“దేవదాసు” కు దాస్యం చేసి, “మల్లీశ్వరి” ని రాణి ని చేసి, “సాహసం సేయరా ఢింభకా…రాకుమారి దక్కుతుందని” (పాతాలభైరవి) ప్రేమని ప్రోత్సహించిన తాతయ్య,బామ్మ ల తరం ఒకటైతే, “మేఘసందేశా”న్ని మధించి “ప్రేమాభిషేకా”న్ని పొంగించిన నాన్నలు,అమ్మల తరం మరోటి. కానీ,ఈ రెండు జనరేషన్లూ ప్రేమకు వ్యతిరెకమే.మళ్ళీ ఏమైనా ఆంటే “ఈకాలం సినిమాలున్నాయి చూసారూ…ఇవి పిల్లల్ని చెడగొట్టేస్తున్నాయి” అంటూ రాగాలు పోవడం పరిపాటి. నిజంగా సినిమాలు అంత మహత్తును కల్గి ఉంటాయా? మానవ సంభంధాలను అదీ ముఖ్యంగా ప్రేమను నిర్వచించి,ప్రోత్సహించే శక్తి సినిమాకు ఉందా? అనేవి చరిత్రకు అందని, విమర్శకులకు తోచని,(నాలాంటి)సామాన్య మానవులకు అర్థం కాని విషయం. అందుకే ఈ వ్యాసం ద్వారా ఈ వైరుధ్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తునాను.
“గీతాంజలి” సినిమా తరం వాడినైన నేను, ఆ మధ్య (సెంట్రల్ యూనివర్సిటీ,హైదరాబాదు లో ఉండగా) “చిత్రం” సినిమా చూడటం జరిగింది. అదీ, హైదరాబాదు KPHB colony లోఉన్న ఒక థిఏటరులొ. ఈ కాలనీ విశేషం ఏంటంటే, ఇక్కడ మనకు తెలిసిన ఆంధ్రదేశం లోని అన్ని కోచింగ్ సెంటర్లూ ఉన్నాయి. టూకీగా చెప్పాలంటే, ప్రేమించే వయసు, అర్హత,అవసరం అన్నీ ఉన్న జనాభా పుష్కలంగా ఉన్న ప్రదేశమన్నమాట. ఈ ’చిత్రం’ అనే చిత్రాన్ని చూసిన నేను, కాస్త చిత్రమైన ఇబ్బందికి గురైనమాట వాస్తవం. టీనేజర్ల “సెక్స్పరిమెంటు”, దాని ద్వారా దాపురించిన “కన్యా గర్భాన్ని” ( teen pregnancy) ని రొమాన్టిక్ ప్రేమగా చాలా గొప్పగా “తేజ” మభ్యపెట్టాడు. ఆ తరువాతి నెలల్లో మీడియా, మహిళా నంస్థలు తీవ్రస్థాయిలో ఈ సినిమాపట్ల విభేదించి, వ్యతిరేకించి, ధర్నాలు చేసి ఒక గొప్ప ’హిట్’ గా నిలబెట్టారు.
ఈ పరిస్థితుల్లో నేనుకూడా “ఛ్చట్! ఈ సినిమాలు నిజంగా యువతని తప్పుదోవ పట్టిస్తున్నాయ”ని గర్హించి, పదిమందినీ పిలిచి చర్చించి రెండు రాళ్ళు నేనూ విసిరి, చేతులు దులుపుకున్నా. కానీ, ఎక్కడో మనసులో ఏదో కాస్తవెలితి అలాగే ఉండిపోయింది. అసలే “Understanding Cinema” ని సిలబస్సుగా చదువుతున్న ఈ మెట్ట బుర్ర కి ఈ సినిమా-ప్రేమ ల ఆర్గ్యుమెంటు లో ఎంత పసవుందో స్వయంగా తెలుసుకుందామనే ఆలోచన తట్టింది. ఆలోచనైతే వచ్చిందిగానీ, ఆచరణ ఎలాగో తెలియరాలేదు. అందుకె నా “పరిశోధన”ని రెండు భాగాలుగా విభజించా, ఒకటి: నా మరియు ఇతర మిత్రుల స్వీయజీవితాలలోని ప్రేమ ప్రసంగాలలో (ముఖ్యంగా టీనేజి వయస్సులోని పిచ్చి ఆలోచనలలో) సినిమాల ప్రభావాన్ని గురించి చర్చ. రెండు:మళ్ళీ సినిమాను దర్శించి ప్రదర్శనకు వచ్చే ప్రేక్షకుల profiling, వీలైతే ఆ వయసు వారితో చర్చ.
