Wednesday, October 15, 2008

రెస్టారెంటోఫోబియా...!

కొత్త అనుభవం. కొత్త ప్రదేశం. కొత్త మనుషులూ, కొత్త వాతావరణం మనలో ఎప్పుడూ కొంత ఖంగారుని సృష్టిస్తాయి. అది సహజంకూడా. అదీ ముఖ్యంగా ఆ కొత్తదనానికి తెలియనితనం జోడిస్తే ! అధికారమున్నాకూడా మనం సాధికారకంగా నిర్ణయాలు తీసుకోలేం. మన సహజ ప్రవర్తనని చూపించలేము. దాన్నే ఒక్కోసారి మొహమాటం అనుకుంటే, మరో సారి బిడియం అనేసి తృప్తిపడతాము. కానీ, అప్పుడప్పుడూ అది ఈ సాధారణ హద్దుల్నిదాటి మానసిక శాస్త్రంలో చెప్పే కాంప్లెక్స్ గానో లేక ఒక ఫోబియాగా తయారవుతుంది.


ఆంధ్రప్రదేశ్ లో సాధారణగా ఉండే టిఫిన్, భోజనం హోటళ్ళను మాత్రమే చూసిన నేను, డిగ్రీ చదివే రోజుల్లో స్నేహితులతో మొట్టమొదటిసారిగా ఒక పెద్ద 'రెస్టారెంట్'కు వెళ్ళాను. అక్కడ మెన్యూ చూసిన మొదటి క్షణంలో పట్టుకుంది నాకొక కాంప్లెక్స్...దాన్నే ఫోబియా అనుకుంటే అదొక కలగాపులగం ఫోబియా. ఒకటికాదు రెండుకాదు ఏకంగా మూడు ఫోబియాల కలయిక. Kainolophobia or Kainophobia- Fear of anything new, novelty. Kakorrhaphiophobia- Fear of failure or defeat and Katagelophobia- Fear of ridicule.


నిజానికి ఆ మెన్యూలో చాలా పేర్లు నాకు అస్సలు అర్థం కాలేదు. అర్థమయినా, ఆర్డరు ఎలా ఇవ్వాలో తెలీలేదు. కొత్తదనంవల్ల వచ్చిన ఖంగారు ఒకటైతే, ఎక్కడ తప్పుచేస్తానో అన్న భయం మరోవైపు. ఈ రెండిటికీ మూలకారణం, నాతో వచ్చిన స్నేహితులు "ఊరోడ్రా!" అనుకుంటారనే దిగులు. మామూలుగా మాఊర్లో భోజనం చెబితే అన్నీవచ్చెస్తాయి. మహాఅయితే చపాతీ చెప్పేవాళ్ళం. వాటితోపాటూ పప్పో కూరో వాటంతట అవే వచ్చేస్తాయి. కానీ ఇక్కడ ‘రోటీ’ సపరేటుగా ‘దాల్’ సపరేటుగా ఆర్డరివ్వాలి. ‘పన్నీర్’ అనేది తియ్యటి సోడాలాంటి పానీయంగా నాకు తెలుసేగానీ, అదొక తిండిపదార్థం పేరని తెలీదు. ఇక మలాయికోఫ్తా, కాశ్మీరీ పలావ్, బటర్ చికెన్ లాంటివి కొత్త పేర్లైతే , ఇప్పటికీ పేరుకూడా తెలీని చైనీస్ వంటకాలు బోలెడు.


ఈ తంతుజరిగిన కొన్నాళ్ళకు మా Educational psychology లెక్చరర్ తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పారు.


మా లెక్చరర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు విదేశీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఒకాయన మైసూర్ కొచ్చాడట. అప్పటికే రీసెర్చ్ కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న మా లెక్చరర్, ఆయన్ను కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ఎక్కడ వెళ్ళడానికి లేటైపోతాడేమో అనే ఆలోచనతో మా లెక్చరర్, అనుకున్న సమయానికన్నా గంట ముందే ఆ ప్రొఫెసరున్న ఫైవ్ స్టార్ హోటల్ కి చేరుకున్నాడు. తీరా అక్కడికి చేరగానే, వారి అసిస్టెంట్ "అయ్యా మీరు గంట ముందొచ్చేసారు, కొంత సమయం వేచిచూడాలి" అని మర్యాదగా చెప్పేసాడు. ఆ గంటసమయంలో ఏంచెయ్యాలో తెలీక కాసేపు లాబీలో కూర్చుని,సమయం గడవక కొంత ధైర్యం చేసి పక్కనే ఉన్న రెస్టారెంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు.


