Monday, August 31, 2009

మాల-మాదిగల విబేధం : దళితక్రైసవుల రిజర్వేషన్


దళితక్రైస్తవులకు SC రిజర్వేషన్ ఒక రాజకీయ ఎత్తుగడ. ఒకవైపు ఇప్పటికే మాల-మాదిగల చిచ్చును రావణకాష్టంలా రగిలిస్తున్న రాజశేఖర్ రెడ్డి అసలు సమస్యని పక్కదారి పట్టిస్తూ చిన్నగీత పక్కన పెద్దగీత గీసాడు. ఇదే అదనుగా హిందుత్వవాదులు ఈ సమస్యని ఒక రాజ్యాంగాన్ని interpret చేసే సమస్యగా కాకుండా, మతపరమైన సమస్య చేసిపారేశారు. దీంతో అసలు చర్చ చాలా చోట్ల తప్పుదోవపడుతోంది.


సమస్య రిజర్వేషన్ ఉండాలా వద్దా అనేది కాదు.
సమస్య దళితులకు ఇంకా రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా కాదు.
సమస్య జనాభాప్రాతిపదికన వర్గీకరణ చెయ్యాలా వద్దా అనేది కాదు.
సమస్య క్రైస్తవ దళితులకు రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా అనేది కాదు.
సమస్య క్రైస్తవదళితులకు రిజర్వేషన్ కల్పిస్తే హిందూమతానికి అన్యాయం జరిగిపోతుందా అనేది అస్సలు కాదు.

సమస్య క్రైస్తవ దళితులకు SC కేటగిరీలో రిజర్వేషన్ కల్పించాలా వద్దా అనేది మాత్రమే.

మాల-మాదిగల విభేధం నేపధ్యాన్ని తీసుకుంటే; advantage ఉన్న మాలలు ఎక్కువశాతం రిజర్వేషన్ లాభాలు పొందుతున్నారని. సంఖ్యాపరంగా ఎక్కువున్నప్పటికీ మాదిగలు ఆ సౌలభ్యాన్ని అందిపుచ్చుకోలేకున్నారనే వాదన ఆధారంగా మాదిగలు వర్గీకరణను కోరారు.మాల-మాదిగలిద్దరూ గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, దళితక్రైస్తవులకు రిజర్వేషన్ కల్పిస్తే మళ్ళీ అదే జరుగుతుంది. కాన్వెంట్ చదువులు,ఆర్థికపరమైన బలిమి కలిగిన దళితక్రైస్తవులు రిజర్వేషన్లో సింహభాగాన్ని ఎగేసుకెళ్తే నష్టపోయేది మాల-మాదిగలే.

ఇప్పటికే దళితక్రైస్తవులు BC స్థాయిలో 1% రిజర్వేషన్ కి అర్హులు. దళితక్రైస్తవులకు ప్రత్యేకంగా మరికొంత శాతం అదనంగా పెంచి రిజర్వేషన్ కల్పిస్తే వచ్చేనష్టం లేదుగానీ, SC కేటగిరీలో ఇస్తామంటే మాత్రం దళితులకు అన్యాయం జరిగినట్లే.

ఈ చర్చల్లో మతపరమైన కోణం ఒక అనవసరమైన అపోహ మాత్రమే.

****

20 comments:

Praveen Sarma said...

క్రైస్తవ మిషనరీలు స్కూళ్ళు కట్టేది మత మార్పిడిలు కోసమే కదా. క్రైస్తవ మిషనరీ స్కూల్ లో, అది కూడా ఇంగ్లిష్ విద్య నేర్చుకున్న దళితులకి ఉద్యోగం దొరకడం కష్టం కాదు. ఇక దళిత రిజర్వేషన్ కోటా ఉద్యోగాలూ దాదాపుగా అన్నీ దళిత క్రైస్తవులు లాక్కుపోయి నిజమైన దళితులకి ఉద్యోగాలు రాకుండా చెయ్యడం ఖాయం.

mohanrazz said...

బిసి-సి ని ఎస్సీ లో కలిపి రిజర్వేషన్లిస్తే ఎస్సీలు నష్టపోతారో లేదో చెప్పలేను కానీ ఇది బిసి-సి కి ఏ మాత్రమూ ఉపయోగపడే నిర్ణయం కాదు అని మాత్రం చెప్పగలను. 1% రిజర్వేషన్ వల్ల ఎక్కడికెళ్లినా ఒక సీట్ ఉండడం లేదా (when total intake is less than 50) అది కూడా ఉండకపోవడం కొంత టార్చరే అయినా - దీనికి పరిష్కారం గా -జెపి చెప్పినట్టు- అవసరం అనుకుంటే - బిసిసి కి ఒక 0.5 % అలా పెంచడం (అదీ అవసరమనుకుంటే) - కరెక్ట్ కానీ- ఇలా ఎస్సీ ల్లో కలిపి కొత్త గొడవలు తీసుకొచ్చి- మళ్ళీ మొత్తాన్ని కంగాళీ చేయడం కేవలం రాజకీయ ఎత్తుగడే.

