Saturday, August 2, 2008

మాతృభాష - భావప్రకటన

ఇప్పుడే ‘తెలుగువీర లెవరా!’ అనే బ్లాగులో ‘మనకెప్పుడీ మంచిరోజులు’ అని తమిళనాడులో ఉన్నతవిద్యలో తమిళభాషాబోధన గురించి ఒక లంకె ఇస్తూ, మన తెలుగువారు ఇలా ఎందుకు ప్రయత్నించరూ అని తమ బాధని వ్యక్తపరిచారు. అక్కడ ఒక నేను ఒక సమాధానం (దాదాపు టపా కన్నా పెద్దది) రాసినా, మరింత విస్తృతంగా విషయాన్ని వివరించాలి అనిపించి ఇక్కడ ఒక టపాగా రాస్తున్నాను.భావప్రకటన: పిల్లలుగా అవసరాలతో మొదలై, తరువాత సమాచారం, వివరణలుగా మార్పుచెంది, ఎదిగేకొద్దీ ఆలోచనలూ,విశ్లేషణలుగా మనకు తెలిసిన ప్రపంచాన్ని, అర్థం చేసుకున్న జ్ఞానాన్నీ తెలియజెప్పే విధానాల్ని భావప్రకటన అంటాము. ఇది ఒక సహజ ప్రక్రియ, చుట్టూఉన్న బౌతిక,సామాజిక,కుటుంబ పరిస్థితుల మాధ్యమంగా ఈ భావప్రకటన పుట్టుకొస్తుంది.మాతృభాష - భావప్రకటన: సహజవాతావరణం కల్పించిన భావప్రకటన ఖచ్చితంగా ఆ వాతావరణంలో వాడబడే భాషలో ఉంటుంది. దాన్నే మాతృభాష అంటాము. అంతేతప్ప అమ్మ భాషో,నాన్న భాషో కాదు. ఉదాహరణకు నేను తెలుగు, మా ఆవిడ బెంగాలీ అయినా, నా కొడుకు అవినాష్ మాతృభాష మాత్రం హిందీ అన్నమాట. భవిష్యత్తులో తను బెంగాలీ లేక తెలుగు,ఆంగ్లాలు నేర్చుకున్నా, మాతృభాష మాత్రం హిందీగానే ఉంటుంది.భావప్రకటన -సంస్కృతి: భాష, భావప్రకటనా ఎప్పుడూ చుట్టుపక్కలున్న వాతావరణం పైన ఆధారపడి ఉంటాయని చెప్పుకున్నాం. ఆ చుట్టుపక్కల వాతావరణాన్ని సంస్కృతి అనుకోవచ్చు. మా ఇంగ్లీషు ఫొఫెసర్ ఎప్పుడూ చెప్పేవాడు "understand English literature, but go and experience and feel it your regional language literature" అని. విశదంగా చెప్పాలంటే సాంస్కృతికంగా, ఆంగ్ల సాహిత్యం యొక్క సృజన ఆ సాంస్కృతిక నేపధ్యం నుండీ చెయ్యబడింది కాబట్టి, అర్థం చేసుకోగలమేగానీ అనుభవించాలంటే మనకు సాధ్యం కాదు కనుక, ఆ తెలుసుకున్న అర్థాన్ని మన మాతృభాష సాహిత్యానికి అన్వయించుకుని అనుభవించాలన్నమాట.అంటే, మనకు తెలిసిన సంస్కృతిలోని వస్తువులూ, అభిప్రాయాలూ,ఆలోచనలూ,భావజాలాలూ వేరే భాషలో చెప్పాలంటే ఆ సహజత్వం రాదని అర్థం. అలాగే, వేరే భాషని అనుభవించాలంటే, వారి సంస్కృతి తెలిసుండాలన్నమాట. ఉదాహరణకు అమెరికన్ సినిమా చూసే మనకు, ఇంగ్లీషు బాగా వచ్చినా చాలా విషయాలు అర్థం కావు, కారణం అవి culture specific expressions లేక culture specific behaviour కావడమే. నేను చిన్నప్పుడు చూసిన కొన్ని సినిమాలలో కారు ఆగిపోయినప్పుడు "Car ran out of gas" అనే భావన అర్థమయ్యేది కాదు, ఎందుకంటే, మనం కారులో ‘పెట్రోల్’ అంటామేగానీ ‘గ్యాస్’ అనము కాబట్టి. ఇది చాలా చిన్న ఉదాహరణే అయినా, పెద్ద ఉదాహరణలు మరింత "తేడాగా" ఉంటాయని మాత్రం చెప్పొచ్చు. అలాగే, భగవద్గీత లోని మార్మికత, తార్కిక మెదడు కలిగిన పాశ్చ్యాత్యులకు అర్థమవ్వడం కష్టం అని చెబుతూ ఉంటాం. కారణం ఈ సాంస్కృతిక తేడాయే కదా!తెలుగు భాష - భావప్రకటన: పై విశ్లేషణ నేపధ్యంలో, మాతృభాషలో భావప్రకటన సహజంగా, చురుకుగా ఉంటుందని అంగీకరించినా, దానికున్న pre-condition చైతన్యవంతమైన సంస్కృతి. విస్తృతమైన తెలుగు భాష ఉపయోగానికి చైతన్యవంతమైన తెలుగుతనం ఒక అవసరం. కానీ, ఆ తెలుగుతనం మన ఆంధ్రప్రదేశ్ లో, మన జీవితల్లో,చుట్టుపక్కలున్న వాతావరణంలో ఉందా? అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానాలు ఎవరి జీవితాల్లో వారు తరచి చూసుకొని సమాధానం తెలుసుకుంటేనే బాగుంటుంది.వ్యక్తిగతంగా ‘తమిళ,మళయాల, కన్నడతనాలతో’ పోల్చుకుంటే, మన తెలుగువారిలో తెలుగుతనం పాళ్ళు చాలా తక్కువగా ఉంటుంది. ఉన్నా, అపోహలూ, ఆచారాలే తప్ప తెలుగు సాంస్కృతిక స్పృహ, భావజాలం,ఆదర్శాలు మచ్చుకకికూడా కనిపించవు. కర్ణుడిచావుకి వందకారణాలన్నట్లు, ఈ స్థితికి ఎన్నో కారణాలు. వాటిల్లో నాకు తోచిన ముఖ్యమైన రెండు కారణాలు 1. భాషా భోధన 2. తెలుగువారిలో పెరిగిన వ్యాపార ధోరణి.1. భాషాభోధన :వాడుకభాషను దగ్గర చెయ్యడం మానేసి కొన్ని తరాలుగా నన్నయ,తిక్కన అని పూర్వపు వైభవాన్ని బలవంతంగా పిల్లలకు అంటగట్టడం ఒకటైతే, సమాజంలోని పరిణామాల్ని భాషలో ప్రతిఫలించక "ఉబుసుపోక" రాసుకున్న సాహిత్యాన్ని మన భాషా సంస్కృతిగా పట్టంగట్టిన స్థితి మరోకారణం. వీటివలన తల్లిదండ్రులు భాషకు దూరమవ్వడమేకాక, పిల్లల్నికూడా "తెలుగులో ఏముందిరా! ప్రతిపదార్థాలూ తాత్పర్యాలూ తప్ప" అంటూ దూరం చేస్తున్నారు. వారు చేస్తున్నది చాలా వరకూ సహేతుకం కూడాను. ఈ విధానం వలన మనకొరిగింది ఒక కుహానా భాషా సంస్కృతి, మాతృభాషంటే ఆమడదూరం పారిపోయే జనస్రవంతి.ఇక తెలుగు భాషకూ, తెలుగు సంస్కృతికీ లంకె కుదిరేనా ?


