Tuesday, May 13, 2008

నా కాలేజీ కథ - Part 1

"ఇంగ్లీషు గోల"
మైసూరు రీజనల్ కాలేజిలో సీటొచ్చిందని లెటరు రాంగానే, తెగ సంబరపడిపోయా. మా నాన్నకైతే ఇలా జరుగుతుందని అసలు నమ్మకం లేదనుకుంటా, ఎందుకైనా మంచిదని మదనపల్లి, బీ.టీ. కాలేజిలో ముందు జాగ్రత్తగా చెర్చిపారేశారు. ఇదే తరువాయని, ఫోలోమని మదనపల్లి కాలేజికెళ్ళి ఇచ్చిన సర్టిఫికెట్లు,కట్టిన ఫీజూ లాగేసుకుని మైసూరు చెక్కేశా. కాలేజి ఫీజులూ,హాస్టలు వసతీ,నా అవసరాలకి తగ్గ సరంజామా అంతా మా నాన్న చూసేసి, "ఇంకేరా, నన్ను బయలుదేరమంటావా" అని అనేసరికీ కళ్ళలో నీళ్ళుమాత్రం తిరగలేదుగానీ, గుండెల్లో కొంచం బాధమాత్రం వేసింది. ఎంతైనా అప్పటికే ఏడేళ్ళ హాస్టలు జీవితం నవోదయా విద్యాలయం లో వెలగబెట్టి ఉండటం మూలంగా, ఈ నాలుగు సంవత్సరాలు మనకో లెఖ్ఖ కాదుగానీ, ఎదో కొత్త ప్రపంచం, తెలియని మనుషులు,రాని భాష అని కాస్త మనసులో గుబులేసి అలా అయుండవచ్చు. ఏదిఏమైనా, నన్ను ఓ కాలేజివాడ్ని చేసి మా నాన్న అలా ఇంటికి బయల్దేరారు.


మన సంగతీ, పరపతీ ఆల్రెడీ కాలేజీకి పాకేశాయి కాబోలు, రూము నంబరు 1 మనకు సమర్పించుకుని, "ఇది మీదే" అన్నాడు హాస్టలు క్లర్కు. "హాస్టలు పేరు ‘కృష్ణా హాస్టలు’ మనది రూంనంబరు ఒకటి, ఇదేదో రాబోయే కాలానికి శుభశూచకం కాదుకదా" అని లోలోపల సంతోషం వెలగబెట్టి, రూం లో సామాన్లు తగలబెట్టా. అప్పటిదాకా ఆకలిగా నన్నే గమనిస్తున్న సీనియర్లను నేను గమనించలేదుగానీ, మా రూంమేటు చూసి "పాపం" అన్నట్టు నా వైపు జాలిగా చూపు విసిరాడు. పరుపు సర్దుతున్న నేను గుమ్మంలో అయిన అలికిడికి తిరిగి చూస్తే, నలుగురు ఆజానుబాహులు మన పరిచయప్రాప్తినాశిస్తూ నిల్చోని ఉన్నారు. ఇదేదో మనకి స్వాగతం తాలూకు ఏర్పాటు అయిఉంటుందనిపించి, "హలో !" అనేశా. "లుక్ అట్ దిస్ ఫెలో మ్యాన్...బ్లడీ f@#$ % r , డోంట్ ఈవెన్ నో హౌటు రెస్పెక్ట్ సీనియర్స్ మ్యాన్" అని మాటి మాటికీ "మ్యావ్" అని శబ్దం చేస్తూ ఓ అరవ సీనియరు నామీద విరుచుకు పడ్డాడు. మిగతావాళ్ళు వాడి మాటలతో ఏకీభవిస్తున్నట్టు గంగిరెద్దుల్లా తలలూడిపోయేట్టు ఆడించేస్తున్నారు. "నేను వాడికిచేసిన అపకారమేమిటో, నావల్ల జరిగిన అపచారమేమిటో" ఏకరువు పెట్టండని, నేను తెలుగులో దబాయించేశా. ఆ గుంపులో ‘తప్పిపోయానా!’ అన్నట్టు చూస్తున్న ఒకడు నాదగ్గరకొచ్చి,"యూ డోంట్ నో ఇంగ్లీష్" అన్నాడు. హమ్మయ్య కోంచం అర్థమయ్యే కూత కూశాడనుకుని, మన ఇంగ్లీష్ పాండిత్యానికి పరీక్షపెట్టాం. "యస్ ఐ నో ఇంగ్లీస్" అని నేననేసరికి, వాడికి ఏంతెగులు పుట్టిందో ఏమో, త్రీ లాంగ్వేజ్ ఫార్ములా వాడే కనిపెట్టినట్టు "హిందీ జాన్తేహో?" అని తన హిందీ భాషా ప్రయోగాన్ని నామీద చేశాడు. "నేను హర్యానా లో రెండు సంవత్సరాలు ఉండొచ్చానని ఆ అర్భకుడికి తెలియదుగనక మన పాండిత్యాన్ని శంకిస్తున్నాడుగానీ, మనం గానీ హిందీ మాటాడితే సూపరని ఈడికి తెలియదు" అని మనసులో అనేసుకుని, "హా జాన్తాహు" అన్నా. "ఠీక్ హై, షామ్కో కమరా నంబర్ పైంతాలీస్ మే ఆనా, తుమ్ దోనో" అని మా రూంమేట్ కేసి సైగచేసి గుంపును తరలించుకు వెళ్ళిపోయాడు.


