Tuesday, November 9, 2010

నా బ్లాగులో నా ఇంటర్వ్యూ...

ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళకి నా బ్లాగు మొత్తం చదివే తీరికా ఓపికా లేవుగానీ, నన్ను వ్యతిరేకిస్తూ ఎక్కడైనా వ్యాఖ్యరాస్తే మాత్రం వారికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేస్తుండటంతో అదొక సరదాగా మార్చుకుని నాకొక "హిందూవ్యతిరేక" బ్రాండొకటి తగిలించేసి పనికానిచ్చేసుకుంటున్నారు.

వాళ్ళకి నా బ్లాగు మొత్తం చదివి నా పంథా అర్థం చేసుకోమని చెబుదామనుకుంటే, అది వ్యర్థం అనిపించింది. నేనేమిటో తెలుసుకుకోవడానికి, నా ఆలోచనా విధానం కొంతైనా అర్థం చేసుకోవడానికి సులువైన మార్గం ఏమిటా అని చూస్తుంటే, జ్యోతిగారు నాతో చేసిన పిచ్చాపాటి గుర్తొచ్చింది. దాన్ని ఇక్కడ పెడుతున్నా...కొంతైనా నా గురించి కొందరు తెలుసుకుంటారని ఒక చిన్న ఆలోచన...

జ్యోతి : నమస్తే మహేశ్ గారు , ముందుగా మీ వివరాలు చెప్తారా ? చదువు, ఉద్యోగం, కుటుంబం వగైరా..

మహేశ్ : పుట్టినూరు చిత్తూరు జిల్లా మదనపల్లి, ఇప్పుడు అమ్మానాన్నా వాయల్పాడులో ఉన్నారు.అమ్మానాన్న, ఒక అన్నయ్య,చెల్లెలు. డిగ్రీ ఆంగ్ల సాహిత్యం మైసూర్ లో. పోస్టుగ్రాడ్యుయేషన్ కమ్మ్యూనికేషన్ లో హైదరాబాద్ యూనివర్సిటీ. కమ్మ్యూని కేషన్ కన్సల్టెంట్ గా ఉద్యోగం

జ్యోతి: మీరు చిన్నప్పటినుండి , చదువుకునేటప్పుడు ఏదైనా లక్ష్యం అంటూ పెత్తుకున్నారా . లేదా అలా చదివేసారా ?

మహేశ్ : చదువుకొనేప్పుడు ఖచ్చితమైన గోల్ అంటూ ఏమీ లేవు. కాలేజిలో ఫిల్మ్ క్లబ్ లో జాయినైన తరువాత సినిమా తియ్యాలనే కోరిక కలిగింది.

జ్యోతి: మీ ఇంట్లో ఇది చదువు, అది చదువు , పెద్ద ఉద్యోగం సంపాదించుకోవాలి అని చెప్పలేదా?

మహేశ్ : లేదు.ఇంజనీర్ అవ్వాలనే మా నాన్నగారి ఆశయం మా అన్నయ్య తీరుస్తుంటే నేను ఫ్రీగానే ఉన్నాను.
నాకు చేతనయ్యింది హ్యూమానిటీస్ ఒక్కటే అని నాకు అనిపిస్తే ఇంటర్మీడియట్ లో అదే తీసుకున్నాను

జ్యోతి: ఐతే మీ ఇష్టానికి చదువుకోమన్నారన్నమాట మీ నాన్నగారు.

మహేశ్ : అప్పుడు మా కుటుంబం కొంత నిరాశపడిన మాట వాస్తవం. ఎందుకంటే ఆర్ట్స్ అంటే పనికిరానోళ్ళు తీసుకునే కోర్సని పేరుకదా.

జ్యోతి: మరి ఉద్యోగం మీకు నచ్చిందే ప్రయత్నించారా . దొరికిన దాంట్లో చేరిపోయారా ?

మహేశ్ : ఆశయం సినిమా. కానీ ఇప్పటివరకూ అది చెయ్యలేదుకదా. అంటే బ్రతుకు తెరువుకోసం ఇప్పటికీ చాలా చేస్తున్నట్లే లెక్క. కానీ ప్రస్తుతం చేస్తున్నదాంట్లో ఆత్మతృప్తి కూడా ఉందికాబట్టిఆది బోనస్ అనుకోవాలి.

జ్యోతి: చదువు విషయంలో ఎటువంటి ఒత్తిడి లేదా? ఇప్పటి పిల్లల్లా ఇంజనీరు, డాక్టర్ అని ఉన్నట్టు.

