Tuesday, May 13, 2008

నా కాలేజీ కథ - Part 2

"ర్యాగింగ్ లో రాగాలు"
ఆ సీనియర్ చెప్పిన మాటలతో గుండెల్లో కొంత ధైర్య వచ్చినా, దాని మోతాదు ఇంగ్లీషు సాగరాన్ని ఈదటానికి సరిపోతోంది గాని ఈ ర్యాగింగ్ భూతాన్ని నా గుండెలోంచి వెళ్ళగొట్టడానికి చాలట్లేదు. సరే విషయాన్ని పక్కదారి పట్టించైనా కాస్త కుదుట పడదామని, "ఈ సీనియరు పేరేంటి? రమేష్!" అన్నా, పక్కనే నడుస్తున్న రమేష్ ని ఉద్దేసించి. "ర్యాగింగ్ టైమ్ లో సీనియర్లు తమ పేర్లు చెప్పరు బాబూ, ఇక నేను చెబితే నా పీకమీదకొస్తుంది " అని మళ్ళీ ర్యాగింగుని గుర్తుచేసాడు. "హమ్మో పేర్లు కూడా తెలీకుండా ముసుగుదొంగల్లాగా వీళ్ళు ర్యాగింగ్ పేరుతో ఘోరాలు చేస్తారన్నమాట అని" అనుకోగానే దడమొదలై అర్జంటుగా ఆక్సిజన్ కావాల్సొచ్చి ఆరుబయట కెళ్ళొద్దామనుకున్నా. "ముహూర్తం ఎలాగూ రాత్రికే కదా, కాస్త అలా బయటకెళ్ళొద్దామా?" అని రమేష్ ని ఉత్సాహపర్చే ప్రయత్నం లో ఉండగానే, "నేన్రాను బాబూ, సామాన్లు సర్దుకోవాలి" అన్జెప్పి తుర్రుమనాడు.





ఈ కాస్త అడ్వెంచరూ మనమే వెలగబెడదామని బయలుదేరా! క్యాంపస్ లోనే తిరిగితే సీనియర్ల ఆగ్రహానికి గురికావలసి వస్తుందన్న భయంతో, తిన్నగా కాలేజి గేటుదాటి బయట ప్రపంచం వైపు ఉత్సాహంగా అడుగులేసాను. సిటీ బస్సు దిగిన చోటు, అక్కడినుండీ కాలేజికి వచ్చిన రూటూ తప్ప అన్యమెరుగని మనకి, ఆదారే మళ్ళీ ‘వెలసిన పూదారై’ స్వాగతించింది. బస్టాపుకు చేరగానే నాకంట ‘నందిని హాలు’ అన్న బోర్డు కనపడింది. "ఈ హాలేమిటని?" నన్నునేను ప్రశ్నించుకునేలోపే నాకోసమే గీసినట్టు, పాల సీసా ఓ వైపు,పాల ప్యాకెట్టు ఒకవైపు కనపడ్డాయి. అచ్చుతప్పై ‘పాలు’, ‘హాలై’ నాయేమో అని సందేహం వచ్చిందిగానీ, తరువాత్తరువాత "కన్నడం లో ఇంతే" అని తెలిసింది. అంటే మన ‘ప’ కారాన్ని వీరు ‘హ’ కారంగా మార్చి, మాదీ ఒక ప్రత్యెకభాష అని తెలియజెప్పుతారన్నమాట. ఇక ఊరి పేర్లు రాయడంలో కూడా వీరివన్నీ అతిశయోక్తులూ,ఆశ్చర్యార్థకాలే. ‘బెంగుళూరు’ ను ‘బెంగుళూరో’ (!?!) అని పెద్ద అనుమానమొచ్చేలా రాశేస్తారు. ఇలా చేసి తమ ప్రత్యెకతని చాటడంతో పాటూ, తెలుగు వారిని గందరగోళానికి గురిచేస్తున్నారని నా ఆరోపణ.





