Wednesday, May 12, 2010

వాదాల గురించి నా వాదాలు...అక్కడక్కడా !

“వేటుఅదే వేట అదే నాటికథే అంతా” అన్నట్లు భ్రూణహత్యలు, హానర్ కిల్లింగులూ, వివక్ష, లైంగిక వేధింపులు, కట్నం సమస్య, సామాజిక వంచన అన్నీ ఇప్పటికీ పచ్చినిజాలే. మగజాతి collective జాత్యాహంకారానికి ఎవరమూ exception కాము. దాని తీవ్రత మన పెంపకం, సామాజిక నేపధ్యం మీద ఆధారపడి ఉంటాయేగానీ, అంశలు మాత్రం మన DNA లో నిక్షిప్తం అయిపోయాయి. ఆ DNA mutation జరిగి సమూలమైన మార్పురావడానికి ఎన్ని తరాలు పడుతుందో తెలీదు. కాబట్టి వ్యక్తిగత ధృక్కోణం నుంచీ ఒక లోతైన సామాజిక కోణాన్ని జడ్జిచేసేముందు big picture కొంత తెలుసుకోవడం ఎంతైనా అవసరం.

సమాజంలోని power structure లో సమతౌల్యం సాధించే క్రమంలో దోపిడి గురైన వర్గం “నిరసన”తోనే తమ పోరాటాన్ని ప్రారంభిస్తుంది. దళితుల పోరాటం అగ్రవర్ణాల దౌష్ట్యాన్ని ఎండగట్టకపోతే ప్రారంభం అవదు. స్త్రీలు పురుషాధిక్యపోకడల్ని నిలదియ్యకపోతే అది ఆరంభం కాదు. ఈ నిరసన క్రమంలో విబేధం, ప్రతిహింస,ఎదురుదాడి తప్పవు. సామరస్యానికి ఆధిపత్యపోరులో స్థానంలేదు. ముఖ్యంగా సమానత్వం కోరుకునేవాళ్ళను ఆధిపత్యస్థానంలో ఉన్నవాళ్ళు ఎప్పుడూ “ప్రమాదకారి”గానే గుర్తించి “అంతం” చెయ్యాలని చూస్తారు. ఈ సైద్ధాంతిక, భౌతిక, మానసిక పోరాటంలో నిరసన “తీవ్రంగా” ఉన్నంతమాత్రానా అది ఆణగారిన వర్గాలు చేస్తున్న అన్యాయం అనలేము. సామాజికశాస్త్రప్రకారం చూస్తే బహుశా అనకూడదు కూడా. ఆ తీవ్రతే లేకపోతే “మార్పు” జరగదు. విప్లవం అస్సలు రాదు. స్త్రీలు మార్పుతో సరిపెట్టుకునే మూడ్లో లేరు. వారికి విప్లవం కావాలి.

సమానత్వంకై పోరాటమంటే, ఆధిపత్య భావజాలంతో యుద్ధమంటే, అది బాహాబాహీ మల్లయుద్దం కాదు. బజార్నపడి కొట్టుకోవడం అస్సలు కాదు. ఇక్కడ శతృవులు, ప్రత్యర్థులూ లేరు. సాంప్రదాయాలూ, సిద్ధాంతాలూ, భావాలూ, అభిప్రాయాలూ, భావజాలాలూ, హెజిమొనీ ఇవే ఉంటాయి. వాటి వైరుధ్యం మధ్యనే పోరాటం. ఇప్పటిదాకా రాజ్యమేలిన భావజాలం ఒక వర్గాన్ని తృణీకరించి వంచితుల్ని చేస్తే, ఆ వర్గం తమ నిరసనని ప్రత్యామ్న్యాయ భావజాలంగా మార్చి,పోరాడి, ఆతీవ్రతతో మార్పుని సాధిస్తారు. ఈ పోరాటంలోకూడా ఆడామగా లేరు. పురుషాధిక్యభావజాలం – సమానత్వపు కాంక్ష మాత్రమే ఉంటాయి. మహిళల్లో పురుషాధిక్యభావజాలం ఉన్నవాళ్ళు సాధ్యం. అలాగే మగవాళ్ళలో సమానత్వాన్ని కాంక్షించేవాళ్ళూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మగాడు ఆడది అనేవి చర్చనీయాంశాలు కాదు. ఆధిపత్యం – సమానత్వం అనేవి సమస్యలు-సమాధానాలు.

