బీజేపీ ఆధ్వర్యంలోని కర్ణాటకలో సాంస్కృతిక పరిరక్షణ పేరుతో రౌడీమూకలు పబ్బులపై దాడిచేసి అమ్మాయిల్నీ అబ్బాయిల్నీ పైచాచికంగా కొడితే, ఇప్పుడు కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ ప్రభుత్వం పబ్బులు, మాల్స్ తోపాటూ అమ్మాయిలూ అబ్బాయిలూ చట్టాపట్టాలు వేసుకుని తిరిగే "అసభ్య" సంస్కృతిని రూపుమాపే ప్రయత్నంలో పడింది. రామసేనకూ మాకూ ఎటువంటి సంబంధం లేదని బీజేపీ విదిలించేసుకుంటే, ఇక్కడ ఏకంగా ముఖ్యమంత్రి అశోక్ గెహలోట్ సగర్వంగా ఈ చర్యలు చేపట్టడానికి తయారయ్యాడు. పైగా, క్రింతం పరిపాలించిన వసుంధరా రాజే (బీజేపీ)ప్రభుత్వం ఈ సాంస్కృతిక హీనతకు కారణమని ఎద్దేవాకూడాచేశాడు.
ఏది ఏమైనా రాజకీయ పార్టీలూ, రౌడీమూకలూ భారతీయ సంస్కృతంటే ఏమిటో డిసైడ్ చేసిపారేసి ఫాలో అయిపోమని చెప్పడానికి రెడీగా తయారయిపోయారు. రేపు ప్యాంటెందుకు వేసుకున్నావని నా కాళ్ళనూ, ముక్కుపుడకెందుకు పెట్టుకోలేదని మరో మహిళ ముక్కునూ ఈ సాంస్కృతిక పిచ్చోళ్ళు నిర్ధాక్షిణ్యంగా నరికేసినా,కోసేసినా మనం మాత్రం జేజేలు పలుకుతూ ఉందాం.
Thursday, January 29, 2009
బీజేపీ -కాంగ్రెస్ దొందుదొందే!
Posted by Kathi Mahesh Kumar at 1:23 PM 7 comments
Labels: సమాజం
Wednesday, January 28, 2009
"పబ్బు కెళ్ళే హక్కు , బీరు తాగే స్వేఛ్చ లేదా, ఒళ్ళు ప్రదర్శించే స్వాతంత్ర్యం"
"ఒక పక్క గృహ హింసకు గురై చెప్పుకోలేక యాతన పడుతున్న స్త్రీలు,కూలి చేస్తే తప్ప పొట్ట గడవని స్త్రీలు,ఆకతాయిల వేధింపులకు గురై గొంతులు కోయించుకునే ఆడపిల్లలు , మరో వైపు "మాకు బారు(లేదా పబ్బు)కెళ్ళే హక్కు లేదా, బీరు తాగే స్వేఛ్చ లేదా, ఒళ్ళు ప్రదర్శించే స్వాతంత్ర్యం లేదా అని వాపోయే స్త్రీ రత్నాలు మరో వేపు ఉంటే ఎవరి గురించి బాధ పడాలో నిర్ణయించుకోవడం మనుషులు చేయాల్సిన పని."
పై రెండు ప్రపంచాలూ అనాదిగా ఉంటూ వస్తున్నవే. అవి పరస్పర విరుద్ధాలు కాదు. పరస్పర పూరకాలు. ఆ నిజం గ్రహించగలగాలి. క్రింద-మధ్య తరగతి మహిళల స్వాతంత్ర్య కాంక్షలకీ, ఎగువ తరగతి మహిళల స్వేచ్చా ఆశయాలకీ ఎప్పుడూ తేడా ఉంటుంది. ఆ తేడా వారి సామాజిక- ఆర్థిక స్థాయినిబట్టి అవసరాలూ,ఆకాంక్షలూ,అవకాశాలను బట్టి ఏర్పడుతుంది. దిగువ-మధ్య తరగతి మహిళలు తమ అవసరాలు లేక తమ బాధల నేపధ్యంలోంచీ స్వేఛ్ఛ కోసం పోరాడితే. ఎగువ తరగతి మహిళలు అవసరాల స్థాయిని దాటి భావస్వేచ్చను ఆధారం చేసుకుని ఆశయాల ఆకాంక్షలతో స్వేచ్చను నిర్వచించుకుంటారు. ఈ రెంటిలో ఏది సరైనది అనేకన్నా, ఏ స్థితికి అది సరైనదనే విషయాన్ని అర్థం చేసుకోవడం అవసరం.
