Friday, November 7, 2008

లైంగికత Vs నైతికత : ఒక జెండర్ ధృక్కోణం

లైంగికత ఒక శారీరక స్పందన. నైతికం ఒక సామాజిక కట్టుబాటు. మొదటిది సహజం. రెండవది సమాజనిర్మితం. లైంగికత హద్దులుదాటితే, సమాజంలోని నిర్ధిష్టత,ప్రామాణికత దెబ్బతింటాయన్న ఉద్దేశంతో, ఈ సహజత్వాన్ని హద్దుల్లో పెట్టడానికి నైతికత అనే కృత్రిమ కంచె ఏర్పాటు చెయ్యటం జరిగింది. కాకపోతే, ఇక్కడకూడా men are more equal than women అయిపోయారు. ఈ లింగవివక్షతోకూడిన నైతిక నిర్వచనాల స్థాపనలో, శారీరక గుణాలపాత్ర చాలా వుందని తెలుసుకోవడం ముఖ్యం. ఈ నిజాన్ని ఎంత విస్తృతంగా తెలుసుకుంటే, అంతే విశదంగా 'నైతికతే మన సమాజంలోని లింగవివక్షకు మూలం' అనే సత్యం గోచరిస్తుంది.


'శారీరక కలయిక గర్భాదానానికే!' అనేది మన శాస్త్రాలు చెప్పే విషయం.ఇలాంటి మాటలే దాదాపు అన్ని మతాల్లోనూ చెప్పడం జరిగింది. అది చాలావరకూ నిజం కూడాను. లైంగికతలోని మూల ఆశయం పునరుత్పత్తి (procreation). ప్రతిజీవీ తన సంతతిని వృద్ధిచేసుకుంటూ మనుగడ సాగించడం ఈ లైంగికత ద్వారానేసాధ్యం.అందుకే ఈ ప్రక్రియకి పవిత్రత ఆపాదించబడింది. ఆ పవిత్రత ఆధారంగా, కలయికకి సంబంధించిన కొన్ని నియమాలు సృష్టించబడ్డాయి. ఈ సందర్భంలో ఆడవారికీ మగవారికీ గల మౌళికమైన తేడాను గుర్తించడం అవసరం. మగవారు పవిత్రత మీరినా, నియమాల్ని వుల్లంఘించినా వాటికి ఆధారాలు లభ్యంకావు.కానీ, అదేపని ఆడది చేస్తేమాత్రం ఆక్షణంలో కాకపోయినా మరో కొన్నివారాలకి సమాజ ప్రామాణికతను దెబ్బతీసే ఆధారాలతొసహా పట్టుబడుతుంది.


'దొరికితేనే దొంగలు' అనేది మన సామాజిక న్యాయసిద్ధాంతం కాబట్టి, ఈ దొరకని దొంగలకి మినహయింపునిచ్చేసి, దొరికే దొంగల మీద ప్రత్యేకశ్రద్ధ పెట్టడం జరిగింది. మన పూర్వజులు బహుతెలివైనవారూ, మానవప్రవృత్తిని కూలంకషంగా అర్థం చేసుకున్నవారూ కనక, దొంగ చేతికే తాళాలిచ్చేసారు. ఆ తాళాలే "సుసంపన్నమయిన మన సంస్కృతీ సాంప్రదాయాలకు పట్టుగొమ్మలయిన స్త్రీమూర్తులు" అనే బాధ్యత. కుటుంబ గౌరవం, వంశప్రతిష్ట, సంస్కృతీ సాంప్రదాయాల తాళాలు ఈ విధంగా సమకూరినవే.


ఈ తాళాలను మోస్తూమోస్తూ అదేతమ జీవితాశయంగా బ్రతికెయ్యడం మొదలయ్యింది. సమయం మారింది. పరిస్థితి మారింది. ఆశయాలు మారాయి.ఆదర్శాలు మారాయి. కానీ, ఇవేమీ పట్టనట్టుగా మన నైతిక నిర్వచనం మాత్రం మారలేదు. తాళాలిచ్చిన దొంగలుకూడా, 'నిజంగా ఇది మా బాధ్యతే కామోసు' అన్న గౌరవప్రదమైనభ్రమలో జీవించడం కొనసాగించారు.లింగవివక్ష వేళ్ళూనుకుంది, నైతికతని లైంగికత, లైంగికతని నైతికతా విడదియ్యరాని సామాజిక పార్శ్వాలుగా వర్ధిల్లుతున్నాయి.


ఒకసారి సమాజం మతం నైతికతకు ఇచ్చే నిర్వచనాన్ని చూసి తరువాత ఆధునికయుగంలో జరిగిన మార్పుల నేపధ్యంలో వాటిని బేరీజు చేద్దాం.

1.కలయిక ఉద్దేశం గర్భధారణకాబట్టి అది అత్యంతపవిత్రమైన కార్యం.
2. ఆ పవిత్రకార్యం పెళ్ళితరువాతనే జరగాలి.
3. కలయికద్వారా సంభవించే సంతానానికి తల్లిదండ్రులిద్దరూ బాధ్యత వహించాలి.

ఆధునిక యుగంలో గర్భనిరోధకాలద్వారా గర్భధారణతో సంబంధం లేని కలయిక సంభవం,సాధారణం. కాబట్టి, కలయికకు ఆపాదించబడే పవిత్రతకు స్థానం లేదు. పెళ్ళి అనేది ఐచ్చికం (optional) కాబట్టి, పెళ్ళి కలయికకు అత్యవఅవసరమైన షరతు అసలు కాదు. ఇక్కడ పిల్లల ప్రసక్తి లేదుకాబట్టి బాధ్యతాయుతమైన కలయిక అంటే, ఈ కలయిక ద్వారా పిల్లలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం. ప్రస్తుతం ప్రాణాంతకమైన వ్యాధులు సంక్రమిస్తున్నాయి కాబట్టి అవి సంక్రమించకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవడం.


ఈ ఆధునిక మార్పుల నేపధ్యంలోంచీ చూస్తే, పైన చెప్పిన మూడు నిబంధనల్నీ ఇలా మార్చుకోవచ్చు.

1.కలయిక ఉద్దేశం చాలావరకూ ఆనందం. అప్పుడప్పుడూ మాత్రమే గర్భధారణ
2. పెళ్ళికీ కలయికకూ ఎటువంటి బాదరాయణ సంబంధం లేదు.
3. కలయిక ఇరు పక్షాల సమ్మతంతో, బాధ్యతాయుతంగా జరగాలి.

ఒకప్పుడు స్త్రీకి తన శరీరంపైన ఎటువంటి నియంత్రణా లేదుకాబట్టి, అప్పటి పరిస్థితికి అనుగుణంగా లైంగికతను నిర్దేశించే నైతికతను ఆపాదించడం జరిగింది. కానీ,మారిన నేపధ్యంలో కూడా అవే కొనసాగటం మాత్రం కొంత సామాజిక కుట్రలో భాగం అనిపించకమానదు.


