Saturday, May 24, 2008
నా కాలేజీ కథ -Part 6
Posted by Kathi Mahesh Kumar at 3:48 PM 19 comments
Labels: జీవితం
Friday, May 16, 2008
నా కాలేజీ కథ - Part 5
(కలహాలూ - కన్నీళ్ళూ అనే 6వ భాగం త్వరలో)
Posted by Kathi Mahesh Kumar at 8:40 AM 6 comments
Labels: జీవితం
నా కాలేజీ కథ - Part 4.2
"ఈవెనింగ్ వాక్ లో స్నేహాలూ, ప్రేమలూ"
స్నేహాలూ, ప్రేమల గురించి మనం ఏర్పరుచుకున్న గొప్ప అపోహలు తొలగే సరికీ, మనసు కాస్త నెమ్మదించినా,వయసుకి మాత్రం ఇవేవీ అంతగా నచ్చినట్టు గా కనిపించలేదు. అదే తరుణంలో ప్రభుదేవా నటించిన"కాదలన్" అనే సినిమా (తెలుగులో ప్రేమికుడు) రిలీజైంది. కొత్తగా పుడుతున్న పరిచయాలూ,స్నేహాలూ, "మనమంతా ఒకటి" అన్న కామ్రాడరీ ఇవ్వన్నీ కలిపి, మా క్లాసుమొత్తాన్నీ ఒక జట్టు గా ఈ సినిమా చూడ్డానికి బయల్దేరదీశాయి. టికెట్టు కోసం లైన్లో నిలుచుకుని ఇలా ప్రతి సినిమా కలసికట్టుగా చూడాలని నిర్ణయాలు తీసేశాం,ప్రమాణాలు చేసేశాం. నేనే కోరుకున్నానో, తనే ప్రయత్నించిందో తెలియదు కానీ, అంబిలి మాత్రం నా పక్కన సీట్లోకి చేరింది. ఇక సినిమా లో నగ్మా ఉన్న చోటంతా అంబిలి కనపడి, నన్ను నేను ప్రభుదేవా అనేసుకుని, మళ్ళీ ఏవేవో పిచ్చి కలలూ,ఊహలూ. "ఇల్లాగైతే మనం దేవదాసే కావాల్సొస్తుంద"ని మన ఆత్మారాముణ్ణి హాజరుపరచి, మనసులొనే చర్చ మొదలెట్టాం. మనకన్నా వీడు కాస్త లాజిక్కుల పుట్ట గనక, ఓ విరుగుడులేని తర్కం వెలగబెట్టాడు. "అసలు ఆంధ్రాలో ప్రేమించి ఉంటే ఏంచేసే వాడివి? ఆ అమ్మాయిని దూరం నుంచీ చూసే వాడివి, ముసిముసిగా నవ్వేవాడివి, ఆ అమ్మాయికీ నచ్చితే తనూ నవ్వేది. అప్పుడప్పుడూ విరిగిపోయిన పెన్ను గురించో, సినిమాలో చిరంజీవేసిన స్టెప్పు గురించో మాట్లాడి ఆనందించే వాడివి. మహా ఐతే చాటుగా ఎవరూ చూడని సినిమా కి వెళ్ళే వాడివి. అంతకుమించిన విషయాలు ఇంకేవీ జరిగేవీ కాదు, అయ్యేవీ కావు. మరి ఇవ్వన్ని, ఇంతకంటే ఎక్కువ బాహాటం గా స్నేహం పేరుతో స్వేచ్చగా జరుగుతుంటే, ప్రేమా, పిచ్చీ అవసరమా?" అని. ఇదేదో వినడానికి చాలా బాగుందనిపించి పిచ్చి ఆలోచనల్ని కట్టిపెట్టి, కేవలం ఆ అమ్మాయి తోడుని అనుభవించి, ఆనందించా.
ఇకపై మనసులో ఏ కల్మషాలూ లేనివాడనై, రెట్టించిన ఉత్సాహంతో అంబిలి తో నా ‘ఈవెనింగ్ వాక్’ ప్రస్థానాన్ని ముందుకు సాగించా. ఇలా రోజులు గడుస్తుండగా, మళ్ళీ ఒక సారి, నేను అంబిలి ని పిలిస్తే వసుమతి దయతలచింది. రావడం రావడం సీరియస్ గా మొఖం పెట్టుకుని, "నేన్నీతో అర్జంటుగా మాట్టాడాలి" అంది. దానికేం భాగ్యం "రేపు క్లాసులో మాట్లాడేసుకుందాం!" అన్నా. దీనికి తను "నో దిసీజ్ అర్జంట్ అండ్ దిసీజ్ అబౌట్ అంబిలి", అనగానే నేను కొంత కీడుని శంకించి తనతో మారు మాట్టాడకుండా బయల్దేరదీసా. తను నాతో చర్చించిన సారాంశం ఏమిటంటే, ఇలా "నేను ప్రతిరోజూ చేస్తున్న దండయాత్ర, అంబిలి పవిత్రమైన ఇమేజికోటని కూలుస్తోంది" అని. ఒక్క క్షణం నా చుట్టూ చూసా, దాదాపు యాభై అరవై జంటలు రోడ్డుమీద ‘వాక్’ చేస్తుంటే మరో ముప్పైదాకా స్టోన్ బెంచీలమీద స్నేహాన్నీ,ప్రేమనీ వెలగబెడుతున్నారు. "మరి వీరందరిలో లేనితప్పు నాలో ఏమిటా?" అనుకున్నా. ఇదేమాట తనతోనూ అన్నా. దీనికి నీకు తెలియదు "హాస్టలంతా మీగురించే చర్చలు" అంది. "మీ హాస్టల్ అమ్మాయిలందరికీ మరేం పనులు లేవా, మా గురించి మాత్రమే మాట్టాడు కోవడానికీ?" అని తీవ్రంగా ప్రశ్నించేసా. తమ చదువులూ, తమ జీవితాలూ, తమ బాయ్ ఫ్రెండ్సూ ఇలా ప్రతి పిల్లకీ కావలసినన్ని విషయాలు ఆలోచించుకొనేవి ఉంటే, వాటన్నింటిని గాలికొదిలి మాజీవితాల్ని ఉద్దరించడాని కి వీళ్ళ హాస్టలమ్మాయిలందరూ కంకణం కట్టుకోవడం, నా చిన్న ఆలోచనలున్న మెట్ట బుర్రకైతే ఒక పట్టాన అర్థంకాలేదు. ఈ విషయాన్నే తనతో చెప్పి చెప్పిచూశా. ఎంతకీ వినదే! ఇలాక్కాదని వెళ్ళిఅంబిలిని పిలవమని గదమాయించా. నాతో వాదించే ఓపిక నశించింది కాబోలు, వెళ్ళి అంబిలిని పిల్చుకు వచ్చింది.
రావడం రావడం అంబిలి, నాతో చక్కా వాక్ కు బయల్దేరింది. అసలే ఆవేశం లో ఉన్న నేను అక్కడే నిలబడి అడిగెయ్యలనుకున్నా, కావాల్సింది దొరికిన మారాం చేసే పిల్లాడికిమల్లే శాంతించి తన వెంట బయల్దేరా. కొంటసేపు మాటల్లేకుండా నడిచిన తరువాత నేనే ఉండ బట్టలేక, "వై ఈజ్ వసుమతి టాకింగ్ లైక్ దిస్?" అన్నా, దీనికి తను "డుయు రియల్లీ వాంట్ టు డిస్కస్ దిస్?" అంది. ఒక్క సారి ఖంగుతిన్నా, ఈ రోజు ఈ విషయమేమిటో తేల్చేద్దామని. "వైనాట్" అన్నా. సరే ఐతే విషయం చెబుతాను విను అని, వసుమతి ఎవరో సీనియర్లు మా గురించి మాట్లాడుకుంటుంటే విన్నదనీ, తనకు బాధకలిగి ఈ విషయం తనతో కూడా చెప్పిందని, నాతోకూడా చెప్పి నా తప్పుని తెలియజెప్పే బాధ్యత తీసుకుని ఇలా వచ్చి మాట్టాడిందని, చెప్పుకొచ్చింది. "ఐతే దీనికి నువ్వేమంటావ్" అన్నాఒక వంతు అనుమానంతో, ఆ అమ్మాయి నన్ను ఒక్క క్షణం చూసి, "నేను ఏమైనా అనేదానినైతే ఖచ్చితం అనేదానిని, అనడానికి ఏమీ లేదు గనకనే నీతో వాకింగ్ కి వచ్చా" నంది. తన భావాల్నీ, ఆలొచనా సరళినీ, తన ‘డొంట్ కేర్’ విధానానీ ఈ ఒక్క వాక్యం లో తను చెప్పిన తీరుచూసి, జీవతం లో ఒక అమూల్యమైన పాఠం నేర్చుకున్నట్టుగా అనిపించింది. దీనితో పాటూ వసుమతి ప్రవర్తించిన తీరు వలన మనుషుల్లో కొందరు ఇలా ఎందుకు ప్రవర్తిస్తారో తెలిసినట్టైంది. వసుమతి లాంటివారు మన సమాజంలో కొందరు అందరికీ సుపరిచితులే. వీరు సమాజపు విలువలని భుజాలకెత్తుకుని మోస్తూఉంటారు, ఎవరైనా వారి విలువలని కాదని దారి తప్పినట్టనిపిస్తే, సమాజమనే బూచిని చూపించి, దేవదూతల్లాగా రక్షించే ప్రయత్నం చేస్తారు. వీరికి అదో వృత్తి, సమాజం లోని విలువలకు అనవసరంగా ప్రాతినిధ్యం వహించి, యువతను కాపాడేస్తూ ఉంటారు. వీరి అవసరం ఎవరికీలేదని వీరెప్పటికీ గ్రహించరు.
ఇలా నా ప్రేమకాని ప్రేమ, స్నేహం గా మారి కాలేజీ ఈవెనింగ్ వాక్ లలో తడిసి ముద్దైంది. తరువాతి రోజుల్లో కొన్ని మనస్పర్థలు కలిగినా, ఈ ఒక్క క్షణం లో తనపై కలిగిన అపారమైన గౌరవం ముందు, అవన్నీ బలాదూర్. ఇలా అంబిలితో నా మొదటి సంవత్సరపు ఆకర్షణ, ప్రేమా స్నేహం గా మారి, నన్ను మనిషిగా కొన్ని మెట్లెక్కించిందని మాత్రం ఖచ్చితంగా చెప్పలేనుగానీ. అమ్మాయి దూరం గా చూసి నవ్వితేనే ప్రేమ అనుకునే మూర్ఖత్వం నుంచీ, తాకితేనే స్వర్గం అనుకునే చపలత్వం నుంచీ మాత్రం కొంత ఎదిగానని చెప్పొచ్చు. ఇలా నా ‘ఈవెనింగ్ వాక్’ ల కల గుర్తుంఛుకునే స్నేహం గా మారినా, "‘స్టోన్ బెంచిల’ కోరిక అలాగే మిగిలిపోయింద"నుకొంటూ, కాలేజి జీవితాన్ని అనుభవింఛసాగాను.
(కాలేజిలో భారతీయ సినిమాతో నా పరిచయం "సినిమా తందనాలు" అనే తరువాయి భాగం లో)
Posted by Kathi Mahesh Kumar at 6:29 AM 7 comments
Labels: జీవితం
Thursday, May 15, 2008
నా కాలేజీ కథ - Part 4.1
Posted by Kathi Mahesh Kumar at 8:16 PM 9 comments
Labels: జీవితం
Wednesday, May 14, 2008
నా కాలేజీ కథ- Part 3
హాస్టలు నుండీ కాలేజి భవనం దాదాపు ఒక కిలోమీటరుంటుంది. 150 ఎకరాల క్యాంపస్ ఇది. ‘మైసూర్ యూనివర్సిటీ - మానసగంగోత్రి’ కి ఆనుకునే, మా రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇప్పుడు అదికాస్తా రీజనల్ ఇంస్టిట్యూట్ అయ్యిందిలెండి. అక్కడికి వచ్చిన వెంఠనే మనకు నచ్చిన పేరు, ‘మానస గంగోత్రి’. ఎవడు పెట్టాడొ గానీ "యమహో!" అనుకున్నా. అసలా ఆలోచనను చూడండిక్కడ, ‘గంగోత్రి’ అనేది గంగానది జన్మస్థానం అంటే ఈ యూనివర్సిటీ ‘మానసగంగ’ ఉద్భవించే చోటట. చదువు యొక్క సార్థకత తెలిసినోడు ఈ పేరుపెట్టి ఉంటాడనుకున్నా. ఇక కాలేజ్ క్యాంపస్ అంటారా! సూపరో, సూపరు. ఓ చుట్టు తిరగాలంటే కనీసం గంటైనా పడుతుంది. ఇక ఎక్కడ చూసినా చెట్లు,గడ్డి మధ్యలో ఒక పేద్ద ఫుడ్బాల్ /క్రికెట్ గ్రౌండు. దాని చుట్టూ ‘స్టొన్ బెంచస్’ (వీటి మహత్యాన్ని తరువాత చెప్పుకుందాం) అనబడే సిమెంటు దిమ్మెలు. కాలేజిలో జాయినైంది జూలై లో అవటం మూలంగా అప్పుడే పడుతున్న వర్షాలు, పకృతికి అద్దుతున్న రంగులకి అదొక భూతల స్వర్గలా అనిపించింది.