ఇక్కడ ఎవరికోసం భాధపడాలో లేక ఎవరిని సమర్ధించాలో అన్న ప్రశ్నకన్నా, స్త్రీవాదం అనే మూల భావజాలానికి ఈ రెండు పోకడలూ ప్రతీకలే అని గుర్తించాలి. గర్భం ధరించే హక్కుని (reproductive right) దిగువ-మధ్య తరగతి మహిళ గర్భస్తశిశువు ఆడపిల్ల అయిన కారణంగా అబార్షన్ చేసుకోమని బలవంతపెట్టే భర్త లేక అత్తమామలకు వ్యతిరేకంగా వాడటం ఎంత సమంజసమో, భర్త అవసరం లేకుండా ఒక స్వతంత్ర్య మహిళ గర్భం ధరించడానికి వాడుకోవడంకూడా అంతే సమంజసం అని తెలుసుకోవాలి. మొదటి ఘటనలో ఈ హక్కు మహిళకు సాధికారతను కలిగిస్తే, రెండవ ఘటనలో ఆర్థికస్వావలంబల కలిగిన ఒక సాధికారక మహిళ ఆకాంక్ష పూర్తికి ఉపయోగపడింది. ఇందులో ఎవరిది ఒప్పు ఎవరిది తప్పు అనేది నైతికతకు సంబంధించిన విషయమైతే అది వ్యక్తిగతమా? సామాజికమా? అనేది ఒక ప్రశ్న. చట్ట వ్యతిరేకమా ! అనేది మరో ప్రశ్న. పద్దెనిమిదేళ్ళు తీరిన ఒక స్త్రీ కావాలని గర్భం ధరిస్తే అది చట్టవ్యతిరేకమైతే కాదు. ఇక మిగిలింది నైతికత. వ్యక్తి ఇష్టప్రకారం జరిగింది కాబట్టి వ్యక్తిగత సమస్య లేనట్టే లెక్క. ఇక సామాజిక నైతికతను మతం నిర్దేశిస్తుందా?సాంప్రదాయం నిర్దేశిస్తుందా? పక్కింటొళ్ళూ, ఎదురింటోళ్ళూ నిర్దేశిస్తారా? లేక రాజకీయ గూండాలూ, హింసాత్మక సాంస్కృతిక పరిరక్షకులు నిర్దేశిస్తారా? అనేది అత్యంత సమస్యాత్మక ప్రశ్న.
ప్రస్తుత చర్చ "పబ్బు కెళ్ళే హక్కు , బీరు తాగే స్వేఛ్చ లేదా, ఒళ్ళు ప్రదర్శించే స్వాతంత్ర్యం" గురించి కనక ఆ విషయాన్ని కొంత theorize చెయ్యడానికి ప్రయత్నిస్తాను. స్త్రీలకూ పురుషులకూ సమాన హక్కుల నేపధ్యంలో చూస్తే పబ్బుకెళ్ళడం, బీరు త్రాగడం అసలు సమస్యలే కాకూడదు. అది individual choice and they can do what they want to do. వస్త్రాధారణనుకూడా ఇతరులకు ఇబ్బందికలగని వ్యక్తిగత స్వాతంత్ర్య పరిధిలో నిర్వచించొచ్చు. ఒళ్ళు చూపించే స్వాతంత్ర్యం "హద్దుల్ని" దాటితే, indecent behaviour (అశ్లీల ప్రవర్తన) causing public nuisance క్రింద చట్టపరైన చర్యలు తీసుకోవచ్చు. ఇక్కడా కొంత సమస్య ఉంది. లైంగిక వేధింపుల(వ్యతిరేక) చట్టం పరిధిలోనే మన భారతీయ శిక్షాస్మృతి(IPC)లో అశ్లీలత define చెయ్యబడింది. మహిళలకు అనుకూల చట్టం కాబట్టి, సహజంగా ఇక్కడ పురుషులు చేసే అశ్లీల చేష్టల ప్రస్తావన ఉందిగానీ ఇప్పటి చర్చల్లో చెప్పబడుతున్న అసభ్య(?) వస్త్రధారణ చేసుకునే మహిళల ప్రస్తావన లేదు. కాస్తోకూస్తో ఎక్కడైనా ఉంటే అది immoral trafficking act లో ఉంది.అదీ అలా ప్రవర్తించే మహిళలు డబ్బు లేదా మరే ఇతర లాభాన్నిగానీ ఆశిస్తేగానీ (ఆశించినట్లు నిరూపిస్తేగానీ) ఆ కేసు నిలవదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(3) ద్వారా మహిళలకోసం ప్రత్యేక చట్టాలు తెచ్చే అధికారం ప్రభుత్వాలకు కల్పించబడింది. అలాగే అర్టికల్ 15 (A)(e) మహిళల్ని అగౌరవపరిచే పద్దతుల్ని త్యజించే బాధ్యతా సమాజానికి కట్టబెట్టబడింది. ఈ ఆర్టికల్స్ కు లోబడి affirmative discrimination in favour of women స్ఫూర్తిగా చేసిన చట్టాలవడం వలన అవి మగవాడికి వ్యతిరేకంగా ఉంటాయేగానీ మహిళలకు ప్రతికూలంగా ఉపయోగించడానికి వీలుపడదు.
భారతీయ స్త్రీవాదం కొంత (స్వాతంత్ర్యోద్యమ సమయంలో)సహజపరిణామమైతే, మరికొంత అమెరికన్ స్త్రీవాదం అనుకరణతో వచ్చింది. ఆ అనుకరణలు గుడ్డి అనుకరణలుగా ప్రస్తుతం నగరజీవనంలో కనిపిస్తాయి. మూల సమస్యలపై అవగాహన లేకుండా, సొంత సమస్యల స్పృహకూడా లేకుండా కొందరు దాన్నొక rebellion fashion గా అనుసరిస్తారు. ముఖ్యంగా ఆర్ధిక సామాజిక సమస్యల జాడకూడా లేని ఎగువ మధ్యతరగతిలో ఈ పోకడలు కనిపిస్తాయి. వీరిలో త్రాగడం ఒక assertion అయితే స్మోకింగ్ ఒక liberating factor అదీ కేవలం notional గా మాత్రమే...నిజజీవితానికి ఏమాత్రం సంబంధం లేకుండా. వీళ్ళు పబ్ కాకపోతే ఇంట్లోనో లేక స్నేహితులతో పార్టీచేసుకుంటూనో ఇవన్నీ చేస్తారు. ఇదొక ట్రెండ్ అంతే! కాకపోతే వీరికీ వ్యక్తి స్వాతంత్ర్యం ఉందిగనక,వీరిపోకడల్ని చూసి మనం తలుచుకుని తలుచుకుని బాధపడాల్సిన అవసరం లేదు. వీరికి ఎలాగూ సంస్కృతీ,మతం,సాంప్రదాయం లాంటివి అంటవు. అలాంటప్పుడు వీరిని ఎరగాచూపి భారతీయ సంస్కృతేదో భష్టుపట్టిపోతుందనే అపోహలు కల్పించడంకూడా అర్థరహితం. ఇక దాడి చేయడం చట్టవ్యతిరేకం, అనాగరికం.