అంతెందుకు, వ్యవస్థీకృత కలయిక జరిగే పెళ్ళిలో కూడా గర్భాధారణతోపాటూ, పెళ్ళి అనే సంబంధం ప్రేమతో కలకాలం కొనసాగే ప్రక్రియలో భాగంగా గర్భనిరోధక కలయికను ఆమోదిస్తున్నప్పుడు, దానికి ఇంకా procreation పవిత్రతను అంటగట్టడం అర్థరహితం. అలా చెయ్యటం లేదుకాబట్టి, ప్రేమించిన స్త్రీ ఆ ప్రేమకారణంగా సుముఖంగా గర్భందాల్చడానికి ఇష్టపడిందని అనుకోవాలి.అంటే, ఇక్కడ స్త్రీ ఇష్టానికిగల ప్రాధాన్యత ముఖ్యంగానీ పెళ్ళి అనే వ్యవస్థకున్న ప్రాముఖ్యత నగణ్యం. కారణం, పెళ్ళైనంతమాత్రానా భర్తతో బలవంతంగా కాపురం చెయ్యాలి లేక పిల్లల్ని కనివ్వాలన్నది చట్టరీత్యా నేరం కాబట్టి.


స్త్రీకి తన శరీరంపైన తనకుగల సంపూర్ణహక్కుల నేపధ్యంలో,ఆ హక్కుల్ని కాపాడుకునే సాంకేతిక జ్ఞానం మరియూ విజ్ఞానం యొక్క లభ్యత దృష్ట్యా పవిత్రతలూ, నైతికతలకు కాలం చెల్లిపోయిందనే సైద్ధాంతిక రూపేణే భావించాలి.కానీ, మన సమాజిక నిర్మాణం,వ్యవస్థా ఈ మార్పులకి అనుగుణంగా ప్రస్తుతానికైతే అగుపించడం లేదు. లైంగికతను శాసించే నైతికతలు పోయి, స్వతంత్ర్యంగా లైంగికతను ఒక వ్యక్తియొక్క ఆద్శావకాశం (informed choice)గా నిర్ణయించుకునే మార్పు వస్తుందని ఆశిద్దాం.

17 comments:

Kathi Mahesh Kumar said...

Anonymous said...

కత్తి గారి వ్యాసాలు రాయడం చుస్తుంటె నాకు 1980 లొ తెలుగు సినిమాల విడుదల లు గుర్తుకు వస్తునై. ఆ రొజుల లొ ఒక్క హీరొ దాదపు సంవత్సరానికి 9 సినిమా లు నటించె వారు అలా గే రొజు కు 5 ఆటలులు వుండెవి. మహెష్ కూడ వుదయం, మద్యహ్నం, సాయంత్రం, రాత్రి 11.40 కూడా బ్లాగ్స్ రాసి మిగతా బ్లగ్స్ లొ తన అభిప్రాయాలు చెప్పి మొత్తానికి అనతి కాలం లొ నె ఒక
ఒరవడి ని తీసు కొచాడు. కత్తి బ్లాగ్స్ చదివె వారంతా కలసి ఒక బిరుదును మహెష్ కి ఇవ్వ వలసి న సమయం వచ్చింది. దీనిమిద మీ అభిప్రాయములను తెలియ జెసేది.

Regds,
NNR
November 7, 2008 12:38 AM

అబ్రకదబ్ర said...

మహేశా, ఇటువంటి విషయాల మీద నీ అభిప్రాయాలు ఇంతకు ముందే ఎన్నో సార్లు చెప్పేశావు. మాలాంటోళ్లు వాళ్ల అభిప్రాయాలూ చెప్పేశారు. మతం లాగానే, ఈ నైతికత, లైంగికతల కతలు తెగేవి కావు. చర్చించటానికి కొత్తగా ఏముందని మళ్లీ మొదలెట్టటం?

cbrao said...

"లైంగికతను శాసించే నైతికతలు పోయి, స్వతంత్ర్యంగా లైంగికతను ఒక వ్యక్తి యొక్క ఆద్శావకాశం (informed choice)గా నిర్ణయించుకునే మార్పు వస్తుందని ఆశిద్దాం." -మహేష్

ఏమిటి చెప్పదలుచుకున్నారు? పెళ్లి అనే కట్టుబాటు లేకుండా కలిసి ఉండటం లేక స్త్రీ తనకు సమ్మతమైన వారితో ఐచ్చికంగా కలిసి నిదురించటం లాంటివి ప్రజాదరణ పొందాలనా? పెళ్లి అనే వ్యవస్థ ఒక్క రోజులో వచ్చింది కాదు. ఎన్నో అంశాలను పరిశీలించిన పిదప పెళ్లి అనే వ్యవస్థీకృతమైన పద్ధతి అమలులో కొచ్చింది. సామాజిక ఆరోగ్యానికి, సుఖ శాంతులకు పెళ్లి అనే లైంగిక కట్టుబాటు, నియమం అవసరం. పెళ్లి లేని సమాజం ఎలా వుంటుందో ఒక సారి ఊహించండి. మరో జంబలకిడి పంబ లా తయారవుతుంది సమాజం, నిత్య యుద్ధాలతో.
November 7, 2008 1:55 AM
teresa said...

ఇదేనా పురోగమనం?
November 7, 2008 2:10 AM
నియంత said...

మహేష్,

ఏమి చెప్పాలనుకున్నారు ...స్త్రీ లైంగిక స్వేచ్చ పెళ్ళి, పిల్లలు, మాతృత్వం అనే భందనాల్లో భంధీ అయింది, మగవాడు సుఖ పురుషుడు అయ్యాడు... స్త్రీకి ఆ స్వేచ్చ లేకుండా చేసారు అనా..... ?

ఈ కాలంలో సతీ అనసూయకధలు వినటానికి కూడా పనికిరావులేండి... మీరు లోకాన్ని ఈ కోణంలో మిస్ అవుతున్నట్టున్నారు.... జెనరేషన్ చాలా వేగంగానే మీరు ఆశించినట్టుగానే నడుస్తుంది.... ఒక తరగతి గదిలో కనీసం రెండు నుంచి అయిదువరకు ఇలాంటి బయటపడుతున్న కేసులు ఉన్నయి.. బాల్యం ఇంత వేగంగా ఉంటే ....వారు మీ అంత అయ్యేసరికి ..... ఒక్కొక్కరి సంఖ్య పదుల్లో ఉంటుంది (అబ్బయిది ,అమ్మాయిది)......