మా జూనియర్ల లైను కాలేజి బిల్డింగ్ చేరగానే సింబాలిక్ గా రెండు పాయలుగా చీలిన నదల్లే విడిపోయాయి. ఒకటి బిఏ ఎడ్ మరోటి బిఎస్సీ ఎడ్. అప్పుడు గమనించా మా బిఏ ఎడ్ లైన్లో ఉన్న అబ్బయిల సంఖ్య కేవలం 8 మాత్రమే. వారిలొ బాషా(ఫ్రమ్ కడప), రమేష్ లతో అల్ల్రెడి పరిచయం ఉందిగాబట్టి మిగతా కొత్త ముఖాలను కాస్త తీక్షణంగా గమనించడం జరిగింది. ఆ కొత్తముఖా లలో ఒక వింత ముహం కూడా ఉంది. కళ్ళు కొంచెం చిన్నగా ముక్కుకొంచం లోతుగా ఆచ్చు చైనా వాళ్ళకి మల్లే. "ఏ అస్సమో,మిజోరాం బాపతో" అనుకున్నా. కానీ తరువాత తెలిసింది తన పేరు ‘నంగ్యాల్’ అని, తను ఒక టిబెట్ కాందిశీకుడని. మైసూర్ దగ్గరి బెళకుప్పె అనే స్థలంలో ఒక పెద్ద టిబెటన్ కాలనీ ఉందట అక్కడినుండి ప్రతి సంవత్సరం ఇద్దరు ముగ్గురు ఈ కాలేజీలో చదవటానికి వస్తారట. ఇలా లైనుగా ఒకరినొకరు డౌటుగా చూసుకొంటూ సీనియర్లు చెప్పిన ఈ అవమానకర వేషధారణ తో క్లాసు కి చేరాం.
క్లాసులో అడుగు పెట్టగానే నా గుండె ఒక్క సారిగా ఆగినట్టంది. మ్యాచింగ్ లేని చుడీదార్లతో, నూనె కారే ముఖాలతో, హవాయి చెప్పులతో అంతకన్నా మించి, రెండు జడలకీ ఎద్దుకొమ్ముకు రంగేసినట్టు, ఎర్ర రిబ్బన్లు కట్టుకుని 13 మంది అమ్మాయిలు, మా క్లాసును ఆక్రమించుకుని కనపడ్డారు. ఇది అమ్మయిల ర్యాగింగు లో భాగంగా అర్థమయ్యింది. వీళ్ళకన్నా మనమే బెటరనుకుని కాస్త ఊరట కలిగింది. క్లాసు ఒక వేపున్న బెంచీలను పూర్తిగా ఈ ఆడ మళాయాళం ఆక్రమింఛుకొని ఉండగా, మిగిలిన సగాన్ని మాకే అంటూ ఆక్రమించేశాం.
క్లాసు సమయం అయ్యేసరికీ తలుపు బార్లా తెరుచుకుని కాంతిపుంజంలా ప్రకాశిస్తూ, "రఘునాథ్...ప్రొఫెసర్ రఘునాథ్" ప్రవేశించాడు. వచ్చీరాగానే, "డియర్ యంగ్ ఫ్రెండ్స్, ఎస్టర్ డే వుయ్ హాడ్ ఎన్ ఇంట్రడక్షన్ టుద సెమెస్టెర్, నౌ వుయ్ షల్ హావ్ ఇంట్రడక్షన్ టు అవర్ ఓన్ సెల్ఫ్స్" అని క్లాసంతా కలియదిరిగి చూశాడు. ఏదో నచ్చలేదన్నట్టు మొహం మాడ్చి, ఇలా అమ్మయిలూ, అబ్బాయిలూ వేరువేరు లైన్లలో కూర్చోవడం ఈ ఇంగ్లీషు డిపార్టుమెంటు ధర్మానికి విరుధ్ధమనీ, కలిసి కూర్చోవాలనీ తెలియజెప్పాడు. "హవ్వ! వీడి అసాధ్యంగూలా! వీడు చదువు జెప్పటానికొచ్చాడా? మా పాతివ్రత్యం ‘పబ్లిగ్గా’ చెడగొట్టడానికి వచ్చాడా?" అని మనసులో అనేసుకుని, నా సీట్లోంచి మాత్రం నేను కదలలేదు. ఈ విషయం వినగానే క్లాసులో కలకలం మొదలై,రాజకీయ నాయకుల తీరున సీట్ల మార్పిడి జరిగిపోయాయి. ఈ హడావిడి ముగిసేసరికీ నేను అటో అమ్మాయీ,ఇటో అమ్మాయీ మధ్య మా పెద్ద తిరపతి ఎంకన్న లెవెల్లో తేలా. "వీడి ధర్మమేదో, మన మానాల మీదకి తెచ్చింది" అని గర్హించా, తప్పనిసరి పరిస్థితుల్లో సర్దుకుపోయా. అప్పుడనిపించింది, "ఎంచక్కా మన ఆంధ్రాలో ఐతే, అమ్మాయిల్ని దూరం నుంచీ చూసి ఆనందింఛవచ్చు, ఈలలేసి గోలపెట్టొచ్చు, కామెంట్లు చేసి ఆస్వాదించవచ్చు. ఎంత మర్యాదగా ఉంటుంది! ఇక్కడ చూడండి దౌర్భాగ్యం, పక్కన కూర్చుని స్నేహం చెయాలట, చీ! చీ!! ఇదేం ధర్మం" అనేసుకుని ఊరుకున్నా.
ఇక పరిచయ కార్యక్రమాలు మొదలయ్యాయి. మొదటగా ‘రేఖ’ అనే అమ్మాయి లేచి ‘అచ్చతేట’ ఇంగ్లీషులో, తను బెంగుళూరు పిల్లనని, ఆంగ్ల సాహిత్యమంటె తను చెవీ,ముక్కూ,నోరూ ఇంకా ఏవేవో కోసేసుకుంతుందని, ఉపోద్ఘాతం దంచేసి, తనకి వచ్చిన,నచ్చిన కవులూ రచయితల పేర్లు దీర్ఘంగా ఏకరువు పెట్టేసింది. ఆంగ్లమేంఖర్మ, సరిగా తెలుగు కవుల గురించి కూడా తెలియని నాకు, పరిచయం బహుశా ఇలా వెలగబెట్టాలని తెలిసే సరికీ గుండెలవిసిపోయాయి. నా చేతులు అదిరి, నుదుటిమీద చెమట బిందువులు సరదాగా ప్రత్యక్షమయ్యాయి. సాంతం ‘రేఖ’ పరిచయాన్ని ఆలకించిన మా జేమ్స్ బాండ్ (అదే నండీ! మా ప్రొఫెసర్) ఇలాక్కాదు, కేవలం మీపేరు,వచ్చిన ఉరు, ఇక్కడ చేరేముందు చదివిన చదువు చెబితే చాలన్నాడు. "హమ్మయ్య, బతుకుజీవుడా!" అనుకుంటూ నావంతు కోసం, చెప్పల్సినవి మననం చేసుకుంటూ వేచిచూశా. హరీశ్, రమేష్, బాషా(మళ్ళీ ‘ఫ్రమ్ కడప’ తో సహా), నిషా , అయిషా, షరీన్, మాచమ్మ.... జ్యోతి....ఉమ...ఇలా అందరి పరిచయాలూ అవుతూ, నా వంతు వచ్చింది. నేను అదరాబదరా లేచి గొంతు విప్పి చెప్పేసా. నేను చెప్పింది నాకైతే వినపడలేదిగానీ, అందరూ ఆలకించినట్టుగా తలలూపి ఆమోదాన్ని తెలిపినట్టనిపించింది.
ఈ తంతు ముగిసేసరికి నా ఇరుపక్కలున్న అమ్మాయిల పేర్లు నాకు తెలిసిపోయాయ్. ఎడమవైపున ‘అంబిలీ ఉన్నికృష్ణన్’ చెన్నై పక్కన ఏదో ఊరట, కుడిపక్క ‘ఆయిషా’ కేరళ నుండీ దిగుమతైనదట. "‘అంబిలి’ పేరవడమేంటి మన అంబలి కూడులా?" అనుకుంటూ, తన వంక క్రీగంట చూసేసరికీ గుర్తొచ్చేసింది. నిన్నటి క్లాసులొ "అవును కదా" అన్నట్టూ పదిసార్లు చూసి, నా పాతివ్రత్యాన్ని శంకించిన కన్యకామణి ఈవిడే. ఈ నూనెకారే జిడ్డు మొహంతో కూడా బాగానే ఉన్నట్టనిపించింది. కానీ, "పేరుమాత్రం అంబలి, గంజీ అంటూ హేమిటో" అని రుద్రవీణ సినిమా లో శోభన తనపేరు ‘పెంటమ్మ’ అనిచెబితే, మధనపడ్డ చిరంజీవికి మల్లే చింతించా. ఇక ‘ఆయిషా’ పేరు మన మతానిది కాదు కాబట్టి "తురకమేమో ?" అనుకున్నా, వేషధారణ మరీ వారికి తగ్గ ఘాటీ గా లేకపోవడం తో కొంత ఆలోచింఛాల్సి వచ్చింది. కానీ, వెరైటీగా నెత్తిన జుట్టు కనపడకుండా, మనూర్లో పచ్చి బాలింతలు కట్టుకున్నట్టు ఓ నల్లటి గుడ్డ చూసి ఇదోరకం తురకమనుకుని సరిపెట్టుకున్నా. ఇలా ఈ స్వగతం నుంచీ బయటకువచ్చి, జేమ్స్ బాండ్ చెప్పే విషయం వైపు ధ్యాస మరల్చా.
"లుక్ మైడియర్ యంగ్ ఫ్రెండ్స్" అంటూ తను మొదలెట్టెసరికీ, నాకు కాస్త చిరాకేసింది. "ఫ్రెండ్స్" అంటాడేమిటి? స్టూడెంట్స్ ని పట్టుకొని" అని. "సరేలే ఇదికూడా డిపార్టుమెంటు దర్మాలలో ఒకటైఉంటుందని" తలచి, "సర్దుకుందాం" అనుకుంటుండగానే, ఇంకో బాంబు నా నెత్తిన వేశాడు. ఈ జేమ్స్ బాడ్ పేరు ‘ప్రొఫెసర్ రఘునాధ్’ కాబట్టి మేము ఈతగాడిని "ప్రొఫెసర్" లేక "మిస్టర్ రఘునాథ్" అని పిలవొచ్చట. "సార్" అని పిలిచి మాటిమాటికీ ఇబ్బంది పెట్టొద్దని దీని సారము. ఎంత ఆరాచకం చూడండీ! "గురువుని పేరు పెట్టి పిలుస్తారా ఎవరైనా? మా రాజ్యం లో నైతే, ఏమారు పేరో, అదీ చాటుగా పెట్టుకుని అగౌరవపరుచుకుంటామే గానీ ఇలా బరితెగించడం జరగదు" అని చింతించా. ఏదిఏమైనా ఈఅ న్యాయాల్ని కనీసం ఒక సంవత్సరమైనా భరించక తప్పని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి క్షమించి ఊరుకున్నానుగానీ, లేకపోతే ఈ పాటికి వీరంగం చేసి, మన తెలుగు విలువలని కాపాడే వాడినే!
క్లాసులో కుదురుగా నులుచోక అటూఇటూ కలియదిరుగుతూ మా జేమ్స్ బాండ్ మామీద ఓ ప్రశ్న సందించాడు. "హౌమెనీ ఆఫ్ యూ థింక్ ఇంగ్లీష్ ఈజ్ ఎ ‘గ్రేట్’ లాంగ్వేజ్?" అని ‘గ్రేట్’ అని పదాన్ని నొక్కి మరీ పలికాడు. మనదగ్గర దీనికి భేషైన సమాధానముందని తలచి ఠకాలున అలవాటు ప్రకారం చెయ్యెత్తేశాం. అంతలో క్లాసుగది తలుపులు భళ్ళున తెరుచుకుని జీన్స్ ప్యాంట్ లో ఒక దేవత ప్రత్యక్షమై "ఎస్ క్యూజ్ మీ" అంది. "అయితే నన్నురక్షించడానికి వచ్చిన దేవత కాదన్నమాట" అని ఎత్తినచెయ్యి దించకుండా అనుకున్నా. ఇంతలో మా ప్రొఫెసర్ "ఓ ‘గౌరి’ కమాన్, యువార్ లేట్ ఫర్ ద వెరీ ఫస్ట్ క్లాస్" అని బాగా తెలిసినవాడల్లే కూర్చో మన్నట్టు డెస్కుకేసి చూపాడు. ఆ జీన్స్ దేవత తఠాలున నా ఎదురుగా ఉన్న డెస్క్ లో కూచుని తన జడని వెనక్కి విసిరేసరికీ, అదికాస్తా మన ముఖాన్ని ముద్దెట్టుకుని ఇబ్బందిపెట్టింది. "సారి" అంటూ తను వెక్కితిరిగి అంటే, "ఫరవాలేదని" అభయహస్తం చూఫుతూ మనం తెలుగులోనే అనేశాం. దానికి అర్థం కానట్టూ చూస్తూ, ఓ చిరునవ్వు విసిరింది. అ ప్పుడుగానీ, సమాధానాం చెప్పడానికి ఎత్తిన ఓ చేయి నింగిని చూఫిస్తూ, మరోటి అభయహస్తమిస్తూ ఉన్న మన విశ్వరూపం గుర్తుకురాలేదు. "అవమానంగా ఫీలవుదామా?" అని చుట్టూచూస్తే, క్లాసులో సగం చేతులు ఆల్రెడీ చూరుని చూపిస్తున్నాయి. అయితే మన గౌరవానికొచ్చిన ఢోకా ఏమీ లేదని తలిచి సమాధానం ఇవ్వటానికి తయారుగా కూర్చున్నా.
