ఉద్యోగరీత్యా విధించుకున్న ఆరు సంవత్సరాల self exile నుంచీ మరో assignment రీత్యా హైదరాబాద్ వస్తున్నాను. So, I will be back in Hyderabad.
మొన్న హైదరాబాదొచ్చినప్పుడు ట్రాఫిక్కును చూసి భయపడ్డాను. ఆ భయాన్ని అధిగమించాలి
సిటీబస్సులో వెళ్తూ పక్కనున్న బిల్డింగులనుబట్టి దారి కనుక్కునే అవకాశం కోల్పోయినందుకు ఖంగారుపడ్డా...ఎన్ని కొత్తకొత్త హార్మ్యాలో !!! అవన్నీ ఇప్పుడు కనుక్కుని ఖంగారు తగ్గించుకోవాలి.
దేశంమొత్తం "హైద్రాబాదీ బిర్యానీ" ఆర్డరు చేసి, రుచిచూసి విసిగివేసారి వస్తున్నాను. మళ్ళీ ‘బావర్చి’లో బిర్యానీ తిని హైద్రాబాదు రుచిని మళ్ళీతాజాగా తెలుసుకోవాలి.
తెలుగు సినిమాల్ని ఢిల్లీ పాలికాబజార్లో పైరేటెడ్ DVD లలో చూసిచూసి విసుగెత్తి, పెద్దతెరపై తెలుగు సినిమా చెత్తను టికెట్టు కొనిమరీ ప్రోత్సహించాలి.
గోకుల్ చాట్లో నాకిష్టమైన దహీపాపడీ...మిర్చిబజ్జీలకు మొఖంవాచిపోయున్నాను. ఈ సారి కనీసం మరో ఆరు సంవత్సరాలకి సరిపడా రెండేళ్ళలోనే పట్టించెయ్యాలి.
సినిమా ఇండస్త్రీలోవున్న స్నేహితులందరి జీవితాల్నీ నేనే ఒక సినిమాగా తియ్యాలి.
హైద్రాబాదులోని నా స్నేహప్రపంచంలో మరిన్ని బ్లాగుదేశాలు చేరాయి. అన్నింటినీ ఒక్కటిగాచేసి, అంతానాదే అనేసుకోవాలి.
మళ్ళీ హైదరాబాదుని సొంతం చేసుకోవాలి.
వస్తున్నా హైదరాబాద్ ! just wait for me !
Thursday, August 28, 2008
హైద్రాబాదొస్తున్నానోచ్ !
Posted by
Kathi Mahesh Kumar
at
6:18 AM
11
comments
Labels: వ్యక్తిగతం
Tuesday, August 26, 2008
పరమసత్యాన్ని మించిన సత్యం !!!
సిద్దార్థుడు నిద్రపోతున్న భార్యాపిల్లల్ని వదిలి సత్యశోధనకై అడవుల్లో ప్రయాణించి ‘గయ’ చేరుకున్నాడు. బోధివృక్షం కింద జ్ఞానోదయం అయింది. ‘పరమసత్యం’ (Ultimate Truth) అవగతమయ్యింది. సత్యాన్ని కనుగొన్న ఉత్సాహం... ఎవరికైనా తెలియజెప్పాలన్న ఆతృత. సారనాధ్ తన మొదటి ప్రవచనానికి సిద్దమయ్యింది. ఐదుగురు శిష్యులు గౌరవంగా చేతుజోడించి ఎదురుగా నిల్చున్నారు. "నిజంగా సత్యాన్ని అవగతం చేసుకుని బుద్ధుడి మారిన సిద్దార్థుడికా ఆ గౌరవం? లేక, ఇన్నికష్టాలు అనుభవించి రాజ్యాన్నీ, పెళ్ళాంపిల్లల్నీ అంత:పురంలో వదిలి అడవులపాలై తిరిగివచ్చిన ఒక సాధకుడిగా ఆ గౌరవం?" ఈ ప్రశ్నకి సమాధానం బుద్ధుడితో సహా ఎవరికీ తెలీదు.
సత్యాన్ని తెలుసుకోవడంద్వారా అనుభవించిన అలౌకిక ఆనందాన్ని, అవగతం చేసుకున్న పరమసత్యాన్ని ఎలా మాటల్లో చెప్పాలో బుద్దుడికైనా తెలిసేనా ! అనుభవానికి పదాలుకూర్చడం ముక్కుమూసుకుని ధ్యానిస్తే వచ్చేనా! మెల్లగా పెదాలు విడిపడ్డాయి...జీవితం దు:ఖమయం...కోరికలు దు:ఖానికి మూలకారణం...కోరికల్ని త్యజిస్తే దు:ఖాలు అంతమైపోతాయి. ఎదురుగా నించున్న శిష్యుల్లో ఎలాంటి చలనమూ లేదు. కనీసం కళ్ళలో ఈ పరమసత్యాన్ని తెలుసుకున్న ఆనందంకూడా ప్రతిఫలించడం లేదు. "ఇదేకదా నేను ఇన్నాళ్ళ ధ్యానంలో తెలుసుకున్నది. మరి సత్యం మరెవ్వరికీ అర్థం కాదా?" ఒక self doubt ఉదయించింది. పరమసత్యం అవగతమైనా, సందేహాలు తప్పవా! ఏమో!
పరమసత్యాన్ని తెలుసుకోవాలంటే అందరూ ధ్యానం చెయ్యాలా? దేన్ని ధ్యానించాలి? ఎంతకాలం ధ్యానించాలి? ఎలాధ్యానించాలి? ఎన్నో ప్రశ్నలు. తనే విడమర్చి చెబితే ! ప్రయత్నించాడు. చిన్నచిన్నఊర్లూ, పెద్దపెద్ద పట్టణాలూ అన్నీ తిరిగాడు. ప్రజలందరికీ ఈ సత్యాన్ని విప్పిచెప్పాడు. కొందరు అర్థమయ్యిందని తలలూపారు. శిష్యులు మరింత శ్రద్ధగా తలాడించారు. మరికొందరు, "ఐతే" అన్నట్లు ప్రశ్నార్థకంగా ముఖాలుపెట్టారు. నిజమే, "ఐతే ఏమిటి?", "ఐతే ఎలా?" అప్పుడే తను పొందిన జ్ఞానంలోంచీ మరో వెలుగురేఖ ఉదయించింది. ‘అష్టాంగమార్గం’. ఎలా కోరికల్ని త్యజించాలో తెలియాలి. దానికి మార్గం అవగతం కావాలి. అయ్యింది. అదే మరోక మూలసూత్రం. మొదటి మూడింటితో కలిపి ఇప్పుడు నాలుగు.దు:ఖాలనుండీ విముక్తికి ఒక మార్గముంది, అదే అష్టాంగమార్గం. సత్యావగాహన (Right Understanding), సత్యాలోచన (Right Thought), సత్యవాక్కు (Right Speech), సత్యప్రవర్తన (Right Action),సత్యజీవని (Right Livelihood), సత్యయత్నం (Right Effort),సత్యయోచన (Right Mindfulness), సత్యఏకాగ్రత (Right Concentration).