Vinay Chakravarthi.Gogineni said...

evari point of view lo vaaru alochistunnaru....after reding ur post and mohan's comment...i felt like this.

హేతువాది said...

మత, కుల ,వర్గ రాజకీయాలు నశించి నప్పుడే ఇలాంటి వాటికి పరిష్కారం. మూలాన్ని వదిలి రకరకాల వర్గీకరణ చేస్తూ పోతుంటే సమాజం ముక్క చెక్కలాగా చీలి,చివరికి నశించటం ఖాయం.
మూల సమస్యకు మందు వేస్తేనే రోగం కుదురుతుంది.

కత్తి మహేష్ కుమార్ said...

@హేతువాది: "మూలసమస్య" ఏమిటంటారూ!

@గోగినేను వినయ్ చక్రవర్తి: అందరి కోణాల్నీ సమదృష్టితో చూసే universal brotherhood మనకు లేదు. ప్రస్తుతానికి రాలేదు. కాబట్టి ఎవరి POV లో వాళ్ళు ఆలోచించడం తప్పులేదుగా!

@మోహన్ రాజ్: జనాభా ప్రాతిపదికన దళితక్రైస్తవులు రిజర్వేషన్ శాతం పెంచడానికి పోరాడితే దళితులంతా సమర్దిస్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు.

కానీ SC లలో కలపడాన్ని మాల-మాదిగలు వ్యతిరేకిస్తే దాన్ని సహానుభూతితో దళితక్రైస్తవులు అర్థం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలా జరగకపోతే వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి వ్యూహం ఫలించి మళ్ళీ కొట్టుకోవడం మొదలౌతుంది.

హేతువాది said...

@మహేష్ : అసమానతలను, కుల వివక్షను పెంచి పోషిస్తున్న "రిజర్వేషన్స్" అనేదే మూల రోగం. దీనికీ సరైన ప్రత్యమ్నాయాం(మందు) వేయాలి.లేకపోతె ఈ లొల్లి దేశాన్ని గుల్ల చేస్తుంది. ప్రతి కులం /వర్గం తన అస్తిత్వానికి ఆరాటపడుతుంది. రాజస్తాన్లో గుజ్జర్లు-మీనాలు, ఆంధ్రలో మాల,మాదిగలు...ఇలా ఈ రావణ కాష్టం ఆరదు. వీరికి తోడూ మాకు కోటా అంటు మరిన్ని కులాలు. ప్రపంచం లో మనం తప్పా మరే జాతి "మేము వెనక బడి ఉనామంటే ,కాదు మేము ఇంకా వెనకబడి ఉన్నాం" అనే వాదనలు చేయరు. ఆరు పదుల ఏళ్లలో ఈ రిజర్వేషన్ల సాదించినది ఏమిటి? సాదించాలిసినది ఎంత? అది సాదించటానికి ఇంకెంత కాలం పడుతుంది? సావధానంగా ఆలోచించండి.

తమిళన్ said...

హేతు వాది గారు

మీరు చెప్పేది తప్పు , ,కుల వివక్షను పెంచి పోషించేది "రిజర్వేషన్స్" కావు.

కావాలంటే మీ ఊరిలోని దళిత కూలీని మరియు రిజర్వేషన్స్ తో వుద్యోగం సంపాదించుకున్న దళితున్ని ఒక్కసారి అడిగి చూడండి.
పెద్దకులం వాళ్లు ఎవరితో స్నేహంగా వుండడానికి ఇష్టపడతారో.. ?

ప్రభాకర్‌ మందార said...

దళిత క్రైస్తవులకు ప్రస్తుతం ఇస్తున్న బీ సి - సి కోటాకు ప్రాతిపదిక ఏమిటి.?
క్రైస్తవ మతం లో చేరిన ఎస్ టి ల , బీసీ కులాల పరిస్థితి ఏమిటి?
బౌద్ధ మతం లో చేరిన దళితులకు ఎస్ సి కోటా అలాగే ఇస్తున్నారా ?
క్రైస్తవ మతం లో చేరాగానే దళితుడు ఎస్ సి నుంచి బీసీ గా ఎలా మారతాడు?
దేవాలయాల్లోకే అడుగుపెట్టే అర్హతలేని దళితుడికి కూడా గతం లో మతం అనేది వుండేదా ?
బౌద్ధ మతం లోకి మారిన దళితుడి ఎస్ సి స్థాయిని అట్లాగే వుంచి క్రైస్తవ మతం లో చేరిన దళితుడి స్థాయిని మాత్రమే మార్చడానికి కారణం ఏమిటి?
దళితులు మారితే బౌద్ధ మతం లోకి మారాలి కానీ క్రైస్తవమతం లోకి మార కూడదని పరోక్షంగా నిర్దేశించడమే కదా ఇది?
దళిత క్రైస్తవు లందరికీ ఇప్పటికీ నెల నెలా విదేశాల నుంచి నిధులు/ ఆర్ధిక సహాయాలు ఏమైనా అందుతున్నాయా ? రహస్యంగానా, బాహాటంగానా?
వర్గీకరన శాస్త్రీయ పద్ధతులలో జరిగితే అన్ని అవకాశాలను క్రైస్తవులే ఎట్లా దక్కించుకోగలరు?
దళితుల ఎ బి సి డి వర్గీకరణ డిమాండ్ న్యాయమైనది కాదా?
మీ టపా చదివిన తరువాత నాకు తట్టిన ప్రశ్నలివి. సమాధానాలు చెప్పగలరా ?

mohanrazz said...

