Wednesday, January 28, 2009

"పబ్బు కెళ్ళే హక్కు , బీరు తాగే స్వేఛ్చ లేదా, ఒళ్ళు ప్రదర్శించే స్వాతంత్ర్యం"

"ఒక పక్క గృహ హింసకు గురై చెప్పుకోలేక యాతన పడుతున్న స్త్రీలు,కూలి చేస్తే తప్ప పొట్ట గడవని స్త్రీలు,ఆకతాయిల వేధింపులకు గురై గొంతులు కోయించుకునే ఆడపిల్లలు , మరో వైపు "మాకు బారు(లేదా పబ్బు)కెళ్ళే హక్కు లేదా, బీరు తాగే స్వేఛ్చ లేదా, ఒళ్ళు ప్రదర్శించే స్వాతంత్ర్యం లేదా అని వాపోయే స్త్రీ రత్నాలు మరో వేపు ఉంటే ఎవరి గురించి బాధ పడాలో నిర్ణయించుకోవడం మనుషులు చేయాల్సిన పని." - సుజాత (మనసులో మాట)

పై రెండు ప్రపంచాలూ అనాదిగా ఉంటూ వస్తున్నవే. అవి పరస్పర విరుద్ధాలు కాదు. పరస్పర పూరకాలు. ఆ నిజం గ్రహించగలగాలి. క్రింద-మధ్య తరగతి మహిళల స్వాతంత్ర్య కాంక్షలకీ, ఎగువ తరగతి మహిళల స్వేచ్చా ఆశయాలకీ ఎప్పుడూ తేడా ఉంటుంది. ఆ తేడా వారి సామాజిక- ఆర్థిక స్థాయినిబట్టి అవసరాలూ,ఆకాంక్షలూ,అవకాశాలను బట్టి ఏర్పడుతుంది. దిగువ-మధ్య తరగతి మహిళలు తమ అవసరాలు లేక తమ బాధల నేపధ్యంలోంచీ స్వేఛ్ఛ కోసం పోరాడితే. ఎగువ తరగతి మహిళలు అవసరాల స్థాయిని దాటి భావస్వేచ్చను ఆధారం చేసుకుని ఆశయాల ఆకాంక్షలతో స్వేచ్చను నిర్వచించుకుంటారు. ఈ రెంటిలో ఏది సరైనది అనేకన్నా, ఏ స్థితికి అది సరైనదనే విషయాన్ని అర్థం చేసుకోవడం అవసరం.


ఇక్కడ ఎవరికోసం భాధపడాలో లేక ఎవరిని సమర్ధించాలో అన్న ప్రశ్నకన్నా, స్త్రీవాదం అనే మూల భావజాలానికి ఈ రెండు పోకడలూ ప్రతీకలే అని గుర్తించాలి. గర్భం ధరించే హక్కుని (reproductive right) దిగువ-మధ్య తరగతి మహిళ గర్భస్తశిశువు ఆడపిల్ల అయిన కారణంగా అబార్షన్ చేసుకోమని బలవంతపెట్టే భర్త లేక అత్తమామలకు వ్యతిరేకంగా వాడటం ఎంత సమంజసమో, భర్త అవసరం లేకుండా ఒక స్వతంత్ర్య మహిళ గర్భం ధరించడానికి వాడుకోవడంకూడా అంతే సమంజసం అని తెలుసుకోవాలి. మొదటి ఘటనలో ఈ హక్కు మహిళకు సాధికారతను కలిగిస్తే, రెండవ ఘటనలో ఆర్థికస్వావలంబల కలిగిన ఒక సాధికారక మహిళ ఆకాంక్ష పూర్తికి ఉపయోగపడింది. ఇందులో ఎవరిది ఒప్పు ఎవరిది తప్పు అనేది నైతికతకు సంబంధించిన విషయమైతే అది వ్యక్తిగతమా? సామాజికమా? అనేది ఒక ప్రశ్న. చట్ట వ్యతిరేకమా ! అనేది మరో ప్రశ్న. పద్దెనిమిదేళ్ళు తీరిన ఒక స్త్రీ కావాలని గర్భం ధరిస్తే అది చట్టవ్యతిరేకమైతే కాదు. ఇక మిగిలింది నైతికత. వ్యక్తి ఇష్టప్రకారం జరిగింది కాబట్టి వ్యక్తిగత సమస్య లేనట్టే లెక్క. ఇక సామాజిక నైతికతను మతం నిర్దేశిస్తుందా?సాంప్రదాయం నిర్దేశిస్తుందా? పక్కింటొళ్ళూ, ఎదురింటోళ్ళూ నిర్దేశిస్తారా? లేక రాజకీయ గూండాలూ, హింసాత్మక సాంస్కృతిక పరిరక్షకులు నిర్దేశిస్తారా? అనేది అత్యంత సమస్యాత్మక ప్రశ్న.