"హారి భగవంతుడా ! వీడుగానీ నేను ఇంటినుంచీ తెచ్చిన మురుకులూ, చెగోడిలూ,కారం పెట్టిన వేరుశెనగ పప్పూ,ఆవకాయా అడగడుకదా?" అనే భయంకరమైన ఆలోచనవచ్చిన నా గుండె, అవన్నీ ఉన్న ట్రంకుపెట్టెలోకెళ్ళి చేరింది. "ఈ బందిపోటుగాళ్ళందరూ ఒక్క చెయ్యేసినా, కనీసం నెల రోజులు తినోచ్చనుకున్న సామానంతా ఒక్క గుటకలో అయిపోతుందే" అనుకుంటూ, అప్పటికే బిక్కచచ్చిన మా రూంమేటు దగ్గరికెళ్ళా. తన పేరు ‘విజయ నరసింహ’ అని, ఊరు ‘కోలార్’ అని తనకు వచ్చీరాని తెలుగు లో చెప్పుకోచ్చాడు ఈ కన్నడం అబ్బాయి. ఆంధ్రాకి బోర్డర్ కావటమూ,తను మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానవటం మూలంగా తనకు తెలుగు అర్థమవుతుంది, తనదైన యాసలో మాట్లాడనూగలడు. కోంచం చెవులకు కఠినంగా ఉన్నా, అప్పుడుమాత్రం తన పలుకులు అమృతాలే అయ్యాయి. "సాయంత్ర ఏ రూముకి రమ్మన్రి?" అని తనడిగేసరి, "ఔను ఏరూం?" అని నేను కూడా అనుకున్నా. అసలే హిందీలో మనకు సరిగ్గా వచ్చిన అంకెలు ఇరవై వరకే, కాబట్టి సీనియర్ చెప్పిన సంఖ్య అంతకు మించినదైఉండాలని ‘ధియరీ ఆఫ్ ప్రాబబిలిటీ’ లెఖగట్టి మళ్ళీ నెమరువేసుకున్నా. ‘పైంతీస్’ అని పదం జ్ఞాపకమోచ్చినా దానియొక్క సంఖ్యా చిహ్నాలు కళ్ళకు కనపడ కుండా ఉన్నాయ్. "సరేలే కాస్త మెదడుకి మేత వేద్దా"మని ఆలోచించా. "తీస్ అంటె ముప్ఫై, ‘పైన్’ అంటే ఏంటబ్బా" అని గట్టిగా ఆలోచిస్తుండగా మా నరసింహుడి కది ‘పైవ్’ లా వినపడి "ఫైవ్..ఫైవ్" అన్నాడు ఏదో కనిపెట్టిన ఆర్కెమెడీస్ "యురేకా యురేకా" అన్నట్టు. సరేలే వీడి సరదా మనమెందుకు పాడుచెయ్యలని దయదలిచి వాడి ఆనందం కోసం ఆ సీనియరు చెప్పింది రూంనెంబరు ముఫైఐదు గా తీర్మానించేశా. "అసలెందుకు పిలిచాడనే" పురుగు నా మెదడు తోలుస్తున్నా, "అంత ప్రమాదమైతే ఈ నరసింహుడు చెప్పకపోడా" అని కాస్త గుండెని ట్రంకులోంచి మళ్ళీ నా శరీరం లోకి ప్రవేశపరిచా.