ఇక మా ప్రొఫెసర్ అడిగిన ప్రశ్నపై చర్చ జరిగింది. క్లాసులో ఇద్దరు (రేఖ, గౌరి) మినహా అందరం అంగ్లభాష చాలా గొప్పదని, అది ప్రపంచ భాష అని, మనదేశం లో కూడా పైచదువులు చదవాలన్నా, ఉద్యోఅవకాశాలు రావాలన్నా ఈ భాష అవసరమని చిత్తగించారు. మనవంతుగా, ఇంగ్లీషు మాట్లాడే తల్లిదండ్రులకు మాస్కూలులో జరిగే గౌరవాన్ని గుర్తుచేసుకుని, "ఇంగ్లీషు మాట్లాడితే గౌరవిస్తారు" అని నాకు వచ్చిన ఇంగ్లీషులో "స్పీకింగ్ ఇంగ్లీష్ గెట్స్ రెస్పెక్ట్" అనే విలువైన అభిప్రాయాన్ని చెప్పేసా. నా అభిప్రాయాన్ని విని కొందరు సాలోచనగా తలవంకిస్తే , మరికొందరు అంగీకార సూచకంగా తల ఆడించారు. మా జేమ్స్ బాడ్ మాత్రం సన్నగా నవ్వుతూ "చిక్కావులే చేతిలో" అన్నట్టు చూపువిసిరాడు. ఎమైతేనేం క్లాసులో దాదాపు అందరూ ఆంగ్లమొక గొప్ప భాష అనే అంగీకారానికి వచ్చి నిర్ణయింఛేశాం.
ఈ నిర్ణయం విన్న తరువాత, "ఇప్పుడు మీవంతు" అని రేఖ, గౌరీల్ని అడిగాడు మా ప్రొఫెసర్. వాళ్ళిద్దరూ కూడబలుక్కున్నట్టు, "ఇంగ్లీష్ ఈజ్ ఎన్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్, నాట్ ఏ గ్రేట్ లాంగ్వేజ్" అన్నారు. ఇది విని నా మనసులో నేను, "దొరికారు దొంగలు, ప్రాముఖ్యానికీ,గొప్పతనానికీ అవినాభావ సంబంధం ఉందని వీళ్ళకి తెలిసినట్టు లేదని" చాటుగా చంకలు గుద్దుకున్నా. కానీ విచిత్రంగా మా జేమ్స్ బాండ్ మాత్రం "శెహబాష్ !" అన్నట్టు వారి మొహాల్ని చూసి, మమ్మల్నందరినీ వెదవసన్నాసుల కింద జమకట్టేసాడు. దీనికి కొనసాగింపుగా తను ‘ఆంగ్లేయులు మన దేశాన్ని200 సంవత్సరాలు పాలించడమనే "చారిత్రాత్మక తప్పిదం" (Historical blunder) వలన మనం ఇంగ్లీషు లో మాట్లాడి దానికి గొప్పతనం ఆపాదిస్తున్నామేగానీ, ఒక వేళ ఏ ఫ్రెంఛివాళ్ళొ, డఛ్చి వారో ఆక్రమింఛుకొనివుంటే మనం ఆ భాషని గొప్పగా భావించేవాళ్ళమని తన పాండిత్యాన్ని ప్రదర్శించాడు. ఈ ప్రకారం గా తను చెప్పొచ్చేదేమిటంటే, మన తెలుగు,కన్నడ,తమిళ, మళయాళ భాషలు కూడా ఆంగ్లం తో సమానమైన భాషలని,కేవలం ఉపయోగరీత్యా ఆంగ్లానికి ప్రపంచస్థాయిలో ఉపయోగించదగ్గ అవకాశం ఉండటం వలన దాన్ని ముఖ్యమైన భాష గా భావించడం లో తప్పులేదుగానీ గొప్పతనం ఆపాదించటం మాత్రం ఎంతమాత్రం తగదని గితవు పలికాడు. ఒక తెలుగువాడి గా ఆంగ్లం మనతోటి సమానమన్న ఇతడి మాటలకి సంతోషించినా, పూర్తి పాఠం మనకి అంతగా రుచించలేదనే చెప్పాలి. "అంగ్లం గొప్ప కాకపోవటమేమిటి? వీడి బొంద కాకపోతేనూ!" పైగా ఇంగ్లీషు భాషా ప్రొఫెసరైయ్యుండీ ఇలా దాని గొప్పనే శంకిస్తున్న ఈతడిని, "ఇంత స్థాయికి ఎలా ఎదగనిచ్చారా?" అన్న అనుమానం కూడా నా తెలివైన బుర్రలో వచ్చింది. ఆఖరుకు ఈ సెమిస్టరులో అంగ్ల సాహిత్యంతో పరిచయానికి సన్నిద్ధులుగా ఉండమని చెప్పి, అసలు క్లాసులు సోమవారం నుండి ప్రారంభమవుతాయనీ, ఇక మేము ఈ రోజుకు విశ్రమించవచ్చని చెప్పి తను నిష్క్రమించాడు.
హాస్టలుకు వెడితే సీనియర్ల బెడద తప్పదు గనక క్లాసులో జిడ్డోడుతున్న ఒకరి ముఖారవిందాలు ఒకరం చూసుకుంటూ కూలబడ్డాం. ఒక్క క్షణం క్లాసులో నిశ్శబ్దమే తాండవించింది. ఇంతలో ‘గౌరి’ లేచి "వై డొంట్ వుయ్ హావ్ ఎన్ ఇన్ ఫార్మల్ ఇన్ట్రడక్షన్" అన్నది. దానికి ‘రేఖ’ "యా యా స్యూర్" అంటె మిగతా వారం మాత్రం గంగిరెద్దుల్లా తలఊపాం. తరువాత కొంచం సాధారణ స్థాయి న్సేహపూరిత పరిచయాలు అందరూ చెప్పటం మొదలెట్టారు. అబ్బాయిలలొ శ్రీనివాన్ అనే అతను ఇంగ్లీషులో కొంచం తడబడితే, ‘రేఖ’ తనని (పురుగులా) చూసిన చూపు నాకింకా గుర్తు. అదే తడబాటుకు ‘గౌరి’ మాత్రం, "డోంట్ వర్రీ యు కెన్ స్పీక్ ఇన్ హిందీ ఇఫ్ యు వాంట్, ఆర్ స్పీక్ ఇన్ యువర్ మదర్ టంగ్. వుయ్ విల్ ట్రైటు అండర్శ్టాడ్" అన్నది. ఈ ముక్కతో ఈ జీన్సుదేవతపైన నాకు విపరీతమైన గౌరవం వచ్చేసింది. ఇక వంతువంతుగా దాదాపు అందరూ ‘స్టార్ ప్లస్’ వారి హిందీ చానల్ లా హిందీ లో తమ పరిచయాలు దబాయించేశారు. అప్పుడర్థమైంది మనకి, ఏ కొంతమంది సిటీ పిల్లలు మినహా మిగతావారు నాబోటి ఊరోళ్ళేనని. ఈ జ్ఞానోదయంతో వచ్చిన ఉత్సాహంతో మనం రెచ్చిపోయాం. పరిచయాల లోనే ‘అంబిలి’ తన గురించిచెబుతుంటే ఉండబట్టలేక," తన పేరుకి "అర్థమేనిటని?" అడిగేశా. దానికి ఆ పిల్ల కొంచం సిగ్గుపడి నా వంక విచిత్రంగా చూసి, ఇది ఒక మళయాళ పదమని దానర్థం "వెన్నెల" అని చెప్పింది. ఈ మాట వినగానే నా మదిలో కోటి వెన్నెలలు కురిసిన ఫీలింగ్. హమ్మయ్య ఇంత అందానికి అంబలి లాగా, అంబిలి పేరేమిటని మధన పడిన నా మనసు కుదుట పడింది. ఇక అబ్బాయిలలో విచిత్రంగా ఉన్నాడు కాబట్టి టిబెటన్ కుర్రాడు ‘నంగ్యాల్’ నచ్చితే, మరో బెంగుళురు కుర్రాడు ‘హరీశ్’ నవోదయ విద్యాలయం నుంచీ వచ్చాడు (మనమూ ఆబాపతే) కాబట్టి నచ్చాడు. ఇక ముఖ్యంగా అమ్మాయిలలొ‘ మాల’ అనే కూర్గి (కర్నాటకలో కూర్గ్ అనె ప్రాంతం వారు) అమ్మాయి తో పాటూ, తెలుగమ్మాయి ‘హరిత’ కూడా నచ్చింది. ఇలా స్నేహం చెయ్యదగ్గవాళ్ళూ, ప్రేమించదగ్గవాళ్ళు అంటూ ఓ పేర్ల లిస్టుని మనసులో ఫైనల్ చేసి ఆరోజు కానిచ్చి, హాస్టలుకు బయల్దేరాం...అదీ లైన్లో.
("ఈవెనింగ్ వాక్ లు , స్నేహాలూ, ప్రేమలు" అన్న చతుర్థ (4) భాగం త్వరలో)
Posted by Kathi Mahesh Kumar at 4:59 PM 13 comments
Labels: జీవితం
Tuesday, May 13, 2008
నా కాలేజీ కథ - Part 2
ఈ కాస్త అడ్వెంచరూ మనమే వెలగబెడదామని బయలుదేరా! క్యాంపస్ లోనే తిరిగితే సీనియర్ల ఆగ్రహానికి గురికావలసి వస్తుందన్న భయంతో, తిన్నగా కాలేజి గేటుదాటి బయట ప్రపంచం వైపు ఉత్సాహంగా అడుగులేసాను. సిటీ బస్సు దిగిన చోటు, అక్కడినుండీ కాలేజికి వచ్చిన రూటూ తప్ప అన్యమెరుగని మనకి, ఆదారే మళ్ళీ ‘వెలసిన పూదారై’ స్వాగతించింది. బస్టాపుకు చేరగానే నాకంట ‘నందిని హాలు’ అన్న బోర్డు కనపడింది. "ఈ హాలేమిటని?" నన్నునేను ప్రశ్నించుకునేలోపే నాకోసమే గీసినట్టు, పాల సీసా ఓ వైపు,పాల ప్యాకెట్టు ఒకవైపు కనపడ్డాయి. అచ్చుతప్పై ‘పాలు’, ‘హాలై’ నాయేమో అని సందేహం వచ్చిందిగానీ, తరువాత్తరువాత "కన్నడం లో ఇంతే" అని తెలిసింది. అంటే మన ‘ప’ కారాన్ని వీరు ‘హ’ కారంగా మార్చి, మాదీ ఒక ప్రత్యెకభాష అని తెలియజెప్పుతారన్నమాట. ఇక ఊరి పేర్లు రాయడంలో కూడా వీరివన్నీ అతిశయోక్తులూ,ఆశ్చర్యార్థకాలే. ‘బెంగుళూరు’ ను ‘బెంగుళూరో’ (!?!) అని పెద్ద అనుమానమొచ్చేలా రాశేస్తారు. ఇలా చేసి తమ ప్రత్యెకతని చాటడంతో పాటూ, తెలుగు వారిని గందరగోళానికి గురిచేస్తున్నారని నా ఆరోపణ.
దుకాణం పెట్టి, బోర్డు కట్టి, మనలాంటి గొప్ప కస్టమర్ ల కోసం ఎదురుచూస్తున్నవాడల్లే అనిపించి, వాడిమీద దయతల్చటానికి నిశ్చయించా. దుకాణం చేరగానే ‘స్పెషల్ బాదామీ హాలు దొరయుత్తదే’ అని మరో చిరుబోర్డు దర్శనమిచ్చింది. సర్లేవీడి ఆనందాన్ని మనమెందుకు కాదనాలని, బోర్డు చూపించి వంద కాగితాన్ని రెపరెపలాడించా. వంద చూడాగానే నా స్తోమత చూసి సంతోషిస్తాడనుకుంటే, వాడుకాస్తా "చిల్లర బేకు" అని చిల్లర అరుపులు అరిచాడు. భాష మనకు అర్థమవకపోయినా భావం మమూలుగా మన దుకాణాలదగ్గరా ఎడ్చేదే గనక, తల ఊపి పదిరూపాయల నోటు సమర్పించుకున్నా. వేడివేడిగా వాడు కంటైనర్ లోంచి బాదంపాలు గ్లాసులో పోసిస్తే, దాన్ని ఆస్వాదిస్తూ, " ఈరోజు బాదంవల్ల వచ్చేశక్తి మనకు ర్యాగింగ్ ని తట్టుకోవడానికి కావాల"నుకుని నాకునేనే ఆలోచన చేసినందుకు "శభాష్" చెప్పేసుకుని, వాడిచ్చిన చిల్లర జేబులో వేసుకుని మళ్ళీ రోడ్డెక్కా. ఆపాటికే చీకటి పడుతోంది. "ఈ చీకట్లో ఎ పురుగూ పుట్రో లేక ర్యాగింగ్ పిచ్చిఉన్న సీనియర్కో దొరికితే ఇంకేమైనా ఉందా!" అనుకుంటూ హాస్టల్ దారి పట్టాను.