ప్రస్తుత చర్చ "పబ్బు కెళ్ళే హక్కు , బీరు తాగే స్వేఛ్చ లేదా, ఒళ్ళు ప్రదర్శించే స్వాతంత్ర్యం" గురించి కనక ఆ విషయాన్ని కొంత theorize చెయ్యడానికి ప్రయత్నిస్తాను. స్త్రీలకూ పురుషులకూ సమాన హక్కుల నేపధ్యంలో చూస్తే పబ్బుకెళ్ళడం, బీరు త్రాగడం అసలు సమస్యలే కాకూడదు. అది individual choice and they can do what they want to do. వస్త్రాధారణనుకూడా ఇతరులకు ఇబ్బందికలగని వ్యక్తిగత స్వాతంత్ర్య పరిధిలో నిర్వచించొచ్చు. ఒళ్ళు చూపించే స్వాతంత్ర్యం "హద్దుల్ని" దాటితే, indecent behaviour (అశ్లీల ప్రవర్తన) causing public nuisance క్రింద చట్టపరైన చర్యలు తీసుకోవచ్చు. ఇక్కడా కొంత సమస్య ఉంది. లైంగిక వేధింపుల(వ్యతిరేక) చట్టం పరిధిలోనే మన భారతీయ శిక్షాస్మృతి(IPC)లో అశ్లీలత define చెయ్యబడింది. మహిళలకు అనుకూల చట్టం కాబట్టి, సహజంగా ఇక్కడ పురుషులు చేసే అశ్లీల చేష్టల ప్రస్తావన ఉందిగానీ ఇప్పటి చర్చల్లో చెప్పబడుతున్న అసభ్య(?) వస్త్రధారణ చేసుకునే మహిళల ప్రస్తావన లేదు. కాస్తోకూస్తో ఎక్కడైనా ఉంటే అది immoral trafficking act లో ఉంది.అదీ అలా ప్రవర్తించే మహిళలు డబ్బు లేదా మరే ఇతర లాభాన్నిగానీ ఆశిస్తేగానీ (ఆశించినట్లు నిరూపిస్తేగానీ) ఆ కేసు నిలవదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(3) ద్వారా మహిళలకోసం ప్రత్యేక చట్టాలు తెచ్చే అధికారం ప్రభుత్వాలకు కల్పించబడింది. అలాగే అర్టికల్ 15 (A)(e) మహిళల్ని అగౌరవపరిచే పద్దతుల్ని త్యజించే బాధ్యతా సమాజానికి కట్టబెట్టబడింది. ఈ ఆర్టికల్స్ కు లోబడి affirmative discrimination in favour of women స్ఫూర్తిగా చేసిన చట్టాలవడం వలన అవి మగవాడికి వ్యతిరేకంగా ఉంటాయేగానీ మహిళలకు ప్రతికూలంగా ఉపయోగించడానికి వీలుపడదు.


