Monday, August 10, 2009

హేతువు - నిజం


Rationality means perspective.
- Ken Wilber
అనుపూర్వికంగా వచ్చే నీతిసూత్రాల మంచిచెడ్డలను గుర్తించకుండా గుడ్డిగా ఫాలోఅయిపోవడాన్ని ప్రశ్నించి, ఈ ఆచారాల ప్రయోజనాన్ని తిరగదోడి పరీక్షించుకుంటూ ఉండటమే హేతువాదం. ఈ ఆనుపూర్విక నీతిసూత్రాలు కుటుంబ- సామాజిక-సాంస్కృతిక- మతపరమైన విధానాల ద్వారా అనునిత్యం reinforce చెయ్యబడి స్థిరత్వాన్ని కాంక్షిస్తూ ఉంటాయి.

ఈ స్థిరపడిపోయిన ఆచారాల వల్ల నిత్యసంచలన స్వభావం కలిగిన సంఘానికి చెడుజరిగే అవకాశం ఉందిగనక, పున:సమీక్షను కోరుతుంది హేతువాదం. ఆ పున:సమీక్ష తర్క,హేతు,మానవశ్రేయస్సు ఆధారంగా జరగాలనుకోవడమే దాని శాస్త్రీయత. హేతువాదం అంటే గుడ్డిగా నమ్మకం కాదు. ప్రశ్నించి తెలుసుకుని నమ్మకాన్ని పెంచుకోవడం లేదా ఉన్న నమ్మకాన్ని మార్చుకోవడం. ఇదొక నిరంతర ప్రక్రియ. Rationality to put it simply, is the sustained capacity for cognitive pluralism and perspectivism.

****

Our theory of truth must be such as to admit of its opposite, falsehood.
- Bertrend Russel

మన భౌతిక వస్తువుల అనుభవానికి వ్యతిరేకంగా ఏమీ ఉండదు. ఎందుకంటే ఆ భౌతిక వస్తువు ఉంటే ఉంటుంది. లేకపోతే లేదు. కానీ మన "నిజం" జ్ఞానానికి, దాని అనుభూతికీ "అబద్ధం" అనే ఒక వ్యతిరేక పదం తయారుగా ఉంది. అందుకే నిజం అన్న ప్రతిదీ ప్రశ్నించబడుతుంది. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలోనైనా నిజం తన వ్యతిరేకపదాన్ని ఎదుర్కోక తప్పదు.

ఈ రెడీ వ్యతిరేకత కారణంగా నిజాలలో ఎప్పుడూ వైరుధ్యం ఉంటుంది. దానికున్న మరో ముఖ్యమైన కారణం "నమ్మకం". నిజం- అబద్ధం రెండూ నమ్మకంపై ఆధారపడిన అనుభూతులు. భౌతిక వస్తువుల్లాగా అనుభవించి నిర్ధారించుకునే సౌలభ్యం ఇక్కడ లేదు. అబద్ధాన్ని నిజంగా నమ్మొచ్చు. నిజాన్ని అబద్ధంగా నమ్మొచ్చు. ఒక్కోసారి అబద్ధాన్ని మరింత బలంగా నమ్మొచ్చు. అందుకే, ఆ నమ్మకాల నిజానిజాల్ని సమీక్షించుకోవడం అత్యంత సమస్యాత్మకం.

ఆ సమస్యతీరినా...అర్జంటుగా తలెత్తే మరో సమస్య, నిజాన్ని అబద్ధానీ "నిర్వచించడం". ఏదీ ఒకసారి ప్రయత్నించండి!

****

7 comments:

భావన said...

బాగుంది పోస్ట్. " నిజాన్ని అబద్ధానీ "నిర్వచించడం"." నా దృష్టి లో అలా నిర్వచించే వారు మహా మేధావి ఐనా వుండాలి ( ఎందుకంటే మేధావి తనను తను సమర్ధించుకోగలడు), లేదా మాహా మూర్ఖుడైనా అయ్యి వుండాలి (ఎందుకంటే వాళ్ళూ సమర్ధించుకోగలరు) :-)

Anonymous said...

>>అందుకే నిజం అన్న ప్రతిదీ ప్రశ్నించబడుతుంది. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలోనైనా నిజం తన వ్యతిరేకపదాన్ని ఎదుర్కోక తప్పదు.

