Wednesday, May 14, 2008

నా కాలేజీ కథ- Part 3

"కాలేజీ లో క్లాసులు"
ర్యాగింగ్ ఇలా జరుగుతున్న తరుణం లోనే మాకు క్లాసులు కూడా మొదలయ్యాయి. ఆరోజు శుక్రవారం, నేను కాలేజిలో చేరిన రెండవరోజు. సీనియర్లు తమ ర్యాగింగ్ తంతులో భాగంగా మా తలలకు దట్టంగా నూనె రాసి,హవాయి చెప్పులు తొడిగించి ,క్లాసుకు తీసుకెళ్ళ వలసిన పుస్తకాల్ని ఓ ప్లాస్టిక్ సంచిలో నింపి చేతిలో పెట్టి లైన్లో హాస్టల్ నుండీ కాలేజి బిల్డింకు సాగనంపారు.

హాస్టలు నుండీ కాలేజి భవనం దాదాపు ఒక కిలోమీటరుంటుంది. 150 ఎకరాల క్యాంపస్ ఇది. ‘మైసూర్ యూనివర్సిటీ - మానసగంగోత్రి’ కి ఆనుకునే, మా రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇప్పుడు అదికాస్తా రీజనల్ ఇంస్టిట్యూట్ అయ్యిందిలెండి. అక్కడికి వచ్చిన వెంఠనే మనకు నచ్చిన పేరు, ‘మానస గంగోత్రి’. ఎవడు పెట్టాడొ గానీ "యమహో!" అనుకున్నా. అసలా ఆలోచనను చూడండిక్కడ, ‘గంగోత్రి’ అనేది గంగానది జన్మస్థానం అంటే ఈ యూనివర్సిటీ ‘మానసగంగ’ ఉద్భవించే చోటట. చదువు యొక్క సార్థకత తెలిసినోడు ఈ పేరుపెట్టి ఉంటాడనుకున్నా. ఇక కాలేజ్ క్యాంపస్ అంటారా! సూపరో, సూపరు. ఓ చుట్టు తిరగాలంటే కనీసం గంటైనా పడుతుంది. ఇక ఎక్కడ చూసినా చెట్లు,గడ్డి మధ్యలో ఒక పేద్ద ఫుడ్బాల్ /క్రికెట్ గ్రౌండు. దాని చుట్టూ ‘స్టొన్ బెంచస్’ (వీటి మహత్యాన్ని తరువాత చెప్పుకుందాం) అనబడే సిమెంటు దిమ్మెలు. కాలేజిలో జాయినైంది జూలై లో అవటం మూలంగా అప్పుడే పడుతున్న వర్షాలు, పకృతికి అద్దుతున్న రంగులకి అదొక భూతల స్వర్గలా అనిపించింది.మా జూనియర్ల లైను కాలేజి బిల్డింగ్ చేరగానే సింబాలిక్ గా రెండు పాయలుగా చీలిన నదల్లే విడిపోయాయి. ఒకటి బిఏ ఎడ్ మరోటి బిఎస్సీ ఎడ్. అప్పుడు గమనించా మా బిఏ ఎడ్ లైన్లో ఉన్న అబ్బయిల సంఖ్య కేవలం 8 మాత్రమే. వారిలొ బాషా(ఫ్రమ్ కడప), రమేష్ లతో అల్ల్రెడి పరిచయం ఉందిగాబట్టి మిగతా కొత్త ముఖాలను కాస్త తీక్షణంగా గమనించడం జరిగింది. ఆ కొత్తముఖా లలో ఒక వింత ముహం కూడా ఉంది. కళ్ళు కొంచెం చిన్నగా ముక్కుకొంచం లోతుగా ఆచ్చు చైనా వాళ్ళకి మల్లే. "ఏ అస్సమో,మిజోరాం బాపతో" అనుకున్నా. కానీ తరువాత తెలిసింది తన పేరు ‘నంగ్యాల్’ అని, తను ఒక టిబెట్ కాందిశీకుడని. మైసూర్ దగ్గరి బెళకుప్పె అనే స్థలంలో ఒక పెద్ద టిబెటన్ కాలనీ ఉందట అక్కడినుండి ప్రతి సంవత్సరం ఇద్దరు ముగ్గురు ఈ కాలేజీలో చదవటానికి వస్తారట. ఇలా లైనుగా ఒకరినొకరు డౌటుగా చూసుకొంటూ సీనియర్లు చెప్పిన ఈ అవమానకర వేషధారణ తో క్లాసు కి చేరాం.