ఇక పోతే, మీరు నిర్ద్యంధంగా మాట్లాడాలంటే.... తల్లి చెప్పి, అక్క, అన్ని మనిషి సృష్టించుకున్నవే .... వాటి వల్ల కొన్ని అవరోధాలు కనిపించాయికదా అని వాటి ప్రవిత్రత చెడ గొడదాము అని అశించటం అంత మంచిది కాదేమో.... ఏది ఏమయినా ... మీ రాజ్యాంగ హక్కుల ప్రకారం .. మీకురాసే హక్కు ఉంది.....

ఇక్కడ నా అసలు మతలబు ఏంటి అంటే

కాకపోతే అబ్బాయిలు రెండో(లేద అంతకన్న ఎక్కువ) పెళ్ళిళ్ళు చేసుకున్న అమ్మాయిలను ఎంత మంది హుందాగా, గౌరవంగా, ప్రేమగా స్వాగతిస్తారో తెలీదు......ఇప్పుడు ఆ సంఖ్య చాలా తక్కువ.... కనుక.... మీ టపా అమ్మాయిల శృంగార స్వేఛ్చ కంటే అబ్బాయిల విశాల దృక్పధం పెంపోందిచటానికి వ్రాస్తే ఉపయోగకరమయ్యేదేమో.......


అజ్ఞాత/అనామక: మీరు ఒక రచయిత బావాన్ని జీర్ణించుకోలేక, తిరిగి సమాధానం చెప్పాలేనంత అయోమయస్తితిలో రాస్తినట్టున్నారు.... టాలెమీని చంపిన వారు బహుసా మీ లానే ఉంటారేమో.... (కొంత ఎక్కువ ఉన్మాదంతో)..... ఈ ఆర్టికల్ చదవమని మహేష్ గారు మిమ్మల్ని అడగలేదు కదా... ప్రతిదానికి ఒక పద్దతి పాడు ఉంటుంది. నాకు నచ్చనిది ప్రతిదీ ఖండీస్తాను అని రొడ్డ కొట్టుడు మాటలు చెప్పకు... నువ్వు రాసే మాటలు నీ వ్యక్తిత్వాన్ని చూపిస్తాయి..... ఇక్కడ మహేష్ గారు చెప్పిన విషయం కంటే నీ వ్యాఖ్య అత్యంత హేయంగా ఉంది.....
భస్మాసుర said...

Dear Kathi,

You have every right to write whatever you want, write to your heart's content.

But here is a friendly suggestion to you. The people that read your blogs are *real people* with brains that are designed to think. so it would be better if you understand a few things here:

First, you are not producing any knowledge. People have problems with you and your writings not in a way that what you write is ground breaking, out of the box, aggressive thinking; but because you write stuff that doesn't make any sense at all. My impression is that you *want* to express yourself in the 'out of the box', 'progressive' blogger mould because it is fashionable to do so and because it sells.. to achieve that, you write your half baked, nonsensical, some times insanely stupid stuf. That way, you disrespect the time of those who read your blog, which is not good.

You may respond that people are free to not to read your stuff. Yes, they will do it anyway. It that really doesn't bother you, I would appreciate your guts. But I seriously doubt it. you write what you write, because you *want* people to see it, talk about it.

"In a society where so many people have enough, few people have time to spare. When you waste it (by breaking a promise and being late) or abuse it (by viewing your time as worth more than mine), we respond by distrusting you, ignoring you and eventually moving on."

- Bhasmasura
November 7, 2008 5:25 AM
కొత్త పాళీ said...

Bhasmasura .. Amen to that last paragraph!
November 7, 2008 7:11 AM
కత్తి మహేష్ కుమార్ said...

@అనామకుడు: లైంకికతకు పెళ్ళికన్నా ఇష్టం,ఆదర్శావకాశం (informed choice) ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న reproductive rights ఉద్యమ నేపధ్యంలో మహిళలకు తమ శరీరంపైగల హక్కుగా సమాజం ఆపాదిస్తున్న నైతికతను చూడమని(ప్రశ్నించమని) చెప్పడం ఈ వ్యాసం యొక్క ఉద్దేశం.

నా నైతికతను ప్రశ్నించే ప్రయత్నంలోకూడా ఒక స్త్రీకే అనైతికతను అంటగట్టడానికి ప్రయత్నించిన నీలాంటి పురుషపుంగవులు ఆధిపత్యం చెలాయించే సమాజపోకడలను ఎత్తిచూపడంలో నేను సఫలంకాకపోయినా, నీ ఒక్క వ్యాఖ్య ఆ పనిచేసింది. ధన్యవాదాలు.

@అబ్రకదబ్ర:నేనెప్పుడూ కొత్తవిషయాలు చెప్పలేదు.సావకాశంగా ఈ విషయంమీద ఇక్కడ చర్చించాలనీ అనుకోవడం లేదు.

@సి.బి.రావు: లైంగికతకు ఒక వ్యక్తియొక్క ఆదర్శావకాశం వచ్చినంతమాత్రానా, పెళ్ళి అనే వ్యవస్థ వచ్చే ప్రమాదమేదీ లేదు.అప్పటికీ మెజారిటీ ఈ బంధంలోనే వుంటారు. కాకపోతే, మహిళలు తమ లైంగిక హక్కుల్ని సాధించుకుంటారు. అంతే తేడా.

మీ సంశయం ఇంత చదులేనివాళ్ళకి ఓటుహక్కిస్తే,నిజంగా ప్రజాస్వామ్యం అవుతుందా అన్నట్లే వుంది. సందేహం సహేతుకం,కానీ దానిలో అపోహశాతం ఎక్కువ అంతే!

@తెరెసా:ఇదే పురోగమనం కాకపోవచ్చు. కాకపోతే, ఈ దిశగా మార్పుమాత్రం జరుగుతోంది.నైతికత ఆపాదించకపోయినంత మాత్రానా సమాజంలో అనైతికత పెచ్చరిల్లి పోతుందని నమ్మడం మనుషుల నిర్ణయాధికారం, హక్కులు, వ్యక్తిత్వాన్ని నమ్మకపోవడమే.

@నియంత: ఇక్కడకూడా మీకు తల్లీ,అక్క పవిత్రత మాత్రమే గుర్తుకొచ్చి, అన్నదమ్ముల పవిత్రత గుర్తుకు రాకపోవడమే నేను చెప్పదలుచుకున్న సామాజిక కుట్ర.

ఇక నేను ఇక్కడ చెప్పింది శృంగార స్వేచ్చకాదు. లైంగిక అధికారం. రెంటికీ గల భేధాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించగలరు.