వ్యవస్థలు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. మాతృస్వామ్యంగా మొదలైన సమాజం ప్రస్తుతం పితృస్వామ్యమై పురుషాధిక్యంగా మారింది. మళ్ళీ మాతృస్వామ్యం రాకపోయినా, సమానత్వం ఆశయంగా పోరాటం సాగుతోంది. ఈ పరిణామక్రమంలో చట్టం, న్యాయం, కుటుంబం, వ్యవస్థా అన్నీ మారాల్సిందే. అది ఆటవిక సమాజమని మీరనుకుంటున్నారు…సమసమాజమని కొందరు నమ్ముతున్నారు. రెండిట్లో ఏదనేది అది జరిగితేకానీ తెలీదు. ఒకవేళ ఆ మార్పు జరిగినా దాన్ని “ఆటవికం” అనేవాళ్ళు కొందరు “నాగరికం” అనేవాళ్ళు మరికొందరు ఎప్పటికీ ఉంటారు. కానీ మార్పు మాత్రం అనివార్యం.

స్త్రీ,దళిత,ప్రాంతీయ వాదాలలో అన్యాయం జరిగిందనే “అపోహ” లేదు. అన్యాయం చెయ్యబడ్డామనే స్పృహ ఉంది. దానికి empirical evidance ఉంది.

ఈ ఉద్యమాలలో ద్వేషంకన్నా, సమానత్వకాంక్ష ఉంది. కానీ ఆ సమానత్వం వస్తే ఎక్కడ ఆధిపత్యం చేజారిపోతుందో అనే పురుష,అగ్రకుల,వలసవాద కుట్రలు ఈ ఉద్యమాల్ని ద్వేషపూరితం చేస్తున్నాయి. మార్పుని ఆధిపత్యం అంత సులభంగా అంగీకరించదు. అందుకే ఈ violence. దానికి counter violence ఆ మార్పుకోసం జరిగే పోరాటంలో భాగమే.

సామాజిక ఉద్యమాలు mathematical calculations కావు. అవి మానవసంబంధాలంత సంక్లిష్టం.

అగ్రకులాల్లో ఎందరో దళితసమస్యపై పోరాడుతున్నంతమాత్రానా, పురుషుల్లో కొందరు స్త్రీవాదులు ఉన్నంతమాత్రానా పురుషస్వామ్యమనే భావజాలం, కులవివక్ష అనే వికృత సామాజిక రూపం fundamentalగా మారవు. ఆ భావజాలాన్ని ప్రతిఘటించే ప్రతిసారీ, స్టార్ మార్క్ పెట్టి “conditions apply” అనే గమనిక వేస్తూ చర్చించాలి అంటే కుదరదు.

దళితులూ, స్త్రీవాదులూ తమ పోరాటాలతో ద్వేషభావాన్ని నింపుతున్నాయనే అపోహ అవగాహనలేని ఆభిజాత్యం మాత్రమే. Fight for existence and human rights can never propagate hatred.

నిజంగా దళితులు తమ పోరాట క్రమంలో ద్వేషాన్ని నూరిపోసుంటే, హింసనే ఆయుధంగా మలుచుకొనుంటే ఈ పాటికి భారతదేశం గృహయుద్దంలో ఉండేది. స్త్రీవాదులు ఆ పనిచేసుంటే, ప్రతి ఇల్లూ ఒక అగ్నిగుండమయ్యుండేది.

****

19 comments:

Unknown said...

పచ్చ కామెర్ల వాడికి లొకమంతా 'పచ్చ' గానే కనిపిస్తుంది.

ఆ.సౌమ్య said...

Nice to read all your comments again. good exercise!
I agree with most of it....మార్పుకోసం తీవ్రత ఖచ్చితంగా అవసరం. తీవ్రత లేకుండా మార్పు రాదు...ఇది నూటికి నూరుపాళ్ళు నిజం

Anonymous said...