క్లాసులో అడుగు పెట్టగానే నా గుండె ఒక్క సారిగా ఆగినట్టంది. మ్యాచింగ్ లేని చుడీదార్లతో, నూనె కారే ముఖాలతో, హవాయి చెప్పులతో అంతకన్నా మించి, రెండు జడలకీ ఎద్దుకొమ్ముకు రంగేసినట్టు, ఎర్ర రిబ్బన్లు కట్టుకుని 13 మంది అమ్మాయిలు, మా క్లాసును ఆక్రమించుకుని కనపడ్డారు. ఇది అమ్మయిల ర్యాగింగు లో భాగంగా అర్థమయ్యింది. వీళ్ళకన్నా మనమే బెటరనుకుని కాస్త ఊరట కలిగింది. క్లాసు ఒక వేపున్న బెంచీలను పూర్తిగా ఈ ఆడ మళాయాళం ఆక్రమింఛుకొని ఉండగా, మిగిలిన సగాన్ని మాకే అంటూ ఆక్రమించేశాం.క్లాసు సమయం అయ్యేసరికీ తలుపు బార్లా తెరుచుకుని కాంతిపుంజంలా ప్రకాశిస్తూ, "రఘునాథ్...ప్రొఫెసర్ రఘునాథ్" ప్రవేశించాడు. వచ్చీరాగానే, "డియర్ యంగ్ ఫ్రెండ్స్, ఎస్టర్ డే వుయ్ హాడ్ ఎన్ ఇంట్రడక్షన్ టుద సెమెస్టెర్, నౌ వుయ్ షల్ హావ్ ఇంట్రడక్షన్ టు అవర్ ఓన్ సెల్ఫ్స్" అని క్లాసంతా కలియదిరిగి చూశాడు. ఏదో నచ్చలేదన్నట్టు మొహం మాడ్చి, ఇలా అమ్మయిలూ, అబ్బాయిలూ వేరువేరు లైన్లలో కూర్చోవడం ఈ ఇంగ్లీషు డిపార్టుమెంటు ధర్మానికి విరుధ్ధమనీ, కలిసి కూర్చోవాలనీ తెలియజెప్పాడు. "హవ్వ! వీడి అసాధ్యంగూలా! వీడు చదువు జెప్పటానికొచ్చాడా? మా పాతివ్రత్యం ‘పబ్లిగ్గా’ చెడగొట్టడానికి వచ్చాడా?" అని మనసులో అనేసుకుని, నా సీట్లోంచి మాత్రం నేను కదలలేదు. ఈ విషయం వినగానే క్లాసులో కలకలం మొదలై,రాజకీయ నాయకుల తీరున సీట్ల మార్పిడి జరిగిపోయాయి. ఈ హడావిడి ముగిసేసరికీ నేను అటో అమ్మాయీ,ఇటో అమ్మాయీ మధ్య మా పెద్ద తిరపతి ఎంకన్న లెవెల్లో తేలా. "వీడి ధర్మమేదో, మన మానాల మీదకి తెచ్చింది" అని గర్హించా, తప్పనిసరి పరిస్థితుల్లో సర్దుకుపోయా. అప్పుడనిపించింది, "ఎంచక్కా మన ఆంధ్రాలో ఐతే, అమ్మాయిల్ని దూరం నుంచీ చూసి ఆనందింఛవచ్చు, ఈలలేసి గోలపెట్టొచ్చు, కామెంట్లు చేసి ఆస్వాదించవచ్చు. ఎంత మర్యాదగా ఉంటుంది! ఇక్కడ చూడండి దౌర్భాగ్యం, పక్కన కూర్చుని స్నేహం చెయాలట, చీ! చీ!! ఇదేం ధర్మం" అనేసుకుని ఊరుకున్నా.

