Monday, December 8, 2008

ఏది నిజం ? ఏది సత్యం?

15 పార్క్ అవెన్యూ (అనే భారతీయ ఆంగ్లచిత్రం) నాకు విపరీతంగా నచ్చిన సినిమాలల్లో ఒకటి. అందులో కొంకణా సేన్ శర్మ (మీఠీ) పాత్రకు స్కిజోఫీనియా (schizophrenia) అనే మానసికవ్యాధి ఉంటుంది. ఈ వ్యాధిగ్రస్తులు తమదైన ఆలోచనల్లో, కల్పిత నిజాల్లో, ఊహాజనిత జీవితాల్లో కాలం గడుపుతూ ఉంటారు. అదే నిజంగా, అదే జీవితంగా భ్రమిస్తూ ఉంటారు.


ఈ చిత్రంలో ఒక దృశ్యంలో మీఠీ యొక్క ఊహాజనిత కుటుంబం, భర్త,పిల్లలు, ఇల్లు మొదలైన మాటల్తో విసుగెత్తిపోయిన మీఠీ అక్క అంజలి (షబానా ఆజ్మీ) "ఇవన్నీ నిజాలు కావు కేవలం నీ మెదడ్లోంచీ వచ్చిన కల్పన" అని ఖరాఖండిగా ఒకస్థాయిలో rude గా చెబుతుంది. అప్పుడు మనం సహజంగా మీఠీ నుంచీ ఆశించే స్పందన నిరాశపడటమో లేక హింసాత్మకంగా ప్రవర్తించడం. కానీ మీఠీ అలా చెయ్యదు. చాలా ప్రశాంతంగా ఒక కాలేజీ ప్రొఫెసర్ అయిన అంజలితో "నువ్వొక ప్రొఫెసర్వి. కాలేజిలో చదువు చెబుతావు. పెద్దపెద్ద వ్యాసాలు రాస్తావు. ఇవన్నీ నిజం కాదు. కేవలం ఊహలని, నీ మెదడు కల్పించిన కల్పన మాత్రమే అని చెబితే నీకు ఎలా ఉంటుంది?" అని అడుగుతుంది.


ఈ డయలాగ్ వినగానే, నా మెదడు పైన ఒక బకెట్టు చన్నీళ్ళు కుమ్మరించినట్లనిపించింది. "ఎంత వేదాంతం, జీవిత సత్యం నిండుందీ ఆలోచనలో!" అనిపించింది. మనకు తెలిసిన ప్రపంచమే మన నిజం. పదుగురు అంగీకరించిందీ పాటించేదే మనకు సత్యం. అంతేతప్ప ‘నిజంగా నిజం’ ఎవరికైనా తెలుసా? ఏది సత్యమో ఖచ్చితంగా చెప్పగలమా? మనకు తెలీనిదాన్ని నిజం కాదనుకుంటాం. అప్పటీకే తెలిసిందానికి భిన్నంగా కొత్తగా ఏదైనా వినిపిస్తే కనిపిస్తే సత్యం కాదని నిర్ణయించుకుంటాం. నిజం సత్యమనేవి వ్యక్తిగతమని, భావాలకూ, నమ్మకాలకూ, తమకు తెలిసిన ప్రపంచానికీ అనుగుణంగా అవి రూపాంతరం చెందుతాయని అందరం మర్చిపోతాం. అలాంటప్పుడు మనం నమ్మివన్నీ నిజాలు కావని ఎవరైనా చెబితే ఎలా ఉంటుంది? మనజీవితం ‘కేవలం ఊహ!’ అని ఎవరైనా తేల్చేస్తే ఎలా ఉంటుంది?


అందుకే...సత్యానికి పలు పార్శ్వాలుంటాయని నా నమ్మకం.నిజానికి వివిధ కోణాలుంటాయని విశ్వాసం. అకిరకురసోవా ‘రోషోమాన్’ లో చెప్పినా, మన శ్యాంబెనెగల్ ‘సూరజ్ కా సాత్వాఘోడా’ లో వివరించినా, ఆల్బర్ట్ అయిన్ స్టీన్ సాపేక్షసిద్ధాంతంలో ప్రతిపాదించినా...ఇతి...ఇతి (ఇదే ఇదే!!). నిజం- సత్యం అనేవి ఎప్పటికీ నేతి..నేతి (ఇది కాదు ఇదికాదే!!).