మార్గం చెప్పగానే వానవెలిసిన స్పష్టత ఏర్పడినట్టుంది. తేటగా కనబడుతున్న ప్రజల ముఖాలు, "ఇదే సరైన దారి" అన్నట్లు శిష్యుల కళ్ళూ. సత్యశోధన బోధించడానికి దారి లభించింది. సులభంగా అర్థమయ్యేలా అవగతం చేసే మార్గం లభించింది. అప్పుడే ‘సంఘం’ ఏర్పడింది. ఈ దారిని నమ్మి ప్రయాణించే ప్రయాణికుల సమూహం. అదే సమయంలో ‘కపిలవస్తు’ నుండీ పిలుపువచ్చింది. బుద్దుడికళ్ళలో సందిగ్ధత. "తనది ఇంకా చిన్నతనమని తండ్రి అనుకుంటున్నాడేమో!" అని. ఏంత పెద్దవారైనా తల్లిదండ్రులకు ఎప్పటికీ చిన్నపిల్లమే కదా. భార్య యశోధర "ఎందుకిలా చేసావంటే, సమాధానం?". కొడుకు "నాన్నా...అంటే నువ్వేనా?" అని అడిగితే. ఇవే ఆలోచనలా, లేక వారికీ సత్యాన్ని చూపించాలనే తపనా ! అరమూసినకళ్ళలో అటు సందిగ్ధత ఇటు తపనా కనిపించకపోతే చెప్పేదెలా.
యశోధర వచ్చింది. ఎదురుగా నిలుచుంది. ఒకప్పుడు ప్రేమించిన దేహం. చుంబించిన నుదురు. ఒళ్ళంతాకప్పుకున్న జుట్టు. వెలిగే కళ్ళు. కానీ ఇప్పుడు. మారిపోయింది. చాలామారిపోయింది. "మార్పుకు కారణం నువ్వే" అన్నంతగా మారింది. నిలదీస్తుందో...నిందిస్తుందో తెలీదు. తను పెదవి విప్పింది. "ప్రపంచంలో ఒకే పరమసత్యం ఉన్నప్పుడు, అది అంత:పురంలో లేకుండా అడవిలో ఎలా దొరుకుతుందనుకున్నావు?". అంత సత్యం తెలిసిన బుద్దుడికి నోటమాట లేదు. సత్యం తెలిసిన బుద్దుడు నిజంకోసం వెతుకుతున్నాడు. తెలిసింది. "సత్యం ఎక్కడ దొరుకుతుందో నాకప్పుడు తెలీదు. ఒక్కటే తెలిసేది. అంత:పురంలో నన్ను సత్యన్ని చూడకుండా కట్టడి చేసారని. అందుకే అక్కడినుండీ పారిపోయాను. భార్యాబిడ్డల భాద్యత ఒక మనిషిగా నాకున్నాయని తెలుసు. అయినా సత్యశోధన బలం నన్ను ఈ బంధాలను త్యజించేలా చేసింది." యశోధర నవ్వినట్లనిపించింది. యశోధరకి పరమసత్యానికి మించిన సత్యమేదో తెలుసని బుద్దుడి మనసుకు అనిపించింది. "నిజంగా తెలుసా...!!! ఎలా అడగాలి?".
"బౌద్ద విహారానికొచ్చావు, ఏదైనా భిక్ష ఇవ్వకుండానే వెళ్ళిపోతావా?" అన్నాడు. కనీసం భిక్షగా అయినా పరమసత్యాన్ని మించిన సత్యాన్ని పరిచయం చేస్తుందేమో అన్న ఆశ. "నా దగ్గర నా కొడుకుతప్ప ఇంకేమీ లేదు.తననే నీకు ధారాదత్తం చేస్తున్నాను. రాహుల్ తనదైన సత్యాన్ని కనుగొంటాడని కోరుకుంటాను.ఈ ప్రపంచంలో మరో యశోధర జన్మించకుండా ఆ సత్యం వుంటుందని ఆశిస్తాను." అది భార్యభర్తని ఎత్తిపొడిచినట్టుగా లేదు. ఒక జ్ఞాని తన శిష్యుడిని మందలించినట్టుగావుంది. బుద్దుడికి ఎలా అనిపించిందో తెలీదు.
రాహుల్ మంచి శిష్యుడిగా ఎదుగుతున్నాడు. ఇప్పుడు ఎక్కడికి బుద్దుడు వెళ్ళినా ప్రజలు అగరొత్తులతో స్వాగతిస్తున్నారు. అతన్ని కీర్తిస్తూ గానం చేస్తున్నారు.దేవుడంటూ అభిమానిస్తున్నారు. తన ఆశీర్వాదంతొ మోక్షం పొందొచ్చనుకుంటున్నారు. ధనవంతులు విహారాలనూ, ఉద్యానవనాలనూ బుద్దుడికి గౌరవంగా నిర్మించి నిర్వాణం పొందొచ్చనుకుంటున్నారు. ఈ మార్పులు బుద్దుడికి అస్సలు అర్థం కావటం లేదు. తను చెప్పిన పరమసత్యంకన్నా, తానెప్పుడు ప్రాముఖ్యత సంతరించుకున్నాడో అవగతం కాని దశ. ఎవరినీ ప్రశ్నించలేని, గద్దించి జవాబు అడగలేని స్థితి. ఏంచెయ్యాలో తెలీని పరిస్థితి.
ఇలాంటి తరుణంలో రాహుల్ బుద్దుడి దగ్గరికొచ్చాడు. " నాకు పరమసత్యం అవగతమయ్యింది" అన్నాడు. తన ముఖవర్ఛస్సూ చుట్టూ ప్రతిఫలించే కాంతీ అది నిజమని చెప్పకనే చెబుతున్నాయి. బుద్దుడు మరోమాట మాట్లాడేలోపు రాహుల్ "నేను మళ్ళీ రాజ్యానికి వెళ్ళే సమయం ఆసన్నమయ్యింది" అన్నాడు. బుద్దుడి కళ్ళలో ఆశ్చర్యం. "పరమసత్యాన్ని గ్రహించినవాడివి వాటిని ప్రజలకు తెలియజెప్పాలని లేదా?" అని వీలైనంత శాంతంగా అడిగాడు. "తండ్రీ ! నన్ను మీకు అప్పగించేముందు నా తల్లి నాతో కొన్ని మాటలు చెప్పింది. నీ తండ్రి చెప్పిన దారిలో పయనిస్తూ ‘విశ్వజనీయమైన పరమ సత్యాన్ని’ (Universal Ultimate Truth) కాక నీదంటూ ఒక ప్రత్యేకమైన ‘వ్యక్తిగత సత్యాన్ని’ (Personal Truth) తెలుసుకో. ఎందుకంటే, ఒక సారి విశ్వజనీయమైన సత్యాన్ని గ్రహించిన పిదప ఆ సత్యాన్ని అందరూ గ్రహించాలని కాంక్షిస్తావు. కానీ అది అసాధ్యం. ప్రతిమనిషీ తనదైన సత్యాన్ని తెలుసుకుంటేతప్ప నిర్వాణాన్ని అందుకోలేడు. విశ్వజనీయమైన సత్యాన్ని వేరొకద్వారా వింటే మనిషికి అర్థం కాదు. సత్యంయొక్క మహత్తు తెలిసినతరువాత ఆ సత్యాన్ని త్వరగా పొందాలని ఆశించే స్వార్థం ప్రారంభమవుతుంది. ఆ స్థితిలో అష్టాంగమార్గం శూన్యమై దానికి విపరీతమైన లక్షణాలు అలవడుతాయి" అని చెప్పాడు రాహుల్.