మహేశ్ : మైసూర్ లో ఇంగ్లీషు లిటరేచర్ అంటే మొదట్లో భయపడినా స్నేహితులూ సీనియర్ల సహాయంతో నెగ్గుకొచ్చాను. ఆ తరువాత అదే సాహిత్యం పట్ల ప్రేమగా మారింది. సినిమా పట్ల నా ఆశయానికి ఊపిరినిచ్చింది

జ్యోతి: సినిమా జీవితాంతం బ్రతుకుతెరువుకు పనికొస్తుందా? .అది తాత్కాలికమే కదా

మహేశ్ : అందుకే ఇప్పుడు సినిమా తియ్యాలనుకుంటున్నానే గానీ దాన్ని బ్రతుకుతెరువు చేసుకోదలుచుకోలేదు.

జ్యోతి: తల్లితండ్రులు, పిల్లలు . ఒకరిపట్ల ఒకరికి బాధ్యత ఉందా? లేకుంటే వాళ్లిష్టం. అటువంటివి ఆలోచించకూడదు. ఎవరి జీవితం వారిది అంటారా ?

మహేశ్ : పెళ్ళితరువాత ఎవరి కుటుంబ జీవితం వారిదే. అంతమాత్రానా బాధ్యతలు లేనట్లు కాదు. కానీ ఒకరికుటుంబ విషయాలలో మరొకరి అనవసర జోక్యం మాత్రం ఖచ్చితంగా ఉండకూడదని ఆశిస్తాను. అదే వీలైనంత సౌమ్యంగా నిర్దేషిస్తానుకూడాను.

జ్యోతి : కాలేజిలో సీరియస్ గా చదువుకున్నారా ? లేక ఫుల్ ఎంజాయ్, అమ్మాయిలను ఏడిపించడం, ప్రేమలు గట్రా..

మహేశ్ : నా కాలేజి జీవితం ఒక ఆదర్శ కాలేజి జీవితం లాంటిదే. చదువూ,అల్లరి వేషాలూ,యవ్వన ప్రేమ, గొడవలూ, అలవర్చుకోదగి(గ)ని అలవాట్లూ అన్నీ ఉన్నాయి. జీవితాన్ని అర్థం చేసుకునే అన్ని తప్పుల్నీ సావకాశంగా చేసి, అనుభవించి,నేర్చుకున్న జీవితం. నా కాలేజీ జీవితం.

జ్యోతి : ప్రేమ అంటే ఏంటి మీ ఉద్దేశ్యంలో?

మహేశ్ : చాలా కష్టమైన ప్రశ్న. ఎందుకంటే ప్రేమను నిర్వచించడం మెదలుపెడితే, ప్రతినిర్వచనాన్నీ "ప్రేమ కాదు" అనుకోవచ్చనేది నా అభిప్రాయం.

జ్యోతి : ఓకె. మరి సినిమాలలో చూపించేది మాత్రం ఒకటే కదా

మహేశ్ : అందుకే నావరకూ ప్రేమ ఒక స్పందన. దానికి తర్కాలూ,హేతువులూ లేవు. అది అలా జరిగిపోతుంది. అంతే!

జ్యోతి : ప్రేమ అంటే యవ్వనంలో ఉన్న అమ్మాయి , అబ్బాయి మధ్య మాత్రమే ఉండేదా?.ఎక్కువ వయసు వారి మధ్య ఉండదా?

మహేశ్ : ప్రేమ అనే స్పందన ఏ వయసులోనైనా ఎవరి పట్లనైనా కలవచ్చు. దానికి కండిషన్స్ దానికి పర్యసానం ఏమిటి అనేదాన్నిబట్టి ఉంటుంది.

జ్యోతి : ఇష్టానికి , ప్రేమకి తేడా ఏంటి??

మహేశ్ : ఇష్టానికి పరిధి ఉంటుంది. ప్రేమకు పరిధి లెదని నా ఉద్దేశం. ప్రేమకు పర్యవసానం లేకుండా బేషరతుగా మనతరఫునుంచీ మనం ప్రేమించెయ్యడం ఉత్తమమని నా అభిప్రాయం.

జ్యోతి : ఇద్దరు యువతీయువకులు సన్నిహితంగా ఉంటే అది ప్రేమకు దారి తీస్తుందా? అది తప్ప వేరే సంబంధం ఉండకూడదా?

