"ఈవెనింగ్ వాక్ లో స్నేహాలూ, ప్రేమలూ"
స్నేహాలూ, ప్రేమల గురించి మనం ఏర్పరుచుకున్న గొప్ప అపోహలు తొలగే సరికీ, మనసు కాస్త నెమ్మదించినా,వయసుకి మాత్రం ఇవేవీ అంతగా నచ్చినట్టు గా కనిపించలేదు. అదే తరుణంలో ప్రభుదేవా నటించిన"కాదలన్" అనే సినిమా (తెలుగులో ప్రేమికుడు) రిలీజైంది. కొత్తగా పుడుతున్న పరిచయాలూ,స్నేహాలూ, "మనమంతా ఒకటి" అన్న కామ్రాడరీ ఇవ్వన్నీ కలిపి, మా క్లాసుమొత్తాన్నీ ఒక జట్టు గా ఈ సినిమా చూడ్డానికి బయల్దేరదీశాయి. టికెట్టు కోసం లైన్లో నిలుచుకుని ఇలా ప్రతి సినిమా కలసికట్టుగా చూడాలని నిర్ణయాలు తీసేశాం,ప్రమాణాలు చేసేశాం. నేనే కోరుకున్నానో, తనే ప్రయత్నించిందో తెలియదు కానీ, అంబిలి మాత్రం నా పక్కన సీట్లోకి చేరింది. ఇక సినిమా లో నగ్మా ఉన్న చోటంతా అంబిలి కనపడి, నన్ను నేను ప్రభుదేవా అనేసుకుని, మళ్ళీ ఏవేవో పిచ్చి కలలూ,ఊహలూ. "ఇల్లాగైతే మనం దేవదాసే కావాల్సొస్తుంద"ని మన ఆత్మారాముణ్ణి హాజరుపరచి, మనసులొనే చర్చ మొదలెట్టాం. మనకన్నా వీడు కాస్త లాజిక్కుల పుట్ట గనక, ఓ విరుగుడులేని తర్కం వెలగబెట్టాడు. "అసలు ఆంధ్రాలో ప్రేమించి ఉంటే ఏంచేసే వాడివి? ఆ అమ్మాయిని దూరం నుంచీ చూసే వాడివి, ముసిముసిగా నవ్వేవాడివి, ఆ అమ్మాయికీ నచ్చితే తనూ నవ్వేది. అప్పుడప్పుడూ విరిగిపోయిన పెన్ను గురించో, సినిమాలో చిరంజీవేసిన స్టెప్పు గురించో మాట్లాడి ఆనందించే వాడివి. మహా ఐతే చాటుగా ఎవరూ చూడని సినిమా కి వెళ్ళే వాడివి. అంతకుమించిన విషయాలు ఇంకేవీ జరిగేవీ కాదు, అయ్యేవీ కావు. మరి ఇవ్వన్ని, ఇంతకంటే ఎక్కువ బాహాటం గా స్నేహం పేరుతో స్వేచ్చగా జరుగుతుంటే, ప్రేమా, పిచ్చీ అవసరమా?" అని. ఇదేదో వినడానికి చాలా బాగుందనిపించి పిచ్చి ఆలోచనల్ని కట్టిపెట్టి, కేవలం ఆ అమ్మాయి తోడుని అనుభవించి, ఆనందించా.
ఇకపై మనసులో ఏ కల్మషాలూ లేనివాడనై, రెట్టించిన ఉత్సాహంతో అంబిలి తో నా ‘ఈవెనింగ్ వాక్’ ప్రస్థానాన్ని ముందుకు సాగించా. ఇలా రోజులు గడుస్తుండగా, మళ్ళీ ఒక సారి, నేను అంబిలి ని పిలిస్తే వసుమతి దయతలచింది. రావడం రావడం సీరియస్ గా మొఖం పెట్టుకుని, "నేన్నీతో అర్జంటుగా మాట్టాడాలి" అంది. దానికేం భాగ్యం "రేపు క్లాసులో మాట్లాడేసుకుందాం!" అన్నా. దీనికి తను "నో దిసీజ్ అర్జంట్ అండ్ దిసీజ్ అబౌట్ అంబిలి", అనగానే నేను కొంత కీడుని శంకించి తనతో మారు మాట్టాడకుండా బయల్దేరదీసా. తను నాతో చర్చించిన సారాంశం ఏమిటంటే, ఇలా "నేను ప్రతిరోజూ చేస్తున్న దండయాత్ర, అంబిలి పవిత్రమైన ఇమేజికోటని కూలుస్తోంది" అని. ఒక్క క్షణం నా చుట్టూ చూసా, దాదాపు యాభై అరవై జంటలు రోడ్డుమీద ‘వాక్’ చేస్తుంటే మరో ముప్పైదాకా స్టోన్ బెంచీలమీద స్నేహాన్నీ,ప్రేమనీ వెలగబెడుతున్నారు. "మరి వీరందరిలో లేనితప్పు నాలో ఏమిటా?" అనుకున్నా. ఇదేమాట తనతోనూ అన్నా. దీనికి నీకు తెలియదు "హాస్టలంతా మీగురించే చర్చలు" అంది. "మీ హాస్టల్ అమ్మాయిలందరికీ మరేం పనులు లేవా, మా గురించి మాత్రమే మాట్టాడు కోవడానికీ?" అని తీవ్రంగా ప్రశ్నించేసా. తమ చదువులూ, తమ జీవితాలూ, తమ బాయ్ ఫ్రెండ్సూ ఇలా ప్రతి పిల్లకీ కావలసినన్ని విషయాలు ఆలోచించుకొనేవి ఉంటే, వాటన్నింటిని గాలికొదిలి మాజీవితాల్ని ఉద్దరించడాని కి వీళ్ళ హాస్టలమ్మాయిలందరూ కంకణం కట్టుకోవడం, నా చిన్న ఆలోచనలున్న మెట్ట బుర్రకైతే ఒక పట్టాన అర్థంకాలేదు. ఈ విషయాన్నే తనతో చెప్పి చెప్పిచూశా. ఎంతకీ వినదే! ఇలాక్కాదని వెళ్ళిఅంబిలిని పిలవమని గదమాయించా. నాతో వాదించే ఓపిక నశించింది కాబోలు, వెళ్ళి అంబిలిని పిల్చుకు వచ్చింది.
రావడం రావడం అంబిలి, నాతో చక్కా వాక్ కు బయల్దేరింది. అసలే ఆవేశం లో ఉన్న నేను అక్కడే నిలబడి అడిగెయ్యలనుకున్నా, కావాల్సింది దొరికిన మారాం చేసే పిల్లాడికిమల్లే శాంతించి తన వెంట బయల్దేరా. కొంటసేపు మాటల్లేకుండా నడిచిన తరువాత నేనే ఉండ బట్టలేక, "వై ఈజ్ వసుమతి టాకింగ్ లైక్ దిస్?" అన్నా, దీనికి తను "డుయు రియల్లీ వాంట్ టు డిస్కస్ దిస్?" అంది. ఒక్క సారి ఖంగుతిన్నా, ఈ రోజు ఈ విషయమేమిటో తేల్చేద్దామని. "వైనాట్" అన్నా. సరే ఐతే విషయం చెబుతాను విను అని, వసుమతి ఎవరో సీనియర్లు మా గురించి మాట్లాడుకుంటుంటే విన్నదనీ, తనకు బాధకలిగి ఈ విషయం తనతో కూడా చెప్పిందని, నాతోకూడా చెప్పి నా తప్పుని తెలియజెప్పే బాధ్యత తీసుకుని ఇలా వచ్చి మాట్టాడిందని, చెప్పుకొచ్చింది. "ఐతే దీనికి నువ్వేమంటావ్" అన్నాఒక వంతు అనుమానంతో, ఆ అమ్మాయి నన్ను ఒక్క క్షణం చూసి, "నేను ఏమైనా అనేదానినైతే ఖచ్చితం అనేదానిని, అనడానికి ఏమీ లేదు గనకనే నీతో వాకింగ్ కి వచ్చా" నంది. తన భావాల్నీ, ఆలొచనా సరళినీ, తన ‘డొంట్ కేర్’ విధానానీ ఈ ఒక్క వాక్యం లో తను చెప్పిన తీరుచూసి, జీవతం లో ఒక అమూల్యమైన పాఠం నేర్చుకున్నట్టుగా అనిపించింది. దీనితో పాటూ వసుమతి ప్రవర్తించిన తీరు వలన మనుషుల్లో కొందరు ఇలా ఎందుకు ప్రవర్తిస్తారో తెలిసినట్టైంది. వసుమతి లాంటివారు మన సమాజంలో కొందరు అందరికీ సుపరిచితులే. వీరు సమాజపు విలువలని భుజాలకెత్తుకుని మోస్తూఉంటారు, ఎవరైనా వారి విలువలని కాదని దారి తప్పినట్టనిపిస్తే, సమాజమనే బూచిని చూపించి, దేవదూతల్లాగా రక్షించే ప్రయత్నం చేస్తారు. వీరికి అదో వృత్తి, సమాజం లోని విలువలకు అనవసరంగా ప్రాతినిధ్యం వహించి, యువతను కాపాడేస్తూ ఉంటారు. వీరి అవసరం ఎవరికీలేదని వీరెప్పటికీ గ్రహించరు.