ఇక పరిచయ కార్యక్రమాలు మొదలయ్యాయి. మొదటగా ‘రేఖ’ అనే అమ్మాయి లేచి ‘అచ్చతేట’ ఇంగ్లీషులో, తను బెంగుళూరు పిల్లనని, ఆంగ్ల సాహిత్యమంటె తను చెవీ,ముక్కూ,నోరూ ఇంకా ఏవేవో కోసేసుకుంతుందని, ఉపోద్ఘాతం దంచేసి, తనకి వచ్చిన,నచ్చిన కవులూ రచయితల పేర్లు దీర్ఘంగా ఏకరువు పెట్టేసింది. ఆంగ్లమేంఖర్మ, సరిగా తెలుగు కవుల గురించి కూడా తెలియని నాకు, పరిచయం బహుశా ఇలా వెలగబెట్టాలని తెలిసే సరికీ గుండెలవిసిపోయాయి. నా చేతులు అదిరి, నుదుటిమీద చెమట బిందువులు సరదాగా ప్రత్యక్షమయ్యాయి. సాంతం ‘రేఖ’ పరిచయాన్ని ఆలకించిన మా జేమ్స్ బాండ్ (అదే నండీ! మా ప్రొఫెసర్) ఇలాక్కాదు, కేవలం మీపేరు,వచ్చిన ఉరు, ఇక్కడ చేరేముందు చదివిన చదువు చెబితే చాలన్నాడు. "హమ్మయ్య, బతుకుజీవుడా!" అనుకుంటూ నావంతు కోసం, చెప్పల్సినవి మననం చేసుకుంటూ వేచిచూశా. హరీశ్, రమేష్, బాషా(మళ్ళీ ‘ఫ్రమ్ కడప’ తో సహా), నిషా , అయిషా, షరీన్, మాచమ్మ.... జ్యోతి....ఉమ...ఇలా అందరి పరిచయాలూ అవుతూ, నా వంతు వచ్చింది. నేను అదరాబదరా లేచి గొంతు విప్పి చెప్పేసా. నేను చెప్పింది నాకైతే వినపడలేదిగానీ, అందరూ ఆలకించినట్టుగా తలలూపి ఆమోదాన్ని తెలిపినట్టనిపించింది.