Posted by Kathi Mahesh Kumar at 6:24 PM 15 comments
Labels: సమాజం
Monday, January 26, 2009
రామసేన సేవ...!
అమ్మాయిల జుట్టుపట్టి లాగి...చెంప ఛెళ్ళుమనిపించి...పరిగెత్తించి కొట్టి...క్రిందపడదోసి.
ఈ సందర్భంగా ఈ భావజాలాన్ని ఆకాంక్షించే అందరికీ నా అభినందనలు. రామ సేవకులందరికీ, మత రక్షకులందరికీ, సాంస్కృతిక పరిరక్షకులందరికీ జేజేలు.
మరిన్ని వివరాలకు ఇక్కడ చూడండి.
Posted by Kathi Mahesh Kumar at 9:37 AM 50 comments
Labels: సమాజం
Sunday, January 25, 2009
ర్యాండమ్ ఆలోచనలు
రాయడం(బ్లాగడం) తగ్గింది: ఏమిటీ..ఈ మధ్య రాయడం తగ్గించారూ? అని అడిగారొక బ్లాగ్మిత్రులు. ఆ ప్రశ్నతోపాటూ, possible answers కూడా ఆరా తీసారు. ఉద్యోగంలో వ్యస్థతా! ఆర్థిక మాంద్యం ఎఫెక్టా!! వ్యాఖ్యాతల బాధలు పడలేకా లేక రాయడానికి ఏమీ మిగల్లేదా !! అని. ఈ నెలలో అతితక్కువ రాసే సమయం దొరికింది. ఉద్యోగంలో డిసెంబర్-జనవరి నెలల్లో పనిదినాలు చాలా తక్కువ ఉండటం వలన, ఉన్న కొద్దిరోజుల్లోనే నెలకు సరిపడా పని తగలడంతో..పనేపని. ఇక శెలవులంటారా! హైదరాబాద్ వచ్చాక శెలవుల్లో చెయ్యాల్సిన పనులూ,కలవాల్సిన మిత్రులూ, చూడాల్సిన సినిమాలూ,చదవాల్సిన పుస్తకాలూ చాలాచాలా తయారయ్యాయి. అందుకని బ్లాగడానికి సమయం తగ్గింది. ఇక mandatory భోపాల్ ప్రయాణాలు సరేసరి.
ఆర్థికమాంద్యానికీ నా ఉద్యోగానికీ పెద్ద లంకె లేదుకాబట్టి ఆ టెన్షన్ ప్రస్తుతానికి లేనట్టే. వ్యాఖ్యాతల బాధలు (అవి బాధలనుకుంటే) పడలేకుంటే,నేను బ్లాగడం ఎప్పుడో అపెయ్యాల్సింది.కాకపోతే నా చర్మం మందం కాకపోయినా, హృదయం విశాలం కాబట్టి అవెప్పుడూ సమస్యగా అనుకోలేదు. బ్లాగు రాసుకునేది ఎవర్నో ఉద్దరించడానికి కాక నాకోసం కాబట్టి, బ్లాగడం కొనసాగించడం పెద్ద విషయమూ కాదు. ఇక రాయడానికి ఏమీ మిగలని రోజున జీవించడం మానేస్తానంతే! If you have no story to tell, that only means you have no meaning left in life అనిపిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కథలు చెప్పడానికి బ్లాగుతోపాటూ మరిన్ని అవకాశాలు దొరకడం మరో కారణం అనుకుంటా బ్లాగులో రాయడం తగ్గించడానికి. ఔత్సాహిక సినిమా జనాలతో కథా చర్చలూ, సాహితీవేత్తలతో సాహిత్య విమర్శనాలూ, పాత మిత్రులతో nostalgic trips, future plans...హమ్మో! బోలెడు విషయాలు జరుగుతూనే ఉన్నాయి. ఇన్ని అనుభవాల్నీ రాయాలి...ఇంకా రాయాలి.