నిజంగా దళితులు తమ పోరాట క్రమంలో ద్వేషాన్ని నూరిపోసుంటే, హింసనే ఆయుధంగా మలుచుకొనుంటే ఈ పాటికి భారతదేశం గృహయుద్దంలో ఉండేది. స్త్రీవాదులు ఆ పనిచేసుంటే, ప్రతి ఇల్లూ ఒక అగ్నిగుండమయ్యుండేది.

ఇది కేవలం తమను తాము గొప్పగా ఊహించుకునే తత్వమే తప్ప మరొకటి కాదు. స్త్రీవాదులకు అంత సీను లేదు. వారికే నిజంగా వుండి వుంటే నిజంగానే ఈపాటికి ఇల్లు అగ్నిగుండమయ్యేది. వారు తమ శాయశక్తులా దానికి కృషి చేస్తూనే ఉన్నారు. కానీ పాపం కుదరడం లేదు లెండి.

Kathi Mahesh Kumar said...

@ఆకాశరామన్న: మీరు తెలుసుకున్న స్త్రీవాదం, మీకు ఎదురైన స్త్రీవాదులు ఎవరోగానీ...వారు మీకు అపోహలు తప్ప సరైన అండర్ స్టాండింగ్ ఇవ్వలేకపోయారు. కనీసం మీరైనా సొంతంగా కొంత స్టడీ చెయ్యడం అవసరమేమో!

rayraj said...

కరెక్టే. బాగా రాశారు.

అఫ్‌కోర్స్‌, ఇదేమీ విభేదించలేని అభిప్రాయం కాదు. విభేదించి చెప్పే టైం కాదని....మార్పు అవసరం గ్రహింపుకి ఉండి...

మీరన్నట్టు, ప్రతిసారి “conditions apply” అని పెట్టలేం కదా.అంతే.

కెక్యూబ్ వర్మ said...

తమ ఆధిపత్యాన్ని కూల్చే శక్తులను అపహాస్యం చేయడం ద్వారా, వారి వ్యక్తిత్వాన్ని మరింత చిన్నాభిన్నం చేయడం ద్వారా పోరాడే వారి తత్వాన్ని బలహీనం చేసే కుట్రలు అనాదిగా జరుగుతూనే వున్నాయి. వాటికి బ్లాగర్లు కూడా మినహాయింపు కాదు. తమ తమ భావజాలాదిపత్యాన్ని ప్రస్ఫ్హుటి౦చేవిగానే వు౦టాయి వారి రాతలుకుడా. తప్పనిసరిగా వాటిని నిబ్బర౦గా ఎదిరి౦చే దృక్పధాన్ని కలిగివు౦డట౦ అవసరం. పోరాడకపోతే, రక్తం చి౦ది౦చకపోతే ఇ౦త మార్పు వచ్చేది కాదు. సమాజం నిర౦తర౦ చలనశీలం అన్నది సత్యం. ఏ కొద్దిమ౦ది కోసమో అది ఆగదు.

Samaikya said...

"ఈ నిరసన క్రమంలో విబేధం, ప్రతిహింస,ఎదురుదాడి తప్పవు. సామరస్యానికి ఆధిపత్యపోరులో స్థానంలేదు."
హింస లేకుండానే ప్రతిహింస,దాడి లేకుండా ఎదురు దాడీ మొదలుపెడితే దానికి తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.
"దళితులూ, స్త్రీవాదులూ తమ పోరాటాలతో ద్వేషభావాన్ని నింపుతున్నాయనే అపోహ అవగాహనలేని ఆభిజాత్యం మాత్రమే."
ఎదుటి వాడినీ ప్రతిసారీ అభిజాత్యం అనటంకూడా న్యూనతా భావం నుంచీ వస్తుంది. ఇదీ అభిజాత్యం యొక్క నెగటివ్ రూపమే. వీళ్ళు ద్వేష భావాన్ని నింపక పోయినా అది ఉద్యమ రూపం లో రోడ్ మీద జనాలకి చేరేటప్పటికి దానిలో ద్వేష్భావం తప్పితే మిగిలేది ఏమీ ఉండదు.
"అంత సీన్ లేదు.దళితులు 15% ఉంటే మిగిలిన వారు 85% ఉంటారు. ముందు నుంచీ మిగిలిన కులాలన్నీ కూడబలుక్కుని దళితులని అణచివేయాలనుకొంటే మీరు ఈ మాటలు మాట్లాడగలిగే వారు కాదు. అంబేద్కర్ రిజర్వేషన్లు ఇవ్వగలిగే వాడు కాదు.అసలు అణిచివేయబడుతున్నామనే తెలిసేది కాదు. అలానే మగాళ్ళందరూ కూడ బలుక్కొని ఆడవాళ్ళను అణిచివేసినట్లైతే, ఆడ వాళ్ళకు రక్షణ కలిపించే వ్యవస్థలేమీ ఏర్పడేవి కాదు. ఏ మధ్య యుగాలలొకి లాగా మగాడి సంపద గాకునారిల్లేది. మగాళ్ళు ఈ చచ్చు మాటలు పడవలసి వచ్చేది కాదు."
ముందు ఏ కులమైనా, లింగమైనా వెనుక బడిందీ అంటే దానికి బలమైన కారణాలేవో ఉండి ఉండాలి. ఎదుటి వాడు అణచి వేశాడు అంటే, ఆ కాలం తమకు ఏవో బలహీనతలున్నాయి అని అర్ధం చేసుకోవాలి. అలానే అణిచి వేసిన వాడికి ఏమి బలాలు ఆ కాలం లో ఉన్నాయో కూడా తెలుసుకోవాలి.