ఈ తంతు ముగిసేసరికి నా ఇరుపక్కలున్న అమ్మాయిల పేర్లు నాకు తెలిసిపోయాయ్. ఎడమవైపున ‘అంబిలీ ఉన్నికృష్ణన్’ చెన్నై పక్కన ఏదో ఊరట, కుడిపక్క ‘ఆయిషా’ కేరళ నుండీ దిగుమతైనదట. "‘అంబిలి’ పేరవడమేంటి మన అంబలి కూడులా?" అనుకుంటూ, తన వంక క్రీగంట చూసేసరికీ గుర్తొచ్చేసింది. నిన్నటి క్లాసులొ "అవును కదా" అన్నట్టూ పదిసార్లు చూసి, నా పాతివ్రత్యాన్ని శంకించిన కన్యకామణి ఈవిడే. ఈ నూనెకారే జిడ్డు మొహంతో కూడా బాగానే ఉన్నట్టనిపించింది. కానీ, "పేరుమాత్రం అంబలి, గంజీ అంటూ హేమిటో" అని రుద్రవీణ సినిమా లో శోభన తనపేరు ‘పెంటమ్మ’ అనిచెబితే, మధనపడ్డ చిరంజీవికి మల్లే చింతించా. ఇక ‘ఆయిషా’ పేరు మన మతానిది కాదు కాబట్టి "తురకమేమో ?" అనుకున్నా, వేషధారణ మరీ వారికి తగ్గ ఘాటీ గా లేకపోవడం తో కొంత ఆలోచింఛాల్సి వచ్చింది. కానీ, వెరైటీగా నెత్తిన జుట్టు కనపడకుండా, మనూర్లో పచ్చి బాలింతలు కట్టుకున్నట్టు ఓ నల్లటి గుడ్డ చూసి ఇదోరకం తురకమనుకుని సరిపెట్టుకున్నా. ఇలా ఈ స్వగతం నుంచీ బయటకువచ్చి, జేమ్స్ బాండ్ చెప్పే విషయం వైపు ధ్యాస మరల్చా."లుక్ మైడియర్ యంగ్ ఫ్రెండ్స్" అంటూ తను మొదలెట్టెసరికీ, నాకు కాస్త చిరాకేసింది. "ఫ్రెండ్స్" అంటాడేమిటి? స్టూడెంట్స్ ని పట్టుకొని" అని. "సరేలే ఇదికూడా డిపార్టుమెంటు దర్మాలలో ఒకటైఉంటుందని" తలచి, "సర్దుకుందాం" అనుకుంటుండగానే, ఇంకో బాంబు నా నెత్తిన వేశాడు. ఈ జేమ్స్ బాడ్ పేరు ‘ప్రొఫెసర్ రఘునాధ్’ కాబట్టి మేము ఈతగాడిని "ప్రొఫెసర్" లేక "మిస్టర్ రఘునాథ్" అని పిలవొచ్చట. "సార్" అని పిలిచి మాటిమాటికీ ఇబ్బంది పెట్టొద్దని దీని సారము. ఎంత ఆరాచకం చూడండీ! "గురువుని పేరు పెట్టి పిలుస్తారా ఎవరైనా? మా రాజ్యం లో నైతే, ఏమారు పేరో, అదీ చాటుగా పెట్టుకుని అగౌరవపరుచుకుంటామే గానీ ఇలా బరితెగించడం జరగదు" అని చింతించా. ఏదిఏమైనా ఈఅ న్యాయాల్ని కనీసం ఒక సంవత్సరమైనా భరించక తప్పని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి క్షమించి ఊరుకున్నానుగానీ, లేకపోతే ఈ పాటికి వీరంగం చేసి, మన తెలుగు విలువలని కాపాడే వాడినే!క్లాసులో కుదురుగా నులుచోక అటూఇటూ కలియదిరుగుతూ మా జేమ్స్ బాండ్ మామీద ఓ ప్రశ్న సందించాడు. "హౌమెనీ ఆఫ్ యూ థింక్ ఇంగ్లీష్ ఈజ్ ఎ ‘గ్రేట్’ లాంగ్వేజ్?" అని ‘గ్రేట్’ అని పదాన్ని నొక్కి మరీ పలికాడు. మనదగ్గర దీనికి భేషైన సమాధానముందని తలచి ఠకాలున అలవాటు ప్రకారం చెయ్యెత్తేశాం. అంతలో క్లాసుగది తలుపులు భళ్ళున తెరుచుకుని జీన్స్ ప్యాంట్ లో ఒక దేవత ప్రత్యక్షమై "ఎస్ క్యూజ్ మీ" అంది. "అయితే నన్నురక్షించడానికి వచ్చిన దేవత కాదన్నమాట" అని ఎత్తినచెయ్యి దించకుండా అనుకున్నా. ఇంతలో మా ప్రొఫెసర్ "ఓ ‘గౌరి’ కమాన్, యువార్ లేట్ ఫర్ ద వెరీ ఫస్ట్ క్లాస్" అని బాగా తెలిసినవాడల్లే కూర్చో మన్నట్టు డెస్కుకేసి చూపాడు. ఆ జీన్స్ దేవత తఠాలున నా ఎదురుగా ఉన్న డెస్క్ లో కూచుని తన జడని వెనక్కి విసిరేసరికీ, అదికాస్తా మన ముఖాన్ని ముద్దెట్టుకుని ఇబ్బందిపెట్టింది. "సారి" అంటూ తను వెక్కితిరిగి అంటే, "ఫరవాలేదని" అభయహస్తం చూఫుతూ మనం తెలుగులోనే అనేశాం. దానికి అర్థం కానట్టూ చూస్తూ, ఓ చిరునవ్వు విసిరింది. అ ప్పుడుగానీ, సమాధానాం చెప్పడానికి ఎత్తిన ఓ చేయి నింగిని చూఫిస్తూ, మరోటి అభయహస్తమిస్తూ ఉన్న మన విశ్వరూపం గుర్తుకురాలేదు. "అవమానంగా ఫీలవుదామా?" అని చుట్టూచూస్తే, క్లాసులో సగం చేతులు ఆల్రెడీ చూరుని చూపిస్తున్నాయి. అయితే మన గౌరవానికొచ్చిన ఢోకా ఏమీ లేదని తలిచి సమాధానం ఇవ్వటానికి తయారుగా కూర్చున్నా.

