Reader's Discretion is requested: ఇక్కడ పొందుపరచబడిన కవితల్లోని కొన్ని అంశాలు (కొందరికి) అభ్యంతరకరంగా అనిపించవచ్చు. ఈ కవితా సంకలనాన్ని పరిచయం చేస్తున్న ఉద్దేశంకూడా ఆ వైరుధ్యమే కాబట్టి, పాఠకులు తమ ఇంగితజ్ఞానాన్ని ఉపయోగించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తాను.
పుస్తకం పేరు: లెట్ మి కన్ఫెస్
సాహితీ విధానం: కవితా సంకలనం
కవి: పసుపులేటి పూర్ణచంద్ర రావు
పబ్లిషర్ : ELMO BOOKS
ధర: Rs 75/-
ప్రతులకు : విశాలాంధ్ర, నవయుగ పుస్తకాలయాలు.
"నరాలు జివ్వున లాగే గొప్ప అనుభవాన్ని స్త్రీ మనకిచ్చినప్పుడు, ఆ అనుభవం తర్వాతి అనుభూతిని హాయిగా నెమరవేసుకుని అమరత్వం పొందే ఆ కాన్షస్నెస్ని అద్భుతంగా చెప్పగలిగితే, అది సాహిత్యం ఎందుక్కాదు...?" అని ప్రశ్నించి మరీ కవితలు రాసేస్తే, ఆ భావప్రవాహాన్ని సాహిత్యం అనకుండా వుండగలమా!
కవిత్వాన్ని ఎందుకు రాస్తారో నాకు తెలీదు. అప్పుడప్పుడూ కవితల పేరుతో నేనూ పదాలు అల్లినా, ప్రాసల్ని గిల్లినా అదొక ప్రయత్నంగా మిగిలిందేతప్ప నేను చెప్పాలనుకున్న పరామార్థం ఆవిష్కరించలేదనే వెలితి ఎప్పుడూ ఉండేది. ఈ మధ్యకాలంలో పుస్తకాల్లో, బ్లాగుల్లో కవితల్ని చదివి స్పందించగలిగాను. ఆస్వాదించగలిగాను. అనుభవించగలిగాను. కొందరి కవితల్లో పదచిత్రాలు నన్ను ఆకట్టుకుంటే, మరికొన్నిట్లో అసాధారణ సాధారణత్వం చూసి మురిసిపోయాను. భావగర్భిత ఉద్వేగాలు కొన్ని కవితల్లో చవిచూస్తే, మరికొన్ని కవితలు వేదనావేదనల్ని పదాల్లో కూర్చగా చదివాను.కానీ ఇప్పటివరకూ ఎక్కడా చాచి లెంపకాయకొట్టినట్లు షాక్ ఇచ్చే కవితల్ని చదవలేదు.ఈ మధ్యనే ఒక స్నేహితుడిపుణ్యమా అని అలాంటి కవితా సంకలనాన్నొకటి దక్కించుకుని, కొన్ని బలమైన లెంపకాయల్ని ప్లెజంట్ గా షాకింగ్ గా తిన్నాను. Its an outrageous poetry that I have ever read in Telugu.
అదే "లెట్ మి కన్ఫెస్" అనే పుస్తకం. 'పసుపులేటి పూర్ణచంద్ర రావు' రాసిన కవితల సంకలనం. 'సెల్ఫ్ ఇంట్రో' అంటూ, "ఏ సమాజ ఉద్దరణ కోసవూ నేనీ పొయిట్రీ రాయలేదు. నా ఆనందం కోసం, నాలో నేను నవ్వుకోవడం కోసం, నాలో నే జూసుకుని, నావంకరల మీద జోక్ చేసుకోవడం కోసం, అంతకన్నా ముఖ్యంగా నా స్త్రీ (ల)ని నేను తలుచుకోవడం కోసం అప్పుడప్పుడూ తోచినప్పుడల్లా ఇరవై ఏళ్ళుగా ఈ "కన్ఫెషన్స్" చేస్తూ వచ్చాను. నిజానికివి నా డైరీలో పేజీల్లాంటివి" అంటూ మంగళవాక్యాలు పాడేసి. ఆతరువాత వరుసగా మనసుతడిని, యవ్వనపు చిత్తడిని, స్త్రీపురుషుల కాంప్లెక్స్ బంధాల కథాకమానిషుని ఆద్యంత్యం అద్భుతంగా, ఆలోచనాత్మకంగా, అబ్బురపడేలా కవిత్వించేశారు.