మరోసారి బుద్ధుడికి జ్ఞానోదయం జరిగింది. "ఇదే పరమసత్యానికి మించిన సత్యం" అని అవగతమయ్యింది. "కానీ ఇప్పటివరకూ తాను చేసింది !" అనే సందేహంతోపాటూ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలలోని రహస్యం బోధపడినట్లయ్యింది. అప్పుడు ఈ సందేహాస్పద తధాగతుడిని చూసి రాహుల్ "శాక్యమునీ ! నీ ఆలోచన నాకు అర్థమయ్యింది. ప్రపంచం నీ పరమసత్యాన్ని అర్థం చేసుకోలేదు. ఈ ప్రపంచం ఎప్పటికీ అర్థం చేసుకోదుకూడాను. కానీ నీ బోధనలవలన కొన్ని విప్లవాత్మక పరిణామాలు జరిగాయని మర్చిపోకు. కొన్ని వేల సంవత్సరాలుగా అణగదొక్కబడిన పేదలు, దళితులూ ఈ వ్యవస్థని మొదటిసారిగా ప్రశ్నించారు. హిందూమతంలోని సామాజిక దురాచారాలనీ, మూఢాచారాలనీ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. త్యజిస్తున్నారు. పరమసత్యాన్ని వారు అందుకోలేకపోయినా సత్యం కానిదాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తిస్తున్నారు, నిరసిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఇదే వ్యక్తిగత సత్యాన్ని సాధించటానికి గల ఉత్తమమైన మార్గం. నువ్వు చూపినదారి ఇంకోదారిని వెతుక్కుంది. ఈ దారి పరమసత్యాన్ని అందించకపోయినా, మెరుగైన జీవితాన్ని ఖచ్చితంగా అందిస్తుందు. అదే వ్యక్తిగత సత్యం. అదే ఇప్పుడు కావలసింది. నిజంగా కావలసింది దు:ఖం లేని జీవితంకాదు. పోరాడి సాధించుకునే హక్కులూ,స్వతంత్ర్యం." అన్నాడు.
తధాగతబుద్ధుడు మందస్మితుడైవున్నాడు. పరమసత్యాన్ని మించిన సత్యాన్ని గ్రహించిన యశోధరకు ప్రణమిల్లుతున్నాడు. రాహుల్ తన వ్యక్తిగత సత్యాన్ని తనలోనే వుంచుకున్నాడు. లోకం మారింది కానీ బుద్దుడు అనుకున్నట్లుగా కాదు. పరమసత్యం ఇప్పటికీ ఎవరికీ తెలీదు.
*మైధిలీ శరణ్ గుప్త్ రాసిన ‘యశోధర’ కవితకు నా సొంతపైత్యం జోడించి.
Posted by
Kathi Mahesh Kumar
at
8:33 PM
20
comments
Labels: మతం
Monday, August 25, 2008
స్త్రీవాద సాహిత్యంలో గందరగోళం
రెంటాల కల్పనగారు తమ బ్లాగులో రాసిన "కొత్త సరిహద్దుల్లో స్త్రీవాద కథ" అనే విశ్లేషణాత్మక వ్యాసానికి నేను రాసిన వ్యాఖ్యలను టపాగా ఇక్కడ పబ్లిష్ చేస్తున్నాను.
ఈ కాలంలో స్రీవాదం అనేది ఒక politically correct పంధా. భారతదేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ భావజాలం యొక్క సైద్దాంతిక స్వరూపం అస్తవ్యస్తంగా ఉంది.
ఇలాంటి స్థితిలో rhetoric కి ఉన్న విలువ సాహిత్యానికి లేదు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. రాజకీయ పార్టీలు emotive slogans వాడినట్లు చాలా మంది రచయిత/త్రు లు ఈ వాదాన్ని వాడేస్తున్నారు.
సాహిత్యాన్ని కేటగరైజ్ చెయ్యటంలో మొదటిది సహజసిద్దంగా వచ్చిన సాహిత్యాన్ని సిద్దాంతీకరించే పద్దతైతే మరొకటి సిద్దాంతాన్ని బట్టి సాహిత్యాన్ని సృష్టించడం.ప్రస్తుతంవున్న చాలా మంది స్త్రీవాద రచయిత/త్రు లు చేస్తున్న పని రెండోరకానికి చెందింది. అందుకే ఇన్ని సమస్యలున్నాయని నా అభిప్రాయం. విమర్శకుల వివక్షకి ముఖ్య కారణంకూడా అదే కాబోలు. విస్తృతమైన మానవసంబంధాలూ, సామాజిక సమస్యలమీద రచయిత/త్రులు సహజంగా రాసిన తరువాత వాటిల్లోవున్న స్త్రీవాదకోణాన్ని అర్థం చేసుకుని విమర్శనలు చెయ్యడం వేరు, కేవలం స్త్రీవాద రచనగనక ఆ ధృష్టికోణంలో దాన్ని చూసి ‘విలువకట్టడం’ వేరు.
౦౦౦
”ఈ భావజాలం యొక్క సైద్దాంతిక స్వరూపం అస్తవ్యస్తంగా ఉంది.”ఏరకంగానో నాకైతే అర్దం కాలేదు. దీన్ని వివరించగలరా? - రెంటాల కల్పన
౦౦౦
అర్థం కాక అడిగారంటే నేను నమ్మలేను. అయినా ఆ స్టేట్మెంట్ ఇచ్చింది నేను గనక,వివరించాల్సిన నైతిక బాధ్యతని తీసుకుని వీలైనంత క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను.
సాధారణంగా భారతీయ స్త్రీవాదాన్ని మూడు భాగాలుగా విభజిస్తారు. మొదటిది బ్రిటిష్ పాలన సమయంలో జరిగిన సామాజిక ఉద్దరణ (1850- 1915). దీనికి మూలం మానవత్వం అనిచెప్పుకోవచ్చు. ‘సాంఘిక సంక్షేమం’ ఆధారంగా కొందరు సతీసహగమనం,వితంతువివాహం మొదలైనవాటి నిర్మూలనకు పోరాడిన సమయం ఇది.
రెండవది, స్వాతంత్రోద్యమ నేపధ్యంలో జరిగిన మహిళా చేతన (1915-1947). ముఖ్యంగా గాంధీ భారతీయ రాజకీయ తెరపైకివచ్చి మహిళల్ని కార్యోన్ముఖుల్ని చేసిన దశలో జరిగిన కాలమిది. ఇప్పుడే ‘మహిళలు మాత్రమే’ ఉన్న సంస్థలూ,ఉద్యమాలూ మొదలయ్యాయి. ఇవన్నీ దేశస్వాతంత్ర్యంతోపాటూ మహిళా స్వేచ్చని కాంక్షించేవిగా ఎదిగాయి.
స్వాతంత్ర్యానంతరం కూడా వీరి పరిధి మహిళాశిశు సంక్షేమం, సమాన వేతనాలు వంటివాటికే పరిమితమయ్యాయి. ప్రభుత్వంకూడా ఈ ఫనులన్నింటినీ ఒక ప్రోత్సాహంలాగానే (దయతలచినట్లు) చేసిందేతప్ప “హక్కుల” ధృక్కోణంలో చెయ్యలేదు.
మూడవభాగం 1970లలో ప్రపంచవ్యాప్తంగా,ముఖ్యంగా అమెరికాలో వచ్చిన స్త్రీవాద మార్పుల నేపధ్యంలో భారతీయ స్త్రీవాదం మరో బలమైన మలుపు తిరిగింది. వ్యక్తిగతస్వేచ్చ,హక్కులు, జెండర్, సెక్సువాలిటీ,గృహహింస, పితృస్వామ్యం వంటి విస్తృతమైన సమస్యల్ని ప్రధానస్రవంతిలోకి తీసుకురావడానికి ఈ సమయంలో ప్రయత్నాలు జరిగాయి.