మహేశ్ : ఆడామగా సన్నిహితంగా ఉంటే ప్రేమ కలగకపోయినా ప్రేమ ప్రస్థావమాత్రం ఖచ్చితంగా వస్తుంది. అది సహజం. కాకపోతే స్నేహం,ప్లెటోనిక్ బంధం,ఆత్మసంబంధం లాంటి పెర్లతో ప్రేమకు ఆల్టర్నేటివ్ పదాలు వాడుకుని సర్ధుకుపోవచ్చు. ముఖ్యంగా ఇద్దరు eligible అడామగా ఉన్నప్పుడు అది చాలా "సాధారణంగా" జరిగే విషయం.

జ్యోతి : కాని మన దేశంలో ఇంకా ప్రేమ అనేది ఇంకా forbidden word అనిపిస్తుంది. అమ్మను కూడా ప్రేమించొచ్చు. I love you చెప్పొచ్చు. కాని చాలామంది ఇది ఒక బూతు మాటలా, అనకూడని పదంలా భావిస్తారు కదా!

మహేశ్ : ఇంగ్లీషులో ultimate expression of love is love making అంటారు. అంటే, ప్రేమకు పరాకాష్ట ప్రేమించడం(love making) అని. ఇక్కడ sex అనేపదం ఉపయోగించలేదని గమనించాలి.

జ్యోతి : కాని చాలా మందికి ఈ రెండు పదాలకు ఒకటే అర్ధం తీస్తారు.

మహేశ్ : అదే ఇక్కడొచ్చిన చిక్కు. మన దేశంలో శారీరక సంబంధాలు అవసరాలకోసమేతప్ప, అనుభూతులకోసం కాదు. కానీ మనస్ఫూర్తిగా ప్రేమించిన తరువాత శారీరక పవిత్రతకిప్రత్యేకమైన విలువ ఇవ్వాలా అనేది వ్యక్తులు నిర్ణయించుకోవలసిన విషయం.

జ్యోతి : ఎవరైనా తమకు ఇష్టమైనవారిని Love you అంటే పెడర్దాలు తీస్తారు.

మహేశ్ : ప్రేమే ఒక పెడర్ధంగా తయారయిన సమాజంలో ప్రేమించడం తప్పుడుపనే.

జ్యోతి : కాని ప్రేమ అనే పదం చాలామందికి నచ్చదు.

మహేశ్ : అదొక సహజ ప్రక్రియ అని ఒప్పుకోలేని సంఘంలో అదొక బూతే. యవ్వనంలో ఉన్న యివతీయువకులు రహస్య ప్రేమ అనుభవించాల్సిన ఖర్మ పట్టించడం తప్ప ఈ ముసుగులు ఇప్పటివరకూ ఎందుకూ పనికొచ్చినట్లు నాకైతే అనిపించడం లేదు.

జ్యోతి : యవ్వనంలో ఉన్నవాళ్లే ప్రేమించాలా?

మహేశ్ : ఏ వయసులోనైనా ప్రేమించొచ్చు. దానికి కావాల్సింది స్పందించే హృదయం. కాకపోతే ప్రేమ చాలా వరకూ యవ్వనానికి సంబంధించిన విస్ట్రుత సమస్యకాబట్టి అదే ఎక్కువ చర్చించడం జరుగుతుంది. అంతే!

జ్యోతి : కాని ఇక్కడ ప్రేమ అనేది శారీరక సంబంధం కాదని నా ఉద్దేశ్యం.

మహేశ్ : శారీరక సంబంధం ఒకటే ప్రేమ అని నాఉద్దేశం అసలు కాదు. అందుకే దాన్ని స్పందన అంటున్నాను కానీ కోరిక కాదు.

జ్యోతి : ok. మీరు బ్లాగులో రాస్తున్న టాపిక్స్ బయట కూడా చర్చిస్తారా ?

మహేశ్ : చేస్తాను. చాలావరకూ నేను చర్చించిన విషయాలే బ్లాగులో ఉంటాయి.

జ్యోతి : మరి అక్కడ స్పందన ఎలా ఉంటుంది.

మహేశ్ : ఇంకా ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఒకరి ఎదురుగా ఒకరు కూర్చున్న తరువాత చర్చించడం ఇంకా సులభం.

జ్యోతి : మీరు రాసేది ఖచ్చితంగా సరైనది. ఎదుటివాళ్లు చెప్పేది తప్పు అని ఎందుకు వాదిస్తారు ?

