Sunday, May 11, 2008

సిరి ‘కట్నలీల’ - ఓ కొత్త కథకుడి కథ

దినం: శుక్రవారం
సమయం: 10.30

"చా, ఈ మగాళ్ళంతా ఇంతే!" ఆఫీసుకు వచ్చీరాగానే తన సీట్లో కూర్చుంటూ అంది ‘సిరి’.
"ఏం, మళ్ళీ ఇంకో పెళ్ళిచూపులా?" తెలిసిన కథే, అన్నట్టు చూస్తూ అడిగింది ‘లత’.
"అవునే, సాఫ్టువేర్ గాడట, పది లకారాలు కావాలట. పైగా, త్వరలో ‘అమెరికాకెళ్ళి డాలర్లు సంపాదిస్తే మీ కూతురే గదా సుఖపడుతుందీ’, అని వాడి తల్లి సన్నాయి నొక్కులుకూడానూ, పిచ్చిపట్టిందనుకో." అంది మధ్యతరగతి మామూలు తెలుగు అమ్మాయిల ప్రతినిధి సిరి.

"ఆ మాత్రమైనా ఇవ్వకపోతే మొగుళ్ళెలా దోరుకుతారండీ, ఈ ఖరీదైన కాలంలో", అంటూ పక్క క్యూబికల్ 'శ్రీనివాస్' తాబేలల్లే తలబయటెట్టి తన అమూల్యమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. ఆసలే చిరాకుగా ఉన్న సిరి కి ఈ మాటతో చిర్రెత్తుకొచ్చింది. "మీకు మా మాటలు వినడం కన్నా, వేరే పనిలేదాండీ?" అని వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ, మర్యాద వోలకబోసింది సిరి. "వినకూడదనుకున్నానండీ కానీ నా చెవులూరుకోలేదు, ఏంచెస్తాం". అంటూ అర్జెంటుగా పశ్చాత్తాపం ప్రకటించేశాడు. ఇక అనడానికీ పడడానికీ ఏమీలేక లత, సిరి ఒకర్నోకరు చూసుకుని, అసంకల్పితంగాన నవ్వేశారు. ఈ సారి తెల్లబోవడం శ్రీనివాస్ వంతయ్యింది.

సిరి నాన్న కలెక్టరాఫీసులో గుమస్తాగా చేసి రెటైర్ అయ్యారు. ఉద్ద్యోగం చేసిన రోజుల్లో గొప్ప హోదా వెలగబెట్టక పోయినా బహు పొదుపుగా జీవితం గడిపి, ఒక చిన్న ఇంటితో పాటు కూతురు పెళ్ళికని కొంత సొమ్ము వెనకేసుకున్నారు. ఆడపిల్లకు పెళ్ళి మాత్రం చేస్తే చాలని నమ్మిన వ్యక్తిగనక, సిరిని పెద్దచదువులు వెలగబెట్టనీయక గ్రాడ్యుయేట్ అనిపించేశారు. ఇంగ్లీషు మీడియం స్కూల్లో చదవడం వల్ల వచ్చిన ఇంగ్లీషు, తను చేసిన "బీకాం" ను అడ్డం ఫెట్టుకుని ఒక స్వచ్చందసంస్థ లో ఆరునెల్ల క్రితమే "టీం అసిస్టెంట్" గా ఉద్యోగం సంపాదించి, నాన్న పెన్షన్ తో పాటు తన సంపాదనతో సంసారానికి కోంత వేడ్నీళ్ళకు చన్నీళ్ళు కలుపుతోంది . ఈ ఉద్యోగం కూడా పెళ్ళి చేసేవరకే అని సిరి నాన్న ఉద్యోగం వచ్చిన రోజే తేల్చి చెప్పడమూ అయిపోయింది.

"వచ్చినప్పటి నుండీ ఇదే గోల వీడితో", శ్రీనివాస్ ని ఉద్దేశించి అంటూ తన పనిలో పడింది సిరి. "మంచబ్బాయేలేవే" అంది టైపిస్ట్ లత, అనునయిస్తూ. "ఆ... మంచే కానీ కాస్త జోల్లుకూడా " అంది కాస్త సాలోచనగా సిరి. "అంత కాదు లేవే, మర్యాదగానే ఉంటాడుగా, బొంబాయిలో చదివొచ్చాడు కాబట్టి కొంచం ఆంధ్రా కల్చర్ తెలీదు అంతే" అంటూ సమాధానమిచ్చింది, టైప్ చెయ్యాల్సిన కాగితాల వంక చూస్తూ, లత.