పైన ఉన్న ప్రతి భాగంలో అప్పటి పరిస్థితికి అనుగుణంగా సాహిత్యసృజన జరిగింది. కాకపోతే, భారతదేశం 1990వ దశకంలో చాలా విప్లవాత్మకమైన మార్పుల్ని సంతరించుకుంది. 1970 లలోని సామాజిక,ఆర్థికవిధానాలతో స్త్రీవాద ఉద్యమం ముడిపడివున్నట్లే, ఈ విప్లవాత్మక మార్పుల దృష్ట్యా ఈ వాదంలోనూ మార్పులు రావాల్సింది. కానీ కొన్ని ఛాంధసవాద భావాలూ, సాంప్రదాయక విలువలలోని సౌఖ్యాన్ని అంతర్లీనంగా గ్రహించిన చాలామంది స్త్రీవాదులు కేవలం దీన్ని battle of sexes గా మార్చి, సమాజమూలాల్ని మార్చడంగురించి చర్చించడం మానుకున్నారు. ఇక్కడే అసలు సమస్య ప్రారంభమయ్యింది.
ఈ నేపధ్యంలో స్త్రీవాదంలో ఒక రకమైన డొల్లతనం కనిపించడం ప్రారంభమయ్యింది. అమెరికా స్త్రీవాదాన్ని ఆదర్శంగా తీసుకున్న స్త్రీవాదులు, కేవలం వారికి అనుకూలమైనవాటిని మాత్రమే ఏరుకుని, మిగతా “స్వేచ్చ” విషయాలలో పితృస్వామ్యం మూసనే మళ్ళీ మన సమాజంపై తమ సాహిత్యం ద్వారా రుద్దటం ప్రారంభించారు. ఇక్కడే ఒక disconnect మొదలయ్యింది. అటు ఎంచుకున్న అనుకూల మూలసిద్దాంతం, ఇటు త్వరితగతిన మారిన సమాజం నేపధ్యంలో ఒక విధమైన సైద్దాంతిక గందరగోళం ఏర్పడింది.
చాలావరకూ స్త్రీవాద రచయిత/త్రులు నగరానికి చెందినవారవటం కారణంగా ఈ తేడా మరింత స్పష్టంగా కనిపించడం మొదలయ్యింది. మూల సమస్యలకన్నా కొసరు సమస్యలను నెత్తికెత్తుకుని అదే స్త్రీవాదంగా భ్రమించడం మొదలయ్యింది. అందుకే “all men are pigs” వంటి సులభమైన భావజాలాన్ని సృష్టించి దీన్ని మగాడికీ ఆడవారికీ మధ్య సమస్యగా మాత్రమే చూపుతూ తమ పబ్బం గడుపుకోవడం మనకు తెలిసిందే. ఇంతలో మారాల్సిన సమాజం అర్జంటుగా మారిపోయి, ఈ సిద్దాంతాలకి “బూజుపట్టించేసింది”. యువతలో చాలామంది ఈమూస స్త్రీవాదం నుంచీ దూరంగా ఉండాలనుకోవడం ఈ సైద్దాంతిక అస్తవ్యస్తతే అని నాకు అనిపిస్తుంది.
“అడామగాకున్నది మిత్రవైరమేకానీ శతృత్వంకాదన్న” మూల సిద్దాంతాన్ని విస్మరించి ప్రస్తుత స్త్రీవాదం,దాని సాహిత్యంలో కఠినత్వాన్ని నటిస్తోందని నేను చదివిన కొన్ని కథల మూలంగా అనిపించింది. మార్చాల్సిన కనబడే సామాజిక వ్యవస్థలకన్నా, పితృస్వామ్య భావజాలమనే ఒక శతృవుతో పోరాడటానికి వీరు ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు కనబడుతుంది. దీనికితోడు, కొంత ఈ ఆలోచనా శైలితో విభేధించే ఏ స్త్రీనైనా లేక పురుషుడినైనా లేబుల్స్ తగిలించేసి “వెలివేసే” అలవాటు స్త్రీవాదుల్లో తయారయ్యింది.
70లలో ఆగిపోయిన స్త్రీవాద భావజాలం 90ల sensitivity ని పుణికితెచ్చుకోకుంటే, అసలే తెలుగు చదవడం మానేస్తున్న యువత, స్త్రీవాదం అనే మాటవింటేనే ఆ సాహిత్యంవైపు కన్నెత్తిచూసే సాహసం చెయ్యకపోవచ్చు. ఇక కేవలం రాసినోళ్ళూ,పబ్లిష్ చేసినోళ్ళూ లేక వృత్తిరీత్యా విమర్శకులూ ఆ సాహిత్యాన్ని చదవాల్సిందే. ఆ భావజాలాన్ని అభినందించాల్సిందే.
I don’t mean to take away any credit from feminism for what it has done in the past. But, at present if they don’t sensitize themselves with present day reality, the time may come when it is dead and none will be there even to mourn it.
ప్రస్తుతం చాలామంది మార్కెట్లో ఈ వాదం నడుస్తుంది కాబట్టి రాయటం మొదలయ్యిందిగనకనే credibility ఒక సమస్యగా మారింది. ఇక పాఠకులంటారా, వారిని తప్పుబడితే నేను అంగీకరించను. Readers have every right to interpret the text as they wish. కాకపోతే విమర్శకులుకూడా సాధారణ పాఠకుల్లాగా భావజాలం రంగుటద్దాలతో a work of artని కొలవడం నేను అంగీకరించలేని విషయం.
“Literary criticism has a great role to play in not only indexing what is written, but also to contextualize the written word in present day society” అనే సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. అందుకే సాహితీ సమీక్షలకూ, విశ్లేషణలకూ,విమర్శనలకూ నేను విలువనిస్తాను. కాకపోతే మన తెలుగులో కులాలూవాదాలూ తప్ప సమాజం ఎక్కడా విమర్శకుల ధృక్కొణంలో కనిపించక నిరాశపడుతూ ఉంటాను.
ఎలియట్ ఆర్నాల్డ్ చదివితేగానీ విమర్శకుడు కారాదని నా ఉద్దేశం కాదు. కానీ, విమర్శకుడిగా మన బాధ్యత,నిబద్దత తెలియాలంటే సాహితీ విమర్శకు సంబంధించిన విభిన్నమైన ఆలోచనలు ఖచ్చితంగా తెలియాలి. అందుకే బహుశా మన విమర్శకులు చదవలేదేమో అనే సందేహం వెల్లడించాను.
***
Posted by
Kathi Mahesh Kumar
at
3:51 PM
12
comments
Labels: సాహిత్యం
Sunday, August 24, 2008
నేను రోజూ ఎందుకు బ్లాగు రాస్తాను !
సి.బి.రావు గారు నా 'దరిద్రనారాయణుడు' టపాకు వ్యాఖ్యరాస్తూ నా బ్లాగు రాతలగురించి కొన్ని సందేహాలు లేవనెత్తారు. మొదటిది "అలవక రోజూ ఇలా, ఎలా కత్తుల్లా విసురుతున్నాడో" అని. రెండవది "ఇన్ని టపాలు, ఉల్లాసంగా, ఉత్సాహంగా రాయటానికి మీరేమి తాగుతారు" అని. అంతేకాక "వ్యాఖ్య రాసే లోపలే, కొత్త టపా వస్తుంటే వ్యాఖ్య ఎలా రాస్తాము?" అంటూ నాకొక చురకకూడా అంటించారండోయ్. వారడిగినవి చాలా విలువైన ప్రశ్నలు, ఎందుకంటే ఇప్పటివరకూ ఆప్రశ్నలకు నాకూ నిర్ధిష్టంగా జవాబులు తెలియదు.
