Monday, October 13, 2008

చిరంజీవి Vs బాలకృష్ణ : ఒక ప్రేమ సంవాదం

బాలకృష్ణ తన ఫ్యాన్స్ తో చిరంజీవి గొప్పనటుడని చెప్పి ఒప్పించగలడా? అదేపని చిరంజీవిమాత్రం చెయ్యగలడా?
చఛ్చినా చెయ్యలేరు. కారణం, వారివారి ఆలోచనాధోరణులూ, పనిచేసే చిత్రాలు, నటించే విధానాలు, మేనరిజాలు, ప్రేక్షకులకు వారిపట్లుండే ఆశలూ, ఆశయాలూ వేరు..చాలా వేరు. బాలకృష్ణ అభిమానిని హఠాత్తుగా చిరంజీవిని ప్రేమించి, అభిమానించి సినిమాహాల్లో ఈలలేసి గోలచెయ్యమని చెప్పగలమా..ఇలా చెయ్యడానికి ఎవరికీ దమ్ములు చాలవు. ఎందుకంటే, అదంతే. ఆ విలువలూ, అభిమానం, ఉన్మాదం కాంప్రమైజ్ కొచ్చేవి కావు. చిన్నప్పటినుంచీ వాళ్ళునమ్మిన తారను, ఆరాధ్య నటుడ్ని త్యజించడం సులభంకాదు. దాదాపు అసాధ్యం కూడా!


అలాంటిది, తాము జీవితాంతం నమ్మి బ్రతికిన విలువల్ని త్యజించి, తమ ఇష్టానికి వ్యతిరేకంగా, ప్రేమించిన జంటని తల్లిదండ్రులు ఎందుకు ఆశీర్వదించాలి? నిరసించి తాటతియ్యకుండా ఎందుకు వదిలెయ్యాలి? మన సినిమాలూ, సాహిత్యం అన్నీ పెద్దలు ప్రేమలకు వ్యతిరేకమని చూపించి, వారిని కర్కోటకులుగా చూపినవే. చర్యల ప్రకారం వారు చేసేవి దుర్మార్గాలుగా అనిపించినా, "అవి వారికి తమ విలువలపట్ల వున్న నిబద్దతగా ఎందుకు చూడకూడదు?" అనేది నా ప్రశ్న. నమ్మిన సిద్ధాంతాలనూ, విలువలనూ,అభిప్రాయాలనూ, 'పిల్లలకు ఏది మంచో తమకు బాగా తెలుసు' అనే నమ్మకాన్నీ ఒక్కసారిగా విడనాడి విశాలహృదయంతో తల్లిదండ్రులు పిల్లల ప్రేమను ఎందుకు అంగీరించి ఆశీర్వదించాలి. అందుకే ప్రేమను వ్యతిరేకించే తల్లిదండ్రులంటే నాకు అమితమైన గౌరవం.


ఇక ప్రేమికుల సంగతి చూద్దాం.షర్టుకొనడానికీ, షూస్ కొనడానికీ, పరీక్షఫీజు కట్టడానికీ, మెస్ బిల్లు కట్టడానికీ తల్లిదండ్రులనుంచీ పర్మిషన్ తీసుకుంటారేగానీ, ప్రేమల వరకూ వచ్చేసరికీ వారిష్టం వారిది. ఒకరినొకరు ఇష్ట'పడిపోతారు', ఆరాధించేసుకుంటారు, అభిమానించి కలిసి జీవించేయ్యాలనే నిర్ణయాలకొచ్చేస్తారు. అప్పటిదాకా గుర్తురాని తల్లిదండ్రులు, "పెళ్ళి" అనే మాట వినబడగానే గుర్తుకొచ్చేస్తారు. "మా అమ్మానాన్నాల్ని అడిగి ఒప్పించవా శేఖర్!!!" అని బేలగా ఆ అమ్మాయి. "మన ఇరువురి తల్లిదండ్రుల అంగీకారంతోనే సగర్వంగా అందరి సమక్షంలో నీ మెడలో తాళికడతాను ప్రియా" అని సాహసంగా అబ్బాయీ చెప్పుకుని. బాలకృష్ణ అబిమానులకు చిరంజీవి గొప్పనటుడని చెప్పడానికి ప్రయత్నించే తరహాలో తల్లిదండ్రులకు తమ ప్రేమ గొప్పతనాన్ని చెప్పడానికి బయల్దేరుతారు.


ఆ తరువాత జరిగేది కొన్ని వందల సినిమాలలో చూసిన రొటీన్ తంతే. ఆవేశపడే తండ్రి, గుండెలు పగిలేలా ఏడ్చేతల్లి, అవకాశమిస్తే చంపైనా ఈ ప్రేమను అమరం చేస్తాననే (ఉంటే) అన్న, (లేకపోతే) బాబాయిలూ మామయ్యలూ. ఇలా అందరూ పేజీలకొద్దీ తాము పిల్లలకోసం చేసిన త్యాగాలూ,వంశప్రతిష్టలూ, కులగౌరవాలూ, వారికోసం కన్నకలల్నీ ఏకరువుపెట్టి, తమ నిబద్ధతని అధికారికంగా చాటుకుంటారు. ఒకవైపు అమ్మాయి హౌస్ అరెస్ట్, కమ్యూనికేషన్ కట్. మరో వైపు అబ్బాయి విరహాలు. వాడి ప్రేమబాధని మందుతోనో లేక లేచిపొయ్యే ఆలోచనలతో రెచ్చగొట్టి, ప్రేమావేశాన్ని శాంతింపజెసే స్నేహబృందాలు. ప్రేమకు వత్తాసుపలికే బలం లేని బామ్మలో, తాతయ్యలో ఎంచక్కాతయారయ్యి మంచి ట్రాజిక్ కామెడీ వెలగబెడుతూ ఉంటారు. అదేనండీ! ప్రేమికులకు ట్రాజెడీ మనకూ, చుట్టుపక్కలవారికీ మాత్రం కామెడీ.


నిజంగా, ఈ చిరంజీవి అభిమానులకు బాలకృష్ణ సినిమాను ఆదరించమనే తంతు అవసరమంటారా? పిల్లలు తమ ప్రేమల విషయం చెప్పి, తల్లిదండ్రులను ఒప్పించడం ముఖ్యమంటారా? నాకు మాత్రం ఇందులో అనవసరంగా సినిమా నిడివి పెంచి, జీవితాలలో డ్రమాటిక్ ఎఫెక్టి తీసురావడానికితప్ప ఈ తంతెప్పుడూ అసంబద్ధంగానే అనిపిస్తుంది. Diametrically opposite విలువలున్న తరాలు సహృదయంతో, ఎటువంటి బాధా, కోపం, నిరాశ, లేకుండా కాంప్రమైజ్ కు ఎలా వస్తారు? ఎందుకురావాలి? అలావస్తే, వారుతమ జీవిత విలువల్ని "తూచ్!" అని ఒక్క క్షణంలో త్యజించినట్టేకదా ! అది నిజంగా అవసరమా?


ప్రేమించడానికి అఖ్ఖరలేని పెద్దల పర్మిషన్/ఆశీర్వాదం పెళ్ళికెందుకు కావాలి? అంటే, ఈ ప్రేమించే తరానికి ఎప్పుడూ తమ విలువలపట్ల నమ్మకమూ, నిబద్ధతా లేవన్నమాటే! ప్రేమించే ఆవేశమేతప్ప, జంటగా కలిసి బతకాలని సొంతంగా నిర్ణయం తీసుకునే సాధికారత లేదన్నమాట. ఇలాంటి వాళ్ళకు నిజంగా ప్రేమ అవసరమా? అటు తమ పైత్యాలకు పర్మిషనడిగి పెద్దలను అడకత్తెరలో పోకల్నిచెయ్యడం, ఇటు తమ జీవితాల్ని కొంతకాలం నరకప్రాయం చెసుకోవడం వల్ల వీరు సాధించేదేమిటో నాకు అర్థం కాదు.


ఇదేమాట ఒక ప్రేమికుడిని అడిగితే, "ప్రేమంట ఇద్దరు వ్యక్తులు ఇష్టపడటం, పెళ్ళంటే రెండుకుటుంబాల కలయిక కదా! అందుకే, మొదటిదాంట్లో తల్లిదండ్రులు అవసరం లేదు, రెండోదానికి వాళ్ళందరూ కావాలి" అని వేదాంతం ఒలకబొసాడు. "అహా! అలాగా!! అయితే, తల్లిదండ్రులకు తెలీకుండా నీకిష్టమైన అమ్మాయిని కేవలం ప్రేమించు. ఆ తరువాత మీ కుటుంబంకోసం, వారు చూపించిన అమ్మాయిని పెళ్ళిచేసుకో. రెండూ బ్యాలన్సైపోతాయి" అని చెబితే మౌత్ లో సౌండ్ రాలేదు.ఎందుకురా ఈ నాటకాలంటే, "కుటుంబం సపోర్ట్ లేకపోతే పెళ్ళి తరువాత నానాకష్టాలూ పడాల్సివస్తుంది మిత్రమా" అంటూ అసలు నిజాలు బయటపెట్టాడు. బాగోగులు చూడ్డానికీ, కడుపులకీ, పురుళ్ళకీ, ఫంక్షన్లకీ, పిల్లల పెంపకానికీ ఇతరత్రా అవసరాలకి ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. బరితెగించి ఇష్టమొచ్చినట్లు పెళ్ళిచెసుకుంటే ఈ సుఖాలన్నీ కాదనుకున్నట్లే అని దేవరహస్యం ఏకరువయ్యింది.