మహేశ్ : నేను చెప్పింది ఖచ్చితంగా సరైనది ఎదుటివాళ్ళది తప్పు అని నేను ఎప్పుడూ వాదించలేదు. నేను చెప్పేది నాకు తెలిసిన ఒక ధృక్కోణం అని మాత్రమే బలంగా చెబుతాను.

జ్యోతి : అలా అని ఎదుటివాళ్లు చెప్పింది కూడా కరెక్ట్ అని ఒప్పుకోరుగా :) ..

మహేశ్ : ఎదుటివాళ్ళు వాళ్ళ కోణం నుంచీ కరెక్టయ్యుండచ్చు కానీ నా ధ్రుక్కోణంలో నాదే కరెక్టని ఖచ్చితంగా చెప్పడంలో తప్పులేదుగా!

జ్యోతి : పెళ్లి కాకుండా కలిసి ఉండడం అనే విషయం మీద మీ బ్లాగులో అప్పుడెప్పుడో గొడవ జరిగినట్టుంది..

మహేశ్ : ఇద్దరు consenting ఆడామగా కలిసి జీవించాలని నిర్ణయించుకుంటే చట్టానికే వాళ్ళను ఆపే హక్కులేదు.
అలాంటప్పుడు అనామక వ్యక్తులకు అది తప్పని వాదించే అధికారం ఎవరిచ్చారన్ది మాత్రమే నా ప్రశ్న.

జ్యోతి : నిజమే. అది తప్పు కాదా మరి?

మహేశ్ : అదితప్పని చట్టం నిర్ణయించనప్పుడు దాన్ని తప్పని ఎవరు నిర్ణయించాలి?

జ్యోతి : ఈ విషయంలో మీ ఉద్దేశ్యం ఏంటి మరి. అది తప్పు కాదా ?

మహేశ్ : నా వరకూ అది వాళ్ళ వ్యక్తిగత విషయం. నాకు సంబంధం లేదు. జడ్జిమెంట్ పాస్ చేసే అధికారం లేదు.

జ్యోతి : సరే.

మహేశ్ : నిరసించే హక్కు అసలు లేదు.

జ్యోతి : బ్లాగింగ్ వల్ల మీ అనుభవం, అనుభూతి.

మహేశ్ : నా ఆలొచనల్ని రాసుకుని దాచుకునే ఒక ఫోరం నాకు దక్కింది. చూసి స్పందించే పాఠకులూ లభించారు. ఆనందమే.

జ్యోతి : దీనివల్ల మీకు మిత్రులు ఎక్కువయ్యారా? శత్రువులు మొదలయ్యారా?

మహేశ్ : మిత్రులే ఎక్కువయ్యారు. విభేధించేవాళ్ళు కొందరున్నా వాళ్ళని విరోధులని చెప్పలేను.

జ్యోతి : మీ ఆలోచనలు పంచుకుని, చర్చిస్తుంటే ఏమనిపిస్తుంది. అదీ ఎదుట మనిషి లేకుండా, ఎవరెక్కడివారో, ఎలా ఉంటారో తెలీకుండా...

మహేశ్ : నేను పోరాడేది ఆలోచనలతో,సిద్ధాంతాలతో అదే బ్లాగుల్లోనూ జరుగుతోంది. ఈ process చాలా వరకూ ఎదురుగా మనిషి లేకుండానే జరుగుతుంది. కాబట్టి బ్లాగింగ్ నాకు చాలా సహజంగా అనిపిస్తుంది.

జ్యోతి :ఇలా బ్లాగులు, చర్చల వల్ల మీ ఆలోచన, ఆవగాహన, రచనాశైలి... ఇలా ఏమైనా మార్పులు జరిగాయా?

మహేశ్ : ఆలోచనల్లో కొంత మార్పు వచ్చింది. అంటే ఇంకా స్థిరపడ్డాయి. శైలి ఖచ్చితంగా అభివృద్ది చెందింది. నాదంటూ ఒక మార్క్ కనిపించడం మొదలయ్యింది.

జ్యోతి : మీ బ్లాగులో రాసేది మీరు కరెక్ట్ అనుకునే విషయాలు కదా? ఇతరులు అది తప్పు అన్నా ఒప్పుకోరు , మీ పద్దతి మార్చుకోరు .. రైట్..