Kathi Mahesh Kumar said...

@సితార:ఒకరి ఆభిజాత్యానికి కారణం మరొకరి న్యూనతాభావం అనేది నాకైతే కొత్తలాజిక్.

దళితులు స్త్రీలు వెనకబడటానికి బలమైన కారణాలు,వారికి ఆ కాలంలో ఉన్న బలహీనతలు ఏమిటో కాస్త వివరిస్తే అప్పుడు చర్చించడానికి కుదురుతుందేమో!

Samaikya said...

ఒకరి న్యూనతా భావం వలన ఎదుటి వారిది అభిజాత్యం గా కనపడటం సహజం.

1. ఇప్పటి అగ్ర కులాలని చూస్తే వాళ్ళు చాలా వరకూ నార్త్ నుంచీ వచ్చిన ఆర్య జాతులకు సంబంధించిన వారై ఉంటారు. లేక వారితో సత్సంబంధాలు కలిగిన వారై ఉంటారు (వైస్యులు).వలసలు వెళ్ళిన వారు ఆర్ధికం గా డామినేట్ చేయటం ఈ రోజుల్లో కూడా చూడ వచ్చు.వారికి ఎక్ష్పర్టీజ్ ఆ రోజుల్లో అదవులను కొట్టటం, అక్కడ వ్యవసాయం చేయటం. దళితులు ఇక్కడ అంతకుముందు నుంచీ ఉంటున్న ఒరిజినల్ ఇన్ హాబిటంట్స్.వారికి అప్పటికి వ్యవసాయం తెలియదు. పై నుంచీ వచ్చిన వారు దళితులను తమ వ్యవసాయం లో కూలీలు గా పెట్టి , తమ బ్రూట్ ఫోర్స్ తో తాము ఇచ్చిన దానినే తీసుకొనేటట్లు చేశారు. దీనికి తోడు రాజ్యాలు కూడా పై నుంచీ వచ్చిన వారివే అవ్వటం వలన భూస్వాముల పనులకి రాజుల అండ కూడా దొరికేది. ఒక వ్యవస్థ ఏర్పడినాక దానిని కంటిన్యూ చెయ్యటం లో భ్రాహ్మణులు మూఢ విశ్వాసాల(అంటరాని తనం వగైరా) రూపం లో ప్రముఖ పాత్రవహించారు. దీనికి మీకు సోర్సెస్ కావాలంటే చెప్పండి ఇస్తాను.(ఇంటర్నెట్ లో కాదు).

2. ఆద వాళ్ళు పిల్లలని కంటూ, పీరియడ్స్ తో శారీరకం గా బలహీనం గా ఉంటూ, నిరంతర యుధ్ధాలతో ఉండే ఆ వ్యవస్థ లో గ్యారంటీ గా బలహీనులే. యుధ్ధాలలో గెలిచిన వాడు ఆడవాళ్ళని ఒక సంపద గా తీసుకొని పోయేవాడు. ఆడవాళ్ళు పవర్ఫుల్ పొజిషన్లలో ఉండే వారిని ఇష్టపడటం మనం ఇప్పటికీ చూడవచ్చు. ఇది అప్పటి వారి రక్షణ కొరుకొనే ప్రవర్తన కి ఇప్పటి రూపం మాత్రమే.