మొదటి భాగం చాలా సులభంగా నెరవేర్చగలిగాను. అందులో నాకు కలిగిన ఙానోదయం ఇంతాఅంతా కాదని చెప్పవచ్చు. మా మిత్రులంతా తేల్చిచెప్పిన నిజాలేమిటంటే …”ప్రేమించాలి అని వయస్సు అనిపింపజేస్తే, ఎలాంటి అమ్మయి అనేది అమ్మాయి రంగు,అందుబాటులో ఉన్న పరిధి నిర్ణైయించేవి” ఇంకా, “ప్రేమను మానసిక మరియు శారీరక అవసరాలెతప్ప సినిమాలు నేర్పించలేదు కానీ, అమ్మాయిల దృష్టిని తమ వైపు ఆకర్షించడానికి మాత్రం సినిమాలో చూపించే వెకిలిచేష్టలను (అవి వెకిలిచేష్టలని తెలిసీ…వేరే విధంగా communicate చేసే అవకాశం లేక) అనుకరించటం జరిగేది” అని. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, “ప్రేమ” perse సినిమాల product కాదుగానీ దాని physical manifestations (వెకిలినవ్వులు,కోతి చేష్టలు) మాత్రం సినిమా guided అని తేలింది, అందునా వేరే భావప్రకటనాపద్దతులు (alternate mainstream expression patterns) లేక మాత్రమే.
రెండో అంకం కోసం, విజయవంతంగా వందరోజుల వైపు పరుగులిడుతున్న’చిత్రా’న్ని చూడటానికి సినిమా ధియేటర్ కి చేరుకున్ననాకు ఒక్కచూపులోనే audience profile అర్థమైపోయింది. 90% ప్రేక్షకులు పదవతరగతి నుంచి డిగ్రీ చదివే అమ్మాయిలు , అబ్బాయిలు అదీ దాదాపు గుంపులో జంటలుగా (పదిమంది అమ్మాయిలు, పదిమంది అబ్బాయిలు ఒక గుంపుగా అని చెప్పుకోవచ్చు). ఇది ఏవిధమైన “ట్రెండో”? ఈ విపరీతానికి కారణం ఏమిటో? నాజుట్టు నా స్నేహితుల జుట్టూ పట్టుకు లాగినా సమాధానం రాదని ఖచ్చితంగా తెలిసిపొయింది. ఈ పజిల్ ని విడమర్చి నా ఉత్సుకతకి ఆనకట్ట వేసే “ప్రొఫయిల్” గాడి కోసం నేను సాగించిన వేటలో EMCET coaching కోసం హైదరాబాద్ లో ఉన్న మా దోస్త్ తమ్ముడు పడ్డాడు. వాడ్ని వలేసిపట్టుకుని, నా ప్రయోగానికి గిన్నీపిగ్ ని చేసేశా.
కాస్త బుజ్జగించి, బతిమాలి,భయపెట్టిన పిదప కర్నూలు యాసలో కాస్తంత “సంస్కృతం” కలిపిన భాషలో వాడు చేసిన జ్ఞానోపదేశం నా చెవిలో ఇంకా చక్కర్లు కొడుతోంది. తను చెప్పిన విషయాల సారాన్ని ఆమోదయోగ్యమైన భాషలో కాస్త అందాలు అద్ది ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. “బ్లాక్ అండ్ వైట్ సినిమాలలో ప్రేమ పేరుతో జరిగే అమలిన శృంగారం మాకు అర్థరహితం. ఈస్ట్మన్ కలర్ లో అమ్మాయిలని ఏడిపించి పాటలతో ప్రేమలో పడవేయటం మూర్ఖత్వం. కలర్ సినిమాలలోని కాస్త మంచితనం,కాస్త సాహసం అన్నీ కలిపిన ’రాముడు మంచి బాలుడిని’ మాత్రమే అమ్మాయిల్ని ఆకర్షిస్తారనటం అప్రస్తుతం. అన్నయ్యా! మాది సినిమాస్కోపు జీవితాలు,DTS ప్రేమలు. ప్రేమ గురించి పుట్టగానే మాకుతెలుసు, “ప్రేమ అనేది మనసు,వయసు ఎదిగిన తరుణం లో opposite sex తోడు కావాలనుకోవడమే” అని నిర్వచించేసాడు “ఇంకా కావాలంటే ఈ సినిమావాళ్ళకి మేము నేర్పిస్తాం” అన్నాడు. ఇందుకు కొనసాగింపుగా చెబుతూ, “సాధారణమైన ప్రేమను రహస్యంగానైనా అనుభవించే అవకాశం సొంతఊరికి దూరంగా ఉన్న నాకుకలిగింది…ఇలాంటి ప్రేమలకు పర్యవసానం పెళ్ళేమో అనిమాత్రమే ఈ పెద్దలు హడలిచస్తున్నారేగాని లేకపోతే అసలు ఈ చర్చే అప్రస్తుతమయ్యెది” అని ఆరిందాలా ఈ బుడతడు చెబుతుంటే, నోరెళ్ళబెట్టి వినడం నా వంతైంది.