అబ్బాయిలు,ఆమాయికీ వ్యక్తిత్వం,ఇష్టాఇష్టాలూ,తన శరీరంపై హక్కులూ వుంటాయని అంగీకరించగలిగితే విశాలభావాలు తమంతట తమే ఏర్పడతాయి. కానీ,ఆ పరిస్థితిని కల్పించే స్థితి మనం ప్రస్తుతం కల్పించడం లేదేమో అన్నదే నా సందేహం. అంతేకాక, అటుమగవాళ్ళూ,ఇటు చాలా మంది పితృస్వామ్య ప్రతినిధులైన ఆడవాళ్ళూ తమకు ఆపాదించిన నైతికతను భాధ్యతగా భావించి, తమ మూల హక్కుల స్పృహ కోల్పోయారనేది నిజంకాదంటారా!

@భస్మాసుర: That's precisely what shocks me. I am neither proposing ground breaking ideas, nor am I coming up with out of the box thinking. What ever I am writing is either already in practice or already been discussed national and international forums.

But, calling what I write nonsense only reflects your lack of understanding on blogging.

If you want to ignore me please do so, If you think its waste of your time, please keep away from my blog.You will not be the only one doing that.So be my guest either ways.
November 7, 2008 7:56 AM
సుజాత said...

ఇలాంటి టపాలు రాసేటపుడు comment moderation పెట్టుకోమని ముందు మీకొక సలహా! ఎవరికో భయపడి కాదు, అసభ్యమైన కామెంట్స్ చదవటం మిమ్మల్నే కాదు, మమ్మల్ని కూడా నొప్పించే విషయం కాబట్టి!

అబ్రకదబ్ర చెప్పినట్టు ఎవి ఎప్పటికీ తెగని చర్చలకు దారితీసే విషయాలు! ఎంత చర్చించినా ఎంతో కొంత మిగిలే ఉంటుంది.

మొత్తానికి ఇలా న్యాయ సమ్మతం కాని సంబంధాలను "దొంగతనం" అని ఒప్పుకుంటున్నారన్నమాట. దొంగతనానికి నైతికత ఆపాదిద్దామా వద్దా?

Unknown said...

ప్రపంచంలో ఏది సక్రమంగా జరగాలన్నా అది కొన్ని నియమాలకి లోబడి జరగాలి. ఆడా మగ మధ్య సంబంధాల కోసం మనకు కొన్ని నియమాలు వున్నాయి.ఆ నియామాలు ఇద్దరికీ సమానంగా వుండాలి. నియమాలు ఆచరించడంలో సమానత్వం రావాలని చెప్పాలి, కానీ మగవాడు నియమం తప్పాడని ఆడది కూడా నియమం తప్పాలనడం సరి కాదు. ఒకళ్ళు తప్పు చేస్తే ఇంకొకళ్ళ తప్పుతో అది ఒప్పు అవదు. ఇక్కడ 'కత్తి' గారు చెప్పేది అలాగే వుంది. 'టిట్ ఫర్ టాట్' లాగ అన్నమాట. గమ్యం మంచిదే కానీ మార్గమే తప్పనిపిస్తుంది. దీన్ని కాదు అని చెప్పడానికి 'అనామకుడు' గారు అలా తీవ్రంగా స్పందించారు.

1. నియమాలు ఇద్దరికి సమానంగా వుండాలి.
2. ఎవరు నియమం తప్పితే వారే తప్పు తెలుసుకుని సరిచేసుకోవాలి. ఒకరు నియమం తప్పారని ఇంకొకరు కూడా తప్పితే వాళ్ళూ తప్పు చేసినట్టే.

Anonymous said...

మీ టపాలకు సగటున ఎన్ని హిట్లు వస్తుండవచ్చు అన్నది ఒక ఆసక్తి కరమైన అంశం.

Kathi Mahesh Kumar said...

@నరేష్: నేనిక్కడ ఎవర్నీ తప్పుచెయ్యమని చెప్పటం లేదు. కొన్ని సామాజిక కారణాలవలన ఆపాదించబడిన పవిత్రత -అనైతికాలకు, ఆధునిక మార్పులదృష్ట్యా కాలం చెల్లిందంటున్నాను.అంతే.

లైంగికత(sexuality)కి లైంగికసంబంధానికీ (sex)గల తేడాను గమనించండి.sexuality is all about individual’s right and sex is a matter of choice. ఈ రెంటికీ గౌరవం ఇవ్వని వివక్షాపూర్వకమైన నైతికతను ప్రశ్నిస్తున్న చాలా మందిలో నేనొకడ్ని.

"The fact that an opinion has been widely held is no evidence whatever that it is not utterly absurd; indeed, in view of the silliness of the majority of mankind, a widespread belief is more likely to be foolish than sensible."

Bertrand Russell, Marriage and Morals, p. 58


@నెటిజన్: హిట్ల గురించి ఇప్పటివరకూ తీవ్రంగా పట్టించుకునే అవసరం రాలేదు.హిట్ కౌంటర్ కూడా ‘సాంకేతికాలలో’ చూసి ప్రయత్నించిందేతప్ప, దాన్నొక కొలమానంగా చూడటం లేదు. ఈ మధ్య ఆ కౌంటర్ కూడా తిక్కతిక్కగా అంకెలు చూపుతోంది.కాబట్టి,దాన్నికూడా ప్రామాణికంగా చూడలేను.

Aruna said...

మీ బ్లాగుల్లో చర్చలకి దూరంగా వుందాం అని అనిపించినా, ఒక్క ప్రశ్న మాత్రం అడగాలి అనిపించి అడుగుతున్నాను. ఇష్టం వచ్చిన వ్యక్తి తో పెళ్ళి అనే బంధం లేకుండా జీవితాంతం కలిసి ఆదర్శ జీవితం గడిపారు అనుకుందాం. దానివల్ల వచ్చేది ఏంటి? పెళ్ళి చేసుకున్నా చేసేది అదే. ఏదైన ఒకటే.

ఒక మహిళ గా, నేటి మహిళగా, కిరణ్ బేడీ గారి అన్ని పుస్తకాలను జీర్ణించుకున్న పాఠకురాలిగా, నేనొక విషయం సాధికారికంగా చెప్పగలను. స్త్రీలకు కావలసింది ఆర్ధిక స్వాతంత్రం, క్రమశిక్షణ, చేసిన వొప్పులకే గాక తప్పులకి గూడా బాధ్యతని వహించగలిగే హుందాతనం, జీవితం లో ఒక స్థాయి కి చేరాక పదిమందికి సాయపడ గలిగే మంచితనం. అది కాకపోతే ఇతరులని పైకి రానివ్వగలిగే నిరహంకార నైజం.

మీ టపా లైంగికత కి సంబంధించినది మాత్రమే కాబట్టి , నా సమాధానం సరి అయింది కాదు అనుకుంటే, మీరు ఆడవారిని అర్ధం చేస్కోలేదు అని అర్ధం.