దుకాణం పెట్టి, బోర్డు కట్టి, మనలాంటి గొప్ప కస్టమర్ ల కోసం ఎదురుచూస్తున్నవాడల్లే అనిపించి, వాడిమీద దయతల్చటానికి నిశ్చయించా. దుకాణం చేరగానే ‘స్పెషల్ బాదామీ హాలు దొరయుత్తదే’ అని మరో చిరుబోర్డు దర్శనమిచ్చింది. సర్లేవీడి ఆనందాన్ని మనమెందుకు కాదనాలని, బోర్డు చూపించి వంద కాగితాన్ని రెపరెపలాడించా. వంద చూడాగానే నా స్తోమత చూసి సంతోషిస్తాడనుకుంటే, వాడుకాస్తా "చిల్లర బేకు" అని చిల్లర అరుపులు అరిచాడు. భాష మనకు అర్థమవకపోయినా భావం మమూలుగా మన దుకాణాలదగ్గరా ఎడ్చేదే గనక, తల ఊపి పదిరూపాయల నోటు సమర్పించుకున్నా. వేడివేడిగా వాడు కంటైనర్ లోంచి బాదంపాలు గ్లాసులో పోసిస్తే, దాన్ని ఆస్వాదిస్తూ, " ఈరోజు బాదంవల్ల వచ్చేశక్తి మనకు ర్యాగింగ్ ని తట్టుకోవడానికి కావాల"నుకుని నాకునేనే ఆలోచన చేసినందుకు "శభాష్" చెప్పేసుకుని, వాడిచ్చిన చిల్లర జేబులో వేసుకుని మళ్ళీ రోడ్డెక్కా. ఆపాటికే చీకటి పడుతోంది. "ఈ చీకట్లో ఎ పురుగూ పుట్రో లేక ర్యాగింగ్ పిచ్చిఉన్న సీనియర్కో దొరికితే ఇంకేమైనా ఉందా!" అనుకుంటూ హాస్టల్ దారి పట్టాను.





హాస్టలు గేటు వరకూ నాతోనే ఉన్న అదృష్టదేవత, తనూ పాలు తాగోస్తానని వెళ్ళిపోయిందేమో, ఎదురుగా ప్రత్యక్షమయ్యాడో మళయాళీ సీనియరు. "వేర్ డిడ్ యు గో మ్యాన్" అని నాకేసి గుడ్లుమిటకరించి చూసేసరికి, బిక్కచచ్చి సగమైపోయా. "జస్ట్ వాకింగ్ సార్" అని వినమ్రతతో భుజాలు ఒదగదీసి మరీ గౌరవంగా వంగి చెప్పేశా. ఈ నా వినయశీలతకు ముచ్చటపడక ఈ రాక్షసుడు,పెద్ద నోరేస్కుని "హేయ్! లుక్ అట్ దిస్ బగ్గర్ మాన్, నాట్ ఈవెన్ ఎ డేఓల్డ్, అండ్ హీఈజ్ గోయింగ్ ఫర్ ‘ఈవెనింగ్ వాక్’ మచ్చీ!!" అని ‘ఈవెనింగ్ వాక్’ ను ఒత్తిపలుకుతూ టముకేసేసాడు. ఈ దెబ్బతో చుట్టు పక్కలున్న సీనియర్లేకాక, తమతమ రూముల్లో పనిలోఉన్నవారుకూడా పనిగట్టుకుని నా పనిబట్టడానికి హాజరైపోయారు. నేనుచేసిన పాపమేమిటో తెలియక, ఇంత కోపాన్నెలా కలిగింఛానో అర్థంకాక వారి తీక్షణమైన చూపులకు అప్పటికే పదో సారో,వందో సారో భస్మమై బ్రతికాను. భస్మమైనా,ఆబూడిదని కూడా కాఫీలో కలుపుకొని తాగేసి నన్ను శిక్షిస్తామన్నట్టు అందరికళ్ళూ సాక్ష్యం పలుకుతున్నాయ్. ఇంతలో వార్డన్ వస్తున్నాడని కబురై, "అభీ చోడ్ దోరే, రాత్కో దేఖేంగే ఇస్ కో" అని హిందీ లో ఒక అంగీకారాని వచ్చినవారై అక్కడినుండీ కదిలారు.