బ్లాగులు -బాధలు: "The first key to writing is... to write, not to think!" అంటాడు Finding Forrester అనే ఆంగ్ల చిత్రంలో Sean canary పాత్ర. బ్లాగుల ఫిలాసఫీకూడా అదే. రాయాలంటే...just రాసెయ్యడమే! బ్లాగులున్నదే అందుకోసం కదా! ఆలోచనలు చెప్పడానికి. అభిప్రాయాలు పంచుకోవడానికి.అనుభవాల సారాల్ని, జీవితంలో నేర్చుకున్న పాఠాల్నీ అక్షరాలలో పొదిగి పదిల పర్చుకోవడానికీ, పదిమందితో పంచుకోవడానికే బ్లాగుంది. అలా కాకుండా తెలుగు బ్లాగుల్లో లేక సొసైటీ ఇన్ జనరల్ లో పేరుకుపోయిందనుకున్న భావదాస్యాన్ని,ఆభిజాత్యాన్నీ,సా
చచ్చేచావు: కొందరు ఛస్తేగానీ వారి గొప్పతనం గుర్తింపబడదు. కొందరు ఛస్తామని చెప్పుకుంటేనో లేక ఇంకొకర్ని చంపితేనోగానీ వారి అస్థిత్వానికొక విలువరాదు. మొత్తానికి ఈ చావుల్తో పెద్ద చిక్కొచ్చిపడింది! చావుతోగానీ దేవదాసు ప్రేమకథ అమరం కాలేదు. చంపితేగానీ కొందరు ఉన్మాదుల ప్రేమకథలు టీవీ తెరకెక్కి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించలేదు. ఒక ప్రేమకథ త్యాగం పేరుతో చేతకానితన్నాన్ని నూరిపోస్తే, మరో రకం ప్రేమలు, ప్రేమంటేనే గుండెలు జారిపోయేలా చేసాయి. ఏదిఏమైనా రెండూ చావు కథలే. మన చావుకొచ్చిన కథలే!
దొరకని పుస్తకాలు: పట్టువదలని పుస్తకమార్కుడిలాగా మళ్ళీ విజయవాడ లెనిన్ సెంటర్లో పాత పుస్తకాల షాపుపైకి కత్తి పట్టుకుని బయల్దేరాను. దాదాపు నాలుగు సంవత్సరాలుగా చివుకుల పురుషోత్తం 'మహావేద', డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ 'శ్రావణి',స్పార్టకస్ 'ఖాకీ బతుకులు' నవలల్ని వీలైనన్ని చోట్ల వెతుకుతూనే ఉన్నాను. నవయుగా,ప్రజాశక్తి,దిశ,ఎమెస్కో,
Posted by Kathi Mahesh Kumar at 9:16 AM 18 comments
Labels: వ్యక్తిగతం
Wednesday, January 14, 2009
మహాభారతం నిజంగా జరిగుంటే !
"మహాభారతం నిజంగా జరిగుంటే, బహుశా ఇలాగే జరిగుంటుందా...!"అనిపించే నవల ‘పర్వ’. 1976వ సంవత్సరంలో ప్రముఖ కన్నడ సాహితీవేత్త ఎస్.ఎల్.భైరప్ప రచించిన ఈ నవల, సాహిత్య అకాడమీ వారి చొరవతో గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు తెలుగులోకి అనువదించారు. సాహిత్య అకాడెమీ వారి పుస్తకాలు దొరికే అన్ని షాపుల్లోనూ ఈ నవల Rs 250/- కి దొరుకుతుంది.
మొదటి ప్రచురణ 2002 సంవత్సరంలో జరిగింది. ప్రస్తుతం అది "తీక్షణంగా" చదివే ప్రయత్నం చేస్తున్నాను. తీక్షణంగా అని ఎందుకంటున్నానంటే, సాధారణంగా రామాయణం,మహాభారతాల్లాంటి కావ్యాలను చదవాలంటే భక్తి కావాలంటారు. కానీ ఈ మహాభారతం కథ కాదు ఒక మానసిక విశ్లేషణ. మహాభారతంలోని పాత్రలు తమంతట తాము తమ ఆలోచనా స్రవంతిని ఆవిష్కరించుకునే శైలిలో సాగే ఈ నవల ఒక మనోవైజ్ఞానిక ప్రయోగం. మహాభారతంనాటి సామాజిక-ఆర్ధిక-రాజకీయ పరిస్థితుల్ని వ్యక్తిగత కోణంలోంచీ ప్రతిపాత్రా వ్యక్తిగత పునరాలోచన (personal flashback) రీతిలో చెప్పే ఈ నవల చదవాలంటే, అదేస్థాయి మానసిక తీక్షణ,తార్కిక ధృక్పధం, భావవైశాల్యం కావాలి. ఇప్పటివరకూ సినిమాలూ,సీరియళ్ళూ నమ్మకాలూ కట్టిన మహాభారతం యొక్క image కట్టడాల్ని కూలగొట్టి మనుషుల కథలాగా చూడగలిగే సాహసం కావాలి. ఆ తీక్షణత లేకుంటే బహుశా రసస్పందన కలగదేమో. అందుకే బలహీనమైన గుండెలూ,నమ్మకాలూ కలవారు ఈ నవల జోలికి వెళ్ళకపోవడమే మంచిది.
అనువాదకుడి నివేదనలో లక్ష్మీనారాయణ గారు చెప్పినట్లు "(బైరప్పగారు)తార్కికతతో, శాస్త్రీయ పురా ఆధారాలతో, మిత్ (myth) ను- వాస్తవాలనూ విడదీసి మహాభారత గాథను ఈ ‘పర్వ’ రూపంలో పునర్నిర్మించారు...మరొకసారి చరిత్ర భూమిక పొరల్లో చిక్కుకుపోయిన నాటి సమాజ స్వరూపంలోకి తన పురాకథన త్రవ్వకంతో పాఠకుల్ని తీసుకువెళ్ళారు" అన్నట్లుగానే ఉంది ఈ నవల. రచయిత ఎస్.ఎ.భైరప్ప ఈ నవల రాసిన నాటి శ్రమని అంతర్మధనాన్నీ మున్నుడి(ముందుమాటలో)లో చాలా చక్కగా చెప్పారు. "సమకాలీన (కథా)వస్తువులను గూర్చి రాసేప్పుడు వివరాల కోసం రచయిత తడుముకోనవసరం లేదు. అతనికి తెలియకుండానే తన అనుభవం పేర్చుకుని వివరాలు రచన అవసరానికి తగిన రూపంలో దూసుకొని వస్తాయి. చారిత్రక వివరాలు అతని అనుభవంలో లభించక,కేవలం పరిశోధక బుద్ధికి మాత్రమే గోచరించడం వల్ల రచనా సమయంలో ద్రవరూపంగా సాక్షాత్కరించవు..."
