ఇప్పటివరకూ ‘స్త్రీవాదానికి' (feminism) కి వ్యతిరేకం‘పురుషాహంకారం’ (Male chauvinism) అనుకుంటూవచ్చాను. కానీ, ఈ మధ్య నేను రాసిన ‘స్త్రీపక్షపాతానికి మరోవైపు’, ‘వక్రీకరించిన వరం’ టపాలకు వచ్చిన వ్యాఖ్యలకు సమాధానాలు తెలుసుకునే శోధనల నేపధ్యంలో, అంతర్జాలంలో ఒక గమ్మత్తైన వెబ్ సైట్ చూడటం తటస్థించింది. National Coalition of Free Men (NCFM) అనే ఈ సైట్ మగాళ్ళకు వ్యతిరేకంగా జరిగే లింగవివక్షకు (sex discrimination) వ్యతిరేకంగా అమెరికాలో 1977 వ సంవత్సరం నుండీ పనిచేస్తోంది. అంటే ‘స్త్రీవాదానికి’ వ్యతిరేకం ‘పురుషస్వాతంత్ర్ర్యం’ అన్నమాట. చాలా చిత్రంగా ఉందికదూ! మొదట చదివినప్పుడు నాకూ అలాగే అనిపించింది.
కాకపోతే నా ‘అర్బన్ మేల్’ మిత్రుడు చెప్పిన నగరవాసంలో మారుతున్న జెండర్ సమీకరణలను దృష్టిలో పెట్టుకుంటే, ఇలాంటి ఒక సంఘం త్వరలో భారతదేశంలో పుట్టుకొచ్చినా ఆశ్చర్యం లేదు. నాకు బాగా నచ్చిన విషయం వీరి సైధ్ధాంతిక వివరణ (Philosophy of the organization). అందునా ముఖ్యంగా ఈ సిద్ధాంతం ఆఖర్న FREE MEN, ‘మగాడికి ముక్తిని ప్రసాదించండి’ అని వీరు చేసిన విశ్లేషణ నాకు అమితంగా నచ్చి ఇక్కడ స్వేచ్చానువాదం చేసి అందిస్తున్నాను. ఈ విశ్లేషణను ఆంగ్లంలో చదవాలనుకునేవారు లంకె ద్వారా మాతృకని చదవొచ్చు.
మగాళ్ళని విముక్తుల్ని చెయ్యండి...
- వారి పాత్రలకున్న కఠిన నిర్వచనాలనుంచీ
- సామాజిక, సాంస్కృతిక ప్రయోజనాలు అతిగా పొందిన జాతి అనే అపోహలనుంచీ
- అసాధ్యాలని సుసాధ్యాలు చేస్తారనే లేనిపోని ఆదర్శాలతూనికల నుంచీ
- నెత్తిన రుద్దిన పోటీలనుంచీ, వైఫల్యాల భయాలనుంచీ
- సహజభావాలూ, సహజ ప్రేరణలూకాక, తర్కాన్ని ఆధారం చేసుకుని నిర్ణయాలు చేసే బలవంతం నుంచీ
- అపాదిత అంతస్తులనుండీ, పాత్రలనుంచీ
- తమ భయాన్ని ప్రకటించలేని నిస్సహాయతనుంచీ
- ఉద్యొగం పురుషలక్షణం అనే సామెత నుంచీ
- హింసాత్మక ప్రవర్తన తమ మగతనానికి చిహ్నమనుకునే భ్రమలనుంచీ
- తమ శరీరపు అవసరాలను నిర్లక్ష్యం చేసే బాధనుంచీ
- స్త్రీలను లైంగికంగా సంతృప్తిపరచాల్సిన భాధ్యతనుంచీ,ఆడవారి భావప్రాప్తి నాటకాలనుంచీ
- సాటి మగాళ్ళతో సన్నిహిత ఆత్మిక సంబంధాలు నెరిపడానికిగల సామాజిక అవరోధాలనుంచీ
- రక్షకులు,పోషకులుగా తమ పటిమ ప్రదర్సించాల్సిన బలవంతం నుంచీ
- చట్టపరమైన శిక్షల తీవ్రతలో వివక్షతనుంచీ
- పిల్లలను పెంచడంలోని ఆనందాన్ని అందుకోలేకపోవడం నుంచీ
- స్త్రీలను అణచివేసే వర్గంగా తమను చూపెట్టే ఈ మూసలనూ, లక్షణాలనూ ఆపాదించడం నుంచీ
పైనున్నవాటిల్లో కొన్ని కేవలం అమెరికన్ సంస్కృతికి మాత్రమే చెందినవైనప్పటికీ, చాలావరకూ మన భారతీయ నగరజీవనానికి అన్వయించుకోవచ్చనిపించింది. ముఖ్యంగా మగాడి మారుతున్న పాత్ర నేపధ్యంలో, అతివాద స్త్రీవాదుల బారినుండీ రక్షణ మగాడికీ ఒక హక్కుగా కావల్సిన పరిస్థితి వస్తే ఇలాంటి సంఘాల రూపకల్పన అవసరంగా కనిపించొచ్చు.
నాకు కాస్త సరదాగా అనిపించినా, ఇప్పటికే ఇలాంటి సంఘాల ఆవశ్యకతను కోరుకునే మగాళ్ళ జాబితా పెరుగుతోందనడానికి నా ‘స్త్రీపక్షపాతానికి మరోవైపు’ టపాకొచ్చిన స్పందనబట్టి అనిపిస్తోంది. వాళ్ళల్లో ఒకరు భారతీయ ఫ్రాంచైజ్ తీసుకుని దీన్ని మొదలెట్టినా ఆశ్చర్యం లేదు.
‘మక్బూల్’ అనే హిందీ సినిమాలో ఓంపురి ఒక డైలాగ్ అంటాడు "సృష్టిలో సమతౌల్యం (balance) చాలా అవసరం. నిప్పుకెప్పుడూ, నీటి భయం ఉండాల్సిందే!" అని. దానినిక్కడ అన్వయించుకుంటే, జెండర్ యుద్దంలో ఇంతకాలం సాగిన మగవారి పైచేయికి స్త్రీవాదం సమాధానమైతే, ‘స్త్రీవాదం’ మితిమీరిన రోజున ‘పురుషస్వాతంత్ర్యం’ ఉద్భవించి సమతౌల్యం సృష్టిస్తుందన్నమాట!
"Wah...what an IDEA sirji!!!!"






