Monday, August 25, 2008

స్త్రీవాద సాహిత్యంలో గందరగోళం

రెంటాల కల్పనగారు తమ బ్లాగులో రాసిన "కొత్త సరిహద్దుల్లో స్త్రీవాద కథ" అనే విశ్లేషణాత్మక వ్యాసానికి నేను రాసిన వ్యాఖ్యలను టపాగా ఇక్కడ పబ్లిష్ చేస్తున్నాను.

౦౦౦

ఈ కాలంలో స్రీవాదం అనేది ఒక politically correct పంధా. భారతదేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ భావజాలం యొక్క సైద్దాంతిక స్వరూపం అస్తవ్యస్తంగా ఉంది.
ఇలాంటి స్థితిలో rhetoric కి ఉన్న విలువ సాహిత్యానికి లేదు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. రాజకీయ పార్టీలు emotive slogans వాడినట్లు చాలా మంది రచయిత/త్రు లు ఈ వాదాన్ని వాడేస్తున్నారు.


సాహిత్యాన్ని కేటగరైజ్ చెయ్యటంలో మొదటిది సహజసిద్దంగా వచ్చిన సాహిత్యాన్ని సిద్దాంతీకరించే పద్దతైతే మరొకటి సిద్దాంతాన్ని బట్టి సాహిత్యాన్ని సృష్టించడం.ప్రస్తుతంవున్న చాలా మంది స్త్రీవాద రచయిత/త్రు లు చేస్తున్న పని రెండోరకానికి చెందింది. అందుకే ఇన్ని సమస్యలున్నాయని నా అభిప్రాయం. విమర్శకుల వివక్షకి ముఖ్య కారణంకూడా అదే కాబోలు. విస్తృతమైన మానవసంబంధాలూ, సామాజిక సమస్యలమీద రచయిత/త్రులు సహజంగా రాసిన తరువాత వాటిల్లోవున్న స్త్రీవాదకోణాన్ని అర్థం చేసుకుని విమర్శనలు చెయ్యడం వేరు, కేవలం స్త్రీవాద రచనగనక ఆ ధృష్టికోణంలో దాన్ని చూసి ‘విలువకట్టడం’ వేరు.


“A failed writer becomes a critic” అన్నట్లు, మన తెలుగు సాహిత్య విమర్శకులలో చాలా మంది ఈ బాపతుగానే అనిపిస్తారు. వారు చేసే “విమర్శ”లెక్కువా “విమర్శనలు” తక్కువా. ఎంతసేపూ ఉన్న సాహిత్యంలో లోపాలను వెతకడానికి కంకణం కట్టుకున్నట్లు మాట్లాడతారేగానీ, ఆ రచనకున్న సామాజిక విలువ, పాఠకులకు ఈ రచన ఎలా ఉపయోగకరంగా ఉంటుందో విశ్లేషించరే? వీళ్ళందరూ T.S.Eliot, F.R.Leavis, Mathew Arnold వంటి విమర్శకులని చదివుండరనిపిస్తుంది.

౦౦౦

”ఈ భావజాలం యొక్క సైద్దాంతిక స్వరూపం అస్తవ్యస్తంగా ఉంది.”ఏరకంగానో నాకైతే అర్దం కాలేదు. దీన్ని వివరించగలరా? - రెంటాల కల్పన

౦౦౦

అర్థం కాక అడిగారంటే నేను నమ్మలేను. అయినా ఆ స్టేట్మెంట్ ఇచ్చింది నేను గనక,వివరించాల్సిన నైతిక బాధ్యతని తీసుకుని వీలైనంత క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను.


సాధారణంగా భారతీయ స్త్రీవాదాన్ని మూడు భాగాలుగా విభజిస్తారు. మొదటిది బ్రిటిష్ పాలన సమయంలో జరిగిన సామాజిక ఉద్దరణ (1850- 1915). దీనికి మూలం మానవత్వం అనిచెప్పుకోవచ్చు. ‘సాంఘిక సంక్షేమం’ ఆధారంగా కొందరు సతీసహగమనం,వితంతువివాహం మొదలైనవాటి నిర్మూలనకు పోరాడిన సమయం ఇది.