2.తెలుగువారిలో వ్యాపారాత్మక ధోరణి: మన సాంస్కృతిక మూలాలు బలహీనమైనప్పుడు ఈ ఆధునిక ప్రపంచంలో ఎదుగుదలకు బలమైన కారకమైన ‘డబ్బు’ని మూలంగా ఎంచుకోవడం చాలా సహజంగా జరిగే ప్రక్రియ. 5 వతరగతి వరకూ మాతృభాషలో భోధన, ఆపైన త్రిభాషా ఫార్ములా (Tri-language formula) అని National Curriculam Framework చెబుతున్నా, పుట్టుకతోనే ABCD లు నేర్పుతూ, తామూ మమ్మీలూ డాడీలూ అవుతూ, మన తెలుగువారు ఇంగ్లీషు వైపుకి పరుగులుతీస్తున్నారు. దానికిగల ముఖ్యకారణం వారి పిల్లల్ని ‘ఉద్యోగ విపణి(job market) కి’ త్వరగా తయ్యారు చేసేయ్యడమే. అంటే, భాషాసంస్కృతి బలహీనమైన మన జాతి, కనీసం బలమైన ఆర్థిక సంస్కృతి దిశగా అడుగులేస్తోందన్నమాట.పై నేపధ్యంలోంచీ చూస్తే, మన స్థితికి మనమే కారణం. ఆంగ్లాన్ని ధూషించో, ఇంగ్లీషు భాషపై మనవాళ్ళకున్న మోజుని నిరసించో తెలుగు భాష వాడకాన్ని పెంచలేము. తెలుగుతనాన్ని , సంస్కృతినీ, భాషా సంస్కృతినీ సమూలంగా సంస్కరించి "పనికొచ్చే తెలుగును" పరిచయం చేస్తే తప్ప, ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుభాష తిరోగమనం అరికట్టబడదు. అంటే మూలాల్ని సంస్కరిస్తేగానీ ఈ లక్షణాలు బాగుపడవు.ఆ మూలాల్ని సంస్కరించే చేవ,సత్తా,బలిమి మనకు లేవు గనక ఆవేదన వ్యక్తపరుస్తూ, ఆంగ్లాన్ని నిరసిస్తూ, ఆంగ్లాన్ని మాతృభాషగా చేసుకుంటున్న తెలుగువారిని ఎద్దేవా చేస్తూ, తెలుగు భాష స్థితిని చూసి కన్నీరు విడుస్తూ, కనీసం మన జీవితల్లో తెలుగుని పెంపొందించుకుందామని ప్రమాణాలు చేసుకుంటూ సంతోషిద్ధాం.

