Tuesday, December 30, 2008

కొమ్ములూ- కోరలూ-పర్ణశాల - e-తెలుగు

తెలుగు ప్యారడీ కింగ్ ఝరుక్ శాస్త్రి గారికి మిత్రుడొకరు మొదటి సారిగా 'కొకు' (కొడవటిగంటి కుటుంబరావు)గారిని పరిచయం చేసారట. ఝరుక్ శాస్త్రిగారు తన హాస్యశైలిలో 'కొకు'గార్ని ఎగాదిగా చూసి మిత్రుడితో, "అబ్బే ఈయన కొకు అవ్వడమేమిటి?! కొకు అంటే ఇంతపెద్ద కొమ్ములూ, కోరలుండాలి, అవీ భయంకరంగా కనబడాలీ, పైగా ముక్కులోంచీ పొగలూ సెగలూ రావాలి. ఇవన్నీ లేకపోతే కొకేమిటి? నేనస్సలు నమ్మను" అన్నారట.*


నిజమే, ఆవేశపూరితమైన రాతలు రాసినంత మాత్రానా పొగలూసెగలూ కక్కుతూ, ఆవేశంతో కనపడినవాళ్ళనల్లా కసకస మనిపించే కోరలతో కపడాలా? ఏమో ఈ మధ్య జరిగిన బుక్ ఫెయిర్లో, e-తెలుగు స్టాల్ దగ్గర కలిసిన కొందరు బ్లాగ్మిత్రుల స్నేహపూరిత వాక్కుల తరువాత నాకు ఈ సందేహమే వచ్చింది. నా బ్లాగులో జరిగే వాడివేడి చర్చలూ, అక్కడక్కడా వేరే బ్లాగు వ్యాఖ్యల్లో వినిపించే నా నిరసనస్వరాలూ,పదేపదే నా భావాల్నీ ‘సుత్తి’తో నిరసించే మరికొందరి ప్రయత్నాల నేపధ్యంలో కత్తి మహేష్ కుమార్ అంటే (ఫొటో ఉన్నాకూడా) ఒక భీకర స్వరూపమో లేక జగడమారి రూపమో మనసులో ముద్రేసుకున్నారనుకుంటాను. నన్ను కలిసిన మరుక్షణం "బ్లాగంత ‘ఇది’గా లేరే!", "కత్తి బ్లాగులో మాట్లాడతాడు బయటమాత్రం వింటాడు","మంచోడే మరీ అంత ప్రమాదకరం కాదు" లాంటి ప్రశంసల్తో ముంచేసారు.


మరో వైపు ,"బ్లాగులో ఫోటోలాగే వున్నావ్" "కొంచెం ఒళ్ళు పెరిగింది,జుట్టు తగ్గింది... మిగతా అంతా నువ్వే" అని కొందరంటే, ఇంకొందరు "మొదటిసారి కలిసినా ఎన్నాళ్ళుగానో తెలిసినట్లేవుంది" అంటూ స్నేహహస్తం అందించారు.


బ్లాగుల్లో ఒకప్పుడు హోరాహోరీగా పోరాడుకున్న నేనూ-తాడేపల్లిగారూ విభేధించుకుంటూ, చర్చించుకుంటూ అతిఎక్కువ సమయం ఒకరితో ఒకరు గడిపాం. ఈ మధ్యకాలంలో చదువరి గారి టపాపై వ్యాఖ్యలూ ప్రతివ్యాఖ్యలతో గడిపినా, కలిసిన మరుక్షణం ఒక కప్పు కాఫీ తాగుతూ e-తెలుగు కోసం కలిసి పనిచెయ్యాలనే నిర్ణయానికొచ్చాం. పప్పు అరుణగారి కలుపుగోలుతనం-కార్యదీక్ష, నల్లమోతు శ్రీధర్ గారి బేషరతు అభిమానం. దూర్వాసుల పద్మనాభంగారి అకుంఠిత సమర్పణభావం. వీవెన్ నిశ్శబ్ధ అంకితభావం. కేశవ్ ఉత్సాహం. ఇబ్బందిగా నవ్వుతూనే ఎవరికీ ఇబ్బంది కలక్కుండా చూసే చావా కిరణ్. ఇంకా పలువురి శ్రమ,దీక్ష చూస్తుంటే తెలుగుకు ఆధునిక హోదా కలిపించే ఉద్యమంలో నేనూ ఒక భాగాన్నేమో అనిపించింది.


ఇక 25 వతేదీన మహిళాబ్లాగర్ల హడావుడి ఇప్పటికే బ్లాగు లోకంలో విశ్వప్రసిద్ధం...

హమ్మో...నేనూ ఎమోషనల్ అయిపోతున్నాను....


ఇహ చెప్పోచ్చేదేమిటంటే! నా విభేధాలు సిద్ధాంతాలతో,ఆలోచనలతో,అభిప్రాయాలతోకానీ వ్యక్తులతో కాదు అని నేను పదేపదే నా బ్లాగులో మొత్తుకునేమాట నిఝంగా నిజం. నాకు అర్థరహితం అనిపించి సిద్ధాంతాలను నిరసిస్తాను. అలవికాని ఆలోచనలు అనిపించినవాటిని నిలదీస్తాను. స్వార్థాశయంగల అబిప్రాయాలను తెగనాడతాను. అంతమాత్రానా నాకు వ్యక్తులతో విభేధాలుండవు.కోపాన్నికూడా ఒక్క కరుకుపదంకూడా వాడకుండా తెలియజెప్పాలనే నా ప్రయత్నం. కసినికూడా కసుక్కుమనే పదరహితంగా వెళ్ళగక్కాలనే నా ఆశయం. కానీ, నా టపాలు ఎత్తిపొడుపుల్లాగా అనిపిస్తాయని ఒక మిత్రుడు చెప్పారు. అది ఉద్దేశపూర్వకమేగానీ అవి వ్యక్తుల్ని ప్రశ్నించడానికి కాకుండా వ్యవస్థలోని నాకు తెలిసిన లోపాల్ని వ్యక్తపరచడానికి మాత్రమే. వ్యక్తిస్వతంత్ర్యాన్ని నేను ప్రభోధిస్తే అది నా అనుభవాల సారమేగానీ,దాని ఆధారంగా అదే సత్యమని ఉద్భోధించే ఉద్దేశం కాదు నాది. రాజకీయ ఉద్దేశాల్నీ, కులమత భేధాల్నీ, దేశభక్తినీ సాధికారంగా ప్రశ్నిస్తానేగానీ గుడ్డిగా నమ్మే అలవాటుని ప్రోత్సహించను. అంతమాత్రానా అవంటే గౌరవం లేకకాదు.అందరూ గౌరవించేరీతిలో అవి ఉండాలనే తపనతో.


అయినా కొందరికి నా టపాలు ఘాటుగా అనిపిస్తాయి. బహుశా నా టపాల్ని ఆలోచించడానికి కాక వ్యక్తిగతజీవితానికి అన్వయించుకుని పొంతనలేక ఉక్రోషంతో, ఈ ఆలోచనల్ని నిత్యజీవితంలో అవలంభించే ధైర్యం లేక ఆక్రోశంతో అలా అనిపించొచ్చు.ఈ ఆలోచనల్ని అంగీకరిస్తే వారు బ్రతికే భద్రలోకం వీళ్ళని "మంచి వాళ్ళు కారు" అనుకుంటుందనే భయమూ కావచ్చు.