మహేశ్ : ఎవరో చెప్పారు కాబట్టి "తప్పు" అని వేరొకరు చెబితే నేను ఒప్పుకోవడానికి సిద్ధంగా లేను. అయినా అది తప్పు అని వారు నమ్మితే నాకు సమస్య లేదు. ఆ అనుభవాన్నే వారి జీవితానికి అన్వయించుకో మనండి. కానీ, నన్ను వారి అనుభవం నమ్మకం ఆధారంగా సంస్కరించదలచడం నాకు ఆమోదయోగ్యం కాదు. నా పద్ధతి నా అనుభవాల పరిణామం. వారి దగ్గరున్న అనుభవాన్ని చెప్పి నన్ను convince చెయ్యగలిగేవరకూ నా నమ్మకమే నాకు సత్యం. కేవలం నన్ను వ్యతిరేకిస్తూ వాదించినంత మాత్రానా నేను మారాలంటారా? అదీ నా అనుభవ సారాన్ని పక్కనపెట్టి!

జ్యోతి : మరి వేరే బ్లాగుల్లో రాసిన టపాలు కూడా అలాగే అనుకోవచ్చు కదా. అది వాళ్ల అనుభవం అని. ఎందుకు విమర్శిస్తారు ? వెక్కిరించినట్టు వ్యాఖ్యలు రాస్తారు . అది అ బ్లాగరుకు బాధ కలుగుతుంది అని తెలుసుకోలేరా ?

మహేశ్ : నేను చర్చకు ముఖ్యంగా సైద్ధాంతిక చర్చకు ఆహ్వనిస్తానే గానీ వారు చెబుతున్నది తప్పు అని చెప్పను.

జ్యోతి : మరి నేను రాసిన టపాలలో మీరు రాసిందేంటి? అది రాసినవారి అనుభూతి అని ఆలోచించకుండా దాన్ని మీ దృక్పధంలో ఆలోచిస్తే ఎలా?

మహేశ్ : ముఖ్యంగా మతపరమైన విషయాలలో అధికారాత్మకంగా ఎవరైనా చెబితే దాన్ని ప్రశ్నిస్తాను. ఎందుకంటే అక్కడ వారు తమ నమ్మకాన్ని కాక అదే ultimate knowledge అనే అహాన్ని ప్రదర్శించడం కనిపిస్తుంది. అందుకే దాన్ని తార్కికంగా హేతుబద్ధంగా చర్చించాలి అని ఆహ్వానిస్తాను.


జ్యోతి : మతపరమైన విషయాలలో ఎవరి అభిప్రాయం వారిది. మరి మీరు ఇతరులతో ఎలా వాదించగలరు . మేము మీకు రుజువు ఎందుకు చూపించాలి. ఎందుకు చర్చించాలి. mee అనుభవం, అభిప్రాయం మీది ఐనప్పుడు నా అనుభవం, అనుభూతి నాది.

మహేశ్ : హరిసేవలో లేక మీ బ్లాగులో నేను రాసినవి alternate possibilities నేనక్కడ మీ నమ్మకాన్ని ప్రశ్నించడం కాకుండా ఆ నమ్మకం యొక్క source లో కొంత alternative ధృక్పధం యొక్క possibilities ని చూపించాను.

జ్యోతి : అది నా వ్యక్తిగత అభిప్రాయం. అది తప్పు లేదా మార్చుకోవాలి అనే మీకుందా ?

మహేశ్ : నాకు ఎవర్నీ మార్చే హక్కులేదు. నాకు తెలిసిన పర్యాయధృక్పధం తెలియపర్చడం తప్ప. మూఖ్యంగా మతపరమైన విషయాలలో. కానీ కులపర,రాజకీయ పరమైన విషయాలలో నాకు కొన్ని నిర్ధుష్ట్యమైన అభిప్రాయాలున్నాయి.

జ్యోతి : నిజమే ఉన్నాయి. కాని ఇతరుల అభిప్రాయాలను ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం?

మహేశ్ : ప్రశ్నించడం ఎప్పుడూ సమంజసమే. కానీ నేను చెప్పింది ఒప్పుకొమ్మని భీష్మించడం సమంజసం కాదు. చర్చించడం, సమంజసం ఆ చర్చల్లో నాదే సరైందని నిరూపించబడాలనుకోవడం సమంజసం కాదు.
జ్యోతి : రోజుల్లో సర్వసాధారణమైన ఈవ్ టీజింగ్ కి కారణాలు,వాటికి ఏమైనా పరిష్కారాలు ఉన్నాయంటారా? మీరు ఎక్కడైనా మహిళలను వేదించే సన్నివేశం చూస్తే ఎం చేస్తారు?