కూర్చోగానే, చేతిలో మెన్యూ ,పెదవులపై చిరునవ్వూ పెట్టుకుని సర్వర్ ప్రత్యక్షం. ఆ మెన్యూ చూసి మా లెక్చరర్ ఢగైపోయాడు. ఇకతప్పదన్నట్లుగా చదవడానికి ప్రయత్నిస్తే అన్నీ..గ్రీకూ లాటిన్లే. చిట్టచివరకు దోసె,కాఫీ కొంచెం తెలిసిన పదార్థాలలాగా అనిపిస్తే వాటినే ఆర్డరిచ్చు ఊరుకున్నాడు.ఆ చిరునవ్వుల సర్వరు పక్కకితప్పుకోగానే మా లెక్చరర్ దృష్టి పక్క టేబుల్లలో కూర్చుని టిఫిన్ ఆరగిస్తున్న వ్యక్తిలపై పడ్డాయి.ఒక్కసారిగా ఆయనగుండేల్లో కత్తులూఫొర్కులూ పరుగెత్తాయి...అర్థమయ్యిందనుకుంటాను! ఆ పక్క టేబుల్లో దోసెల్ని కత్తులూ ఫోర్కులతో చీల్చిచండాడుతూ కొందరు కనిపించారు. తను వందరుపాయలు త్యాగం చెయ్యడానికి సిద్దమైన దోసె తన టేబిల్ పైకి చేరింది.


అసలే ఎప్పుడూ జీవితంలో వెళ్ళని ఫైవ్ స్టార్ హోటలు , దోసెల్ని అలవోగ్గా చేతుల్తోతప్ప కత్తులూ కటార్లతో తినెరగని జీవితం... ఇప్పడు చూస్తే "ఎరక్కపోయి చెప్పాను ఇరుక్కుపోయాను" అనిపాడుకునే పరిస్థితి. ఎదురుగా ఇష్టమైన దోసున్నా మనసారా తినలేని పరిస్థితి. ఈ డోలామానమైన పరిస్థితిలో మా లెక్చరర్ చేతులు నలుపుకుంటూ దాదాపు 10 నిమిషాలు దీనంగా ఎదురుచూస్తూ, కత్తులూ పోర్కుల కాంబినేషల్నతో ప్రయోగాలు చేస్తూ గడిపేసాడు. ఇంతలో, పక్క టేబుల్లో అప్పటివరకూ ఈ తంతుచూస్తున్న ఒక పెద్దాయన తన టిఫిన్ ముగించిన వెళ్తూవెళ్తూ మా లెక్చరర్ భుజంపై చెయ్యివేసి "my boy! you have paid for it" అనిజెప్పేసి వెళ్ళిపోయాడట.


అంతే! ఆ ఒక్క క్షణంలో మనసుమూల ఒక వెయ్యిక్యాండిల్ బల్బువెలిగేసింది. అప్పటిదాకా ఆడుకుంటున్న ఫోర్కూ కత్తులను పక్కనపడేసి, ఆ సర్వర్ను మించిన నవ్వు తన ముఖం మీద ప్రతిఫలిస్తుండగా విజయవంతంగా చెత్తో దీసె లాగించేసాడు.