ఇంకా..ఇంకా మరెన్నోమరెన్నో కారణాలు కావచ్చు. ఆకారణాలతోనే నా బ్లాగు చదవాలి. చదవకపోతే చదివించేలా చేసే బాధ్యత నాదే! చదివితే స్పందించాలి. స్పదించకపోతే స్పందించేలా చేసే బాధ్యత నేనే తీసుకుంటాను. నావరకూ ‘పర్ణశాల’ ప్రశాంతంగానే ఉంటుంది. ఆలోచనలకు నెలవుగానే వుంటుంది.అందరికీ స్వాగతం ఆదరించేవారికీ,విమర్శించేవారికీ,విశ్లేషించేవారికీ, విభేధించేవారికీ అందరికీ... అందరికీ.. స్వాగతం.


నూతన సంవత్సర శుభాకాంక్షలు



*పిట్టకథ చెప్పిన కొత్తపాళీగారికి ధన్యవాదాలు.


****

Sunday, December 28, 2008

మా ముకుందుడి ‘భాష’ తంటాలు

నేను తెలుగు.మా ఆవిడ బెంగాలీ. నాకు బెంగాలీ మాట్లాడ్డం రాది. మా ఆవిడకి తెలుగు మాట్లాడ్డం రాదు. ఇద్దరికీ దాదాపు చాలావరకూ అర్థమవుతుంది. అందుకే ఇంట్లో మాట్లాడే భాష హిందీ. మా అబ్బాయి ముకుంద్ చిన్నప్పట్నించీ ఇంట్లో హిందీ వింటూ పెరగటం వలన వాడి మాతృభాష హిందీ. అందుకే మాతృభాష అనడంకన్నా ‘ఇంటిభాష’ లేక ‘మొదటిభాష’ అంటే ఈ సందర్భంలో అర్థవంతంగా ఉంటుందని నా భావన.


బాల్యంలో ఏభాషలో అయితే మీ అవసరాలనూ,అనుభవాలనూ,ఆలోచనలనూ చెప్పడం చేస్తారో అదే ‘ఇంటిభాష’/‘మొదటి భాష’ అని నా ఉద్దేశం. దానికి పవిత్రత గౌరవం,గొప్పతనం లాంటివి లేవు. అది ఒక సహజ ప్రక్రియ అంతే. ఇంకా చెప్పాలంటే అదొక default setting. భాష నేర్చుకునే క్రమంలో మొదటగా వినడం తరువాత తిరిగిపలకటం ఆ తర్వాత మాట్లాడటంగా జరుగుతుంది. ఆ తర్వాత అవసరాన్నిబట్టి చదవటం, రాయటం నేర్పించబడతాయి లేక నేర్చుకోబడతాయి.నేను తెలుగు భాష ఇలాగే నేర్చుకున్నాను. నా కుటుంబ మరియూ చుట్టూవున్న సహజవాతావరణంలో తెలుగు ఆవరించుకుని ఉండటం, నా ప్రాధమిక విద్య తెలుగులో సాగటంతో తెలుగు నా ఇంటిభాషతో పాటూ వ్యవస్థ భాష(Institutional language) కూడా తెలుగయ్యింది. ఆ తరువాత కాలక్రమంలో వ్యవస్థభాష ఆంగ్లంగా రూపాంతరం చెందింది.


శిక్షణ రీత్యా భాషా బోధకుడిగా, ఏ సందిగ్ధతలేకుండా పిల్లలు తమ బాల్యావసరాలు,భావాలూ వ్యక్తికరించడానికి ఒకే భాష ఉండాలనే సిద్ధాంతాన్ని నమ్ముతాను. అందుకే ఇంట్లో హిందీతప్ప మరోభాష వాడకం చెయ్యలేదు.అందుకే పితృభాష అయిన తెలుగు, మాతృభాష అయిన బెంగాలీని ఇంటిభాష గా చెయ్యలేదు. ఇంగ్లీషునైతే ఉద్దేశపూర్వకంగా మరింత దూరంగా ఉంచడం జరిగింది. ఇప్పుడు మా ముకుంద్ తనంతట తాను ఆసక్తిచూపడంతో కొంత తెలుగు బెంగాలీ నేర్పడం జరుగుతోంది. కానీ సమస్యల్లా వాడి స్కూల్లో ఇంగ్లీషురూపంలో వచ్చింది.


క్రితం సంవత్సరం LKG లో చేర్పించిన కొన్నాళ్ళకి, పేరెంట్స్ మీటింగులో వాళ్ళ మేడమ్ నా ముందుకుతీసుకొచ్చిన సమస్య "your son do not follow instructions in English" అని.దానికి నేను మర్యాదగా,"Sure I understand. We speak Hindi at home and I would expect school to teach him English" అనిచెప్పాను. కానీ, ‘ఇంట్లో మీరు నేర్పిస్తేకదా మీవాడికి స్కూల్లో సూచనలు పాటించడానికి సులువయ్యేదీ’ అని స్కూలువాళ్ళ గోల. నాభాధేమిటంటే నేను ఇంట్లో తెలుగు మాట్లాడుతూనే బయటప్రపంచానికి కావలసిన institutional language అయిన ఆంగ్లాన్ని నేర్చుకున్నప్పుడు, హిందీ మాట్లాడే నాకొడుక్కు స్కూల్లో వీళ్ళు ఇంగ్లీషు నేర్పలేరా? ఇంత మాత్రానికి వేలకువేలు ఫీజులు నేనెందుకు కట్టాలి? అని. ఈ విషయం స్కూల్లో కొంత చర్చించిన తరువాత, మా ఆవిడ నన్ను బలవంతంగా(తలాతోకా లేని ఆర్గ్యుమెంట్ చేస్తున్నానని) ఆ మీటింగ్ నుంచీ లాక్కొచ్చేసింది.



ఏమిటో... నా వాదనలో తప్పుందో... లేక నా ఆలోచనలో తప్పుందో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. కాకపోతే, ఇప్పుడు మాఆవిడ ఇంగ్లీషు పదాలూ,వాక్యాలు ఇంట్లో మా ముకుందుడిపై విరివిగా ప్రయోగిస్తోంది.


****

Saturday, December 27, 2008

స్వగతం


నమ్మకం:
నా పరిధిలో తెలుసుకున్నవాటితో నా అభిప్రాయాలు ఏర్పడుతాయి.అవి ఎంతబలమైనవి అనేది నేను తెలుసుకున్న source నుంచో లేక నేను convince అయిన తీరునుంచో జరుగుతాయి.నా అత్మవిశ్వాసానికి కారణం నేను తెలుసుకున్న జ్ఞానంపై నేను ఏర్పరుచుకున్న నమ్మకం.మళ్ళీ ఎవరైనా నా నమ్మకాన్ని సవాలుచేసి, నా కళ్ళు తెరిపించేంతవరకూ అదే నాకు "సత్యం". అందుకే ఈ సాధికారత.



విశ్వాసం:
అతివిశ్వాసానికీ ఆత్మవిశ్వాసానికీ తేడా ఎంతో... ఎలావుంటుందో... సొంత కొలతల్లో లేక ఎదుటిమనిషి నలతల్లోంచీ కనిపెట్టెయ్యడం అర్థరహితం. కారణం, అవి చాలా వ్యక్తిగతపరిధిలోంచీ చేసే నిర్ణయాలు. వాటిని నిరపేక్ష సిద్ధాంతాలుగా అంగీకరించిన క్షణాన, నా వ్యక్తిత్వానికీ నేను వ్యక్తిగానమ్మిన సాపేక్ష సిద్ధాంతానికీ విఘాతం కలిగినట్లే లెక్క.