Kathi Mahesh Kumar said...

@సితార్: వ్యవసాయం రాకపోవడం, శారీరకంగా బలహీనులుగా ఉండటం దళితులు స్త్రీల అణచివేతకు కారణాలంటారు. బాగుంది.

ఐతే...ఈ కారణాల చారిత్రాత్మకత నిరూపించబడింది కాబట్టి అణచివేతని అంగీకరించాలా? వివక్షను కళ్ళకద్దుకోవాలా? ప్రతిఘటన పోరాటం అవసరం లేదా? న్యూనతగా చూసే వాళ్ళ ఆభిజాత్యాన్ని మన న్యూనత అని సరిపెట్టుకోవాలా? మీరు చెప్పదలుచుకున్నది ఏమిటి?

Samaikya said...

మీరే ఒక పక్క "ఎంపిరికల్ ఎవిడెన్స్ ఉంది" అంటున్నారు. మళ్ళీ మీరే "మాథమెటికల్ కాల్క్యులేషన్స్" కాదు అంటున్నారు.మీరు ఈ మాట ఎందుకన్నారో నాకు అర్ధం కాలేదు. కానీ, మాథమెటికల్ కాల్క్యులేషన్స్ ని దళితులూ, స్త్రీలూ కూడా అనుకూలం గానే ఉపయోగించుకుంటున్నారు. ఎంపిరికల్ ఎవిడెన్స్ కి మాథమెటికల్ కాల్క్యులేషన్స్ తో సంబంధం లేదనే అపోహ లో ఉన్నట్లున్నారు. మన ఎలక్షన్లలో మెజారిటీలూ, అసెంబ్లీలలో సీట్లూ, పార్లమెంటు లో కోటాలూ అనీ నంబర్లే కదా. అప్పుడు మాత్రం మాథ మెటికల్ కాల్క్యులేషన్లు కావాలా?

Kathi Mahesh Kumar said...

@సితార్:ఈ టపా నేను ఒక బ్లాగులో రాసిన వ్యాఖ్యల సమాహారం. బహుశా మీరు ఆ టపా చదివితే context అర్థమవుతుందేమో.

ఇక్కడ కూడా నా వాదనలో క్లారిటీ ఉంది. అది మీరు అర్థంచేసుకోవడానికి సిద్దంగా లేనట్టున్నారు. ఎంపరికల్ ఎవిడెన్స్ ఉన్నది అన్యాయం జరిగిందనే నిజానికి. సామాజిక ఉద్యమాల ఆవిర్భావాన్నీ, రూపాన్ని అర్థం చేసుకోవడానికి మ్యాథమేటికల్ క్యాలిక్యులేషన్స్ పనికిరావు అనేది నా వేరే పాయింట్. దానికీ దీనికీ లంకెకలిపి నా వాదనలో తికమక ఉందంటే ఎట్లా...

Kathi Mahesh Kumar said...

@సితార్:ఈ టపా నేను ఒక బ్లాగులో రాసిన వ్యాఖ్యల సమాహారం. బహుశా మీరు ఆ టపా చదివితే context అర్థమవుతుందేమో.

ఇక్కడ కూడా నా వాదనలో క్లారిటీ ఉంది. అది మీరు అర్థంచేసుకోవడానికి సిద్దంగా లేనట్టున్నారు. ఎంపరికల్ ఎవిడెన్స్ ఉన్నది అన్యాయం జరిగిందనే నిజానికి. సామాజిక ఉద్యమాల ఆవిర్భావాన్నీ, రూపాన్ని అర్థం చేసుకోవడానికి మ్యాథమేటికల్ క్యాలిక్యులేషన్స్ పనికిరావు అనేది నా వేరే పాయింట్. దానికీ దీనికీ లంకెకలిపి నా వాదనలో తికమక ఉందంటే ఎట్లా...

Samaikya said...