"భారత లిఖిత కథ ప్రజల నమ్మకాలతో కూడా కలిసి నిల్చుంది. కీచకుణ్ణి చంపిన సంఘటన నిజం కాకపోయినప్పటికీ,ప్రజల మనసుల్లో అది రేకెత్తించిన భావం అసత్యం కాదు. ఇక్కడ రచయితకు కావలసిన సత్యం ఏది? ఎలాంటిది?...నేను రాస్తున్నది భారత పాత్రల కథ కాదు. మానవ అనుభవానికి చెందిన వివిధ ఆముఖాలు,రూపాలు, మానవసంబంధ స్వరూప వివేచనలనే స్పృహ నాకు చివరిదాకా ఉంది. ఒక్కో పాత్రనో,సన్నివేశాన్నో రాస్తున్నప్పుడు వాటి కొత్తకొత్త వివరాలు,రూపురేఖలూ దృగ్గోచరమవుతుండేవి." అంటారు. పాఠకుడికీ రచయిత అనుభూతి అనుభవమవడం ఈ నవల ప్రత్యేకత.
ఆధునిక హేతువాద ధృక్పదంతో మహాభారతాన్ని చదువుతుంటే ఉదయించే "ఈ కథను ఎలా నమ్మాలి? ఎంతవరకూ నమ్మాలి? ఈ శాపాలూ-వరాల యధార్థ స్వరూపమేమిటి? పాండవుల పుట్టుకలో మర్మమేమిటి? ద్రౌపదీ వస్త్రాపహరణ వికృత కల్పనలోని వాస్తవం ఏమిటి? ఒక కుటుంబంలోని దాయాదుల పోరుకు మొత్తం ఆర్యావర్తనం కదిలి రావడంలోని ఆంతర్యం ఏమిటి? అసలు మహాభారతంలో చర్చించిన ‘దర్మం’ స్వరూపమేమిటి? అది చిత్రించే చారిత్రక సామాజిక తత్వమేమిటి? వంటి అనేకానేక ప్రశ్నలకు సంపూర్ణంగా సమాధానం ఇవ్వకపోయినా ఒక అంగీకారాత్మక కోణాన్ని ముందుకు తీసుకురావడంలో ఈ నవల సఫలమయ్యిందని చెప్పొచ్చు. అందుకే "ఈ పర్వ నవల సామాన్య పాఠకులకు మహాభారతాన్ని కొత్తరూపంలో చెప్పిన నవల. మహాభారతంలో పరిశ్రమించే పరిశోధకుడికి సమగ్ర సృజనాత్మక వ్యాఖ్య". "నాటి మహాభారతానికి నేటి ‘పర్వ’ ఒక సమగ్ర పూరణ." "దీన్ని చదివితేగానీ మహాభారత అధ్యయనం పూర్తికానట్లే లెక్క" అని కొందరు సాహితీవేత్తలు,పాఠకులూ భావిస్తారు.
అందుకే ఈ నవలని చదవాలి. తీక్షణంగా చదవాలి. ప్రయత్నించండి.
Posted by Kathi Mahesh Kumar at 8:45 AM 21 comments
Labels: సాహిత్యం
Tuesday, January 13, 2009
ఆక్షణంలో ప్రేమించాను...
గడివేయని తలుపు
ఎదురుచూసే తలపు
చిహ్నంగా ఉంచిన దీపం
చీకటిచేసుంచిన గది
పందిరిమంచం
పవళించిన అందం
పరిమళించే ఆకాంక్ష
కానీ...
ఆక్షణంలో ప్రేమించాను
అందుకే తిరిగొచ్చాను
ఒకేసారి అయిపోయే సుఖంకన్నా
అవుతూ వుండే ఆనందం కోసం
ఆక్షణంలోని ఉద్రేకంకన్నా
అనుక్షణం ఆస్వాదించే స్థిరత్వం కోసం
అవధులు లేని ఆవేశంకన్నా
అద్భుతమైన అనుభూతి కోసం
తిరిగొచ్చాను
అప్పటివరకూ కేవలం కాంక్షించాను
ఆక్షణంలో ప్రేమించాను...
అందుకే తిరిగొచ్చాను
Posted by Kathi Mahesh Kumar at 1:13 PM 19 comments
Labels: కవిత
Sunday, January 11, 2009
‘కొత్తపాళీ’ గారి మీద కలం చేసుకున్నాను
ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో ‘కొత్తపాళీ’ గారి బ్లాగుపరిచయం. చదవడానికి పై బొమ్మపై క్లిక్కండి....
Posted by Kathi Mahesh Kumar at 7:41 PM 16 comments
Labels: వ్యక్తిగతం
Tuesday, January 6, 2009
మొరిగే కుక్క - ఉమ్మే నోరు
మందంగా ప్రవర్తిస్తే...
అది మత్తగజమైనా వ్యతిరేకిస్తాను
నా ప్రాణాల్నైనా పణంగా పెట్టి
అస్థిత్వాన్ని కాపాడుకుంటాను
అది ఏనుగైతే నాకేంటి?