"మరి తల్లిదండ్రులపై ప్రేమ సంగతో!" అంటే, "తల్లిదండ్రులు మనపై అధికారం ఉందని ఎలా అనుకుంటారొ, మనకూ వారిపట్ల బాధ్యత మాత్రమే ఉందనుకుంటే సరిపోతుంది. ఎంతైనా పెళ్ళైన తరువాత మనం మనస్ఫూర్తిగా ప్రేమించాల్సింది పెళ్ళాన్నేకదా!" అని నాకే జ్ఞానోదయం కల్పించాడు. ఆలోచించడానికి కొంత ఇబ్బందిగా ఉంటుందిగానీ, బహుశా నిజంకూడా ఇదేనేమో! అంటే, తల్లిదండ్రుల ఆశీర్వాదం పేరుతో ఈ ప్రేమికులకి కావలసింది అవసరాలకు ఫ్యామిలీ అందించే సపోర్టేతప్ప, మరోటి కాదు. అందుకే, ప్రేమిస్తున్నప్పుడు అవసరం లేని తల్లిదండ్రులు పెళ్ళికి అర్జంటుగా కావలసివస్తారు.


ఫ్యామిలీ నెట్వర్క్ లో లభించే సెక్యూరిటీ కోసం, స్వతంత్రించి ప్రేమించినా ఆ నిబద్ధతని గాలికొదిలి, పెళ్ళికోసం మాత్రం పర్మిషనడిగే ప్రేమికులకన్నా, ప్రేమల్ని మనస్ఫూర్తిగా తమ విలువల్ని అనుసరించి నిరసించే పెద్దలపక్షమే నేనూ. అయితేగియితే, ప్రేమికులు ప్రేమతొపాటూ పెళ్ళీ ఇష్టానుసారం చేసుకోవాలేగానీ, చిరంజీవి అభిమానిని బాలకృష్ణ ఫోటోను పూజించమని చెప్పినట్లు, ఒప్పుకోరని తెలిసినా, పెద్దల అంగిక్లారం, ఆశీర్వాదంకోసం దేబరించడం ఎందుకూ!!!! ఇరుపక్షాలవారూ క్షోభపడటం ఎందుకూ...కేవలం ఆ తరువాత ఉత్పన్నమయ్యే "అవసరాల" కోసమేనా! ధైర్యం లేని ప్రేమలు, భవిష్యత్తు సుఖాలకోసం నమ్మకాల్ని త్యజించే ప్రేమలంటే ఇవే. వీళ్ళేనా మన ప్రేమికులు? వీరివా పవిత్ర ప్రేమలు?


*****

30 comments:

Ramani Rao said...

సినిమా హీరోల పై ఉండే అభిమానానికి, ప్రేమజంటల అభిమానాన్ని బేరీజు వేయడం మీకే చెల్లిందనిపిస్తోంది. అది తళుకు ప్రపంచం,ఇది ఆకర్షణ ప్రపంచం. మామూలు అభిమానిని(బాలకృష్ణ అభిమాని అయినా/చిరంజీవి అభిమాని అయినా) తీసుకొచ్చి "బాబ్బాబు! నీకు ఇప్పటికప్పుడు ఓ లక్ష రూపాయలిస్తాను నువ్వొకసారి నీ హీరో కి కాక మా హీరోకి జై కొట్టు " అంటే డబ్బు కోసమైనా కొడ్తాడు. డబ్బుకి అభిమానులు దాసోహం. ప్రేమ అంతేనంటారా?? దానికి, దీనికి ముడి పెట్టారు?? వీరాభిమానులైతే చెప్పలేము .

Kathi Mahesh Kumar said...

@రమణి: ఇక్కడ పోలిక అభిమానం -ప్రేమల మధ్యన కాదు. ఎప్పటికీ కలవని భిన్న ధృక్పధాల మధ్య, తరాల అంతరాల మధ్య.ఆలోచనాధోరణులూ,ఆశయాలూ,విలువలూ విపరీతమైనప్పుడు "అంగీకారం" కోసం ప్రాకులాడ్డం వృధా అని మాత్రమే ఉద్దేశం. దయచేసి కాస్త inbetween lines కూడా చూడండి.

Anonymous said...

తల్లిదండ్రుల అనుమతి అడిగిన వాళ్ళందరూ ఇదే ఉద్దేశ్యంతో అడగరు. ఒక్కసారిగా తల్లిదండ్రులతో ఉన్న రిలేషన్షిప్ని వదులుకోలేక అడుగుతారు. కొన్నాళ్ళు ఎదురుచూస్తే తల్లిదండ్రులను వదులుకునే పరిస్థితి తప్పుతుంది కదా అని. ఏమో పేరెంట్స్ ఒప్పుకోవచ్చేమోనన్న ఆశ. కొన్నిసార్లు ఒప్పించటంలో విజయం కూడా సాధిస్తారు.
మా పెళ్ళికి ముందు రొటీన్ గానే మా మమ్మీ కూడా మా హజ్బెండ్ గురించి కనీసం అడగకుండానే వేరే కులం అని మాత్రం తెలుసుకొని కుదరదని చెప్పేసారు. మా డాడీ వెంటనే ఒప్పేసుకున్నారు. మా మమ్మీ ఒప్పుకోటానికి కొంత కాలం పట్టింది. అప్పుడు మా హజ్బెండ్ మంచతను అని చెప్పటానికి కష్టపడ్డాను. ఇప్పుడు అంత మంచతను కాదు అని చెప్పటానికి కష్టపడుతున్నాను. వాళ్ళకు అతనంటేనే అంత నమ్మకం.
వాళ్ళు ఒప్పుకుంటారో, లేదో అని ఆలోచించుకుని ప్రేమించటం సాధ్యమేనంటారా?

సత్యసాయి కొవ్వలి Satyasai said...

చాలామంచి టాపిక్ పై సరియైన విశ్లేషణ. ఈమధ్య పెళ్ళైన వాళ్ళని పెళ్ళి చేసుకునే పోకడెక్కువైంది. కాదంటే లేచిపోవడమో, చచ్చిపోవడమో చేస్తారని భయపడి తల్లిదండ్రులు ఏం చేయలేకపోతున్నారు. ఆడపిల్లలు మరీ బరితెగిస్తున్నారు. చదువుకున్న, ఉద్యోగం చేస్తున్న వాళ్ళూ ఇదే తంతు. ఇదికూడా సినీహీరోయిన్లని అనుకరించడమేమో.

బాటసారి said...

@ మహేష్

ముందుగా బొమ్మ బాగుంది.

మీరు ప్రేమని మీకు తెలిసో తెలియకుండానో ఎలివేట్ చేసి చూపించారు. అదొక ఆదర్శం అయినట్టు, అది " అవసరం " అనే ప్రాధమిక విషయం కన్నా ముఖ్యమైనది అయినట్టు. ఆ అనుకోలుతోనే మీరు పెద్దలు ఉండే కుటుంబం వల్ల కలిగే ప్రయోజనాలని రాసారే కానీ, పెద్దలను వ్యతిరేకించే జంటలు చేసుకోవాలనే పెళ్ళిళ్ళలో ఉండే ప్రయోజనాలని వారి అవసరాలని రాయలేదు...

ఏదో కొన్ని అంశాల ప్రాతిపదికన మీరు ప్రేమని, పెళ్ళి గురించి రాసెయ్యడం చాలా అసంపూర్ణంగా, పరిణితి లోపించినట్టు ఉంది. ఇంక మిగిలిన అభిమానుల పోలిక అనవసరమైనది.

Anil Dasari said...

మొత్తానికి ప్రేమించినవారు తల్లిదండ్రులని లెక్కచేయకుండా పెళ్లి చేసుకోవలనే సందేశమిచ్చారు. నాది నో కామెంట్.

Unknown said...