మహేశ్ : ఈవ్ టీజింగ్ గురించి చాలా విశదంగా నేను రెండు భాగాల్లో ఒక టపా రాసాను. అందుకో నాకు తెలిసిన కొన్ని కారణాలను ఆధారాలతో సహా తెలిపాను నేను ఎక్కడైనా ఈవ్ టీజింగ్ చూస్తే అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాను.


జ్యోతి: ప్రేమ వివాహం , పెద్దలు కుదిర్చిన వివాహం.. ఏది మంచిది అంటారు? పిల్లలకు మంచి కుటుంబం నుండి సంబంధాలు చూసి పెళ్లి చేయాలనుకోవడం తల్లితండ్రులు ఆశించడం తప్పా?

మహేశ్ : ప్రేమ వివాహంలోనైనా కుదిర్చిన వివాహంలోనైనా, ప్రేముండేంతవరకూ రెండూ మంచివే రెండూ సఫలమే. తల్లిదండ్రులు family suitability కన్నా అబ్బాయీ-అమ్మాయిల compatibility పై శ్రద్ద పెట్టినంతవరకూ ఖచ్చితంగా అధికారముంది. పిల్లల అంగీకారంతో పెళ్ళిజరిపేంతవరకూ హక్కుకూడా ఉంది. బలవంతపు పెళ్ళిల్లూ, బ్లాక్ మెయిలింగ్ పెళ్ళిళ్ళూ జరపనంతవరకూ పిల్లల పెళ్ళిళ్ళపై సర్వహక్కులూ ఉన్నాయి, ఉంటాయి. కానీ, దాన్ని మీరితే తల్లిదండ్రులకన్నా పిల్లలు వ్యక్తులుగా తమకుతాము ముఖ్యులమన్న సత్యానికే నా ప్రాధాన్యత.



జ్యోతి : మీకు సినిమాలు అంటే చాలా ఇష్టం కదా. మరి మీకు నచ్చిన సినిమా ???

మహేశ్ : ఒక సినిమా అని లేదు. నచ్చిన సినిమాలున్నాయి కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి. తెలుగు,తమిళ్,మళయాళం,కన్నడ,హిందీ,బెంగాలీ,ఇంగ్లీష్, జపనీస్,చైనీస్,కొరియన్,ఇరానియన్ ఇలా నాకు ఇష్టమైన సినిమాలు భాషాప్రాంతీయభేధం లేకుండా ఉన్నాయి. లిస్టు చెప్పడం మొదలయితే మొత్తం టపా స్పేస్ ఆక్రమించేస్తాయి. దాంతోపాటూ అవి నాకెందుకు నచ్చాయో చెప్పకుండా వొదలనుకాబట్టి, ప్రస్తుతానికి ఇంతటితో వదిలెయ్యండి.



జ్యోతి : మన దేశరాజకీయాల మీద మీ అభిప్రాయం? మనకు ఇంతకంటే మంచి నాయకులు దొరికే అవకాశం లేదా? నిజాయితీగా మనను పాలించే ప్రభుత్వ ప్రతినిధులను మనం ఎన్నుకోగలమా?? అలాంటి వ్యక్తులు ఉన్నారా?

మహేశ్ : నా ఉద్దేశంలో రాజకీయం ఇలా తయారవ్వడానికి కారణాలు రెండు. ఒకటి ఎన్నికల విధానం. రెండవది, స్వల్పకాలిక లాభాలుతప్ప దీర్ఘకాలిక ప్రయోజనాల్ని అర్థం చేసుకోలేని ప్రజలు. ఒకవైపు పరిణితిలేని వ్యవస్థ మరోవైపు పరిపక్వత లేని ప్రజలు. రెండువైపులా సమస్యాత్మకంగా ఉండటంవలనే మన రాజకీయం ఇలా తగలడింది. అందుకే నాయకత్వంకన్నా విధానం ముఖ్యమైన రాజకీయాలు కావాలి. ఈ విధంగా చూస్తే లోక్ సత్తా మీద నాకు మంచి నమ్మకం. గెలుస్తుందన్న విశ్వాసం లేకపోయినా గెలిస్తే రాజకీయాల్ని సమూలంగా మార్చగల సత్తా లోక్ సత్తా విధానాలకుంది.


జ్యోతి : కొన్నేళ్ల క్రిందటి మహిళలు, ఆధునిక మహిళల మీద మీ అభిప్రాయం. అప్పటికి , ఇప్పటికి వాళ్లు మారారా? మారుతున్నారా? వైవాహిక జీవితంలో ఒడిదుడుకులకు ఎవరు బాధ్యులు? స్త్రీయా పురుషుడా? నేటి మహిళపై మీ అభిప్రాయం? ఎలా ఉండాలి అనుకుంటారు?