భారతీయ స్త్రీవాదం కొంత (స్వాతంత్ర్యోద్యమ సమయంలో)సహజపరిణామమైతే, మరికొంత అమెరికన్ స్త్రీవాదం అనుకరణతో వచ్చింది. ఆ అనుకరణలు గుడ్డి అనుకరణలుగా ప్రస్తుతం నగరజీవనంలో కనిపిస్తాయి. మూల సమస్యలపై అవగాహన లేకుండా, సొంత సమస్యల స్పృహకూడా లేకుండా కొందరు దాన్నొక rebellion fashion గా అనుసరిస్తారు. ముఖ్యంగా ఆర్ధిక సామాజిక సమస్యల జాడకూడా లేని ఎగువ మధ్యతరగతిలో ఈ పోకడలు కనిపిస్తాయి. వీరిలో త్రాగడం ఒక assertion అయితే స్మోకింగ్ ఒక liberating factor అదీ కేవలం notional గా మాత్రమే...నిజజీవితానికి ఏమాత్రం సంబంధం లేకుండా. వీళ్ళు పబ్ కాకపోతే ఇంట్లోనో లేక స్నేహితులతో పార్టీచేసుకుంటూనో ఇవన్నీ చేస్తారు. ఇదొక ట్రెండ్ అంతే! కాకపోతే వీరికీ వ్యక్తి స్వాతంత్ర్యం ఉందిగనక,వీరిపోకడల్ని చూసి మనం తలుచుకుని తలుచుకుని బాధపడాల్సిన అవసరం లేదు. వీరికి ఎలాగూ సంస్కృతీ,మతం,సాంప్రదాయం లాంటివి అంటవు. అలాంటప్పుడు వీరిని ఎరగాచూపి భారతీయ సంస్కృతేదో భష్టుపట్టిపోతుందనే అపోహలు కల్పించడంకూడా అర్థరహితం. ఇక దాడి చేయడం చట్టవ్యతిరేకం, అనాగరికం.

****

15 comments:

నాగన్న said...

"ఎవడికి అయినా తన కూతురు ఎవడితోనో పబ్‌కు వెళ్ళింది అని తెలిస్తే జీర్ణించుకోవడం కష్టం" - ఈ స్టేట్‌మెంటును ఒప్పుకోకపోతే నేను చెప్పేదాంట్లో అర్ధం కనిపించదు.

రామ సేన వారు చేసిన విధానం సరైనది కాకపోయినా వాళ్ళ ఉద్దేశంలో నాకు నీతి కనిపిస్తుంది - అది యువతను చెడిపోకుండా ఉండాలని, అమ్మాయిల భవిష్యత్ బాగుండాలని. పబ్‌లను నిర్ణీత సంఖ్యలో కాలేజీలకు దూరంగా, ఇండ్లకు దూరంగా ఒక పద్ధతి ప్రకారం కేటాయించాలి, వాడకందార్లకు సెక్యురిటీ కల్పించాలి, తాగి బండి నడపకుండా పరీక్ష/శిక్ష ఉండాలి. అమెరికాలో ఈ నియంత్రణ అనేది ఉన్నది, మన దగ్గర ఇంకా రాలేదు.

ఒక పబ్ పది మంది కడుపు నింపవచ్చు కానీ వేల మంది అమ్మాయిల జీవితాలకు చెడు చెయ్యవచ్చు. ఎవడికి అయినా అమ్మాయిలతో పబ్‌లకు వెళ్ళాలని ఉంటుంది కానీ పబ్‌లో కలిసిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం మాత్రం అరుదైన విషయమే కదా! మన సమాజంలో ఆడా మగలను ఒకే విధంగా చూసే స్థాయికి మనం ఇంకా ఎదగలేదు ... ఈ విషయంలో స్వాతంత్రం అనే మాటకు అర్ధం వెతకడం వృధా .

సాంప్రదాయం, సంస్కృతిని గాలికి వదిలెయ్యడం కూడా నేల విడిచి సాము చెయ్యడమే, ఈ విషయంలో రామసేనకే నా ఓటు.

