Monday, November 23, 2009

గొడ్డుమాంసం - ప్రజాస్వామిక స్థలాలు

ఇదివరకూ నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఘటన గురించి "గొడ్డుమాంసం - ఒక సంస్కృతి" అనే టపా రాశాను. ఎప్పటిలాగే పవిత్రమైన మిత్రులు బాధపడి విబేధిస్తే, ప్రజాస్వామిక మిత్రులు చర్చించి అంగీకరించారు. అదే ఘటన గురించి గుడిమేడ సాంబయ్య గారు South Asia Research లో భాగంగా Democratisation of the Public Sphere: The Beef Stall Case in Hyderabad's Sukoon Festival" అంటూ ఒక కేస్ స్టడీ రాస్తే దాన్ని SAGE publications వారు ప్రచురించారు. 

ఆ పేపర్ను మీరు ఈ లంకె ద్వారా చదవొచ్చు. 


ఆ ఘటనకు ప్రతిస్పందిస్తూ మిత్రుడు దిగుమర్తి సురేష్ కుమార్ రాసిన కవితను కూడా ఇక్కడ పొందుపరుస్తున్నాను.

గొడ్డు మాంసం గొడ్డు మాంసం
బొడ్డు కోసినప్పటినుంచి తిన్న మాంసం
ఎముకలలో ఎముకై ఎగసిన మా మాంసం
రక్తంలో భాగమై దుమికిన మాంసం

ఊరికి దూరంగా నన్నుంచినపుడు
నా అడుగులే నీకంటరానివైనపుడు
మనిషినే మనిషిగా నువ్వు చూడలేనపుడు
నాకండగా ఉన్నది
నన్నీడికి చేర్చినది - గొడ్డు మాంసం

మా తాతాలు నేతులు తాగారని
ఏవేవో గొప్పలు చేశారని
నీ తరపున నువ్వేదో చెప్పుకుంటూ పోతుంటే
నా తరపున నిలబడ్డది
నాతోనే ఉన్నది - గొడ్డు మాంసం

రొమ్ము పిండి పాలు పిసికినపుడు
నీకు నెప్పంటే తెలియనే లేదు
చెప్పు కుట్టి తొక్కి నడచినపుడు
నీకు బాధంటే తెలియనే లేదు
నీ పెళ్ళికి... నీ చావుకి
డప్పై మోగినపుడు
దెబ్బంటే తగలనే లేదు
నా ఆకలిని తీర్చినపుడు
నీకు దేవతయ్యిందా గొడ్డు మాంసం?

****


14 comments:

Indian Minerva said...

హ్మ్మ్మ్...

Indian Minerva said...

చివరిది ఛెళ్ళుమనిపించలేదూ...?

కెక్యూబ్ వర్మ said...

నా ఆకలిని తీర్చినపుడు
నీకు దేవతయ్యిందా గొడ్డు మాంసం?

నిజమే. మాంసాహారాలన్నిటినీ ఒకేలా చూడలేని మనుషుల మద్య వున్నాం. అది దళితుడి ఆహారంగా చూసినప్పుడే అసహ్యాన్ని ప్రకటిస్తున్నారు. అదే ఒక పాశ్చాత్యుల ఆహారంగా అంగీకరిస్తున్నారు. కటిక దరిద్రంలో మగ్గే ఆదివాసీలు, దళితులు తాము కోసిన గొడ్డును పూర్తిగా ఒకే మారు ఆరగించక వాటిని ఇంట్లో తోరణాలుగా ఎండబెట్టి అప్పుడప్పుడు వండుకునే వాళ్ళు కూడా వున్నారు. వారితో ఆహారాన్ని పంచుకున్న అనుభవంతోనే చెప్తున్నా. ఇది మరీ ఘోరంగా అనిపిస్తుందేమో కొందరికీ. కానీ పచ్చి నిజం. హైలీ హైజెనిక్ ఫుడ్ దొరకదు మరి వీళ్ళకి.