మహేశ్ : పాతతరమైనా కొత్తతరమైనా మహిళల్లో మార్పొచ్చినా మహిళల సామాజిక స్థితిలో రావాల్సినంత మార్పు రావటం లేదని నాకు అనిపిస్తుంది. ఇక్కడ సమస్య కాలానుగుణంగా (మహిళల విషయంలో) మారని సమాజానిదేతప్ప స్త్రీలది కాదని గుర్తించాలి. ముఖ్యంగా మగాడు ఈ మార్పుని హృదయపూర్వకంగా అంగీకరించేలా తయారవనంతకాలం ఒకడుగు ముందుకైతే రెండడుగులు వెనక్కు ఛందంగా పరిస్థితి కొనసాగుతుంది.

పెళ్ళి శాంతీయుతంగా విజయవంతంగా కొనసాగాలంటే ఆడామగా ఇద్దరి బాధ్యతా ఉంది. ఎవరిబాధ్యత ఎక్కువ అంటే ఎవరెక్కువ తీసుకుంటే వారిదని చెప్పాలేగానీ ఇటు ఆడవారిదో లేక అటు మగవారిదో అనిచెప్పే సమాధానం కాదిది.
ఆధునిక మహిళ "ఆధునికంగా" ఉండాలి. అలా మానసికంగా ఆధునికత సంతరించుకోకుండా, పైపై మెరుగులు దిద్దుకుంన్నంత మాత్రానా ఎవరూ ఆధునిక మహిళ కాలేరని గుర్తించాలి.



జ్యోతి : ప్రేమలో విఫలమై ఆత్మహత్య చేసుకునే సందర్భాలలో ఎవరిది తప్పు? ఇటువంటి సమస్య ఉన్నవాళ్లు మనకు తెలిసినవాళ్లు అయితే మనమే విధంగా పరిష్కరించగలం?

మహేశ్ : ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకున్నోళ్ళదే. అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రేమ జీవితంలో ఒక భాగమేగానీ జీవితం కాదు. మరిన్ని ప్రేమలకు ఆస్కారమున్న జీవితాన్ని ఒక్క ప్రేమ కోసం వదిలేసుకోవడం మూర్ఖత్వంకాక మరేమిటి? ఆత్మహత్య ఒక క్షణికమైన ఆవేశంలో జరిగే ఘటన. ఆ క్షణాన మనం ఆ వ్యక్తుల్ని ఆపగలిగి కొంత విషయాన్ని practical గా చర్చించగలిగితే వారు ఆ ఆలోచనను మానుకుంటారనుకుంటాను.


జ్యోతి : మీ బ్లాగులో మీకు ఎక్కువగా నచ్చిన టపాలు. నచ్చిన బ్లాగులు, టపాలు ఏవి??కాస్త చెప్తారా?

మహేశ్ : నా టపాలన్నీ నాకు ఇష్టమైనవే. లేకుంటే అసలు రాయనుకదా! ఇక నచ్చిన ఇతర బ్లాగు టపాలంటారా...ఘాటైన వ్యాఖ్యలు చేసేవీ అభినందనలతో ఆస్వాదించేవీ అన్నీ నాకు నచ్చినవే ఉంటాయి..అటోఇటో. నచ్చిన బ్లాగులు కూడా చాలానే ఉన్నాయి వాటిల్లో కొన్ని మనసులోమాట, కలగూరగంప, అబ్రకదబ్ర గారి తెలుగోడు, స్నేహమా , బాబాగారి కవితల సాహితీ-యానం , రెండురెళ్ళ ఆరు ఇంకా చాలా ఉన్నాయి.



జ్యోతి : టెర్రరిస్ట్ అంటే ఎవరు? నక్సలైట్ల సమస్య ఎప్పటికైనా తీరుతుందా??

మహేశ్ : టెర్రర్ ని స్టృష్టించే ప్రతి వాడూ టెర్రరిస్టే. అందులో ఏమీ తేడా లేదు. అది మతం పేరుతో జరిగినా, కులం పేరుతో జరిగినా,ఆర్థిక-సామాజిక-రాజకీయ కారణాలతో జరిగినా జనసామాన్యాన్ని భయభ్రాంతుల్ని చేసే ప్రతిచర్యా టెర్రరిజమే. నక్సలిజం తన సైద్ధాంతిక మూలాల్ని మరిచి చాలా దూరానికి వెళ్ళిపోయింది. నక్సలిజం సమాధానాలు చూపడానికి బయల్దేరిన సమస్యల్లో ఇప్పుడు అదొకటిగా మారింది.కాబట్టి అది తీరదు..ఆ సమస్యని మనమే తీర్చాలి.