కత్తి మహేష్ కుమార్ said...

@నాగన్న: మీరు చెప్పిందాన్ని middle class morality అంటారు. పబ్బులకి క్రమం తప్పకుండా వెళ్ళేది వీళ్ళుకాదు. కాబట్టి ఈ argument కి విలువలేదు.పబ్స్ కి వెళ్ళేది డబ్బున్న upper middle class ప్రజలు లేదా వీరిని అనుకరించడానికి ప్రయత్నించే neo-rich మధ్యతరగతి యువత. వారి శాతం మొత్తం జనాభాలో 10% కూడా ఉండదు.మొదటివారిలో ఈ భావవైరుధ్యం అసలు లేదు. రెండోరకం దీన్నొక అనురణీయమైన fashion గా భావిస్తారుకాబట్టి సమస్య లేదు. ఇక మనకో లేక రామసేనకో ఎందుకండీ బాధ?

మార్తాండ said...

చిన్నప్పుడు నేను సెక్స్ గురించి మాట్లాడితే "అలా మాట్లాడకు రా, పరువుపోతుంది" అని తిట్టే వాళ్ళు. నన్ను అలా తిట్టిన వాళ్ళే సీక్రెట్ గా పత్రికలో సమరం గారి సెక్స్ సలహాలు చదువుతుండే వాళ్ళు. వీళ్ళు పగటి పూట శ్రీరంగ నీతులు చెపుతూ, రాత్రి పూట బోగం కొంపలలో దూరుతుంటారు.

రాజ మల్లేశ్వర్ కొల్లి said...

Man, you are already separated from the crowd, why you're still looking at them...!?

జీడిపప్పు said...

ఒక్ మధ్య తరగతి కుటుంబాన్ని కూర్చోబెట్టి " అయ్యా/అమ్మా, మీ కుతురు వయసున్న అమ్మాయిలు పబ్‌లో తాగి తందనాలాడుతూ పైన కింద రెచ్చకొట్టేలా బట్టలు వేసుకొని అశ్లీలంగా నృత్యాలు చేస్తుంటే వాళ్ళను కొట్టారు, తన్నారు" అని చెబితే వారి స్పందన:
దాడి చేయడం - దారుణం
ఫలితం - చాలా బాగుంది, అమ్మాయిలకు తగిన శాస్తి జరిగింది.

ఇక్కడ మనము గమనించాలిసింది "సగటు భారతీయ కుటుంబం" గురించి. మహేశ్ గారికి ఉన్న విశాల భావాలు అయిన " అమ్మాయిలు పబ్బుకెళ్ళడం, బీరు త్రాగడం అసలు సమస్యలే కాకూడదు" వాళ్ళకు లేవు. ఇంకా అంత అభివృద్ది చెందలేదు.

కాబట్టి
దాడి చేయడం - దారుణం
ఫలితం - చాలా బాగుంది, అమ్మాయిలకు తగిన శాస్తి జరిగింది.

శరత్ 'కాలం' said...

పబ్బుల్లోకి వెళ్ళి తాగడం తప్పనుకుంటే సీతసేన పుట్టి మగవాళ్లను కూడా తన్నాలి.

అబ్రకదబ్ర said...

@మహేష్

ఈ శాతం పదేళ్ల క్రితం ఇందులో సగమే ఉంది. ఇప్పుడు పదికొచ్చింది. మరో పదేళ్లకి పాతికవుతుంది. ప్రస్తుతం తక్కువ శాతమే కాబట్టి తప్పైనా పట్టించుకోనక్కర్లేదని మీ ఉద్దేశమా?