అన్యమనస్కంగా పనిచేసి లంచ్ టైం వచ్చేసరికీ, ఇందుకోసమే ఎదురు చూస్తున్నట్టుగా టిఫన్లు పట్టుకుని లంచ్ రూం కి పరుగెట్టారు సిరి, లత. తీరా చూస్తే అక్కడ శ్రీనివాస్ తప్ప ఇంకెవ్వరు లేరు. శ్రీనివాస్ నాన్న మిలట్రీ అ‘ట’ అందుకని ఈ కుర్రాడు కాలికి చక్రాలు కట్టుకుని భారతదేశం అంతా తిరిగి చదువుకు పట్టం కట్టాడ‘ట’. సోషియాలజీయో, సోషల్ వర్క్ లోనో బొంబాయిలో పీజీ చేసి, ఉద్యోగం కోసం ఇక్కడ తేలాడ‘ట’. ఇలా సిరికి తన గురించి లత చెప్పిన "ట" ల సమాచారం తప్ప ఇంకేమీలేదు. వచ్చిన మూడు నెలలలో, ఆఫీసు పనులు దాదాపు భుజానేసుకుని మొయ్యటం వల్ల బాసుకు కూడా ప్రీతి పాత్రుడైపోయాడు. ఇక సిరి విషయంలో తను తీసుకునే "ప్రత్యేక శ్రద్ద", సిరికి కొంచెం ఇబ్బంది కలిగించినా, ఎప్పుడూ హద్దులు దాటలేదు కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. పొద్దున జరిగిన తంతుకి ఇప్పుడు మళ్ళీ దాదాపు ఒంటరిగా దొరికిపోవడం కాస్త ఎబ్బెట్టుగా ఉంది సిరి కి.

"రండి మేడమ్స్", అంటూ ఆహ్వానం పలుకుతూ, ఆఫీస్ వాళ్ళందరూ బాస్ లేని అవకాశాన్ని వినియోగించుకుని వీకెండ్ ని శుక్రవారం మధ్యాహ్నం నుంచే సెలబ్రేట్ చేసుకోవడానికి ఇళ్ళకు చెక్కేసారని నింపాదిగా చెప్పుకొచ్చాడు. "ఐతే మనంకూడా భోంచేసి బయల్దేరుదామే, మా పిల్లలూ స్కూలునుండీ వచ్చేసుంటారు" అంటూ టిఫిన్ ఓపన్ చేసింది లత. శ్రీనివాస్ ఒంటరివాడుకాబట్టి హోటల్ నుండి పార్శిల్ తెచ్చుకుంటాడు, బహుశా పార్శిల్ తేవడానికి వెళ్ళిన ప్యూన్ కోసం ఎదురుచూస్తున్నట్టుంది.ఎదురుగా ఏమీ లేదు. ఇక టిఫిన్ ఓపన్ చేస్తే తనతో పంచుకో్వలసి వస్తుందని, చల్లగా కూర్చుంది సిరి.

"ఏంటండి సిరిగారూ ! ఇంకా పొద్దునున్న మూడ్ లోనే ఉన్నారా, టిఫిన్ మూత తియ్యట్లేదు" అంటూ శ్రీనివాస్ పలకరించాడు. అసలే తనను ఎలా అవాయిడ్ చెయ్యాలా అని ఆలోచిస్తుంటే, తను ఇలా అనగానే ఒక్కసారిగా పిచ్చ కోఫమొచ్చింది సిరికి. "మీ మగాళ్ళకేం తెలుస్తాయండీ మా బాధలు?" అంటూ తఠాలున అనేసింది. "ఐతే తెలియజెప్పండి, నేనెప్పుడూ తయారే" అంటూ కౌంటరేశాడు ‘శీను’. ‘ఈ రోజు వీడికి మూడింది’ అని మనసులో అనుకుని చెప్పటం మొదలెట్టింది సిరి. "సమాజం లో స్వేచ్చ మీది,ఆడదాని పై అధికారం మీది, ఇంట్లో పెత్తనం మీది,ప్రపంచంలోని సుఖాలన్నీ మీవి, ఐనా మగాడికి కట్నం పెరుతో ఆడదిచ్చే డబ్బు మాత్రం కావాలి, ఎందుకండీ మా ఆడవాళ్ళు మీమగాళ్ళకు డబ్బులిచ్చి మరీ దాస్యం చెయ్యాలి?" అంది. "నిజమే! ఇలాజరగటం తప్పే. కానీ ఇందులో మగవాడు చేసిన తప్పేమిటండీ?" అని అమాయకంగా అడిగాడు.