ఎంతదాకో ఎందుకు మీ ఇంట్లో ఆడవారి దగ్గర ఇలాంటి చర్చ పెట్టండి. వారి అంగీకారం ఎంతవరకు వుంటూందో చూడండి. వారు మేధావులు కాదు కాబట్టి, వారిని చర్చల్లో దింపను అనుకుంటే, మీకొక మాట. భావాలు అందరివి ఒకేలా వుంటాయి. చదువు వాటిని సర్వజన ఆమోదయోగ్యంగా వ్యక్తీకరించడం నేర్పితే, సంస్కారం ఎక్కడ ఎలాంటి భావాలు వుండచ్చో వుండకూడదో తెలియజేస్తుంది. మీ ఇంటి ఆడువారిని ఇలాంటివి అడగమనడం వారినో, మిమ్మల్నో అవమానించడానికి కాదండి, వారైతే మీకు బాగా తెల్సినవారు, దగ్గిరవారు కాబట్టి, వారు మీకు నిజానిజాల్ని మీ మనసుకు హత్తుకునేలా చెప్పగలిగే కళ లో సమర్ధులై వుండివుంటారు కాబట్టి.

Anonymous said...

HYPOCRITE...HYPOCRITE...HYPOCRITE

Kathi Mahesh Kumar said...

@అరుణ: నేను ప్రతిపాదించిన సాధికారమైన లైంగికత, పెళ్ళికి వ్యతిరేకంగా ఎలా అనిపించిందో అర్థం కావడం లేదు.నేను చెప్పింది లైంగికతకు పెళ్ళి sufficient condition అయితే అవ్వచ్చుగానీ, necessary condition కానఖ్ఖరలేదని మాత్రమే.

పెళ్ళిలోకూడా లైంగికసాధికారత, తమశరీరంపైన తమ హక్కులేని మహిళల గురించి మీకు తెలీదా?

నిజానికి family and social pressure కు లోనై తమ శరీరాలపై అధికారాన్ని కోల్పొతున్న మహిళలు కోకొల్లలు. Reproductive rights and sexual liberation యొక్క నేపధ్యమే అది.

నేనొక మేధావినన్న అహం లేక అపోహా రెండూ నాకు లేవు. కాబట్టి,నేను ఈ విషయాలు మా ఇంట్లో చర్చించనని మీరు అనుకోనవసరం లేదు. My wife is more qualified to discuss these things, as she is a clinical psychologist herself.

@అనామకుడు: నేను హిపోక్రెట్ ని,but I still have an identity. కానీ, నీకు అసలు ఉనికే లేదు. Do you really think you are qualified to judge me?

Anonymous said...

మీరు మీ అభిప్రాయాలని వ్యక్తీకరించడానికి చదవడమో ఆలోచించడమో చేస్తారా, లేక చదివాక, ఆలోచించాక ఒక అభిప్రాయానికి వస్తారా అని నాకు సందేహం వస్తుంటుంది ఒక్కోసారి. ఏదైతే నీకెందుకోయ్ అంటారేమో - ఎందుకంటే, మొదటి తరహా అయితే కామెంటక్కరలేదు కదా, అందుకని..

ఏదైతేనేం, ఈ టపాలో మీరు వ్యక్తపరచిన అభిప్రాయాలో, ప్రతిపాదనలో, తీర్మానాలో, సిద్ధాంతాలో - ఎవైతేనేం - అవన్నీ కలగాపులగంగా, అర్థంపర్థం లేకుండా ఉన్నాయి. లైంగికత, నైతికత అంటూ మొదలెట్టారు. నైతికతకి మతాలకి ఒక్క వాక్యంతోనే ముడెట్టేసారు. అట్నుంచి - ఫెమినిజం నిచ్చెనెక్కి ఇంకెక్కడికో గెంతి అట్నుంచి అటే సంప్రదాయాలు, ఆధునికత అంటూ స్త్రీ స్వాతంత్రం స్పీల్ తో స్వేచ్ఛగా ఊపిరి తీసేసుకొన్నారు. ఒక్క టపాలో, సుమారుగా మీరు స్పృశించిన అంశాలన్నిటినీ 'టపా' కట్టించేసారు - మొత్తం మీద అసాధ్యులే. అది మాత్రం ఒప్పుకుతీరాల్సిందే.

"ప్రతిజీవీ తన సంతతిని వృద్ధిచేసుకుంటూ మనుగడ సాగించడం ఈ లైంగికత ద్వారానేసాధ్యం."

బాగుంది. Let's use evolutionary biology as a frame of reference then. Almost everything you said in this post is completely contrary to the recent advances in Evolutionary Biology. Before you talk about sex, and the supposedly 'male bias' in Human Societies - you would first have to understand human sexuality as a whole. Before proposing that religious and/or social code of conduct (morality, ethics) as something that are artificially imposed to maintain an 'order' in the society and to contain our 'natural tendencies of sexual promiscuity' - you would have to explain the following:

1. Most often having sex for fun rather than for procreation. Most animal species other than humans participate in sex purely for procreation, not for recreation. ఓ కుక్క కోణం లోంచి చుస్తే మనుషులే చిత్తకార్తె కుక్కలు.
2. Having sex in private
3. Expansion of women's breasts even before use in lactation.
4. Female menopause
5. The role of men in human societies - compared to the rest of the species, a human male is rather 'willingly' commits himself to one female. On an evolutionary scale - polygamy, male/female adultery and other forms of sexual promiscuity are not even minor aberrations.
6. Concealed ovulation in human females.

The above six characters of human sexuality make it so bizarre from an evolutionary biology point of view - they need some explanation. Such explanations are offered by noted evolutionary scientists. If you understand this - I am sure you would have no problem in agreeing that your views would have to be completely turned on their head.

Following books would definitely be of help:
Jared Diamond - Why Sex is Fun? And The Third Chimpanzee
Desmond Morris - The Naked Ape, and
Matt Ridley - The Red Queen: Sex and the Evolution of Human Nature

I quote from a reviewer's comment (from amazon.com) on Why is Sex is Fun:

" In my experience, most people, even those otherwise sophisticated and well-educated, do not sufficiently appreciate the importance of evolution. Though they may understand it intellectually, they fail to see evolutionary forces playing a fundamental role in human behavior, and therefore constantly misdiagnose problems and prescribe inappropriate solutions. Their number includes Christians, feminists, and those dealing with racial issues on both sides of the political spectrum--a fairly large chunk of society."



This above comment aptly sums up your above post. I apologize if it sounds harsh.

"'శారీరక కలయిక గర్భాదానానికే!' అనేది మన శాస్త్రాలు చెప్పే విషయం."
ఏ శాస్త్రంలో ఉందండీ? నాకీ శాస్త్రాలు గట్రా పెద్దగా తెలియవు - తెలుసుకుందామనే అడుగుతున్నా.