ప్రేమ గురించి పెద్దలకు చెప్పకపోవడానికి కారణాలనేకం
1. పెద్దలంటే భయం కావచ్చు
2. పెద్దలతో సరైన సాన్నిహిత్యం ఉండకపోవచ్చు
3. మన సమాజ పోకడ అతి పెద్ద కారణం
ఉదాహరణ,
ఒక అమ్మాయితో మాట్లాడగానే అది ప్రేమ అని అందరూ వేసే గుడ్డి ముద్ర (నేను స్వయంగా చాలా అనుభవించాను)
4. ప్రేమకు ఆకర్షణకు తేడా తెలియకపోవటం
5. శృంగారమంటే తప్పుగా భావించే మన సమాజంలో శృంగారపరమైన ఆకర్షణతో మొదలయ్యే టీనేజి ప్రేమ కధలు ఇంటిలో ఎలా చెప్తారు ?

చివరగా మరో మాట,మంచి నటనను అనేది ఎవరి అభిమాని అయినా అభినందించవల్సిందే. ఒక వేళ అలా అంగీకరించని పక్షంలో వారి మెదడు ఇంకా పెరగలేదనే అర్ధం. లేదా వారిలో విశాల దృక్పధం లేదని

నటనకు కొలమానం ఉంది. మరి ప్రేమకు కొలమానం ఏది?

మీ పోలిక ఎలా ఉంది అంటే, ఒక సెలయేరుని జీవనదితో పోల్చినట్టుంది. రెండింటిలోనూ మంచి నీరు ఉంటుంది అంతే వాటి పోలిక అంతే.. అంతకు మించి వెళ్ళలేరు.

ఇసుక రేణువుతో ఎడారి మొత్తాన్ని పోల్చకండి.

సుజాత వేల్పూరి said...

"ప్రేమించుకోడానికి రెండు మనసులు చాలు, పెళ్ళాడ్డానికి మాత్రం రెండు కుటుంబాలు కావాలి" అనే చెత్త డైలాగు సంతోషం సినిమా లోదని గుర్తు! పెళ్ళాడ్డానికి రెండు కుటుంబాలు తప్పని సరి కాదు. అందుకని అసలు తల్లి దండ్రులకు చెప్పకుండా పెళ్ళి చేసేసుకోమంటారా? మన జీవితాల్లో వాళ్ల పాత్ర ఏమీ లేదా? ఇరవై+ఏళ్ళు పెంచిన వాళ్ళకు మనకూ మధ్య 'కేవలం బాధ్యత ' తప్ప ఇంకే రకమైనా మానసిక సంబంధం ఉండదా? తరాల మధ్య అంతరం తప్పని సరి. అందు చేత మనతో విభేదించే తల్లిదండ్రులని పక్కకు విసిరేసి వెళ్ళి పోవడం మనుషులు చేయాల్సిన పని కాదు. పరిస్థితి తీవ్రమైతే "పొండెహె, ఎంత చక్కగా బతికి చూపిస్తామో చూడండి" అని చాలెంజ్ చేసి మరీ వెళ్ళి పెళ్ళాడే వ్యక్తిత్వం ముందు ప్రేమికులిద్దరిలో ఉండాలి. అది ముఖ్యం!

వాళ్ళేదో పురుళ్ళు పోస్తారనో, పిల్లలని పెంచుతారనే దృష్టితోనో "ఫామిలీ సపోర్ట్ కోరుకుంటూ అనుమతి కోరడం" అనే భావన దుస్సహంగా ఉంది. మనకిష్టమైన వారిని పెళ్ళాడ్డం ద్వారా మనకు లభించే సంతోషంలో మన తల్లి దండ్రులు కూడా పాలు పంచుకోవడం అనే ఒకే ఒక్క కోరికతో తల్లిదండ్రుల ప్రమేయాన్ని కోరుకునే జంటలెవరూ లేరా? తటస్థపడలేదా?

కేవలం 'అవసరాల " మీద ఆధారపడి నడిచే కుటుంబాలు కాక, బలమైన అనుబంధాలున్న కుటుంబాలు కూడా సమాజంలో ఉన్నాయని గుర్తించాలి మీరు.ఇలాంటి కుటుంబాల్లో పిల్లలు అంత త్వరగా తల్లిదండ్రులతో బంధాలు తెంచేసుకుని పోలేరు.

"పెళ్లయ్యాక నిజంగా ప్రేమించాల్సింది భార్యనే కదా, తల్లి దండ్రులపై కేవలం బాధ్యతే ఉందనుకుంటే సరి పోతుంది" అని మీకు జ్ఞానోదయం కలిగించిన ఆ ప్రేమికుడికి గట్టి కౌన్సిలింగ్ అవసరమనిపిస్తోంది.

"ఆలోచించడానికి ఇబ్బందిగా ఉండొచ్చు గానీ బహుశా నిజం కూడా అదేనేమో"....ఇబ్బందిగా కాదు, దిగ్భ్రాంతిగా ఉంది! పెళ్ళి అంటూ జరిగాక తల్లిదండ్రులు జీవితాల్లోంచి ఫేడౌట్ ఐపోవాలన్నమాట!

"ఆశీర్వాదం" అనే మాట ఒట్టి సెంటిమెంటు! అది వదిలెయ్యండి! పెద్దల అంగీకారం తీసుకోవడం(వాళ్ళొప్పుకోకపోతే వెళ్ళిపోయి పెళ్ళాడే ధైర్యం ఉండాలని ముందే చెప్పాను)అనేది ప్రేమ వివాహల్లో తప్పేమీ కాదు! పెళ్ళి కోసం అర్జెంటుగా తల్లి దండ్రుల్ని శత్రువులుగా చూడాల్సిన అవసరమూ లేదు.

సరే, పవిత్ర ప్రేమ అంటే ఏమిటో చెప్పండి! తెలుసుకోవాలని ఉంది!

Note: నా గెలుపు జ్ఞాపకం టపాకీ ఈ కామెంట్ కీ సంబంధం లేదు.

Kathi Mahesh Kumar said...

@భవాని: అందరూ అలాగే చేస్తారు అనడం నా ఉద్దేశం కాదు. ఇలాంటిది జరిగింది...ఇంకా ఎన్నో జరిగుండొచ్చు అని మాత్రమే నా సూచన.తల్లిదండ్రులతో ఉన్న రిలేషన్షిప్ వదులుకోకూడదు అన్న ఆదర్శంగల వ్యక్తులు ‘చాటుగా’ప్రేమించొచ్చా?

ఇక ‘ఆశ’ సంగతిలో నాకు మీకన్నా రివర్స్ అనుభవం ఉంది. మావాడు/మా అమ్మాయి మాత్రం ప్రేమలోపడడు/దు అనే పిచ్చి నమ్మకం/ఆశ తల్లిదండ్రులకి. మా అమ్మానాన్నా నా ప్రేమని ఒప్పేసుకుంటారనే వెర్రి నమ్మకం/ఆశ పిల్లలది. రెండూ మూర్ఖత్వాలే.

తల్లిదండ్రులు ఒప్పుకుంటారో లేదో అని ఆలోచించకుండా ప్రేమించినప్పుడు, మళ్ళీ వారిని బాధపెట్టిమరీ అన్యమనస్కంగా ఒప్పించే ప్రయత్నం ఎందుకు? నీ ప్రేమ నిర్ణయం నువ్వు తీసుకున్నట్లు పెళ్ళినిర్ణయమూ తీసుకుని సగౌరవంగా తల్లిదండ్రులని ఆహ్వానించక! అనేదే నా పాయింటు.

@సత్యసాయి కొవ్వలి:మీ అభినందనకు నెనర్లు. మీరు నా మూల ఉద్దేశాన్ని కొంచెం మిస్ అయినట్టున్నారు.

@బాటసారి: బాటసారిగారూ ప్రేమ ఒక అవసరం అన్నది నేనూ నమ్ముతాను. కానీ ఇదేమాట నేనంటే ఒకానొకప్పుడు నా మీద విరుచుకుపడటం జరిగింది. అందుకే ఈ రివర్స్ డ్రామా ఆడుతున్నాను.నేను చెబుతున్నది ప్రేమించే దమ్మున్నప్పుడు పెళ్ళీ అదే నమ్మకంతో చేసేసుకోమనే! పర్మిషన్ పేరుతో మళ్ళీ కన్వీనియంట్గా సాధారణ సమాజంలో భాగమైపోవద్దనే!!

నేను చెప్పింది నాకు తెలిసిన ఒక ఘటన గురించి. ఇదే ప్రపంచం మొత్తం జరుగుతోందని కాదుకదా? అలాంటప్పుడు అసమగ్రంగా, పరిణితి లోపించినట్టుగానే ఉంటుంది. ఇక పోలికంటారా...ఇదే పోలికని మీరు నిజజీవితంలో ఉపయోగించి తరువాత దాని అసంబద్ధతని తేల్చండి. ఈ మధ్య ప్రజలకు రాజకీయ లేక సినిమా పరిభాషలో చెబితేనే బాగా అర్థమవుతుంది.