ఎదుటివారు నాగురించి చేసే వ్యక్తిగత బేరీజుకన్నా, నాగురించి నేను అనుభవించే అపోహే మిన్నకాదా! isn't my reality better than perceived notion of others...or is it others reality and perceived notions of my own self? either ways it makes no difference.



జీవించేద్దాం!
ప్రతిమనిషీ తను సృష్టించుకున్న మూసలోనే జీవిస్తాడు. తను అల్లుకున్న బోనులోనే బతికేస్తాడు.కానీ తనదంటూ ఒక పిచ్చితనం లేకపోతే...తనకంటూ కొన్ని నమ్మకాలు లేకపోతే బోనుకూ,మూసకూ సార్థకత కలిగేనా? అస్థిత్వానికొక అర్థం లభించేనా!



ఒరిజినల్ ధాట్:
సొంత ఆలోచనలు కావాలట...original thought. Foolish romantics. అసలు సిసలు ఆలోచనలున్న మహానుభావులెవరో సెలవిస్తారా? Best that has been thought and said is in literature అని ఊరికే అన్నారా! సొంతవీ కొత్తవీ ఎక్కడినుంచీ వస్తాయి..ఆదేదో మనకన్నా ముందు మనల్ని మించిన మొనగాళ్ళే పుట్టనట్టు.


అద్వితీయమైన ఆలోచనలున్నాయి. ఆచరణసాధ్యంకాని అనుభవాలున్నాయి. అనుభవైక్యమైన అనుభూతులున్నాయి. అనుభవించడం చేతకాదుగానీ..ఆలోచించాలట! అదీ ఒరిజినల్గా...ఎవడిక్కావాలి ఒరిజినాలిటీ? అందమైన అనుభవాలు రెడీమేడ్ గా అవేలబుల్ అయితేనూ...



ఆన్ బీయింగ్ సినికల్:
"ఎందుకురా జీవితం మీద అంత నిరసన.ఎప్పుడూ ప్రశ్నించడమేనా..కాస్త ప్రశాంతంగా ఉండలేవా?" అంటాడొక స్నేహితుడని చెప్పుకునే వెధవ. నిరసించని జీవితమూ ఒక జీవితమే! ప్రశ్నించని బ్రతుకూ ఒక బతుకే!!


అన్నిటినీ అంగీకరించి బతికెయ్యడంలో సుఖముండొచ్చుగాక...కానీ శోధించి సాధించడంలోని ఆనందం ఏ సుఖం ఇవ్వగలదు. If you don't problamatize your existence, can it ever become a meaningful Life...its a life with ‘L’ capital mind you. Not just any life.


అయినా నువ్వనుకునేట్లు నేను విరాగిని,విరసుడ్ని,రంధ్రాన్వేషకుడ్ని,నిరాశావాదినీ,నిస్పృహనిండిన వ్యక్తిని కాదు. జీవించే క్రమంలో జీవితాన్ని అర్థవంతమైన క్రమంలో అమర్చుకోవాలనుకునే వేదాంతిని. వేదాంతానికీ వైరాగ్యానికీ ఆర్థం తెలియని నువ్వా సినిక్...లేక నేనా?



****

Friday, December 26, 2008

అర్ధసత్య (1983) - ఒక పరిచయం


సినిమా: అర్థసత్య

నటీనటులు: ఓంపురి,స్మితా పాటిల్, అమ్రిష్ పురి, సదాశివ్ అమ్రపుర్కర్, నసీరుద్దీన్ షా మొదలైన వారు

దర్శకత్వం: గోవింద్ నిహలాని


చక్రవ్యూహ ప్రవేశానికి మునుపు
నేనెవరో..ఎలాంటివాడినో
నాక్కొంచెమైనా జ్ఞాపకం లేదే!
చక్రవ్యూహ ప్రవేశానంతరం
నాకూ దానికీ మధ్య
ప్రాణాంతక సామీప్యం తప్ప మరేమీ లేదు
అయినా ఆ అనుభూతి స్పృహకూడా నాలో రాదే!

చక్రవ్యూహాన్ని ఛేధించాక
ముక్తుడిగా నేనే మిగిలినా…
ఈ చక్రవ్యూహ సృష్టిలో
మార్పేమైనా కలిగేనా?
చచ్చినా చంపైనా
చనిపోయినా, ప్రాణాలే తీసినా
ఈ నిర్ణయం జరిగేనా?

నిద్రనుంచీ లేచి నడిచే మనిషికి
మళ్ళీ కలల ప్రపంచం కనిపించేనా!
వెలుగులో..
తీర్పుచెప్పే క్షణాల వెలుగులో
అన్నీ సరిసమంగా తూగేనా?

ఒకత్రాసులో పుంసత్వం
మరొక త్రాసులో నపుంసకత్వం
ఈ రెంటినీ తూల్చే తూలికలో…
సరాసరిమధ్యన ‘అర్థసత్యం’

హిందీ మూలం- దిలీప్ చిత్రే
తెలుగు స్వేఛ్చానువాదం - కె.మహేష్ కుమార్


పూర్తి వివరాలకు నవతరంగం చూడండి.

Tuesday, December 23, 2008

ప్రేమ్ ‘ఆత్మహత్య’ కుమార్



















ఈ టపా చదివిన కొందరు సాక్షి లోని వార్త లంకె అడిగారు. అది దొరక్క ఆ వార్తాంశాన్ని స్కాన్ చేయించి టపాల పెడుతున్నాను.




ఇప్పుడే ‘సాక్షి’ పేపర్లో ఒక వార్త చూసి వస్తున్నాను. ప్రేమ్ కుమార్ అనే ఒక ఎమ్మెస్సీ విద్యార్థి తన ప్రేమికురాలు ఇన్నాళ్ళ స్నేహానికి కటీఫ్ చెప్పేసి, ప్రేమకు గుడ్ బై చెప్పిందని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్తకు ఖచ్చితంగా యాసిడ్ ఘటనకున్న కవరేజీ, మైలేజీ రెండూ ఉండవు. ఒకవేళ ఎవరైనా బై మిస్టేక్ చదివినా, "ఒక అమ్మాయికోసం ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారా?" అని ఆ కుర్రాడి మానసిక స్థితిని ప్రశ్నిస్తారేతప్ప ఆ అమ్మాయి ప్రవర్తనని హర్షించకపోయినా ఖచ్చితంగా గర్హించరు. కారణం...తప్పెప్పుడూ అబ్బాయిదే ఉంటుందనే మన ప్రఘాఢ విశ్వాసం.అబ్బాయిలు emotional గా ఉండకూడదనే Social conditioning.


యాసిడ్ ఘటనలో ఎన్కౌంటర్ చేసి చంపినా పాపం లేదనుకున్న వాళ్ళందరి ముందూ ఈ సంఘటన పెడితే, ‘అబ్బాయి పిరికితనంతో ఈ పనిచేసుండకుండా ఉండాల్సింది’ అంటారే తప్ప, మోసం చేసిన అమ్మాయిని శిక్షించమని ఒక్కరూ అనరు. దానికున్న లాజిక్ ఒక్కటే, ఆ కుర్రాళ్ళు అమ్మాయిని బౌతికంగా దాడి చేసి హింసకు గురిచేసారు కాబట్టి వారికి ఆ శిక్ష కావాలి. కలిసి తిరిగి, ఆశలు రేపి పుటుక్కున బంధాన్ని తెంచుకుని ఆత్మహత్యకు ఉరికొల్పేంత మానసిక క్షోభపెట్టిన అమ్మాయి హింసమాత్రం మనకు కనిపించదు. కారణం...నాకూ తెలీదు.