కనీసం మొరిగైనా నా నిరసనను ప్రదర్శిస్తాను
అకారణంగా ఉరిమితే...
అది ఆకాశమైనా నాకు లెక్కలేదు
నా ఆత్మగౌరవాన్ని నేలకురాస్తే
నింగిపైనా కోపగిస్తాను
అది అందకపోతేమాత్రం వదిలేస్తానా?
కనీసం ఉమ్మైనా ప్రతీకారం చేస్తాను
పేదవాడికోపం పెదవికి చేటని
నోరుమూసుకుని కూర్చుంటానా?
అన్యాయం చెవి పోటెక్కేలా..
పెదవి చిట్లినా, రక్తమే కక్కినా
ఒక్క పొలికేకైనా పెట్టిపోనా!
Posted by Kathi Mahesh Kumar at 10:15 AM 27 comments
Labels: కవిత
Monday, January 5, 2009
కులం చర్చల్లో నేను...
సాహితీ ఝరి - నా హృదయ మంజరి లో...
కులాల గురించి జరిగే చర్చల్ని మూడు విభిన్న భాగాలు విభజిస్తేగాని అర్థవంతమైన చర్చ జరగదని నా అభిప్రాయం.
1.సామాజిక విభజనగా కులాలు- కులవివక్ష
2.కులప్రాతిపదికన ప్రత్యేకహోదా - రిజర్వేషన్లు
3.రాజకీయ అంశంగా కులం - politics of representation and rhetoric.
మీ అతర్మధనంలో మరియూ చాలా వరకూ జరిగే చర్చల్లో(మీ టపాకొచ్చిన వ్యాఖ్యల్లోకూడా) ఈ మూడింటినీ కలగలిపి మాట్లాడేస్తుంటారు. అందుకే అవి ఎప్పటికీ తెగే చర్చలు కావు.
పైన చెప్పిన మూడింటికీ మూలాలు కులమే అయినా వాటి manifestation,విస్తృతత్వం,రూపం,అవసరం చాలా విభిన్నమైనవి అందుకే ఒకేగాటన కట్టదగినవి కావు.ఒకే స్థాయిలో బేరీజు చెయ్యదగినవీ కావు.అందుకే వాటిని ప్రత్యేకంగానే చర్చించాలి.
1.సామాజిక విభజనగా కులాలు- కులవివక్ష:
కులవ్యవస్థ ఏలా ఏర్పడింది అనే దానికి ఖచ్చితమైన సమాధానాలు లేవు.కాకపోతే భారతదేశ చరిత్ర మొదలైనప్పటి నుంచీ కులప్రస్తావన ఉందిగనక అది హిందూమతంలోంచీ పుట్టిన వ్యవస్థగా అనుకోవాలి.ఇక మతపరంగా "జన్మనా జాయతే.." లాంటి ప్రస్తావనతో అది రూఢిగా తెలుస్తుంది. ఇక ఎవరు ఎక్కడ్నించీ(ఏఏ భాగాల్నుంచీ) పుట్టారో చెప్పే జుగుప్సాకర సిద్ధాంతం ఉండనేవుంది.
ఇవన్నీ పక్కనబెట్టి కులాలు కేవలం పనులవల్ల వచ్చాయనుకుంటే వివక్ష ప్రస్తావన వచ్చుండేది కాదు. కాబట్టి మతమూలాన్ని అంగీకరించక తప్పదు.మతమూలాల పరంగా చూస్తే advantageous పనులున్న మైనారిటీ కులాలు మెజారిటీ అయిన మిగతాకులాలపై ఆధిపత్యాన్ని చలాయించడానికి దేవుడిపేరు చెప్పి వివక్ష మొదలెట్టారని నమ్మకతప్పదు.
ఇక శూద్రులకన్నా అధమమైన పంచమకులాన్ని తమ అసహ్యాన్ని తెలియజెప్పేందుకు సృష్టించారు.Dignity of labour ని ఎలాగూ కులవ్యవస్థ గుర్తించలేదు,కానీ మాలిన్యాన్ని శుభ్రంచేసే కులాల్ని మరింత దిగజార్చి అస్పృశ్యుల్ని(అంటరానివాళ్ళని) చేసారు.
అంటరానితనం అన్ని మూలాల్లోకీ చొచ్చుకునివెళ్ళింది. విద్య,వైద్యం,సామాజిక-ఆర్ధిక ప్రగతి అన్నింటిలోనూ అంటరానివారు అంటరానివారుగానే మిగిలారు.కొన్ని వేల సంవత్సరాలు ఈ వివక్ష నడిచింది.కులహింస గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే హిందూ మతానికి అంత మంచిదని నా అభిప్రాయం. తెగిన నాలుకలూ,చెవిలో సీసాలూ,తెగనరికిన తలలూ ఆ కులాల్లో నమోదుచేసే నాధుళ్ళు లేక లెక్కలు లభ్యంగా లేవు. ఒకవేళ ఎవరైనా లెక్కకట్టుంటే పరిస్థితి ఇప్పుడు మరింత ప్రమాదకరంగా తయారయుండేదేమో. కాబట్టి ఈ విధంగా హిందూమతం తనకు గొప్పసేవే చేసుకుంది.
