Sunday, December 7, 2008

లెట్ మీ ఆల్సో కన్ఫెస్...


'నువ్వు స్వార్థపరుడివి...!
నా అవసరంకన్నా నీ అహం నీకు ముఖ్యం
నా భావనలకన్నా నీ విలువలు నీకు ముఖ్యం'
అని తనంటుంటే...
సమాధానం చెప్పలేక
నిజాల్ని మింగలేక
ఇంకాజీర్ణించుకోని విలువల్ని కక్కలేక
నేను పడ్డ బాధ...ఏమని చెప్పేది?

మొదటిసారి కలిసాం
మళ్ళీ కలిసాం
మళ్ళీమళ్ళీ కలిసాం
రుచులూ అభిరుచులూ ఆలోచనలూ
ఆద్యంతంకాకున్నా అక్కడక్కడా కలిసాయి
ఇంతకన్నా 'స్నేహానికి' మరేంకావాలని
స్నేహితులమయ్యాం

'ఆడామగా మధ్య స్నేహమేమిట్రా కన్నా!
ఎంత రుచీ,అభిరుచీ ప్రాతిపదికైనా
ఎదరెదురుగా నిలిచాక
అప్పుడప్పుడూ...
మూలసూత్రం మాత్రం మారదురా చిన్నా..!’
అని మనసెంతచెబుతున్నా
పవిత్రంగా జ్వలిస్తానని
చెప్పిన మాటకు కట్టుబడతానని
కొత్తవిలువల కాకలో భీష్మప్రతిజ్ఞ గావించా

బలహీనతల్ని బలవంతంగా
భూస్థాపితం చేసి
కొత్తవిలువల్ని ఖచ్చితంగా పాటించడానికే నిర్ణయించా
స్టేట్మెంట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ సాక్షిగా
స్నేహంతప్ప మరేమీ కాకూడదని నిశ్చయించా

కానీ...

శరీరధర్మం స్నేహధర్మాన్ని ప్రశ్నించే క్షణాలు
మోహావేశాలు మనసుల్ని వివశుల్ని చేసే నిమిషాలు
అవసరాలు ఆదర్శాల్ని వెక్కిరించే తరుణాలు
ఎన్నో... ఎన్నెన్నింటినో దాటుకుని
స్పందనల్ని నడిసంద్రంలో నెట్టుకుని
కోరిల్ని కట్టగట్టి కాల్చుకుని
నిష్టగా నిర్ధ్వందంగా తనని నిలువరిస్తే...

ఇప్పుడు తనంటుంది...
'నువ్వు స్వార్థపరుడివి...!
నా అవసరంకన్నా నీ అహం నీకు ముఖ్యం
నా భావనలకన్నా నీ విలువలు నీకు ముఖ్యం'
అని

నిజమేనా!?!
నేను స్వార్థపరుడ్నా!
‘పవిత్ర’పాపినా!!

మళ్ళీ విలువల్ని బేరీజుచేసుకోవాలి
పాతవిలువల్ని పరీక్షించుకోవాలి
కొత్తవాటిని జీర్ణింఛుకోవాలి
కొన్నింటిని త్యజించాలి
మరికొన్నింటిని...తెలీదు
ఏదో ఒకటి చెయ్యాలి !


*‘లెట్ మీ కన్ఫెస్’ కవితా సంకలం ప్రేరణతో...

****

12 comments:

శ్రీనివాస్ పప్పు said...

మహేష్ చాలా బాగుంది..
మీకో చిన్న విన్నపం.పేజ్-3(థి ఇన్సైడ్ స్టోరీ)హిందీ సినిమా రివ్యూ రాయగలరా నవతరంగంలో.కార్పొరేట్ సినిమాతో ఫ్రీ గా ఇచ్చాడు ఆ డివిడి నాకు.మొన్నే చూసా,మీడియా ని బేస్ చేసి తీసాడు మాధుర్ భండార్కర్,బాగుందనిపించింది(కొంకిణీ సేన్ శర్మ చాలా బాగ చేసింది)ఎందుకో మీరు దాని మీద రివ్యూ రాస్తే చదవాలనిపించింది.

Anonymous said...

నేను స్వార్థపరుడ్నా!
‘పవిత్ర’పాపినా!!
-correct!

గీతాచార్య said...

Let me confess too.

Visit...

http://thinkquisistor.blogspot.com/2008/12/blog-post.html

గీతాచార్య said...

