Saturday, August 23, 2008

రచనలు - ‘బ్లాగు రచనలు’

ఈ మధ్య చర్చల్లో ఒక బ్లాగరి "మనం రాసేది బ్లాగులూ, పోస్టులూ కదా! మరి వాటిని రచనలు అనొచ్చా?" అని ఒక అమూల్యమైన ప్రశ్న సంధించారు. ఒక్క క్షణం అర్థం చేసుకోవడానికి సమయం పట్టినా, నేను సమాధానం వెతకడానికి ఆట్టే కాలయాపన చెయ్యలేదు. రాసేది ‘రచన’ అయితే, రాసేవాడు ‘రచయిత’. అది బ్లాగులో ‘రాసినా’, పత్రికలకు రాసినా, ఏకంగా పుస్తకాలే రాసినా, రాసినదాన్ని ‘రచన’ అనెయ్యొచ్చనే తీర్మానానికొచ్చేసి, అదే చేప్పాను. కాకపోతే నేను చెప్పింది over simplification అనిపించి, ఈ దశగా కొంత ఆలోచించడం జరిగింది. ఆ ఆలోచనల్ని ఈ టపాలో పంచుకుంటాను.పత్రికల్లో,పుస్తకాల్లో రచనలు జనబాహుళ్యాన్ని ఉద్దేశించి రాయడం వలన లేక రచయిత తనసొంతానికి రాసుకున్నా, ప్రచురణకర్త అవి చాలామంది ప్రజల ఆలోచనలను అందిపుచ్చుకుందని నమ్మటం వలన ప్రచురింపబడతాయి. అందుకే వాటిల్లో నాణ్యత పరమైన జాగ్రత్తలు (quality control) తీసుకుంటారు. ఆ రచనలోని విషయం, సమాజంలో అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న విలువలు, నమ్మకాలు, విశ్వాసాలకు భంగం వాటిల్లకుండా ఉండేలా చూడటం. ముద్రణలో అక్షరదోషాలూ, వాక్యనిర్మాణంలో ambiguity లేకుండా చూడటం. రచయిత రాసినదాన్ని చదివేవారి tasteకి అనుగుణంగా, పొందికలో అవసరమైన మార్పులు చేయడం లాంటివి జరుగుతాయి. ఈ పరిణామంలో ఒక రచన కాపీ ఎడిటర్ దగ్గరనుంచీ, సబ్ ఎడిటర్ (ఉప సంపాదకులు), ఎడిటర్ (సంపాదకులు) ఒక్కోసారి పబ్లిషర్ (ప్రచురణకర్త) వరకూ ఆ రచనలోని ఒక్కోఅక్షరాన్నీ, ఆలోచననీ, భావాన్నీ, శైలినీ, పొందికనీ పరిశీలించి పరీక్షించి అప్పటి సాహిత్యం యొక్క విలువలతో, వ్యాపార అవకాశాలతో (business possibility) బేరీజుచేసి "పబ్లిష్" మీట/ బొత్తం నొక్కుతారు.ఇక మన బ్లాగు విషయానికొస్తే, పైన చెప్పిన quality controls ఇక్కడ వుండవు. బ్లాగనేది ఒక వ్యక్తిగత అభివ్యక్తీకరణ మార్గం కనుక, రచయిత అనుకున్నది, తనకు అనిపించినది, తను అనుభవించినది, తను ఆలోచించేదీ నిరభ్యంతరంగా రెండోవ్యక్తి value judgment అవసరం లేకుండా రాసుకోవచ్చు. ఇది జనబాహుళ్యానికి ఉద్దేశింపడింది కాకపోయినా, ఆరంభంలోనే వివిధ విషయాలపై రాసే బ్లాగుల ఆధారంగా, అభిరుచి ఉన్న విషయాలపై రాసే బ్లాగుల్ని search option ద్వారా జనబాగుళ్యం కాకున్నా, కనీసం ఆ విషయం పట్ల ఆసక్తిగల కొందరు చదవటానికి వీలు కలిగేది. ఇప్పుడు కూడలి, జల్లెడ లాంటి బ్లాగ్ అగ్రిగేటర్లు, ఫోరంలు వచ్చిన తరువాత ప్రచురణకు