Thursday, December 31, 2009

బ్లాగులు నాకేమిచ్చాయి?




టైంపాస్ కి నేను బ్లాగు మొదలెట్టలేదు. నా ఆలోచనలూ,అభిప్రాయాలూ,అనుభవాలూ (ఒకవేళ ఉంటే) ఆధర్శాలు రాసుకోవడానికి బ్లాగు మొదలెట్టాను. ఎప్పుడో మర్చిపోయిన "తెలుగులో రాయడాన్ని" సానబెట్టుకోవడానికి మొదలెట్టాను.

మొదలెట్టిన రెండున్నర సంవత్సరాల్లో ఎన్నో అనుభవాలు.
కొన్ని అహ్లాదపరిచేవి, కొన్ని కలవరపెట్టేవి. 
ఎన్నో వాదాలూ వివాదాలు. 
కొన్ని మెదడుకు పదునుపెట్టేవి, మరికొన్ని మనసుని (గాయ)గట్టిపరిచేవి.
ఎన్నో ఆలోచనలు.
కొన్ని నన్నునాకు పరిచయం చేసేవి,మరికొన్ని ఇతరులకు నాపరిచయం కలుగజేసేవి.
ఎందరితోనో పరిచయాలు.
కొన్ని జీవితాన్ని మార్చేవి, మరికొన్ని జీవన మూల్యాల్ని ప్రశ్నించేవి/బలపర్చేవి.

ఇలా బ్లాగు నా వ్యక్తిత్వంలో భాగమయ్యింది. ఎన్నో మార్పులు,ఒత్తిడుల మధ్య 2009 లో నా బ్లాగులో నేను తక్కువ రాశానేమో అనిపించింది.కానీ లెక్క చూసుకుంటే 171 టపాలు తేలాయి. ఒకనెలలో ఏకంగా 30 టపాలున్నాయి.

బ్లాగుల్లో రాయడం వలన నా ఎన్నో ఆలోచనలకు పదాలు దొరికాయి. నా అభిప్రాయాల పదును పెరిగింది. వాటిని చెప్పే విధానంలో నాదంటూ ఒక శైలి కలిగింది. ఇదే సాధన మొదటిమెట్టుగా నా సినిమా ఆశయం నెరవేర్చుకునే అవకాశం వచ్చింది. ఈ సంవత్సరం ఒక సినిమాకు మిత్రుడు వెంకట్ తో కలిసి మాటలు రాశాను. నూతన సంవత్సరంలో రిలీజయ్యే ఈ సినిమా పేరు "న్యూ". మొదటిసారి వెండితెరపై నా పేరు కనిపిస్తుంది. నా రాతలకు మరో గుర్తింపు వస్తుంది.

బ్లాగులు నాకింకా ఏమిచ్చాయి? తెలీదు. ముందుముందు చూడాలి.

అందరికీ "న్యూ" సంవత్సర శుభాకాంక్షలు.

"న్యూ" చిత్రం వెబ్ సైట్ కోసం ఇక్కడ చూడండి.

**** 

Friday, December 25, 2009

‘న్యూ’ సంవత్సర శుభాకాంక్షలు




ఈ గ్రీటింగ్ కార్డులకోసం www.new.navatarangam.com చూడండి.


****

Tuesday, December 22, 2009

భాష గోల


ఒకప్పుడు ప్రపంచంలోని ప్రజలంతా ఒకటిగా ఉండేవారట.
కలిసికట్టుగా. ఐకమత్యంగా. సంఘటితంగా. ఒకటిగా.
ఆ ఐకమత్యంవలనొచ్చిన బలంతో, ఒక పెద్ద స్థంభాన్నికట్టి స్వర్గానికి చేరుకుందామని జనం ప్లానేశారు.
ఆ ఒంటిస్థంభం మేడ నిర్మాణం మొదలయ్యింది. ఆ..వీళ్ళేంకడతార్లే అని దేవతలు ఊరుకున్నారట.
కానీ ఆ మేడ రోజురోజుకీ పెరిగి స్వర్గాన్ని చేరేదాకా వచ్చేసింది.
దేవుడు ఆ స్థంభాన్ని ఒకసారి కూల్చేసాడు.
జనం మళ్ళీ కలిసి ఇంకొకటికట్టారు.
మళ్ళీ దేవుడు కూల్చేసాడు.
జనం మళ్ళీకట్టారు...దేవుడు కూల్చేసాడు...జనం మళ్ళీ కట్టారు.
దేవుడికి దడ మొదలయ్యింది...ఇలా అయితే మనుషులందరూ స్వర్గానికి హైవేలో ఎప్పటికైనా వచ్చేస్తారని తెలిసొచ్చింది.

వెంఠనే...దేవుడు భాషని సృష్టించాడు.
అప్పట్నుంచీ ఇప్పటివరకూ మనుషులంతా ఒకటికాలేకపోయారు.
కొట్టుకుంటూనే ఉన్నారు. స్వర్గాన్ని అందుకోలేకపోయారు.