"'నువ్వు స్వార్థపరుడివి...!
నా అవసరంకన్నా నీ అహం నీకు ముఖ్యం
నా భావనలకన్నా నీ విలువలు నీకు ముఖ్యం'
అని తనంటుంటే...
సమాధానం చెప్పలేక
నిజాల్ని మింగలేక
ఇంకాజీర్ణించుకోని విలువల్ని కక్కలేక
నేను పడ్డ బాధ...ఏమని చెప్పేది?"

ఆలోచింప చేస్తున్నాయి. నిజ జీవితం లో మీకు ఇలాంటి సందర్భం వస్తే ఏమి చేస్తారు? పైన ఇచ్చిన పోస్ట్ చదివి మీ అభిప్రాయం చెప్పగలరు.

Anonymous said...

dear kathi,

i still remember, we lived through such confessions and confusions during our college days. we were Hamlets, Paul Morels, gregor samsas and a bit of Meursaults. we had a lot of confusions regarding our confessions. i dont think we ever did CONFESS anything. To be or not to be...thats the question. but, we must do something. what..? ఏదో...!!! ఏదో ఒకటి చెయ్యాలి !చెయ్యాలి !

కొత్త పాళీ said...

good show.
నేనా పుస్తకం చదివాను. నాకేం పెద్దగా నచ్చలేదు. కానీ మీతో ఇది రాయించే ప్రేరణ నిచ్చినందుకు దాన్నిపూడు మెచ్చుకుంటున్నా :)

Bolloju Baba said...

ఈ కవితను మొన్నే చదివాను.
ఒక భావతీవ్రతను ప్రశ్నలరూపంగా సంధించబడ్డ కవిత.
కవిత చెపుతున్న అంశాలు
1. స్నేహంలో కూడా కొన్ని విలువలకు కట్టుబడి అస్కలితంగా ఉండగలగడం.
2.స్నేహితుడు/స్నేహితురాలు తప్పుచేద్దామా అన్నప్పుడు మనం కట్టుబడిన విలువల్కే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి నిగ్రహించుకోగలగడం.
3.అది అవతలి వ్యక్తికి మన నైతికతలా కాక అహంకారంగా అనిపించటం.
4.ఆ ప్రక్రియలో మనలో చెలరేగిన అంత;మధనం. కొండొకచో ఆత్మపరిశీలన.
దీనికి కవిసూచించే పరిష్కారం
పాతవిలువల్ని పరీక్షించుకోవటం, కొత్త వాటిని జీర్ణించుకోవటం, కొన్నింటిని త్యజించటం (నైతికత ?)
ఇవీ నాకు కలిగిన అభిప్రాయాలు.

మన జీవితాల్లో అనేక చిన్న చిన్న విషయాలలో జరిగే మోరల్ డైలమ్మా ని (చెయ్యకూడదూ అనుకొన్న పనిని, సన్నిహితుల వత్తిడివలన చేయటమో, లేక చెయ్యాలి అనుకొన్న పనిని చేయలేకపోవటామో, అలా జరిగిపోయినతరువాత లేదా నిగ్రహించుకోగలిగిన తరువాత మనలో ఏర్పడే చిన్న పాటి సంఘర్శ్హణ)
చాల గడుసుగా, ఒక పెద్దవిషయానికి ముడిపెట్టారు మీరు.

అభినందనలు

Anonymous said...

బాగుందండీ వాస్తకవిత, నిజాయితీ ప్రతిఫలించాయి కవితలో. అభినందనలు.

రాఘవ said...

మొదట కొన్ని వాక్యాలు చెప్పి... అలా ఎందుకో తరువాత చెప్పి మళ్లీ మొదటి వాక్యాలు చెప్పడం (ఒక వృత్తంలాగ) భలే అందాన్ని తీసికొనివస్తుంది. ఇక్కడా సరీగ్గా అదే జరిగింది. బావుంది.

ఏకాంతపు దిలీప్ said...

@ మహేష్ గారూ
నాకు హిమజ్వాలలో "వెలుగు మరక" గుర్తొస్తుంది... అది ఇన్స్పిరేషనా?

మోహన said...

చాలా బాగుంది మహేశ్ గారు..

Kathi Mahesh Kumar said...

అందరికీ ధన్యవాదాలు.
@బాబాగారూ! మీ విశ్లేషణ కవితను మరింత అర్థవంతం చేసిండీ.
@దిలీప్: హిమజ్వాల తెలీదుగానీ నాకు ప్రేరణనిచ్చింది మాత్రం ‘లెట్ మీ కన్ఫెస్’ అనే ఒక కవితా సంకలనం. దాని గురించి ఒక టపా రాసాను చదవండి.