@అబ్రకదబ్ర: నేను ఎంత తిరకాసుపెట్టి చెప్పినా మూల బిందువుని ఇట్టేపట్టేస్తారు మీరు. మీ "నోకామెంట్"కి ధన్యవాదాలు.

@మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్: మీరు బాహ్యకారణాలను భేషుగ్గా గుర్తించారు. నా అభినందనలు. వాటితోపాటూ "వారి విలువలపై వారికున్న ఒక బలమైన నమ్మకం" త్యజించలేకపోవడం సమస్యలకి మూలకారణంగా నాకు తోచింది. ఈ టపా దానిగురించే రాసాను.
మీరు నటన గురించి చెప్పిన విశాలధృక్పధం మనలో మనుషుల విషయంలో, మానవ సంబంధాలలో కూడా లేదనేదే నా పాయింటూను.

నా ఉద్దేశంలో నటనకూ ప్రేమకూ రెంటికీ కొలమానాలు లేవు. చివర్లో మీరు చెప్పిన పోలికనాకు నచ్చినా, దానికి ప్రతిగా ఒక చిన్న విషయం చెబుతాను,Individual is the basis for an entire society. ఇసుకరేణువు సాంకేతిక కాంబినేషన్ తెలిస్తే ఎడారి లక్షణాల్ని చెప్పొచ్చు. ఇదీ అంతేకాకూడదా! అయినా ఈ టపా మొత్తం సమాజానికి ప్రతీక కాదులెండి. కొందరికి మాత్రం ఖచ్చితంగా ఈ అనుభవాలు, ఇలాంటి వ్యక్తులు తారసపడుంటారని నా నమ్మకం.

Anonymous said...

తల్లిదండ్రులు క్లబ్ చేసి చూసినట్లే మీరు కూడా మీ మొదటి పాయింట్ లో చూస్తున్నారేమో అనిపిస్తుంది. నా దృష్టిలో నేను ప్రేమించటానికి, నా తల్లిదండ్రులను వదులుకోలేకపోటానికీ సంబంధం లేదు. పేరంట్స్ అలా క్లబ్ చేసి చూస్తారు. అందుకని వాళ్ళను ఒప్పించే కనీస ప్రయత్నం చేయటం తప్పు కాదు కదా.
అంతగా ఒప్పుకోకుండా పిచ్చి రిస్ట్రిక్షన్స్ పెడితే అప్పుడు ఇంకా వాళ్ళని ఒప్పించడానికి ట్రై చేయకూడదు. నేనొప్పుకుంటాను. కానీ వాళ్ళకి అర్ధమయ్యేలా చెప్పటానికి కనీస ప్రయత్నం చెయ్యాలి.
ప్రేమ ఎంత అవసరమైనా, అంత కంటే ఎక్కువ కాకపోయినా "ఫీజిబిలిటీ" చూసుకున్నాక మాత్రమే పడాలనటం సమంజసమేనా.
Donno how far this would be convincing. Everytime we encounter something new in life, especially that is socially not so acceptable we tend to oppose it. But if we think it is really important for us to overcome that obstacle we do that though after taking sometime or we may just end up not doing it. Parents do need some time to come out of such self-imposed as well as socially imposed predicaments. It's just a matter of time.
If they still persist and forcefully compel children to be compliant with their opinions then they deserve to be abandoned. Otherwise still they need to be convinced.

Kathi Mahesh Kumar said...

@సుజాత: నేను గట్టిమానసిక సంబంధం లేని మెజారిటీ కుటుంబాలలోని తల్లిదండ్రుల గురించి చెబుతున్నాను.వీరిమధ్య తరాల అంతరాలుకాదుకదా, లోయలున్నాయి. అటువంటి పక్షంలో, కాదంటారని అంతకుమించి తీవ్రంగా విభేధించి సాధిస్తారని తెలిసీ, లేని సమస్యను తెచ్చిపెట్టుకుని ఇరుపక్షాలవారూ బాధపడొద్దనే చెబుతున్నాను.

మీరు చెప్పినజంటలు నాకు తారసపడలేదని చెప్పడం లేదు. ఇలాంటి జంటలు కూడా ఉన్నారని తెలియజెప్పడం మాత్రమే నా ఉద్దేశం. Both are real.

చాలావరకూ సాంప్రదాయక వివాహాల్లో కలతలు ఈ ఇద్దరి సంసారంలో వారి తల్లిదండ్రులు అధికారం చెలాయించబూనడంతో జరుగుతాయని ప్రత్యేకించి చెప్పఖ్ఖరలేదనుకుంటాను. అలాంటప్పుడు "నా సంసారం" అనే ఒక ఆరోగ్యకరమైన గీత తల్లిదండ్రులకూ పిల్లలకూ మధ్య ఎంతైనా అవసరం. అంటే, ఇక్కడ ప్రేమ తగ్గిందనికాదు. కేవలం ప్రేమ స్వరూపం మారిందనిమాత్రమే. కాస్త కటువుగా చెప్పినా నామితృడి ఉద్దేశం అదేనేమో! అని నేను భావించాను. ఈ విషయంపై మరో సారి చర్చించాలి!!

పెళ్ళికోసం తల్లిదండ్రుల్ని శతృవుల్లాగా పిల్లలు చూడ్డం లేదు.పెద్దలే తమ విలువల నుంచీ బయటపడలేక విలన్లౌతున్నారు. నేను చెప్పేదల్లా, ఇద్దరిదీ తప్పులేదు. అలాంటప్పుడు permission తీసుకుని పెళ్ళిచేసుకోవడంకన్నా,ధైర్యంగా inform చేసి, invite చేసి పెళ్ళిచేసుకోమంటున్నాను.

నేను పైపాయింటునే కాస్త డొంకతిరుగుడుగా చెప్పడానికి ప్రయత్నించాను.

నేను పవిత్రప్రేమ గురించి చెప్పడంకన్నా, నేను రాసిన "వ్యక్తిగతస్వేచ్చ -సమాజ శ్రేయస్సు" టపాలో మహామహులు నాతో విభేధించి చెప్పిన నిర్వచనాల్ని క్రోడికరించడం మంచిదనుకుంటాను.

శ్రీను said...

ఒక పది మంది వ్యక్తులుంటే వారిలో ఏ ఇద్దరి అభిప్రాయాలైనా ఒకే విధంగా ఉంటాయని చెప్పలేం.ఒకొక్కరి అలోచనా విధానం ఒకోలా ఉంటుంది.అందువల్ల ఇటువంటి విషయాలలో అందరి వ్యాఖ్యలు సరియైనవే,వారి ఆలోచనలు,అనుభవాల ఆధారంగా.

Ramani Rao said...

మహేష్ గారు: యిన్ బిట్వీన్ ది లైన్స్ కాదు, పదం పదం చదివాను. ఇప్పుడిక్కడ ఈ టపా కి సందర్భం లేకుండా వ్యాఖ్య రాస్తునందుకు మన్నించండి. తప్పదు, ఎప్పటినుండో రాద్దామనుకొంటున్నా, ఇప్పుడొద్దులే అని వాయిదా వేయడం జరుగుతోంది.

నేను బ్లాగు మొదలుపెట్టినప్పుడు అంతో ఇంతో కాస్త నాకు తెలివి ఉందనే భ్రమలోనే ఉన్నా నిన్న మొన్న మీ బ్లాగు మొదలుపెట్టేదాక, మీరు మొట్టమొదటిగా ఏమి రాసారో నాకు తెలీదు కాని, మొట్ట మొదట నేను చదివనది మటుకు "బండి కాదు మొండి ఇది సాయం పట్టండి" అంటూ రాసిన టపా. అది చదివనప్పుడే కళ్ళు గిర్రున తిరిగాయి, ఆ లెక్కలు అవి చదివి. ఆ తరువాతనుండీ ప్రతి రోజు అనేకకన్నా, ప్రతి పూట మీరు రాసే ప్రతి ఒక్క టపా చదువుతూనే ఉన్నా. భాష పట్టు, భావ ప్రకటన మీ సొంతం అనుకొనేదాన్ని. అన్ని అవార్డు సిన్మాల్ల అలవోకగా, అశువుగా, అరడజన్ పేజీలు రాసేయ్యగలిగే ప్రావీణ్యత మీ సొంతం. వింత ఏంటంటే ప్రతి ఒక్కటి అర్ధం చేసుకోడానికి ప్రయతించేలోపే ఇంకో టపా ప్రత్యక్షం [ఇప్పుడు కాస్త ఆ జోరు తగ్గినట్లుంది :) ]. అప్పుడనిపించింది నేనింత తెలివి తక్కువదాన్నా , నాకు భాష తెలియడంలేదేంటి అని? అంతకన్నా ఎక్కువ హాశ్చర్యపోయింది మీ టపాకి వచ్చే వ్యాఖ్యలు. ఏంటో అవి చదివిన తరువాతైనా అర్ధం అవుతుందోమో అని ట్రై చేసాను. నాకెందుకో అందులో చాలా మటుకు "అమ్మో ఇంత భాషా ప్రావీణ్యులకి వ్యాఖ్య రాయకపోతే మనకి భాష పట్టు లేదనుకొంటారేమో" అని తప్పక రాసినట్లుగా ఉంటుంది. అదీ మీ నైపుణ్యతే అని చెప్పొచ్చు. అసలు వ్యాఖ్య రాసే అవకాశం ఇవ్వరు అంత క్షణాలమీద టపాలు ఎలా రాయగలరు మీరు??