రిగార్డులతో,
నాగరాజు.
సాలభంజికలు

రాజ మల్లేశ్వర్ కొల్లి said...

క్షమించాలి..., చాల కాలం తర్వాత పొరపాటు న ఇటు వచ్చా... ’మేధావుల’ చర్చ అని తెలియక.

నేనూ ఏదోఒక రోజు మేధావి నవుతా...:-)

cbrao said...

"మహిళలు తమ లైంగిక హక్కుల్ని సాధించుకుంటారు. "-మహేష్

మహిళల లైంగిక హక్కుల నిర్వచనమేమిటి? ఈ వ్యాసంలో మీరు చెప్పదలుచుకున్న విషయంలో స్పష్టత లోపించింది. ఈ అస్పష్టతే అనామకుడినుంచి అసభ్య వ్యాఖ్యలు వచ్చేలా ప్రేరేపించింది. మీ భార్యను, తల్లిని అవమానించేలా రాసిన అనామక వ్యాఖ్యలు తొలగించగలరు. ఆ వ్యాఖ్యలు మీరు అనుమతించరాదు.

పిల్లలను ఎప్పుడు, ఎంతమందిని కనాలి అనే విషయంలో గతంలో స్త్రీకి స్వాతంత్రం లేదు. కాని ఆధునిక మహిళకు కొన్ని దేశాలలో ఈ స్వాతంత్రం ఉంది. ఆఫ్రికా లో స్త్రీకి సుంతీ లాంటివి (Removal of clitoris) అమలుచేస్తున్నారు. స్త్రీ చదువుకొని, తనకాళ్లపై తను నిలబడగలిగితే చాల సమస్యలకు పరిష్కారం దొరకకలదు. మహిళా సంస్థలు ఈ దిశగా కృషిచెయ్యవలసి ఉంటుంది. చలం మైదానం లో లాగా స్త్రీ ప్రవర్తిస్తే, ఆమె తన జీవితాన్ని తనే వ్యర్ధం చేసుకున్నట్లవుతుంది. సెక్స్ లో కాదు స్వేచ్ఛ , స్త్రీకి జీవితంలో తనకు, తన పిల్లలకు ఆర్థిక స్వావలంబన, భద్రత ఎక్కువ అవసరం.

Kathi Mahesh Kumar said...

@‘సాలభంజికలు’ నాగరాజు:చాలా కాలం తరువాత నా బ్లాగులో మీ వ్యాఖ్యని దయదలిచారు.

నా అభిప్రాయాలు ఏ విధిలో ఏర్పడినా, రాయడం మాత్రం ఒక్కోసారి నా ఆలోచనలకు అక్షరరూపం ఇవ్వడానికైతే, మరోసారి అభిప్రాయాల్ని పంచుకోవడానికి అవుతుంది. అప్పుడప్పుడూ ఆలోచనల్ని నాకు నేను చెప్పుకుని clarity of thought కోసం కూడా రాయటం జరుగుతుంది.

మీ వ్యాఖ్య ద్వారా మిగతా చాలా మంది ఈ వ్యాసానికి ఇంత ఘాటుగా ఎందుకు స్పందించారో అర్థమయ్యింది. అందుకు మొదటగా ధన్యవాదాలు. వారందరూ ఒక సైద్ధాంతిక చర్చని వ్యక్తిగతకోణంలోంచీ చూసి స్పందించారేతప్ప,దీన్నొక possible idea గా react అవ్వలేదు.

మొదటిగా సులువైన మీ ఆఖరి ప్రశ్నతో మొదలెడతాను.పురుషార్థాలైన ధర్మ,అర్థ,కామ,మోక్షాల గురించి ఉటంకించిన ప్రతిసారీ,ధర్మాన్ని అనుసరించే కామం ఉండాలని చెప్పడం జరుగుతుంది.ఇక వర్ణాశ్రమధర్మాలలో గృహస్థ్యాశ్రమంలో చెప్పిన "ధర్మాల" గురించి మీకు తెలియనిది కాదు.అందుకే sex is for procreation (surely not for entertainment) అని శాస్త్రాలు చెప్పాయన్నాను.

‘కామశాస్త్రం కూడా శాస్త్రమే కదా!’ అని మీరడగరని నా నమ్మకం.ఏందుకంటే, కామశాస్త్రం కూడా ధర్మశాస్త్రానికి కట్టుబడి కామాన్ని భోధించేదే. కాకపోతే, తరువాత కాలంలో వేశ్యాలోలులైన రాజులూ,గణికులూ ఆ గ్రంధానికి ప్రస్తుతం వున్న రూపు తీసుకొచ్చారు.

కొంత జెండర్ ధృక్కోణంతో కామశాస్త్రాన్ని చూస్తే, అందులో ఎన్నిరకాల స్త్రీలుంటారో వారిని ఎలా సంతృప్తి పరచాలో లేక మగాడు ఎలా సంతృప్తిపడాలో చెబుతుందేతప్ప ఎన్నిరకాల మగాళ్ళుంటారో ఆడది ఎలా సుఖపడగలదో చెప్పలేది. ఈ విధంగా కామశాస్త్రంకూడా మగధృక్కోణంలో రాయబడిందేకానీ మహిళలకోసం కాదు.

మీ evolutionary biology ప్రతిపాదనతో నేను నూటికి నూరుపాళ్ళూ అంగీకరిస్తాను. నేను చెప్పింది ఒకప్పటి నమ్మకాల గురించి. అయినా,టెస్ట్ ట్యూబ్ బేబీలున్న ఈ కాలంలో లైంగికతే సంతానవృద్ధికి మూలం అని ఎలా చెప్పగలం! గే,లెస్బియన్ ల హక్కుల గురించి మాట్లాడే ఈ తరుణంలో sex is for procreation అని ఎలా చెప్పగలమన్నదే నా ఉద్దేశంకూడా. ఒకవేళ మీరు చెప్పిన తికమక నా వ్యాసంలో వుంటే మాత్రం నా ఉద్దేశ్యం సాకారం అవ్వలేదని తెలుస్తోంది.

PS.నేనుప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నాను. మిమ్మల్ని ఎలా కలవచ్చో నాకు mail చేస్తారా. నా mail ID mahesh.kathi@gmail.com

@సీబీ రావు:చాలా విషయాలు కొంత సైద్ధాంతిక assumptions నేపధ్యంలో రాయటం వలన మీరన్న సృష్టత రాలేదేమో. నాకు మాత్రం నేపధ్యం తెలుసుకాబట్టి తేటతెల్లంగా వుంది. కొందరు స్నేహితులు చదివికూడా అర్థమయ్యిందనే చెప్పారు. బహుశా వారి ఆలోచనకు ప్రాతిపదికకూడా ఆ previous knowledge అయ్యుండచ్చు. మీరు చెప్పిన వ్యాఖ్యల్ని తొలగించాను.