వయసులోని ప్రేమల్ని..వయసుకు రాని ప్రేమల్నీ సహానుభూతితో అర్థం చేసుకునే తల్లిదండ్రులూ, సమాజం రానంతవరకూ యాసిడ్లతో పాటూ ఆత్మహత్యలూ జరుగుతూనే ఉంటాయి. మనం బ్లాగుల్లో మీడియాలో చదివో చర్చించో కొంత బరువు దింపుకుంటూనే ఉంటాం. పదండి, యాసిడ్ చర్చలకు కేటాయించిన సమయంలో నూరోవంతు ఈ ప్రేమ(ప్రేమ్ కుమార్) కోసం కేటాయిద్దామా!


****

Wednesday, December 17, 2008

‘వినాయకుడు’ దర్శకుడితో ముఖాముఖి

మొదటి భాగం కోసం ఇక్కడ నొక్కండి.

అప్పటిదాకా దాదాపు చాలారొజుల తరువాత కలిసిన స్నేహితుల్లాగా మాట్లాడేసుకున్న తరువాత, ‘వినాయకుడు’ సినిమా విషయం చర్చకు రాగానే ఆ సినిమా నాకు in parts మాత్రం నచ్చిందన్న నిజం గుర్తుకొచ్చింది. ఈ సారి కొంత “ఫ్రొఫెషనలిజం” చూపిద్ధామని ఒట్టుపెట్టుకున్నాను.ప్రశ్నలేతప్ప చర్చలొద్దని నిర్ణయించుకున్నాను. కానీ ప్రశ్నలడుగుతున్నంతసేపూ ఆత్మారాముడు స్వగతంగా ఏదో ఒకటి వాగుతూనే వుంటే వాడి మాటల్తో కలిపి ఈ ఇంటర్వ్యూ ఇలా తయారయ్యింది…

నేను (నే): ‘వినాయకుడు’… అసలీ టైటిల్ ఎలా వచ్చింది?
సాయి కిరణ్ (సాకి): ఈ టైటిల్లో వింతేమీ లేదు అందరికీ తెలిసిన పేరే. అన్ని స్థాయిల్లోని ప్రజలూ వాడే పదమే. నిజానికి గణేష్, గణపతి అనే పేర్లకన్నా వినాయకుడు అంటేనే కొంత ‘నిండుతనం’ ఉందనిపిస్తుంది. ఈ టైటిల్ సజెస్ట్ చేసినప్పుడు పరిశ్రమలో చాలా మంది “వైబ్రేషన్ లేదు” అన్నారు. ఆ వైబ్రేషనేమిటో! అదెక్కడుంటుందో!! తెలీదుగానీ, నా కథకు తగ్గట్టుగా ప్రేక్షకులకు సులభంగా రిజిస్టర్ అయ్యేలా వుంటుందని అదే ఖాయం చెసాను.
(స్వగతం (స్వ): వైబ్రేషనా! సినిమా పేర్లలోకూడా ఈ మధ్యకాలంలో వైబ్రేషన్ ఆశిస్తున్నారా పరిశ్రమ జనాలు? అయినా కథలో పట్టు కథనంలో వైవిధ్యం లేకుండా సినిమా తీసేసి టైటిల్ లో వైబ్రేషనొచ్చినా, పేరే “వైబ్రేషన్” అని పెట్టినా ప్రేక్షకులు చూసేస్తారా!)Link

పూర్తి ముఖాముఖి కోసం నవతరంగం చూడండి.


****

Tuesday, December 16, 2008

మతమా...! కులమా...?

కులచర్చలు అంత తొందరగా తెగేవీకాదు అంగీకారాత్మక నిర్ణయాలకు వచ్చేవీ కావు.అవి మన సామాజిక మనుగడనూ, ఆలోచననూ problamatize చేసి కొత్త సమీకరణాల్ని తయారుచెయ్యడానికేతప్ప సమస్యల్ని తీర్చడానికి ఎప్పుడూ ఉపయోగపడలేదు. ఇప్పట్లో అలా ఉపయోగపడే పరిస్థితీ కనిపించడం లేదు.


హిందూ మతస్థులు ఎప్పుడూ ఒక cohesive సమూహంగా వ్యవహరించ లేదు.ఒకే మతానికి చెందినవారిగా కొన్ని shared symbols ఉన్నప్పటికీ,ఆచారవ్యవహారాలు, విధివిధానాలు,సాంప్రదాయాలూ అన్నీ కులపరంగా ఏర్పరచబడ్డాయి లేదా అలాగే ప్రచారం కల్పించబడ్డాయి.


చాతుర్వర్ణాల సృష్టినుంచీ పంచమకులాల్ని చేర్చేవరకూ విభజించి పబ్బంగడుపుకునే బ్రాహ్మణక్షత్రియవర్ణాల ఆధిపత్య కుట్ర తప్ప మతపరిరక్షణ ఎవరి ఉద్దేశమూ కాలేదు. జ్ఞానాధారిత,రాజ్యాధికారాధారిత సంఘం నుంచీ భూమిఆధారిత సంఘం ఏర్పడే సరికీ నియో-క్షత్రియ (రెడ్డి,కమ్మ,బలిజ మొ")కులాలు తమ అధికారాన్ని చెలాయించాయేతప్ప సర్వమానవ సమానత్వం ఎక్కడా చూపించలేదు. అందుకే ఇప్పుడు దళితులు మేము హిందువులం కాము పొమ్మంటున్నారు.


భూమినుంచీ రాజకీయం రాజ్యాధికారానికి మూలమవ్వగానే ఇవే కుల సమీకరణాలు ఆ వ్యవస్థమీద superimpose అయ్యాయి.అంటే వ్యవస్థ మారినా మూలాలు మాత్రం అవే అన్నమాట.ఓట్ బ్యాంక్ రాజకీయ క్షేత్ర్రంలో ఈ వర్గసమూహాల స్పృహ విజయవంతంగా ప్రతిసారీ reinforce చెయ్యబడింది.ప్రజాస్వామ్యంలో సమానత్వం తేవడంపోయి రాజకీయలభ్ధి కోసం కులాలు మరింత కరుడుగట్టిపోయాయి.కొన్ని కులాలు తమపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ కులాల ఉనికిని బలోపేతం చేస్తుంటే,మరికొన్ని తమకు సంక్రమించిన అధికారం ఎక్కడ కోల్పోతామో అన్న భయంతో మరింతగా ఈ కులవ్యవస్థని వ్యవస్థీకరిస్థున్నాయి.


ఇటువంటి రాజకీయబ్రహ్మాస్త్రాన్ని త్యజించి సమానత్వాన్ని కాంక్షించే ఆలోచన దాదాపు అన్నికులాల్లోనూ అడుగంటింది. ఇది హిందూమత సమస్య కాదు. ఇదొక ఆర్థిక-సామాజిక-రాజకీయ సమస్య.కులాలకి మూలాలు మతంలో వున్నా,అసలే అరవ్యవస్థీకృత హిందూమతంలో ఈ విస్తృత సమస్యను తీర్చే శక్తి లేదు.ఈ సామాజిక సమస్యకు మతపరమైన సమాధానం వెతికితే అది మరింత ప్రమాదకరమైన పరిణామం అవుతుందేతప్ప solution ఏనాటికీ కాదు.