‘తప్పా, తప్పంతా మగాళ్ళదే !’
‘ఆ తప్పే ఏంటని అడుగుతున్నా?’
‘కట్నం అడగడమే తప్పు!’
‘ఆ విషయం చట్టమే చెబుతోంది, కానీ ఇందులో మగాడి తప్పేంటి?’
‘కట్నం కావాలనటం.’
‘మరి మీరివ్వటానికి రెడీ కదా అదితప్పుకాదా?
‘మేమిస్తే మీరు తీసేసుకుంటారా?’
‘ఇవ్వడానికి మెజారిటీ తయారుగా ఉంటే, మీకు మాత్రం ప్రత్యేకంగా కన్సెషన్ ఇవ్వాలా?’ అసలు మీసమస్య కట్నం అడగటమా, లేక మరీ పది లక్షలు ఆడగటమా?’ అని శీను అనేసరికి సిరికి నోట మాట రాలేదు.

"చూడండి సిరిగారు ! కట్నం అన్నది మీసమస్య అయితే, నేను ఇవ్వను అని భీష్మించుకు కూర్చోగలిగే హక్కు మీకుంది. అసలు కట్నం తీసుకోకుండా పెళ్ళికి తయారైన వాడ్ని చేసుకోవచ్చు. కానీ మీ ఉక్రోషం వాడు ఇంత కట్నం ఎందుకు ఆడిగాడూ అని. ఒక వేళ వచ్చినవాడు మీ బడ్జట్ లోగనక ఉండి ఉంటే,ఈ పాటికి పెళ్ళికి రెడీ అయ్యేవారు. ఇంత మాత్రానికి మొత్తం మగజాతిపైన కత్తిగట్టడం ఎంతవరకూ సమంజసం?" అని మర్యాదగా అడిగాడు శీను. "ఐతే పెళ్ళి కాకుండా ఉండిపొమ్మంటారా?" అని ఎత్తి పొడిచింది. "అది నా ఉద్దేశం ఏంతమాత్రం కాదు. సమస్యని సరిగా గుర్తించి, తరువాత మగాడ్ని భాధ్యుడిని చెయ్యమంటున్నాను అంతే" అని సర్దిచెప్పబోయాడు. " మీ ప్రకారం సమస్యని సృష్టించింది మా ఆడవాళ్ళంటారా?" అని రెట్టించింది. "సమస్య ఎవరు పుట్టించారో నాకు తెలియదు.కానీ సమస్యని పెంచి పోషించడం లో మాత్రం ఆడవాళ్ళు కూడా సమాన పాత్ర పొషించారని మాత్రమే నా ఉద్దేశం". ఈ మాటతో తదేకంగా టిఫిన్ లోకి చూస్తున్న లత ఉలిక్కిపడి, "అంటే" అని హుంకరించింది.

శీను సర్దుకుని చెప్పడం మొదలు పెట్టాడు, "అసలు కట్నం ఇవ్వము అని ఆడాళ్ళంతా ఒక్క సారిగా అనుకుంటే,వార్ని ఆపడం ఏ మగాడి తరం? అసలే జెండర్ రేషియో తగ్గిన భారతంలో కట్నం అడిగితే అమ్మాయి దొరకదు అని తెలిస్తే కట్నం అడిగే ధైర్యం ఏ మగాడు చెయ్యగలడు? నిజం చెప్పాలంటే, మగాడు ఖచ్చితంగా కాళ్ళబేరానికి వస్తాడు. ఎందుకంటే, ఆడది లేకుండా మగాడు అసలుండలేడు కాబట్టి. "