రెండవది, స్వాతంత్రోద్యమ నేపధ్యంలో జరిగిన మహిళా చేతన (1915-1947). ముఖ్యంగా గాంధీ భారతీయ రాజకీయ తెరపైకివచ్చి మహిళల్ని కార్యోన్ముఖుల్ని చేసిన దశలో జరిగిన కాలమిది. ఇప్పుడే ‘మహిళలు మాత్రమే’ ఉన్న సంస్థలూ,ఉద్యమాలూ మొదలయ్యాయి. ఇవన్నీ దేశస్వాతంత్ర్యంతోపాటూ మహిళా స్వేచ్చని కాంక్షించేవిగా ఎదిగాయి.


స్వాతంత్ర్యానంతరం కూడా వీరి పరిధి మహిళాశిశు సంక్షేమం, సమాన వేతనాలు వంటివాటికే పరిమితమయ్యాయి. ప్రభుత్వంకూడా ఈ ఫనులన్నింటినీ ఒక ప్రోత్సాహంలాగానే (దయతలచినట్లు) చేసిందేతప్ప “హక్కుల” ధృక్కోణంలో చెయ్యలేదు.


మూడవభాగం 1970లలో ప్రపంచవ్యాప్తంగా,ముఖ్యంగా అమెరికాలో వచ్చిన స్త్రీవాద మార్పుల నేపధ్యంలో భారతీయ స్త్రీవాదం మరో బలమైన మలుపు తిరిగింది. వ్యక్తిగతస్వేచ్చ,హక్కులు, జెండర్, సెక్సువాలిటీ,గృహహింస, పితృస్వామ్యం వంటి విస్తృతమైన సమస్యల్ని ప్రధానస్రవంతిలోకి తీసుకురావడానికి ఈ సమయంలో ప్రయత్నాలు జరిగాయి.


పైన ఉన్న ప్రతి భాగంలో అప్పటి పరిస్థితికి అనుగుణంగా సాహిత్యసృజన జరిగింది. కాకపోతే, భారతదేశం 1990వ దశకంలో చాలా విప్లవాత్మకమైన మార్పుల్ని సంతరించుకుంది. 1970 లలోని సామాజిక,ఆర్థికవిధానాలతో స్త్రీవాద ఉద్యమం ముడిపడివున్నట్లే, ఈ విప్లవాత్మక మార్పుల దృష్ట్యా ఈ వాదంలోనూ మార్పులు రావాల్సింది. కానీ కొన్ని ఛాంధసవాద భావాలూ, సాంప్రదాయక విలువలలోని సౌఖ్యాన్ని అంతర్లీనంగా గ్రహించిన చాలామంది స్త్రీవాదులు కేవలం దీన్ని battle of sexes గా మార్చి, సమాజమూలాల్ని మార్చడంగురించి చర్చించడం మానుకున్నారు. ఇక్కడే అసలు సమస్య ప్రారంభమయ్యింది.


ఈ నేపధ్యంలో స్త్రీవాదంలో ఒక రకమైన డొల్లతనం కనిపించడం ప్రారంభమయ్యింది. అమెరికా స్త్రీవాదాన్ని ఆదర్శంగా తీసుకున్న స్త్రీవాదులు, కేవలం వారికి అనుకూలమైనవాటిని మాత్రమే ఏరుకుని, మిగతా “స్వేచ్చ” విషయాలలో పితృస్వామ్యం మూసనే మళ్ళీ మన సమాజంపై తమ సాహిత్యం ద్వారా రుద్దటం ప్రారంభించారు. ఇక్కడే ఒక disconnect మొదలయ్యింది. అటు ఎంచుకున్న అనుకూల మూలసిద్దాంతం, ఇటు త్వరితగతిన మారిన సమాజం నేపధ్యంలో ఒక విధమైన సైద్దాంతిక గందరగోళం ఏర్పడింది.