19 వశతాబ్ధపు ప్రారంభంలో కొందరు జ్యోతీబా ఫూలే వంటి సంఘసంస్కర్తలు "మనిషిని మనిషిగా చూడాలనే" ఒక చిన్న (కొందరికి తప్పుడు) పాశ్చాత్యధోరణిని దొరకబుచ్చుకుని నిమ్నకులస్తుల్ని ముఖ్యంగా అప్పటికి శూద్రులతొ సహా అన్ని చాతుర్వర్ణాల ఆభిజాత్యాహంకారాన్ని అనుభవిస్తున్న పంచముల్ని ఉద్దరించాలని కంకణంకట్టుకున్నారు.కనీసం పూర్తి వివక్షను కాకున్నా "అంటరానితనాన్ని" రూపుమాపే ప్రయత్నం చేసారు.
స్వాతంత్ర్యపోరాట సమయానికి సంఘసంస్కర్తల ప్రయత్నం.కులాన్ని సరిగ్గా అర్థం చేసుకోని ఇంగ్లీషు పాలకుల పుణ్యమా అని పంచములు అక్కడక్కడ బహుకొద్దిమంది కాస్తోకూస్తో ఆధునిక విద్యను అభ్యసించారు.మనుషులమనే చైతన్యం వచ్చింది.తక్కువచేసి చూడబడుతున్నారనే భావన జాగృతమయ్యింది. కానీ పోరాడే శక్తిలేదు.ఎదురుతిరిగే వనరులు లేవు.
స్వాతంత్ర్యోద్యమంలో గాంధీ ప్రవేశించాడు. అప్పటివరకూ కేవలం అగ్రకులాల్లో మాత్రమే వున్న స్వాతంత్ర్యాకాంక్ష జనబాహుళ్యానికి విస్తరించకపోతే లాభం లేదనే రహస్యాన్ని గ్రహించాడు.స్వాతంత్ర్యోద్యమం విసృతమయ్యింది.మిగతాకులాలు కలిసాయి. అంటరానివాళ్ళనికూడా "హరిజనులు" అని పేరుపెట్టి కలుపుకునే ప్రయత్నం చేసాడు. కానీ అగ్రకులాల్లో విపరీతమైన నిరసనభావం రగిలింది. సామాజిక న్యాయంకన్నా దేశస్వతంత్ర్యం ముఖ్యమనుకుని తన తీవ్రతని తగ్గించాడు.
ఈ పరిణామక్రమంలో కులపోరాటాన్ని దేశస్వతంత్ర్యంకన్నా అతిముఖ్యమనుకున్నాడొక పంచమ కులస్తుడు.అతని పేరు భీంరావ్ అంబేద్కర్.తనప్రజల సామాజికస్వతంత్ర్యానికి పాటుపడుతూనే దేశస్వతంత్ర్యానికీ తనదైన సేవచేసాడు. పోరాటాలు సాగాయి. గుళ్ళలోకి ప్రవేశం. తాగే నీళ్ళకోసం పోరాటం.అస్పృస్యతకు వ్యతిరేకంగా నినాదం ఎన్నో జరిగాయి. అయినా వివక్ష పోలేదు.
స్వతంత్ర్యం వచ్చింది.అంటరానితనం ఒక నేరంగా పరిగణించబడింది.అగ్రకుల అధికారులు.అగ్రకుల అనుకూల సామాజిక-ఆర్ధిక-రాజకీయరంగాలు చట్టాన్ని అమలు చెయ్యలేదు.మళ్ళీ పోరాటాలు..మళ్ళీ పోరాటాలు. ఇప్పటికీ పోరాటాలు.
హరిజనులు తమల్ని తాము "దళితులు" అనుకున్నారు. వివక్ష మాత్రం మరింత sophisticated రూపాన్ని సంతరించుకుంది.పల్లెల్ని దాటి పట్టణాల్లో నాగరికత విస్తరించిన నగరాల్లో ప్రవేశించింది. మరిన్ని రంగాల్లో విస్తరించింది.విద్య,ఉద్యోగం,రాజకీయం అన్నిఅన్ని రంగాల్లోనూ ఎదో ఒకరూపంలో ప్రవేశించింది.పుట్టుకలొ చావులో..పెళ్ళిలో తద్దినంలో అన్నింటిలోనూ వివక్ష ఇంకా ఏదో ఒకమూల సాగుతూనే ఉంది.
దళితులపై హింస...అస్సలు తగ్గలేదు.2006 లో 27,070 కేసులు, 2007లో 30,013 కేసులూ భారతదేశంలో నమోదయ్యాయి. ఇవి కేవలం నమోదైనవి మాత్రమే.నమోదుకానివి లక్షల్లొ వుంటాయని అంచనా.
1)రివర్స్ కుల వివక్ష ఆమోద యోగ్యమా మొరల్గా? 2) కులాలను రూపు మాపగలమా?
ఏది ఏమైనా సమస్య చరిత్ర తెలీకుండా సమాధానం కష్టం కాబట్టి నా మునుపటి వ్యాఖ్యని భూమికగా భావించండి. ఆ నేపధ్యంలో నేను మీ ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి ప్రయత్నిస్తాను.
1.రివర్స్ కులవివక్ష ఆమోదయోగ్యం కాదు.ఒకప్పుడు చిన్నచూపు చూసారని, ఇప్పుడు చూస్తున్నారని అగ్రవర్ణాలపై కక్షగట్టడం సిద్ధాంతరీత్యా దళిత స్పూర్తికి విరుద్ధం.కష్టాలు పడినవాడు అదే కష్టాల్ని ఎదుటివాడికి పెట్టాలనుకోడు.కానీ,అందరి వ్యక్తుల స్పందన సిద్ధాంతాల్ని అనుసరించి ఒక్కలాగే ఉండకపోవచ్చు.ఇది అగ్రవర్ణాలకు కూడా వర్తిస్తుంది.