రూంకి ఎలా వచ్చిపడ్డానో నాకే తెలీదు. ఈ ‘ఈవెనింగ్ వాక్’ ఏమిటో, అది వినగానే నేనేదో ఘోరం చేసినట్టు నాపై ఈ మూకుమ్మడి కత్తిగట్టడమేమిటో ఏదీ అర్థం కాక, బెడ్ మీద కూలబడ్డా. నాకోసమే ఎదురుచూస్తున్నట్టుగా నా ‘రూమీ’ హడావిడిగా వచ్చి "ఎక్కడ పూడ్సినారు మీరు, నేను రూమంతా ఎతికేస్తిని" అన్నాడు, అదేదో కాలేజంతా వెతికొచ్చినట్టు." ఏదో కాస్త చల్లగాలి కోసం వాక్ వెళ్ళొచ్చా"నని చెప్పి తరువాత సీనియర్లతో జరిగిన తంతుగురించికూడా చెప్పుకొచ్చా. ‘అయ్యో మహేశా (కన్నడమోళ్ళు నాపేరునిలాగే వాయించేస్తారు) !, రీజనల్ కాలేజిలో సాయంత్రాలు ‘వాక్’ పోయేది చల్లగాలి కోసం కాదప్పా, ‘పిల్ల’ గాలి కోసం" అని చెప్పి. అమ్మాయిల ‘గంగా హాస్టలు’ సాయంత్రం 7.30 కి మూసేస్తారని అందుకే అబ్బయిలూ, అమ్మయిలూ 5.30 నుండీ 7.30 వరకూ క్యాంపస్ లో నడుచుకుంటూ తమ ప్రేమ కలాపాలు ఓ 2 గంటల సేపు సాగిస్తారనీ దానినే ఇక్కడ ‘ఈవెనింగ్ వాక్’ అంటారనీ జ్ఞానబోధ చేసాడు. "అయ్యో! ఎరక్కపోయి అన్నానూ ఇరుక్కు పోయానూ" అనిపాడేసుకుని కాస్త చింతించినా, రాబోయేకాలంలో మనకు పట్టబోయే అదృష్టాన్ని తలుచుకుని వొళ్ళు పులకరించిందంటే నమ్మాలి. ఆ పులకరింపు పైన మళ్ళీ సీనియర్లు నీళ్ళు జల్లకముందే భోజనాలు కానిచేద్దామని మెస్ కేసి దారి తీసాం, నేనూ నా రూమీ.





ఆఖరికి ర్యాగింగ్ పెళ్ళిరాత్రి రానే వచ్చింది దానికి తగ్గ పిలుపులూ వచ్చాయ్. సామూహిక వివాల టైపులో వధువుల్ని నిలబెట్టినట్టు జూనియర్లందరినీ మొదట వరుసగా నిలబెట్టి, ఎవరికి కావల్సిన కన్యల్ని వారు వరింఛినట్టు ‘సెలెక్ట్’ చేసుకుని తమ తమ రూములకు లగేసుకెళ్ళారు. నాతోపాటు మరో నలుగుర్ని మళయాళీ సీనియరూ, నాకు ఇంగ్లీషు సలహా ఇచ్చిన సీనియరూ కలిసి పాణీగ్రహణం కావించి రూముకు తీసుకెళ్ళారు. రూంనెంబరు ముప్పైఐదు, లో మాచేత సినిమా నటుల యాక్టింగుల నుంచీ, సిల్కుస్మిత డాన్సింగుల వరకూ అన్నీ చేయించేశారు.ర్యాగింగంటే ఇంతేనా అనిపించింది. అసలే మనం సిగ్గు విడిచిన బాపతు కనక (అప్పటికే ఏడేళ్ళ హాస్టలు జీవితం మరి) పెద్ద ఇబ్బంది లేకుండా వాళ్ళడిగిన వన్నీ చేసేశాం. ర్యాగింగ్ లో కిటుకేంటంటే, అడిగింది అడిగినట్టు చేసేస్తే బోరుకొట్టి మనల్ని వదిలేస్తారు, మనం నసిగామా సీనియర్లకు బలైనట్టే లెఖ్ఖ.