స్త్రీలకు ఆర్థిక,సామాజిక స్వావలంబన అతిముఖ్యమని నేను నిర్ధ్వందంగా అంగీకరిస్తాను. కానీ,లైంగిక హక్కులుకూడా అందులోభాగమని కూడా నమ్ముతాను.

cbrao said...

"మహిళల లైంగిక హక్కుల నిర్వచనమేమిటి?" అన్న నా ప్రశ్నకు బదులిచ్చుంటే, వ్యాసంలోని అస్పష్టత కొంత తొలిగిపోయుండేది. మీ జవాబు అసలు విషయాన్ని వదిలేసి beating around the bush అన్నట్లుగా తోచింది. మీ వ్యాసం అసంపూర్ణం అనిపిస్తుంది.

Kathi Mahesh Kumar said...

@సీబీ రావు: క్షమించాలి అందరికీ తెలుసుకదా అనే నా assumption వలన మళ్ళీ అదే తప్పుచేసినట్లున్నాను.

ప్రపంచ ఆరొగ్యసంస్థ (WHO) ప్రకారం ఈ క్రింది వాటిని లైంగిక హక్కులుగా పేర్కొనచ్చు.
1.గర్భధారణ విషయంలో మహిళలకు నిర్ణయాధికారం
2.చట్టబద్ధమైన సురక్షిత ఆబార్షన్ కొరకు హక్కు
3.గర్భానికి సంబంధించిన ఆర్థిక,సామాజిక వివక్షనుంచీ విముక్తి
4.గర్భనిరోధకాలు దానికి సంబంధించిన విషయాలపై అవగాహన మరియూ ఉపయోగించే సాధికారత.
5.లైంగికచర్యద్వారా సంక్రమించే వ్యాధులనుంచీ రక్షణ కోరుకునే హక్కు.
6.గర్భవతులకు సంరక్షణ మరియు ఆరోగ్య సేవల హక్కు.
7.లింగవివక్షతాపూర్వకమైన సున్తీలాంటి (female genital cutting)లాంటి హింనుంచీ రక్షణ.
8.కూలంకషంగా,మానవహక్కులలో భాగంగా సంక్రమించే శరిరాలపై సంపూర్ణమైన హక్కు

Anonymous said...

నైతికత అనేది కేవలం ఊహాజనితమైన కంచె మాత్రమే( Not physically exist). దానిని ఎవరైనా అదిగమించవచ్చు. కాకపోతే పట్టుబడకుండా ఆ పని చేయాలి అంతే. ఒక పక్క మీరు, ఈ కంచె ఏర్పాటుకు శారీరక గుణాల పాత్ర వుందని చెబుతూనే అది వివక్షకు మూలమన్నారు. మీరు చెప్పిన దాని ప్రకారం ఆడవారు పట్టుడే అవకాశం వుంది కాబట్టి ఈ రకమైన నైతికత తప్పుకాదు. మరో రకంగా ఆలోచిస్తే, ఒకవేల మగాడు సాక్షాదారాలతో పట్టుబడినా అతని మీద ఆ ప్రభావం స్త్రీలతో పోలిస్తే తక్కువే కాబట్టి అది వివక్షే అనొచ్చు. కానీ పట్టుబడే అవకాశం ఆడవారికే ఎక్కువ కాబట్టి మీరు చెప్పిన శారక ధర్మాల ప్రకారం ఇది అవసరమేనేమో?

బహుశా శాస్త్రంలో శారీరక కలయిక గర్భధారణకే అని చెప్పి వుండవచ్చు. కాకపోతే, శాస్త్రంలో ఇదే కాదు ఇంకా చాలా చెప్పారు. సత్యమునే పలకవలెను అన్నది అందులో ఒకటి. కానీ ఎంతమంది వీటిని పాటిస్తున్నారు చెప్పండి. నిజంగా శాస్త్రంలో చెప్పినట్లు ఆడా మగా భావించి వుంటే ప్రపంచములో అత్యంత పురాతన వినొద రంగంగా కొంతమందిచే పిలవబడే వేశ్యా వృత్తి వుండేదా..? అక్రమ సంబంధాలకున్న చరిత్ర, ఇప్పుడున్న గర్భనిరోధాలకి, సాంకేతికతకూ అతీతమైనది కాదా...? శాస్త్రాలలో చెబుతారంతే దాన్ని పాటించే వారు, అధిగమించే వారూ ఎప్పుడు వుంటారు.

ఇక పవిత్రత అంటారా, అవన్నీ నలుగురిలో చెప్పుకోవడానికే. అర్ధరాత్రి ప్రియుని/ప్రియురాలి ఇంటి తలుపు తట్టే సమయంలో అవన్నీ హుష్ కాకీ.అందుకే నైతికత అనేది వూహా జనితమైన కంచె మాత్రమే.అది ఎవ్వరినీ వారి ఇస్టంలేకుండా ఆపలేదు.

ఇక స్త్రీలు గౌరవ ప్రధమైన భ్రమలో బతుకుతున్నారు అన్నారు. తప్పుచేసినప్పుడు స్త్రీలు మాత్రమే సాక్షాధారాలతో బయట పడడానికి అవకాశము ఎక్కువైనప్పుడు, అది అవసరమౌతుంది కానీ భ్రమ ఎలా అవుతుంది. సామాజిక కుట్ర ఎలా అవుతుంది? ఇక సాంకేతికత అభివృద్ది కారణంగా వచ్చిన మార్పు అంటారా, అప్పుడైనా ఇప్పుడైనా పొరపాటు జరిగితే భయట పడేది స్త్రీలే, మగాడు అప్పుడు ఇప్పుడు సురక్షితమే కదా. మరి మీరు చెప్పిన దాని ప్రకారం, ఆ నైతికత ఇప్పుడు కూడా స్త్రీలపైనే వుండడం సమంజసమే కదా..? కాకపోతే అప్పటితో పోలిస్తే ఇప్పుడు స్త్రీలకు కూడా బయటపడే అవకాశాలు తగ్గాయి, కానీ మగాడితో పొలిస్తే మాత్రం స్త్రీకే ప్రమాదం ఎక్కువ.( contraceptives fail అయ్యి, గర్భవతులైన స్త్రీలు కోకొల్లలు. కొంతమంది స్త్రీలు, 4 నెలలు వచ్చిన తరువాత కూడా తాము గర్భవతులమని గమనిచలేకపోయిన సంఘటనను నేను పేపర్లో చదివాను.దొరికితే పోస్ట్ చేస్తాను.) ఇవన్నీ చెప్పడానికి కారణం స్త్రీలపై వివక్ష వుండాలి అనడం కాదు కానీ, స్త్రీలపై వివక్షకు మీరు చెప్పిన కారణం సరైంది కాదేమో అని చెప్పడానికి మాత్రమే వీటిని నేను వుదహరిస్తున్నాను.