హాస్టలు గేటు వరకూ నాతోనే ఉన్న అదృష్టదేవత, తనూ పాలు తాగోస్తానని వెళ్ళిపోయిందేమో, ఎదురుగా ప్రత్యక్షమయ్యాడో మళయాళీ సీనియరు. "వేర్ డిడ్ యు గో మ్యాన్" అని నాకేసి గుడ్లుమిటకరించి చూసేసరికి, బిక్కచచ్చి సగమైపోయా. "జస్ట్ వాకింగ్ సార్" అని వినమ్రతతో భుజాలు ఒదగదీసి మరీ గౌరవంగా వంగి చెప్పేశా. ఈ నా వినయశీలతకు ముచ్చటపడక ఈ రాక్షసుడు,పెద్ద నోరేస్కుని "హేయ్! లుక్ అట్ దిస్ బగ్గర్ మాన్, నాట్ ఈవెన్ ఎ డేఓల్డ్, అండ్ హీఈజ్ గోయింగ్ ఫర్ ‘ఈవెనింగ్ వాక్’ మచ్చీ!!" అని ‘ఈవెనింగ్ వాక్’ ను ఒత్తిపలుకుతూ టముకేసేసాడు. ఈ దెబ్బతో చుట్టు పక్కలున్న సీనియర్లేకాక, తమతమ రూముల్లో పనిలోఉన్నవారుకూడా పనిగట్టుకుని నా పనిబట్టడానికి హాజరైపోయారు. నేనుచేసిన పాపమేమిటో తెలియక, ఇంత కోపాన్నెలా కలిగింఛానో అర్థంకాక వారి తీక్షణమైన చూపులకు అప్పటికే పదో సారో,వందో సారో భస్మమై బ్రతికాను. భస్మమైనా,ఆబూడిదని కూడా కాఫీలో కలుపుకొని తాగేసి నన్ను శిక్షిస్తామన్నట్టు అందరికళ్ళూ సాక్ష్యం పలుకుతున్నాయ్. ఇంతలో వార్డన్ వస్తున్నాడని కబురై, "అభీ చోడ్ దోరే, రాత్కో దేఖేంగే ఇస్ కో" అని హిందీ లో ఒక అంగీకారాని వచ్చినవారై అక్కడినుండీ కదిలారు.
రూంకి ఎలా వచ్చిపడ్డానో నాకే తెలీదు. ఈ ‘ఈవెనింగ్ వాక్’ ఏమిటో, అది వినగానే నేనేదో ఘోరం చేసినట్టు నాపై ఈ మూకుమ్మడి కత్తిగట్టడమేమిటో ఏదీ అర్థం కాక, బెడ్ మీద కూలబడ్డా. నాకోసమే ఎదురుచూస్తున్నట్టుగా నా ‘రూమీ’ హడావిడిగా వచ్చి "ఎక్కడ పూడ్సినారు మీరు, నేను రూమంతా ఎతికేస్తిని" అన్నాడు, అదేదో కాలేజంతా వెతికొచ్చినట్టు." ఏదో కాస్త చల్లగాలి కోసం వాక్ వెళ్ళొచ్చా"నని చెప్పి తరువాత సీనియర్లతో జరిగిన తంతుగురించికూడా చెప్పుకొచ్చా. ‘అయ్యో మహేశా (కన్నడమోళ్ళు నాపేరునిలాగే వాయించేస్తారు) !, రీజనల్ కాలేజిలో సాయంత్రాలు ‘వాక్’ పోయేది చల్లగాలి కోసం కాదప్పా, ‘పిల్ల’ గాలి కోసం" అని చెప్పి. అమ్మాయిల ‘గంగా హాస్టలు’ సాయంత్రం 7.30 కి మూసేస్తారని అందుకే అబ్బయిలూ, అమ్మయిలూ 5.30 నుండీ 7.30 వరకూ క్యాంపస్ లో నడుచుకుంటూ తమ ప్రేమ కలాపాలు ఓ 2 గంటల సేపు సాగిస్తారనీ దానినే ఇక్కడ ‘ఈవెనింగ్ వాక్’ అంటారనీ జ్ఞానబోధ చేసాడు. "అయ్యో! ఎరక్కపోయి అన్నానూ ఇరుక్కు పోయానూ" అనిపాడేసుకుని కాస్త చింతించినా, రాబోయేకాలంలో మనకు పట్టబోయే అదృష్టాన్ని తలుచుకుని వొళ్ళు పులకరించిందంటే నమ్మాలి. ఆ పులకరింపు పైన మళ్ళీ సీనియర్లు నీళ్ళు జల్లకముందే భోజనాలు కానిచేద్దామని మెస్ కేసి దారి తీసాం, నేనూ నా రూమీ.
ఆఖరికి ర్యాగింగ్ పెళ్ళిరాత్రి రానే వచ్చింది దానికి తగ్గ పిలుపులూ వచ్చాయ్. సామూహిక వివాల టైపులో వధువుల్ని నిలబెట్టినట్టు జూనియర్లందరినీ మొదట వరుసగా నిలబెట్టి, ఎవరికి కావల్సిన కన్యల్ని వారు వరింఛినట్టు ‘సెలెక్ట్’ చేసుకుని తమ తమ రూములకు లగేసుకెళ్ళారు. నాతోపాటు మరో నలుగుర్ని మళయాళీ సీనియరూ, నాకు ఇంగ్లీషు సలహా ఇచ్చిన సీనియరూ కలిసి పాణీగ్రహణం కావించి రూముకు తీసుకెళ్ళారు. రూంనెంబరు ముప్పైఐదు, లో మాచేత సినిమా నటుల యాక్టింగుల నుంచీ, సిల్కుస్మిత డాన్సింగుల వరకూ అన్నీ చేయించేశారు.ర్యాగింగంటే ఇంతేనా అనిపించింది. అసలే మనం సిగ్గు విడిచిన బాపతు కనక (అప్పటికే ఏడేళ్ళ హాస్టలు జీవితం మరి) పెద్ద ఇబ్బంది లేకుండా వాళ్ళడిగిన వన్నీ చేసేశాం. ర్యాగింగ్ లో కిటుకేంటంటే, అడిగింది అడిగినట్టు చేసేస్తే బోరుకొట్టి మనల్ని వదిలేస్తారు, మనం నసిగామా సీనియర్లకు బలైనట్టే లెఖ్ఖ.
ఇక నాతో ఏం చెయ్యాలో తెలియక, ఓ బకెట్టు నీళ్ళు తెప్పించి దాంట్లో నిలబెట్టి పాట పాడ మన్నారు. పాడకపోతే కరెంటు పెడతామని బెదిరింపుకూడానూ. "నా పాట వినడం వీళ్ళ ఖర్మంగానీ పాడటానికి మనకేంటి" అని మనసులో అనేసుకుని ప్రతిఘటనలో విజయశాంతిని గుర్తు చేసుకుని, " ఈ ధుర్యోధన దుశ్సాసన , దుర్వినీతలోకంలో..." అని ఓ సిచ్యువేషన్ సాంగ్ వదిలా. ఈ నా విప్లవానికి ఖంగారుపడిపోయి "ఆపరా బాబు ఆపు...చుప్ బే" అని గౌరవించి నా నోరు నొక్కడమైనది. ఈ తంతంతా ఎప్పటిలాగే సైలెంటుగా చూస్తున్న ‘యముడు’, "కాస్త మంచిగుండే పాటల్రావ్రా నీకు? మెలోడీ టైప్" అని సిబాకా గీత్ మాలలో ఫర్మాయిష్ లాగా అడిగాడు. సరే మనమూ వివిధభారతే ననుకుని, పాటని లంకించుకున్నాం. "మనసా తుళ్ళిపడకే...అతిగా ఆశ పడకే" అని రాగం పాడగానే, "అంతా ఆడాళ్ళ పాటలేనారా...మగాళ్ళ పాటలు రావా మనకీ" అని నా ప్రవాహానికి అడ్డుకట్ట వేశేసాడు. ఇక విడికి మన టాలెంట్ చూపించి తీరాలన్న కసితో మన బాలుగాడి "ఏ దివిలొ విరిసిన పారిజాతమో", అని కళ్ళుమూసుకుని సాంతం(ఎవ్వడూ ఆపకుండా) పాడేసి కళ్ళు తెరిచా. అప్పటి వరకూ రాక్షసుల్లా కనపడ్డ సీనియర్లు, నన్నే పెద్ద భూతాన్ని చూసినట్టు చూస్తూ కనిపించారు.
ఇంతలో మళ్ళీ మా ‘యముడు’ కల్పించుకుని, "హిందీ గానా ఆతై?" అని చానల్ మార్చాడు. "వీడికింకా దమ్ముంద"నుకుని అప్పుడే వచ్చిన సల్మాన్ ఖాన్ సినిమాలోని "హరీ దుపట్టే వాలీ, సీధిసాధీ భోలిభాలీ జానమ్ రుక్ జానా" అని వయ్యారాలు పోకముందే, "ఈ జింక్ లకా గానా కాదురా భయ్, రఫీ కిశోర్ పాత పాటల"న్నాడు. "అప్పటిదాకా వాళ్ళపేర్లు వినడమే గానీ, మనకు పెద్ద పరిచయంలేదు వీళ్ళతో" అని చెప్పడం రాక, "రావు" అని ఒక్క మాటతో సరిపెట్టుకున్నా. "ఐతే ఒక పన్చెయ్" అని తటాలున పక్కనే ఉన్న టేప్ రికార్డర్, ఓ రెండు కేసిట్లు ఇచ్చి, "ఏదో ఒక పాట నేర్చుకొని, పొద్దున 5 గంటలకి నన్నొచ్చి నిద్రలేపు " అని పంపేశాడు. బతుకు జీవుడా అని ఆ రూంబయట పడి, నా రూంచేరుకున్నా.
టేప్ రికార్డర్ ని ప్లగ్గులో పెట్టి తెచ్చిన కేసెట్లని చూశా. ఒకటి హెచ్.ఎం.వీ. వారి ‘రఫీ కే అనుమోల్ రతన్’, మరోటి కిశోర్ కే దర్ధ్ భరే నగ్మే’. నా ప్రస్తుత దర్ధ్ ముందు కిశోర్ దర్ధేంటో తెలుసుకుందామని అదే మెదట మొదలెట్టా. "హే... యేజో మొహబ్బత్ హై, యె ఉన్ కాహై కామ్. మహబూబ్ కాజో బస్ లేతేహువె నామ్ మర్ జాయే మిట్ జాయే హోజాయే బద్నామ్..." అని ‘కటీ పతంగ్’ పాట వినవచ్చింది. అప్పటివరకూ "అమ్మా అని అరచినా ..ఆలకించవేమయ్యా" పాటలో ఘంటశాల పలికించిన ఆర్ద్రత ఇంకే గొంతూ పలికించలేదని నమ్మిన నాకు, ఇదొక డిస్కవరీ అని చెప్పాలి. అరగంటలో పాట నేర్చేసుకున్నా, ఐదు గంటలు ఎప్పుడవుతుందా అని ఎదురుచూసా. రాత్రంతా కిశోర్ పాటలు వింటూనే ఉన్నా. ఐదవగానే యముడి తలుపు తట్టేసి పాట గుమ్మం దగ్గరే వినిపించేశా. అంతే పాటంతావిని ‘ధ్యాంక్యూ’ అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఈ నా సాహసం మరుసటిరోజు హాస్టల్ వార్తల్లో, మొదటి పేజి న్యూసై కూర్చుంది. ఆ రోజునుండీ ర్యాగింగ్ జరిగిన నెలవరకూ ఏదో ఒక సీనియర్ రూంలో, వాళ్ళు ర్యాగింగ్ చేసిఅలసి పోతే రిలాక్సేషన్ కోసం నా గొంతు మ్రోగేది. ఈ ర్యాగింగ్ నాకు కిశోర్ ని, రఫీ ని,తలత్ ని,హేమంత్ ని పరిచయంచేసి నా జీవితానికొక ‘హిందీ అర్థాన్నిచ్చింది’. ఇలా ర్యాగింగ్ లో నా రాగాలు హాస్టలు గదుల్ని తాకాయి. కాలేజిలో మోగాయి.
Posted by Kathi Mahesh Kumar at 10:20 AM 17 comments
Labels: జీవితం
నా కాలేజీ కథ - Part 1
మన సంగతీ, పరపతీ ఆల్రెడీ కాలేజీకి పాకేశాయి కాబోలు, రూము నంబరు 1 మనకు సమర్పించుకుని, "ఇది మీదే" అన్నాడు హాస్టలు క్లర్కు. "హాస్టలు పేరు ‘కృష్ణా హాస్టలు’ మనది రూంనంబరు ఒకటి, ఇదేదో రాబోయే కాలానికి శుభశూచకం కాదుకదా" అని లోలోపల సంతోషం వెలగబెట్టి, రూం లో సామాన్లు తగలబెట్టా. అప్పటిదాకా ఆకలిగా నన్నే గమనిస్తున్న సీనియర్లను నేను గమనించలేదుగానీ, మా రూంమేటు చూసి "పాపం" అన్నట్టు నా వైపు జాలిగా చూపు విసిరాడు. పరుపు సర్దుతున్న నేను గుమ్మంలో అయిన అలికిడికి తిరిగి చూస్తే, నలుగురు ఆజానుబాహులు మన పరిచయప్రాప్తినాశిస్తూ నిల్చోని ఉన్నారు. ఇదేదో మనకి స్వాగతం తాలూకు ఏర్పాటు అయిఉంటుందనిపించి, "హలో !" అనేశా. "లుక్ అట్ దిస్ ఫెలో మ్యాన్...బ్లడీ f@#$ % r , డోంట్ ఈవెన్ నో హౌటు రెస్పెక్ట్ సీనియర్స్ మ్యాన్" అని మాటి మాటికీ "మ్యావ్" అని శబ్దం చేస్తూ ఓ అరవ సీనియరు నామీద విరుచుకు పడ్డాడు. మిగతావాళ్ళు వాడి మాటలతో ఏకీభవిస్తున్నట్టు గంగిరెద్దుల్లా తలలూడిపోయేట్టు ఆడించేస్తున్నారు. "నేను వాడికిచేసిన అపకారమేమిటో, నావల్ల జరిగిన అపచారమేమిటో" ఏకరువు పెట్టండని, నేను తెలుగులో దబాయించేశా. ఆ గుంపులో ‘తప్పిపోయానా!’ అన్నట్టు చూస్తున్న ఒకడు నాదగ్గరకొచ్చి,"యూ డోంట్ నో ఇంగ్లీష్" అన్నాడు. హమ్మయ్య కోంచం అర్థమయ్యే కూత కూశాడనుకుని, మన ఇంగ్లీష్ పాండిత్యానికి పరీక్షపెట్టాం. "యస్ ఐ నో ఇంగ్లీస్" అని నేననేసరికి, వాడికి ఏంతెగులు పుట్టిందో ఏమో, త్రీ లాంగ్వేజ్ ఫార్ములా వాడే కనిపెట్టినట్టు "హిందీ జాన్తేహో?" అని తన హిందీ భాషా ప్రయోగాన్ని నామీద చేశాడు. "నేను హర్యానా లో రెండు సంవత్సరాలు ఉండొచ్చానని ఆ అర్భకుడికి తెలియదుగనక మన పాండిత్యాన్ని శంకిస్తున్నాడుగానీ, మనం గానీ హిందీ మాటాడితే సూపరని ఈడికి తెలియదు" అని మనసులో అనేసుకుని, "హా జాన్తాహు" అన్నా. "ఠీక్ హై, షామ్కో కమరా నంబర్ పైంతాలీస్ మే ఆనా, తుమ్ దోనో" అని మా రూంమేట్ కేసి సైగచేసి గుంపును తరలించుకు వెళ్ళిపోయాడు.