ఇక నాతో ఏం చెయ్యాలో తెలియక, ఓ బకెట్టు నీళ్ళు తెప్పించి దాంట్లో నిలబెట్టి పాట పాడ మన్నారు. పాడకపోతే కరెంటు పెడతామని బెదిరింపుకూడానూ. "నా పాట వినడం వీళ్ళ ఖర్మంగానీ పాడటానికి మనకేంటి" అని మనసులో అనేసుకుని ప్రతిఘటనలో విజయశాంతిని గుర్తు చేసుకుని, " ఈ ధుర్యోధన దుశ్సాసన , దుర్వినీతలోకంలో..." అని ఓ సిచ్యువేషన్ సాంగ్ వదిలా. ఈ నా విప్లవానికి ఖంగారుపడిపోయి "ఆపరా బాబు ఆపు...చుప్ బే" అని గౌరవించి నా నోరు నొక్కడమైనది. ఈ తంతంతా ఎప్పటిలాగే సైలెంటుగా చూస్తున్న ‘యముడు’, "కాస్త మంచిగుండే పాటల్రావ్రా నీకు? మెలోడీ టైప్" అని సిబాకా గీత్ మాలలో ఫర్మాయిష్ లాగా అడిగాడు. సరే మనమూ వివిధభారతే ననుకుని, పాటని లంకించుకున్నాం. "మనసా తుళ్ళిపడకే...అతిగా ఆశ పడకే" అని రాగం పాడగానే, "అంతా ఆడాళ్ళ పాటలేనారా...మగాళ్ళ పాటలు రావా మనకీ" అని నా ప్రవాహానికి అడ్డుకట్ట వేశేసాడు. ఇక విడికి మన టాలెంట్ చూపించి తీరాలన్న కసితో మన బాలుగాడి "ఏ దివిలొ విరిసిన పారిజాతమో", అని కళ్ళుమూసుకుని సాంతం(ఎవ్వడూ ఆపకుండా) పాడేసి కళ్ళు తెరిచా. అప్పటి వరకూ రాక్షసుల్లా కనపడ్డ సీనియర్లు, నన్నే పెద్ద భూతాన్ని చూసినట్టు చూస్తూ కనిపించారు.





ఇంతలో మళ్ళీ మా ‘యముడు’ కల్పించుకుని, "హిందీ గానా ఆతై?" అని చానల్ మార్చాడు. "వీడికింకా దమ్ముంద"నుకుని అప్పుడే వచ్చిన సల్మాన్ ఖాన్ సినిమాలోని "హరీ దుపట్టే వాలీ, సీధిసాధీ భోలిభాలీ జానమ్ రుక్ జానా" అని వయ్యారాలు పోకముందే, "ఈ జింక్ లకా గానా కాదురా భయ్, రఫీ కిశోర్ పాత పాటల"న్నాడు. "అప్పటిదాకా వాళ్ళపేర్లు వినడమే గానీ, మనకు పెద్ద పరిచయంలేదు వీళ్ళతో" అని చెప్పడం రాక, "రావు" అని ఒక్క మాటతో సరిపెట్టుకున్నా. "ఐతే ఒక పన్చెయ్" అని తటాలున పక్కనే ఉన్న టేప్ రికార్డర్, ఓ రెండు కేసిట్లు ఇచ్చి, "ఏదో ఒక పాట నేర్చుకొని, పొద్దున 5 గంటలకి నన్నొచ్చి నిద్రలేపు " అని పంపేశాడు. బతుకు జీవుడా అని ఆ రూంబయట పడి, నా రూంచేరుకున్నా.