"అంటే మమ్మల్ని ఇప్పుడు ఉధ్యమాలు చెయ్యమంటారా?" అని ముక్త కంఠం తో ఇద్దరు మహిళామణులూ ఒక్కసారిగా గొంతుచించుకున్నారు. "ఉద్యమాలు చెయ్యక్కరలేదు, కనీసం మగాళ్ళను మాత్రం భాధ్యుల్ని చెయ్యకండి, ఇంకా చెప్పాలంటే, ఈ విషయం లో మగాళ్ళు మీకు చేసే సహాయాన్ని మర్చిపోకండి" అన్నాడు. "మగాళ్ళు మాకు చేసే సహాయమా? అదేంటి!" అన్నారు ఇద్దరూ. "మీ పెళ్ళిళ్ళు చెయ్యడానికి చెప్పులరిగేలా తిరిగేది ఎవరు? ఉంటే మీ నాన్న, లేదంటే మీ అన్న వీళ్ళు మగాళ్ళని మీరు మర్చిపోతున్నారే!?!" అని సున్నితంగా ఎత్తిచూపాడు శీను. "అది వాళ్ళ బాధ్యత" అంది లత, ఏదో హఠాత్తుగా గుర్తొచ్చినట్టు. "మరి మీ ఆడాళ్ళ బాధ్యత, మగాళ్ళకి మీ ఫోటొయిచ్చి మీకొ మొగుణ్ణి వెదకమని పంపడమా?" అని కాస్త ఘాటూగా సమాధానమిచ్చాడు శీను. "లేకపోతే మొగుణ్ణి వెదకడానికి మమ్మల్ని బయలుదేరమంటారా?" అంది సిరి అసహనంగా . "వెళ్లడం లో ఎంతమాత్రం తప్పు లేదు. కానీ అలా వెళ్ళే అవసరం కూడా మీకు లేదని, అవకాశాలు మీ దగ్గర ఎప్పుడూ ఉన్నాయని కూడా గమనింఛలేని స్థితిలో మీరున్నారు.అది ఇక్కడ ట్రాజెడీ". "కాస్త డీటైల్గా చెప్తారా", అంది లత ఉత్సుకతో.

"మీరు రోడ్లో వెళ్తున్నప్పుడు, పెళ్ళిళ్ళలో,బస్సులలో ఎక్కడ పడితే అక్కడ, మగాళ్ళు మీ ప్రేమకై ఎదురుచూస్తూ కనపడ లేదా? సరే వీళ్ళు మీ ప్రేమకు అర్హులుకాని పోకిరివాళ్ళనుకుందాం. కనీసం మీ కాలేజిలో, వర్క్ ప్లేస్ లో మీకు అర్హుడైనవాడూ,మీఫ్రెమకై ఎదురు చూసినవాడూ ఒక్కడంటే ఒక్కడులేడా? వీరిలో ఒక్కర్ని కూడా కట్నం లేకుండా పెళ్ళి వరకూ తీసుకురాలేక పోయారా? మిమ్మల్ని ప్రేమించమనట్లేదు, మీ ఆశయం పెళ్ళి కాబట్టి దానిగురించే చెబుతున్నాను. మీరు ‘మంచి అమ్మాయి’ అయ్యే ఫ్రయత్నం లో, జీవితాన్ని కన్వీనియంట్ గా గడిపేసి ఇప్పుడు మీ స్థితికి మగాళ్లు కారణమనడం సమంజసమంటారా?" అని సిరిని చూస్తూ ముగించాడు శీను.

సిరి ముఖం లో నెత్తురుచుక్క లేదు. తన అంతరాలలో దాగిఉన్న భూతాన్ని, శీను తన కళ్ళముందే నిలిపినట్టుగా ఉంది. తను అడిగిన ప్రశ్నలకి సమాధానం ఎక్కడ వెదకాలో తెలియక, అసలున్నాయో లేవో తెలియక, తన మూర్ఖత్వాన్ని కప్పిపుచ్చుకో లేక కాసేపు మౌనం వహించింది. ఇంతలో లత ఇద్దరివైపూ తిరిగి, "ఇవన్నీ చెప్పటానికి బాగుంటాయ్, నువ్వు కట్నం లేకుండా పెళ్ళి చేసుకుంటావా?. అంది. దీనికి సమాధానంగా శీను, "నేనెప్పుడూ రెడీనే"అ న్నాడు సిరిని చూస్తూ.

దినం: సోమవారం
సమయం: 10.30

ఆఫీస్ లోకి నవ్వుతూ వచ్చింది సిరి. హాయ్!గుడ్ మార్నింగ్ అని శీనుకు లతకు చెప్పి తన సీట్లో కూర్చుంది. వేర్వేరు వైపుకు తిరిగి కూర్చున్న శీను, సిరి ల ముఖాల్లో ని నవ్వు దాదాపు ఒక్కలాగే ఉంది.