*****

18 comments:

Purnima said...

hmmmmmmmm.........

భైరవభట్ల కామేశ్వర రావు said...

మహేష్ గారు,
ముందుగా నా టపాకి స్పందనగా మీరో టపా రాసినందుకు నెనరులు.
మొదటగా, మీరన్న భాషా బోధన గురించి. తమిళనాడులో పాఠశాలల్లో పిల్లలు చదివే తమిళం వాళ్ళ వాడుకభాషకి దగ్గరగా ఉండదనీ, వాళ్ళుకూడా ప్రతిపదార్థ తాత్పర్యాలు చదువుకుంటారనీ మీకు తెలీదని నేననుకోను. మరి వాళ్ళ భాషాభిమానానికి అడ్డురాని ఆ విషయం మనకెందుకు వచ్చిందంటారు?
ఇక తెలుగువారిలో వ్యాపారాత్మక ధోరణి గురించి. ఇంగ్లీషు నేర్చుకోవడం వల్ల తెలుగుభాష క్షీణిస్తోందని అనుకోవడం తప్పని నేను నా బ్లాగులో రాసిన టపాల్లో స్పష్టంగానే చెప్పాను. అలానే ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే, మనలా మాతృభాషని మరచిపోవాల్సిన అవసరం లేదని కూడా, ఒక భాషాశాస్త్రవేత్త పరిశోధనాపత్రాన్ని కూడా అధారంగా చూపిస్తూ నిరూపించడానికి ప్రయత్నం చేసాను. మరి ఈ రెంటికీ సంబంధం లేదని మీరొప్పుకుంటారా? లేకపోయినా ఉందని మన తెలుగువాళ్ళు అనుకోవడం భ్రమపడటం కాదా?

భాషపై అభిమానం ఎక్కువగా లేకపోవడానికి రెండేం సవాలక్ష సాకులే వెతుక్కోవచ్చు. దీన్ని మార్చడం మనతరం కాదని చతికలబడి కూచోనూవచ్చు. మన ఆలోచనలో, మన మనసులో ఉండే negative energy ఇది. దీనివల్ల మిగిలేది జడత్వమే కాని సాధించేదేమీ ఉండదు. సమాజంలో ఎలాంటి మార్పు రావాలన్నా దానికీ జడత్వమే అడ్డుతగులుతూ ఉంటుంది.
ఇది మిమ్మలని వ్యక్తిగతంగా తక్కువచెయ్యాలనీ/కించబరచాలనీ అనటం లేదని దయచేసి అర్థంచేసుకోండి. ఇలాటి negative energy సమాజంలో చాలామందికే ఉంది. నాలో కూడా అప్పుడప్పుడు విజృంభిస్తుంది. కానీ అది కీడుతప్ప మేలుచెయ్యదన్న గ్రహింపుతో దాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను.
ఇప్పుడీ వ్యాఖ్య రాస్తున్నది కూడా మీ ఆలోచనల్ల్లో ఏదో మార్పు తెచ్చేస్తానన్న భ్రమతో కాదు. తటస్థంగా ఉన్నవాళ్ళకి మీ negative energy వ్యాపించకుండా ఉంటుందన్న ఆశతో.

కత్తి మహేష్ కుమార్ said...

@భైరవభట్ల కామేశ్వర రావు:నా విశ్లేషణ తెలుగు మీద అభిమానం ఎందుకు తగ్గుతొందని కాదు. అసలు తెలుగుసంస్కృతి అంటూ ఒకటి లేకుండాపోతున్నప్పుడు తెలుగులో భావప్రకటన అప్రస్తుతమై, ప్రస్తుతం ఉన్న పరిస్థితి దాపురించిందని మాత్రమే.

తమిళనాడులో తమిళ్ బోధనగురించి నాకు కొంత తెలుసు వారు ‘తిరుక్కురళ్’ తోపాటూ సమానంగా ‘భారతియార్’ ని కూడా చదువుతారు. అవి వారి సంస్కృతినీ,భాషోద్యమాన్నీ,సామాజిక నిజాల్నీ పరిచయం చేస్తాయి.So they are more rooted in to their culture through literature. కానీ మన తెలుగు బోధనాపద్దతి అది కాదు.We don't make social and cultural bonding though language teaching, we only alienate.

ఆర్ధికాభివృద్ది చెందాలంటే మాతృభాష మరిచిపోనఖ్ఖరలేదు. కానీ మన తెలుగుజాతికి అసలు మాతృభాష అవసరమే లేకుండాపోతోంది. కారణం మన increasing cultural rootlessness.నేను చెప్పదలచుకున్న బిందువు అదే!