టేప్ రికార్డర్ ని ప్లగ్గులో పెట్టి తెచ్చిన కేసెట్లని చూశా. ఒకటి హెచ్.ఎం.వీ. వారి ‘రఫీ కే అనుమోల్ రతన్’, మరోటి కిశోర్ కే దర్ధ్ భరే నగ్మే’. నా ప్రస్తుత దర్ధ్ ముందు కిశోర్ దర్ధేంటో తెలుసుకుందామని అదే మెదట మొదలెట్టా. "హే... యేజో మొహబ్బత్ హై, యె ఉన్ కాహై కామ్. మహబూబ్ కాజో బస్ లేతేహువె నామ్ మర్ జాయే మిట్ జాయే హోజాయే బద్నామ్..." అని ‘కటీ పతంగ్’ పాట వినవచ్చింది. అప్పటివరకూ "అమ్మా అని అరచినా ..ఆలకించవేమయ్యా" పాటలో ఘంటశాల పలికించిన ఆర్ద్రత ఇంకే గొంతూ పలికించలేదని నమ్మిన నాకు, ఇదొక డిస్కవరీ అని చెప్పాలి. అరగంటలో పాట నేర్చేసుకున్నా, ఐదు గంటలు ఎప్పుడవుతుందా అని ఎదురుచూసా. రాత్రంతా కిశోర్ పాటలు వింటూనే ఉన్నా. ఐదవగానే యముడి తలుపు తట్టేసి పాట గుమ్మం దగ్గరే వినిపించేశా. అంతే పాటంతావిని ‘ధ్యాంక్యూ’ అని చెప్పి వెళ్ళిపోయాడు.





ఈ నా సాహసం మరుసటిరోజు హాస్టల్ వార్తల్లో, మొదటి పేజి న్యూసై కూర్చుంది. ఆ రోజునుండీ ర్యాగింగ్ జరిగిన నెలవరకూ ఏదో ఒక సీనియర్ రూంలో, వాళ్ళు ర్యాగింగ్ చేసిఅలసి పోతే రిలాక్సేషన్ కోసం నా గొంతు మ్రోగేది. ఈ ర్యాగింగ్ నాకు కిశోర్ ని, రఫీ ని,తలత్ ని,హేమంత్ ని పరిచయంచేసి నా జీవితానికొక ‘హిందీ అర్థాన్నిచ్చింది’. ఇలా ర్యాగింగ్ లో నా రాగాలు హాస్టలు గదుల్ని తాకాయి. కాలేజిలో మోగాయి.





(మూడవ భాగం "కాలేజీ లో క్లాసులు" త్వరలో)

17 comments:

Indian Minerva said...

మీ బ్లాగో చదువుతుంటే మా బెంగుళూరు వచ్చిన కొత్తలో మేం చేసిన అల్లరి గుర్తుకు వచ్చింది. మావాడొకడుండే వాడు మోహన్ అని వాడే కనుక్కున్నాడో లేక యెవరైనా చెప్పారో తెలీదుగానీ తెలుగులో చివరన సున్నా తీసేస్తే కొంచెం అటూ ఇటూ గా కన్నడ పదం అవుతుందని. ఇక చూడాలి "అణ్ణ", "రస", "మేఘ", "కవి హృదయ" ఇలా ప్రయోగాలు చేసేవాళ్ళం.

ఇక హా హా కారాలంటారా "హాలు", "హళ్ళి" చూసి నేను "హిచ్చివాడు" అన్న పదం కనుక్కొంటే, అది తప్పని "హుచ్చివాడు" కరెక్టనీ తెలిసింది. ఇప్పటికీ నేను "హిచ్చి*@!*@*" అని తిడుతూ వుంటాను.

యెక్కడో చదివినట్లు గుర్తు కన్నడ వాళ్ళు యేదీ ఒక పట్టాన తేల్చరట "బారో రెస్టారెంటో" యెదో ఒకట్లే అన్నట్లు రాస్తారంట.
మీ పోస్టో తుంబ చెన్నాగిత్తు.

కొత్త పాళీ said...

చాలా జ్నాపకాలు రేపెడుతున్నారు బ్రదర్!

Kathi Mahesh Kumar said...

మినర్వ గారూ & కొత్తపాళీ గారు,నా కథ(త) మీ జ్ఞాపకల్ని తట్టిలేపుతోందంటే ఆనందంగా ఉంది. ఇన్నాళ్ళ తరువాత నెమరేసుకుని రాస్తుంటే నాక్కూడా,ఏదోగానే ఉంది. ఈ ఫీలింగ్ ని ఇలాగే కంటిన్యూ చెయ్యడానికి ప్రయత్నిస్తాను.

మంజుల said...

రాజేంద్ర ప్రసాద్ సినిమా చూస్తున్నంత ఆనందంగా ఉంది. కానివ్వండి.