కాబట్టి, కులాన్ని ఒక సామాజిక వర్గంగా చూసి ఆర్థం చేసుకుని ఆరాతీసి సమాధానాలు వెతకగలిగితే కొంతైనా సాంత్వన కలగొచ్చు. హిందూమత పరిరక్షణలో భాగంగా కులాలను విడనాడాలని పిలుపునిస్తే మాత్రం మతాన్ని వదిలేస్తారేమోగానీ కులాల్ని చాలా మంది వీడలేరు.ఆధ్యాత్మికతకు మతమైతే కులం ఆర్థిక-సామాజిక-రాజకీయ అధికారానికి హేతువు.ఈ ఒక్క కారణం చాలు మతాన్ని త్యజించి కులాన్ని తలకెక్కించుకోవడానికి.



‘హిందూఛారిటీస్’ అనే బ్లాగులో ‘కులమును విసర్జించండి’ అనే టపాకు నేను చేసిన వ్యాఖ్య ఇది.

****

‘వినాయకుడు’ దర్శకుడితో పరిచయం

మధ్యాహ్నం రెండుగంటల ప్రాంతంలో ఫిల్మ్ నగర్ చేరుకున్నాను.ఫోన్ లో మళ్ళీ ఆఫీస్ అడ్రస్ అడగాల్సొచ్చింది. ఒకటో సారి. రెండో సారి మూడో సారి. అదే గొంతు విసుగులేకుండా ఓపిగ్గా డైరెక్షన్స్ చెబుతుంటే…’కొత్తగా విజయాన్ని దక్కించుకున్న ఒక నూతన సినీదర్శకుడు ఇంకా సాధారణంగా ఉన్నాడంటే అసాధారణమే’ అనిపించింది. ఆఫీస్ లోపలికి అడుగుపెట్టాను. అప్పుడే కొత్తగా ఏర్పాటుచేసుకుంటున్న పార్టిషన్లు ఇంకా పని జరుగుతున్నట్లుగా సంకేతాలందించాయి. ఆదివారం కాబట్టి వర్కర్లు పని చెయ్యడానికి రాలేదేమోగానీ, లేకుంటే the office would have been bustling with work of setting up the place…a new place for new achiever in Telugu film industry.



రిసెప్షన్లో ఎవరూ లేరు. లోపల కొన్ని గొంతులు వినపడుతున్నాయి. కొంత ఇబ్బందిగా అనిపిస్తుండగానే గదిలో అడుగుపెట్టాను.’సాయి కిరణ్!!’ అంటూ నేను నీళ్ళు నమిలేసరికీ పాతిక ముప్పై సంవత్సరాల యువకుడొకరు “హలో మహేష్” అంటూ చెయ్యి కలిపాడు. పరిచయాల తర్వాత, “ప్లీస్ ఓ రెండు నిమిషాలు వెయిట్ చెయ్యగలరా!” అంటూ పక్కనున్న వ్యక్తితో నన్ను పక్కగదిలో కూర్చోబెట్టమని పురమాయించాడు. రెండు నిమిషాలకన్నా ముందే వచ్చి, “చెప్పండి మహేష్ గారు. ఏదో స్టోరీ డిస్కషన్ నడుస్తుంటేనూ…” అంటూ ఎదురుగా కూర్చున్నాడు. అప్పుడు చూసాను, ఏదో కాలేజో యూనివర్సిటీ క్యాంపస్ లోనో కనిపించే ఒక సాధారణ విద్యార్థిలాంటి యువకుడ్ని. తెలివైన ముఖం. తెలివిని కప్పిపుచ్చే అమాయకపు కళ్ళద్దాలు. ఆ కళ్ళద్దాలమాటున దాక్కునీ దాక్కోలేకున్న విజయగర్వంతో కాకుండా విజయానందంతో మెరిసేకళ్ళు. తన పేరు సాయి కిరణ్ అడివి. ఈ మధ్య చిన్న సినిమాగా రిలీజై పెద్ద సినిమా స్థాయిలో నడుస్తున్న ‘వినాయకుడు’ సినిమా దర్శకుడు.


పూర్తి వ్యాసం కోసం నవతరంగం చూడండి....

Monday, December 8, 2008

ఏది నిజం ? ఏది సత్యం?

15 పార్క్ అవెన్యూ (అనే భారతీయ ఆంగ్లచిత్రం) నాకు విపరీతంగా నచ్చిన సినిమాలల్లో ఒకటి. అందులో కొంకణా సేన్ శర్మ (మీఠీ) పాత్రకు స్కిజోఫీనియా (schizophrenia) అనే మానసికవ్యాధి ఉంటుంది. ఈ వ్యాధిగ్రస్తులు తమదైన ఆలోచనల్లో, కల్పిత నిజాల్లో, ఊహాజనిత జీవితాల్లో కాలం గడుపుతూ ఉంటారు. అదే నిజంగా, అదే జీవితంగా భ్రమిస్తూ ఉంటారు.


ఈ చిత్రంలో ఒక దృశ్యంలో మీఠీ యొక్క ఊహాజనిత కుటుంబం, భర్త,పిల్లలు, ఇల్లు మొదలైన మాటల్తో విసుగెత్తిపోయిన మీఠీ అక్క అంజలి (షబానా ఆజ్మీ) "ఇవన్నీ నిజాలు కావు కేవలం నీ మెదడ్లోంచీ వచ్చిన కల్పన" అని ఖరాఖండిగా ఒకస్థాయిలో rude గా చెబుతుంది. అప్పుడు మనం సహజంగా మీఠీ నుంచీ ఆశించే స్పందన నిరాశపడటమో లేక హింసాత్మకంగా ప్రవర్తించడం. కానీ మీఠీ అలా చెయ్యదు. చాలా ప్రశాంతంగా ఒక కాలేజీ ప్రొఫెసర్ అయిన అంజలితో "నువ్వొక ప్రొఫెసర్వి. కాలేజిలో చదువు చెబుతావు. పెద్దపెద్ద వ్యాసాలు రాస్తావు. ఇవన్నీ నిజం కాదు. కేవలం ఊహలని, నీ మెదడు కల్పించిన కల్పన మాత్రమే అని చెబితే నీకు ఎలా ఉంటుంది?" అని అడుగుతుంది.


ఈ డయలాగ్ వినగానే, నా మెదడు పైన ఒక బకెట్టు చన్నీళ్ళు కుమ్మరించినట్లనిపించింది. "ఎంత వేదాంతం, జీవిత సత్యం నిండుందీ ఆలోచనలో!" అనిపించింది. మనకు తెలిసిన ప్రపంచమే మన నిజం. పదుగురు అంగీకరించిందీ పాటించేదే మనకు సత్యం. అంతేతప్ప ‘నిజంగా నిజం’ ఎవరికైనా తెలుసా? ఏది సత్యమో ఖచ్చితంగా చెప్పగలమా? మనకు తెలీనిదాన్ని నిజం కాదనుకుంటాం. అప్పటీకే తెలిసిందానికి భిన్నంగా కొత్తగా ఏదైనా వినిపిస్తే కనిపిస్తే సత్యం కాదని నిర్ణయించుకుంటాం. నిజం సత్యమనేవి వ్యక్తిగతమని, భావాలకూ, నమ్మకాలకూ, తమకు తెలిసిన ప్రపంచానికీ అనుగుణంగా అవి రూపాంతరం చెందుతాయని అందరం మర్చిపోతాం. అలాంటప్పుడు మనం నమ్మివన్నీ నిజాలు కావని ఎవరైనా చెబితే ఎలా ఉంటుంది? మనజీవితం ‘కేవలం ఊహ!’ అని ఎవరైనా తేల్చేస్తే ఎలా ఉంటుంది?