ఇలా నా ప్రేమకాని ప్రేమ, స్నేహం గా మారి కాలేజీ ఈవెనింగ్ వాక్ లలో తడిసి ముద్దైంది. తరువాతి రోజుల్లో కొన్ని మనస్పర్థలు కలిగినా, ఈ ఒక్క క్షణం లో తనపై కలిగిన అపారమైన గౌరవం ముందు, అవన్నీ బలాదూర్. ఇలా అంబిలితో నా మొదటి సంవత్సరపు ఆకర్షణ, ప్రేమా స్నేహం గా మారి, నన్ను మనిషిగా కొన్ని మెట్లెక్కించిందని మాత్రం ఖచ్చితంగా చెప్పలేనుగానీ. అమ్మాయి దూరం గా చూసి నవ్వితేనే ప్రేమ అనుకునే మూర్ఖత్వం నుంచీ, తాకితేనే స్వర్గం అనుకునే చపలత్వం నుంచీ మాత్రం కొంత ఎదిగానని చెప్పొచ్చు. ఇలా నా ‘ఈవెనింగ్ వాక్’ ల కల గుర్తుంఛుకునే స్నేహం గా మారినా, "‘స్టోన్ బెంచిల’ కోరిక అలాగే మిగిలిపోయింద"నుకొంటూ, కాలేజి జీవితాన్ని అనుభవింఛసాగాను.
(కాలేజిలో భారతీయ సినిమాతో నా పరిచయం "సినిమా తందనాలు" అనే తరువాయి భాగం లో)
7 comments:
వసుమతి మనస్తత్వాన్ని సరిగ్గా విశ్లేషించారు.ఇంకా మీరు స్నేహితుల నుండి నేర్చుకున్న పాఠాలు అన్నీ వీలైనంతవరకూ రాయండి.
అరె ఈ ఎపిసోడులో కామెడీ తగ్గిందే!?
అయిన కొన్ని మంచి విషయాలని(ముఖ్యంగా అమ్మాయిలగురించి వారి మనస్తత్వాల గురించి) తెలుసుకున్నరుగా.
తరువాయి బాగం 4.3 లేక 5 ... కోసం ఎదురుచూస్తుంటాము.
ayya idi katha kademo,serial emo? aina chala chakkati vshleshanalatho raasthunnaru.konasaaginchandi
పెద్ద పెద్ద టపాలువున్నాయని తరువాత చదువుదామని పక్కకు పెట్టేసా.ఈ రోజే చదివాను అన్ని భాగాలూ.నేరేషన్ చాలా బాగుందండి.గిలిగింతలు పెడుతూ వుంది.ఇదేరకం గా మీరు వంద భాగాలు రాసినా చదవడానికి నేను రెడీ.కాపీరైట్స్ తీసుకోండి.
అప్పుడప్పుడు నేను,మా గేంగు వసుమతిలాగే ప్రవర్తించేవాళ్లం.ముందు క్షణం వరకు మేము చేసిందని తప్పని ఎప్పుడూ అనుకోలేదు.కానీ ఇప్పుడు ఆలోచనలో పడ్డాను.
అందరికీ నెనర్లు,
@వాసు గారు innocence is bliss అన్నట్లు అమ్మయకంగా ఉన్నప్పుడు జీవితం కామెడీయే సార్..కానీ ఆ తరువాత కథ ఇలాగే ఉంటుంది,చాలా మంది జీవితాల్లాగే మనదీను!!.
@రాధిక గారు,కనీసం మీరు గ్రహించారు, చాలామంది ఇంకా ప్రజల్ని ప్రేమనుంచీ కాపాడుతూనే ఉన్నారు. వంద భాగాలు కాకున్నా, పది వరకూ ఇప్పటికే మెదడులో ఉన్నాయ్.
"మన సమాజంలో కొందరు అందరికీ సుపరిచితులే. వీరు సమాజపు విలువలని భుజాలకెత్తుకుని మోస్తూఉంటారు, ఎవరైనా వారి విలువలని కాదని దారి తప్పినట్టనిపిస్తే, సమాజమనే బూచిని చూపించి, దేవదూతల్లాగా రక్షించే ప్రయత్నం చేస్తారు. వీరికి అదో వృత్తి, సమాజం లోని విలువలకు అనవసరంగా ప్రాతినిధ్యం వహించి, యువతను కాపాడేస్తూ ఉంటారు. వీరి అవసరం ఎవరికీలేదని వీరెప్పటికీ గ్రహించరు."
Good observation.
చక్కగా రాశారు సార్ అమ్మాయిల మనస్తత్వాన్ని.ముఖ్యంగా వసుమతి క్యారెక్టర్ని ఇంకా విస్తరించి ఓ సినిమాకి మంచి క్యారెక్టర్ గా వాడుకోవచ్చు.
Post a Comment