సుజాత వేల్పూరి said...

కన్నడలో 'ప ' ని హ చేసి వీళ్ళు చేసే విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. మన వైపు 'పల్లి '(ఊరిపేరులో వచ్చేది) ని వీళ్ళు హళ్ళి చేస్తారు. కానీ కన్నడ నేర్చుకోవడం సులభమే! బెంగుళూరులో తెలుగు ఓకే కాని, మైసూరులో తప్పదు కదా, నేర్చుకున్నారా కన్నడం?

మొత్తానికి రాగింగ్ మీకు రాగాలు నేర్పడం ముదావహం!

Naveen Garla said...

సుజాత గారు, వారి హళ్ళినే మనం పల్లిగా చేసుకున్నాం. కన్నడ భాష తెలుగుకన్నా ప్రాచీనమైనది :)

vasantam said...

చాల తమాషాగా వుంది.
నెనర్లు.
కాని మన బాలుగాడి "ఏ దివిలొ విరిసిన పారిజాతమో", అని బాలు గారిని 'గాడు' గా సంభోదించటం బావోలేదు.బహుశ టైపింగ్ సమస్య అనుకుంటాను.
వెంటనే సరిదిద్దండి.please.

Indian Minerva said...

నవీన్ గారూ..
కన్నడమే ప్రాచీన భాషా? మరైతే వాళ్ళ కన్నా మనమే యెక్కువగా పూసుకొంటున్నామే "తెలుగును ప్రాచీన భాషగా ప్రకటించాల"ని.

వాసు గారూ..
అది అభిమానంతో కూడిన చనువు (అనుకుంటాను). మనం NTR ని యెన్టీవోడు అంటాంకదా అలాగ(నుకుంటాను).

ramya said...

హి హి హి..:)
మీ ర్యాగింగ్ రాగాలు కి వేంటనే కాపీ రైట్స్ ప్రకటించండి లేకపోతే రాబోయే సినిమ్మాల్లో ఏదోఓ దాంట్లో వీటిని మీరు చూస్తారు.

సుజాత వేల్పూరి said...

నవీన్ గారు,
అవునా! అయితే కన్నడ 'హ ' తెలుగులో 'ప ' గా మారుతుందన్నమాట.

Kathi Mahesh Kumar said...

స్వాతి,సుజాత,నవీన్ మరియు రమ్య గారికి, నా టపా మీద అభిమానానికి నెనర్లు.

కన్నడం చారిత్రకంగా మన తెలుగు కన్నా ముందుపుట్టినా, వాజ్ఞ్మయాలు మాత్రం మన తెలుగు లోనే మొదట అని విన్నాను.ఇక ‘ప్రాచీనత’ హోదా అంటారా,కన్నడిగులకి ఇది అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికీ వారు తమ భాషని బాగానే వాడి బ్రతికిస్తున్నారు.

మైసూరులో కన్నడం నేర్చుకోకపోయినా చెల్లుతుంది కానీ, నేనే ముచ్చటపడి కోత కన్నడ కస్తూరిని అంటించుకున్నా సుజాత గారు (రాబోయే టపాలలొ ఆఈ పొందుపరుస్తాను.

వాసుగారూ, బాలు గారిని ‘గాడు’ అనడం అచ్చుతప్పు కాదు. మా ఊరోళ్ళకి, ప్రైమినిస్టర్ నుంచీ సినిమా స్టార్ వరకూ ‘గాడు’లే. అది ప్రేమతో పిలిచేదేగాని, అగౌరవపరచాలని కాదు.ఆ సమయంలో నేనలా అనుకోవడం "పాత్రోచితం"గా తలచి మన్నించగలరు.ఇంకా ఇబ్బందైతే ఖచ్చితం గా మార్చేద్దాం.

రమ్యగారూ కాపీరైట్ ప్రకటన ఖచ్చితంగా చేశేద్దాం.సలహా కు ధన్యవాదాలు.

arvindrishi said...

మేకప్ లేని బాపు సినిమా క్యారక్టర్స్ లో ఉండే ఒక సహజమైన అందం ఉంది నీ రచనలో మహెశా..!