ఈ సంఘటన చెప్పిన మరిక్షణంలో నాకున్న ఫోబియాలన్నీకూడా పటాపంచలయ్యాయి. "నిజమే! నా డబ్బులు పెట్టి నేను తింటున్నప్పుడు, నా ఇష్టమొచ్చినట్లు తినే అధికారం నాకుంది కదా" అనిపించింది. అంతెందుకు, అంత డబ్బుపెట్టి ఆర్డరిస్తున్నప్పుడు ఆ పదార్థాలేమిటో అవి వేటితో తయారు చేస్తారో అవి మనకు ఎలా కావాలో సాధికారికంగా అడిగి తెలుసుకుని మరీ చెప్పే హక్కు మనకుందికదా అనిపించింది. అప్పటి నుంచీ ఇప్పటివరకూ ఆ కాంప్లెక్సులూ,ఫోబియాలూ నా దరికికూడా చేరలేదు.


ఈ సంఘటనను చెప్పి నా ఆత్మన్యూనతను పోగొట్టిన మా సైకాలజీ లెక్చరర్ షిండే గారిని ఇప్పటికీ పెద్ద హోటల్ కెళ్ళిన ప్రతిసారీ, కొత్త ప్రదేశానికి వెళ్ళిన ప్రతిసారీ తలుచుకుంటాను.


*****

25 comments:

కొత్త పాళీ said...

The first para exactly describes my feelings the first time I went to a star restaurant after joining college.
ఆత్మన్యూనత పడాల్సిన అవసరంలేదు, నిజమే. దోసెనీ చపాతీనీ ఫోర్కుతో తినచూడ్డమూ చిరాకైనదే, నిజమే. కానీ స్టార్ హోటల్లో కూడా యెంకాయమ్మ హోటల్లో తిన్నట్టే తింటాను అంటే కుదిరే పని కాదు. ఎక్కడి పద్ధతులు అక్కడ పాటించాలి.

ఆనందగురు said...

చాలా మంచి టపా.వివాదాలు రాని టపా.చక్కని లెర్నింగ్ ఎక్స్పీరియన్స్.

సుజాత వేల్పూరి said...

బాగుంది. ఇలాంటి సంఘటనలు చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతాయేమో కదా!

పన్నీర్ అంటే తియ్యని సోడా లాంటి పానీయమా?
పన్నీర్ అంటే ఒక సుగంధ ద్రవ్యం, నాకు తెలిసి!సౌందర్య సాధనంగా వాడతారని, అప్పుడప్పుడు పెళ్ళిళ్ళలో చల్లుకుంటారని తెలుసు!

Anonymous said...

నాకిలాంటి ఫోభియాస్ మా బాపూజి సార్ వల్ల పోయాయి.
మీకు బి.ఆర్.బాపూజి సార్ తెలుసో, లేదో. అనవసరంగా
చుట్టూ ఉన్న వాళ్ళు మన గురించి ఏమనేసుకుంటున్నారో అని
ఆలోచించొద్దని చెప్తారతను. వాళ్ళు అనుకున్న విషయాన్ని
కంట్రోల్ చెయ్యలేము కదా. అందుకే మనకు నచ్చినట్టు మనముండటం
ముఖ్యం అని చెప్తారు.

Anonymous said...

ఇది చదువుతూంటే అమ్రుతం లోని ఒక ఎపిసొడ్ గుర్తొచ్చింది.
అమ్రుత రావు అనుకొకొండ ఒకసారి రెస్టారెంట్ లో వైట్ చెయ్యల్సి వస్తుంది. వెయిటర్ వచ్చి ఏం కావాలని తొందర పెట్టేస్తుంటే పర్సులో వున్న వందరూపాయలతో ఏమొస్తుందా అని చూస్తాడు .ఆ రేటుకి వున్న ఒకే ఒక్క ఐటెం ప్రాన్ కచ్చ్హ పిచ్చ్హ ఎంతో స్టైల్ గా అర్డెర్ ఇచ్చేస్తాడు. తీరా చూస్తే పచ్చి రొయ్యలు అందంగా ప్లేట్లో సర్ది అతని టేబుల్ పై పెట్టి అదోలా చూసి వెల్లిపొతాడూ వైటర్. ఇక అక్కడినించి అది తినలేక , వదల్లేక తింటున్నట్టు ఏక్ట్ చేస్తూ ప్లేటుకిందా నేప్కిన్లోను సర్దేసి ,నైస్ డిష్ అంటూ తెగ వోవర్ అక్టింగ్ చేసుకుంటూ బయటికొచ్చి పడాతాడు.
కొత్త ఐటెం ట్రై చేద్దమని వున్న ఇలాటి రిస్క్ కి భయపడే అలవాటైనవి ఆర్డర్ ఇచేస్తాం. అంతేగాని అవి తెగ నచ్చేసి కాదు.
ఈ సారి మిమ్మల్ల్ని తలుచుకొని సాహసం చేస్తాను .