ఇక మా ప్రొఫెసర్ అడిగిన ప్రశ్నపై చర్చ జరిగింది. క్లాసులో ఇద్దరు (రేఖ, గౌరి) మినహా అందరం అంగ్లభాష చాలా గొప్పదని, అది ప్రపంచ భాష అని, మనదేశం లో కూడా పైచదువులు చదవాలన్నా, ఉద్యోఅవకాశాలు రావాలన్నా ఈ భాష అవసరమని చిత్తగించారు. మనవంతుగా, ఇంగ్లీషు మాట్లాడే తల్లిదండ్రులకు మాస్కూలులో జరిగే గౌరవాన్ని గుర్తుచేసుకుని, "ఇంగ్లీషు మాట్లాడితే గౌరవిస్తారు" అని నాకు వచ్చిన ఇంగ్లీషులో "స్పీకింగ్ ఇంగ్లీష్ గెట్స్ రెస్పెక్ట్" అనే విలువైన అభిప్రాయాన్ని చెప్పేసా. నా అభిప్రాయాన్ని విని కొందరు సాలోచనగా తలవంకిస్తే , మరికొందరు అంగీకార సూచకంగా తల ఆడించారు. మా జేమ్స్ బాడ్ మాత్రం సన్నగా నవ్వుతూ "చిక్కావులే చేతిలో" అన్నట్టు చూపువిసిరాడు. ఎమైతేనేం క్లాసులో దాదాపు అందరూ ఆంగ్లమొక గొప్ప భాష అనే అంగీకారానికి వచ్చి నిర్ణయింఛేశాం.

ఈ నిర్ణయం విన్న తరువాత, "ఇప్పుడు మీవంతు" అని రేఖ, గౌరీల్ని అడిగాడు మా ప్రొఫెసర్. వాళ్ళిద్దరూ కూడబలుక్కున్నట్టు, "ఇంగ్లీష్ ఈజ్ ఎన్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్, నాట్ ఏ గ్రేట్ లాంగ్వేజ్" అన్నారు. ఇది విని నా మనసులో నేను, "దొరికారు దొంగలు, ప్రాముఖ్యానికీ,గొప్పతనానికీ అవినాభావ సంబంధం ఉందని వీళ్ళకి తెలిసినట్టు లేదని" చాటుగా చంకలు గుద్దుకున్నా. కానీ విచిత్రంగా మా జేమ్స్ బాండ్ మాత్రం "శెహబాష్ !" అన్నట్టు వారి మొహాల్ని చూసి, మమ్మల్నందరినీ వెదవసన్నాసుల కింద జమకట్టేసాడు. దీనికి కొనసాగింపుగా తను ‘ఆంగ్లేయులు మన దేశాన్ని200 సంవత్సరాలు పాలించడమనే "చారిత్రాత్మక తప్పిదం" (Historical blunder) వలన మనం ఇంగ్లీషు లో మాట్లాడి దానికి గొప్పతనం ఆపాదిస్తున్నామేగానీ, ఒక వేళ ఏ ఫ్రెంఛివాళ్ళొ, డఛ్చి వారో ఆక్రమింఛుకొనివుంటే మనం ఆ భాషని గొప్పగా భావించేవాళ్ళమని తన పాండిత్యాన్ని ప్రదర్శించాడు. ఈ ప్రకారం గా తను చెప్పొచ్చేదేమిటంటే, మన తెలుగు,కన్నడ,తమిళ, మళయాళ భాషలు కూడా ఆంగ్లం తో సమానమైన భాషలని,కేవలం ఉపయోగరీత్యా ఆంగ్లానికి ప్రపంచస్థాయిలో ఉపయోగించదగ్గ అవకాశం ఉండటం వలన దాన్ని ముఖ్యమైన భాష గా భావించడం లో తప్పులేదుగానీ గొప్పతనం ఆపాదించటం మాత్రం ఎంతమాత్రం తగదని గితవు పలికాడు. ఒక తెలుగువాడి గా ఆంగ్లం మనతోటి సమానమన్న ఇతడి మాటలకి సంతోషించినా, పూర్తి పాఠం మనకి అంతగా రుచించలేదనే చెప్పాలి. "అంగ్లం గొప్ప కాకపోవటమేమిటి? వీడి బొంద కాకపోతేనూ!" పైగా ఇంగ్లీషు భాషా ప్రొఫెసరైయ్యుండీ ఇలా దాని గొప్పనే శంకిస్తున్న ఈతడిని, "ఇంత స్థాయికి ఎలా ఎదగనిచ్చారా?" అన్న అనుమానం కూడా నా తెలివైన బుర్రలో వచ్చింది. ఆఖరుకు ఈ సెమిస్టరులో అంగ్ల సాహిత్యంతో పరిచయానికి సన్నిద్ధులుగా ఉండమని చెప్పి, అసలు క్లాసులు సోమవారం నుండి ప్రారంభమవుతాయనీ, ఇక మేము ఈ రోజుకు విశ్రమించవచ్చని చెప్పి తను నిష్క్రమించాడు.