"హారి భగవంతుడా ! వీడుగానీ నేను ఇంటినుంచీ తెచ్చిన మురుకులూ, చెగోడిలూ,కారం పెట్టిన వేరుశెనగ పప్పూ,ఆవకాయా అడగడుకదా?" అనే భయంకరమైన ఆలోచనవచ్చిన నా గుండె, అవన్నీ ఉన్న ట్రంకుపెట్టెలోకెళ్ళి చేరింది. "ఈ బందిపోటుగాళ్ళందరూ ఒక్క చెయ్యేసినా, కనీసం నెల రోజులు తినోచ్చనుకున్న సామానంతా ఒక్క గుటకలో అయిపోతుందే" అనుకుంటూ, అప్పటికే బిక్కచచ్చిన మా రూంమేటు దగ్గరికెళ్ళా. తన పేరు ‘విజయ నరసింహ’ అని, ఊరు ‘కోలార్’ అని తనకు వచ్చీరాని తెలుగు లో చెప్పుకోచ్చాడు ఈ కన్నడం అబ్బాయి. ఆంధ్రాకి బోర్డర్ కావటమూ,తను మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానవటం మూలంగా తనకు తెలుగు అర్థమవుతుంది, తనదైన యాసలో మాట్లాడనూగలడు. కోంచం చెవులకు కఠినంగా ఉన్నా, అప్పుడుమాత్రం తన పలుకులు అమృతాలే అయ్యాయి. "సాయంత్ర ఏ రూముకి రమ్మన్రి?" అని తనడిగేసరి, "ఔను ఏరూం?" అని నేను కూడా అనుకున్నా. అసలే హిందీలో మనకు సరిగ్గా వచ్చిన అంకెలు ఇరవై వరకే, కాబట్టి సీనియర్ చెప్పిన సంఖ్య అంతకు మించినదైఉండాలని ‘ధియరీ ఆఫ్ ప్రాబబిలిటీ’ లెఖగట్టి మళ్ళీ నెమరువేసుకున్నా. ‘పైంతీస్’ అని పదం జ్ఞాపకమోచ్చినా దానియొక్క సంఖ్యా చిహ్నాలు కళ్ళకు కనపడ కుండా ఉన్నాయ్. "సరేలే కాస్త మెదడుకి మేత వేద్దా"మని ఆలోచించా. "తీస్ అంటె ముప్ఫై, ‘పైన్’ అంటే ఏంటబ్బా" అని గట్టిగా ఆలోచిస్తుండగా మా నరసింహుడి కది ‘పైవ్’ లా వినపడి "ఫైవ్..ఫైవ్" అన్నాడు ఏదో కనిపెట్టిన ఆర్కెమెడీస్ "యురేకా యురేకా" అన్నట్టు. సరేలే వీడి సరదా మనమెందుకు పాడుచెయ్యలని దయదలిచి వాడి ఆనందం కోసం ఆ సీనియరు చెప్పింది రూంనెంబరు ముఫైఐదు గా తీర్మానించేశా. "అసలెందుకు పిలిచాడనే" పురుగు నా మెదడు తోలుస్తున్నా, "అంత ప్రమాదమైతే ఈ నరసింహుడు చెప్పకపోడా" అని కాస్త గుండెని ట్రంకులోంచి మళ్ళీ నా శరీరం లోకి ప్రవేశపరిచా.
"నిన్నె కూడా నాకు బాగా లేటయ్యే" అని మా రూంమేట్ నిస్పృహగా ముఖం కిటికీ వేపు తిప్పుకుని కన్నడం కలిపిన తెలుగులో అంటే, "ఫేస్ కొంచం టర్నింగ్ ఇచ్చి విషయం చెప్పమని" చిరంజీవి స్టైల్లో అడిగా. "అదే సీనియర్లంతా ర్యాగింగ్ చేస్తారప్పా, రాత్రికి" అని చావు కబురు చల్లాగా చెప్పాడు. ఈ ర్యాగింగ్ గురించి ఇప్పటికే విన్న నేను, నాదగ్గరున్న తిండిపదార్థాలు లంచం గా ఇచ్చేసి తప్పించుకునే అవకాశం ఉందేమోనని ఆలోచించడం మెదలెట్టా. " ఈ రోజే క్లాసులకి మొదటి రోజు, టైమ్ టెబిల్గూడా ఇస్తురు" అని మావాడు చెప్పిన మాటతో అదేక్యాంపస్ లో ఉన్న కాలెజీ బ్లాక్ కు బయల్దేరాం. "నువ్వూ "బియస్సీయెడ్డేనా", అని మళ్ళీ నా మిత్రుడు అడిగేసరికీ,దార్లో పోతున్న అమ్మాయిల వంక చూస్తున్న నాకు తెలివొచ్చి "హా...కాదు నేను బీఏయెడ్డు" అని చెప్పా, "ఐతే నీ ఆపక్క" అని మార్గదర్శకత్వంచేసి తనదారిన చక్కా పోయాడు.
తను చూపించిన దిశగా అడుగులెస్తున్న నాకు ‘English Department ’ అనే బోర్డు స్వాగతం పలికింది. నేవెతుకుతున్నది ‘బీఎ ఎడ్’ తరగతి గదా! అని చుట్టూ కలియతిరిగా, నేను కావాలన్న బోర్డుమాత్రం కనపడలేదు. నన్ను మోసం చేసి, మా నాన్నడబ్బులు ఈ కాలెజి వాళ్ళు దండుకోలేదుగదా అనే ఆలోచన నా మెదడుచేసినా, "చస్, ఎప్పుడూ ఎదవాలోచనే ఇది భారత ప్రభుత్వం వారి కాలేజి రా" అని నా ఆత్మారాముడు, మెదడు చెవి మెలెట్టి పాఠం చెప్పాడు. ఇంతలో కొన్ని తెలుగు గొంతుకలు వినవచ్చాయి. "ఇదే రా డిపార్టుమెంటు" అంటూ ఒకడు నన్ను చూసీచూడనట్టు రయ్ మని పరుగెడుతుంటే, మేమూ ఉన్నామన్నట్టు దారికడ్డంగా నిలబడిపోయా. ఒక్క క్షణం ఆగి నన్నుచూసి సీనియరన్న అపోహతో "గుడ్ మార్నిగ్...గుడాఫ్టర్ నూన్ సార్" అనేశాడు. నాకు నవ్వాగలేదుగానీ, బరితెగించి నవ్వేస్తే మన పరిస్తితి మరీ భేజారైపోతుందని, "సారీ బ్రదర్ నేనూ బీఏ ఏడ్ వెతుకుతున్నా" నని మర్యాదగా చెప్పా. ఆ పరుగెత్తినోడి పేరు ‘రమేష్ బాబు’, వాడితో ఉన్నోడి పేరు ‘మొహమ్మద్ బాషా’ ఫ్రమ్ కడప (తను ఊరిపేరు తో సహా అలాగే చెబుతాడు, ఎప్పుడడిగినా) గా పరిచయాలు కానిచ్చేసుకుని డిపార్ట్మెంట్ లోకి ఆడుగు పెట్టాం. వారి ద్వారానే తెలిసిందినాకు ‘బీ ఏ ఎడ్’ డిగ్రీలో ఇక్కడ ఇంగ్లీషు సాహిత్యం (English Literature) మేజరు అని. ఒక్కసారిగా గుండెల్లో కోటి రైళ్ళూ, మా పల్లె బస్సూ(అది కోటి రైళ్ళతో సమానం లెండి) ఇంకా ఏంటేంటో పరుగెత్తేసాయి.
ఇంగ్లీషు మీడియం లో ఎనిమిదో తరగతి నుంచీ చదువు చట్టుబండలు చేసినా, మన ఆంధ్రా గురువుల పుణ్యమా అని ఒక్క వాక్యం ఇంగ్లీషులో ఎప్పుడైనా మాట్లాడి ఉంటే ఒట్టు. ఈ సబ్జక్టు లో (మనకి ఇంగ్లీషు కూడా సబ్జెక్టే మరి) పాసైతే చాలు భగవంతుడా అని పదో తరగతి వరకూ అనుకున్నా, శెలవుల సాయంత్రాలలో మా అన్నయ్య తీసుకెళ్ళే ఇంగ్లీషు సినిమాల దయవల్ల ఈ దొరల భాష అర్థమాయ్యీ కానట్టు కాస్త, అర్థమయ్యే స్థితికి ఇంటర్ కాలానికి వచ్చేసాం. కానీ, ఇంటర్ లో హిస్టరీ,జాగ్రఫీ,ఎకనామిక్స్ ని సాధించి దాదాపు డిస్టింక్షను సంపాదించిన నాకు, ఇంగ్లీషు సాహిత్యం లో మేజరనేసరికీ ఇలాంటి మధురానుభూతి కలగడం సహజమే కదా మరి. "అర్రే ! పదా పదా, ఆఫీసులో టైంటేబుల్ ఇచ్చాండ్రు" అని భాషా కడప యాసలో కూకలేసి లాక్కెళ్ళి టైంటేబులిప్పించాడు. దాంతో పాటూ, ఇంకో అరగంటలో ‘ఇంట్రడక్టరీ’ క్లాసొకటుందని కూడా సమాచారం వచ్చేసింది. అప్పటికే కాబోయే మాక్లాసు వాళ్ళు దాదాపు అందరూ అక్కడ గుమిగూడడం మొదలెట్టారు.
అన్యమనస్కంగా చేతిలోని టైం టెబిల్ మీద దృష్టిసారించిన నాకు, పగలే తారాలోకం కనిపించింది. "రీడింగ్", "పొయెట్రీ", "డ్రామా" అంటూ, నాటకం ప్రతిపై ప్రామ్టింగుకు పెట్టుకునే గుర్తుల్లాగా ఈ సబ్జెక్టుల పేర్లు కనపడ్డాయి. ఇవేమిటో, వీటిల్లో ఏమిచేస్తారో కనీసం ఊహకుకూడా అందలేదు. "పొయట్రీ అంటే పద్యాలు పాడిస్తారేమో, డ్రామా అంటే దాట్లో డ్రామాలాడిస్తారేమో" అని ఏవేవో పిచ్చి పిచ్చి ఆలొచనలు నా పిచ్చి బుర్రలో మెదలసాగాయి. "నిండా మినిగినోడికి చలెందులని" గుంపుతోపాటూ క్లాసులో అడుగుపెట్టి, ఎందుకైనా మంచిదని చివరి బెంచిలో కూర్చున్నా. అసలే టెన్షన్ తో చస్తున్న నా పక్కన ఓ అమ్మాయి వచ్చి కూర్చుంది. "ఇదేమి తెగింపు ఈ ఆడాళ్ళకి? వీళ్ళకి సపరేటు లైన్లో బెంచీలు వెయ్యరా" అని హైరానా పడిపోయి ఒక్కక్షణం ఈ టెన్షన్ తో ఆ టెన్షన్ మర్చిపోయా. ఇంతలో భళ్ళున తలుపు తెరుచుకొని, అప్పుడేపడిన వాన జల్లుల్ని కోటుపైనుండీ తప్పిస్తూ అడుగు పెట్టాడు ఒక శాల్తీ. "గుడ్ మార్నింఘ్ ఎవ్రీబడీ, ఐ యామ్ రఘునాథ్, ప్రొఫెసర్ రఘునాథ్" అని జేమ్స్ బాండ్ స్థాయిలో తన పరిచయం వెళ్ళబుచ్చాడు. ఆ తరువాత తను గంట పర్యంతం చెప్పిన ఒక్క ముక్క ఇంగ్లీషూ నాకు అర్థం కాలేదు. తన హావ భావాల వల్ల తెలిసిందేమిటయ్యా అంటే, తను ఇక్కడ పెద్దపోటుగాడని, రాబోయే కాలంలో అన్నీ తనే అయ్యి మా చదువులు ఉద్దరింఛి మమ్మల్ని చరితార్థుల్ని చేస్తాడని. మిగతా క్లాసువారందరూ, ముఖాలు కిలోమీటరు ప్రసరించే సర్కసుడేరా ఫ్లాష్ లైట్ళలాగా పెట్టుకుని, తలలు గాలికి ఆడే తైలం చెట్లలాగా ఊపేస్తుంటే, నేనుమాత్రం తక్కువా అని ఒక అంగుళం ఎక్కువే ఆడించాను తల. ఈ గంట పాటు జరిగిన భాగోతంలో, నా పక్కన కూర్చున్న అమ్మాయి కనీసం పదిసార్లు నా ముఖం వైపు "అవునుకదా !" అన్నట్టు చూసింది. అసలే పతివ్రతాముండావాడ్నైన నేను, "నాకు నువ్వేమైనా వరసా?" అన్నట్టు ఓ చూఫువిసిరి ఊరుకున్నా. తనకర్థమైనట్టుగా లేదు కామోసు, క్లాసు అయిపోయిన తరువాత కూడా అలాంటి చూపొకటి విసిరి చక్కా పోయింది. "సర్లే రేపు ఇంకోలా చూసి, నా అభిప్రాయాన్ని తెలియజెబుతానని" నేను మనసులొ అనేసుకుని హాస్టలు దారి పట్టా.