ముందు ఉండే Editorial control ఉండకపోయినా, పది మందీ చూస్తారు గనక ఎంచుకునే విషయాల్లో, రాసే శైలిలో, అభివ్యక్తి రీతిలో ఒక మానసిక ఎడిటింగ్ అవలంభించడం జరుగుతోంది. ఇంకా కొంచెం ముందుకు సాగితే, పాఠకుల feedback ఆధారంగా ప్రస్తుతం ఉన్నటపాలోనే మార్పులో, లేక రాయబోయేవాటిల్లో ఆ సూచనలను అవలంభించడమో చేస్తున్నాము. అంటే, "పబ్లిష్" మీట/బొత్తం వ్యక్తిగతంగా బ్లాగరి చేతిలోనేఉన్నా, కొంతవరకూ pre-editing, మరికాస్త post-editing ఇక్కడా మొదలయ్యిందన్నమాట.అది ఎంతవరకూ సమంజసం అనేది చాలా వరకూ వ్యక్తిగతం కాబట్టి దాని గురించి చర్చ (ఈ టపా నేపధ్యంలో) అనవసరం. మన మూల బిందువు, రచనలు- బ్లాగురచనలు. ఇప్పుడు ఈ మూలబిందువుని పై విశ్లేషణకి అన్వయిస్తే ఉదయించే ప్రశ్న, "కేవలం నాణ్యతా ప్రమాణాలున్నంత మాత్రానే, ముద్రితమైనదాన్ని మాత్రం ‘రచన’ అని పిలిచి, బ్లాగు పోస్టులను ఆ పదప్రయోగం నుంచీ దూరం చెయ్యాలా?" అని. నాకైతే ఈ ‘వివక్ష’ అంతగా నప్పలేదనే చెప్పాలి. చారిత్రాత్మకంగా సాహిత్యసృజనా దాని పురోగతిని చూస్తే, రచయితలూ, కవులూ, కథకులూ (ఈ మధ్య వచ్చిన కమర్షియల్ రచనల్ని వదిలేస్తే) చాలావరకూ జనాలకోసం రాయలేదు. తమకు ముఖ్యమనిపించిన లేక తాము ప్రతిస్పందించిన విషయాలను అసంకల్పితంగా అక్షరబద్ధం చేసారు. ఆ తరువాతనే వారి అక్షరాల ‘విలువని’ గుర్తించిన అప్పటి రాజులు, జమిందారులో లేక ఇప్పటి ఎడిటర్లూ,పబ్లిషర్లూ వాటిని జనానికి అందించే ప్రయత్నం చేసారు.అంటే, వ్యక్తిగతమైన అసంకల్పిత రాతలు మొదట పుట్టి, ఆ తరువాతనే ఈ నాణ్యతావిలువలూ, అవి జన బాహుళ్యానికి అందటాలూ, విమర్శకుల విశ్లేషణలూ మొదలయ్యాయన్నమాట. ఈ విధంగా చూస్తే మన బ్లాగులు సరైన దారిలోనే వెళ్తున్నాయి. కాబట్టి నిరభ్యంతరంగా ‘రచన’ అనే పదం వాడుకోవచ్చు. కాకపోతే నేను రచయితని అంటే, ప్రజలు మన రచనల కాంప్లిమెంటరీ కాపీ అడిగే అవకాశం ఉందికాబట్టి, నేను ‘బ్లాగు రచయిత’ని అని గర్వంగా చెప్పుకుని మన బ్లాగు ‘లింకు’ మాత్రం చేతికందించి తప్పించుకోవచ్చన్నమాట.ఈ మధ్యకాలంలో ప్రముఖ రచయితలు కూడా మరింత మంది పాఠకుల్ని చేరడానికి బ్లాగుదారి నెంచుకోవడం మనకు తెలిసిందే. ఈ పరిణామంలో మార్పు ఇటువేపునుంచీకూడా మొదలౌతోంది. మన తెలుగు బ్లాగరలు e-పుస్తకాలవరకూ వస్తే, ఇంగ్లీషు బ్లాగర్లు పుస్తకాల పబ్లిషింగ్ వరకూ వచ్చేసారు. మనదీ రాబోయే కాలంలో ఆ దారే కావచ్చు. కాబట్టి, నిస్సందేహంగా బ్లాగర్లందరూ రచయితలే, ప్రతిపోస్టూ రచనే.So, Welcome to the (blog) writers club, Congratulations.