అందుకే...సత్యానికి పలు పార్శ్వాలుంటాయని నా నమ్మకం.నిజానికి వివిధ కోణాలుంటాయని విశ్వాసం. అకిరకురసోవా ‘రోషోమాన్’ లో చెప్పినా, మన శ్యాంబెనెగల్ ‘సూరజ్ కా సాత్వాఘోడా’ లో వివరించినా, ఆల్బర్ట్ అయిన్ స్టీన్ సాపేక్షసిద్ధాంతంలో ప్రతిపాదించినా...ఇతి...ఇతి (ఇదే ఇదే!!). నిజం- సత్యం అనేవి ఎప్పటికీ నేతి..నేతి (ఇది కాదు ఇదికాదే!!).


****

Sunday, December 7, 2008

లెట్ మీ ఆల్సో కన్ఫెస్...


'నువ్వు స్వార్థపరుడివి...!
నా అవసరంకన్నా నీ అహం నీకు ముఖ్యం
నా భావనలకన్నా నీ విలువలు నీకు ముఖ్యం'
అని తనంటుంటే...
సమాధానం చెప్పలేక
నిజాల్ని మింగలేక
ఇంకాజీర్ణించుకోని విలువల్ని కక్కలేక
నేను పడ్డ బాధ...ఏమని చెప్పేది?

మొదటిసారి కలిసాం
మళ్ళీ కలిసాం
మళ్ళీమళ్ళీ కలిసాం
రుచులూ అభిరుచులూ ఆలోచనలూ
ఆద్యంతంకాకున్నా అక్కడక్కడా కలిసాయి
ఇంతకన్నా 'స్నేహానికి' మరేంకావాలని
స్నేహితులమయ్యాం

'ఆడామగా మధ్య స్నేహమేమిట్రా కన్నా!
ఎంత రుచీ,అభిరుచీ ప్రాతిపదికైనా
ఎదరెదురుగా నిలిచాక
అప్పుడప్పుడూ...
మూలసూత్రం మాత్రం మారదురా చిన్నా..!’
అని మనసెంతచెబుతున్నా
పవిత్రంగా జ్వలిస్తానని
చెప్పిన మాటకు కట్టుబడతానని
కొత్తవిలువల కాకలో భీష్మప్రతిజ్ఞ గావించా

బలహీనతల్ని బలవంతంగా
భూస్థాపితం చేసి
కొత్తవిలువల్ని ఖచ్చితంగా పాటించడానికే నిర్ణయించా
స్టేట్మెంట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ సాక్షిగా
స్నేహంతప్ప మరేమీ కాకూడదని నిశ్చయించా

కానీ...

శరీరధర్మం స్నేహధర్మాన్ని ప్రశ్నించే క్షణాలు
మోహావేశాలు మనసుల్ని వివశుల్ని చేసే నిమిషాలు
అవసరాలు ఆదర్శాల్ని వెక్కిరించే తరుణాలు
ఎన్నో... ఎన్నెన్నింటినో దాటుకుని
స్పందనల్ని నడిసంద్రంలో నెట్టుకుని
కోరిల్ని కట్టగట్టి కాల్చుకుని
నిష్టగా నిర్ధ్వందంగా తనని నిలువరిస్తే...

ఇప్పుడు తనంటుంది...
'నువ్వు స్వార్థపరుడివి...!
నా అవసరంకన్నా నీ అహం నీకు ముఖ్యం
నా భావనలకన్నా నీ విలువలు నీకు ముఖ్యం'
అని

నిజమేనా!?!
నేను స్వార్థపరుడ్నా!
‘పవిత్ర’పాపినా!!

మళ్ళీ విలువల్ని బేరీజుచేసుకోవాలి
పాతవిలువల్ని పరీక్షించుకోవాలి
కొత్తవాటిని జీర్ణింఛుకోవాలి
కొన్నింటిని త్యజించాలి
మరికొన్నింటిని...తెలీదు
ఏదో ఒకటి చెయ్యాలి !


*‘లెట్ మీ కన్ఫెస్’ కవితా సంకలం ప్రేరణతో...

****

Wednesday, December 3, 2008

లెట్ మి కన్ఫెస్ : ఒక పరిచయం

Reader's Discretion is requested: ఇక్కడ పొందుపరచబడిన కవితల్లోని కొన్ని అంశాలు (కొందరికి) అభ్యంతరకరంగా అనిపించవచ్చు. ఈ కవితా సంకలనాన్ని పరిచయం చేస్తున్న ఉద్దేశంకూడా ఆ వైరుధ్యమే కాబట్టి, పాఠకులు తమ ఇంగితజ్ఞానాన్ని ఉపయోగించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తాను.


పుస్తకం పేరు: లెట్ మి కన్ఫెస్
సాహితీ విధానం: కవితా సంకలనం
కవి: పసుపులేటి పూర్ణచంద్ర రావు
పబ్లిషర్ : ELMO BOOKS
ధర: Rs 75/-
ప్రతులకు : విశాలాంధ్ర, నవయుగ పుస్తకాలయాలు.


"నరాలు జివ్వున లాగే గొప్ప అనుభవాన్ని స్త్రీ మనకిచ్చినప్పుడు, ఆ అనుభవం తర్వాతి అనుభూతిని హాయిగా నెమరవేసుకుని అమరత్వం పొందే ఆ కాన్షస్నెస్ని అద్భుతంగా చెప్పగలిగితే, అది సాహిత్యం ఎందుక్కాదు...?" అని ప్రశ్నించి మరీ కవితలు రాసేస్తే, ఆ భావప్రవాహాన్ని సాహిత్యం అనకుండా వుండగలమా!


కవిత్వాన్ని ఎందుకు రాస్తారో నాకు తెలీదు. అప్పుడప్పుడూ కవితల పేరుతో నేనూ పదాలు అల్లినా, ప్రాసల్ని గిల్లినా అదొక ప్రయత్నంగా మిగిలిందేతప్ప నేను చెప్పాలనుకున్న పరామార్థం ఆవిష్కరించలేదనే వెలితి ఎప్పుడూ ఉండేది. ఈ మధ్యకాలంలో పుస్తకాల్లో, బ్లాగుల్లో కవితల్ని చదివి స్పందించగలిగాను. ఆస్వాదించగలిగాను. అనుభవించగలిగాను. కొందరి కవితల్లో పదచిత్రాలు నన్ను ఆకట్టుకుంటే, మరికొన్నిట్లో అసాధారణ సాధారణత్వం చూసి మురిసిపోయాను. భావగర్భిత ఉద్వేగాలు కొన్ని కవితల్లో చవిచూస్తే, మరికొన్ని కవితలు వేదనావేదనల్ని పదాల్లో కూర్చగా చదివాను.కానీ ఇప్పటివరకూ ఎక్కడా చాచి లెంపకాయకొట్టినట్లు షాక్ ఇచ్చే కవితల్ని చదవలేదు.ఈ మధ్యనే ఒక స్నేహితుడిపుణ్యమా అని అలాంటి కవితా సంకలనాన్నొకటి దక్కించుకుని, కొన్ని బలమైన లెంపకాయల్ని ప్లెజంట్ గా షాకింగ్ గా తిన్నాను. Its an outrageous poetry that I have ever read in Telugu.