హాస్టలుకు వెడితే సీనియర్ల బెడద తప్పదు గనక క్లాసులో జిడ్డోడుతున్న ఒకరి ముఖారవిందాలు ఒకరం చూసుకుంటూ కూలబడ్డాం. ఒక్క క్షణం క్లాసులో నిశ్శబ్దమే తాండవించింది. ఇంతలో ‘గౌరి’ లేచి "వై డొంట్ వుయ్ హావ్ ఎన్ ఇన్ ఫార్మల్ ఇన్ట్రడక్షన్" అన్నది. దానికి ‘రేఖ’ "యా యా స్యూర్" అంటె మిగతా వారం మాత్రం గంగిరెద్దుల్లా తలఊపాం. తరువాత కొంచం సాధారణ స్థాయి న్సేహపూరిత పరిచయాలు అందరూ చెప్పటం మొదలెట్టారు. అబ్బాయిలలొ శ్రీనివాన్ అనే అతను ఇంగ్లీషులో కొంచం తడబడితే, ‘రేఖ’ తనని (పురుగులా) చూసిన చూపు నాకింకా గుర్తు. అదే తడబాటుకు ‘గౌరి’ మాత్రం, "డోంట్ వర్రీ యు కెన్ స్పీక్ ఇన్ హిందీ ఇఫ్ యు వాంట్, ఆర్ స్పీక్ ఇన్ యువర్ మదర్ టంగ్. వుయ్ విల్ ట్రైటు అండర్శ్టాడ్" అన్నది. ఈ ముక్కతో ఈ జీన్సుదేవతపైన నాకు విపరీతమైన గౌరవం వచ్చేసింది. ఇక వంతువంతుగా దాదాపు అందరూ ‘స్టార్ ప్లస్’ వారి హిందీ చానల్ లా హిందీ లో తమ పరిచయాలు దబాయించేశారు. అప్పుడర్థమైంది మనకి, ఏ కొంతమంది సిటీ పిల్లలు మినహా మిగతావారు నాబోటి ఊరోళ్ళేనని. ఈ జ్ఞానోదయంతో వచ్చిన ఉత్సాహంతో మనం రెచ్చిపోయాం. పరిచయాల లోనే ‘అంబిలి’ తన గురించిచెబుతుంటే ఉండబట్టలేక," తన పేరుకి "అర్థమేనిటని?" అడిగేశా. దానికి ఆ పిల్ల కొంచం సిగ్గుపడి నా వంక విచిత్రంగా చూసి, ఇది ఒక మళయాళ పదమని దానర్థం "వెన్నెల" అని చెప్పింది. ఈ మాట వినగానే నా మదిలో కోటి వెన్నెలలు కురిసిన ఫీలింగ్. హమ్మయ్య ఇంత అందానికి అంబలి లాగా, అంబిలి పేరేమిటని మధన పడిన నా మనసు కుదుట పడింది. ఇక అబ్బాయిలలో విచిత్రంగా ఉన్నాడు కాబట్టి టిబెటన్ కుర్రాడు ‘నంగ్యాల్’ నచ్చితే, మరో బెంగుళురు కుర్రాడు ‘హరీశ్’ నవోదయ విద్యాలయం నుంచీ వచ్చాడు (మనమూ ఆబాపతే) కాబట్టి నచ్చాడు. ఇక ముఖ్యంగా అమ్మాయిలలొ‘ మాల’ అనే కూర్గి (కర్నాటకలో కూర్గ్ అనె ప్రాంతం వారు) అమ్మాయి తో పాటూ, తెలుగమ్మాయి ‘హరిత’ కూడా నచ్చింది. ఇలా స్నేహం చెయ్యదగ్గవాళ్ళూ, ప్రేమించదగ్గవాళ్ళు అంటూ ఓ పేర్ల లిస్టుని మనసులో ఫైనల్ చేసి ఆరోజు కానిచ్చి, హాస్టలుకు బయల్దేరాం...అదీ లైన్లో.