ఇద్దరి శరీరాలు కలవాడానికి ప్రీప్లాండ్ పెళ్ళి అనే బంధం అవసరం లేదు , అదో ప్రేమైక భావన, మధురానుభూతి అన్న భావనని మీదైన భావుకత శైలిలో చెప్పి వప్పించిన మీ నేర్పరితనం, ఇప్పుడు పెళ్ళికి కావాల్సింది రెండు ప్రేమించే హృదయాలే కాని , రెండు కుటుంబాలు అవసరం అనేది ఓ తొక్కలో డైలాగ్ అని అనిపించగలిగారంటే నిజంగా మీకు మరోసారి రెండు చేతులెత్తి వందనం చేయకుండా ఉండలేకపొతున్నాను. మీరు కనక ఏ దేశానికో రాజయి ఉంటే, ప్రజలని మీ వైపు తిప్పుకొని, మీరు చెప్పినదే వేదం అని చెప్పించగలిగే నైపుణ్యం మీకుంది. నేనింకా గర్వించతగ్గ విషయం మీకు మా మహిళా బ్లాగర్లే అభిమానులుగా ఉండడం మాకందరికీ స్పూర్తిదాయకం. :)

Anonymous said...

@మహేష్ కుమార్ గారు,
"permission తీసుకుని పెళ్ళిచేసుకోవడంకన్నా, ధైర్యంగా inform చేసి,invite చేసి పెళ్ళిచేసుకోమంటున్నాను."

మీరన్నట్లు ధైర్యంగా పెళ్ళి చేసుకుంటే తల్లిదండ్రులు బాధపడరని మీరనుకుంటున్నారా?

ఇలా inform చెసి invite చేసినప్పుడు తల్లి దండ్రులు ఆ పెళ్ళికి వచ్చారనుకో అప్పుడేమంటారు.

1. మాతో ముందే చెప్పి వుంటే ఈ పెళ్ళి ఘనంగా చేసేవాళ్ళం కదా అంటారు (బాధపడుతూనే).
2. ఆ పెళ్ళిని ఆపడానికి ప్రయత్నిస్తారు.
3. ఇంటి గడప తొక్క వద్దంటారు.

యువతీ, యువకులు ధైర్యంగా పెళ్ళిచేసుకోలేక కాదు. అలా చేసుకొని వాళ్ళు ఎక్కడికో ఒకచోటికి వెళ్ళి ఎదో ఒకవిధంగా బ్రతికేయగలరు.

తల్లిదండ్రులు మాత్రం వున్న ఊరినీ, ఇంటినీ వదలలేక ఊర్లో వాళ్ళు అనే మాటలన్నీ పడుతూ
జీవితాంతం బాధపడుతుంటారు.

ఇలా తల్లిదండ్రులను బాధపెట్టడం ఇష్టం లేకనే చాలామంది యువతీ, యువకులు పెళ్ళి విషయం వచ్చే సరికి తల్లిదండ్రులకు చెప్పి, ఒప్పించి చేసుకోవాలనుకుంటారు. అంతే కాని వాళ్ళతో ఎదో అవసరముంటుందని కాదు.

ఇప్పటికీ చాలామంది యువతీ, యువకులు తల్లిదండ్రులను బాధపెట్టడం ఇష్టం లేక, ప్రేమలకు దూరంగా వుంటున్నారు తెలుసా.

ఇంకొకటి "ప్రేమని వ్యతిరేకించే పెద్దల పక్షాన వుంటానని" అన్నారు మీరు.

తల్లిదండ్రులైనా తమ కొడుకు/కూతురి ని చివరికి ఏదో ఒక అపరిచితురాలు/అపరిచితుడు తో పెళ్ళి చేసెస్తారు కదా.

అలాంటప్పుడు ఏ అపరిచితుడు/అపరిచితురాలి కో ఇచ్చి చేసే బదులు, పిల్లలకు నచ్చిన వాళ్ళతోనే చేయవచ్చు కదా.

పిల్లల సంతోషమే తమ సంతోషం అని చెప్పుకునే తల్లిదండ్రులు పిల్లల పెళ్ళి విషయంలో ఎందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు?


దీనికి కులం, ఆస్థి అంతస్తులలో తేడా అని సమాధానం చెప్పకండి.

Anonymous said...

అయ్యా మహేశా ... నిజం గా ఒకరిని ఒకరు ఇష్టపడి, అభిప్రాయాలు కల్సి,అభిరుచులు కల్సి, జీవితం పంచుకోవాలి అనుకునే వాళ్ళు ( ఇంట్లో నచ్చావు ఇలాంటివి అని తెల్సిన వాళ్ళు, వాళ్ళతో సత్సంబంధం కలిగి ఉండే వాళ్ళు) ఒక మనిషి ని చూడగానే, ప్రేమ, పెళ్లి అని ప్లాన్స్ వేస్కోరు ! అలా జరిగిపోతుంది అంతే, స్నేహం ప్రేమ గా రూపాంతరం చెంది, వాళ్ళతో జీవితం పంచుకోవాలి అనిపించోచు కదా ? ప్రేమకి , శారీరిక సంబంధమే unplanned గా అలా జరిగిపోతుంది అంతే...అని చెప్పే మీరు, హృదయాల కలయిక మాత్రం అందుకు అతీతం అని ఎందుకు అనుకుంటున్నారో ? దానికి ముందు, పెద్ద వాళ్ళ మద్దతు అని ఎందుకు ఆలోచించాలో ? సమాజం అంగీకరించని శారీరిక సంబంధాలు , సమాజం లోనే ఉంటూ ... గొప్ప అనుభూతులని అనుకునే వాళ్ళు,ఆలోచించకుండా భావుకత లో చేసి... సమాజం లో ఎందుకు ఉండటం ? ఏ అడవికో పరిపోవచు గా ? ( మాకు ఈ పెద్ద వాళ్ళు అక్కర్లేదు అని సొంతంగా ఇంట్లో వాళ్ళ support చూడకుండా పెళ్లి చేస్కోవాలి అని మీరు అన్నట్టు ) ... సమాజం లో ఇలాంటి అనిర్వచనీయ అనుభూతులని అర్థం చేస్కోలేని ఈ హీన ? సమాజం నుంచి, ఒక అడవికి వెళ్ళిపోయి ... ఇష్టపడ్డ వాళ్ళతో నిరభ్యమ్తరం గా, గొప్ప అనిర్వచనీయ అనుభూతులని అస్వాదిన్చోచు? కాని సమాజం లోనే ఉంటూ, సమాజం మేచ్చట్లేదు అని బాధ పడే బదులు ....

ఎలా అయితే ఈ అనిర్వచనీయ అనుభూతులని కావాలని అనుకునే గొప్ప భావుకులు...సమాజాన్ని వదులుకోలేరో, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తల్లి తండ్రులని, అది అవసరానికి కావొచ్చు, కృతజ్ఞత కవోచు, లేక మంచి బంధం కావొచ్చు, ఏదైనా సరే...ప్రేమికులు వదుకొలెరెమొ ? ఆలోచించండి ?

Kathi Mahesh Kumar said...

@నాగప్రసాద్: సమస్య ఇక్కడ తల్లిదండ్రులు బాధపడటం మాత్రమే కాదు.విలువల ఘర్షణతో వారు పడే మానసిక వ్యధనుకూడా పరిగణలోకి తీసుకోవాలన్నదే నా మనవి.

పెళ్ళినిర్ణయమయ్యాక తెలిస్తే వారికి కొంత షాక్ తగిలినా, రాజీపడాలనే నిర్ణయానికొచ్చిన తరువాత షాక్ అబ్జార్బర్స్ వాటంతకవే ఏర్పడతాయి. కానీ వారే పెళ్ళినిర్ణయం చెయ్యాలంటే వారు త్యజించాల్సిన baggage is much more and needs far greater strength. Causes much more trauma.దాన్ని avoid చెయ్యగలిగితే అంతకుమించిన సుఖం మరోటి ఉండదేమో! ఆక్షణంలో కలిగే షాక్ కన్నా, a prolonged pain resulting out of conflicting values బాధాకరం అని నా అభిప్రాయం.