జ్యోతి : మీరు చెప్పే విషయాలు నిజజీవితంలో పాటిస్తారా? నిజాయితీగా ఉంటారా? లంచం గట్రా ఇచ్చి పని చేయించుకుంటారా?

మహేశ్ : జీవితంలో వీలైనంత నిజాయితీగానే ఉంటాను. డైరెక్టుగా లంచం ఇవ్వలేదుగానీ, influence ఉపయోగించిన సందర్భాలున్నాయి. ఇక నేను చెప్పే విషయాల్లో కొన్ని ఆలోచనలుంటాయి, కొన్ని అభిప్రాయాలుంటాయి, చాలావరకూ నా జీవితంలో పాటించాకే చెబుతాను.ఇతరుల సమ్మతికోసం నేను జీవించడం లేదు. నాకిష్టమొచ్చినట్లు నేను బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాను. నా జీవితానికి సంబంధించినవారికి అవి అర్థమయ్యేలా చెప్పవలసిన బాధ్యత నాకుంది. ఆ పని మాత్రం ఖచ్చితంగా చేస్తాను.


జ్యోతి : మీ టపాలు , వ్యాఖ్యలు చూస్తుంటే ఎప్పుడు రఫ్ అండ్ టఫ్ గా ఉంటారనిపిస్తుంది. సెంటిమెంట్స్ అంటూ ఉండవా? ఇతరుల మనసు అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తారా? ముఖ్యంగా మీ అమ్మ, మీ ఆవిడ గురించి.

మహేశ్ : నేను కరుగ్గా వుండను. ఖచ్చితంగా ఉంటాను. ఇలా వుండటానికీ అనుభూతులు లేకుండా ఉండటానికీ అసలు లంకే లేదు. నాకంటూ కొన్ని ఆలోచనలున్నాయి కాబట్టే అదే రీతిలో నా అనుభూతులుంటాయే తప్ప అవేవీ లేని మోడుని కాను. మనసుల్ని అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే మనుషుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఒక్కోసారి మనుషులు కూడా అర్థం కారు. అదే జీవితం.


జ్యోతి : మహేష్ గారు మీ వృత్తిలో బిజీగా ఉన్నా మాకోసం సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు.

మహేశ్ : మీకు కూడా ధన్యవాదాలు..

******

8 comments:

vrdarla said...

bagunnaayi.. prasnalu samaadhaanaalu

ఆ.సౌమ్య said...

very nice, interesting!

జ్యోతి గారి ప్రశ్నలు, మీ సమాధానాలు అన్నీ బావున్నాయి. ఇది ఎప్పుడు జరిగింది?

కెక్యూబ్ వర్మ said...

మీ అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం బాగుంది. కొన్ని విషయాలలో కొంత విభేదమున్నా మొత్తమ్మీద మీరు ప్రగతిశీల దృక్పధంతో, అభిప్రాయ నిబద్ధతతో, మానవీయత కలిగి వున్న వారుగా అర్థమైంది..

వేణు said...

ఈ ఇంటర్వ్యూని జ్యోతి గారి బ్లాగులో, దాదాపు రెండేళ్ళ క్రితమే చదివాను. ఇప్పుడు చదివినా ఆసక్తికరంగానే అనిపించింది. ప్రశ్నలూ జవాబులూ అన్నీ బాగున్నాయి!

Anonymous said...

బాగుంది. మీగురించి కొంతవరకు తెలుసుకోగాలిగాము.

Balaji said...

Yes Mahesh Garu, It's vary useful to know about you. Very Intellectual answers.

శీను said...

బాగుంది ఇంటర్వ్యూ . మీ గురించి తెలుసుకోవటానికి ఉపయోగపడింది.

Ramani Rao said...

ఇది నేను జ్యోతి గారి బ్లాగులో చదివాను మళ్ళి ఇన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడు చదివాను.. అప్పట్లో మీ బ్లాగు తరుచుగా చదువుతూ ఉండేదాన్ని.. ఈ ప్రశ్నలు , సమాధానాలు ఇంకొంత మీరంటే ఏంటో తెలిపాయి. కొన్ని ప్రశ్నలకి సూటిగా సమాధానాలు రాలేదని మటుకు అనిపిస్తోంది :)