ఈ పుస్తకాన్ని పరిచయం చెయ్యాలంటే మొత్తం సంకలనాన్నిక్కడ మక్కీకి మక్కీ దింపాలి. ఎందుకంటే, ఇందులోని ఏ కవితా స్వయంసంపూర్ణం కాదు. మొత్తం సంకలనం కూడా స్వయంప్రకాశకం కాదు. జీవితాన్ని మధించకపోతే, ముందుగా కొంత యోగం పొందకపోతే ఈ భోగం అర్థం కాదు. కవి జీవితంలోని లోతుల్ని కూసింతైనా మనజీవితంలో అనుభవించకపోతే లేక కనీసం కనీవినకపోతే obscene ideas of perversion లాగా అనిపిస్తాయేతప్ప అక్కునచేర్చుకుని ఆదరించదగ్గ అద్భుత కవితల్లా కనిపించవు. అందుకే, simply outrageous అనాల్సొచ్చింది.
"మనిషీ కావాలి...
పశువూ కావాలి...అనే స్త్రీని
సముద్రాన్ని ఔపోసన పట్టినంత తేలిక్కాదు కదా
దిగమింగడం...!
నిజం-
తనకు ఖచ్చితంగా ఏం కావాలో తెలిసిన
స్త్రీని
అంత తేలిక్కాదు ప్రేమించడం...!"
అంటూ తన పురుషాహంకార బలహీనతను, స్త్రీపట్ల తనకుగల అంతర్గత భయాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకోవడం ఇక్కడే చెల్లింది. ఈ విషయం స్వయంగా చెబుతూ, "అప్టరాల్ నేను మగాడ్ని; లభించే అనేక ఎడ్వాంటేజస్ ని అందుకుంటున్నవాడ్ని; స్త్రీలు ఖచ్చితంగా విక్టిమ్సే అని గ్రహించికూడా, ప్రాక్టికల్గా స్త్రీ శ్రమని దోచడంలో పురుష భూస్వామ్య లక్షణాల్ని పూర్తిగా వొదులుకోలేనివాడ్ని- ఎలా అబద్ధం చెప్పను...? ఎడ్వాంటేజ్ కి అలవాటుపడ్డ ప్రాణం కదా...! అంత తేలిగ్గా పురుషావకాశాల్ని లొదులుకొంటానా.." అంటాడీ కవి. ఎంత దారుణం కదా!
‘సౌందర్యం కోసం’ పరితపిస్తూ భగ్నప్రేమనుకూడా అనిర్వచనీయమైన పూజగా చేసుకోమంటూ కవిచెప్పే కథ చూడండి;
"చాతనైతే
నీ దేవత
నీ చేయి వదిలిపోయినా చితికిపోకు...
చిట్లిపోయిన గుండేనే చేతిలో పట్టుకుని
చెమ్మగిల్లిని కళ్ళతో
చిట్టచివరిగా చేయు ఊపు...!
పోతే...గుండె విచ్చిపోనీగానీ
మొట్టమొదటి సారి చూడగానే
నీ దేవత కోసం
నీ గుండె ఎలాకొట్టుకుందో
ఆ పిచ్చిప్రేమను మాత్రం చచ్చిపోనీకు..!"
ఇంతకంటే మంచి సలహా భగ్నప్రేమికులకు ఎవరైనా ఇవ్వగలరా?!?
సింగిల్ మదర్స్ తొడుక్కునే ‘మానుషి- మాస్క్’ గురించి,available women గా చూసే మగాడి చూపుగురించి చెబుతూ...
" ‘లంజ...
మొగాడిలా కాలెత్తి
ఇట్నుంచీ అటేసి మోటార్ సైకిలెక్కుతుంది...!’
అని ప్రతిసారీ అగ్లీగా బావురుమంటారు
ఉత్త మీసాలు తప్ప
చెప్పుకోను మరో గొప్పలేని మెగవాళ్ళు...
...బల్లెంలా ఇల్లు చేరుతుంది
భళ్ళున తలుపు తెరుస్తుంది
పెళ్ళున విరిగి మంచంలో కూలిపోతుంది
ఇక అంతటితో
ఆ మంటల మాస్క్ తీసి
విసిరి...మంచం కింద పారేస్తుంది...!
కొసరి
కొడుక్కి గోరుముద్దలు తినిపిస్తుంది..
కసిరి
కసాపిసా క్లాసు పుస్తకాల్ని నవిలిస్తుంది..."