****

6 comments:

Bolloju Baba said...

http://ammaodi.blogspot.com/2008/12/1_09.html#comment-form

పై బ్లాగుని ఫాలో అవుతున్నారా?
మంచి వ్యాసాలున్నాయి.

మేధ said...

నేను కొరియాలో ఉన్న సమయంలో చూసా ఈ సినిమాని.. చాలా నచ్చింది.. ఆ సినిమా చూసే ముందు వరకూ, ఏ రకమైన ఎమోషన్స్ లేకుండా కేవలం రాచిప్పలాగా పని చేస్తూ ఉన్నా.. అది చూసిన తరువాత కాస్త మనిషినయ్యాను..

>>నువ్వొక ప్రొఫెసర్వి. కాలేజిలో చదువు చెబుతావు. పెద్దపెద్ద వ్యాసాలు రాస్తావు. ఇవన్నీ నిజం కాదు. కేవలం ఊహలని, నీ మెదడు కల్పించిన కల్పన మాత్రమే అని చెబితే నీకు ఎలా ఉంటుంది?"

ఆ సీన్ చూస్తున్నప్పుడు నేను కూడా, కొంకణా సేన్ గట్టిగా అరుస్తూ తిడుతుందేమో అనుకున్నాను కానీ, అలా సమాధానమిచ్చేసరికి, ఒక్కసారి ఈ లోకంలోకి వచ్చి పడ్డా...

యోగి said...

There is a concept in Christian Philosophy - "Peace that passeth understanding". It is one's moment of clear understanding.

your 'peace that passeth understanding' was attained when you were watching a schizophrenic! I found it rather amusing!! (no sarcasm intended)

I should probably go back to watching Kamal Hassan's "Abhay" - and learn a point are two prom Kamal!

చంద్ర మోహన్ said...

సినిమా డైలాగు అన్న పార్శ్వంలోనుండి చూస్తే అద్భుతంగా ఉంది గానీ, అది ఏ విధంగా సత్యం పట్ల మన దృక్కోణాన్ని మార్చే విధంగా ఉందో నాకు అర్థం కాలేదు. హెలూసినేషన్ లలో బ్రతికే ఒక స్కిజోఫ్రెనియాక్ అదే సత్యం అనుకోవడంలో ఆశ్చర్యంలేదు. ఆ జబ్బు ప్రధాన లక్షణం అదే. ఆమె ఒక ప్రొఫెసర్ నిజజీవితాన్ని అబద్ధం ఎందుకు కాదని ప్రశ్నించినంత మాత్రాన తన హెలూసినేషన్ నిజమైపోదు. హెలూసినేషన్ తనకు మాత్రమే కలిగే చిత్త భ్రాంతి. చుట్టూ ఉన్నవారందరికీ అది అబద్ధమని తెలుస్తూనే ఉంటుంది. ఐతే ప్రొఫెసర్ నిజ జీవితం తనకే కాక ప్రపంచమంతటికీ నిజంగానే కనిపిస్తూ ఉంటుంది. ఆ రెండింటినీ పోల్చి, ఒకటి నిజమైతే మరొకటి కూడా నిజం కావాలన్న వాదన నిజంగా మతిపోయిన వారు చేసేదే. ఆ విధంగా ఐతే దర్శక ప్రతిభను కొనియాడ వలసిందే. కానీ అది మన సత్యం పట్ల మన నిబద్ధతను మార్చడానికి సరిపోదు. మతిలేని వారిమాటలను పట్టుకుని మనం చూస్తున్న సత్యాన్ని శంకించడం తప్పని నా అభిప్రాయం.

-- said...

@ Chandra Mohan: The question is, what is truth? Why do you think, what you see is truth ;)

Satyanni Sankinchadam is the first step of liberation. Nethi (Na+Ithi = Not this) is the begining of that.

Dr.Pen said...

I concur with Chandramohan.