నిజమే!! బంగారు మొదట మట్టినుండి తవ్వబడి, ఆ తర్వాత బాగా కాల్చబడుతుంది, దీనితో ఆగక తర్వాత సుత్తితో బాదే బాదుడుకు తట్టుకుంటుంది. ఆ తర్వాతే దానికి విలువ చేకూరుతున్నది. ఆ విధముగనే నిజం ఎంతగా ప్రశ్నించబడుతున్నదో, ఎంతగా శోధించబడుతుందో, దానికి అంత బలం చేకూరుతుంది. మీ టపా ఆలోచింపచేసే విధంగా ఉన్నది. మాతో పంచుకున్నందుకు ధన్యవాదములు.

రమణ said...

టపా చాలా బాగుంది.

//ఈ స్థిరపడిపోయిన ఆచారాల వల్ల నిత్యసంచలన స్వభావం కలిగిన సంఘానికి చెడుజరిగే అవకాశం ఉందిగనక, పున:సమీక్షను కోరుతుంది హేతువాదం. ఆ పున:సమీక్ష తర్క,హేతు,మానవశ్రేయస్సు ఆధారంగా జరగాలనుకోవడమే దాని శాస్త్రీయత. హేతువాదం అంటే గుడ్డిగా నమ్మకం కాదు. ప్రశ్నించి తెలుసుకుని నమ్మకాన్ని పెంచుకోవడం లేదా ఉన్న నమ్మకాన్ని మార్చుకోవడం. ఇదొక నిరంతర ప్రక్రియ.

నిజంగా నిజం.

పెదరాయ్డు said...

హేతువాదం ప్రకార౦ ఈరోజు ఒక నిజానికి/అబద్దానికి స౦భ౦ధి౦చిన హేతువు, రేపటికి మారుతు౦ది. మళ్ళీ మళ్ళీ మారుతు౦ది. ఈ రోజు నిజ౦గా కనిపి౦చిన హేతువు రేపు అపద్దమయే స౦భావ్యత వు౦ది. ఈరోజు శాస్త్రీయ౦గా నిరూపి౦చబడిన హేతువు రేపటి సడలి౦చబడిన/ఆధునిక శాస్త్రీయత ప్రకార౦ నిర్హేతుకమవుతు౦ది. ఎ౦దుక౦టే హేతువాద౦ కేవల౦ భౌతిక సాక్ష్యాలనే నిజమని నమ్ముతు౦ది కనుక. భౌతిక౦ కానిదేదైనా నిజ౦ కాదని నిర్వచిస్తు౦ది కనుక. భౌతిక సాక్ష్య౦ లేనప్పుడు సిద్దా౦తాలను గుడ్డిగా తిరస్కరిస్తు౦ది కానీ, సిద్దా౦త ప్రతిపాదనలను నిర్దారి౦చగల శాస్త్రీయత హేతువాదానికి లేదు. రేపటికి మారుతు౦దనే/మారగలదనే ఈనాటి హేతువును నమ్మట౦ హేతుబద్దమా? అన్నది నా మట్టిబుర్రను తొలిచేస్తు౦టు౦ది. నాకె౦దుకో హేతువాద౦ ప్రకార౦ హేతువాదమే నిర్హేతుకమనిపిస్తో౦ది. హమ్మో ...నాకు ఉరి శిక్ష వేయరు కదా?

ఉదాహరణకు కోర్టులు సాక్ష్య౦ ఉ౦టేనే ని౦దితుడిని దోషిగా తేలుస్తు౦ది. సాక్ష్యాలు లేకపోయినపుడు ఆ ని౦దితుడు నిరపరాధిగానే జీవిస్తాడు. సాక్ష్య౦ లేనప్పుడు ని౦దితుని గుడ్డిగా వదిలేస్తు౦ది కానీ, అతడిని దోషి అని కాని/నిర్దోషి అనికాని నిర్దారి౦చగల శాస్త్రీయత కోర్టులకు లేదు. ఇక్కడ కేవల౦ ’సాక్ష్యాలు’ స౦పాది౦చగలిగిన/మార్చగలిగిన/నిర్మూలి౦చగలిగిన సమర్థులే విజయాన్ని సాధిస్తారు. కోర్టులు స౦పూర్ణ న్యాయాన్నిఅ౦దిస్తున్నాయని న్యాయమూర్తులే ధైర్య౦గా చెప్పుకోలేని దుస్థితి నేటిది. కాకపోతే మరో మార్గా౦తర౦ లేక కోర్టులు, ప్రస్తుత సమాజ౦లో గౌరవాన్ని పొ౦దగలుగుతున్నాయి....హేతువాద౦ లాగా.