చాలావరకూ స్త్రీవాద రచయిత/త్రులు నగరానికి చెందినవారవటం కారణంగా ఈ తేడా మరింత స్పష్టంగా కనిపించడం మొదలయ్యింది. మూల సమస్యలకన్నా కొసరు సమస్యలను నెత్తికెత్తుకుని అదే స్త్రీవాదంగా భ్రమించడం మొదలయ్యింది. అందుకే “all men are pigs” వంటి సులభమైన భావజాలాన్ని సృష్టించి దీన్ని మగాడికీ ఆడవారికీ మధ్య సమస్యగా మాత్రమే చూపుతూ తమ పబ్బం గడుపుకోవడం మనకు తెలిసిందే. ఇంతలో మారాల్సిన సమాజం అర్జంటుగా మారిపోయి, ఈ సిద్దాంతాలకి “బూజుపట్టించేసింది”. యువతలో చాలామంది ఈమూస స్త్రీవాదం నుంచీ దూరంగా ఉండాలనుకోవడం ఈ సైద్దాంతిక అస్తవ్యస్తతే అని నాకు అనిపిస్తుంది.



“అడామగాకున్నది మిత్రవైరమేకానీ శతృత్వంకాదన్న” మూల సిద్దాంతాన్ని విస్మరించి ప్రస్తుత స్త్రీవాదం,దాని సాహిత్యంలో కఠినత్వాన్ని నటిస్తోందని నేను చదివిన కొన్ని కథల మూలంగా అనిపించింది. మార్చాల్సిన కనబడే సామాజిక వ్యవస్థలకన్నా, పితృస్వామ్య భావజాలమనే ఒక శతృవుతో పోరాడటానికి వీరు ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు కనబడుతుంది. దీనికితోడు, కొంత ఈ ఆలోచనా శైలితో విభేధించే ఏ స్త్రీనైనా లేక పురుషుడినైనా లేబుల్స్ తగిలించేసి “వెలివేసే” అలవాటు స్త్రీవాదుల్లో తయారయ్యింది.


70లలో ఆగిపోయిన స్త్రీవాద భావజాలం 90ల sensitivity ని పుణికితెచ్చుకోకుంటే, అసలే తెలుగు చదవడం మానేస్తున్న యువత, స్త్రీవాదం అనే మాటవింటేనే ఆ సాహిత్యంవైపు కన్నెత్తిచూసే సాహసం చెయ్యకపోవచ్చు. ఇక కేవలం రాసినోళ్ళూ,పబ్లిష్ చేసినోళ్ళూ లేక వృత్తిరీత్యా విమర్శకులూ ఆ సాహిత్యాన్ని చదవాల్సిందే. ఆ భావజాలాన్ని అభినందించాల్సిందే.


I don’t mean to take away any credit from feminism for what it has done in the past. But, at present if they don’t sensitize themselves with present day reality, the time may come when it is dead and none will be there even to mourn it.



ప్రస్తుతం చాలామంది మార్కెట్లో ఈ వాదం నడుస్తుంది కాబట్టి రాయటం మొదలయ్యిందిగనకనే credibility ఒక సమస్యగా మారింది. ఇక పాఠకులంటారా, వారిని తప్పుబడితే నేను అంగీకరించను. Readers have every right to interpret the text as they wish. కాకపోతే విమర్శకులుకూడా సాధారణ పాఠకుల్లాగా భావజాలం రంగుటద్దాలతో a work of artని కొలవడం నేను అంగీకరించలేని విషయం.



“Literary criticism has a great role to play in not only indexing what is written, but also to contextualize the written word in present day society” అనే సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. అందుకే సాహితీ సమీక్షలకూ, విశ్లేషణలకూ,విమర్శనలకూ నేను విలువనిస్తాను. కాకపోతే మన తెలుగులో కులాలూవాదాలూ తప్ప సమాజం ఎక్కడా విమర్శకుల ధృక్కొణంలో కనిపించక నిరాశపడుతూ ఉంటాను.