P.S : నన్ను పోరి, నాచేత ఈ పాపం చేయించిన అరవింద్ కు కసితో నా కథ అంకితం
---------------------------------------------------------------------------------------

17 comments:

teresa said...

కత్తి!:)

శ్రీ said...

బాగుంది, అమ్మాయిలని చైతన్యవంతుల్ని చేస్తున్నారు.

Kathi Mahesh Kumar said...

‘కత్తి’ నా యింటిపేరు కూడా నండి తెరెసా గారు. మీరు కథ నన్నారో,నన్ననారో తెలియకుంది.

శ్రీ గారు, ఏదో మనవంతు కృషి మనం చేస్తున్నాం. చైతన్యవంతుల్ని చేయడమంత పెద్దమాట కాదుగానీ, నాకు తెలిసింది పంచుకుంటున్నా!అంతే.

Srividya said...

chaalaa baavundi

మంజుల said...

మీరేం చెప్పాలనుకున్నారో అది బాగా చెబుతున్నారు. కధనం మాత్రం మాములుగా ఉంది. మొదటి ప్రయత్నం లో మాములుగా అనిపించేలా రాశారు కాబట్టి ముందు ముందు ఆహా అనిపించేలా రాస్తారనమాట. ఈ కధలో తేదీ లు టైము వివరం గా రాయటం అంత అవసర్లేదనుకుంటా.

Kathi Mahesh Kumar said...

స్వాతి గారు మీతో "మమూలుగా రాశారు", అనిపించుకుంటే, నేను కథల్రాయడానికి క్వాలిఫికేషన్ సంపాదించినట్టే.మీ ‘త్వమేవాహం’ చదివిన తర్వాత అసలు కథ రాయకూడదని నిర్ణయించు కున్నా.ఎందుకంటే, ఆ స్థాయిలో జీవితం లో నేను రాయలేనని తెలుసు కాబట్టి.కానీ నామిత్రుడొకడు తప్పదంటేనూ,మొదలెట్టా.

ఇక తేదీలు, సమయం అంటారా, మార్పు రావడానికి ఒక ‘మాట’ , ఒక ‘వారాంతరం’చాలు అని చెబ్దామనుకున్నా. అందుకే వాటిని బోల్డ్ ఫాంట్ కూడా చేశా...ఏదో నా ఆలోచన.

సుజాత వేల్పూరి said...

మహెష్ గారు,మీరు కొత్త కొత్తగా బాగా ఆలోచిస్తారండి!'అవును కదా, ఇలా కూడా ఆలోచించచ్చు ' అని అమ్మాయిల చేత అనిపించాలనుకున్నట్టున్నారు. సబ్జెక్టు బాగానే ఉన్నా కథనం ఇంకొంచెం మెరుగ్గా ఉండొచ్చని అనిపించింది.మొదటి కథ ఇలా రాశారంటె, తర్వాతి కథలు తెరలు చిరిగి పోయేలా ఉంటాయన్నమాట!(మీ సినిమా భాషలో) సో,మీరు తీయబోయే సినిమా మీద కూడా నాకు నమ్మకం వచ్చేసింది.

నిషిగంధ said...

ఏంటీ! ఇది మీ మొదటి కధా!! నేన్నమ్మను.. అస్సలంటే అస్సలు! :-)
చెప్పాలనుకున్న విషయం ఎలాంటి కన్ ఫ్యూజన్ లేకుండా క్లియర్ గా చెప్పారు.. ఇంకా పాటించవలసిన జాగ్రత్తలు ఎం.ఎం సుజాత గారు, స్వాతికుమారి గారు ఆల్రెడీ చెప్పేసారు.. మరి ఇంకో కత్తి లాంటి కధ ఎప్పుడు వదుల్తున్నారు??

San .D said...

మీ లాజిక్కు బాగుందండీ ;-)

రాధిక said...

చాలా బాగుందండి.ఆలోచించవలసిన విషయాలు.

Rajendra Devarapalli said...