అంటూ మరోరూపాన్ని చూపించి ఆధునికజీవితంలో తప్పనిరిగా కనపించే (తనకు తెలిసిన) సింగిల్ విమెన్ గురించి మనకొక పదచిత్రాన్ని, భావవైచిత్ర్యాన్నీ అందిస్తారు. అదే ఊపులో ఒక ‘కామగానం’ చేస్తూ...
" కామం అంటేనే స్నేహం..
స్నేహం అంటేనే శాంతి...
మేం శాంతికాముకులం
యుద్ధ వినాశకులం..
నో సెక్స్ ప్లీస్...! ఉయ్ ఆర్ సెయింట్స్...!
అనే వెధవలతో
అసలు యుద్ధం ఏవిటి..?" అంటూ తనదైనా భాష్యాల్ని చెబుతూనే సూటిగా ప్రశ్నిస్తాడు కవి.
"తెల్లవారుఝాముకు కాస్తంత ముందరే
నా స్లీపింగ్ బాగ్ జిప్ పర్ర్ పర్ర్ న పగలదీసి
పక్కలో దూరిపడుకొంది...!
చీకట్లోకి చందమామల్ని విడిచి
పడుకుంటూనే పకపకా నవ్వింది...!
అలా నా కోపాన్ని
తన ముద్దు దువ్వెనతో ఆ అర్థరాత్రి దువ్విందా-
తెల్లారి బారెడు పొద్దెక్కి లేచి
ముద్దుగా ముఖం మీద గుచ్చుకుంటున్న
మూరడేసి పొడుగున్న సూరీడి మీసాల్ని విదిలించుకొంటూ
కళ్ళు నులుపుకుంటూ
ఓ నువ్వా బాస్...!
భాగీ అనుకున్నాను...అంది!
అని సిగ్గుపడుతూ నా బుగ్గ మీద పొడిచింది...!" అని తన beautiful misadventure గురించి చెబుతూనే...అదే కవితలో;
"ప్రతి ఆడదానితోనూ
ఓ మెట్టు తరిగే మనకు
ప్రతి మగపశువుతోనూ
ఓ మెట్టు పెరిగే ఆ నిరంతర స్వేచ్చ
మళ్ళీ
ప్రేమగానో...పిచ్చిలోనో
మనత నివిరేదెప్పుడో..! అంటూ తన అబ్బురపాటును, అద్వితీయ గౌరవాన్ని ప్రకటిస్తాడు.
‘బర్త్ ఆఫ్ వీనస్’ లో తన వనదేవతను ఆవిష్కరిస్తే, శ్వేతానందంలో ‘యూజ్ షీత్ మాన్..’ అంటూ, ‘తప్పదు... ఆతర్వాతే విందు’ అన్న శ్వేత సుందరి ఎదుట నీరుగారిన తనమగతనాన్ని ప్రస్తావిస్తాడు కవి. వెతికితే బూతేగానీ, కవిచెప్పిన విధానంలోని గమ్మత్తును చూడాలిక్కడ.
"అప్పటికే ఓ చావుచచ్చి గాల్లో తేలుతున్న
నా భూతాన్ని ఓ చక్కటి గులాబీ రంగు చిరు సంచిలో
ముద్దుగా బంధించి
మధురమైన మంత్ర తంత్రాలతో
అద్భుతంగా భూస్థాపితం చేయబోయింది...కానీ
ఆవిడి తాంత్రిక తీవ్రతకి తట్టుకోలేక
అసలే గిజగిజలాడుతున్న నా పిచ్చిభూతం
జస్ట్...
జస్ట్ భూమిని తాకీ తాకగానే
ఆగలేక...
ఆవేశంగా..భళ్ళున పేలి..బ్రద్ధలైపోయింది...!"
ఇలా యాభై కవితల్లో నిండిన ఎన్నో అనుభవాలు. వాస్తవిత, తాత్విత రెంటి కలబోతా ఈ కన్ఫెషన్స్ లో వున్నాయి. కవి మాటల్లోనే చూస్తే, "ఈ ప్యాకింగ్ పొరలు నిజంగా ఉల్లిపొరలే! ఒలిచి పూర్తిగా నగ్నం చేయగలిగినవాళ్ళు చేయండి. చేయకుండా కూడా నా కవిత్వంలోని నగ్నతను ఎంజాయ్ చేయగలిగిన వాళ్ళు అలాగైనా చేయండి. నగ్నతని చూడలేక కళ్ళుమూసుకునే వాళ్ళకోసవయితే నేనీ కన్ఫెషన్స్ చేయలేదు."