"నిన్నె కూడా నాకు బాగా లేటయ్యే" అని మా రూంమేట్ నిస్పృహగా ముఖం కిటికీ వేపు తిప్పుకుని కన్నడం కలిపిన తెలుగులో అంటే, "ఫేస్ కొంచం టర్నింగ్ ఇచ్చి విషయం చెప్పమని" చిరంజీవి స్టైల్లో అడిగా. "అదే సీనియర్లంతా ర్యాగింగ్ చేస్తారప్పా, రాత్రికి" అని చావు కబురు చల్లాగా చెప్పాడు. ఈ ర్యాగింగ్ గురించి ఇప్పటికే విన్న నేను, నాదగ్గరున్న తిండిపదార్థాలు లంచం గా ఇచ్చేసి తప్పించుకునే అవకాశం ఉందేమోనని ఆలోచించడం మెదలెట్టా. " ఈ రోజే క్లాసులకి మొదటి రోజు, టైమ్ టెబిల్గూడా ఇస్తురు" అని మావాడు చెప్పిన మాటతో అదేక్యాంపస్ లో ఉన్న కాలెజీ బ్లాక్ కు బయల్దేరాం. "నువ్వూ "బియస్సీయెడ్డేనా", అని మళ్ళీ నా మిత్రుడు అడిగేసరికీ,దార్లో పోతున్న అమ్మాయిల వంక చూస్తున్న నాకు తెలివొచ్చి "హా...కాదు నేను బీఏయెడ్డు" అని చెప్పా, "ఐతే నీ ఆపక్క" అని మార్గదర్శకత్వంచేసి తనదారిన చక్కా పోయాడు.


తను చూపించిన దిశగా అడుగులెస్తున్న నాకు ‘English Department ’ అనే బోర్డు స్వాగతం పలికింది. నేవెతుకుతున్నది ‘బీఎ ఎడ్’ తరగతి గదా! అని చుట్టూ కలియతిరిగా, నేను కావాలన్న బోర్డుమాత్రం కనపడలేదు. నన్ను మోసం చేసి, మా నాన్నడబ్బులు ఈ కాలెజి వాళ్ళు దండుకోలేదుగదా అనే ఆలోచన నా మెదడుచేసినా, "చస్, ఎప్పుడూ ఎదవాలోచనే ఇది భారత ప్రభుత్వం వారి కాలేజి రా" అని నా ఆత్మారాముడు, మెదడు చెవి మెలెట్టి పాఠం చెప్పాడు. ఇంతలో కొన్ని తెలుగు గొంతుకలు వినవచ్చాయి. "ఇదే రా డిపార్టుమెంటు" అంటూ ఒకడు నన్ను చూసీచూడనట్టు రయ్ మని పరుగెడుతుంటే, మేమూ ఉన్నామన్నట్టు దారికడ్డంగా నిలబడిపోయా. ఒక్క క్షణం ఆగి నన్నుచూసి సీనియరన్న అపోహతో "గుడ్ మార్నిగ్...గుడాఫ్టర్ నూన్ సార్" అనేశాడు. నాకు నవ్వాగలేదుగానీ, బరితెగించి నవ్వేస్తే మన పరిస్తితి మరీ భేజారైపోతుందని, "సారీ బ్రదర్ నేనూ బీఏ ఏడ్ వెతుకుతున్నా" నని మర్యాదగా చెప్పా. ఆ పరుగెత్తినోడి పేరు ‘రమేష్ బాబు’, వాడితో ఉన్నోడి పేరు ‘మొహమ్మద్ బాషా’ ఫ్రమ్ కడప (తను ఊరిపేరు తో సహా అలాగే చెబుతాడు, ఎప్పుడడిగినా) గా పరిచయాలు కానిచ్చేసుకుని డిపార్ట్మెంట్ లోకి ఆడుగు పెట్టాం. వారి ద్వారానే తెలిసిందినాకు ‘బీ ఏ ఎడ్’ డిగ్రీలో ఇక్కడ ఇంగ్లీషు సాహిత్యం (English Literature) మేజరు అని. ఒక్కసారిగా గుండెల్లో కోటి రైళ్ళూ, మా పల్లె బస్సూ(అది కోటి రైళ్ళతో సమానం లెండి) ఇంకా ఏంటేంటో పరుగెత్తేసాయి.