మొదటి కధతో ముందుకు వచ్చిన మీకు నా అభినందనలు.మీ కధ చదివాక నాకు వచ్చిన కొన్ని పోరంబోకు అనుమానాలు,ఆలోచనలు.మీ కధానాయకుడు..శ్రీనివాస్ నాన్న మిలట్రీ అ‘ట’ అందుకని ఈ కుర్రాడు కాలికి చక్రాలు కట్టుకుని భారతదేశం అంతా తిరిగి చదువుకు పట్టం కట్టాడ‘ట’. సోషియాలజీయో, సోషల్ వర్క్ లోనో బొంబాయిలో పీజీ చేసి, ఉద్యోగం కోసం ఇక్కడ తేలాడ‘ట’.వగైరాలు పైగా పెళ్ళికాని సిరి అనే అమ్మాయి ప్రెమించకపోతుందా అని ఎదురు చూస్తున్నవాడు కూడా.అలా కాకుండా అతగాడు సకలదుర్గుణధాముడయ్యుంటే?లేదా పెళ్ళయ్యి కూడా ఆ అమ్మాయిని వలలో వెసుకుందామని పాచిక వేస్తుంటే?
అప్పటివరకూ శ్ర్రీనివాస్ అంటేనే ధుమధుమలాడినమ్మాయి తెల్లారేసరికి సిగ్గులమొగ్గ కావటం కాస్త చిత్రంగా లేదూ?అందరు సిరులకు అలా శ్రీనివాసులు దొరికితే మంచిదే,దొరకకగేగా ఈ తిప్పలన్నీ?ఎంత స్వచ్చందసంస్థలో ఉద్యోగమైతే మాత్రం బొత్తిగా కులమతప్రసక్తి లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటారా?
మీ కధ నచ్చలేదని నేను అనటమ్ లేదు ఆయా పాత్రల తీరుతెన్నుల గురించి పైన చెప్పినట్లు నా పోరంబోకు ప్రశ్నలు ఇవి

Nagaraju Pappu said...

అయ్యా - నేనూ మీటైపే, లాజిక్కెక్కువా, స్పార్కు తక్కువాను. మీరింకా నయం - కొందరిచేతనైనా "కత్తి" అనిపించుకొన్నారు. ఈ మధ్యనేనోకథలాంటిది రాసి, కొందరికి పంపి సుమారుగా "ఛీ" అనిపించుకొన్నా. కావునా, నా విమర్శని సహృదయంతో స్వీకరించేయండి:
నాలాటి లాజిగ్గాడికి మీ కథలో బాగా నచ్చినవి:
మధ్యతరగతి సగటు అమ్మాయికి "సిరి" అని పేరెట్టటం, కట్నం అక్కర్లేని హీరోకి బోలెడంత కన్యాశుల్కం ఇచ్చి, పద్మావతిని కట్టుకొని, శిలగా మారిన ఏడుకొండలవాడి పేరెట్టడం - ఈ ప్రయోగాలు అదుర్సు.

సిరి - మధ్యతరగతి సగటు అమ్మాయి అని మీరు చెప్పేస్తే మాలాటి లాజిక్కులు గుడ్డిగా నమ్మేస్తారనుకొన్నారా? మీరు చెప్తేకుదరదు, అలా అని మాకు కథ చదివినప్పుడు అనిపించాలి కదండీ?

ఇది చదువుతూంటే, NDTV లో డిబేట్లు గుర్తుకువచ్చాయి. పాత్రలు సజీవంగా పాఠకుడి ముందుకి వచ్చి తమగోడు చెప్పుకొన్నట్టు లేదు. సిరి, శ్రీనివాస్ అనే పావులతో మీరే రెండువైపులా చదరంగం ఆడుతున్నట్టుగా ఉంది.

స్వాతిగారన్నట్టు - ఇప్పుడు ఇది మాములు కథ. ఈ కథలో పాత్రలకి మరికొంచెం రక్తమాంశాదులు, ఓ స్వతంత్ర వ్యక్తిత్వం, కథలో కొన్ని సంఘటనలు, సన్నివేశాలు ప్రవేశపెడితే అప్పుడు మంచి కథ అవుతుంది.

కథ చదివంగానే, మనం ఇచ్చుకోలేనంత కట్నం అయితేనే - అది వరకట్నం సమస్య - అందుకే, అదింకా మన దేశం వదిలిపోలేదు, ఎప్పటికీ పోదు అని పాఠకుడికి మీరు స్పురింపచెయ్యగలిగితే అప్పుడు ఇది తప్పకుండా గొప్పకథ అవుతుంది.