అందుకే, కొంత బలమైన appetite- జీర్ణశక్తి ఉన్నవాళ్ళుమాత్రమే ఈ కవితా సంకలనాన్ని చదవడానికి సాహసించండి.
Wednesday, December 3, 2008
లెట్ మి కన్ఫెస్ : ఒక పరిచయం
****
Subscribe to:
Post Comments (Atom)
13 comments:
Reality bites?
భగ్న ప్రేమికులకి ఇచ్చిన సలహా బాగుంది.
"మనిషీ కావాలి...
పశువూ కావాలి...అనే స్త్రీని
సముద్రాన్ని ఔపోసన పట్టినంత తేలిక్కాదు కదా
దిగమింగడం...!
నిజం-
తనకు ఖచ్చితంగా ఏం కావాలో తెలిసిన
స్త్రీని
అంత తేలిక్కాదు ప్రేమించడం...!"
మిగతా సంగతి కాదు కానీ ఇది మాత్రం నిజం. తనకు ఏమి కావాలో ఖచ్చితం గా తెలిసిన స్త్రీ ని ప్రేమించటం ఎ మాత్రం తేలిక కాదు. అలాంటి వారిని ప్రేమించాలంటే ఎన్నో గట్స్ కావాలి. ఈ విషయం గురించి నేనూ వ్రాయాలనుకుంటున్నాను. ఎలా రిసీవ్ చేసుకుంటారో?
కవిత్వం స్థూలంగా రెండు రకాలు. ఒకటి పదచిత్రాలతో పేర్చుకొని వచ్చేది రెండవది థాట్ బేస్డ్ కవిత్వం.
రెండవ రకపు కవితల్లో పదచిత్రాల సౌందర్యం కంటే చెప్పే ఒక విషయం సూటిగా సాధారణ మాటల్లో ఒదిగిపోతుంది.
ఈ రెండవ రకం కవిత్వాన్ని వెలువరించే కవులు ఎక్కువగా ఇజాల ఊబిలో కూరుకు పోయి ఉంటారు. వీరు చెప్పదలచుకొన్న ఒక సిద్దాంతాన్ని కానీ, అంతవరకూ పాఠకులకు/ప్రపంచానికి తెలియని కొత్త విషయాల్ని చెప్పాలన్న తపన గొప్ప ఫోర్స్ తో వీరి కవితల్ని నడిపిస్తుంది.
మీరిచ్చిన ఉదాహరణలను బట్టి ఈ పుస్తకంలోని కవితలు రెండవరకానికి చెందినaనిపిస్తుంది. (అఫ్ కోర్స్ పూర్తిగా చదివితే కానీ చెప్పలేమనుకోంది)
ఈ రకపు కవితలు నాదృష్టిలో ఎక్కువమంది వ్యక్తుల్ని ప్రభావితం చేస్తాయి.
పాఠకుడిని ఒక సుడిగుండం వంటి ఆలోచనలో పడేస్తాయి. ఏ సాహిత్య ప్రక్రియకైనా ఇంతకు మించి పరమార్ధమేమింటుంది.
గొప్ప పుస్తకాన్ని పరిచయం చేసారు.
తప్పని సరిగా కొని చదవాలి.
ధన్యవాదములు
బొల్లోజు బాబా
పుస్తకం చదవలేదూ, పేరు ఎప్పుడూ వినలేదూ కాని,
పైన మీరిచ్చిన పంక్తులు, నాకంత outrageous గా అనిపించలేదు మహేష్.
Anyway, thanks for the intro.
I should get it when I come to India.
Thanks
Kumar
>> 'మనిషీ కావాలి, పశువూ కావాలి' అనే స్త్రీని సముద్రాన్ని ఔపోసన పట్టినంత తేలిక్కాదు కదా
దిగమింగడం. నిజం, తనకు ఖచ్చితంగా ఏం కావాలో తెలిసిన స్త్రీని అంత తేలిక్కాదు ప్రేమించడం.
తనకేం కావాలో తెలీని స్త్రీని ప్రేమించటం మరింత కష్టం.