**** 

Sunday, December 20, 2009

ప్రేమజ్యోతి



అలవాటైన పరిచయాల నీడలు
చీకట్లను ప్రసరిస్తున్నా
ప్రేమజ్యోతిని మాత్రం
ఉజ్వలంగా వెలగనీ



The light of love

let the light of love
shine through
even when
the darkness
of familiarity
begins to cast it's shadows

- శేఖర్ కపూర్


Thursday, December 10, 2009

శాంతి కావాలా?


అంత:శోధన
శాంతిని దరిచేర్చదు
శాంతి కావాలంటే...
ఓమందేసుకో
సంగీతాన్ని విను
ధ్యానం చెయ్! ఒక సూదీర్ఘమైన శ్వాస పీల్చుకో!!
ప్రేమించు
జీవితంతో రాజీపడు

Thursday, December 3, 2009

విమర్శకుడి బాధ్యత



సాహిత్యసృజన విమర్శనకన్నా ఎప్పుడూ ఒక మెట్టు ఎక్కువే. ఎందుకంటే, ‘తులనకన్నా సృష్టి ఉన్నతం ’కాబట్టి. అది ఎలాంటిదైనా సరే, సృష్టి సృష్టే!


 వర్డ్స్ వర్త్ చెప్పినట్లు సృజనాత్మకత అనేది "emotions recollected in tranquility". కాబట్టి, అక్కడ తర్కానికీ,తులనకూ స్థానం లేదు. మనిషీ ప్రకృతీ ఒక బలవత్తరమైన స్థాయిలో సంగమించి సాహితీసృజనకు ప్రాణంపోస్తాయి.

అలా సృష్టించబడిన సాహిత్యంలో తర్కాన్ని,తులలను ప్రవేశపెట్టి సామాజిక ప్రయోజనాన్నీ గుర్తించి ఆ ఆలోచనల్ని పాఠకులదగ్గరికి తీసుకొచ్చేవాడే విమర్శకుడు. అంటే తమ విశ్లేషణతో సృజనాత్మకతలోని నిగారింపుని గుర్తించే పరీక్షకుడు విమర్శకుడు.అంతటి బృహత్తర కార్యాన్ని భుజాన వేసుకున్న విమర్శకుడికి బాధ్యత,నిబద్ధత చాలా అవసరం.

వ్యక్తిగత అభిప్రాయాలకన్నా సామాజిక ప్రయోజనాన్ని ముందుంచాలి. ఉత్తమమైన ఆలోచనల గుర్తింపుకు ప్రాధాన్యత ఇవ్వాలి.ముఖ్యంగా రచనను రచనగా చూడాలి.

విమర్శకుడి బాధ్యత "to make the best ideas prevail. New ideas reach society.The touch of truth is the touch of life, and there is a stir and growth everywhere; out of this stir and growth come the creative epochs of literature." ఆ ఉత్తమమైన ఆలోచనల వ్యాప్తిద్వారా మరింత సాహితీసృజన జరిగే అవకాశాల్ని మెరుగు పర్చడం.

విమర్శకుడికి అనుకున్నది చెప్పే అధికారంకన్నా, రచన ఆదర్శాన్ని అర్థంచేసుకుని విశ్లేషించడం ముఖ్యం. తన అనుకోలుకు తగ్గ ఆధారాలు చూపుతూ పాఠకుడికి రచనను పరిచయం చేస, దాని "విలువను" తెలపడం ముఖ్యం. ఆ రచన ఒక విఘాతమైతే దాని గురించి ‘వార్న్’చెయ్యడం ముఖ్యం.

ఈ మూలభావనలకు విఘాతంకలిగేలా విమర్శనం చేస్తే అది కేవలం "విమర్శ" అవుతుంది.నింద అవుతుంది. అది చాలా మంది mediocre విమర్శకులు చేస్తారు.  విమర్శకులంటూ  సాహిత్యాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నవాళ్ళు "కేవలం భాధ్యతాయుతంగానే" రాయాలి.

****

Tuesday, December 1, 2009

ఆర్య లాంటి ఫ్రెండుంటే - కేసీఆర్ లాంటి నాయకుడుంటే










ఈ మధ్యే విడుదలైన ఆర్య-2 సినిమా "ఆర్య లాంటి ప్రెండ్ వుంటే చాలు వేరే శత్రువులు అక్కర్లేదు…" అనే డైలాగ్ తో మొదలౌతుంది. సినిమా మొత్తం అతిప్రేమ-సైకోప్రేమ- అతిసైకో చేష్టలతో ఆర్య పిచ్చిపిచ్చిగా సినిమా మొత్తం ఎనర్జీతో గెంతి, ప్రేక్షకుల్ని 70MM లో వెధవల్ని చేసి బయటికి పంపిస్తాడు...

అదే పిచ్చి నాకు తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు KCR చేసిన "ఆమరణ నిరాహారదీక్ష" డ్రామాలో కనిపించింది. ఇలాంటి నాయకుడే ఉండే తెలంగాణాకి మరే శత్ర్రువూ అవసరం లేదు. నట్టేట ముంచాడు, ముంచుతాడు, ముంచుతూనే ఉంటాడు. తెలంగాణా ఎప్పటికీ రాకపోవడానికి కారణమెవరైనా ఉంటే అది కె.సి.ఆర్ మాత్రమే.

****