వీటన్నిటినీ చెప్పిన తరువాత నేను చెప్పదలుచుకున్నది..

1) కలయిక వుద్దేశం అప్పుడైనా, ఇప్పుడైనా ఆనదం మరియు గర్భధారణ, రెండూ. (వేశ్యా వాటికలు, అక్రమ సంభందాలు ఇందుకు నిదర్శనం, కాదంటారా...?)

2) శాస్త్రాలు ఎప్పుడు వుంటాయి కానీ దాన్ని పాటించే వారే ఎంతమంది అన్నది ప్రశ్న.

గర్భనిరోధకాలు రావడం కారణంగా sex పవిత్రతను కోల్పొయింది అన్నారు(ఆనందానికి కూడా పాల్గొనడం ద్వారా). అది కాసేపు నిజమనే అనుకుందాం. కానీ గర్భధారన పవిత్రతను ఎలా కోల్పోయింది. పెల్లి అన్నది సమాజం ఏర్పాటు చేసుకున్న కట్టుబాటు. స్త్రీ పురుషులిరువికీ భద్రతను కల్పించే ఒక కార్యం. ప్రేమలో ఈ కట్టుబాటు వుండదు. సామాజిక ఆమోదం వుండదు. తద్వారా కలిగే పిల్లలకు ఇరువురూ భాధ్యత వహించాలి అన్న కట్టుబాటు వుండదు. ఒకవేల అలా కాదు, ప్రెమలో కూడా అవన్నీ వున్న్నాయి అనుకుంటే... ఆ కట్టుబాటు కూడా నైతికత కిందకే వస్తుంది కదా..? మరి పెల్లిచేసుకోవడమే మంచిది కదా..? పెల్లే మంచిదని ఎందుకంటున్నానంటే, వివాహేతర సంభందాలు విశృంకలతకు దారితీసే అవకాశాలు చాలా ఎక్కువ. సమాజం యొక్క మౌలిక స్వరూపాన్నే చిన్నాభిన్నం చేయగల అవకాశాలు పుష్కలం.

ఇక శరీరంపై హక్కు అంటారా, ప్రతీ ఒక్కరికీ తమ శరీరం పై హక్కు వుంటుంది. కానీ వివాహ బందం హక్కులతో పాటు భాధ్యతలు కూడా వుండే ఒక బంధం కాదా..? స్త్రీ తనకు ఇష్టం వచ్చినట్లు లేదా ఇష్టంవచ్చినపుడు మాత్రమే సహకరిస్తాను అనడం భర్తయొక్క వైవాహిక హక్కులు (conjugal rights) కి బంగం కలిగించడమే కాదా..?

ఉదాహరణకు కోర్టులు,
1) భార్య, భర్తకు పరిగణించదగిన కాలం పాటు sex కు అంగీకరించక పోవడం మానసిక హింస కిందకు వస్తుంది అని తీర్పు చెప్పాయి.

2) భర్తకు ఇష్టంలేకుండా, abortion చేయించుకుంటే ఆ భర్త విడాకులు కోరవచ్చని తీర్పు చెప్పాయి.

3) ఒక నిర్ణీత కాలం తరువాత ( బహుశా 3 నెలలు అనుకుంటాను) abortion కు చట్టం అంగీకరించదు. ఇక్కడ తల్లుల హక్కులతో పాటు, కడుపులో వున్న బిడ్డ హక్కులు కూడా ముఖ్యమే అన్న వారికి మీరు ఇచ్చే సమాధానం ఏమిటి.

మీరు సాలభంజిక నాగరాజు గారి వ్యాఖ్యకు ఇచ్చిన వివరణలో కామ శాస్త్రం మగదృక్కొణంతో రాయబడింది అన్నారు. అది ఎలా...? ఇక్కడ ఆడవారు ఎన్ని రకాలు, వారిని ఎలా సంత్రుప్తి పరచాలి అని చెప్పారు. కానీ మాగాడిని ఎలా సంతృప్తి పరచాలి, వారు ఎన్ని రకాలు అని చెప్పలేదు. అంటే కామ శాస్త్రం ద్వారా ఆడదాన్ని సుఖపెట్టగలరు కానీ, మాగాన్ని కాదు. మాగాడికి ఆడదాన్ని సుఖపెట్టడం భాధ్యత అని చెప్పడం జరిగింది. ఇక్కడ లాభం ఎవరికి, సుఖం ఎవరికి? నిజానికి ఈ కామ శాస్త్రం స్త్రీదృక్కొణంతో రాయబడిందని చదివాను.

Samanyudu said...

గురువు గారు, మీ 'లైంగికత వ్స్ నైతికత : ఒక జెండర్ ధృక్కోణం' పూర్తిగా చదవలేదు; కారణం ఏమిటంటే, the foundation on which you started the post, the beginning lines, found to be not appropriate based on what i understand. నైతికత, సామాజికం కాదు పూర్తిగా వ్యక్తిగతం. I think you need to correct on that fundamental difference between social values & indidualistic morales (నైతికత) and re-write your article; the whole essence of your article would change.

Kathi Mahesh Kumar said...

@సామాన్యుడు: ఇప్పుడే మనసులోమాట బ్లాగులో మీ వ్యాఖ్య చదివి వస్తున్నాను.This has completely slipped off my mind.I know its not an excuse but after all I am a human being.

ఒక స్థాయిలో నైతికత వ్యక్తిగతం. కానీ,నైతికత యొక్క నిర్వచనాలు సామాజిక కట్టుబాట్లలోంచే వచ్చినవి.కొంచెం సింపుల్గా చెప్పాలంటే Individual choice is meaningful when you really have a choice. కానీ ఆ ఛాయిస్ సామాజిక కట్టుబాట్లవల్ల కుదించుకుపోయి వాటి నియమనిబంధనల్లో వ్యక్తిగత నైతికతను నిర్మించుకోవలసి వస్తే అది వ్యక్తిగతం ఎలా అవుతుంది అనేదే నా ప్రశ్న.

I am essentially seeking for the right to exercise the choice. ముఖ్యంగా లైంగికత విషయంలో ఆ ఛాయిస్ లేదనేది నా అనుభవం,నమ్మకం.

yuddandisivasubramanyam said...

dear friends, it is 100% correct that coital act is purely to participate in procreation. that is the reason ,nature made it a treasure of pleasure to trap both the sexes, there are no rules and regulations in this play. the fullest pleasure is like transcended. once the stage attained, man will not opt for further pleasure in the external world. that is why sex is divine.