తల్లిదండ్రులు ఇలా జరిగాక జీవితాంతం బాధపడరు. ఈ విషయం నాకు ఖచ్చితంగా తెలుసు. ఇక ఊర్లోవాళ్ళ మాటలంటారా..అవి లేని దెప్పుడు?

పిల్లల ప్రేమ విషయంలో తల్లిదండ్రులు వ్యతిరేకించడానికి మూలకారణం వారు బ్రతికిన విలువలూ,నమ్మకాలూ ప్రేమకు అనుకూలంగా ఉండకపోవడం. అందుకే వారి నమ్మకాలు మన నమ్మకాలు కానప్పుడు, ఇద్దరి నమ్మకాలూ కరెక్టే అనిపించినప్పుడు ఈ ఘర్షణ అవసరమా? అని అడిగాను.

@ఆదిత్య:అడవికి వెళ్ళకుండానే సమాజంలో స్వేచ్చగా మనైష్టమొచ్చినట్లు బ్రతికే అవకాశం ఉన్నప్పుడు అలా చెయ్యాల్సిన అవసరం లేదనెదే నా అభిప్రాయం. సమాజం నిజంగా మనం అనుకునేంత ప్రమాదకరమేమీ కాదు. కాకపోతే, అది కుక్కలాంటిది. పారిపోయేవాళ్ళని తరిమి మరీ కరుస్తుంది. నిలబడి ఒక రాయెత్తుకుంటే తోకముడుస్తుంది. అందుకు వ్యక్తిత్వం, మన నిర్ణయాలపై మనకు విశ్వాసం నిబద్ధతా కావాలి అంతే!

మీ ఆలోచనలతో నాకు సమస్యలేదు. కానీ నా ఆలోచనలకీ కొన్ని ఆధారాలున్నాయన్నదే నా విన్నపం.

సుజాత వేల్పూరి said...

రమణి గారు,
"ప్రేమించడానికి రెండు హృదయాలు చాలు, కానీ పెళ్ళి చేసుకోడానికి రెండు కుటుంబాలు కావాలి" దీన్ని చెత్త డైలాగ్ గా పేర్కొంది నేను. కానీ అనిపించింది మహేష్ కుమార్ గారు కాదు. నా స్వంత గొంతే అది! మన బ్లాగర్లకెవరూ డబ్బింగ్ చెప్పక్కర్లేదనుకుంటాను. కామెంట్ అంటేనే వ్యక్తిగతాభిప్రాయం. దాన్ని ఎవరో "అనిపించడం" ఏమిటి?

పెళ్ళి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కావాలి!నార్మల్ పరిస్థితుల్లో! రెండు వైపుల నుంచీ అభ్యంతరాలు ఎదురై, కలిసి జీవించకపోతే బతకలేని పరిస్థితి ఎదురైతే? అప్పుడూ "పెళ్ళి చేసుకోడానికి రెండు కుటుంబాలు కావాల్సిందే" అని కూచోవాలంటారా? అలాంటి పరిస్తితిలో పెళ్ళికైనా సరే రెండు హృదయాలు చాలు! పైగా ఈ డైలాగు ఈ మధ్య విరివిగా "ప్రేమ వివాహం" టాపిక్ వచ్చిన చోటల్లా వాడేస్తున్నారు. అందుకే చెత్త డైలాగ్ గా అనిపించింది నాకు!

చెప్పదల్చుకున్న విషయాన్ని సూటిగా డొంక తిరుగుడు లేకుండా చెప్పడమే మహేష్ కి అభిమానుల్ని(మహిళా బ్లాగర్లైనా,మేల్ బ్లాగర్లైనా) ఏర్పరుస్తుందని నేననుకుంటున్నాను!

Anonymous said...

అయ్యా మహేశా, మీ ఆక్రోశం, ఆక్రందన ? నాకు అర్థం అయినట్టు, కానట్టు ఉంటోంది !

1)""అడవికి వెళ్ళకుండానే సమాజంలో స్వేచ్చగా మనైష్టమొచ్చినట్లు బ్రతికే అవకాశం ఉన్నప్పుడు అలా చెయ్యాల్సిన అవసరం లేదనెదే నా అభిప్రాయం."""--బాగా చెప్పారు ! చిన్నప్పటి నుంచి పెరిగిన సమాజం నుంచే విదిపోనక్కరలేదు అని అనుకున్తున్నట్టే, ఈ ప్రేమికులు కూడా notice లేని పెళ్ళిళ్ళతో ... ఇంట్లో వాళ్ళ నుంచి వేరు పడాలి అనుకోవట్లేదేమో ? మీకు తెలుసా, ఏమి చెప్పకుండా చేస్కునే పెళ్ళిళ్ళ వాళ్ళ, ఎంత shock కి గురి అవుతారో parents ? అప్పుడు ఆ shock add చేసే trauma సహించలేనిది గా ఉంటుంది ! చిన్నప్పటి నుంచి పెంచిన పిల్లలు, కనీసం మాట మాత్రం చెప్పకుండా చేసుకున్నారు అంటే, లేచి పోయిన పెళ్లి చేస్కుంది వీళ్ళ కూతురు, కొడుకు అనో...కుళ్ళబోడుస్తుంది సమాజం ... కనీసం ఇంట్లో కూడా చెప్పలేదు అంటే, అదేం పెంపకం అని ... అల చేస్తే, మాటలు పడేది ... ఆ అభాగ్య , నిర్భాగ్య తల్లి తండ్రులే కదా !

2) ఈ సమాజం అంటే ఏంటి? అందులో మన స్నేహితులు, తల్లి తండ్రి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు ఉండరా? వాళ్ళు ఒకవేళ మన " అనిర్వచనీయ " అనుభూతుల ? గురించి తెలిసి, oppose చేస్తే, ( మీ సిద్ధాంతం బట్టి, ప్రేమ + అనిర్వచనీయ " అనుభూతులు ... ending పెళ్లి కానక్కర లేదు ! ) కాబట్టి ... అది కేవలం ఒక అనుభూతి గా మిగుల్చుకుంటా అని కుటుంబ సభ్యులతో, especially if it's a woman,( in some families who think men also should stand by morals ! ) (ఓకే ! atleast according to the family or society , a moral = marrying someone with whom u've physical relationships ) అనేస్తే...వాళ్ళు oppose చేస్తే, కుక్క లాంటి వాళ్ళు అని వాళ్ళని కూడా రాయుచ్చుకుని కొట్టాలా ?

3) మనకి most convenient and safe, సమాజం కాబట్టి, అది గొంతు చించుకున్న పట్టించుక్కరలేదు !అందులోనే ఉంటూ మన ఇష్టమొచ్చింది విశ్వాసం, నిబద్ధత ? తో చేస్కోవచ్చు ! కానీ, మన ఇంట్లో వాళ్ళు చేస్తే,(వీళ్ళు సమాజం లోనే గా ఉంటారు ? ) వాళ్ళని sudden gaa avoid చేసి మరీ ... మనం అనుకున్నది చేసెయ్యాలి !వాళ్ళ approval తో పని లేకుండా !

4) ఇంట్లో వాళ్ళ సహాయం మనకి అవసరం కాబట్టి వీళ్ళు వేరు పడరు అంటున్నారు ? మరి సమాజం మాత్రం విశాఆఆఆఅల హృదయం తో, మన నిబద్ధత ని ఎందుకు అర్థం చేస్కోవాలి ? చేస్కోకపోయిన, మనం అక్కడే ఉండాలి ! చేతిలో రాయి పెట్టి సమాజం ఒక కుక్క అనుకుని దాన్ని కొడుతూ ? ఎందుకు ఈ గోల అంటే ... సమాజం తో మనకి అవసరం ఉంది కాబట్టి !!!!!!!!

దీని భావమేమి, మహేశా ?

Anonymous said...

నాకు ఒక చిన్న సందేహం..మీరు చిరంజీవి బాలకృష్ణ అభిమానుల మధ్య ఎందుకు పోలిక పెట్టారో నా మట్టి బుర్ర కి తట్టడం లేదు..N.T.R, బాలకృష్ణ అభిమానుల మధ్య పోలిక ఎందుకు పెట్టలేదు..నాకు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు..

Kathi Mahesh Kumar said...

@ఆదిత్య:నేను ఇదివరకూ చెప్పిన సమాధానం మీరు కుళ్ళబొడుస్తుందనుకుంటున్న సమాజం గురించే! మీ సంశయం సమాజం గురించి ఎక్కువ వ్యక్తులగురించి తక్కువా ఉన్నట్లుంది. అది అనవసరం అనేది నా అభిప్రాయం.

మీ రెండోప్రశ్నలోని నిరసన ధ్వని అర్థమయ్యిందేతప్ప భావం అర్థం కాలేదు.మీరు రాయటంలోనో లేక నా చదవటంలోనో కొంచెం సమస్య ఉంది.