ఇలాంటి విషయాల్లో తరచూ వినిపించే మాట: 'ఎవరి డబ్బుతో వాళ్లు, ఎవరింట్లో వాళ్లో నాలుగ్గోడల మధ్యో తాగితే తప్పేంటి' అని. వ్యభిచారమూ అలానే చేస్తారు - సొంత డబ్బుతో, నాలుగ్గోడల మధ్యా. దాన్ని తప్పుగా ఈసడించుకునే సమాజం తాగుడు వ్యసనాన్ని మాత్రం పట్టించుకోకుండా వ్యక్తుల ఇష్టాలకి వదిలేయాలనటం అర్ధరహితం. ఆధునికత పేరుతో అమెరికాని గుడ్డిగా అనుకరించే వాళ్లు, వాళ్లని వెనకేసుకొచ్చేవాళ్లూ మర్చిపోయే విషయం - అమెరికాలో తాగటం మీద ఉన్న ఆంక్షలు, వాటిని అత్యంత కఠినంగా అమలు చేసే పద్ధతి. పందొమ్మిదేళ్లలోపు తాగటం ఇక్కడ నిషిద్ధం. తాగి వాహనాలు నడిపేవారికి పడే శిక్షలు బహు కఠినం. మద్యపానం మానేయమని ఇక్కడ ప్రభుత్వమూ, పలు ప్రైవేటు సంస్థలూ సదా ప్రచారం చేస్తుంటాయి. ఆ విషయంలో కౌన్సిలింగ్ తరగతులు, ట్రీట్‌మెంట్ సెషన్లూ ఉచితంగా నిర్వహిస్తుంటాయి. మద్యపానం వల్ల కలిగే అనర్ధాలని ఇక్కడ ఇంతలా ప్రచారం చేస్తుంటే, మన దేశంలో అటువంటివి జరుగుతున్న దాఖలాలు శూన్యం. పాశ్చాత్యుల నుంచి మంచీ నేర్చుకోవచ్చు. అబ్బే, మనకంత తీరికెక్కడిది?

ఇక ఆడా-మగా సమానత్వం అనేది తప్పతాగటం, చెడు తిరుగుళ్లు తిరగటంలో కావాలనుకోటం దివాలాకోరుతనం.

పబ్బుల మీద దాడిని 'మంగుళూర్ హారర్' అంటూ గుండెలు బాదుకుంటూ ప్రసారం చేసిన మీడియా వెనుక ఆడాళ్లకూ తాగుడు అలవాటు చేసి జేబులు నింపుకోవాలనుకునే మద్యం లాబీ మంత్రాంగం ఉందని నా నమ్మకం. దేశంలో యాభై కోట్లున్న వీళ్ల జనాభాలో పది శాతాన్నైనా తాగేలా చెయ్యగలిగితే వాళ్లకి పండగే.

ఇక దాడి చేసిన వాళ్ల గురించి - వీళ్లు రాముడి పేరుతో పరాయి మతస్థుల మీద అరాచకాలకు తెగబడినప్పుడు గమ్మునున్న జనాలు (అందరూ కాదు, కానీ చాలామంది) ఇప్పుడు వీళ్లే సంస్కృతి పేరుతో పబ్‌ల మీద దాడులకి దిగుతుంటే గగ్గోలు పెట్టటం .. ఏమనాలి దీన్ని? భస్మాసుర హస్తం అనుకోవాలా?

బుసాని పృథ్వీరాజు వర్మ said...

ఆడవారి స్వేచ్చకు మితిమీరిన పరిణామమేనేమో ఇదంతా..నాగరికతను నేర్చినా మనిషి నాణ్యతను కోల్ఫోతున్నాడనడనానికి ఇదో తార్కాణం.

Anonymous said...

"ఆడా-మగా సమానత్వం అనేది తప్పతాగటం, చెడు తిరుగుళ్లు తిరగటంలో కావాలనుకోటం దివాలాకోరుతనం"

అబ్రకదబ్ర గారూ...హాట్సాఫ్!.

Marthanda said...