హఠాత్తుగా మనల్ని ఎవరైనా జవాబు రాని ప్రశ్నలెవరైనా అడిగితే, "good question" అని మొదట అనేసి తరువాత ఆలోచించడం మొదలెడతాం. అలాగే, వారి వ్యాఖ్యకు ప్రతిగా ఏకంగా ఒక టపా "రాసేస్తా చూడండి" అని చెప్పి, ఇప్పుడు ఆలోచిస్తుంటే కాస్త గందరగోళంగా ఉంది. ఏదిఏమైనా, మన రతన్ టాటా 'నానో' కారు రేటు గురించి "a premise is a promise" అంటూ లక్షరూపాయలకే ఇవ్వడానికి తయారైనట్టు, నేనూ వీలైనంత సిన్సియర్గా సమాధానం ఆలోచిస్తూ చెప్పడానికి ప్రయత్నిస్తాను.
"To understand a writer in his totality, you need to understand his life and times" అంటారు. అలాగే రావుగారడిగిన ప్రశ్నలకి సమాధానంగా కొంత నా జీవితాన్ని వివరించకతప్పదు.
ఇంట్లో నేనే చిన్నవాడిని అవటం వలన స్వతహాగా కొంత రెబల్ మనస్తత్వం కలిగింది. పుస్తకాలు చదవడం చిన్నప్పుడే మా అన్నయ్య ద్వారా అలవడింది.అలా చదివినదాన్ని ఊహించి ఆనందించడం నా చుట్టూ చాలా మంది చేస్తే, నేను కాస్త తింగరోణ్ణికాబట్టి ఆనందించడంతోపాటూ ప్రశ్నించడం మొదలెట్టేవాడిని. అప్పట్లో అది నా తరహా భాష్యం (interpretation) చెప్పుకోవడానికి నేను చేసిన ప్రయత్నమన్నమాట. ఇలా చందమామ నుంచీ యండమూరి వరకూ చదివేసాను. యండమూరి అప్పట్లో కొంత సామాజిక నిజాల్ని ప్రశ్నించే రచనలు చెయ్యడం, నేను వాటిని చదవడంతో కొంత critical thinking మొదలయ్యింది. నాకు ఇష్టమొచ్చింది నేను మనస్ఫూర్తిగా చెయ్యగలగటం, అనే ఒక విలువని అప్పట్లో చాలా అభిమానించి internalize చేసుకున్నాను. అందుకే నన్నూ ఏ ఇంజనీరుగానో,డాక్టరు గానీ చేసెయ్యడానికి మా నాన్నగారు సైన్సు తీసుకోమంటే, ఖచ్చితంగా వద్దని చెప్పి ఆర్ట్స్ తీసుకున్నాను.
నా అదృష్టంకొద్దీ తేదీలు బట్టీపట్టమనే హిస్టరీ టీచర్లూ, స్టాటిస్టిక్స్ ఫార్ములాలు వల్లెవేయమనే ఎకనామిక్స్ టీచర్లూ లేక జ్యాగ్రఫీ అంటే మ్యాపులు కొలిచే సబ్జెక్ట్ అన్నట్లు చెప్పే టీచర్లు కాక, కొంత innovative గా పాఠాలు చెప్పే ఉపాధ్యాయగణం దయవల్ల నా విమర్శనా దృష్టికి కొంత తర్కం,ఆలోచనా దొరికాయి. ఉదాహరణకి చరిత్రపాఠాలు తారీఖుల ఆధారంగాకాక, ఘటనలను ఒక పద్దతి ప్రకారం అర్థం చేసుకోవడం వలన సులభంగా నేర్చుకోవచ్చని మా హిస్టరీ మాస్టారు నేర్పారు. ఒక "3C formula" మాకు నేర్పించి జీవితంలో చాలా పెద్ద సహాయం చేసిన ఆ టీచర్ని మర్చిపోలేను. మా మాష్టారి ప్రకారం ఏ చారిత్రాత్మక ఘటననైనా మూడు భాగాలుగ విభజించొచ్చు, 1.Causes (కారణాలు), 2. Course (ఘటనాక్రమం), 3. Consequences (ఫలితాలు), నిజంగా చరిత్రకు ఇవే ముఖ్యం. తారీఖులు కాదు.ఈ ఘటనలు జరిగిన తేదీ గుర్తుంటే అది ఒక బోనస్సేతప్ప,అదే అంతంకాదు. ఈ ఒక్క ఆలోచన, నా జీవితంలోని విషయాలను అర్థం చేసుకునే విధానంలో తీవ్రమైన మార్పుని తీసుకొచ్చింది.
ఈ ఆలోచనలు నాలో అంకురించి మొక్కగా మొలిచిన దశలో, మైసూర్ కాలేజిలో గ్రాడ్యుయేషన్ కోసం వెళ్ళాను. అక్కడ నేను నా సబ్జెక్టు ఆంగ్ల సాహిత్యం. అసలే సగానికిపైగా మతాన్ని వ్యతిరేకించి, వ్యక్తి స్వాతంత్ర్యానికి పట్టంకట్టే ఈ సాహిత్యం నా స్వతంత్ర్యా భావాలకు రెక్కలనిచ్చింది. అప్పుడే "ఆంగ్ల సాహిత్యాన్ని అర్థం చేసుకో, తెలుగు సాహిత్యాన్ని అనుభవించు" అని చెప్పిన మా ఫ్రొఫెసర్ మాటతో అప్పటివరకూ యండమూరి వరకూ ఆగిన నా చదువు చలం,కొడవగంటి కుటుంబరావు,చివుకుల పురుషోత్తం,చిట్టిబాబు, బుచ్చిబాబు,తిలక్ ల పరిచయంతో పరిమళించింది.దానితోపాటూ చదవిన ఆంగ్లసాహిత్యం ఎలాగూ ఉంది. ఇలా మొత్తానికి చాలా మంది జీవితాల్లా కాక, my academics always helped my "Education" అన్నమాట.
ఆపైన ఏ TV లోనో సినిమాల్లోనో చేరదామనుకున్న నేను Communicationలో పోస్ట్ గ్ర్యాడ్యుయేషన్ చేసినా, అక్కడ సామాజిక సమస్యల గురించీ వ్యక్తులుగా, మీడియా ఫ్రొఫెషనల్స్ గా, ఈ దేశ పౌరులుగా మేము నెరవేర్చవలసిన బాధ్యత గురించీ ఒక theoretical frameworkలో చెప్పారు. గ్రామీణ నేపధ్యం కలిగిన నాకు ఆ సమస్యలు తెలిసున్నా, ఈ సైద్దాంతిక ధృక్కోణం నా ఆలోచనకు కొంత ఉద్వేగాన్ని అందించింది. ఈ నేపధ్యం కారణంగా జీవితాన్నీ, చుట్టూవున్న సమాజాన్ని నాదైన రీతిలో అనుభవించడానికీ,అర్థం చేసుకోవడానికీ, ప్రతిస్పందించడానికీ ప్రయత్నిస్తూ ఉంటాను.