మూడవప్రశ్నలో నేను చెప్పినవీ మీరు అడిగినవీ ఒకటే, మరలాంటప్పుడు conflict of interest ఎక్కడుంది?

సమాజం నన్నొద్దనుకుంటే నా దారి నేను వెతుక్కుంటాను. కానీ చుట్టుఉన్న కొంతమందినే సమాజం అని భ్రమించి నా జీవితాన్ని చిన్నచూపుచూడను. అంతే తేడా!

@అనామకుడు: చిరంజీవి బాలకృష్ణల మధ్య భావవైరుధ్యంతోపాటూ విభిన్న(సినిమా పరమైన)విలువల నేపధ్యాలున్నాయి. అందుకే వార్ని ఉదాహరణలుగా తీసుకున్నాను. NTR బాలకృష్ణల మధ్య సాంప్రదాయక కొనసాగింపేతప్ప వైరుధ్యాలు ఎక్కడున్నాయి?

Anonymous said...

బాగా నే చెప్పారు గాని కొద్దిగా generalize చేసి పారేశారు విషయాన్ని. తల్లి తండ్రులు ఆమోదించటం అనేది వారి వారి సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తల్లి, తండ్రుల విలువలు ని నమ్మి అన్నారు. ఆ విలువలు ఏమిటీ అని ప్రశ్నించు కొంటే అది మరొక వ్యాసం అవుతుంది. వారి విలువలు చాల మటుకు సంప్రదాయమనో, డబ్బు దగ్గరో ఆగి పోతాయి (మీలాగే generalization). వాళ్లు ఈ అమ్మాయి నీకు తగదు, దానికి కారణాలు, ఆమె కీ నీకు కంపాటిబిలిటీ ఉండదని చెప్పే సందర్భం సినిమా లో ఎక్కడైనా చూసేరా? చూసిన చాల తక్కువ సందర్భాలలో. ప్రతీ ఒక్కరి కి ఒక ఎజెండా ఉండటమే చూస్తాం ఈ విషయం లో. అలాగని ప్రేమికులని నేను వెనుకేసుకుని రాటం లేదు. బొమ్మరిల్లు లో ప్రకాష్ రాజ్ లూ, సిద్ధార్థ లూ తక్కువ నిజ జీవితం లో.

మీ ఈ చిన్న సమాజం వదిలే ధైర్యం ఉంటే మీకు, మీరు కొవ్వాలి గారి కామెంట్ , "ఈ ఆడవాళ్ళు మరీ బరితెగిస్తున్నారు" అన్న విషయమా కొద్ది పాటి తీవ్రత తో అయినా ఖండిచే వారు అని నా ఉద్దేశ్యం.
సమాజం ఎప్పుడూ చిన్నది గా నే ఉంటుందని మాత్రం గమనించండి.

మీ కథ కూడా చదివా. కాని అందులో హీరో , హీరోయిన్ "అది" చేసే ముందు తల్లి తండ్రులు గురించి ఆలోచించారా? ఇది ఒకే ఎందుకంటే దీనికి పెద్ద వాళ్ల అనుమతి అక్కర్లేదు. ఇది చెయ్య టానికి "విలువలకీ" కూడా తావు లేదు.

Anonymous said...

బాగా నే చెప్పారు గాని కొద్దిగా generalize చేసి పారేశారు విషయాన్ని. తల్లి తండ్రులు ఆమోదించటం అనేది వారి వారి సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తల్లి, తండ్రుల విలువలు ని నమ్మి అన్నారు. ఆ విలువలు ఏమిటీ అని ప్రశ్నించు కొంటే అది మరొక వ్యాసం అవుతుంది. వారి విలువలు చాల మటుకు సంప్రదాయమనో, డబ్బు దగ్గరో ఆగి పోతాయి (మీలాగే generalization). వాళ్లు ఈ అమ్మాయి నీకు తగదు, దానికి కారణాలు, ఆమె కీ నీకు కంపాటిబిలిటీ ఉండదని చెప్పే సందర్భం సినిమా లో ఎక్కడైనా చూసేరా? చూసిన చాల తక్కువ సందర్భాలలో. ప్రతీ ఒక్కరి కి ఒక ఎజెండా ఉండటమే చూస్తాం ఈ విషయం లో. అలాగని ప్రేమికులని నేను వెనుకేసుకుని రాటం లేదు. బొమ్మరిల్లు లో ప్రకాష్ రాజ్ లూ, సిద్ధార్థ లూ తక్కువ నిజ జీవితం లో.

మీ ఈ చిన్న సమాజం వదిలే ధైర్యం ఉంటే మీకు, మీరు కొవ్వాలి గారి కామెంట్ , "ఈ ఆడవాళ్ళు మరీ బరితెగిస్తున్నారు" అన్న విషయమా కొద్ది పాటి తీవ్రత తో అయినా ఖండిచే వారు అని నా ఉద్దేశ్యం.
సమాజం ఎప్పుడూ చిన్నది గా నే ఉంటుందని మాత్రం గమనించండి.

మీ కథ కూడా చదివా. కాని అందులో హీరో , హీరోయిన్ "అది" చేసే ముందు తల్లి తండ్రులు గురించి ఆలోచించారా? ఇది ఒకే ఎందుకంటే దీనికి పెద్ద వాళ్ల అనుమతి అక్కర్లేదు. ఇది చెయ్య టానికి "విలువలకీ" కూడా తావు లేదు.

Kathi Mahesh Kumar said...

@ఆర్యహి(పేరు చాలా బాగుంది):నేను కొద్దిగాకాదు చాలానే generalize చేసాను. కాకపోతే,ఇది ఒక సంఘటనద్వారా నేను చూసిన ఒక సామాజిక పార్శ్వం మాత్రమే. అందరూ ఇలాగే ఉంటారు. అన్ని ప్రేమలూ,తల్లిదండ్రులూ ఇంతేలాంటి sweeping statement మాత్రం అస్సలు ఇవ్వలేదు.

సాధారణంగా తల్లిదండ్రులకు "మా పిల్లలకు కావల్సిన మంచేమిటో మాకు తెలుసు" అనే నమ్మకం ఒకటుంటుంది. అది మన సంస్కృతిలో ఒక భాగం, విలువలలోని ఒక అశం. చాలావరకూ ప్రేమలు దానికి విఘాతం కలిగించేవే. అందుకే instead of conflict just follow your value and take responsibility of the consequence అంటున్నాను.

కొవ్వాలి గారిని తీవ్రంగా ఖండించకపోవడానికి కారణం,వారికి నా వ్యాసం అర్థంకాలేదు అనేది నకర్థమవడం. నేను "ఈ/e సమాజానికి" భయపడేవాడినైతే ఇలాంటివ్యాసాలు రాసేవాడినేకాదు.

Anonymous said...

ధన్యవాదాలు. మతం మార్పిడి మీద మీరు రాసిన వ్యాసం చాల బాగుంది.
కాని ఏ సందర్భం లో కొవ్వలి గారి జేనరలిజాషన్ సరి యో శెలవిస్తార ? బరితెగినచటం అనే పద ప్రయోగం ఈ తెలుగు బ్లాగ్ ల లో సమంజసమా ? చూస్తే "తిరిగి ఆడది చెడింది తిరగక మగాడు చెడ్డాడు" అన్న సామెత రాసినది మగాడు అని చెప్పే నిదర్శనం.
ఇక్కడ ఇంతమంది స్త్రీ బ్లాగర్స్ కి అది తప్పు గా అనిపించక పోవటం లేక చూసి చూడనట్టు పోవటం కొద్దిగా ఆశ్చర్యం గానే ఉంది మరి.

Kathi Mahesh Kumar said...

@ఆర్యహి: బరితెగించడం అంటే "కట్టడిని మీరిపోవడం" అని అర్థం. అందులో మీరు అనుకున్నంత అభ్యంతరకరమైన అర్థం లేదు. కానీ, కొవ్వలిగారు నా వ్యాసంలోని భావాన్నికాకుండా "పెళ్ళైనవాళ్ళని మళ్ళీ పెళ్ళిచేసుకునే" కొందరు ఆడవాళ్ళమీద తన సామాజిక ధృక్పధాన్ని వ్యక్తపరిచారు.

నేను వారి ఉద్దేశంతో అంగీకరించకపోయినా,ఖండించకపోవడానికి కారణం ఆ వ్యాఖ్య యొక్క misplaced emotion. అందుకే వారి వ్యాఖ్యలోని అసంబద్ధతను సూచించి ఊరకున్నాను.

అయినా, చాలా మంది స్త్రీబ్లాగర్సూ మరియీ మహిళలు in general ఈ ideologyనే subscribe చేస్తారు అనేది నేనూ నా బ్లాగులో జరిగిన కొన్ని చరచల్లో తెలుసుకున్నాను.