ఇంగ్లీషు మీడియం లో ఎనిమిదో తరగతి నుంచీ చదువు చట్టుబండలు చేసినా, మన ఆంధ్రా గురువుల పుణ్యమా అని ఒక్క వాక్యం ఇంగ్లీషులో ఎప్పుడైనా మాట్లాడి ఉంటే ఒట్టు. ఈ సబ్జక్టు లో (మనకి ఇంగ్లీషు కూడా సబ్జెక్టే మరి) పాసైతే చాలు భగవంతుడా అని పదో తరగతి వరకూ అనుకున్నా, శెలవుల సాయంత్రాలలో మా అన్నయ్య తీసుకెళ్ళే ఇంగ్లీషు సినిమాల దయవల్ల ఈ దొరల భాష అర్థమాయ్యీ కానట్టు కాస్త, అర్థమయ్యే స్థితికి ఇంటర్ కాలానికి వచ్చేసాం. కానీ, ఇంటర్ లో హిస్టరీ,జాగ్రఫీ,ఎకనామిక్స్ ని సాధించి దాదాపు డిస్టింక్షను సంపాదించిన నాకు, ఇంగ్లీషు సాహిత్యం లో మేజరనేసరికీ ఇలాంటి మధురానుభూతి కలగడం సహజమే కదా మరి. "అర్రే ! పదా పదా, ఆఫీసులో టైంటేబుల్ ఇచ్చాండ్రు" అని భాషా కడప యాసలో కూకలేసి లాక్కెళ్ళి టైంటేబులిప్పించాడు. దాంతో పాటూ, ఇంకో అరగంటలో ‘ఇంట్రడక్టరీ’ క్లాసొకటుందని కూడా సమాచారం వచ్చేసింది. అప్పటికే కాబోయే మాక్లాసు వాళ్ళు దాదాపు అందరూ అక్కడ గుమిగూడడం మొదలెట్టారు.