ఈ నా ఆలోచనలకి,స్పందనలకీ బ్లాగు మూలంగా ఇప్పుడు అక్షరరూపం వస్తున్నాయంతే. బ్లాగులేనప్పుడు మిత్రులతో,కుటుంబ సభ్యులతో మౌఖికంగా చర్చించేవాడిని ఇప్పుడు రాస్తున్నాను. అంతే తేడా. ఆలోచించిందో లేక అనుకున్నదో చెప్పటం అలవోకగానే జరుగుతుందేతప్ప అలసటన్నది దరిదాపులకి కూడా రాదు. సాహితీమూర్తులను చదివి సంపాదించుకున్న భాష, నేను ఇప్పటివరకూ తెలుసుకున్న జ్ఞానం నా ఆలోచనల మరింత పదునుపెట్టి రాసేలా పురికొల్పుతుంటే, ఉత్సాహంగా రాయటానికి ఇంకేమీ అవసరంగా అనిపించలేదు. రాసిన తరువాత, రాసింది మరోసారి చదువుతుంటే కలిగే తృప్తే నా ఇంధనం. మరింకేం తాగనవసరం లేదు కూడాను.
"వ్యాఖ్య రాసే లోపలే, కొత్త టపా వస్తుంటే వ్యాఖ్య ఎలా రాస్తాము?" అన్నదానికి మరింత విస్తృతమైన సమాధానం ఇవ్వాల్సిందే.అలాగే ఈ మధ్య తలెత్తిన కొన్ని అపోహలకూ సమాధానం ఇవ్వాల్సిందే. ఒక ఆలోచనవచ్చిన తరువాత దాన్ని సాధ్యమైనంత త్వరగా, వీలైనంత ‘మూలసహజ స్థితిలో’ అక్షరరూపం ఇవ్వాలంటే దాన్ని అర్జంటుగా రాసెయ్యాలి. అందుకే టపామీదటపా నా బ్లాగులో ప్రత్యక్షమవుతున్నాయి.ఇదివరకూ జ్యోతి గారూ, దిలీప్ గారుకూడా ఈ విషయంగా నాకు కనీసం రెండ్రోజులకొక టపా చొప్పున రాయమని సూచించారు. కానీ వల్లకావడం లేదు. నా ఆలోచనా స్రవంతి అలా తయారయ్యింది. పేపరు మీద రాసే అలవాటు లేక, డైరెక్టుగా బ్లాగులోనే రాస్తున్నందువలన "పబ్లష్" నొక్కడం చాలా temptingగా ఉండి, ఆగలేకపోతాను.
ఈ మధ్య కొందరు, నేనేదో లైమ్ లైట్ లో ఉండటానే కోరికతో ఇలా రోజుకొక టపా రాస్తానని తమతమ బ్లాగుల్లో చెప్పడం చదివాను. అంతేకాక కేవలం కాంట్రవర్సీలు సృష్టించి నా పాప్యులారిటీ పెంచుకోవడం ఒక (ఇగో సంతృపి పరుచుకునే) అవసరంగా భావించి పనికిమాలిన రాతలు రాస్తానని కూడా అనుకోవడం జరిగింది. నాకు ఈ అభిప్రాయాలు (నిందలు అనికూడా అనుకోవచ్చునేమో) నవ్వునే తెప్పించాయి. ఏదోఒకటి రాస్తే ఎవరైనా లైమ్ లైట్లో ఉండగలరా? అని ప్రశ్నించుకుని సంతృప్తికరమైన సమాధానం దొరకక మానేసాను. పైపెచ్చు నన్ను రెండ్రోజులకొక టపా రాస్తే, కనీసం చెప్పిన విషయం మీద ఆలోచించి వ్యాఖ్య చెయ్యడానికి అవకాశం ఉంటుందని చెప్పే పాఠకులు నా బ్లాగుకుండగా రోజుకొక టపా "కేవలం లైమ్ లైట్ లో వుండటానికి" నేను రాయాల్సిన అవసరం ఉందా! అన్న సందేహానికి సమాధానమే దొరకలేదు.
ఇక కాంట్రవర్సీల సంగతి మరింత హాస్యాస్పదం. నా ఆలోచనలు think of the unthinkable తరహాలో వివాదాస్పదంగా ఉండవచ్చేగానీ, కేవలం టపాలద్వారా వివాదాలు సృష్టించి "పబ్బం గడుపుకోనే" అవసరం నాకైతే ఖచ్చితంగా లేదు. బ్లాగు నా emotional outletకే తప్ప ఎటువంటి ఆర్థిక లాభాలనూ అపేక్షించి కాదే ! ఇక సామాజిక (బ్లాగులోకంలో) విలువంటారా, అది వివాదాన్ని సృష్టిస్తే వచ్చే అవకాశం అస్సలు లేదు. మరి వేటికోసం నేను వివాదాలు సృష్టించాలి?
నా ఆలోచనలతో, అభిప్రాయాలతో విభేధించేవారికి నా బ్లాగులో ఎప్పుడూ సముచిత స్థానం ఉండనే ఉంది. వారు తమ విభేధాలను నిస్సంకోచంగా పంచుకోనూవచ్చు, నా అభిప్రాయాలను తీవ్రంగా ఖండించనూవచ్చు. ఇక నేను రాసింది నేను చాలావరకూ విశ్వసించి (వీలైనంత వరకూ దానికి సంబంధించిన సమాచారం సేకరించి) రాస్తానుగనక నా అభిప్రాయాలకు మద్దతుగా వాదనలు వినిపించే హక్కు నాకూ ఉందని నమ్ముతాను. ఆ హక్కును "పిడివాదం" అంటే, వారు హేతువును చూపకుండా కేవలం నమ్మకాల ఆధారంగా చేసేదికూడా అదేకదా !
మన తెలుగువారిలో, వ్యతిరేకతను అంగీకారాత్మకంగా తెల్పే (disagree agreeably) లక్షణం చాలా తక్కువన్న నా నమ్మకాన్ని చాలా మంది నిజం చేసారంతే. ఏది ఏమైనా, నా బ్లాగు నా వ్యక్తిత్వానికి ఒక అద్దం లాంటిది. నన్ను నిజజీవితంలో అందరూ అభిమానించనట్లే ఇక్కడా కొందరు ద్వేషిస్తారు, మరికొందరు అభిమానిస్తారు. అభిమానానికి సహేతుకమైన కారణం చాలావరకూ ఉంటుందికానీ, ద్వేషానికి.... ఒక్క అపోహ లేక వారు జీవితాన్ని చూసే ధృక్కోణం వ్యతిరేకమైతే చాలు. అయినా ఆలోచనలు వేరైనంతమాత్రానా వ్యక్తుల్ని ద్వేషించాలని నేను అనుకోను. అందుకే ఎప్పుడూ అంగీకారాత్మకంగా విభేధించడానికి ప్రయత్నిస్తాను. ఇక అంతకుమించి హద్దుదాటితే చురక అంటించగలిగే భాష ఎలాగూ నాదగ్గరుందని. అంతేకాక మర్యాదపుర్వకంగా నిరసించగలిగే సంస్కారం కూడా నా పెంపకం, నేను నేర్చుకున్న చదువూ నాకందించాయి అని నేను భావిస్తాను.
ఇదివరకూ ఒక టపాలో చెప్పినట్లు, నా బ్లాగులో నేను మనస్ఫూర్తిగా నమ్మినవీ లేక తీవ్రంగా విభేధించేవీ రాస్తుంటాను. If we all agree, do we really have anything to discuss? అందుకే నా అస్తిత్వం నేను నేనులా ఉండటంలో ఉందని నమ్మినట్లే, నా బ్లాగూ నా బ్లాగులాగానే ఉంటుంది. అందరికీ నా బ్లాగులో స్వాగతం...as long as you have an apatite for disagreement and difference of opinion.