("ఈవెనింగ్ వాక్ లు , స్నేహాలూ, ప్రేమలు" అన్న చతుర్థ (4) భాగం త్వరలో)

13 comments:

bojja.vasu said...

ఇరగ దీస్తున్నావు మహేశా,
చదువుతుంటే సమయము తెలియటములేదు.
మీ వూరు మదనపల్లి దగ్గర అయినా, యాస లేకుండా చక్కగా చదివించే శైలి లో వ్రాస్తున్నందుకు అభినందనలు.
మరి మా ఊరి వాళ్ళం ప్రధాన మంత్రి అయిన ఎన్టీఆర్ అయిన ప్రేమగా వోడు అనే పిలుస్తాము అని చెప్పటము వరుకు బాగానే వుంది కాని, కేసిఆర్ లాగ దంచుతం,నరుకుతం,రక్తం ఎరులయి పారిస్తం లాంటివి లేవుకదా?(అయన మా తెలంగాణలో ఇలాగే మాట్లాడుటాము అంటారు).
తరువాత భాగం కోసం ఎదురుచూస్తూ...
మరొక్కసారి అభినందనలతో...

sujata said...

'స్నేహించ దగిన వాళ్లు, ప్రేమించ దగిన వాళ్ళూ అంటూ వేరే వేరే లిస్టులు తయారు చెయ్యడం బాగుంది. మా కాలేజి లో ఇంకో రకం అమ్మాయిలూ, అబ్బాయిల లిస్టు కూడా ఉండేది.. వీళ్ళు వార్తాహరులు / రాయ బారులూ అన్న మాట. వీళ్ళు ప్రేమ ని & స్నేహాన్నీ.. రెండింటినీ సపోర్ట్ చేస్తారు. వీళ్ళ తో వ్యవహారం సేఫ్ అన్నమాట. అందరికీ లంకె ల్లా పనిచేస్తారు.

sujatha said...

మహేష్ గారు, మీరు మీ స్మృతుల్ని పంచుతున్నట్టు గాక, అందరి స్మృతుల్నీ తట్టి లేపుతున్నట్టుంది. Big సినిమాలో Tom Hanks లాగా అందరూ చిన్న పిల్లలు అదే లెండి, కాలేజీ పిల్లలైపోతున్నారు. రాగింగ్ ఇలా సరదాగా ఉంటుంది కదా! ' గుర్తుకొస్తున్నాయి ' పాట గుర్తొస్తోంది నాకు.

బైలు కుప్పె చూశారా మీరు? కూర్గ్ వెళ్ళినప్పుడు కుశాల నగర్ లో ఉన్న ఆ ప్రదేశం చూశాను. అద్భుతం అనే మాట చాలా చిన్నదనిపిస్తుంది, బుద్ధుడి, పద్మపాణి విగ్రహాలను వర్ణించడానికి.

Kathi Mahesh Kumar said...

వాసు గారు మరియూ సుజాత గారు, నెనర్లు.
@వాసు మాది చిత్తూరు జిల్లా మదనపల్లి దగ్గరైనా, నాకు ఇష్టమైన రచనలు అచ్చతెలుగువి కావటం మూలంగా రాతలో ఆ సౌలభ్యం ఏర్పడింది.మాట్లాడితే మరీ యాస లేకపోయినా కొన్ని సొబగులు మాత్రం, "సిత్తూరివి వచ్చేత్తాయ్".

@సుజాత, నా టిబెటన్ స్నేహితుడి పుణ్యమా అని కర్ణాటక టిబెట్ (బెలకుప్పె) చూసాను. మళ్ళీ ఈ సంవత్సరం వెళ్ళే ఆలోచనున్నాయి.నేను మతాన్ని పెద్దగా నమ్మకపోయినా,బుద్దిజం లో ఒక అవధులు లేని ప్రశాంతత ఉందనిపిస్తుంది.

e-rationality said...