ఎలియట్ ఆర్నాల్డ్ చదివితేగానీ విమర్శకుడు కారాదని నా ఉద్దేశం కాదు. కానీ, విమర్శకుడిగా మన బాధ్యత,నిబద్దత తెలియాలంటే సాహితీ విమర్శకు సంబంధించిన విభిన్నమైన ఆలోచనలు ఖచ్చితంగా తెలియాలి. అందుకే బహుశా మన విమర్శకులు చదవలేదేమో అనే సందేహం వెల్లడించాను.


***

12 comments:

కొత్త పాళీ said...

తెలుగులో స్త్రీవాద రచనల మీదా రచయిత్రుల మీదా చాలా అభాండాలు వేశారు మీరీ టపాలో. ఆ అభాండాల్ని నిరూపించే ఉదాహరణలు కొన్ని చూపగలరా?
కొందరు రచయిత్రుల్లో స్త్రీవాదం అంటే ఏవిటి అన్న సిద్ధాంతం గురించీ, తమ అవగాహన గురించీ అయోమయం ఉన్నదని ఏకీభవిస్తాను. నాలుగు మంచి రచనలు మొత్తం వర్గానికి ప్రాతినిధ్యం వహించనట్లే నాలుగు అయోమయ రచనలు కూడా ప్రాతినిధ్యం వహించవు అని గమనించాలి.
సైద్ధాంతికంగా బలమైనవి, నిర్మాణంలో కళాత్మకమైనవి ఐన కొన్ని మంచి కథలూ పద్యాలూ నేణు ఉదహరించగలను. మీ ఉదాహరణలేంటో చెప్పండి. చర్చ అక్కణ్ణించి కొనసాగిద్దాం.
ఇంకో మాట .. మీరు విమర్శకుల గురించి చేసిన వ్యాఖ్యలు .. ఇతర భారతీయ భాషల్లో పరిస్థితి ఎలా ఉందో నాకు తెలీదు గానీ తెలుగు సాహిత్యంలో ఇప్పుడు విమర్శ అనేది దాదాపుగా లేదనే చెప్పచ్చు నా ఉద్దేశంలో. కల్పన గారి వ్యాసమైనా ఒక విహంగ వీక్షణమే కానీ విమర్శ కాదు.

Kathi Mahesh Kumar said...

@కొత్తపాళి గారు:స్త్రీవాద సాహిత్యం మీద నేను చేసిన సాధన చాలా పరిమితం.70,80వ దశకాలలో ఉన్న సాహిత్యంతో నాకెటువంటి పేచీ లేదు. వాటిల్లోకూడా కొన్ని reinforcing the dominant paradigm తరహాలోవున్నా,నాకెటువంటి అభ్యంతరం కలుగలేదు.

నా పరిథి సిమితమైనదే అయినా, 90ల తర్వాత నేను చదివిన కథలు చాలావరకూ స్త్రీవాదం ముద్రను ఉపయోగించుకుని రాసిన "కన్నీటి కథలు" గానే అనిపించాయి.మీకిప్పుడు ఉదాహరణలు చూపాలంటే ఎప్పుడో చదివిన పత్రికలూ,పుస్తకాలూ వెతుక్కోవాలి. చాలా వరకూ సాధ్యమయ్యే విషయంకూడా కాదు.

ఇక నా అభాండాలు "అందరు స్త్రీవాద రచయిత/త్రుల" మీద కాదు. కేవలం ముద్రను ఉపయోగించి తమ సాహిత్యానికి saleabilityని తెచ్చుకుంటున్న "చాలా మంది" గురించి మాత్రమే. నేను చదివినంతవరకూ దాదాపు 80% కథలు ఈ కోవకిచెందడం నా దురదృష్టం. పైగా నాకు నచ్చిన కొందరు స్త్రీవాద రచయిత/త్రులు అస్సలు స్త్రీవాదానికీ మాకూ సంబంధం లేదంటున్నారు. దీన్నిబట్టి నా అభాండాల్లో కొన్ని కొంతైనా నిజలున్నాయేమోననే భ్రమకలిగింది.