తమిళ,మళయాళ మరియూ కన్నడ సంస్కృతులంత బలంగా మన సంస్కృతి, దానియొక్క విస్తృత వ్యాప్తి లేకపోవడం వలన గత 30 సంవత్సరాలుగా అసలు "తెలుగు భావజాలం" వ్యాప్తి జరగలేదు. ఈ కారణంగా మనం తెలుగు మాట్లాడటం తగ్గించామేగానీ ఇతర భాషపట్ల మోజుతో కాదు. ఈ మోజు ఒక by-product మాత్రమే!

ఇక మీరు నా వ్యాసాన్ని "negative energy" అన్నారు. అయితే అవచ్చుగాక,కానీ ఇది నిజం కాదని వాదించగలరా? నిజాల్ని గ్రహిస్తేనే సమస్యకు సమాధానం వెతకగలం.అందుకే,వ్యక్తిస్థాయిలో మనం చెయ్యగలిగింది చేద్దామని శెలవిచ్చాను. కాకపోతే ఈ సమస్యని సమూలంగా తొలగించాలంటే,మూలాలను మార్చాలి. అలా చెయ్యడానికి మీదగ్గర అధ్బుతదీపమేదైనా ఉందా?

రవి వైజాసత్య said...

"తెలుగుసంస్కృతి అంటూ ఒకటి లేకుండాపోతున్నప్పుడు తెలుగులో భావప్రకటన అప్రస్తుతమై, ప్రస్తుతం ఉన్న పరిస్థితి దాపురించింది" అక్షరలక్షలు. బాగా ఆలోచించవలసిన విషయం

Sankar said...

తెలుగు భాషమీద ఎంతో అభిమానం వ్యక్తపరచే ప్రముఖులు అందరూ తమ పిల్లల్ని తెలుగు మీడియంలో చదివించి ఆ పుణ్యం కట్టుకోవచ్చు కదా. ఎవరూ చెయ్యరు. అందరూ చేస్తేనే మేమూ చేస్తామంటారు. స్టార్టింగ్ ప్రాబ్లెం.లెక్చర్లివ్వడానికి ముందుకొస్తాం కాని గంట కట్టడానికి కాదు. ఎక్కడో ఒకరో ఇద్దరో పట్టుబట్టి తమ పిల్లల్ని ఇలా గవర్నమెంట్ తెలుగు మీడియం స్కూల్లలో చేరిస్తే వాళ్ళని చాదస్తులుగా జమకట్టేస్తాం. ఏ న్యూస్ పేపర్‍లోనన్నా పలానా స్టేట్‍లో ఇలా చేసారంటే మనకు అలా ఉంటే బావున్నంటాం. అది నిజంగా నిజమేనా. ఆ భావన నిజంగా మనస్ఫూర్తిగా వచ్చిందేనా అని ఒక్కసారి తరచి చూసుకొంటే తెలుస్తుంది.రాబోయే తరాలలో తెలుగు చదవగలిగిన రాయగలిగినా వాళ్ళను వెతుక్కొనే పరిస్ధితి మాత్రం తపకుండా వస్తుంది.
ఐతే ఇక్కడ సంస్కృతి ఒక్కటే కాదు లోపం, మన నాయకులలో కూడా.. ఎక్కడ ప్రజాగ్రహానికి గురవుతామోనని భయపడి ఎలాంటి చట్టాలు చెయ్యరు. అదే మనకు పొరుగు రాష్ట్రాలకు ఉన్న తేడా. అక్కడి అధికార పార్టీ నాయకులు చాలా నిర్భయంగా నిర్ణయాలు తీసుకుంటారు...ఇక్కడ ప్రతిపక్షంలోకి వచ్చేవరకు ఆ తలంపే రాదు. మనకు అధికారికంగా ఉంటేనే దానిని అమలు చేస్తాం..లేదంటే అంతే సంగతులు.

ఏకాంతపు దిలీప్ said...

బాగుంది మీరు చెప్పిన విధానం...

కానీ నాకెక్కడో ఆశ ఉంది... గమనించారా?!అంతర్జాలంలో మనం తెలుగు రాస్తున్నంత , ఏ భారతీయ భాష రాయబడటం లేదు... అన్ని భాషలకన్నా ఎంతో ముందు ఉంది...

ఒకానొక సందర్భంలో మా సంస్థ సి. ఇ. ఓ తన పరిశీలనని సంస్థ దీర్ఘ కాలిక లక్ష్యాలని ప్రస్తావిస్తూ ఈ విధంగా తెలియచేసారు.

"The final trend is universal connectivity, bringing about “the passage from the information age to the participation age,” with MySpace, Facebook and Wikipedia being examples of the latter. “When the Berlin Wall fell,” said Mayer, “We got the story from CNN. When tragedy hit Virginia Tech, CNN got its story from MySpace.” "


నిజం కదా!

ఈ పార్టిసిపేషన్ యుగంలో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. అవకాశం మన చేతుల్లో ఉంది. మనం రాసిందే వార్త. మనం ఉపయోగిస్తున్నదే భాష. మనమే ప్రచురణ కర్తలము. ప్రతి ఒక్కరూ ఇప్పుడు పది మందిని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. అంతర్జాలంలో పని చేసే పెద్ద సంస్థలన్నీ దీన్ని గుర్తించాయి. మనం దీన్ని ఉపయోగించుకుందాము.