Sujata M said...

భలే వుంది. అందుకే అయిదూ, ఏడూ నక్షత్రాల హోటళ్ళలో మాత్రమే కాకుండా కాస్త మంచి రెస్టారెంట్లలో పనీర్ అంటే కాటేజ్ చీజ్, క్యూబ్డ్ అండ్ cooked ఇన్ సాస్ ! అని రాస్తారేమో! ఏమైనా.. మనం ఏమి తింటున్నామో తెలుసుకునే హక్కు మనకుంది. సూపర్. అదిరింది. నాకు నోరూరింది. అసలు ఫూడ్ చానెళ్ళలో వర్ణించి వర్ణించి.. ఊరించి చెప్పే వాళ్ళ మాటలు విని, ఆ ఫూడ్ గురించి తెలుసుకుంటుంటేనే కడుపు నిండిపోతుంది. రైట్ టు ఇన్ ఫొర్మేషన్.. ఆక్ట్ పాస్ చెయ్యాలి గల్లీల్లో రెస్టారెంట్లలో కూడా.. !!!

[ I am food-maniac. No Fobia at all. My size says it all. ]

Anonymous said...

>>>అంతెందుకు, అంత డబ్బుపెట్టి ఆర్డరిస్తున్నప్పుడు ఆ పదార్థాలేమిటో అవి వేటితో తయారు చేస్తారో అవి మనకు ఎలా కావాలో సాధికారికంగా అడిగి తెలుసుకుని మరీ చెప్పే హక్కు మనకుందికదా అనిపించింది. అప్పటి నుంచీ ఇప్పటివరకూ ఆ కాంప్లెక్సులూ,ఫోబియాలూ నా దరికికూడా చేరలేదు.

అంటే కొంపదీసి OCగా వచ్చేటప్పుడు అన్ని ఫోబియా లు వుండవచ్చు అంటారు ఏంటి???

--vamsi

Anonymous said...

అంతే అంతే రాజకుమారుడు సినిమాలో బ్రహ్మానందం లా కుమ్మెయ్యడమే మన పని. మేమైతే బిల్లు తో పాటు ఇచ్చే సోంప్ కూడా పిడికెళ్ళ కొద్దీ తీసుకుని రెండో సారి ఆర్డరు చేసేవాళ్ళం.

Kathi Mahesh Kumar said...

@కొత్తపాళి: ఎక్కడిపద్దతులు అక్కడపాటించాలనుకోవడంలో తప్పులేదుగానీ,అది ఏకంగా కడుపుకొడితే మాత్రం నేను స్టార్ హోటల్లో అయినా యెంకాయమ్మ హోటల్ స్టైల్లో తినేస్తా.

@ఆనందగురు: దన్యవాదలు
@సుజాత: నా చిన్నప్పుడు మాఊర్లో ‘పన్నీర్ సోడా’ అని కాస్త తెల్లగా ఉండే తియ్యటి సోడా దొరికేది. అప్పట్లో ఆ పన్నీర్ తప్ప మిగతా పన్నీర్ తెలిసేదికాదు. నిజమే!అందరికీ ఇలాంటి అనుభవం ఖచ్చితంగా ఎదురైవుంటుంది.

@గంగా భవాని: బాపూజీగారు నాకూ పరిచయం లేకున్నా ఆయన గురించి విన్నాను. ఎంతైనా, మీడిపార్ట్ మెంట్ ఎదురుగానే బస్సెక్కి GT వెళ్ళేవాళ్ళం ఆ మాత్రం తెలీదంటారా!

@లలిత: "ధైర్యేసాహసే రెస్టారెంటో" అనుకుని సాహసించెయ్యండి.