ఏదిఏమైనా సిద్ధాంతాలలో గందరగోళం,అవగాహనారాహిత్యం మధ్యన మీరు చదివిన కొన్ని మంచి రచనలు ఎక్కడున్నాయో (90లవి)చెబితే నేనూ చదివి నా అభిప్రాయాల్ని మార్చుకుంటాను.

మన చర్చ నిజంగా తెలుగులో విమర్శకుల అవసరాన్ని ఎత్తిచూపుతోంది.

Anil Dasari said...

మద్దెల ప్రత్యక్షం :-)

"A failed writer becomes a critic".
"ఎంతసేపూ లోపాల్ని వెదకటానికి ....".

మహేశా, మీరూ ఆ తానులో ముక్కే కదా. మీ వ్యాసాల్లో ఎప్పుడూ వ్యవస్థ మీదో, సాహిత్యమ్మీదో, మరోదాని మీదో విమర్శలే. అదే పని చేసి తోటి విమర్శకుల మీద విమర్శలేమిటి? పదాడంబరంతో పొడుగాటి టపా రాసేసి 'ఇదిగిదిగో నేను సహేతుకంగానే విమర్శిస్తున్నా' అనటమో, 'నేనాచరించి నిగ్గుదేల్చినవే నా టపాల్లో రాస్తా' అనటమో మీకీ మధ్య బాగా అలవాటయిపోయింది. మీ రాతల్లో మొనాటనీ వచ్చేస్తుంది. జాగ్రత్త.

Kathi Mahesh Kumar said...

@అబ్రకదబ్ర: నన్ను ఒక విమర్శకుడ్ని చేసినందుకు ధన్యవాదాలు.కాకపోతే సాహితీ విమర్శనకూ సామాజిక విశ్లేషణకూ చాలా తేడా ఉందనుకుంటాను.

ఇక మీరు చెప్పిన రెండు వాక్యాలూ నేను సందర్భానుసారంగా వాడుంటానేమోగానీ, అవి నా standard సమాధానాలైతే కాదు.నా యిదివరకటి టపా,"నేను రోజూ బ్లాగులెందుకు రాస్తాను" చదవగలరు.

ఇక మోనాటనీ అంటారా బ్లాగులు నేను నా వైవిధ్యం చూపించడానికి రాయడం లేదు.కేవలం నా ఆలోచనలకి అక్షరరూపం ఇస్తున్నాను.ఒకవేళ అవి మోనాటనస్ గా మీకు అనిపిస్తే అది నా limitation as an individual అయ్యుంటుంది.

Anonymous said...

మహేశన్న. ఎక్కడికో ఎల్లిపోయావు. ఎంసైకిల్ పిడియ లెక్క అన్ని ఎర్కెనీకు. నీ బాట్రీ వీకయితుందేమో నని బయమైతాందే

Sujata M said...

మహేష్ గారు

మీరు చాలా బాగా రాస్తారు. కానీ మీరు రాసినది అర్ధం చేసుకోవడానికి చాలా సార్లు చదవాల్సొచ్చింది. నా ఉద్దేశ్యం లో మీకు బేసిక్ కాన్సెప్ట్ కోటి అర్ధం కాలేదని తోచింది. ఎప్పుడన్నా ఒక 'వాదం' లేదా 'ఇజం' తయారు కావడానికి కొన్ని పరిస్థితులు దోహదం చేస్తాయి. కొన్ని ఇజాలు మనకు అర్ధం కావు. ఉదా : మార్క్సిజం, ఇస్లామిక్ టెర్రరిజం... ఇలాంటివి. వీటిని అర్ధం చేసుకున్నా.. వాటిని జీవితం లోకి వొంపుకునేందుకు కొంచెం కష్టం. స్త్రీవాదం ఓల్డ్ వైన్ (పొలిటికల్లీ స్పీకింగ్) లాంటిది. ఇది ఒక రకంగా అచ్చంగా మీరన్నట్టే, మానవతా కోణాల్లోంచీ పుట్టింది.