తెలుగు భాషని సంస్కరించే పునాదులు అంతర్జాలంలోనే పడుతున్నాయని నాకు గట్టి నమ్మకం.

మనకి కావాల్సిన ఆ చేవ,సత్తా,బలం మనం ఇక్కడే పెంపొందించుకుంటున్నాము.

మనం రాద్దాము. పది మంది చేత రాయిద్దాము.

కత్తి మహేష్ కుమార్ said...

@దిలీప్; మీ ఆశ నిజమవ్వాలిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను.కాకపోతే,"అంతర్జాలాన్నివాడేది ఎంత శాతం ప్రజలు?" అనే ప్రశ్న నా సందేహాన్ని బలోపేతం చేస్తోందేగానీ, మీ ఆశమీద నాకు ఆశ పుట్టించడం లేదు.అంటే తెలుగువాడటం లగ్జరీ అయిన మనలాంటివాళ్ళు తెలుగును ఉద్దరిస్థున్నామేగానీ,నిజంగా తెలుగు భావవ్యక్తీకరణ అవసరమైనవారు ఈ దిశగా పయనించడానికి మనం ఏంచెయ్యగలిగాం?

@శంకర్;నిజం చెప్పారు.తెలుగుభాష తగ్గిపోతోందని విలవిలలాడే పెద్దమనుషుల పిల్లలు తెలుగు కనీసం మూడోభాషగానైనా లేని స్కూళ్ళలోనే చదువుతుంటారు.ఈ పనికిరాని ఆదర్శం నిజంగా అవసరమేనా అని నా సందేహం!అందుకే లక్షణాల్నికాక అసలురోగాన్ని చూడమంటున్నాను.

@రవి వైజాసత్య: నెనర్లు

బొల్లోజు బాబా said...

మంచి డిస్కషను నడుస్తుంది ఇక్కడ. బాగుంది.
బొల్లోజు బాబా

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

too academic discussion,stuffed with too intelligent phrases,and brevity is missing in the arguements.

Chandra Mohan said...

మీరు చెప్పినట్లు తెలుగు సంస్కృతి అనేది ఒకటి లేకుండా పోవడమే అసలు సమస్య. తమిళనాడు లోనూ గ్రాంధికం లోనే పాఠాలు చెబుతారు. ఆమాటకొస్తే, మాట్లాడే భాషనే ఇంట్లో ఒకలా, బయట ఒకలా మాట్లాడుతాము. కనీసం తెలుగుకు ఆ బాధ లేదు. కాకుంటే తమిళ సంస్కృతి పునాదులు చాలా బలమైనవి. భాష పేరుని పిల్లలకు పెట్టుకొనే జాతి బహుశ తమిళులు మాత్రమే. ఏ తమిళ పాఠశాలకైనా వెళ్ళి చూడండి. 'తమిళ్' అనే పదం ముందో వెనకో ఉన్న పేరు గలవారు (తమిళన్బన్, తమిళ్ మొళి, తేన్మొళి, కనిమొళి, తమిళ్ సెల్వి, తమిళరసన్ లాంటివి) బోలెడు మంది కనిపిస్తారు. తమిళం రాదని చెప్పుకోవడం తమిళులకు సిగ్గుచేటైన విషయం. నేను ఆంధ్ర ప్రదేశ్ లోనే పుట్టి పెరిగినా, తమిళ భాషను, సంస్కృతిని సగర్వంగా వంటబట్టించుకొంటూనే పెరిగాను. నా తెలుగు భాషాభిమానం, మాతృభాషాభిమానానికి ఎప్పుడూ అడ్డు కాలేదు. 'ఐ కాంట్ స్పీక్ టెల్గూ' అనే తెలుగు వారిని చూసినప్పుడు నాకు చాలా అశ్చర్యమూ, బాధా కలుగుతుంది. ' ఐ కాంట్ స్పీక్ టమిళ్'అనే తమిళుడిని నేనింతవరకూ చూడలేదు.

మీరు చెప్పిన పాయింటు చాలా బలమైనది. భాష అన్నది సంస్కృతిలో ఒక భాగం. ఆ సంస్కృతి అంతరిస్తే భాష బతకదు. పొరుగు భాషల ఉన్నతికీ, తెలుగు భాష పతనానికీ అదే కారణం. ఈ నాడు తెలుగు ఈ మాత్రమైనా ఉందంటే, అది ప్రవాసాంధ్రుల వలన, ఇలాంటి తెలుగు బ్లాగుల వలన మాత్రమే అని నా అభిప్రాయం.

- చంద్ర మోహన్

భైరవభట్ల కామేశ్వర రావు said...

