Saturday, March 28, 2009

బారా ఆణా - చిన్న(పెద్ద) సినిమా

సాయంత్రం 5:30 ఆట. అసలే అలవికాని సమయం, అందునా చాలా మందికి పేరైనా తెలీని “చిన్న సినిమా”. అక్కడక్కడా వినడంవల్ల, నసీరుద్దిన్ షా ఉన్నాడన్న ధైర్యంతో PVR లో వెళ్ళి కూర్చున్నాను. సినిమా మొదలయ్యే సరికీ ధియేటర్లో పట్టుమంటే పది మందికూడా లేరు. సినిమా మొదలయ్యింది, ఇంటర్వెల్ వచ్చించి, సినిమా ముగిసింది. ఇంటికొచ్చేశాను. రెడ్రోజులయ్యింది. కానీ…ఆ సినిమా చూసిన అనుభవం ఇంకా నాదగ్గరే ఉంది. ఆ సినిమా పేరు “బారా ఆణా”.

మరణించి మళ్ళీ బ్రతుకుతున్న ఒక టాక్సీడ్రైవర్ (”ఎందుకు? ఏమిటి? ఎలా?” అని అడక్కండి. సినిమా చూస్తేగానీ అసలు విషయం తెలీదు). ఊర్లో పెళ్ళాంబిడ్డల్ని వదిలేసి బొంబాయి నగరంలో వాచ్ మన్ పనిచేసుకునే మరో యువకుడు. హోటల్ లో సర్వర్ గా పనిచేసుకుంటూ, ఒక విదేశీవనిత ఆకర్షణలో మునిగితేలే మరో యువకుడు. ఈ ముగ్గురూ ఉండే ఒక మురికివాడ. వారి జీవితం. ఆశలు. అడియాసలు. ఉక్రోషాలు. కోపాలు. అవి ప్రేరేపించే నేరాలు. సాధారణ జీవితాల్లోవున్న ఊహించని మలుపు ఈ చిత్రం. చూసి ఆనందించడంతోపాటూ, ఒక అనుభూతిని మనతో తెచ్చుకునే సజీవచిత్రం ఈ చిత్రం.

అంతమాత్రానా ఇదేదో బోర్ కొట్టే స్లోమోషన్ సినిమా కాదు. హాస్యమైన సంభాషణలున్నాయి. నవ్వుకునే దృశ్యాలున్నాయి. సహజమైన రొమాన్స్ ఉంది. పరస్పర ఆకర్షణలున్నాయి. నమ్మకద్రోహాలూ- మోసాలూ ఉన్నాయి.

డ్రైవర్ పాత్రలో సినిమా మొత్తం కనిపించినాకూడా, కనీసం ఒక పేజీ డైలాగులు కూడా లేని అత్యద్భుతమైన పాత్రలో నసీరుద్దీన్ షా నటన…ఎలా చెప్పాలో తెలీటం లేదు. అబ్బో! అంతే!! సినిమా 90% అయ్యేవరకూ ఒక్క మాటకూడా మాట్లాడడు. కానీ, యాక్టింగ్ చూశారూ! ఎవరండీ ఈ మహానటుడికి ధీటు? Frustrated వాచ్ మన్ పాత్రలో విజయ్ రాజ్ (మాన్ సూన్ వెడ్డింగ్ ఫేం) కూడా జీవించాడు. ద్వితీయార్థంలో తన పాత్ర కొంత నేలవిడిచి సాముచేసినట్లనిపిస్తుందిగానీ, సహజంగా అలాంటి పరిస్థితుల్లో ఇలా కొందరు మారతారేమో. ఒక తెల్లపిల్ల మోజులోపడే vulnerable వెయిటర్ గా అర్జున్ మాథుర్ (లక్ బై ఛాన్స్ ఫేం) ఈ దిగ్గజాలకు సాటైన నటనాపటిమని పరిచయం చేసాడు. ఈ ప్రధాన పాత్రలతోపాటూ విదేశీ వనితగా వయలాంటో ప్లాసిడో, మురికివాడలో చిల్లర దుకాణం/ఫోన్ బూత్ నడిపే యువతిగా తనిషా చటర్జీ పాత్రోచితంగా నటించారు. ముఖ్యంగా తనీషా చటర్జీకి నటిగా మంచి భవిష్యత్తు ఉందనిపిస్తుంది.

2003 లో బస్ యూహీ అనే అసఫల ప్రయత్నం చేసిన దర్శకుడు రాజా మీనన్ కు ఇది ద్వితీయ ప్రయత్నం. తనకు కథ మీదున్న పట్టు, కథనంలో నిలకడ వలన సినిమాని ఆద్యంతం వినోదభరితం చేసాడు. అదే స్థాయిలో అర్థవంతంగానూ నిలిపాడు.ప్రియా సేత్ సినెమాటోగ్రఫీ మరియూ శ్రీ అందించిన నేపద్యసంగీతం ఈ సినిమాకు మరో హైలైట్.

చిన్న సినిమా. మనసున్న సినిమా. సహజమైన సినిమా. నిజమైన సినిమా. చుడాల్సిన సినిమా.


*ఈ వ్యాసం మొదటిగా నవతరంగం లో ప్రచురింపబడింది.

3 comments:

Anonymous said...

మహేశ్ బాబూ,
త్వరలోనే ఈ చిత్రం చూడగలనని ఆశపడుతున్నాను.
మీ పరిచయం బావుందోచ్.

సుజాత వేల్పూరి said...

ఈ సినిమా చూసేశాను. అన్నట్లు మీరు "సొంత వూరు" సినిమా చూసి రివ్యూ రాయాలని డిమాండ్ చేస్తున్నా!

Kathi Mahesh Kumar said...

@సుజాత: నేను మంగళవారం హైదరాబాద్ వస్తున్నాను. వచ్చాక "సొంత వూరు" సినిమా చూసి ఖచ్చితంగా సమీక్షిస్తాను.