@sijata:నేనూ పెద్ద ఫుడ్డీనే. ధన్యవాదాలు.

@నాగప్రసాద్: అంతే!అంతే!!

Rajendra Devarapalli said...

ఇందుమూలముగా యావన్మందికీ తెలియజేయునది ఏమనగా,ఒకటి నుంచి ఏడు వరకూ,అవి కాని రెస్టారెంట్లూ,రిసార్ట్లూ,తదితర ప్రదేశాలలో ఏ వంటకం ఏమిటి,ఎలా చేస్తారు,ఎలా తినాలి,అది ఎవరు వండారు/వండుతారు ఇలా తక్కుంగల అనుమానాలను మీరు అడిగి తెలుసుకోవచ్చు,కావాలంటే సదరు విభాగాధిపతి ఉదా;-మొగలాయి,తండూరి,కొంకణి,చెట్టినాడ్,కాంటినెంటల్ ఇలాగా,కాదంటే అసలా హోటల్ చీఫ్ షెఫ్ తో కూడా మాట్లాడి తెలుసుకోవచ్చు.కాకుంటే etiquette అనబడు ఒక ’తొక్క’లో సబ్జక్టు కాస్త ముక్కున పెట్టుకుని ఇంగిలిపీసులో డమడమ లాడించాలి.

చంద్ర మోహన్ said...

ఇది చదువుతుంటే ఓ జోక్ గుర్తొచ్చింది. ఒకడు ఢిల్లీలోని ఓ నిరులాస్ రెస్టారెంట్ లో వెళ్ళి గట్టిగా త్రేన్చుతూ, ఖాండ్రిస్తూ శబ్దాలు చేస్తూ తినసాగాడట. చుట్టూ ఉన్న వారి ఇబ్బందిని గమనించిన రెస్టారెంట్ మేనేజర్ అతని దగ్గరకు వచ్చి 'అయ్యా! తమరు ఇంతకు ముందెప్పుడూ ఒక మంచి హోటల్లో భోజనం చేయలేదా?' అని అడిగాడట.
'వెళ్ళకేం, మొన్నంటే మొన్న మౌర్య అశోకాలోనే భోజనానికి వెళ్ళాను ' అన్నాడు అతగాడు.
'అక్కడా ఇలాగే తిన్నారా' అన్ అడిగాడట మేనేజర్. 'ఆహా! ఎక్కడైనా ఇలాగే తింటాను ' అన్నాడు అతను.
'మరి వాళ్ళేం అనలేదా' అనడిగాడట మేనేజర్ వ్యంగ్యంగా.
' ఆ, అన్నారు. ఇదేమైనా నిరులాస్ రెస్టారెంటనుకున్నావా అని బయటికి పంపించేశారు ' అని చెప్పాడట ఆ కస్టమర్ నిజాయితీగా.

ఈ సమస్య అనుభవించని వారు బహు తక్కువగా ఉంటారు. మొదటి సారి ఏసీ కోచ్ లో ప్రయాణించేవారు, మొదటిసారి విమానమెక్కేవారు అందరికీ ఇలాంటి కాంప్లెక్స్ ఉంటుందేమో!

pdileep said...

పదహారు గన్టలు పని తరువాత ఇప్పుడీ ఇన్టికి వచ్చి స్నెహితుల వుత్తరాలు కొన్ని చిన్న ఇన్తెర్నెత్ పనులు చూసుకుని పడుకున్దామని ఆన్లిను వచ్హాను. ఈ టపా చూసి మనసారా నవ్వుకుని పూర్తిగా మళ్లీ వుత్సాహ వన్తుడిని అయ్యా.