మహేష్ గారు,
సంస్కృతితో భాషకున్న సంబంధం గురించి మీరన్నదాంతో నాకు విభేదం లేదు.
తెలుగు సాంస్కృతిక స్పృహ లేకపోవడానికి మీరు చెప్పిన రెండూ, ముఖ్యకారణాలు కావని చెప్పడమే నా ఉద్దేశం.
దానికి కారణం మీరన్నట్టుగా గత ముప్ఫైయేళ్ళుగా "తెలుగు భావజాలం" వ్యాప్తి జరగకపోవడమే. అది జరగాలన్నదే నా ఆకాంక్ష.

మీరుచెప్పిన భావప్రకటన, భావప్రకటన-సంస్కృతికున్న సంబంధం, అలానే తమిళ-మళయాళీల గురించి మీరుచేసిన విశ్లేషణ, అన్నీ చాలా వరకూ నిజాలే. దాన్ని నేను negative energy అనలేదు. కానీ వీటన్నిటినుంచి "ఈ స్థితి మారదు" అని మీరుచేస్తున్న నిర్ణయం నాకు సహేతుకంగా అనిపించలేదు. అది నిజమని మీరు చెప్పలేరు. నిజం కాదని నేనూ చెప్పలేను. అది మన మన దృక్పథాలతో మనం చేసే ఊహే. నేను negative అన్నది మీ ఆ దృక్పథాన్ని.

ఇక అద్భుతదీపం గురించి, అద్భుతదీపమైతే లేదుకానీ ఒక చిన్న దీపం మాత్రం ఉంది. అలాటి దీపం తెలుగు వాళ్ళందరి దగ్గరా ఉంది. ప్రతివారు తమతమ దీపాన్ని వెలిగిస్తే అది అద్భుత దీపమే అవుతుంది! ఆ పని జరగాలన్నదే నా కోరిక.

"తెలుగువాడటం లగ్జరీ అయిన మనలాంటివాళ్ళు తెలుగును ఉద్దరిస్థున్నామేగానీ,నిజంగా తెలుగు భావవ్యక్తీకరణ అవసరమైనవారు ఈ దిశగా పయనించడానికి మనం ఏంచెయ్యగలిగాం?"
తెలుగువాడడం నామటుక్కి నాకు అవసరమే, లగ్జరీ కాదు. అది మీకు లగ్జరీ అని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. మీ ఈ ఆలోచనలకి అదే బహుశా కారణమై ఉండవచ్చు. మనం "ఏం చెయ్యగలిగాం" అన్నదానికన్నా, "ఏం చెయ్యగలం" అన్న ప్రశ్న సబబైనదని నా ఉద్దేశం.

శంకర్ గారు,
తెలుగు-ఇంగ్లీషు మీడియం గురించి నా ఆలోచనలు ఇక్కడ రాసాను: http://teluguviralevara.blogspot.com/2008/07/blog-post_28.html
అందులో మీకు సరికాదనిపించిన వాటిగురించి అక్కడ వివరంగా రాయమని నా అభ్యర్ధన.

కత్తి మహేష్ కుమార్ said...

@భైరవభట్ల కామేశ్వర రావు,
జీవితంలోని అవసరాలన్నీ ఆంగ్లంలో పూర్తిచేసేసుకున్న మనం, తెలుగు వాడటం లగ్జరీనే!కేవలం మన ‘మానసిక అవసరాల్ని’ పూరించుకోవడానికి తెలుగువాడుతున్న మనకు ఇదొక లగ్జరీనే!!చిన్న పల్లెలో చదువుకుంటూ,కార్పొరేట్ ఉద్యోగాన్ని కేవలం కలలోమాత్రమే చూసే విధ్యార్థిని తెలుగు నేర్చుకోమని చేప్పే మన తెలుగు లగ్జరీనే!!!

స్థితి మారదని నేను నిర్ణయించుకోలేదు. ఒకవేళ స్థితి మారినా,నిజంగా మార్పు తేవలసినవారి జీవితాలలో తెలుగు భాష వల్ల పెద్ద పెనుమార్పేమీ రాదని నా విశ్వాసం.They are better off with English than Telugu.

నేను ఒక భాషా బోధనలో తర్ఫీదుపొందిన టీచర్ని (Regional Collage of Education, Mysore).మాతృభాష ప్రాముఖ్యత దాని మహత్తు బాగా తెలిసిన వ్యక్తినే, కానీ మన ఆంధ్రప్రదేశ్ లో తెలుగు అవసరం నిజంగా తగ్గింది కాబట్టే, "సహజంగా" తెలుగువాడకం తగ్గిదని నమ్ముతాను.

దానికి నేను చెప్పిన బోధనా పద్దతితోపాటూ,సాహిత్య సృజన,రాజకీయాలు,తెలుగువాళ్ళ మానసికత కారణం.అందుకే, ఆక్సిజన్ పెట్టిమరీ దాన్ని బ్రతికించే ప్రయత్నం అనవసరం అని నా ఉద్దేశం.I can only pray for a miracle to revive Telugu,as long as our basic attitudes and literary practices/politics don't change.వాటిని మార్చడం ఖచ్చితంగా నా చేతుల్లోనైతే లేదు. అందుకే మీరే ఆ దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి.నా అభినందనలు.