కథాంశం బాగుంది, డైలాగులు, వాదన చాలా బాగున్నాయి. దీన్ని గొప్పకథగా మార్చకూడదూ?

మరీ నిక్కచ్చిగా, తెగేసి చెప్పినట్టున్నా - ఏమనుకోకండేం?

అభినందనలతో,
నాగరాజు (సాలభంజికలు)

Kathi Mahesh Kumar said...

@ రాజేంద్రగారు, మీ ప్రశ్నలతో నా కథకు నన్నే సమీక్షకుడిగా కూర్చోబెట్టారు. అందుకు నెనర్లు.
నేను ఇంకో కామెంట్ లో చెప్పినట్టు,మార్పుకు ఒక మాట,ఒక వారాంతరం చాలు అన్న ఆలోచనతో ఈ కథ రాయటం జరిగింది. ఇక శ్రీనివాస్ శీలాన్ని శంకించదగ్గ సూచనలు నేనెక్కడా చెయ్యలేదు.

ఇక సిరి మొదటిలో చూఫే అయిష్టత , ప్రేమలో ఎక్కడ పడిపోతామో అనో ఫ్రీ గా ఉంటే అలుసైపోతానేమో వంటి కారణాలతో, సిరి కావాలనే వ్యక్తపరుస్తూ ఉండేదేమో అని నా అనుమానం. అందుకే ఎటువంటి "ఆశ" లేని లతకి అతడు మంచివాడిలా కనబడతాడు.

ఇక అప్పటివరకూ తండ్రి చూపించిన దారి తప్పవేరే దారి తెలియని సిరి కి, ఈ "కొత్తదారి" పెళ్ళికి రాజమార్గంగా తోఛడం విచిత్రం కాదనుకుంటా.సిగ్గులమొగ్గవడం సహజమనుకుంటా.she was always looking for marriage,not love. If both love and marriage, that too without any financial burden are here in offering, why would she refuse? She is much more intelligent than we are and so are most women of that age.

Kathi Mahesh Kumar said...

అయ్యా నాగరాజుగారు, మీరుచెప్పిన వన్నీ అక్షర సత్యాలు. నా అభిప్రాయాల్ని పాత్రలుగా చేసి నేనాడిన ‘చదరంగమే’ ఈ కథ. ఎక్కడో ఒక దగ్గర మొదలెట్టాలి కాబట్టి ఇలా చేశాను. ఇది నేను చెప్పిచేసిందే. నేనో కథకుడినని గానీ మహబాగా కథలల్లేస్తాననే అపోహ ఏమాత్రం నాకు లేవు.ఈ విషయం బ్లాగురాసి మరీ ఒప్పుకున్న నిజం.

మొదటి కథ తో ‘మామూలు కథ’ అనిపింఛుకున్న ఆనందం లో నా స్వీయకథ రాయడం మొదలెట్టాను. అది కూడా చదివి చీల్చి చండాడగలరని ప్రార్థన.

Sridevi Aduri said...

mee college kathalu naku baga nachayi. Well modati katha kuda bagane undi.

S said...

Hmm.. నాకు కథలో పట్టు తక్కువైందేమో అని అనుమానం.. లేకుంటే...నిడివి మరీ తక్కువ గా ఉందా?? బానే ఉంది కానీ.. రాజేంద్ర గారిలా...నాదీ అదే సందేహం... ఒక్క రోజులో..ఒక్క డైలాగులో ఆమె మనసు మారిందంటే...నమ్మడం కష్టంగా ఉంది.. Wishing you good luck.... ఇంకా మరిన్ని కథలు రాయండి మరి...ఓ హాస్య కథ రాయరాదూ... :)

Kathi Mahesh Kumar said...

సౌమ్యగారూ, కథలో పట్టుతగ్గినమాట వాస్తవమే. ఇక సిరి ఒక్క డైలాగుతో మారిందని నేననుకోను.అంతవరకూ తనకు తెలియని కొత్తకోణాన్ని,ఆలోచనావిధానాన్ని అందునా తనకు అనుకూలమైన అవకాశాన్ని అందిపుచ్చుకుందని నా ఆలోచన. తను అప్పుడు కూడా శ్రీనివాసుని ప్రేమించలేదనుకుంటా, కేవలం పెళ్ళికి ‘కళ్ళు,నవ్వూ రువ్వుతోంది’ అంతే.