Posted by
Kathi Mahesh Kumar
at
8:03 PM
19
comments
Labels: వ్యక్తిగతం
Saturday, August 23, 2008
దరిద్రనారాయణుడు
నేను జిల్లాస్థాయిలో పనిచేసేటప్పుడు ఒక IAS అధికారి, కలెక్టర్ గా ఉండేవారు. తను IITలో ఇంజనీరింగ్, IIMలో మేనేజ్ మెంట్ చేసి, విదేశాలకివెళ్ళే అవకాశం వదులుకుని, సివిల్సి పరీక్షలో ర్యాంకుసాధించి ప్రభుత్వాధికారిగా మారారు. తనతో ఎప్పుడు దేనిగురించి చర్చించినా,ఎంతోకొంత నేర్చుకుని బయటపడేవాడిని. అందుకే మేధావులతో మాట్లాడటమే ఎడ్యుకేషన్ అంటారు కాబోలు.
వీరికి ఒక చిత్రమైన అలవాటుండేది. ఎప్పుడు ముఖ్యమైన ఫైలు మీద సంతకం పెట్టాలన్నా, తన డెస్కు పై అద్దం క్రింద ఉంచిన ఒక ఫోటోని చూసుకుని ఆ తరువాత సంతకం పెట్టేవారు. నేనిది కొన్నాళ్ళు గమనించాను. ఆసక్తిగా అప్పుడప్పుడూ ఆ ఫోటో ఏమిటో చూద్దామని ప్రయత్నించినా, ఇటువైపునుంచీ కనబడేది కాదు. ఏదైనా దేవుడి ఫోటో అయ్యుంటుందని నేను తీర్మానించేసి అప్పటికి ఆ ఆలోచనకు గుడ్ బై చెప్పేసాను.
కొన్నాళ్ళ తరువాత నేను జిల్లాస్థాయి నుంచీ రాష్ట్రస్థాయి కన్సల్టెంట్ గా హైదరాబాద్ వచ్చే సమయంలో, తన ల్యాప్ టాప్ పైన ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూపించడానికి ఆయన పిలిస్తే, వారు కూర్చున్నవైపు వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు యాధృచ్చికంగా వారు తరచూ పైలుమీద సంతకం పెట్టేముందు చూసే పోటో నా కళ్ళబడింది. ఆ ఫోటో,వయసుకి ముందే వయసుడిగిపోయి అర్ధనగ్నగా ఉన్న బక్కచిక్కిన ముదుసలిది.
ఒక్క క్షణం నా ప్రతిస్పందన ఆగినట్టనిపించింది. అంటే, ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ప్రతిసారీ తను తలుచుకునేది ఎక్కడో కనబడకుండా ఉండే భగవంతుణ్ణి కాదు. ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత పేదవాడ్ని. ఒక్క క్షణం నాకు ఆ ఆలోచనే అత్యంత గౌరవప్రదంగా అనిపించింది. నిజంగా ఇదే ‘సేవ’ కు అర్థం అనిపించింది. తన నిర్ణయం ఆ ఫోటోలో నిలువెత్తుగా నిలిచిఉన్న నిజమైన దేశ ప్రతినిధికి లాభదాయకంగా ఉండాలని కోరడం...కనీసం నష్టాన్ని కలిగించకూడదని అనుకోవడంకన్నా మించిన నిబద్ధత ఉంటుందా?
భూమిపై అవతరించిన మహానుభావులందరూ బుద్ధుడూ, క్రీస్తూ, మహ్మదూ, గాంధీతో సహా సమాజంలోని అత్యంత పేదవారి క్షేమం, చైతన్యం, అభివృద్ధి యొక్క ప్రాముఖ్యతను చెప్పినవారే. ఏ సమాజానికైనా పేదల, బలహీనుల, పీడితుల అవసరాలూ హక్కులూ సంరక్షింపబడినప్పుడు మాత్రమే సంపూర్ణత్వం సిద్ధిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి చారిత్రక యుగంలోనూ వివిధ కారణాలవల్ల పేదరికం సృష్టింపబడుతూనే ఉంది. ఈ పేదరిక నిర్మూలనే అంతిమ లక్ష్యంగా ఏ అభివృద్దైనా జరగాలి అని కాంక్షించడంకన్నా మించిన భక్తి, మతం, భగవంతుడూ వుండడని ఆ అధికారి నాకు చెప్పకనే చెప్పారు.
ఈ ఆలోచన నిజానికి ఏ మతానికీ కొత్త కాదు. హిందూ మతంలో "దరిద్రనారాయణుడు" అని పేదవారి గుండెల్లో ఉండే దేవుడి గురించి ఎప్పుడో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆధునిక యుగంలో ఈ ఆలోచన యొక్క బలాన్ని తెలియజెప్పింది ఇద్దరు. ఒకరు స్వామి వివేకానంద, రెండు మోహన్ దాస్ కరంచంద్ ‘గాంధీ’. కాకపోతే, ‘దరిద్రనారాయణుడి సేవ’ అని ఒక పూజ చేసి మిన్నకుండటమో, లేక గుడిలో కొందరికి అన్నదానం చేసి తృప్తిపడటమో జరుగుతోందేతప్ప, ఈ మూల సిద్దాంతాన్ని అటు జీవితంలో, ఇటు అభివృద్ధి మూసలో మన సమాజం ఇంకా సంపూర్ణంగా అన్వయించుకోలేదు. అలా జరగనంతవరకూ మన పవిత్రతలు అపవిత్రాలే, అభివృద్ధి అర్థరహితమే !
నేను మతాన్నీ, దేవుడ్నీ నమ్మను. కానీ మానవత్వాన్ని పెంపొందించే అన్ని విధానాలనూ,ఆలోచనలనూ అత్యంత గౌరవభావంతో చూస్తాను. అందుకే మతంచెప్పే మూడాచారాలకన్నా, ఇలాంటి విలువలను అవలంభిస్తేనే సర్వమానవాళికీ మంచి జరుగుతుందని భావిస్తాను.
"DARIDRANARAYAN is one of the millions of names by which humanity knows the unnamed and unfathomable God, who is unnamable and unfathomable by human understanding, and it means God of the poor, God appearing in the hearts of the poor. Therefore, Daridranarayan seva, seva of the poor, hungry, destitute, is the worship of Sri Narayan himself."
Posted by
Kathi Mahesh Kumar
at
9:19 PM
16
comments
Labels: సమాజం
రచనలు - ‘బ్లాగు రచనలు’
ఈ మధ్య చర్చల్లో ఒక బ్లాగరి "మనం రాసేది బ్లాగులూ, పోస్టులూ కదా! మరి వాటిని రచనలు అనొచ్చా?" అని ఒక అమూల్యమైన ప్రశ్న సంధించారు. ఒక్క క్షణం అర్థం చేసుకోవడానికి సమయం పట్టినా, నేను సమాధానం వెతకడానికి ఆట్టే కాలయాపన చెయ్యలేదు. రాసేది ‘రచన’ అయితే, రాసేవాడు ‘రచయిత’. అది బ్లాగులో ‘రాసినా’, పత్రికలకు రాసినా, ఏకంగా పుస్తకాలే రాసినా, రాసినదాన్ని ‘రచన’ అనెయ్యొచ్చనే తీర్మానానికొచ్చేసి, అదే చేప్పాను. కాకపోతే నేను చెప్పింది over simplification అనిపించి, ఈ దశగా కొంత ఆలోచించడం జరిగింది. ఆ ఆలోచనల్ని ఈ టపాలో పంచుకుంటాను.