అదే "లెట్ మి కన్ఫెస్" అనే పుస్తకం. 'పసుపులేటి పూర్ణచంద్ర రావు' రాసిన కవితల సంకలనం. 'సెల్ఫ్ ఇంట్రో' అంటూ, "ఏ సమాజ ఉద్దరణ కోసవూ నేనీ పొయిట్రీ రాయలేదు. నా ఆనందం కోసం, నాలో నేను నవ్వుకోవడం కోసం, నాలో నే జూసుకుని, నావంకరల మీద జోక్ చేసుకోవడం కోసం, అంతకన్నా ముఖ్యంగా నా స్త్రీ (ల)ని నేను తలుచుకోవడం కోసం అప్పుడప్పుడూ తోచినప్పుడల్లా ఇరవై ఏళ్ళుగా ఈ "కన్ఫెషన్స్" చేస్తూ వచ్చాను. నిజానికివి నా డైరీలో పేజీల్లాంటివి" అంటూ మంగళవాక్యాలు పాడేసి. ఆతరువాత వరుసగా మనసుతడిని, యవ్వనపు చిత్తడిని, స్త్రీపురుషుల కాంప్లెక్స్ బంధాల కథాకమానిషుని ఆద్యంత్యం అద్భుతంగా, ఆలోచనాత్మకంగా, అబ్బురపడేలా కవిత్వించేశారు.


ఈ పుస్తకాన్ని పరిచయం చెయ్యాలంటే మొత్తం సంకలనాన్నిక్కడ మక్కీకి మక్కీ దింపాలి. ఎందుకంటే, ఇందులోని ఏ కవితా స్వయంసంపూర్ణం కాదు. మొత్తం సంకలనం కూడా స్వయంప్రకాశకం కాదు. జీవితాన్ని మధించకపోతే, ముందుగా కొంత యోగం పొందకపోతే ఈ భోగం అర్థం కాదు. కవి జీవితంలోని లోతుల్ని కూసింతైనా మనజీవితంలో అనుభవించకపోతే లేక కనీసం కనీవినకపోతే obscene ideas of perversion లాగా అనిపిస్తాయేతప్ప అక్కునచేర్చుకుని ఆదరించదగ్గ అద్భుత కవితల్లా కనిపించవు. అందుకే, simply outrageous అనాల్సొచ్చింది.

"మనిషీ కావాలి...
పశువూ కావాలి...అనే స్త్రీని
సముద్రాన్ని ఔపోసన పట్టినంత తేలిక్కాదు కదా
దిగమింగడం...!
నిజం-
తనకు ఖచ్చితంగా ఏం కావాలో తెలిసిన
స్త్రీని
అంత తేలిక్కాదు ప్రేమించడం...!"

అంటూ తన పురుషాహంకార బలహీనతను, స్త్రీపట్ల తనకుగల అంతర్గత భయాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకోవడం ఇక్కడే చెల్లింది. ఈ విషయం స్వయంగా చెబుతూ, "అప్టరాల్ నేను మగాడ్ని; లభించే అనేక ఎడ్వాంటేజస్ ని అందుకుంటున్నవాడ్ని; స్త్రీలు ఖచ్చితంగా విక్టిమ్సే అని గ్రహించికూడా, ప్రాక్టికల్గా స్త్రీ శ్రమని దోచడంలో పురుష భూస్వామ్య లక్షణాల్ని పూర్తిగా వొదులుకోలేనివాడ్ని- ఎలా అబద్ధం చెప్పను...? ఎడ్వాంటేజ్ కి అలవాటుపడ్డ ప్రాణం కదా...! అంత తేలిగ్గా పురుషావకాశాల్ని లొదులుకొంటానా.." అంటాడీ కవి. ఎంత దారుణం కదా!


‘సౌందర్యం కోసం’ పరితపిస్తూ భగ్నప్రేమనుకూడా అనిర్వచనీయమైన పూజగా చేసుకోమంటూ కవిచెప్పే కథ చూడండి;

"చాతనైతే
నీ దేవత
నీ చేయి వదిలిపోయినా చితికిపోకు...
చిట్లిపోయిన గుండేనే చేతిలో పట్టుకుని
చెమ్మగిల్లిని కళ్ళతో
చిట్టచివరిగా చేయు ఊపు...!
పోతే...గుండె విచ్చిపోనీగానీ
మొట్టమొదటి సారి చూడగానే
నీ దేవత కోసం
నీ గుండె ఎలాకొట్టుకుందో
ఆ పిచ్చిప్రేమను మాత్రం చచ్చిపోనీకు..!"

ఇంతకంటే మంచి సలహా భగ్నప్రేమికులకు ఎవరైనా ఇవ్వగలరా?!?



సింగిల్ మదర్స్ తొడుక్కునే ‘మానుషి- మాస్క్’ గురించి,available women గా చూసే మగాడి చూపుగురించి చెబుతూ...
" ‘లంజ...
మొగాడిలా కాలెత్తి
ఇట్నుంచీ అటేసి మోటార్ సైకిలెక్కుతుంది...!’
అని ప్రతిసారీ అగ్లీగా బావురుమంటారు
ఉత్త మీసాలు తప్ప
చెప్పుకోను మరో గొప్పలేని మెగవాళ్ళు...

...బల్లెంలా ఇల్లు చేరుతుంది
భళ్ళున తలుపు తెరుస్తుంది
పెళ్ళున విరిగి మంచంలో కూలిపోతుంది

ఇక అంతటితో
ఆ మంటల మాస్క్ తీసి
విసిరి...మంచం కింద పారేస్తుంది...!

కొసరి
కొడుక్కి గోరుముద్దలు తినిపిస్తుంది..
కసిరి
కసాపిసా క్లాసు పుస్తకాల్ని నవిలిస్తుంది..."

అంటూ మరోరూపాన్ని చూపించి ఆధునికజీవితంలో తప్పనిరిగా కనపించే (తనకు తెలిసిన) సింగిల్ విమెన్ గురించి మనకొక పదచిత్రాన్ని, భావవైచిత్ర్యాన్నీ అందిస్తారు. అదే ఊపులో ఒక ‘కామగానం’ చేస్తూ...

" కామం అంటేనే స్నేహం..
స్నేహం అంటేనే శాంతి...
మేం శాంతికాముకులం
యుద్ధ వినాశకులం..
నో సెక్స్ ప్లీస్...! ఉయ్ ఆర్ సెయింట్స్...!
అనే వెధవలతో
అసలు యుద్ధం ఏవిటి..?" అంటూ తనదైనా భాష్యాల్ని చెబుతూనే సూటిగా ప్రశ్నిస్తాడు కవి.


"తెల్లవారుఝాముకు కాస్తంత ముందరే
నా స్లీపింగ్ బాగ్ జిప్ పర్ర్ పర్ర్ న పగలదీసి
పక్కలో దూరిపడుకొంది...!
చీకట్లోకి చందమామల్ని విడిచి
పడుకుంటూనే పకపకా నవ్వింది...!