****

11 comments:

Purnima said...

:-)

జ్యోతి said...

మహేశ్,,

నాకు నేను నా బ్లాగులో రాసేవి, నా ఆలోచనలు, అనుభవాలు అనుకున్నానే కాని అవి రచనలు అని ఎప్పుడు అనుకోలేదు. సో నీ క్లబ్‍లో నేను చేరనుగాక చేరను.. ఇక నువ్వు చెప్పిన మిగతా విషయాలన్నీ నిజమే మరి..

ramya said...

:-)

నరహరి said...

మీరు హెచ.సి.యు లో గాని చదివారా...మిమ్మల్ని అక్కడ చూసినట్టు ...just let me know

కత్తి మహేష్ కుమార్ said...

@నరహరి: నేను హెచ్.సి.యు లో చదివనండి. MA Communication 1998-2000 బ్యాచ్. మీరు?

@జ్యోతి: చాలావరకూ రచయితలు రాసేవీ అనుభవాలూ,ఆశయాలూ,ఆలోచనలే నండీ!ఇక చదివేవాళ్ళున్న ప్రతి రాతగారూ రచయితే అని నా అనుకోలు. మీరు చెరనని చెప్పినా మీరెప్పుడో రచయిత్రి అయిపోయారు.

@రమ్య & పూర్ణిమ: ధన్యవాదాలు.

sujata said...

మహేష్ గారు -

1) మీ టెంప్లెట్ అదిరింది. గోల్డ్ ఫిష్ ను వెలుతురు లేని గదిలో పెడితే కొన్ని రోజులకు అవి తెల్ల గా అయిపోతాయంట. వెలుతురు (ఎక్స్ పోషర్) బాగా అవసరమైనది - ఈ గోల్డ్ ఫిష్ !

2) జ్యోతి గారన్నట్టు - బ్లాగు చాలా మటుకూ వ్యక్తిగతమైనది. వాటిలో 'రచన ' ల స్థాయిత్వం రావాలంతే కొద్దో గొప్పో కొన్ని క్వాలిటీలు ఉండాలి. బ్లాగు ల్లో టపాలు రచనలు కావడం అనేది కొన్ని బ్లాగులకే సాధ్యం. ప్రామాణికం అంటూ ఏమీ లేదు గానీ, బ్లాగరులందరూ - రచయితలు కావడం కష్టం. ఎవరికన్నా ఇష్టం ఉంటే, కావొచ్చు!

3) ఈ మధ్య సినిమాలు చూడట్లేదా మీరు ? నవతరంగం లో కనబడటం లేదు ?!

sujata said...

ఊప్స్.. ఇప్పుడే నవతరంగం చూసాను. మీ వ్యాసం చాలా బావుంది. మీలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అదిరిపోయె వాళ్ళను రచయితలనొచ్చు గానీ అందర్నీ అనకూడదని మనవి !

కత్తి మహేష్ కుమార్ said...

@సుజాత: గోల్డ్ ఫిష్ గురించి చెప్పిన సమాచారానికి ధన్యవాదాలు. ఎక్స్ పోజర్ మనకూ అవసరమేనండోయ్! ఆ విషయంలోకూడా మనం అదే టైప్.

బ్లాగులు వ్యక్తిగతమే అయినా వాటి క్వాలిటీని చదివేవాళ్ళు నిర్ణయిస్తారు కాబట్టి మరింత ప్రజాస్వామిక రచనలేమో అని నాకు అనిపిస్తుంది. కొన్ని బ్లాగుల్లో టపాలు మామూలుగా పబ్లిష అయిన పుస్తకాలకంటే బాగుండటం మనం అంగీకరించాల్సిన నిజం. మీరు చెప్పినట్లు చూసినా అందరూ కాకపోయినా కొందరైనా రచయితలు ఉనారన్నమాట.

కాస్త over simplification చేస్తే,పాఠకులున్న ప్రతిఒక్కరూ రచయితలే కదా! మరి వారి రాతలు రచనలు కాకుండాపోతాయా..అని నా ఆశ.

నిజంగా ఈ మధ్య నేను చూసిన సినిమాలలో రాయగలిగినంత విషయం ఉండటం లేదు. అందుకే సినిమాల గురించి చదవడం సాగిస్తున్నాను. నా కొత్త నవతరంగం వ్యాసం దానిగురించే.

saisahithi said...

మీ అభిప్రాయాలు 100% కరెక్ట్..ధన్యవాదములు.

నరహరి said...

నేను ఎమ.ఎస్సి. భౌతిక శాస్త్రం చదివాను...1997-1999 లో...2001 వరకు అక్కడె రిసెర్చ్ చేసాను...మీరు అప్పాజి, సుకుమార్ వాళ్ళతో ఉండేవారా...నెను కూడా బి హాస్టలే...మీలో ఇంత పరిణతి ఉందని నేను అనుకోలేదు...బహుశా మీ గ్యాంగ్ ని చూసి నాకు అలా అనిపించి ఉండొచ్చు...సారీ...నేను మీ బ్లాగ్ రెగ్యులర్ గా చదువుతాను

కత్తి మహేష్ కుమార్ said...

@నరహరి గారు: మీరు కరెక్టుగానే ‘గెస్’ చేసారు. నేను ఆ మహేష్ నే. నాదీ బి హాస్టలే.ఇక గ్యాంగూ పరిణితీ అంటారా, అవి కేవలం "images & impressions" కాబట్టి సారీ అవసరం లేదు.We all do that.

మీ పరిచయం ఆనందాన్ని కలిగించింది. ఎంతైనా ఒక యూనివర్సిటీవళ్ళంగా కొంత common culture & experiences కలిగినవాళ్ళం కదా!