పత్రికల్లో,పుస్తకాల్లో రచనలు జనబాహుళ్యాన్ని ఉద్దేశించి రాయడం వలన లేక రచయిత తనసొంతానికి రాసుకున్నా, ప్రచురణకర్త అవి చాలామంది ప్రజల ఆలోచనలను అందిపుచ్చుకుందని నమ్మటం వలన ప్రచురింపబడతాయి. అందుకే వాటిల్లో నాణ్యత పరమైన జాగ్రత్తలు (quality control) తీసుకుంటారు. ఆ రచనలోని విషయం, సమాజంలో అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న విలువలు, నమ్మకాలు, విశ్వాసాలకు భంగం వాటిల్లకుండా ఉండేలా చూడటం. ముద్రణలో అక్షరదోషాలూ, వాక్యనిర్మాణంలో ambiguity లేకుండా చూడటం. రచయిత రాసినదాన్ని చదివేవారి tasteకి అనుగుణంగా, పొందికలో అవసరమైన మార్పులు చేయడం లాంటివి జరుగుతాయి. ఈ పరిణామంలో ఒక రచన కాపీ ఎడిటర్ దగ్గరనుంచీ, సబ్ ఎడిటర్ (ఉప సంపాదకులు), ఎడిటర్ (సంపాదకులు) ఒక్కోసారి పబ్లిషర్ (ప్రచురణకర్త) వరకూ ఆ రచనలోని ఒక్కోఅక్షరాన్నీ, ఆలోచననీ, భావాన్నీ, శైలినీ, పొందికనీ పరిశీలించి పరీక్షించి అప్పటి సాహిత్యం యొక్క విలువలతో, వ్యాపార అవకాశాలతో (business possibility) బేరీజుచేసి "పబ్లిష్" మీట/ బొత్తం నొక్కుతారు.
ఇక మన బ్లాగు విషయానికొస్తే, పైన చెప్పిన quality controls ఇక్కడ వుండవు. బ్లాగనేది ఒక వ్యక్తిగత అభివ్యక్తీకరణ మార్గం కనుక, రచయిత అనుకున్నది, తనకు అనిపించినది, తను అనుభవించినది, తను ఆలోచించేదీ నిరభ్యంతరంగా రెండోవ్యక్తి value judgment అవసరం లేకుండా రాసుకోవచ్చు. ఇది జనబాహుళ్యానికి ఉద్దేశింపడింది కాకపోయినా, ఆరంభంలోనే వివిధ విషయాలపై రాసే బ్లాగుల ఆధారంగా, అభిరుచి ఉన్న విషయాలపై రాసే బ్లాగుల్ని search option ద్వారా జనబాగుళ్యం కాకున్నా, కనీసం ఆ విషయం పట్ల ఆసక్తిగల కొందరు చదవటానికి వీలు కలిగేది. ఇప్పుడు కూడలి, జల్లెడ లాంటి బ్లాగ్ అగ్రిగేటర్లు, ఫోరంలు వచ్చిన తరువాత ప్రచురణకు ముందు ఉండే Editorial control ఉండకపోయినా, పది మందీ చూస్తారు గనక ఎంచుకునే విషయాల్లో, రాసే శైలిలో, అభివ్యక్తి రీతిలో ఒక మానసిక ఎడిటింగ్ అవలంభించడం జరుగుతోంది. ఇంకా కొంచెం ముందుకు సాగితే, పాఠకుల feedback ఆధారంగా ప్రస్తుతం ఉన్నటపాలోనే మార్పులో, లేక రాయబోయేవాటిల్లో ఆ సూచనలను అవలంభించడమో చేస్తున్నాము. అంటే, "పబ్లిష్" మీట/బొత్తం వ్యక్తిగతంగా బ్లాగరి చేతిలోనేఉన్నా, కొంతవరకూ pre-editing, మరికాస్త post-editing ఇక్కడా మొదలయ్యిందన్నమాట.
అది ఎంతవరకూ సమంజసం అనేది చాలా వరకూ వ్యక్తిగతం కాబట్టి దాని గురించి చర్చ (ఈ టపా నేపధ్యంలో) అనవసరం. మన మూల బిందువు, రచనలు- బ్లాగురచనలు. ఇప్పుడు ఈ మూలబిందువుని పై విశ్లేషణకి అన్వయిస్తే ఉదయించే ప్రశ్న, "కేవలం నాణ్యతా ప్రమాణాలున్నంత మాత్రానే, ముద్రితమైనదాన్ని మాత్రం ‘రచన’ అని పిలిచి, బ్లాగు పోస్టులను ఆ పదప్రయోగం నుంచీ దూరం చెయ్యాలా?" అని. నాకైతే ఈ ‘వివక్ష’ అంతగా నప్పలేదనే చెప్పాలి. చారిత్రాత్మకంగా సాహిత్యసృజనా దాని పురోగతిని చూస్తే, రచయితలూ, కవులూ, కథకులూ (ఈ మధ్య వచ్చిన కమర్షియల్ రచనల్ని వదిలేస్తే) చాలావరకూ జనాలకోసం రాయలేదు. తమకు ముఖ్యమనిపించిన లేక తాము ప్రతిస్పందించిన విషయాలను అసంకల్పితంగా అక్షరబద్ధం చేసారు. ఆ తరువాతనే వారి అక్షరాల ‘విలువని’ గుర్తించిన అప్పటి రాజులు, జమిందారులో లేక ఇప్పటి ఎడిటర్లూ,పబ్లిషర్లూ వాటిని జనానికి అందించే ప్రయత్నం చేసారు.
అంటే, వ్యక్తిగతమైన అసంకల్పిత రాతలు మొదట పుట్టి, ఆ తరువాతనే ఈ నాణ్యతావిలువలూ, అవి జన బాహుళ్యానికి అందటాలూ, విమర్శకుల విశ్లేషణలూ మొదలయ్యాయన్నమాట. ఈ విధంగా చూస్తే మన బ్లాగులు సరైన దారిలోనే వెళ్తున్నాయి. కాబట్టి నిరభ్యంతరంగా ‘రచన’ అనే పదం వాడుకోవచ్చు. కాకపోతే నేను రచయితని అంటే, ప్రజలు మన రచనల కాంప్లిమెంటరీ కాపీ అడిగే అవకాశం ఉందికాబట్టి, నేను ‘బ్లాగు రచయిత’ని అని గర్వంగా చెప్పుకుని మన బ్లాగు ‘లింకు’ మాత్రం చేతికందించి తప్పించుకోవచ్చన్నమాట.
ఈ మధ్యకాలంలో ప్రముఖ రచయితలు కూడా మరింత మంది పాఠకుల్ని చేరడానికి బ్లాగుదారి నెంచుకోవడం మనకు తెలిసిందే. ఈ పరిణామంలో మార్పు ఇటువేపునుంచీకూడా మొదలౌతోంది. మన తెలుగు బ్లాగరలు e-పుస్తకాలవరకూ వస్తే, ఇంగ్లీషు బ్లాగర్లు పుస్తకాల పబ్లిషింగ్ వరకూ వచ్చేసారు. మనదీ రాబోయే కాలంలో ఆ దారే కావచ్చు. కాబట్టి, నిస్సందేహంగా బ్లాగర్లందరూ రచయితలే, ప్రతిపోస్టూ రచనే.
So, Welcome to the (blog) writers club, Congratulations.
Posted by
Kathi Mahesh Kumar
at
5:43 AM
9
comments
Labels: సాహిత్యం
Friday, August 22, 2008
మా ముకుందుడు కృష్ణుడైన వేళ...
Posted by
Kathi Mahesh Kumar
at
2:25 PM
20
comments
Labels: వ్యక్తిగతం