నాగన్న said...

భాష విషయంలో ఆఱవం వాళ్ళతో పోలిస్తే తెలుగు వారిది సులభమైన, సాత్వికమైన శైలి. అలా ఉండటమే మంచిది. భాష అన్నది మాట్లాడుకోవటానికి కాక మిగతా విషయాలకు వాడుకుంటే దాని తళుకు పోతుంది, అందుకు తెలుగే బతికున్న ఉదాహరణ. అఱవం కూడా అదే బాటలో వెళ్తుంది ప్చ్.. పాపం. ఈ మధ్యలో నాకు తెలిసి అఱవ, తెలుగు పేర్లను పెట్టుకున్నవాడు ఒక్కడూ లేదు.

లక్షలాది మంది ఇంగిలిపీసు నేర్చుకోబట్టే ఇప్పుడు మనం హైదరాబాదును ఆకాశానికి ఎత్తుతున్నాం, దానిలో తెలుగును ఉవ్వెత్తున నింపుతున్నాం.

రాబోయే భవిష్యత్తులో విదేశాల్లోని ఎయిర్‌పోర్టుల్లో కూడా తెలుగు చదువుతారు. మొన్న డిష్ నెట్వర్కు వాళ్ళూ డిష్ టీవీ సెటప్ చెయ్యడానికి బ్రోచరు పంపించారు..తెలుగు అక్షరాల్లో చక్కగా రాసారు...అమెరికాలో! ముందుకు పదండి కామ్రేడ్స్... డోంటు వర్రీసూ.

saisahithi said...

మీ టపాలోని మీ ఆవేదనని రెండు భాగాలుగావిభజిస్తే...ఒకటి.. తెలుగు భాషలో లౌక్యం లేదని...ఇది భాష పట్ల అత్య భిమానంతో మీరన్నదన్న భావనలో నేపొందిన ఆనందం కంటే, బహుసా..మీరీవిషయమ్లో మరి కొంచెం ఆలోచించి వ్యాఖ్యానించి ఉండి ఉంటే నేను మరింత ఆనందించేవాడినని తెలియ చేయడానికి చాలా చింతిస్తున్నాను. ఈ వాక్యాన్ని ఆంగ్లమ్లో చెపితే ఇంత అందం రాదనేది నిర్వివాదాశం అనుకుంటున్నాను. కనీసం తర్జుమా చేయడం ఎంత కష్ట మో ఆలోచించండి. ఇదీ తెలుగు భాష కున్న సొబగు... కాదనగలమా..తెలుగు పద్యానికున్న మీటర్ ప్రపంచమ్లో ఏ భాషకీ లేదు.అంతేకాదు గద్యాన్ని తీసుకుంటే మన భాషలో ఉన్న చమత్కారాలు, చలోక్తులు ,నానుడులు , సామెతలు, వ్యుత్పత్తి అర్థాలు మరే ఇతర ప్రపంచ భాషల్లోనూ లేవని భాషావేత్తలు ఘంటాపదంగా చెప్పారు. ఇంకానా..కవిత అనే ప్రక్రియకి సరితూగగలిగే ప్రక్రియ ఆంగ్లం లో ఇది అని దేనిని చెప్పగలం. అతి ఎక్కువ సాహితీ ప్రక్రియ లు కలిగిన ఏకైక భాష అని కూడా అంటారు. మహేష్ గారు మీ ఆవేదన ని నేను ఎంత వరకూ అర్థం చేసుకున్నానో తెలియదుకాని తెలుగు భాష గురించి చాలాత క్కువే చెప్పాననిపిస్తూంది.
మరో విషయ మండోయ్ ..ఇక్కడ అంతర్లీనంగా సాగిన కొంత possible deniability ప్రస్తావన గమనించండి.
ఇక రెండవది..
Telugu can not be used as official working knowledge. You are right.. ఇది మనం ఇంగ్లీషు పట్ల ఎంత పరాధీనతకు లోనయ్యామో తెలియ చేస్తుంది. ని జానికి చాలావరకు మన పొరుగు రాష్ట్రాల్లో ఈ పరాధీనతకు తిలోదకాలకు ఎపుడో శ్రీకారం చుట్టారు. ఇలా మనమెందుకు చేయలేం.మీరన్నట్లు ఇది కేవలం పాలకుల నిర్లక్ష్యం. ప్రయత్నిస్తే.. పురిటి నొప్పు లు సహజమే కదూ..
No doubt this is a slow but sure process. నిదానంగానైనా ఖచ్చితమయిన ఫలితాల్నిస్తుంది.
చివరగా..." మాతృభాష కళ్ళు వంటిది . పరభాష కళ్ళజోడు వంటిది."
మంచి అంశం...మీనుండి మరిన్ని అంశాలు ఆశిస్తూ..

ఫజ్లుర్ రహమాన్ నాయక్ said...