ఇది - మీకు ఎక్కువగా నచ్చకపోవడానికీ, డొల్లతనాలూ, లోపాలూ కనిపించడానికీ కారణం ఒక్కటి. కొన్ని బాధపడితే గానీ బోధపడని విషయాలుంటాయి. స్త్రీ లు ఒక నార్మల్ (అందరికీ ఆమోదయోగ్యమైన) టెంప్లెట్ నుంచీ బయటికి వస్తే - దాన్ని అబ్నార్మాలిటీ అంటామా - స్త్రీ వాదం అంటామా, వ్యక్తిత్వ వికాసం అంటామా.. అనే విషయాన్ని పక్కనపెడితే, స్త్రీ అయినా, జంతువైనా, మగ మనిషయినా.. వ్యధకు గురవుతున్నప్పుడు ఏదో రకంగా ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తుంటాడు. స్త్రీలు ఆత్మ రక్షణ చేసుకుంటుంటే, దాన్ని స్త్రీ వాదం అంటాం. { పురుషులు స్వీయ రక్షణ లో పడితే భార్యా బాధితులు అంటాం }. స్త్రీలు పడే మానసిక, శారీరక కష్టాలు మీకు అర్ధం కావట్లేదనను. ఒక తరనికి చెందిన, ఒక దేశానికి చెందిన ఆడపిల్లలందర్నీ, కండిషన్ చేసి, పురుషులతో సమానంగా పెంచి చూస్తే, అసలీ వాదాలే ఉండవేమో. స్త్రీల అభత్రతా భావాల్ని తగ్గించే ప్రయత్నాలు - చెయ్యాలి గానీ.. మీరు తప్పు, మీ భావాలు తప్పు - ఈ ఇజమే మంచిది కాదు అంటే మిగతా (మార్క్సిజం, టెర్రరిజాల్లలా ) ఫెమినిజం కూడా ఒప్పుకోదు. ఈ ఇజం లేకపోతే, పొలిటికల్లీ... స్పీకింగ్ - చాలా ఘోరాలు జరుగుతూ ఉండేవి.

చూడాలి - మీరు ఏమంటారో ?!

Kathi Mahesh Kumar said...

@sujata:ఈ నా వ్యాఖ్య కొంచెం అకడమిక్ చర్చలాంటిది. అందుకే అర్థం చేసుకోవడానికి చాలా సార్లు చదవాల్సొచ్చుండొచ్చు.అంతేకాక నేను వాడిన చాలా పదాలకి history,inference,suggestive value ఉండటంవలన కొంత complexగా తయారయిన అవకాశం మెండుగా ఉంది.

వ్యక్తిస్వాతంత్ర్యాన్ని సంపూర్ణ స్వాతంత్ర్యానికి పునాదిగా నమ్మే నేను,స్త్రీవాదాన్ని మనస్ఫూర్తిగా కాంక్షిచేవ్యక్తిని. నా సమస్యల్లా స్త్రీవాద సాహిత్యం పేరుతో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్న వింతవాదనలూ,పెడధోరణులతోనే.మూలసిద్దాంతమైన సామాజిక మార్పుని పక్కనపెట్టి పురుషద్వేష స్త్రీవాదంగానో లేక కన్నీళ్ళ అభాగినిని ఆదుకునే స్త్రీవాదంగానో మారిన కొన్ని పోకడలు ఈ ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారనే నా ఆవేదన.

మారిన కాలంతోపాటూ మారిన సమాజ అభిరుచుల్నీ,అభిప్రాయాలనీ,ఆలోచనా విధానాలనీ తమ "ఇజం"లో ఇముడ్చుకోక,కేవలం political rhetoric తో తమ వాదాన్ని బ్రతికించుకోపూనడం ఒక empathetic వ్యక్తిగా నాకు అంగీకారాత్మకం కాకనే, ఈ కామెంట్ రాయాల్సి వచ్చింది. అదీ రెంటాల కల్పన గారు వివరించమని అడిగితేనే.