భాషా,రమేష్ కూడా నాతో జత కలిసారు. అప్పటిదాకా అణగదోక్కిన నా ఆరాటం అప్పుడు కట్టలు తెంచుకుంది. ఏడవలేదుకానీ, దాదాపు ఏడుపు ముఖంతో నా "ఆంగ్లరానితన్నాన్ని" ఇప్పుడే కలిసిన ఇద్దరు మిత్రులకి చెప్పుకొచ్చా. బాషా నేనార్చేవాడీనీ, తీర్చేవాడినీ కానని తప్పుకున్నా, రమేష్ మాత్రం "నాకు తెలిసిన సీనియరున్నాడు, మాట్ళాడదాం పద"మన్నాడు. తను నన్ను చక్కా వెంటబెట్టుకుని హాస్టాలు లో గదినెంబరు ముప్పై ఐదు ముందు నిల్చోబెట్టాడు. అయ్యో పులినోట్లో తలపెడుతున్నానే అనుకుంటూ పొద్ధున అధికారం చెలాయించిన సీనియరు ముఖారవిందం తలుచుకుని బోనులో కి అడుగు పెట్టా. "క్యా బే" అని ఒక ఘాండ్రింఫువిని గుండెలవిసిపోయాయి. "అన్నా వీడు మా క్లాస్ మేటు, ఇంగ్లీషు రాదని కోర్స్ వదిలి పోతానంటున్నాడు" అని, నా చిట్టా క్లుప్తంగా ఈ యముడి ముందు చదివాడు రమేష్. "కొరత వేస్తాడో, నన్ను చీల్చి కాకులకీ గద్దలకీ వేస్తాడో, లేక ఏకంగా సలసల కాగే నూనెలో వేయిస్తాడొ" ఆని ఎదురుచూసా ఒక్క క్షణం. "జాయినయ్యేముందు తెలీదారా నీకు?" అన్నాడు యముడు. "తెలియదు" అన్నట్టు తలాడించా. "బాయిలా దూకకముందుండాల్రాభయ్ తెలివి, ఇప్పుడేంజేస్తవ్? మళ్ళీ ఊరెల్తవా?" అనడిగాడు, అప్పటిదాకా ఏ నిర్ణయమూ తీసుకోలేదుగనక అవును-కాదు రెండూ కలిసొచ్చేట్టు, ఇండియా మార్కు తల ఊపుడు ఊపేశా. "పోయి ఏంబీకుతవ్ రా? అన్ని కాలేజ్ అడ్మిషన్లూ ఖతమైపోయుంటాయ్", అందుకే మైసూర్ల ఓ సంమస్రం మజా చెయ్, అప్పటికీ చేతగాదంటే అప్పుడు చెక్కెయ్" అన్నాడు. ఆ క్షణం మా నాన్న గుర్తొచ్చాడు ఎందుకో. మళ్ళీ యముడే చెప్పుకొచ్చాడు, "బాయిల పడకుండా ఉండాల్రా భయ్, పడింతర్వాత ఈదడాన్కి ట్రైచెయ్యాలె లేదనుకో మునిగి పోతావ్" అంటూ తన అమూల్యమైన సలహాను చెప్పి, "తోల్కబోరా వీడ్ని" అని రమేష్ కి చెప్పాడు.
గది బయటకి వస్తుండగా మళ్ళీ, "తెలుగన్నా సక్కగా వస్తదిరా నీకు?" అన్నాడు. మొదటి సారిగా నా గొంతు పెగిలింది, "ఆ...చాలా బాగా వచ్చు" అని. "ఐతే మళ్ళీ ఆలోచిస్తావేంరా, తెలుగొచ్చినోడికి ఇంగ్లీష్ కష్టమారా? ఇట్టె వఛ్ఛెస్తుందిరా భయ్" అని స్వగతంలో అనుకున్నట్టుగా చెప్పాడు. కొంత ధైర్యమొచ్చింది. ఇంగ్లీషు సాగరం ఈది చూద్దాం లేకపోతే ఒక సంవత్సరం మైసూర్ మజా చేద్దాం అని నిర్ణయించేసుకుని, రూంనెంబరు 1 వైపు అడుగులేసా.
Posted by Kathi Mahesh Kumar at 12:15 AM 13 comments
Labels: జీవితం
Monday, May 12, 2008
ఆలోచనలు Vs/& భావాలు
"సమస్య గురించి చింతించడం కన్నా,ఆలోచించడం మిన్న" అని చిన్నప్పుడు ఎక్కడో చదివా. దీని అర్థమేమంటే, సమస్య గురించి చింతిస్తూ అంతర్ముఖుడై బాధపడటం కన్నా, సమస్య తీరే తీరును ‘లాజికల్ డిడక్షన్’ పద్ధతిలో ఆలోచించి దాన్నుండీ బయటపడటం. ఈ సలహా ప్రభావం నాపై చాలా ఉండేది. టీనేజి వయసుకొచ్చేసరికి ఆ వయసు సమస్యలకి (ఈ వయసులో సమస్యలేముంటాయి? అనేవారు యవ్వనాన్ని అనుభవించలేదని అర్థం) ఇలా ఆలోచించి సమాధానం రాబట్టి, (వేరే దారి లేక) సముదాయించేసుకునే వాడిని. ఈ ఆలోచనలు ఎలా ఉండేవంటే, " ఆ అమ్మాయి బాగుంది, ప్రేమించాలి" అన్న భావన కలిగిన వెంఠనే నా ‘లాజిక్’ పనిచేసేది. " ఆ...బాగుంటే మాత్రం ఏమిటి, మాట్లాడటం ఎలాగూ కుదరదు కదా! ఒకవేళ మాట్లాడినా, పెన్ అడగడంతప్ప అంతకుమించి మాట్లాడే అవకాశం రాదుకదా! ఒకవేళ మాట్లాడినా మన దగ్గర ఇంప్రెస్ చెయ్యదగ్గ గొప్ప విషయాలు ఏమున్నాయ్! ఉన్నా తను ప్రేమిస్తుందా! ఇవన్నీ జరిగే విషయాలు కావు గనక, చాప్టర్ మూసెయ్" అని ‘దాన వీర శూర కర్ణ’ సినిమాలొ ధుర్యోధనుడి డయలాగుల్లా మెదడులో మోగేవి. అంటే, భావాల్ని ఆలోచనలతో సముదాయించి జోకొ్ట్టేవన్న మాట. ఈ జోకొట్టడం కాస్తా వయసుతో పాటూ పెరిగి, కొంత భాషని కూడా దాంట్లో కలుపుకొని రాటుదేలిపోయాయి.
ఈ క్రమంగా నా జీవితంలోని ప్రతి వెధవ విషయాన్నీ అనుభవించక, ఆలోచించి దాని అంతుచూడడం అలవాటుగా ఏర్పడిపోయింది. అందుకే నేను అనుభవాల్ని పంచుకోవాలన్నా, నా ఆలోచనలే అక్షర రూపం దాలుస్తాయిగానీ భావాలు దొర్లిపడవు. అంటే నేను మరీ బండరాతినో, ఫీలింగులేని పిపీలకాన్నో అనికాదు. కేవలం భావవ్యక్తీకరణ విషయం లో సరైన భాష లేని వికలాంగుడిని మాత్రమే. ఉదాహరణకు ఒక వేళ ప్రేమిస్తే ఎందుకు ప్రేమించానో చెప్పగలనుగానీ, ప్రేమని వ్యక్తపరచాలంటే మాత్రం కోంచం కష్టమన్నమాట.
నా లాంటి భావవ్యక్తీకరణా వైకల్యం చాలా మందిలో ఉండొచ్చేమో!
ముఖ్యంగా చెప్పదల్చుకున్నది ఏంటంటే, కవితలూ కథలు రాశేవారు బహుశా తమ ‘విషయాలని’ మనసులోంచి తీస్తే నాలాంటి (వ్యాసాలు,సమీక్షలు రాశే) వారు మెదడులోంచి తీస్తారు అని. ఇక్కడ ఏది గొప్ప అని ఎవరైనా అడిగితే, మనసే అని చెబుతాను. ఎందుకటే, ఆలోచనని తెలియజెప్పడం కన్నా, హృదయాన్ని ఆవిష్కరించడానికి భావాలు తెలియజెప్పే భాషతో పాటు అనుభవించే మనసూ కావాలి. అది మనకు కొంచం తక్కువన్నమాట.
ఏదిఏమైనా ఈ రెండురకాల రచనలూ హాయిగా కో-ఎగ్జిస్ట్ అవ్వచ్చన్నమాట. కానీ ఒక్కటి మాత్రం ముఖ్యం, ఈ రెండు విధాలూ మనిషికి అల్టిమేట్ గా ఆనందాన్నిస్తేనే సార్థకం. లేకుంటే వ్యర్థం.
Posted by Kathi Mahesh Kumar at 2:43 PM 4 comments
Sunday, May 11, 2008
సిరి ‘కట్నలీల’ - ఓ కొత్త కథకుడి కథ
సమయం: 10.30
"చా, ఈ మగాళ్ళంతా ఇంతే!" ఆఫీసుకు వచ్చీరాగానే తన సీట్లో కూర్చుంటూ అంది ‘సిరి’.
"ఏం, మళ్ళీ ఇంకో పెళ్ళిచూపులా?" తెలిసిన కథే, అన్నట్టు చూస్తూ అడిగింది ‘లత’.
"అవునే, సాఫ్టువేర్ గాడట, పది లకారాలు కావాలట. పైగా, త్వరలో ‘అమెరికాకెళ్ళి డాలర్లు సంపాదిస్తే మీ కూతురే గదా సుఖపడుతుందీ’, అని వాడి తల్లి సన్నాయి నొక్కులుకూడానూ, పిచ్చిపట్టిందనుకో." అంది మధ్యతరగతి మామూలు తెలుగు అమ్మాయిల ప్రతినిధి సిరి.
"ఆ మాత్రమైనా ఇవ్వకపోతే మొగుళ్ళెలా దోరుకుతారండీ, ఈ ఖరీదైన కాలంలో", అంటూ పక్క క్యూబికల్ 'శ్రీనివాస్' తాబేలల్లే తలబయటెట్టి తన అమూల్యమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. ఆసలే చిరాకుగా ఉన్న సిరి కి ఈ మాటతో చిర్రెత్తుకొచ్చింది. "మీకు మా మాటలు వినడం కన్నా, వేరే పనిలేదాండీ?" అని వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ, మర్యాద వోలకబోసింది సిరి. "వినకూడదనుకున్నానండీ కానీ నా చెవులూరుకోలేదు, ఏంచెస్తాం". అంటూ అర్జెంటుగా పశ్చాత్తాపం ప్రకటించేశాడు. ఇక అనడానికీ పడడానికీ ఏమీలేక లత, సిరి ఒకర్నోకరు చూసుకుని, అసంకల్పితంగాన నవ్వేశారు. ఈ సారి తెల్లబోవడం శ్రీనివాస్ వంతయ్యింది.
సిరి నాన్న కలెక్టరాఫీసులో గుమస్తాగా చేసి రెటైర్ అయ్యారు. ఉద్ద్యోగం చేసిన రోజుల్లో గొప్ప హోదా వెలగబెట్టక పోయినా బహు పొదుపుగా జీవితం గడిపి, ఒక చిన్న ఇంటితో పాటు కూతురు పెళ్ళికని కొంత సొమ్ము వెనకేసుకున్నారు. ఆడపిల్లకు పెళ్ళి మాత్రం చేస్తే చాలని నమ్మిన వ్యక్తిగనక, సిరిని పెద్దచదువులు వెలగబెట్టనీయక గ్రాడ్యుయేట్ అనిపించేశారు. ఇంగ్లీషు మీడియం స్కూల్లో చదవడం వల్ల వచ్చిన ఇంగ్లీషు, తను చేసిన "బీకాం" ను అడ్డం ఫెట్టుకుని ఒక స్వచ్చందసంస్థ లో ఆరునెల్ల క్రితమే "టీం అసిస్టెంట్" గా ఉద్యోగం సంపాదించి, నాన్న పెన్షన్ తో పాటు తన సంపాదనతో సంసారానికి కోంత వేడ్నీళ్ళకు చన్నీళ్ళు కలుపుతోంది . ఈ ఉద్యోగం కూడా పెళ్ళి చేసేవరకే అని సిరి నాన్న ఉద్యోగం వచ్చిన రోజే తేల్చి చెప్పడమూ అయిపోయింది.
"వచ్చినప్పటి నుండీ ఇదే గోల వీడితో", శ్రీనివాస్ ని ఉద్దేశించి అంటూ తన పనిలో పడింది సిరి. "మంచబ్బాయేలేవే" అంది టైపిస్ట్ లత, అనునయిస్తూ. "ఆ... మంచే కానీ కాస్త జోల్లుకూడా " అంది కాస్త సాలోచనగా సిరి. "అంత కాదు లేవే, మర్యాదగానే ఉంటాడుగా, బొంబాయిలో చదివొచ్చాడు కాబట్టి కొంచం ఆంధ్రా కల్చర్ తెలీదు అంతే" అంటూ సమాధానమిచ్చింది, టైప్ చెయ్యాల్సిన కాగితాల వంక చూస్తూ, లత.