నేను వివక్షని ఏ మాత్రం సమర్ధించటం లేదు.
మీరు టార్గెట్ చేసే జనాలలో సగం మంది వివక్షను సమర్ధించే వాళ్ళు కాక పోవచ్చు. వాళ్ళను కూడా కలుపుకొని టార్గెట్ చేయటం వలన, తరువాత వాళ్ళ సపోర్ట్ ని కూడా మీరు కోల్పోతారు.ఇది మీకే నష్టం. ఒక ఉద్యమం చేసే టప్పుడు ఇవన్నీ మామూలే అనుకుంటే, మీకు ఆవేశం గా ముందుకు వెళ్ళటం లోనే లాభాలు కనిపిస్తున్నాయి అనుకొంటాను. ఏమైనా ఇది ఉద్యమం లొ ఉన్నవాళ్ళు తీసుకోవలసిన నిర్ణయం.

Kathi Mahesh Kumar said...

@సితార్: టార్గెట్ చేసేది విధానాలని. ఆ విధానాల్ని ప్రేరేపించిన భావజాలాలని. ఆ భావజాలాన్ని reinforce చేస్తున్న పరిస్థితుల్ని. ఇవన్నీ చివరకు వ్యక్తిల దగ్గరే, వారి చర్యల దగ్గరే అంతమవుతాయి. పోరాటం అలాంటి వాళ్ళతో, ఆ భావజాలంతో ఆపరిస్థితులతో...ఈ విషయం గ్రహించిన ఎవరూ సమర్ధించేవాళ్ళను కూడా టార్గెట్ చేస్తున్నారు అనరు.

Samaikya said...

"టార్గెట్ చేసేది విధానాలని. ఆ విధానాల్ని ప్రేరేపించిన భావజాలాలని. ఆ భావజాలాన్ని reinforce చేస్తున్న పరిస్థితుల్ని"
ఈ విషయం పల్లెల్లో ఉండే ఒక సామాన్య దళితుడికీ ( no abhijaatyam here), లేక స్త్రీ కీ ఏ మాత్రం అర్ధమౌతుందో నాకు సందేహం. అలా అర్ధమైతే మచిదే.

వడ్రంగిపిట్ట said...

@Sitaar gaaru మీరు 85 శాతం మందిమి అన్నదాన్లోనే మీ అభిజాత్యం బయటపడి౦ది. ఈ సంఖ్యా బలాన్ని చూపించి ఇంకా ఎంత కాలం అణగదొక్కాలని చూస్తారు. తిరగబడితే మీ కుర్చీలు గల్లంతవుతాయన్న స౦దేహ౦ రావడ౦తోనే మీ ఆధిపత్యాన్ని చూపుతున్నారు. అణగారిన వర్గాల౦టే దళితులూ ఒక్కరే కాదు, ఆదివాసీలు, నిమ్న జాతులెన్నో బిసి ల పేరుతొ వున్నాయి. వీళ్ళంతా మీ అడుగుల కి౦ద నలుగుతున్నవారే. మీ కాళ్ళు వారి నెత్తిపైన వున్నాయి. కానీ వారు పైకి చూడడం మొదలు పెట్టిన నాటి ను౦చి మీ కాళ్ళు నేలపైకి వస్తున్నా క్రమాన్ని సహి౦చలేని తనం మీ వ్యధలో వ్యక్తమౌతో౦ది.
మరి స్త్రీ వాదమ౦టారా ప్రశ్నించే తత్త్వం మొదలయ్యి౦ది కాబట్టి ఆధిక్యత సమానం వైపు మొగ్గు చూపక తప్పదు. సిగరెట్లు విలిగి౦చి, మ౦దు కొట్టే టిప్పు టాపు స్త్రీ వాదులు కాదు సార్ అసలైన స్త్రీ వాదం శ్రామిక జనం నుండి వస్తున్నారు. కాచుకో౦డి.

Unknown said...

Mahesh,
Finally what is that you are proposing, I'm seeing only complaints from you ,not solutions.

Kathi Mahesh Kumar said...

@యర్నేని: పోరాటం సమాధానంలో భాగమే. ఆ పోరాటాన్ని సమర్ధిస్తూ అర్థం చేసుకోమని మాత్రమే ఈ వ్యాసం చెబుతున్నది.