మస్తుగ రషెస్తున్నావు, ఇలాగెరాశెయ్ నెను ఐతె ఒక్కటె నవ్వుకున్న

sujatha said...

మహేష్ గారు,
మీ వూరు బానే ఉందండోయ్! మా ఆయన తిరుపతి నుంచి మదనపల్లికి డ్రైవింగ్ బాగా ఎంజాయ్ చేసారు. హార్సిలీ హిల్స్ కని వెళ్ళాము. పనిలో పని రిషీ వాలీ స్కూలు కూడా దర్శించి ధన్యులమయ్యాము.

Kiran said...

మహెష్ గారు, చాలా బాగా వ్రాస్తున్నారు.

మీ కాలెజి లొ బియెస్సి యెడ్ చదివిన ఒక హరిత నాకు తెలుసు.

కొత్త పాళీ said...

బొజ్జ వాసు గారికి .. మీ వ్యాఖ్య మహేశ్ గారి రచనా సామర్ధ్యాన్ని, భాషా చాతుర్యాన్ని అభినిందించడానికి రాసిందైతే కావచ్చు. కానీ యాసతో రాయడం (సరిగ్గా చెప్పాలంటే మాండలికంలో రాయడం) సులువైన పని కాదు ఆయా ప్రాంతల వారికి కూడా. ఈసడించుకోవలసినది అసలే కాదు. చిక్కటి చిత్తూరి మాండలికానికి నామిని కతలు, ఈ మధ్య బాగా రాస్తున్న సుంకోజు దేవేంద్ర కథలు చదవండి. గుమ్మపాల మాదిరి కడప భాషని పిండుతున్న మన రానారె బ్లాగు చదవండి.

మహేశా (ఈ పిలుపు నాకు బావుంది, మహేష్ గారు కంటే).. మీరిలాక్కంటిన్యూ ఐపోతే శెఖర్ కమ్ముల హేపీడేస్ - 2 తియ్యొచ్చేమో ఈ సంవత్సరాంతానికి!

Srinivas said...

ఒక దిష్టి చుక్క:

ఇక మేము ఈ రోజుకు విశ్రమించవచ్చని చెప్పి తను ఉపక్రమించాడు. - నిష్క్రమించాడు కదా! ఉపక్రమించడమంటే మొదలుపెట్టడం.

Kathi Mahesh Kumar said...

అభిమానానికి నెనర్లు.

@ సుజాత గారూ, హోల్ ఆంధ్రా మొత్తంలో చల్లటి ప్రదేశం మాదే నండోయ్! బాగానే ఉంటుంది మరి.

@కిరణ్, ఒకవేళ మీకు తెలిసిన మా కాలేజి హరిత 1994-98 మధ్య గనక ఉండిఉంటే, మన సాహసాలు ఖచ్చితం గా తెలిసే ఉంటాయ్.

@కొత్తపాళీ గారూ, మా సిత్తూరు బాస సొబగు అందరికీ తెల్సిందే, వాసుగారు సర్ధాకనుంటారు లెండి.

@శ్రీనివాస్, దిష్టిచుక్క దిద్దడమైనది.

విహారి said...

బాగా రాస్తున్నారు.

ఇంతకూ మీది వాయల్పాడా? దాని పక్కూరా? నేను వాయల్పాడు చాలా సార్లే వచ్చా. మా (కజిన్‌) అక్క వాళ్ళు వుంటారు.

-- విహారి

Kathi Mahesh Kumar said...

@విహారి గారు, మాది వాయల్పాడే!ఇప్పుడు వాల్మీకిపురం అనికూడా అనొచ్చు.

bojja.vasu said...

కొత్త పాళీ గారు, మీతో నేను ఏకీభవిస్తున్నాను.
మీరు సూచించిన రచనలు చదివేదానికి ప్రయత్నిస్తాను, నేను ఎవరి యాసని యీసడించుకోను, సరదాగా వ్రాసానంతే. కాళీపట్నం రామారావు గారి రచనలు చదివితే తెలుస్తుంది కదా మాండలికములో వ్రాయటం ఎంత కష్టమో.
మీకా వుద్దేశం(లేక మహేష్ గారికి) కలిగించినట్టయితే క్షంతవ్యున్ని.
నెనర్లు.