అన్యమనస్కంగా చేతిలోని టైం టెబిల్ మీద దృష్టిసారించిన నాకు, పగలే తారాలోకం కనిపించింది. "రీడింగ్", "పొయెట్రీ", "డ్రామా" అంటూ, నాటకం ప్రతిపై ప్రామ్టింగుకు పెట్టుకునే గుర్తుల్లాగా ఈ సబ్జెక్టుల పేర్లు కనపడ్డాయి. ఇవేమిటో, వీటిల్లో ఏమిచేస్తారో కనీసం ఊహకుకూడా అందలేదు. "పొయట్రీ అంటే పద్యాలు పాడిస్తారేమో, డ్రామా అంటే దాట్లో డ్రామాలాడిస్తారేమో" అని ఏవేవో పిచ్చి పిచ్చి ఆలొచనలు నా పిచ్చి బుర్రలో మెదలసాగాయి. "నిండా మినిగినోడికి చలెందులని" గుంపుతోపాటూ క్లాసులో అడుగుపెట్టి, ఎందుకైనా మంచిదని చివరి బెంచిలో కూర్చున్నా. అసలే టెన్షన్ తో చస్తున్న నా పక్కన ఓ అమ్మాయి వచ్చి కూర్చుంది. "ఇదేమి తెగింపు ఈ ఆడాళ్ళకి? వీళ్ళకి సపరేటు లైన్లో బెంచీలు వెయ్యరా" అని హైరానా పడిపోయి ఒక్కక్షణం ఈ టెన్షన్ తో ఆ టెన్షన్ మర్చిపోయా. ఇంతలో భళ్ళున తలుపు తెరుచుకొని, అప్పుడేపడిన వాన జల్లుల్ని కోటుపైనుండీ తప్పిస్తూ అడుగు పెట్టాడు ఒక శాల్తీ. "గుడ్ మార్నింఘ్ ఎవ్రీబడీ, ఐ యామ్ రఘునాథ్, ప్రొఫెసర్ రఘునాథ్" అని జేమ్స్ బాండ్ స్థాయిలో తన పరిచయం వెళ్ళబుచ్చాడు. ఆ తరువాత తను గంట పర్యంతం చెప్పిన ఒక్క ముక్క ఇంగ్లీషూ నాకు అర్థం కాలేదు. తన హావ భావాల వల్ల తెలిసిందేమిటయ్యా అంటే, తను ఇక్కడ పెద్దపోటుగాడని, రాబోయే కాలంలో అన్నీ తనే అయ్యి మా చదువులు ఉద్దరింఛి మమ్మల్ని చరితార్థుల్ని చేస్తాడని. మిగతా క్లాసువారందరూ, ముఖాలు కిలోమీటరు ప్రసరించే సర్కసుడేరా ఫ్లాష్ లైట్ళలాగా పెట్టుకుని, తలలు గాలికి ఆడే తైలం చెట్లలాగా ఊపేస్తుంటే, నేనుమాత్రం తక్కువా అని ఒక అంగుళం ఎక్కువే ఆడించాను తల. ఈ గంట పాటు జరిగిన భాగోతంలో, నా పక్కన కూర్చున్న అమ్మాయి కనీసం పదిసార్లు నా ముఖం వైపు "అవునుకదా !" అన్నట్టు చూసింది. అసలే పతివ్రతాముండావాడ్నైన నేను, "నాకు నువ్వేమైనా వరసా?" అన్నట్టు ఓ చూఫువిసిరి ఊరుకున్నా. తనకర్థమైనట్టుగా లేదు కామోసు, క్లాసు అయిపోయిన తరువాత కూడా అలాంటి చూపొకటి విసిరి చక్కా పోయింది. "సర్లే రేపు ఇంకోలా చూసి, నా అభిప్రాయాన్ని తెలియజెబుతానని" నేను మనసులొ అనేసుకుని హాస్టలు దారి పట్టా.


