Monday, May 12, 2008

ఆలోచనలు Vs/& భావాలు


ఈ రెండు రోజుల్లో కథల గురించి, వాటిని రాయడం గురించి కొంత చర్చ జరిగింది. నేను కూడా కథ రాయటం లోని మానసిక శ్రమని, తెలియనితనాన్నీ కొంత అనుభవించాను (మొదటి కథ ని కూడా ‘డెలివరీ’ చేశేసా). నా మిత్రుడి ప్రోద్బలంతో ఈ సాహసం చేసినా, కథకుడికి కావలసిన భావవ్యక్తీకరణ బహుశా నాకు లేవని, కేవలం వ్యాసకర్తగా మాత్రమే ఉండగలనని సదా నమ్మినవాడ్నినేను. ఈ నా నమ్మకం నాకు కలిగిన తంతు గురించి కాస్త ఆలోచించా,దాన్ని ఇక్కడ పంచుకుందామని రాస్తున్నా.

"సమస్య గురించి చింతించడం కన్నా,ఆలోచించడం మిన్న" అని చిన్నప్పుడు ఎక్కడో చదివా. దీని అర్థమేమంటే, సమస్య గురించి చింతిస్తూ అంతర్ముఖుడై బాధపడటం కన్నా, సమస్య తీరే తీరును ‘లాజికల్ డిడక్షన్’ పద్ధతిలో ఆలోచించి దాన్నుండీ బయటపడటం. ఈ సలహా ప్రభావం నాపై చాలా ఉండేది. టీనేజి వయసుకొచ్చేసరికి ఆ వయసు సమస్యలకి (ఈ వయసులో సమస్యలేముంటాయి? అనేవారు యవ్వనాన్ని అనుభవించలేదని అర్థం) ఇలా ఆలోచించి సమాధానం రాబట్టి, (వేరే దారి లేక) సముదాయించేసుకునే వాడిని. ఈ ఆలోచనలు ఎలా ఉండేవంటే, " ఆ అమ్మాయి బాగుంది, ప్రేమించాలి" అన్న భావన కలిగిన వెంఠనే నా ‘లాజిక్’ పనిచేసేది. " ఆ...బాగుంటే మాత్రం ఏమిటి, మాట్లాడటం ఎలాగూ కుదరదు కదా! ఒకవేళ మాట్లాడినా, పెన్ అడగడంతప్ప అంతకుమించి మాట్లాడే అవకాశం రాదుకదా! ఒకవేళ మాట్లాడినా మన దగ్గర ఇంప్రెస్ చెయ్యదగ్గ గొప్ప విషయాలు ఏమున్నాయ్! ఉన్నా తను ప్రేమిస్తుందా! ఇవన్నీ జరిగే విషయాలు కావు గనక, చాప్టర్ మూసెయ్" అని ‘దాన వీర శూర కర్ణ’ సినిమాలొ ధుర్యోధనుడి డయలాగుల్లా మెదడులో మోగేవి. అంటే, భావాల్ని ఆలోచనలతో సముదాయించి జోకొ్ట్టేవన్న మాట. ఈ జోకొట్టడం కాస్తా వయసుతో పాటూ పెరిగి, కొంత భాషని కూడా దాంట్లో కలుపుకొని రాటుదేలిపోయాయి.

ఈ క్రమంగా నా జీవితంలోని ప్రతి వెధవ విషయాన్నీ అనుభవించక, ఆలోచించి దాని అంతుచూడడం అలవాటుగా ఏర్పడిపోయింది. అందుకే నేను అనుభవాల్ని పంచుకోవాలన్నా, నా ఆలోచనలే అక్షర రూపం దాలుస్తాయిగానీ భావాలు దొర్లిపడవు. అంటే నేను మరీ బండరాతినో, ఫీలింగులేని పిపీలకాన్నో అనికాదు. కేవలం భావవ్యక్తీకరణ విషయం లో సరైన భాష లేని వికలాంగుడిని మాత్రమే. ఉదాహరణకు ఒక వేళ ప్రేమిస్తే ఎందుకు ప్రేమించానో చెప్పగలనుగానీ, ప్రేమని వ్యక్తపరచాలంటే మాత్రం కోంచం కష్టమన్నమాట.
నా లాంటి భావవ్యక్తీకరణా వైకల్యం చాలా మందిలో ఉండొచ్చేమో!

ముఖ్యంగా చెప్పదల్చుకున్నది ఏంటంటే, కవితలూ కథలు రాశేవారు బహుశా తమ ‘విషయాలని’ మనసులోంచి తీస్తే నాలాంటి (వ్యాసాలు,సమీక్షలు రాశే) వారు మెదడులోంచి తీస్తారు అని. ఇక్కడ ఏది గొప్ప అని ఎవరైనా అడిగితే, మనసే అని చెబుతాను. ఎందుకటే, ఆలోచనని తెలియజెప్పడం కన్నా, హృదయాన్ని ఆవిష్కరించడానికి భావాలు తెలియజెప్పే భాషతో పాటు అనుభవించే మనసూ కావాలి. అది మనకు కొంచం తక్కువన్నమాట.

ఏదిఏమైనా ఈ రెండురకాల రచనలూ హాయిగా కో-ఎగ్జిస్ట్ అవ్వచ్చన్నమాట. కానీ ఒక్కటి మాత్రం ముఖ్యం, ఈ రెండు విధాలూ మనిషికి అల్టిమేట్ గా ఆనందాన్నిస్తేనే సార్థకం. లేకుంటే వ్యర్థం.

4 comments:

కొత్త పాళీ said...

interesting ideas.
దీన్ని గురించి మనసు పెట్టి ఆలోచించాల్సిందే :-)

S said...

మరి రెండూ రాసేసే వాళ్ళూ? :)
బాగా రాస్తున్నారు కదండీ...ఎందుకు రాయలేరనుకుంటున్నారు కథని...రాసి చూడండి...లాజికల్ థింకర్ కథ అని పేరు పెడదాం మనం.. :) కామెడీ కథ బాగా రాయగలరేమో మీరు అనిపిస్తోంది నాకు....

Kathi Mahesh Kumar said...

రెండూ రాసేవాళ్ళు కమర్షియల్ రచయితలైపోతారనుకుంటా సౌమ్యగారూ.మనం అలాక్కాదుగాబట్టి పరిధి నిర్ణయించుకోవడం పరవాలేదనుకుంటా.అయినా ప్రయత్నించడం ప్రారంభించా. ఇక కావల్సింది మీ లాంటివారి ఆశీర్వాదం, ప్రోత్సాహం. అవి మెండుగా ఉంటాయని ఆశిస్తా.

RG said...

నాది కూడా ఇంచుమించు ఇలాంటి మానసికస్థితే మాష్టారూ, అనుభవించడంకన్నా ఆలోచించడం ఎక్కువ...ఈ విషయం అర్థమయ్యేసరికి ... It was too late