అలా నా కోపాన్ని
తన ముద్దు దువ్వెనతో ఆ అర్థరాత్రి దువ్విందా-
తెల్లారి బారెడు పొద్దెక్కి లేచి
ముద్దుగా ముఖం మీద గుచ్చుకుంటున్న
మూరడేసి పొడుగున్న సూరీడి మీసాల్ని విదిలించుకొంటూ
కళ్ళు నులుపుకుంటూ
ఓ నువ్వా బాస్...!
భాగీ అనుకున్నాను...అంది!
అని సిగ్గుపడుతూ నా బుగ్గ మీద పొడిచింది...!" అని తన beautiful misadventure గురించి చెబుతూనే...అదే కవితలో;

"ప్రతి ఆడదానితోనూ
ఓ మెట్టు తరిగే మనకు
ప్రతి మగపశువుతోనూ
ఓ మెట్టు పెరిగే ఆ నిరంతర స్వేచ్చ
మళ్ళీ
ప్రేమగానో...పిచ్చిలోనో
మనత నివిరేదెప్పుడో..! అంటూ తన అబ్బురపాటును, అద్వితీయ గౌరవాన్ని ప్రకటిస్తాడు.



‘బర్త్ ఆఫ్ వీనస్’ లో తన వనదేవతను ఆవిష్కరిస్తే, శ్వేతానందంలో ‘యూజ్ షీత్ మాన్..’ అంటూ, ‘తప్పదు... ఆతర్వాతే విందు’ అన్న శ్వేత సుందరి ఎదుట నీరుగారిన తనమగతనాన్ని ప్రస్తావిస్తాడు కవి. వెతికితే బూతేగానీ, కవిచెప్పిన విధానంలోని గమ్మత్తును చూడాలిక్కడ.

"అప్పటికే ఓ చావుచచ్చి గాల్లో తేలుతున్న
నా భూతాన్ని ఓ చక్కటి గులాబీ రంగు చిరు సంచిలో
ముద్దుగా బంధించి
మధురమైన మంత్ర తంత్రాలతో
అద్భుతంగా భూస్థాపితం చేయబోయింది...కానీ
ఆవిడి తాంత్రిక తీవ్రతకి తట్టుకోలేక
అసలే గిజగిజలాడుతున్న నా పిచ్చిభూతం
జస్ట్...
జస్ట్ భూమిని తాకీ తాకగానే
ఆగలేక...
ఆవేశంగా..భళ్ళున పేలి..బ్రద్ధలైపోయింది...!"


ఇలా యాభై కవితల్లో నిండిన ఎన్నో అనుభవాలు. వాస్తవిత, తాత్విత రెంటి కలబోతా ఈ కన్ఫెషన్స్ లో వున్నాయి. కవి మాటల్లోనే చూస్తే, "ఈ ప్యాకింగ్ పొరలు నిజంగా ఉల్లిపొరలే! ఒలిచి పూర్తిగా నగ్నం చేయగలిగినవాళ్ళు చేయండి. చేయకుండా కూడా నా కవిత్వంలోని నగ్నతను ఎంజాయ్ చేయగలిగిన వాళ్ళు అలాగైనా చేయండి. నగ్నతని చూడలేక కళ్ళుమూసుకునే వాళ్ళకోసవయితే నేనీ కన్ఫెషన్స్ చేయలేదు."


అందుకే, కొంత బలమైన appetite- జీర్ణశక్తి ఉన్నవాళ్ళుమాత్రమే ఈ కవితా సంకలనాన్ని చదవడానికి సాహసించండి.


****

Monday, December 1, 2008

టెర్రరిజాన్ని ఆపడానికి మనం ఏంచెయ్యాలి?


ముంబై ఘాతుకం నేపధ్యంలో మనకు కలిగిన ఉక్రోశం, ఆవేశం,ఆవేదన మరియూ కోపాన్ని ఒక నిర్మాణాత్మక రీతిలో వెళ్ళబుచ్చే అవకాశం కోసం వెతికాను. అలాంటి ఒక అవకాశం దొరికింది.కొందరు ఔత్సాహిక సామాజిక కార్యకర్తలూ, సంస్థలూ, వ్యక్తులూ, ఉద్యోగస్తులూ, అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్న కన్సల్టెంట్లు జనవరి 5, 2009 న హైదరాబాద్ లో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.


హైదరాబాద్ పాతబస్తీలో ముస్లిం సముదాయ సామాజిక,ఆర్థిక అభివృద్ధికి పాటుపడుతున్న ‘రోషన్ వికాస్’ సంస్థకు సంబంధించిన ‘అలి అజ్గర్’ ఆధ్వర్యం(coordination)లో ఈ సమావేశం జరుగనుంది. 90 లలో జరిగిన హైదరాబాద్ మతకల్లోలాలను ఆపడానికి అలిఅజ్గర్ చేసిన ప్రయత్నాలు పాతబస్తీవాసులకూ, హైదరాబాద్ వాసులకీ విదితమే. ఈ చర్చల్లొ పాల్గొని పౌరులుగా గ్లోబల్ టెర్రరిజంకు వ్యతిరేకంగా మన గొంతులను నిర్మాణాత్మకంగా ప్రభుత్వంవరకూ చేరవేయడానికి ప్రయత్నిద్దాం.


ఇప్పటికి ఈ క్రింది విషయాలు 5వతేదీ సమావెశాల్లో చర్చించడానికి ప్రతిపాదించడం జరిగింది.

  1. టెర్రరిజంపై భారతీయ విధానాల గురించి ఒక పరిశీలన
  2. మైనారిటీ-మెజారిటీ వాదాలు : ప్రస్తుత ఎన్నికల విధానం
  3. పోలీసు సంస్కరణలు :రాజకీయనియంత్రణ: టెర్రరిజం
  4. టెర్రరిస్టులకు ఆయుధాల సరపఫరా చేసే అంతర్జాతీయ కంపెనీలను కట్టడి చేసేందుకు భారత్ నేతృత్వంలో ఐక్యరాజ్యసమితి ద్వారా ప్రయత్నానికి వ్యూహం.

ఇంకా ఏదైనా అంశాలు చర్చకు పెట్టదలిస్తే మెయిల్ పంపగలరు. aliasghar60@gmail.com
చర్చలో పాల్గొని తమవంతుగా policy recommendation -విధానపర సూచనలు అందించగలరు.


రాజకీయవ్యవస్థనూ, రాజకీయనాయకులనూ విమర్శించడం. రక్షణ,నిఘా,పోలీసు వ్యవస్థలలోని లోపాలను ఎత్తిచూపడం. మీడియాలోని అతిని ఎండగట్టడం చాలా సులువుగా మనం చెయ్యగలిగే పని. కానీ, మన మేధస్సును, సంవేదననూ, ఆలోచననూ మరింత అర్థవంతంగా ఉపయోగకరంగా తెలియజెప్పడం ప్రస్తుతం మన కర్తవ్యం. ఈ సమావేశంలో ఒక ఆచరణప్రణాళిక ఏర్పరుచుకుని రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ స్థాయిల్లో ఆ ప్రణాళికను ఎలా అమలుపరచాలనే ప్లానింగ్ కూడా చెయ్యబడుతుంది. భారతదేశ పౌరులుగా వివిధస్థాయిల్లో మనం గ్లోబల్ టెర్రరిజంపై పోరాటంలో ఏవిధంగా భాగస్వాములవ్వగలం అన్నది ఇక్కడ నిర్ణయించుకోవచ్చు. Let's swing in to action. Let's contribute our bit to the nation. Let's contribute ideas, plans and proposals to combat terrorism. Let's make India a safe place to live. Let's make the world safe place to be in.

*****