నా అనుభవము లొ నేర్చుకున్నది యెమన్టె, వేరే వాడు స్పూన్ వాడుతున్నాడు అన్టే అది సరి కాక పూవచ్హు. ఉదాహరణకు, UK వెల్లి నప్పుడు, Pizza కత్తి ఒర్క్ వాడలేక పొయను. చేతితొ తినేదానికి మొదట మొహమాట పడి తరువాత వారిని అదిగితే, వారు చాలావరకు చీతి తొనే తిటామని అన్నారు. అక్కడ వున్న గుమ్పులొ ఇద్దరు తప్ప అన్దరు చీతి తొనే తిన్నారు. అలాగే ఇక్కడ అయిదు నక్శత్రాల పూటకూళ్ళ ఇల్లలొ నన్ను ఎలా తినాలో అడిగి మనలాగా చీతి తొనే తిన్న వాళ్లు వున్నారు.

ఒకటి మాత్రము నిజము - మన పక్కనోడు ఏమను కున్టాడొ అని అనుకుటే నష్టపోయెది మనమే - మనలాగే వాడు అలాగే అనుకొన్టు వున్డొచ్హుకదా?

Purnima said...

బాగుంది టపా. కమ్మెంట్లు కూడా చాలా బాగున్నాయి.

డబ్బులిచ్చామని కాదు కానీ, తినాల్సింది మనమే కాబట్టి కొన్ని తెలుసుకోవటం మంచిది. తీరా వాడు తెచ్చాక మనం మొహాలు చూసుకుంటే ఇంకా ఇబ్బంది కదా! మా కొలీగ్ ఒక అబ్బి, ఎప్పుడే రెస్టారెంట్ కెళ్ళినా, నోరు తిరగని వంటకాలనే ఆర్డరు చేయటం, ఒక సరదా! :-)

కానీ పద్ధతుల్లన్నాక, పద్ధతులే! కొన్ని సార్లు తప్పవు..

నిషిగంధ said...

బావుందండీ టపా! కార్పొరేట్ కుటుంబాలలో పుట్టినవాళ్ళు కాకుండా మిగతా ఎవరైనా జీవితంలో ఈ ఫోబియాని అనుభవించి ఉంటారు! పెద్ద రెస్టారెంట్లకి వెళ్ళేప్పుడు అదివరకు ఆల్రెడీ అక్కడికి వెళ్ళి కాస్తో కూస్తో తిండి ఆర్డర్ చేయడంలో అనుభవం ఉన్నవాళ్ళు తోడుంటే బెటర్!

మేము కాలేజీలో ఉన్నప్పుడు మా గ్రూప్ లో ఒకరి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోడానికి మొదటిసారిగా స్టార్ హోటల్ కి లంచ్ కి వెళ్ళాము.. భయపడుతూనే ఆర్డర్ ఇచ్చాము.. కత్తులు కటార్లతో కష్టపడి తిన్నాము.. అంతా బానేఉంది.. భోజనం చివర్లో ఉండగా వెయిటర్ వచ్చి ఫింగర్ బౌల్స్ తీసుకురమ్మంటారా అంటే మా ఫ్రెండ్ ఒకతను ఒకసారి మా అందరి వంకా చూసి 'ఆరుగురుమున్నాము.. బై 2 చేసుకుందాం, సరేనా' అనిచెప్పి "ఆ, 3 ఫింగర్ బౌల్స్" అని ఆర్డరిచ్చాడు... ఆ తర్వాత వెయిటర్ చూసిన చూపు గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు :-)

Anonymous said...

maheshgaaru,
నా కామెంటుకి respond అవ్వకూడదు అనుకున్నారా?:p

--vamsi

Anonymous said...

btw, nishigandhagaaru, mee comment adurs...lol..

Kathi Mahesh Kumar said...

@వంశీ: వచ్చిన సమాధానాల్ని scrawl చేసిచూస్తూ, pop-up window లో సమాధానమిస్తాను. ఆ క్రమంలో బహుశా మీ కామెంట్ త్వరగా పైకెళ్ళిపోయి నా దృష్టిని దాటిపోయుంటుంది. రెస్పాండ్ అవ్వకూడదని నేను ఏమాత్రం అనుకోలేదు.

ఇక మీరి అడిగిన OC పరిస్థితుల్లోకూడా మీకు తెలిసిన ఎవరోఒకరి డబ్బు మీకోసం ఖర్చౌతున్నట్లే కదా! అలాంటప్పుడు అక్కడమాత్రం ఫోబియాలెందుకు?