భాషా,రమేష్ కూడా నాతో జత కలిసారు. అప్పటిదాకా అణగదోక్కిన నా ఆరాటం అప్పుడు కట్టలు తెంచుకుంది. ఏడవలేదుకానీ, దాదాపు ఏడుపు ముఖంతో నా "ఆంగ్లరానితన్నాన్ని" ఇప్పుడే కలిసిన ఇద్దరు మిత్రులకి చెప్పుకొచ్చా. బాషా నేనార్చేవాడీనీ, తీర్చేవాడినీ కానని తప్పుకున్నా, రమేష్ మాత్రం "నాకు తెలిసిన సీనియరున్నాడు, మాట్ళాడదాం పద"మన్నాడు. తను నన్ను చక్కా వెంటబెట్టుకుని హాస్టాలు లో గదినెంబరు ముప్పై ఐదు ముందు నిల్చోబెట్టాడు. అయ్యో పులినోట్లో తలపెడుతున్నానే అనుకుంటూ పొద్ధున అధికారం చెలాయించిన సీనియరు ముఖారవిందం తలుచుకుని బోనులో కి అడుగు పెట్టా. "క్యా బే" అని ఒక ఘాండ్రింఫువిని గుండెలవిసిపోయాయి. "అన్నా వీడు మా క్లాస్ మేటు, ఇంగ్లీషు రాదని కోర్స్ వదిలి పోతానంటున్నాడు" అని, నా చిట్టా క్లుప్తంగా ఈ యముడి ముందు చదివాడు రమేష్. "కొరత వేస్తాడో, నన్ను చీల్చి కాకులకీ గద్దలకీ వేస్తాడో, లేక ఏకంగా సలసల కాగే నూనెలో వేయిస్తాడొ" ఆని ఎదురుచూసా ఒక్క క్షణం. "జాయినయ్యేముందు తెలీదారా నీకు?" అన్నాడు యముడు. "తెలియదు" అన్నట్టు తలాడించా. "బాయిలా దూకకముందుండాల్రాభయ్ తెలివి, ఇప్పుడేంజేస్తవ్? మళ్ళీ ఊరెల్తవా?" అనడిగాడు, అప్పటిదాకా ఏ నిర్ణయమూ తీసుకోలేదుగనక అవును-కాదు రెండూ కలిసొచ్చేట్టు, ఇండియా మార్కు తల ఊపుడు ఊపేశా. "పోయి ఏంబీకుతవ్ రా? అన్ని కాలేజ్ అడ్మిషన్లూ ఖతమైపోయుంటాయ్", అందుకే మైసూర్ల ఓ సంమస్రం మజా చెయ్, అప్పటికీ చేతగాదంటే అప్పుడు చెక్కెయ్" అన్నాడు. ఆ క్షణం మా నాన్న గుర్తొచ్చాడు ఎందుకో. మళ్ళీ యముడే చెప్పుకొచ్చాడు, "బాయిల పడకుండా ఉండాల్రా భయ్, పడింతర్వాత ఈదడాన్కి ట్రైచెయ్యాలె లేదనుకో మునిగి పోతావ్" అంటూ తన అమూల్యమైన సలహాను చెప్పి, "తోల్కబోరా వీడ్ని" అని రమేష్ కి చెప్పాడు.


గది బయటకి వస్తుండగా మళ్ళీ, "తెలుగన్నా సక్కగా వస్తదిరా నీకు?" అన్నాడు. మొదటి సారిగా నా గొంతు పెగిలింది, "ఆ...చాలా బాగా వచ్చు" అని. "ఐతే మళ్ళీ ఆలోచిస్తావేంరా, తెలుగొచ్చినోడికి ఇంగ్లీష్ కష్టమారా? ఇట్టె వఛ్ఛెస్తుందిరా భయ్" అని స్వగతంలో అనుకున్నట్టుగా చెప్పాడు. కొంత ధైర్యమొచ్చింది. ఇంగ్లీషు సాగరం ఈది చూద్దాం లేకపోతే ఒక సంవత్సరం మైసూర్ మజా చేద్దాం అని నిర్ణయించేసుకుని, రూంనెంబరు 1 వైపు అడుగులేసా.





(చాలా వరకూ నిజం, కోంతవరకూ కల్పన జోడించిన నా కాలేజ్ కథ మొదటి భాగం ఇది)

13 comments:

teresa said...

sharp wit! :)

Anonymous said...

నేను కూడా బిసెంట్ దివ్యజ్ఞాన కళాశాలలో ఇంటరు చదువుతున్నంత రోజులలో వున్నంత కాలం మైసూరు బి.ఎస్సీ.ఎడ్. లో చేరాలని, చేరి అక్కడి 'సౌందర్యా' లను చూడాలని ఎన్నో కలలు కన్నాను. కానీ బ్రహ్మాజీ కి చెయ్యి అదిరి నీ నుదురు ముదురు అని పెద్ద వెదురు తో రాసి ఇంటరులో 'చాలా' మార్కులిచ్చి నా కలలని విలవిల లాడించేశాడు.

చాలా కత్తెర్ల తరువాత లడ్డూ కొండల్లో పడ్డా..

ఓ సలహా: చదవడానికి ఈజీగా టపాని సెజ్(SEZ) లా విడగొట్టండి.

-- విహారి

Kathi Mahesh Kumar said...