కాస్త తెమురుకుని మళ్ళీ “చిత్రం” సినిమావైపుకి దృష్టిసారించా. అసలు ఈ సినిమాలో మీ ఏజి వాళ్ళను ఆకర్షించిన విషయవస్తువు ఏమిటి? అమ్మాయిలు,అబ్బాయిలు ఈ చిత్రాన్ని గుంపులు గుంపులుగా చూసి ఆనందించడం లో ఉన్నతాత్పర్యం ఏమిటని? కాస్త సూటిగా ప్రశ్నలు సారించా (ఓపన్ గా చర్చిస్తే, నా బుర్రని మళ్ళి వాయించేస్తాడని భయం కూడా కలిగింది సుమండీ!!!). నా ప్రశ్నలకు తను చెప్పిన సమాధానాలు ఇంతకు మునుపు ఆశ్చర్యం కలిగిస్తే, ఈసారి కుర్రాడి పట్ల గౌరవాన్ని కలిగించాయి. తను అంటాడు, “మాకోసమంటూ ఇంతవరకూ సినిమా తీసినవాడులేడు, అలాగని ఇదేదో మాజీవితాలకు అద్దం పట్టిందనికూడాకాదు కానీ కాస్త desired thrill నిమాత్రం ఖచ్చితంగా ఇచ్చింది. ఇక గుంపులుగా చూడటం అంటావా, అదొక కుతి (guilty pleasure) అంతే” అని సిద్ధాంతీకరించేసాడు.
నా పరిశోధన ఏ కొలిక్కి వచ్చిందో తెలియదుగానీ, ఒక్క విషయం మాత్రం అర్థమయ్యింది. రుగ్మతని మనలో పెట్టుకుని, లక్షణాన్ని తెగుడుతున్నామని. వయసుకు,మనసుకు సర్వసాధారణమైన ప్రేమని ఒక పాపంగా,నేరంగా,చెప్పుకోనే అవకాశం లేని నీచ వస్తువుగా అంటరానిదాన్ని చేసి “అగ్ని” ని సృష్టించి ఈ మన సమాజం “ఆజ్యం” పోస్తున్నదని సినిమాని బలిపశువుని చేయడం ఎంతవరకూ సమంజసం అన్నది million dollar question. సినిమా తప్పు లేదని చెప్పడం నా ఉద్దేశం ఏ మాత్రం కాదు, కాని ప్రేమను గౌరవప్రదంగా వ్యక్త పరచే భాషని సంస్కృతిలో భాగం కాకుండా చేస్తున్న మనతీరుని ప్రశ్నించడం యొక్క అవసరాన్ని ఏత్తిచూపడం నా ఆశయం. ఇలా చేస్తూ మరిన్ని సామాజిక రుగ్మతల్ని సృష్టిస్తున్నామేమో అన్నది నా భయం, “చిత్రం” సినిమా ఎంత ప్రమాదకరమో ఆ చిత్రాన్ని సూపర్ హిట్ చేసిన మన సమాజ పరిస్థితులు కూడా అంతే ప్రమాదకరమేమో ఆలోచించుదాం.
P.S.: పై వ్యాసం లో gender perspective లేకపోవడాన్ని పెద్ద లోపంగా భావిస్తున్నాను. అమ్మాయిల point of view ఈ వ్యాసానికి మరింత కొత్త అర్ధాలను తెచ్చిఉన్డేదేమో!
0 comments:
Post a Comment