న్యాయానికీ నైతికతకూ ఎ౦తటి పోలికలూ వైరుధ్యాలూ ఉన్నాయో, హేతువాదానికీ మన స౦ప్రదాయాలకూ అ౦తటి పోలికలూ వైరుధ్యాలూ ఉ౦టాయి. దేని ప్రయోజనాలు దానికున్నాయి. కాకపోతే ఈ స౦ఘర్షణ ద్వారా ఏదో ఒకరోజు రె౦డి౦టినీ సమన్వయ పరచగలిగే మరో వాద౦ సృష్టి౦చబడుతు౦దనే నమ్మక౦ మాత్ర౦ నాకు౦ది.

Kathi Mahesh Kumar said...

@పెదరాయ్దు: హేతువాదం ఒక "నిరంతరప్రక్రియ" అన్నప్పుడు అది ఖచ్చితమైన నిర్వచనాల్ని ‘ఇదే ఫైనల్’ అని చెప్పి ఇవ్వదు. హేతువాదం ఒక ధృక్కోణం. ఒక ఆలోచనా విధానం. అది నిర్ణయించదు. నిర్ణయానికి ఉపయోగపడే విధానాన్ని ప్రతిపాదిస్తుంది. కాబట్టి హేతువాదం నిర్హేతుకం అయ్యే ప్రశ్నే తలెత్తదు.

బహుశా మీరు కొందరు హేతువాదుల సిద్ధాంతాల్ని ప్రమాణాలుగా తీసుకుని "మొత్తం హేతువాదం ఇదే" అనే నిర్ణయానికి వస్తున్నట్లున్నారు. హేతువాదం మతం కాదు. ప్రపంచమంతా ఇలాగే ఉండాలి అని indoctrinate చెయ్యడానికి.It provides space for sustained capacity for cognitive pluralism and perspectivism. ఇలా ఉన్నంతవరకూ హేతువాదం నిర్హేతుకమయ్యే పరిస్థితి రాదు.

చట్టాలు ఒక అంగీకారాత్మక పరిధిలో న్యాయాన్ని నిర్వర్తించడానికి ఏర్పరిచిన విధానం. హేతువాదం లాగా అదొక process, method or at most a tool.ఇలాంటి agreed framework ప్రతిసమాజం తన ఉనికి కోసం ఏర్పరుచుకుంటూనే వస్తోంది. దానిలోకూడా మార్పులు సాధ్యం. ఇదే "దేవుడి వాక్యం" అని చట్టం చెప్పదు.

సమన్వయం కావాలి.సమన్వయం కుదురుతుందనే నమ్మకం నాకూ ఉంది.

సురేష్ కుమార్ దిగుమర్తి said...

మనం నిర్వచించుకొంటాం, సమయాన్ని అవసరాన్ని బట్టి మార్చేసుకొంటాం. మన మున్న state మాత్రమే మనకు హేతువు. అలా కాకపోతే మిగతా వారు నా స్తాయికి చేరలేదంతే

Satyamevajayate said...

హేతువాదం అంటే -హేతువుని ( కారణాన్ని ) చూసే వాదం. ప్రతి విషయానికీ,ప్రతి సంఘటనకీ హేతువు వుంటుందనీ,ప్రకృతిలో ప్రతి సంగతీ హేతువు ప్రకారమే జరుగుతుందనీ చెప్పే వాదం .

అజ్ఞానం నుంచి జ్ఞానానికి ,అసత్యం నించి సత్యానికి ,నడిపించే దృక్పధాన్ని ఇస్తుంది హేతువాదం.
హేతువాదాన్నే భౌతిక వాదం అనొచ్చు .
పైన చెప్పిన వాక్యాలు 'రంగనాయకమ్మ' గారివి.
చాలా సులభంగా అర్ధమవుతాయి విషయాలు , రంగనాయకమ్మ గారి మాటల్లో .....