కొన్ని కోణాల నుంచి ఆలోచిస్తే మహేష్ గారు నిరాశావాదానికి పోయారని అనిపిస్తుంది. పరువుగల మనుషులమని చెప్పుకుంటూ డబ్బుల కోసం గడ్డి తినే వాళ్ళ గురించి కొన్ని రోజుల క్రితం నా బ్లాగ్ లో వ్రాసాను. మహేష్ గారు డబ్బులు ఖర్చుబెట్టి మరీ పరువు పోగుట్టుకునే బాపతు మనుషుల గురించి వ్రాసారు. మహేష్ గారు నిరాశావాది లాగ మాట్లాడడమే నాకు నచ్చలేదు.

rekha said...

cigarette మరియు booze విషయం లో పేద, ధనిక తేడాలు వుండవు నాకు తెలిసి. మా పనమ్మాయి చుట్ట తాగేది, మందు కొట్టేది.

satya said...

ఎవరికి సమస్యో, ఎవరికి కాదో మీరే తీర్పులిచ్చెస్తే ఎలా? ఒకసారి ఆ కుటుంబాల్లో తల్లి తంద్రులని అడిగితే తెలుస్తుంది. అలా అయితే రామసేన వాళ్ళు తాగిన వాళ్ళని కొడితే మనకేంటండి బాధ?

Shiek Peter Sastri said...

Martand meeru ee desam vidichi vellavalsina agatyam entaina kanipistondi.Meelanti goppppppppppa bhavaalugalvari avasaram pastyastya desalaku chala avasaram..Prastuatniki manaku avasaram ledu..Ktti garu pabbukelle swechha andariki vundi..kaani tappa tagi , vollu marachi , padimandito vollanta tadiminchukovadam adavallaku, vallani flirt cheyavalasina agatyam magavallaku ledani nenu anukuntunnanu.Meeru middle class gurinchi matladutunnaru..Aa high class mayalopadi jeevitalu naasanam chesukuntunna madhyataragati aadapillalu, magapillagurinchi kooda konchem alochiste banguntundani naa manavi

bala said...

Nowadays boys and girls are getting jobs in early ages also loosing virginity in the same early ages. Having a MNC job became a licence to have lustful pleasures. Boys and girls that who drink heavily and dance heavily think that they got freedom in closed nights clubs. It is fact that after industrialization the culture is based on corporate ideology than human values and morals. Indian rich people try to mimic westerns type of living, where the westerns lost their touch with love meaning of marriage and life. These people copy the westerns in uncontrolled sexy and drinking not in terms of punctuality and honest. Indian middle class try to mimic Indian rich people. In both the cases these people are weak in their hearts and livers.
The drinking and sex does not stop in pubs but it prepares them to crime. The government, cinema, the TV channels, media all are working in service of corporate. The corporate try to change normal people into its subjects and slaves. People never realize that they already lost their freedom and they try to search it in closed doors.

Marthanda said...

పీటర్ శాస్త్రిగారు, డబ్బున్న వాళ్ళ గురించి, హైయర్ మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మీకు పూర్తిగా తెలియదు. పెళ్ళికి ముందు కడుపు వస్తే సీక్రెట్ గా అబార్షన్ చెయ్యించుకోవచ్చు ఆని అనుకుంతారు. అబార్షన్ చేస్తున్నప్పుడు పొరపాటున అండాశయం ట్యూబ్ తెగిపోతే భవిష్యత్ లో ఆ స్త్రీకి పిల్లలు పుట్టరు. ఈ విషయం తెలియక భార్య-భర్తలు పిల్లలు పుట్టలేదని చెకప్ కి వెళ్ళారనుకుందాం. చెక్ చేసినప్పుడు భార్యకి పెళ్ళికి ముందు అబార్షన్ అయిన విషయం బయట పడుతుంది. ఎవరి మధ్య అయినా సీక్రెట్లు ఉండొచ్చు కానీ భార్య-భర్తల మధ్య సీక్రెట్లు ఉండకూడదు.