గొ ఆన్..!

అర్వింద్ రిషి

చైతన్య కృష్ణ పాటూరు said...

మీ ర్యాగింగ్ రాగాలు బావున్నాయండి. చాలా జ్ఞాపకాలు కదిలించారు.

నాకు తెలిసినంత వరకు వాళ్ళ హళ్ళిని మనం పల్లిగా మార్చుకోలేదు. వాళ్ళే ’ప’ ని ’హ’ కి మార్చుకున్నారు. హాళెగన్నడ(పాత కన్నడ)లో పల్లెని ’పళ్ళి’ అనే అనేవారట, ఇప్పటి కొత్త కన్నడలో అది హళ్ళి అయ్యింది. వీళ్ళకు హాళెగన్నడ(పాత కన్నడ), నడుగన్నడ(మధ్య కన్నడ), హొసగన్నడ(కొత్త కన్నడ) అని మూడు రకాల విభజన వుంది. పాత కన్నడ నుంచి కొత్త దానికి వచ్చేసరికి చాలా చోట్ల ’ప’ కాస్తా ’హ’ అయ్యింది.

కొత్త పాళీ said...

@ Sujatha - అందుకు నిరసనగ మనం "సున్నకి సున్న, హళ్ళికి హళ్ళి" అంటాము. :-)

@ Naveen Garla - "కన్నడ భాష తెలుగుకన్నా ప్రాచీనమైనది"
ఔరా, పాలు త్రాగి రొమ్ము గ్రుద్దే విశ్వాస ఘాతకుడా! మన తెలుగు భాషాభిమానులు రెచ్చిపోగలరు జాగ్రత్త!! :-)

కనడం వాళ్ళు హ హ్హ హ్హ అని నవ్వితే, తెలుగోళ్ళు ప ప్ప ప్ప అని నవ్వుతారు!

సుజాత వేల్పూరి said...

కొత్త పాళీ గారు,
ఈ చర్చ బాగుందే! తెలుగు ప్రాచీనమా? కన్నడమా? ఒకటి మాత్రం నిజం..ఇక్కడ(బెంగళూరులో లేక కర్నాటకలో) కన్నడ భాషాభిమానం మనకంటే ఎక్కువే! చాలా కార్ల మీద(private vehicles and vehicles belong to individuals) కన్నడ సేన ' అనీ ' కన్నడయే నమ్మ జీవిత ' అనే స్టిక్కర్లు, రాతలు సామాన్యంగా కనపడుతుంటాయి. అయితే సున్నకి సున్న హళ్ళి కి హళ్ళి అనే సామెత కి కూడా ఇదే నేపధ్యమా?

దైవానిక said...

సుజాత గారు, నాకు తెలిసి కన్నడనే ప్రాచీన భాష. మన తెలుగు "neo dravidian" క్రింద వస్తుందనుకుంటాను.
ఇక క్లాసికల్ స్టేటస్ (ప్రాచీన భాష)లో పొలిటికల్ మైలేజే ఎక్కువుంది. దాని వల్ల భాషకి ఒరిగేదేమి లేదు.
భాష ఎంత పాతదయితె అంత గొప్ప అనేది తప్పు అబిప్రాయం అని నేను అనుకుంటాను.

Naveen Garla said...

>> ఔరా, పాలు త్రాగి రొమ్ము గ్రుద్దే విశ్వాస ఘాతకుడా!
చరిత్రను నిజమని ఒప్పుకోవడంలో ఘాతుకం ఏముందండి :)
పాతవంటే...850ADలోనే కవిరాజమార్గ అనే కన్నడ పుస్తకం వ్ర్రాశారంట. ఆ పుస్తకంలో విమల చంద్ర, లోకపాల లాంటి రెండు వందల సంవత్సరాల ముందటి కన్నడ కవుల గురించి కూడా వ్రాశారంట. నాకు తెలిసి మన తెలుగు పుస్తకాలు రావడం 11వ శతాబ్దంలోనే కదా?

>>మన తెలుగు భాషాభిమానులు రెచ్చిపోగలరు జాగ్రత్త!!
నేను కూడా ఈ గుంపులో వాణ్ణే :)