మాతృభాష మీద ప్రస్తావన వచ్చింది కనుక, ఇక్కడ నాకొక సందేహాన్ని వ్యక్తపరుస్తున్నాను. క్రితం వారం, మా కుటుంబ సభ్యుల మధ్య మాటల్లో మన మాతృభాష ఏది? అనే దాని మీద చర్చ జరిగింది... నేనేమో నిస్సంకోచంగా తెలుగు అని చెప్పాను, కాని మా మావయ్య, మా కజిన్ మాత్రం కాదు ఉర్దూ అన్నారు ... దీని మీట భారీగానే వాదులాట జరిగింది కాని ... ఏమి తేలలేదు ... మొత్తానికి నా వాదన ఏంటంటే ... మనం ఆంధ్ర రాష్ట్రం లో ఉన్నాం గనక, ఇక్కడి రాచభాష లేదా అధికారిక భాష ఏదైతే ఉందో (తెలుగు), మనం ఏ భాష నైతే ఎక్కువగా ఉపయోగిస్తామో అదే మన మాతృభాష అవుతుంది అని నేనన్నాను.
అందుకు మా మావయ్య అందుకొని. అదెలా అవుతుంది ... మాతృ అంటే తల్లి ... నీ తల్లి ఏ భాష మాట్లాడుతుందో అదే నీ మాతృభాష అవుతుంది ... వినడానికి హాస్యాస్పదంగా ఉన్నా ఈ స్టేట్మెంట్ మా మావయ్య ఇచ్చారు ... ఇక మా కజిన్ విషయానికి వస్తే ... మనం ముస్లిమ్స్ కాబట్టి మన మాతృభాష ఖచ్చితంగా ఉర్దూనే అని తన వాదన. మొత్తానికి ఏది కరెక్ట్ అనేది నా సందేహం ... ???


కాని మా వాళ్ళేమో నీకు తెలుగు మీద అమితాభిమానం వల్ల అలా అంటున్నావు అంటున్నారు ...

ఇంకో బాధాకరమైన విషయం ఏమిటంటే ... వీళ్ళు (మా మావయ్య, మా కజిన్) వారి వారి డైలీ లైఫ్ లో ఎక్కువగా మాట్లాడే భాష తెలుగే (మా మావయ్య స్కూల్ టీచర్, మా కజిన్ స్టూడెంట్). అలా వారు తెలుగుని వాడుతున్న మాతృభాషగా అంగీకరించక పోవడం నాకేమో కొంత ఆశ్చర్యాన్ని మరి కొంత విస్మయాన్ని కలిపించినిది ... నేను ఉండేది పూణే లో, కాబట్టి చాలా తక్కువగా తెలుగు మాట్లాడటం జరుగుతుంది ... కాని తెలుగు మాత్రం చాలా చదువుతాను ... ఆఫీసు లో కూడా ...


మొత్తానికి ఎవరో ఒకరు నా సందేహాన్ని తీర్చండి ... :)

కత్తి మహేష్ కుమార్ said...

@ఫజ్లుర్ రహమాన్ నాయక్,చాలా రోజులతర్వాత మళ్ళీ ఈ టపాలో మీవల్ల కలకలం రేగింది. ధన్యవాదాలు.

మాతృభాషంటే ‘మొదటి/మూల ఆలోచనల భాష’ అని నాకు అనిపిస్తుంది. మీరు ముస్లింగా చిన్నప్పటి అవసరాలు ఉర్దూ/దక్కనీ హిందీ భాషలో చెప్పున్నప్పటికీ,ఇంటాబయటా వాడకంలో తెలుగు హెచ్చడం వలన మీ మెదడుభాష basic గా తెలుగైతే తెలుగే మీ మాతృభాష.

తల్లి లేక తండ్రిభాషను మాతృభాషగా by default రావాలన్న షరతు మాత్రం లేదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ టపాలో చెప్పినట్లు నాకొడుకే.

నా అభిప్రాయం తప్పైతే ఇక్కడ విజ్ఞులు చాలామందున్నారు,వారు తమ ఆలోచనని ఇక్కడ పంచుకోగలరు.

అబ్రకదబ్ర said...

ఫజ్లుర్ రహమాన్ గారు,

పోకిరి మిమ్మల్నోటి పీకితే దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అయినప్పుడు మీరు 'అమ్మా' అంటే తెలుగు మీ మాతృభాష, 'అమ్మీ జాన్' అంటే ఉర్దూనే మీ మాతృభాష :-) (ఈ బ్లాగుకర్త పేరూ మహేషే. అందుకే ఆయన్ని ఈ ప్రశ్న అడిగారనుకుంటా)

పై ఉదాహరణ హాస్యానికే. నా భావమర్ధమయిందనుకుంటా.

Anonymous said...

కత్తి మహేష్ కుమార్ గారు, బాగా చెప్పారు.
సమస్య మూలాన్ని, కారణాలని బాగా వెతికి పట్టుకున్నారు కాని, టపా లో చెప్పిన విధంగా pessimistic గా ఆలోచించకుండా పరిష్కారాలని ఇంకా కూలంకషంగా చర్చిస్తే ఈ టపాకి నిండుదనం వచ్చి ఉండేది.

- Shiv.