తెరెసా గారూ నెనర్లు
విహారిగా రు,ఈ sez కథాకమామిషు చెప్పి పుణ్యం కట్టుకోండి.

దైవానిక said...

బాగుందండి మీ ఇంగ్లీషు గోల. రెండో భాగం ఎప్పుడో?

వ్యాఖ్యలకి word verification తీసేస్తె బాగుంటుంది.

సుజాత వేల్పూరి said...

మీ కాలేజీ మైసూర్లో ఎక్కడుందో నాకు పెద్ద ఐడియా లేదు గానీ, నాకు మాత్రం మైసూరు మహ బాగా నచ్చేసింది. విశాలమైన రోడ్లు(అదీ ట్రాఫిక్ లేకుండా), విశాలమైన పార్కులు, విశాలమైన రాజ మహలు, 'విశాలమైన ' మహరాజా వారు, కొండ మీద చాముండి, అన్నింటినీ మించి సిల్క్ ఫాక్టరీలో మైసూరు సిల్కు చీరెలు!అందమైన ఊరు.

"తెలుగొచ్చినోడికి ఇంగ్లీష్ కష్టమారా..?" బాగుంది!

Kathi Mahesh Kumar said...

సుజాత గారు, మా కాలేజి ‘మానసగంగోత్రి’(మైసూర్ యూనివర్సిటీ)క్యాంపస్ పక్కనే. అదొక భూతల స్వర్గం లెండి. మరిన్ని వివరాలు తరువాయి భాగం "కాలేజీ లో క్లాసులు" లో వివరిస్తాను.

ఆలోచనలని కాకుండా జ్ఞాపకాలకి కొంత కల్పనని జోడించి కథ కాకపోయినా ‘కథలాగా’ ప్రయత్నిస్తున్నా.

మంజుల said...

చాలా బాగా రాశారు. కనీసం పది భాగాలైనా లేకపోతే ఒప్పుకునేది లేదు. నాకేదో శేఖర్ కమ్ముల తరహా లో సినిమా తియ్యొచ్చు అనిపిస్తుంది. మీ నారేషన్ చూస్తుంటే.

vasantam said...

!!!

అలేఖ్య said...

చాలా బాగుందండి. రెండో భాగం కొంచెం తొందరగా విడిదలచేద్దురూ...

Naveen Garla said...

నేను BT కాలేజీలో BSc అప్లికేషనైతే తీసుకున్నా కానీ..అందులో చేరలేదు. మీ కాలేజీ కథ చదువుతూంటే నా కాలేజీ జీవితం గుర్తొచ్చింది. ఒక వేళ ఆ జీవితాన్ని ఎప్పుడైనే బ్లాగితే దానికి కారణం ఈ టపానే ఔతుంది :)

కొత్త పాళీ said...

ఐతే మీకు అర్జంటుగా వూకదంపుడు గారి "ఇంగ్లీషు యూ లివ్ లాంగా" కోర్సులు రుచి చూపించాలి.

"పతివ్రతా ముండావాణ్ణి" - fantastic .. కన్యల పాతివ్రత్యం, బ్రహ్మచారుల సతీవ్రత్యం గురించి కొకు తన కథల్లో బాగా ఏకుతూ వుండేవారు.

Niranjan Pulipati said...

Mahesh, e navodaya lo chadivaru ? HorsleyHills ? Which batch? I belong to First batch '87

పక్కింటబ్బాయి(మా పక్కింటోళ్లకి) said...

అదిరిందండి మీ స్టోరీ,నరేషన్
అదేంటో విచిత్రంగా వెనుక నుంచి ముందుకు చదువుకొచ్చా(దీన్నే ప్రీక్లైమాక్స్ టెక్నిక్ అంటారని మా ఫ్రెండ్ చెప్పాడు)
అద్భుతంగా ఉంది
ముందేం జరిగుంటుందన్న చిత్రమైన క్యూరియాసిటీతో చచ్చా
ఈ పద్ధతిలో సినిమాలేమైనా ఉంటే చెప్పండి చూస్తా(వెనుక నుంచి ముందుకు)
--సంతోష్ సూరంపుడి