ఉదాహరణకు..రిజర్వేషన్ విధానం ద్వారా సీటుకోల్పోయిన అగ్రవర్ణవిద్యార్థి కి ఒక victim లాగా ఫీలయ్యే అధికారం ఉంది.ఈ విధానం వల్ల తన rightful seat కోల్పోయాననే ఆక్రోశం అతని అధికారం. కానీ తన వ్యక్తిగత ఆక్రోశాన్ని ‘వ్యవస్థలోపం’ లేక ‘విధానపరమైన అన్యాయం’ అనే హక్కు అతనికి లేదని గుర్తించ గలగాలి. ఎందుకంటే విధానం ఒక విస్తృత సామాజిక న్యాయానికి సంబంధించిన నమూనా. అందులో కొందరు వ్యక్తులకు అన్యాయం జరిగిందా అనేకన్నా,సమాజానికి న్యాయం జరిగిందా అనే కొలమానమే సరైనది.చాలా వరకూ చర్చల్లో ఈ రెంటిమధ్యా తేడా గుర్తించక దాన్ని వివక్ష అని అపోహపడే ప్రమాదం మెండుగా ఉంది.చాలా వరకూ జరిగేది అదే.రివర్స్ వివక్షగా భావిస్తున్నవాటిల్లో ఇలాంటివే ఎక్కువ.
అగ్రవర్ణాల ప్రజలను వివక్షకు గురిచేసే స్థితికి దళితులు ఇంకా చేరలేదని నా అభిప్రాయం. ఒకవేళ ఆ స్థితికి చేరినా వివక్షకు గురిచేసే మానసికత రాదనే నా నమ్మకం.సైధాంతిక విభేధాలూ,రాజకీయ rhetoric సందర్భాలలో "బ్రాహ్మణత్వాన్ని" తెగిడే దళితులు కనిపిస్తారేమోగానీ బ్రాహ్మణుల్ని కాదు. "అగ్రవర్ణభావజాలాన్ని" ధూషించే దళితులు కనిపిస్తారేగానీ అగ్రవర్ణాల ప్రజల్ని కాదు. ఈ రెంటిమధ్యాగల తేడాని గుర్తించలేని వారు అపోహల్ని సృష్టించడంలోనూ,అపొహల్లో జీవించడంలోనూ,అపొహలకి విస్తృత ప్రాచుర్యం కలిగించి ఉద్యమంపట్ల భయాన్నీ,తమ ప్రజల్లో insecurity ని సృష్టిస్తారేతప్ప, సమస్యకు సమాధానం దిశగా contribute చెయ్యలేరు.
2)కులాలను రూపుమాపలేము. చాలా అభ్యంతరకరంగా అనిపించినా అదే నిజం. కులం ఇప్పుడొక రాజకీయ ఆయుధం.సామాజిక అస్థిత్వంలో భాగం.కాబట్టి కులాన్ని నిర్ములించడం సులభం కాదు. దాదాపు అసాధ్యం కూడా.
మనమిప్పుడు సంధిగ్ధమైన సమయం(conflicting times)లో జీవిస్తున్నాము. దళితుల్లో "అన్యాయమైపోయాము" అనే స్పృహ చైతన్యవంతమయ్యింది. ఆ అన్యాయానికి సమాధానాలు వెతికేప్రయత్నంలో ఘర్షణ తప్పదు.ఇప్పటిదాకా ప్రశ్నించేవారు లేరు కాబట్టి వ్యవస్థ status-quo లో ఉంది. ఇప్పుడు సంతులన(equilibrium)దెబ్బతినింది. మళ్ళీ even out అవ్వడానికి సమయం పడుతుంది. అది ఎప్పుడు జరిగేనో ఈ సమాజానికున్న shock absorbers మరియూ రాజకీయవిధానాల్ని బట్టుంటుంది.
ఆ సమయం కోసం శాంతినీ సమానత్వాన్నీ కోరుకునే అందరూ ఈ సమస్యను అర్థం చేసుకుని సమాధానాల్ని వెతికే దిశగా ప్రయత్నించాలి.
కలగూరగంప లో...
కులరహిత హిందూ సమాజాన్ని నేను కాంక్షించినా, ప్రస్తుత రాజకీయభావజాలం నేపధ్యంలో అదొక utopia క్రిందనే అనిపిస్తోంది. అందుకే కనీసం కులవివక్షరహిత సమాజం కోసం పాటుపడటంలో అర్థముందనే భావన నాది.అంతమాత్రం చేత కులాల పరిధులను దాటి ఆలోచించనట్లు కాదు. కులాన్ని ప్రాతిపదికగా చేసుకుంటూనే,ఒక అర్థవంతమైన శాంతీయుత సమాజనిర్మాణం సాధ్యమయితే కులం per se is not an issue అని నమ్ముతాను. ఈ ఆలోచనాపధంలోకూడా నేను అంగీకరించేవీ, విభేధించేవీ చాలా ఉన్నాయి.Ideology కన్నా మనుషులు ముఖ్యమనుకునే నాకు వ్యక్తుల సుఖశాంతులు ముఖ్యం.Happiness and peaceful coexistence of humanity is an issue for me not the existence of caste in itself.
Posted by Kathi Mahesh Kumar at 12:24 PM 13 comments
Labels: సమాజం