అన్యమనస్కంగా పనిచేసి లంచ్ టైం వచ్చేసరికీ, ఇందుకోసమే ఎదురు చూస్తున్నట్టుగా టిఫన్లు పట్టుకుని లంచ్ రూం కి పరుగెట్టారు సిరి, లత. తీరా చూస్తే అక్కడ శ్రీనివాస్ తప్ప ఇంకెవ్వరు లేరు. శ్రీనివాస్ నాన్న మిలట్రీ అ‘ట’ అందుకని ఈ కుర్రాడు కాలికి చక్రాలు కట్టుకుని భారతదేశం అంతా తిరిగి చదువుకు పట్టం కట్టాడ‘ట’. సోషియాలజీయో, సోషల్ వర్క్ లోనో బొంబాయిలో పీజీ చేసి, ఉద్యోగం కోసం ఇక్కడ తేలాడ‘ట’. ఇలా సిరికి తన గురించి లత చెప్పిన "ట" ల సమాచారం తప్ప ఇంకేమీలేదు. వచ్చిన మూడు నెలలలో, ఆఫీసు పనులు దాదాపు భుజానేసుకుని మొయ్యటం వల్ల బాసుకు కూడా ప్రీతి పాత్రుడైపోయాడు. ఇక సిరి విషయంలో తను తీసుకునే "ప్రత్యేక శ్రద్ద", సిరికి కొంచెం ఇబ్బంది కలిగించినా, ఎప్పుడూ హద్దులు దాటలేదు కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. పొద్దున జరిగిన తంతుకి ఇప్పుడు మళ్ళీ దాదాపు ఒంటరిగా దొరికిపోవడం కాస్త ఎబ్బెట్టుగా ఉంది సిరి కి.
"రండి మేడమ్స్", అంటూ ఆహ్వానం పలుకుతూ, ఆఫీస్ వాళ్ళందరూ బాస్ లేని అవకాశాన్ని వినియోగించుకుని వీకెండ్ ని శుక్రవారం మధ్యాహ్నం నుంచే సెలబ్రేట్ చేసుకోవడానికి ఇళ్ళకు చెక్కేసారని నింపాదిగా చెప్పుకొచ్చాడు. "ఐతే మనంకూడా భోంచేసి బయల్దేరుదామే, మా పిల్లలూ స్కూలునుండీ వచ్చేసుంటారు" అంటూ టిఫిన్ ఓపన్ చేసింది లత. శ్రీనివాస్ ఒంటరివాడుకాబట్టి హోటల్ నుండి పార్శిల్ తెచ్చుకుంటాడు, బహుశా పార్శిల్ తేవడానికి వెళ్ళిన ప్యూన్ కోసం ఎదురుచూస్తున్నట్టుంది.ఎదురుగా ఏమీ లేదు. ఇక టిఫిన్ ఓపన్ చేస్తే తనతో పంచుకో్వలసి వస్తుందని, చల్లగా కూర్చుంది సిరి.
"ఏంటండి సిరిగారూ ! ఇంకా పొద్దునున్న మూడ్ లోనే ఉన్నారా, టిఫిన్ మూత తియ్యట్లేదు" అంటూ శ్రీనివాస్ పలకరించాడు. అసలే తనను ఎలా అవాయిడ్ చెయ్యాలా అని ఆలోచిస్తుంటే, తను ఇలా అనగానే ఒక్కసారిగా పిచ్చ కోఫమొచ్చింది సిరికి. "మీ మగాళ్ళకేం తెలుస్తాయండీ మా బాధలు?" అంటూ తఠాలున అనేసింది. "ఐతే తెలియజెప్పండి, నేనెప్పుడూ తయారే" అంటూ కౌంటరేశాడు ‘శీను’. ‘ఈ రోజు వీడికి మూడింది’ అని మనసులో అనుకుని చెప్పటం మొదలెట్టింది సిరి. "సమాజం లో స్వేచ్చ మీది,ఆడదాని పై అధికారం మీది, ఇంట్లో పెత్తనం మీది,ప్రపంచంలోని సుఖాలన్నీ మీవి, ఐనా మగాడికి కట్నం పెరుతో ఆడదిచ్చే డబ్బు మాత్రం కావాలి, ఎందుకండీ మా ఆడవాళ్ళు మీమగాళ్ళకు డబ్బులిచ్చి మరీ దాస్యం చెయ్యాలి?" అంది. "నిజమే! ఇలాజరగటం తప్పే. కానీ ఇందులో మగవాడు చేసిన తప్పేమిటండీ?" అని అమాయకంగా అడిగాడు.
‘తప్పా, తప్పంతా మగాళ్ళదే !’
‘ఆ తప్పే ఏంటని అడుగుతున్నా?’
‘కట్నం అడగడమే తప్పు!’
‘ఆ విషయం చట్టమే చెబుతోంది, కానీ ఇందులో మగాడి తప్పేంటి?’
‘కట్నం కావాలనటం.’
‘మరి మీరివ్వటానికి రెడీ కదా అదితప్పుకాదా?
‘మేమిస్తే మీరు తీసేసుకుంటారా?’
‘ఇవ్వడానికి మెజారిటీ తయారుగా ఉంటే, మీకు మాత్రం ప్రత్యేకంగా కన్సెషన్ ఇవ్వాలా?’ అసలు మీసమస్య కట్నం అడగటమా, లేక మరీ పది లక్షలు ఆడగటమా?’ అని శీను అనేసరికి సిరికి నోట మాట రాలేదు.
"చూడండి సిరిగారు ! కట్నం అన్నది మీసమస్య అయితే, నేను ఇవ్వను అని భీష్మించుకు కూర్చోగలిగే హక్కు మీకుంది. అసలు కట్నం తీసుకోకుండా పెళ్ళికి తయారైన వాడ్ని చేసుకోవచ్చు. కానీ మీ ఉక్రోషం వాడు ఇంత కట్నం ఎందుకు ఆడిగాడూ అని. ఒక వేళ వచ్చినవాడు మీ బడ్జట్ లోగనక ఉండి ఉంటే,ఈ పాటికి పెళ్ళికి రెడీ అయ్యేవారు. ఇంత మాత్రానికి మొత్తం మగజాతిపైన కత్తిగట్టడం ఎంతవరకూ సమంజసం?" అని మర్యాదగా అడిగాడు శీను. "ఐతే పెళ్ళి కాకుండా ఉండిపొమ్మంటారా?" అని ఎత్తి పొడిచింది. "అది నా ఉద్దేశం ఏంతమాత్రం కాదు. సమస్యని సరిగా గుర్తించి, తరువాత మగాడ్ని భాధ్యుడిని చెయ్యమంటున్నాను అంతే" అని సర్దిచెప్పబోయాడు. " మీ ప్రకారం సమస్యని సృష్టించింది మా ఆడవాళ్ళంటారా?" అని రెట్టించింది. "సమస్య ఎవరు పుట్టించారో నాకు తెలియదు.కానీ సమస్యని పెంచి పోషించడం లో మాత్రం ఆడవాళ్ళు కూడా సమాన పాత్ర పొషించారని మాత్రమే నా ఉద్దేశం". ఈ మాటతో తదేకంగా టిఫిన్ లోకి చూస్తున్న లత ఉలిక్కిపడి, "అంటే" అని హుంకరించింది.
శీను సర్దుకుని చెప్పడం మొదలు పెట్టాడు, "అసలు కట్నం ఇవ్వము అని ఆడాళ్ళంతా ఒక్క సారిగా అనుకుంటే,వార్ని ఆపడం ఏ మగాడి తరం? అసలే జెండర్ రేషియో తగ్గిన భారతంలో కట్నం అడిగితే అమ్మాయి దొరకదు అని తెలిస్తే కట్నం అడిగే ధైర్యం ఏ మగాడు చెయ్యగలడు? నిజం చెప్పాలంటే, మగాడు ఖచ్చితంగా కాళ్ళబేరానికి వస్తాడు. ఎందుకంటే, ఆడది లేకుండా మగాడు అసలుండలేడు కాబట్టి. "
"అంటే మమ్మల్ని ఇప్పుడు ఉధ్యమాలు చెయ్యమంటారా?" అని ముక్త కంఠం తో ఇద్దరు మహిళామణులూ ఒక్కసారిగా గొంతుచించుకున్నారు. "ఉద్యమాలు చెయ్యక్కరలేదు, కనీసం మగాళ్ళను మాత్రం భాధ్యుల్ని చెయ్యకండి, ఇంకా చెప్పాలంటే, ఈ విషయం లో మగాళ్ళు మీకు చేసే సహాయాన్ని మర్చిపోకండి" అన్నాడు. "మగాళ్ళు మాకు చేసే సహాయమా? అదేంటి!" అన్నారు ఇద్దరూ. "మీ పెళ్ళిళ్ళు చెయ్యడానికి చెప్పులరిగేలా తిరిగేది ఎవరు? ఉంటే మీ నాన్న, లేదంటే మీ అన్న వీళ్ళు మగాళ్ళని మీరు మర్చిపోతున్నారే!?!" అని సున్నితంగా ఎత్తిచూపాడు శీను. "అది వాళ్ళ బాధ్యత" అంది లత, ఏదో హఠాత్తుగా గుర్తొచ్చినట్టు. "మరి మీ ఆడాళ్ళ బాధ్యత, మగాళ్ళకి మీ ఫోటొయిచ్చి మీకొ మొగుణ్ణి వెదకమని పంపడమా?" అని కాస్త ఘాటూగా సమాధానమిచ్చాడు శీను. "లేకపోతే మొగుణ్ణి వెదకడానికి మమ్మల్ని బయలుదేరమంటారా?" అంది సిరి అసహనంగా . "వెళ్లడం లో ఎంతమాత్రం తప్పు లేదు. కానీ అలా వెళ్ళే అవసరం కూడా మీకు లేదని, అవకాశాలు మీ దగ్గర ఎప్పుడూ ఉన్నాయని కూడా గమనింఛలేని స్థితిలో మీరున్నారు.అది ఇక్కడ ట్రాజెడీ". "కాస్త డీటైల్గా చెప్తారా", అంది లత ఉత్సుకతో.
"మీరు రోడ్లో వెళ్తున్నప్పుడు, పెళ్ళిళ్ళలో,బస్సులలో ఎక్కడ పడితే అక్కడ, మగాళ్ళు మీ ప్రేమకై ఎదురుచూస్తూ కనపడ లేదా? సరే వీళ్ళు మీ ప్రేమకు అర్హులుకాని పోకిరివాళ్ళనుకుందాం. కనీసం మీ కాలేజిలో, వర్క్ ప్లేస్ లో మీకు అర్హుడైనవాడూ,మీఫ్రెమకై ఎదురు చూసినవాడూ ఒక్కడంటే ఒక్కడులేడా? వీరిలో ఒక్కర్ని కూడా కట్నం లేకుండా పెళ్ళి వరకూ తీసుకురాలేక పోయారా? మిమ్మల్ని ప్రేమించమనట్లేదు, మీ ఆశయం పెళ్ళి కాబట్టి దానిగురించే చెబుతున్నాను. మీరు ‘మంచి అమ్మాయి’ అయ్యే ఫ్రయత్నం లో, జీవితాన్ని కన్వీనియంట్ గా గడిపేసి ఇప్పుడు మీ స్థితికి మగాళ్లు కారణమనడం సమంజసమంటారా?" అని సిరిని చూస్తూ ముగించాడు శీను.
సిరి ముఖం లో నెత్తురుచుక్క లేదు. తన అంతరాలలో దాగిఉన్న భూతాన్ని, శీను తన కళ్ళముందే నిలిపినట్టుగా ఉంది. తను అడిగిన ప్రశ్నలకి సమాధానం ఎక్కడ వెదకాలో తెలియక, అసలున్నాయో లేవో తెలియక, తన మూర్ఖత్వాన్ని కప్పిపుచ్చుకో లేక కాసేపు మౌనం వహించింది. ఇంతలో లత ఇద్దరివైపూ తిరిగి, "ఇవన్నీ చెప్పటానికి బాగుంటాయ్, నువ్వు కట్నం లేకుండా పెళ్ళి చేసుకుంటావా?. అంది. దీనికి సమాధానంగా శీను, "నేనెప్పుడూ రెడీనే"అ న్నాడు సిరిని చూస్తూ.
దినం: సోమవారం
సమయం: 10.30
ఆఫీస్ లోకి నవ్వుతూ వచ్చింది సిరి. హాయ్!గుడ్ మార్నింగ్ అని శీనుకు లతకు చెప్పి తన సీట్లో కూర్చుంది. వేర్వేరు వైపుకు తిరిగి కూర్చున్న శీను, సిరి ల ముఖాల్లో ని నవ్వు దాదాపు ఒక్కలాగే ఉంది.
P.S : నన్ను పోరి, నాచేత ఈ పాపం చేయించిన అరవింద్ కు కసితో నా కథ అంకితం
---------------------------------------------------------------------------------------
Posted by Kathi Mahesh Kumar at 4:14 PM 17 comments
Labels: కథ
నా మొదటి కథ, మొదలెట్టా !!!
ఈ ‘దడ’బిడ తప్పించుకుందామని, కథ రాశేద్దాంలే! అనుకున్నా. కానీ ఈ మధ్య నేను చదివిన బ్లాగుల్ళొని కథలు గుర్తొచ్చి, మరింతగా గుండె ఠారెత్తింది. ఏమి కథలు, ఏమి విషయం,ఏమి శైలి. నా సామిరంగా ! పత్రికలూ,పబ్లిషింగూ వదిలి, గుడెలుతీసిన కథా పోటుగాళ్ళూ,పోటుగత్తెలూ దండుగా తెలుగు బ్లాగులమీద దండెత్తినట్టుగా ఉంది కత. ఈ మహాయుద్ధం లో వంటకత్తెట్టుకుని "నేనూ సైనికుడినే, కథా కదనరంగానికి వారసుడినే!" అనడం ఎట్టా? అని నాలోనేను ఆత్మారాముడితో డిస్కషన్ లో ఉంటే, అదే మిత్రుడు, మరో సలహా పారేశాడు. అదేమిటయ్యా అంటే, "నీ అభిప్రాయాలనే కథా పాత్రలుగా మార్చి, కథ రాశెయ్యీ" అని. కానీ, ఇలా రాస్తే అది ఒక చర్చా పత్రమవుతుందే గాని, కథ అవుతుందా? అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం. ఇంతా ఆలోచించే బదులు, రాయడం మెదలెడితే విషయం తేలిపోతుందిగదా... అనిపించి ఇప్పుడే మొదలెట్టా.