కవితా ప్రేమికులు నన్ను వాయించేస్తారేమోనని భయమున్నా రాయలేకుండా ఉన్నా .. ఇందులో కవిత్వం ఎక్కడుంది? వచనాన్ని విరిచేస్తే కవితా? నాకు తెలిసినంతవరకూ కవితలో ఓ రిథమ్ ఉండాలి. ఈ మధ్య ప్రయోగాల పేరుతో వాక్యాలు ఇష్టమొచ్చినట్లు విరిచేసి వాటినే పద్యాలు, కవితలు అనుకోండి పొమ్మంటూ మన మొహాన కొట్టేవాళ్లెక్కువైపోయారు.
కాదూ, కవి చెప్పదలచుకున్నదాన్ని చూడు .. అది కవితైతేనేంటి, వచనమైతేనేంటి అంటారా? అటువంటప్పుడు చెప్పదలచుకుందేదో సూటిగా చెప్పేయొచ్చుగదా. ఈ డొంకతిరుగుడెందుకు?
అసలు విషయంలోకొస్తే, నాకంతగా నచ్చలేదు - సబ్జెక్ట్ కాదు, పద్ధతి. ఆ విషయాలనే అంతకన్నా పదునుగా, మరింత భావస్పూరకంగా చెప్పుండొచ్చు.
Sounds like a good read.
@అబ్రకదబ్ర: వాక్యాల్ని విరిచేస్తే కవితైపోతుందనే అపోహ ఒకప్పుడు నాకూ వుండేది లెండి. కాకపోతే మధ్యే చదువుతూ చదువుతూ కొంత తెలిసివస్తోంది. భావాల్నీ లేక ఆలోచనల్నీ మూసల్లో(meter) పొయ్యడంకన్నా భావగర్భితమైన వచనంలో చెప్పెయ్యడం వచన కవిత్వం లక్షణం. ఇక్కడసలే కన్ఫెషన్స్ ఆయె...బహశా మొత్తం సంకలనం చదివితే మీకు నేను ఉటంకించిన ఉదాహరణ context బాగా అనిపిస్తుందేమో! లేదా నేను కొంచెం హత్తుకోని ఉదాహరణ చూపానేమో!! రెండూ సరే కావచ్చు.
మహేష్ గారూ, మంచి పరిచయం. కవితా సంకలనాలను ఎలా చదవాలో చెప్పేలా మీ పరిచయ వ్యాసం వుంది. ఇంగ్లిషులో వచ్చే పరిచయాలతో పోలిస్తే మన తెలుగులో కవిత్వ పరిచయం ఒక మూస ధోరణిలో సాగుతోందని నా నమ్మకం. ఇదిగో ఎప్పుడైనా ఇలా పర్సనల్ గా పుస్తకాన్ని గుండెలకు దగ్గరగా పొదువుకుని చెప్పే మంచి మాటలు వింటే అటు కవులకు, ఇటు పాఠకులకు ఉపయోగకరంగా వుంటుంది. కీప్ రైటింగ్.
"తనకేం కావాలో తెలీని స్త్రీని ప్రేమించడం ఇంకా కష్టం" అబ్రకదబ్ర కూడా బాగానే చెప్పారు.
కొనాల్సిందే, చదవాల్సిందే!
బూతులు చూపి నీతులు చెప్పే సినిమా
3 గంటలు వెచ్చించి 30రూ పెట్టి చూస్తాం
ఉద్వేగాల్ని స్వగతంగా రాసుకున్న ఈ పుస్తకంలో చదవలేనిడేముంది.
It's fully based on inner feelings to say it is good or bad.
మహేశ్ గారు,
మీ వ్యాఖ్య చాలా నచ్చింది.
There should not be any gap between what we want to say and what we say just because of some set patterns.
మీ టపా కూడా చాలా బాగుంది. సింగిల్ వుమన్ గురించి రాసిన కవిత చాలా నచ్చింది. seems to be a good book.
భలే ఉంది కవిత్వం! తప్పకుండా చదువుతాను.
చదవాలి, నగ్నత్వం పట్ల గౌరవం ఉందే కాని భయం లేదు నాకు అందుకు తప్పక చదువుతాను మనకి తెలుగులో కొంచం కొత్తగా ఉన్న ఇతర దేశాల వారితో చుస్తే భావాలు అంత కొత్తవి కావు...అయితే ఇక్కడ మన దేశపు స్త్రీని ఆమె నిర్వహిస్తున్న చాల పాత్రల్ని గూర్చి రాసారు కాబట్టి రక్తి కట్టి ఉంటుంది....ధన్యవాదాలు ...మహేష్ గారు....ప్రేమతో...జగతి
Post a Comment