వారడక్కుండా వుండుంటే, బహుశా నా మొదటి వ్యాఖ్యతోనే ముగుంచేవాడిని.

ఫెమినిజం తప్పు అని నేను ఎక్కడా అనలేదు. పైపెచ్చు ఫెమినిజం చేసిన మేలుని తక్కువ చెయ్యడం లేదు అని కూడా చెప్పాను.కాకపోతే, ప్రస్తుతంవున్న పరిస్థితులకి అనుగుణంగా తమ సిద్ధాంతాలను alter చెయ్యాల్సిన అవసరం గురించి మాత్రమే చెప్పాను.కొన్ని పెడధోరణులవల్ల ఫెమినిజం irrelevant గా మారే ప్రమాదం ఉందని చెబుతున్నాను.అలా జరిగితే ఇప్పటివరకూ జరిగిన ఘోరాలపరంపర మరింత వికృతరూపం దాల్చే అవకాశం ఉంది.

Anonymous said...

maheshgaaru,
ii stree vaada rachayitalu kooda streele anna vishayam meeru marachinatlu vunnaaru... meeru gamanisthe okka rachayitalalonee kaka motham streela alochana dhoranilonee enno malupulu gata 30-40 savamtsaaralaloo vachaayi... meeru anutunnatlu inconsistency deeni prabhavamee kaani ijam gijam kaadu ani naa abhipraayam...
for example, ranganayakammagaaru 70lalo raasina navalaloni bhaavalanu 30 savatsraalalo vyatirekhinche parsthithini meeru gamanisthe artham avuthundi anukuntaa...

Kathi Mahesh Kumar said...

@వంశీ: అందరు స్త్రీవాద రచయితలూ మహిళలు కాదు.కొందరు పురుషులుకూడా స్త్రీవాద రచనలు చేసారు.ఇక మీరు చెప్పిన మిగతా విషయాలతో నేను చాలావరకూ ఏకీభవిస్తాను. నేను లేవనెత్తిన సమస్యకుమూలాన్ని మీరు మళ్ళీ మీ వాఖ్యతో reinforce చేసారు.

మారిన కాలమాన పరిస్థితులు, ముఖ్యంగా post-liberalization తరువాత మారని ఈ ఆలోచనాధోరణిని "ఇజం" రూపంలో ఇప్పటికీ బలవంతంగా గొంతులోకి వొంపాలనుకోవడంతోనే ఈ సాహిత్యానికి పాఠకులు కరువవుతున్నారు.

Vamsi Krishna said...

emandi... kastha ii stree vaada purusha rachayitalevaroo chepparaa... chaduvudaamani...

Unknown said...

స్త్రీవాద టపాలో గందరగోళం

కొత్త పాళీ said...

నా లైబ్రరీ కొంచెం సంక్షోభంలో ఉంది, అందుకని వెదికి ప్రత్యేక ఉదాహరణలు ఇచ్చే వెసులుబాటు ప్రస్తుతానికి లేదు. ప్రస్తుతానికి గుర్తున్నవి ఇక్కడ రాస్తున్నా. ఇవన్నీ గత పదేళ్ళలో వెలువడినవే.
పి. సత్యవతిగారి కథల సంపుటి మంత్రనగరి
నల్లూరి రుక్మిణి కథలు సంపుటి
షాజాహానా కవితల సంపుటి నఖాబ్
ఇవి కాక కథాసాహితి వారు ఏటా ప్రచురించే ఉత్తమ కథల సంకలనాల్లో రంగనాయకమ్మ రచన మురళీ వాళ్ళమ్మ, జయప్రభ రచన రసఝరీ యోగం, వోల్గా రచన మృణ్మయ నాదం, మల్లీశ్వరి రచన రెండంచుల కత్తి కూడా కొన్ని మంచి కథలు.
దళిత బహుజన స్త్రీల రచనల సంకలనం నల్లపొద్దు
ఈ చివరిది గొప్ప సాహిత్యం అనలేను గానీ నిజాయితీ ఉన్న సాహిత్యం అని మాత్రం కచ్చితంగా చెప్పగలను.