"ఇంత ఉపోద్ఘాతం రాయకముందే ఎందుకు? రాసిన తర్వాత కథని టపా వెయ్యక!" అని మీరనుకొవచ్చు. కానీ ఇదంతా అడ్వాన్స్ గా ఎందుకు చెబుతున్నానంటే, సిగరెట్ మానాలనే వాడు పదిమందికి చెప్పి మానాలంటారు పెద్దలు. దీనివలన, ఒకవేళ ఈ మానవుడు మళ్ళీ కర్మగాలి సిగరెట్ అంటిస్తే,ఎత్తిపొడవడానికి చుట్టూ ఉన్నావాళ్ళు ఉపయోగపడి, వాడి మాన్పుకు తోడ్పడుతారని. అదే విధంగా నేను కథ రాసి, దైర్యం చాలకనో లేక తప్పింఛుకోవాలనో మరో రెండురోజుల్లో పోస్ట్ చెయ్యకపోతే, మీరు ఎత్తిపోడవడానికీ,గుర్తుచెయ్యడానికీ ఉంటారని నా ఆశ. సాహసం శేయరా డింభకా! కథ దక్కుతుందని నాకునేనే చెప్పేసుకుని దూకేస్తున్నా!
Posted by Kathi Mahesh Kumar at 1:43 PM 7 comments
Saturday, May 10, 2008
లండన్ లో తెలుగు ప్రేమోన్మాదం !
విజయవాడ, కరీంనగర్ ఇప్పుడు లండన్, ప్రదేశాలలో మార్పే తప్ప ‘తెలుగు ప్రేమ’ వికారాల్లో ఏమీ మార్పులేదు. అసలీ సంస్కృతి ఎక్కడినిండీ వచ్చిందని చాలా చర్చలు జరుగుతున్నాయ్. కొందరు సినిమాల మీద దుమ్మెత్తి పోస్తే, ఫెమినిస్టులు పేరుకుపోయిన "పితృస్వామిక భావజాలాన్ని" కారణమంటున్నారు. వామపక్షాలు ఈ నేరాన్ని "కంస్యూమరిజం" మీదకునెడితే, బీజేపీ దీన్నే "పెరుగుతున్న పాశ్చాత్యసంస్కృతికి చిహ్న"మని తీర్పుచెబుతున్నారు. అసలు సమస్యకు మూలం ఎక్కడో వీరికి అసలు తెలియకపోయైనా ఉండాలి, లేదా వీరు చెబుతున్న అన్నికారణాలూ నిజమైనా అయ్యుండాలి. ఈ చర్చలన్నింటిలో నేను గమనించింది ఒక్కటే, ఎక్కడా ‘ఆ వయసు’ వారిని చర్చల్లో భాగస్వాముల్ని చేయకపోవడం. అసలు ఈ సమస్యకు కారకాల్ని అనుభవిస్తున్న యువతనడిగి తెలుసుకునే ప్రయత్నాలు ఎక్కడాచేసినట్టు కనపడకపోవడం.
ఒక తెలుగు ఛానల్లో పనిచేస్తున్న మిత్రుడిని తో ఈ మాటే అడిగితే తను చెప్పిన సమాధానం, "ఆన్ కేమరా మాట్లాడ్డాలంటే, వీరికి తల్లిదండ్రుల భయం, ఇక ఈ విషయం గురించి సృష్టంగా అభిప్రాయాలు వీరు చెప్పలేకుండా ఉన్నారు" అని. నిజమే, కానీ ఒకసారి తను చెప్పిన వాక్యాన్ని నెమరువేసుకుంటే అందులో అసలు సమస్య తెలుస్తోందనిపించింది. ఈ వయసు వారికి ప్రేమపై ఉండేవి అభిప్రాయాలు కాదు ‘నమ్మకాలు’. ఇక తల్లిదండ్రులపై ఉండేవి భయాలుకాదు, "మా పిల్లలు చాలా అమాయకులు, ఇలాంటి విషయాలు వీరికి తెలియదు" అని నమ్మే తల్లిదండ్రుల అమాయకత్వాన్ని(మూర్ఖత్వాన్ని) కాపాడాలన్న తపన. అందుకే ఈ ‘నమ్మకాలు’, తల్లిదండ్రులను ‘కంఫర్ట్ జోన్లో’ ఉంచే ప్రయత్నాలు ప్రస్తుత పరిస్తితికి కారణమనిపిస్తుంది.
ఈ ప్రేమపై యువతకున్న నమ్మకాల్ని కొంచెం పరిశీలిద్దాం.
1. ప్రేమ జీవితంలో ఒక్కసారే కలుగుతుంది (కాబట్టి దొరికిన అమ్మాయిని హింసించైనా ప్రేమని పొందాలి)
2. ప్రేమంటే ఒకరికొకరు సొంతమవడం ( తను "సొంతం" అయ్యింది కాబట్టి, నా ఇష్ట ప్రకారం నడవాలేగానీ తనకి ఇష్టాఇష్టాలు ఉండకూడదు)
3.ప్రేమకు ప్రాణమివ్వాలి ( లేదంటే ‘ప్రాణం తియ్యాలి’ )
ఎంత పనికిమాలిన `ప్రేమాదర్శాలని' మనం (సమాజం) ప్రాపగేట్ చేసి, యువతకు నమ్మకాల్ని చేసామోచూడండి. దాన్ని అపార్థం చేసుకున్న యువతదే తప్పు అని కొందరివాదన. పై ఆదర్శాలకు అర్థాలుంటే, అపార్థాలౌతాయిగానీ అసలు అర్థమే లేని ఈ పిచ్చి సూత్రాలకి మినహాయింపుకావాలా?
జీవితంలో ప్రేమ ఒక్కసారే కలగటమేమిటి, నాన్సెన్స్! నాకు మట్టుకూ ‘చలం’ లా చాలాసార్లే కలిగింది. ఇప్పుడు దొరికిన అమ్మాయి చేజారితే ఇంకొకరు అంత ఈజీ దొరకని కరువేగానీ, ఈ అవకాశం ఉంటే యువత అంత డెస్పరేట్ అవ్వరని నా నమ్మకం. మనుషుల ప్రాణాలకన్నా, మనం కల్పించుకున్న విలువలు కొన్ని తగ్గినా ఫరవాలేదంటాను, మీరేమంటారు?
ఇక ప్రేమలో ఒకరికొకరు ‘సొంతం’ అవడం. పుట్టించిన తల్లిదండ్రులకూ మనం సొంతంకాదు, మనకు పుట్టిన బిడ్డలు మనకు సొంతంకాదు కానీ, ప్రేమలో అమ్మాయి మాత్రం మన "ప్రాపర్టీయే". ఈ ముక్కచెప్పిన వాడి సొంత భూమి హైదరాబాద్ లో ఉంటే, కబ్జాచేసెయ్యాలి.
ప్రేమకు ప్రాణాలివ్వాలి (లేదా తియ్యాలి). ఈ వాక్యం చెప్పినోడు ఖచ్చితంగా శాడిస్టే. ప్రేమ జీవితంలో ఆనందాన్ని పంచాలేగానీ, జీవితాన్నే అంతం చెయ్యాడం ఎంత తెలివితక్కువతనం! పిచ్చివాడు కాకపోతే, ఎవరీ సిధాంతాన్ని ప్రతిపాదిస్తాడు?
ఇక తల్లిదండ్రుల మూర్ఖత్వపు హిపోక్రసీని ఎండగట్టడానికి...త్వరలో ఒక వేరే టపా పెడతాను.
Posted by Kathi Mahesh Kumar at 7:38 AM 20 comments
Labels: సమాజం
Friday, May 9, 2008
మనకన్నా ఈ మళయాళపోళ్ళు బెటర్ !!!
Posted by Kathi Mahesh Kumar at 5:06 PM 14 comments
Labels: సమాజం
Thursday, May 8, 2008
Wednesday, May 7, 2008
చిన్న సినిమా...కొక్కొరోకో!
మంచి సినిమాలు రావాలి.తెలుగు సినిమా బతకాలి.చిన్న సినిమాల్ని ఆదరించాలి, కొక్కొరోకో!!! అంటూ పరిశ్రమ కోడై కూసింది. మరి సినిమాలు తియ్యండ్రా బాబూ! అంటే, కూయడంతో మా పనైపోయింది తీయడం ఎవరివంతో మీరేచెప్పాలని, ప్రేక్షకుడివైపు వేలెత్తి చూపింది. ఇక మా కూయడమైందని అటకెక్కి, పెద్దసినిమా గుడ్డెట్టడం లో బిజీ అయిపోయింది.
పెద్ద సినిమా అంటే, ఒక పేరున్న హీరో డేట్లివ్వాలి,పదిమంది విలన్లు రావాలి,కనీసం పాతిక సుమోలు పేలాలి,బొంబాయి భామలు దిగాలి, ఇరగదీసే సెట్టో లేక ఏడుసముద్రాలు దాటో పాటలు పాడాలి అంతే, చాలా వీజీ ! అదే చిన్న సినిమా అయితే, అవసరంగా మంచి కథ కావాలి, ఉన్నబడ్జట్టులో ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించాలి, పాటల్లో... మాటల్లో... పదును కాకపోయినా అదునైనాఉండాలి. ఎంత కష్టం. ఎంత కష్టం. అంటే, చిన్న సినిమా అంత వీజీ కాదన్నమాట !!. మంచిసినిమా అసలు వీజీ కాదన్నమాట!!!
పెద్ద హీరో డేట్స్ చాలు సినిమా చుట్టెయ్యడానికి, వ్యాపారం పట్టెయ్యడానికి. పనిలేని టీవీ చానళ్ళూ,పనికివచ్చే విజయ యాత్రలూ ఎలాగూ ఉండనే ఉన్నాయ్, సినిమాను ముఫైరోజులు ఓ వెయ్యి ధియేటర్లలో నడపడానికి. ఇంత మాత్రానికే సబ్జెక్ట్ ఎందుకు బడ్జెట్ తప్ప? ముఫైరోజుల తరువాత, 50 రోజుల దిశగా! 100 రోజుల దిశగా!! అని ఊదరగొట్టెయ్యొచ్చు, అందరినీ పాతరపెట్టెయ్యొచ్చు.
బిజినెస్సంటారా ! సినిమా తీసేముందే అమ్మేసిన నిర్మాత ‘హ్యాపీ’. కొన్న బయ్యరు, ఎగ్జిబిటరుకిచ్చేసి ‘ఖుషీ’. ఎగ్జిబిటరు, 50 రోజులకు సరిపడా ఖర్చుల్ని రెండు వారాల్లో "బ్లాక్"చేసేసి ‘జల్సా’ . మరి నష్టం ఎవరికీ? తేలుకుట్టిన దొంగల్లే ప్రేక్షకుడికి (నీకూ,నాకూ అన్నమాట). కొత్తసినిమా, పెద్దసినిమా అని ఉత్సాహపడేది వీడే, ఎదురు చూసేది వీడే, ఊరేగేదీ వీడే...ఉట్టికెక్కేది వీడే. అంతా అయింతర్వాత మింగలేక కక్కలేక అనుభవించేది కూడా వీడే.
ఇక చిన్న సినిమా అంటారా? అదెప్పుడొస్తుందో తెలీదు. వచ్చినా, ఏ ఊరిచివరి ‘ఉమామహల్లో’నో లేక సంత పక్క సాగర్ టాకీస్ లోనో వచ్చి, మనం వెళ్ళడానికి ఇబ్బందిని తెచ్చిపెడుతుందే తప్ప, వెళ్ళాలనే కోరిక కలుగనీదు. ఒకవేళ చూసిన వాళ్ళు "బాగుందట, చూడరాదూ!" అంటే, అ... రేపో ఎల్లుండో కేబుల్లోనో,టీవీ లోనో మరీ ఐతే సీడీ లోనో దొరక్కపోదా, చూడకపోమా అని తేల్చేస్తాం. నిర్మాత బతుకు బస్టాండ్ చేసేస్తాం.
అసలీ నిర్మాతగాడు, సినిమా తియ్యాలనుకోవడమే పతనానికి పునాది.బడ్జెట్ లేదు కాబట్టి సబ్జెక్ట్ బలపడాలని కోరుకోవడమే వీడికి సమాధి. అనుకున్న సమయానికి రిలీజుకాక, కావాల్సిన ధియేటర్ దొరక్క, "మాఘమాసం" టైపు టైటిలు పెట్టి గాలివానల నడుమ ఉన్న ఇతగాడిని, నడిసముద్రంలో పడేస్తాం. వాడు ఈ కసితో, మాఘమాసం బదులు ఈ సారి, ముమైత్ ఖాన్ తో ‘మధురరాత్రులు’ తీసి మనమీదికి వదుల్తాడు.
అందుకే బ్రదరూ(సిస్టర్లు కూడానండోయ్)! మంచి సినిమా చిన్నదైనా, అది సంత పక్కన ‘సాగర్’ లో ఉన్నా టిక్కెట్టుకొని ప్రోత్సహిద్దాం. పెద్ద సినిమా ‘పరుగు’ఎత్తి పాలుతాగిస్తా మన్నా నిలకడగా నిలబడదాం.
ఈ నా వ్యాసం మొదటగా www.navatarangam.com లో ప్రచురించబడింది
Posted by Kathi Mahesh Kumar at 8:08 AM 5 comments
Labels: సినిమాలు