@రాజేంద్ర:నాతరఫున నుంచీ మీరు చేసిన అనౌన్సుమెంటుకి నెనర్లు.

@చంద్రమోహన్:జోకు బాగుంది. నిజమే,మొదటెక్క్ఇన ఏసీకోచ్, విమానప్రయాణం ఇలాంటి అనుభూతినే మిగులుస్తాయి.

@దిలీప్:టపా మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

@ పూర్ణిమ: చాలారోజులకి నువ్వు కామెంటదగిన టపా రాసానన్నమాట! కొన్ని సార్లు తప్పకపోయినా,ఇబ్బందికలిగితే తప్పకపోయినా తప్పించుకునేదారి వెతకాల్సిందే.

@నిషిగంధ: మీరు చెప్పిన సంఘటన అదిరింది.ధన్యవాదాలు.

cbrao said...

ఎన్నో భోజనశాలలు.ఎన్నో పద్ధతులు. అన్నీ అందరికీ తెలియటం కష్టమే మరి.జపనీస్ భోజనశాలలో, చేపకూర కావాలని అడిగితే ఏ రెండు రొట్టెలాంటి పదార్థాల మధ్య, పచ్చి చేప పెట్టి తీసుకువచ్చినా ఆశ్చర్య పడవద్దు. జపనీయులు అలాగే తింటారు మరి.ఒక వస్తువు కావాలని అడిగే ముందట, ఆ వస్తువు వివరణ, అది ఎలా చేస్తారో అడగటం తప్పు కాదనుకుంటా.

చక్కటి ఈ వ్యాసానికి,నిషీగంధ కామెంట్ చదివి మనసారా నవ్వాను.

-cbrao
Columbus,Ohio.

Anonymous said...

భలే! నేనూ ఓ టపా రాస్తాను టైము దొరికినప్పుడు... నేనూ ఇలాంటి ఆత్మ న్యూనతకు దారి తీసేవి ఒక్కొక్కటిగా ఎదురుచూసుకుంటూ వచ్చాను...ఇప్పుడు అమెరికా లో అయినా, అనంతపురంలో అయినా, మాస్ గా ఉండటం వల్ల అనేక లాభాలు ఉన్నాయి అని decide అయాను. :-)

శ్రీసత్య... said...

very interesting... i liked your writing style...waiting for the next posting.

Unknown said...

చాలా బగుందండి..మీ టపా.

Unknown said...

Nijame, Chnadramohan garu cheppinatlu monnatiki monna first time pune-blr flight ekkinapudu ... same paristhiti ... prakruti pilustunna, mari flight lo enti ani nenupadda kastam... varnanateetam. Ade flight lo, flight take off avutune, mana train lo kante ekkuvaga janaalu, toilet ki seat ki tiragadam yekkuvayyindi.

Tindi daggara maatram ivanni varthinchavu ... :) mankistamochhinatlu laginchadame mana pani ... :D

ప్రతాప్ said...

నిజమేనండి.
మన హక్కులకు భంగం కలగనంతవరకు మనం బాధ్యతగా మెలగాల్సిందే.

Anonymous said...

చక్కగా చెప్పారు. ఇలాంటి పరిస్థితులు జీవితంలో చాలా మందికి ఎదురవుతుంటాయి.ఆత్మన్యూనతను కొన్ని పరిస్థితులు తారా స్థాయికి తీసుకెలతాయి కూడా.

మీ సైకాలజీ లెక్చరరు గారు చెప్పిన సంఘటన నిజంగానే అటువంటి పరిస్థితులో ఇరుక్కున్న వారికి చక్కగా వుపయొగ పడుతుంది. ఆత్మన్యూనతైనా, భయమైనా మన మనుసుకు సంబందించిన భావాలు, పాసిటివ్‌గా ఆలొచించడం ద్వారా అలాంటి వాటిని పోగొట్టుకోవచ్చన్న పాఠాన్ని ఆయన చక్కని వుదాహనతో చెప్పారు.

గీతాచార్య said...

ఇంత లైట్ గా ఎలా వ్రాశారబ్బా!!!??? :-)