తమిళన్ said...

kavitha baagundi

Anonymous said...

http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2009/nov/15edit1

బ్లాగాగ్ని said...

ఇది చూశారా మహేష్ గారూ?

కత పవన్ said...

నిజమే

బుజ్జిగాడు said...

ఎక్కడో గుండెల్లో మెలి తిప్పినట్టు ఉంది ఈ ఆవేదన, ఆక్రోశం.

Anonymous said...

*అది దళితుడి ఆహారంగా చూసినప్పుడే అసహ్యాన్ని ప్రకటిస్తున్నారు.కటిక దారిద్ర్యం లో మగ్గే ఆదివాసిలు ...*

ఎడ్డెమంటె తేడ్డమనడం లో ఇప్పుడు మీరు ఆరితేరారు. బాబు సెంట్రల్ యునివర్సిటి లో చదివేట్టప్పుడు తినవలసిన అవసరం ఏమి వచ్చింది? మీరు చెప్పిన విధంగా యునివర్సిటి విద్యార్థులు ఆదివాసిలు లాగా కటిక దరిద్రం లో లేరు కదా? పైన వ్యాసం చదవండి మాంసం తినడవలన ఎన్ని నష్టాలో రాశారు. మీరు గొడ్డు మాంసం తినడం కూడా ఒక వాదన లో భాగం గా చేసి పద్యాలు రాసి, ఆర్టికల్స్ రాసి మీ రాత నైపుణ్యాన్ని సాన పేట్టుకోవడం తప్ప చదువుకున్న వారిలా ఆలోచిస్తున్నారా? ఎమీ దొరకని వాళ్ళు తినడం లో న్యాయముంది మీరు చెప్పిన ప్రకారం వారికి గత్యంతరం లేదు కనుక.

Kathi Mahesh Kumar said...

@బ్లాగాగ్ని&డమ్మీ: ఇక్కడ చర్చ పర్యావరణ పరిరక్షణ కాదు సామాజిక వివక్ష. సాంస్కృతిక వివక్ష.పౌర/ప్రజాస్వామ్య మానవహక్కుల ఉల్లంఘన.

గొడ్డుమాంసం తినడం ఇక్కడ వాదనకాదు. గొడ్డుమాంసం హిందూసంస్కృతి కాదు అని దళితుల్ని చిన్నచూపుచూసిన అగ్రకులాల దౌష్ట్యానికి వ్యతిరేకంగా ఈ వాదన.ఇక్కడ చదువురానిది మాకుకాదు. మీకు. చదువంటే యూనివర్సిటీ డిగ్రీలూ సాఫ్టువేరు ఉద్యోగాలూ కావు. సమాజం దానికి సంబంధించిన నిజాలు తెలుసుకోవడం. అది మాదగ్గర మెండుగానే ఉంది. మీలాగా మేము డమ్మీలం కాదు. రక్తమాంసాలున్న మనుషులం.

శ్రీ said...

ఎవరికి అందుబాటులో ఉన్న ఆహరం వాళ్ళు తినడంలో తప్పు లేదు.

Anonymous said...

* చదువంటే యూనివర్సిటీ డిగ్రీలూ సాఫ్టువేరు ఉద్యోగాలూ కావు. సమాజం దానికి సంబంధించిన నిజాలు తెలుసుకోవడం.*

ఐతె రోజూ కూడలి లో ఉన్న బ్లాగులు చదివితే సమాజం గురించి అవగాహన వస్తుంది.:-)

ఆ.సౌమ్య said...

"రొమ్ము పిండి పాలు పిసికినపుడు
నీకు నెప్పంటే తెలియనే లేదు
చెప్పు కుట్టి తొక్కి నడచినపుడు
నీకు బాధంటే తెలియనే లేదు
నీ పెళ్ళికి... నీ చావుకి
డప్పై మోగినపుడు
దెబ్బంటే తగలనే లేదు
నా ఆకలిని తీర్చినపుడు
నీకు దేవతయ్యిందా గొడ్డు మాంసం?"....wow, excellent !
i completely agree

Ramesh said...

excellent expression