ఇక మీరు చెప్పిన సామెతలో "చెడటం" గురించి నా అభిప్రాయాలూ,ఆలోచనలూ కొంచెం భిన్నంలెండి. వాటిని విన్నవారు,చదివినవారుకూడా "వీడు బరితెగించాడు" అనే అంటారు. అందులో మహిళలూ ఉంటారు.

గీతాచార్య said...

అమ్మా నాన్నలనీ, బాలకృష్ణ అభిమానుల్నీ పోల్చటం ఏమీ బాగాలేదు. ఆ ఘటాలు తమ తమ సామాజిక వర్గాలనే గొప్ప అనుకుంటూ ఒక reason, logic లేకుండానే ద్వేషించుకునే రకాలు. అలాంటి వారితోనా అమ్మానాన్నలకి పోలిక.

ఇక ప్రేమ విషయానికి వస్తే అదెప్పుడు పుడుతుందో ఎవరికీ తెలీదు. అయినా ప్రేమించిన వెంటనే 'మేం ప్రేమించుకున్నామహో!' అంటూ అందరికీ చాటాలా? సమయం సందర్భం వచ్చినప్పుడు పెద్దలకి తెలిపి వారి ఆశీస్సులని తీసుకోవాలనుకుంటం తప్పా?

ప్రేమ విషయాన్ని పెద్దలకి తెలిపి, వారు ఒప్పుకోకపోతే, నిజంగా తమ ప్రేమ అంత గొప్పదైతే వారిని ఎదిరించి పెళ్లి చేసుకోవచ్చు. పిల్లల సంతోషం తమకి ముఖ్యం అనే పెద్దల అభిప్రాయం. తమ ప్రేమని పండించుకోవటం వల్ల తాము ఎంత సంతోషంగా ఉంటామో పెద్దలకి పిల్లలు అర్ధమయ్యేలా వివరిస్తే సగం సమస్యలు తీరిపోతాయి. ఇక్కడ individual judgement ముఖ్యం. తమ నిర్ణయాలని తాము తీసుకోలేని వాళ్ళే స్నేహితులని ఆశ్రయిస్తారు. వారూ చాలా వరకూ ఇలాంటి వారే కదా! అందుకే వారి సలహాలూ లేచిపోవటం, పారి పోవటం మొదలైనవి బుర్రలోకి ఎక్కిస్తారు. ఆ సలహాలనే పెద్దల నుంచీ తీసుకోవచ్చు కదా? నిర్ణయించుకునే శక్తి లేని వారికి ప్రేమలేందుకు?

అసలు ప్రేమంటేనే తమ అత్యుత్తమ విలువలని వేరొకరిలో చూసి తమ విలువలకిపట్టం కట్టటమే! (పూర్తిగా చెప్పలేను. క్షమించండి). అంటే ఆ విలువలకి ఆకర్షితులై, వారి సాంగత్యాన్ని కోరి, దగ్గరై, క్రమంగా వారి తో ఒక మానసిక అనుబంధాన్ని ఏర్పరుచుకోవటమే. Simply said, it's an interdependency of two equal values. ఈ రోజుల్లో అలా విలువలకి కట్టు పడే వారెందరున్నారు. అమ్మాయి బాగుందనో, sexy గా ఉందనో, నాలుగు రోజుల ఫ్రెండ్షిప్ తరువాత propose చేసే రకాలే. అలాంటి వారికే తమ ప్రేమ వల్ల తమకి కలిగే ఆనందాన్ని గురించి సహేతుకంగా పెద్దలకి చెప్పే సాహసం ఉండదు. ముందు వారికి తెలిస్తేనే కదా. So clashes. పెద్దలకీ వారి మీద నమ్మకం ఉండదు.

తమ ప్రేమకి సరైన reason చెప్పలేని వారు, రేపు కాపురంలో వచ్చే ఇబ్బందులని ఎలా విశ్లేషిస్తారనేదే పెద్దల భయం. అందుకే ప్రేమ వివాహాల్లో పెద్దలు విలన్లు అయ్యేది.

నిజంగా తమ పిల్లల సుఖ సంతోషాలని కోరుకునే పెద్దలు వారి సహేతుకమైన ప్రేమని అంగీకరించకుండా ఉండరు. అలా కాని పక్షంలో పెద్దలకి కూడా పరిణతి లేదనే అర్ధం. అలాంటప్పుడు వారి అభిప్రాయాలని పట్టించుకోనవసరం లేదు.

ఇక పెద్దలని అడిగేది కేవలం పురుళ్ళ కోసమో, లేక ఇతర అవసరాలకోసమో ఐతే మాత్రం కాదు. వారితో పిల్లలకున్న మానసిక అనుబంధమే కారణం. (కొండకచోమీరు చెప్పిన లాటి వారున్డవచ్చు).

"పెళ్ళైన తరువాత మనం మనస్ఫూర్తిగా ప్రేమించాల్సింది పెళ్ళాన్నేకదా!"

ఈ మాట అనుకున్నాడంటేనే వాడికి ప్రేమ ఒక బాధ్యత మాత్రమే. ప్రేమ ఒక విలువ కాదు. అలాంటివాడు ఎప్పటికీ ఎవరినీ ప్రేమించలేదు. కేవలం శారీరక ప్రాతిపదిక మీద ఏర్పరుచుకున్న బంధం మాత్రమె అది. తల్లి తండ్రులనే భరించలేక అదో బాధ్యత అనుకునే వాడు పిల్లలనీ అలాగే అనుకుంటాడు. అంటే తన విలువల్నీ natural గా తీసుకోకుండా అవి default అన్న అవగాహన లేని వాడు. ఏదో బ్రతుకు బండిని లాగించేద్దమనుకునే రకాలు. వారి గురించి పట్టించుకోనవసరంలేదు.

ఇలాంటి విషయాలని నిజంగానే విశ్లేషించాలంటే మనం metaphysical aesthatics లోకి వెళ్ళాలి. కేవలం ఒక బ్లాగో దానికి వ్రాసే వ్యాఖ్యో చాలదు.

నచ్చినా నచ్చకపోయినా మీరు లేవనెత్తే విషయాలు అందరినీ ఆలోచింప చేస్తాయి. మీ టపా చదివింతరువాత కామెంట్ వ్రాయకుండా ఉండలేము. అదే మీ బ్లాగ్ గొప్పతనం.

సమయాభావం వల్ల కొంత అసమగ్రంగానే చెప్పాను.

Kathi Mahesh Kumar said...

@గీతాచార్య: మీరు చెప్పినవాటితో నాకు ఏవిధమైన విభేధం లేదు. నేను చెప్పింది కొంతమందికి సంబంధించిన ఒక సామాజికకోణం,ధృక్పధం మాత్రమే!

సుజాత వేల్పూరి said...

గీతాచార్య,
"ప్రేమంటే తమ అత్యుత్తమ విలువలను వేరొకొరిలో చూసి, తమ విలువలకు పట్టం గట్టడమే" ....

"పెళ్లయిన తర్వాత నిజంగా ప్రేమించాల్సింది పెళ్ళాన్నే కదా...ఈ మాట అనుకున్న వాడికి ప్రేమ ఒక బాధ్యత మాత్రమే".....

రెండూ నాకు బాగా నచ్చేశాయి.

Anonymous said...

చాలా మంది చాలా చాలా చెప్పేశారు. సో నో కామెంట్ అబౌట్ ది పోస్ట్.

@గీతాచార్య: You are right. I know your words came from your heart. "ప్రేమంటే తమ అత్యుత్తమ విలువలను వేరొకొరిలో చూసి, తమ విలువలకు పట్టం గట్టడమే" ....

Unknown said...

చాలా బాగా వ్రాసారు. నిజమే ప్రేమించే ముందు ఇంట్లో చెప్పొచ్చుగా? చెప్పనప్పుడు తర్వాత పర్మిషన్ అడగడం ఎందుకు? 20 సంవత్సరాలు పెంచి పోషించిన తల్లితండ్రుల ప్రేమని కాదనే ప్రేమ, ప్రేమెలా అవుతుంది? 30 40 సంవత్సరాలుగా వున్న తల్లితండ్రుల నమ్మకాలని, కట్టుబాట్లని మార్చుకోమని అడిగే బదులు రెండు-మూడేళ్ళ వాళ్ళ ప్రేమని మర్చిపోవచ్చుగా? ప్రేమంటేనే బాధ్యత, మరి బాధ్యత తెలీని వయసులో ప్రేమేంటి? సినిమాల్లో టివిలో ప్రేమకి అక్కర్లేని ఔన్నత్యాన్ని అంటగట్టేస్టున్నారు. అదే పిల్లల్ని చెడగొడుతుంది. అస్సలు ఫ్యాక్షన్ సినిమాలను కాదు, పిల్లల్ని చెడగొట్టే ఈ ప్రేమ సినిమాల్ని బాన్ చెయ్యాలి.