@vinay,
నిజానికి నాకూ ఇలాంటి చర్చలమీద పెద్ద ఆసక్తి లేదు. అయితే వై.ఎస్. తీర్మానం చేయగానే చంద్రబాబు, చిరంజీవి వెంటనే -"అవును మాకూ ఇలాంటి రిక్వెస్ట్లు వచ్చాయి" అని చెప్పి ఆమోదించారు...వాళ్ళని ఈ తీర్మానం చేయమని రిక్వెస్ట్ చేసిన పెద్దల్లో కానీ, తీర్మానాన్ని ఆమోదించిన వై.ఎస్, చంద్రబాబు, చిరంజీవి లో కానీ ఎవరిలోనూ నాకు ముందు చూపు కనపడలేదు...దీనివల్ల బిసిసి లకి ఒరిగేది ఏమీ లేదు అని ఎవరూ ఎక్కడా చెప్పకపోవడం వల్ల ఇలాంటి POV ఒకటుంది అని తెలియజేయాలనే ఉద్దేశ్యం తో ఈ కామెంట్ వ్రాసాను...

Praveen Sarma said...

మహేష్: ఇది మతపరమైన సమస్య కూడా. దీన్ని మతం నుంచి వేరు చేసి చూడకూడదు. క్రైస్తవులూ, ముస్లింలూ తమ మతాలలో కులాలు లేవని చెప్పుకుంటారు కానీ రిజర్వేషన్ల విషయానికి వచ్చేసరికి మతం మారినంతమాత్రాన కులం పోదు అని అంగీకరిస్తారు.

వర్మ said...

వై.ఎస్. ఉచ్చులో పడనివాళ్ళు ఎవరూ లేరు. విభజించి పాలించు సూత్రాన్ని బాగ ఒంటపట్టించుకున్న వ్యక్తి. నేడు సమాజంలో ప్రతిదాన్ని అనుమానాస్పదంగా తయారుచేసాడు. మాల-మాదిగల వర్గీకరణ జరిగివుంటే ఈ సమస్య అంత ప్రాధాన్యతనిచ్చేవారు కాదనుకుంటా. తన బంధువర్గం ఇందులో వుండబట్టి ఈ సమస్యను ముందుకు తెచ్చాడు. రిజర్వేషన్లు వుండాలి కాని ఉన్నత తరగతికి ప్రమోట్ కాబడ్డ కుటుంబాలను మినహాయించి అట్టడుగు వర్గాలవారికి అవకాశాలు కల్పిస్తే కొంత అపోహను తొలగించవచ్చు.

హేతువాది said...

@తమిళన్ గారు:విద్య,ఆర్ధిక స్థితి గతులు మనిషికి గొరవాన్ని,మర్యాదను ప్రసాదిస్తాయి. కులం నుండి బయట పడి విద్య,ఆర్ధిక స్థితి లు మెరుగు పరచటానికి మనం అనుసరస్తున్న రిజర్వేషన్స్ పద్దతిలో ఏళ్ళు,పూళ్ళు గడిచిన పలితం రాదన్నది గత ఆరు దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. ఇవి విద్యార్దులలో కుల వివక్షత పెరిగేలా చేసాయేకాని, రూపు మాపటానికి తోడ్పదలేదన్నది నగ్న సత్యం. ఈ కులాల ప్రస్తావన విద్యలయాలలోకి రాకుండా ఉండిఉంటే ఇప్పటికే ఎన్నో కులాంతర వివాహాలు జరిగి చాలవరుకు కులాల మద్య అంతరాలు పోయేవి. కాని ఒకప్పుడు అణగారిన వర్గాలకే పరిమితం అయిన రిజర్వేషన్స్ ఇప్పుడు ప్రతి వారికి కావలిసి వచ్చాయి. ఇంతకంటే ఈ రిజర్వేషన్స్ లేకుండా ఆయా వర్గాలకు ఆర్ధిక సహాయ సకారాలు ఇచ్చి వారికి మెరుగైన జీవన పరిస్థితులు కల్పించి ఉంటే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది.

కత్తి మహేష్ కుమార్ said...

@ప్రభాకర్ మందార: మీప్రశ్నలకు నాకు తెలిసిన సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను.

1.బహుశా మండల్ కమిషన్ నేపధ్యంలో చేసిన OBC కేటగరీలో క్రైస్తవుల్ని,దూదేకుల ముస్లింలనూ చేర్చడం జరిగింది.కాబట్టి మతపరమైన రిజర్వేషన్లు చెల్లవు అనే వాదన సరికాదనుకుంటాను.అలాగే ఇస్లాం,క్రైస్తవాలలో కులం లేదు అనేదీ చెల్లదు.

2.క్రైస్తవ మతంలోకి వెళ్ళగానే అంతకుముందున్న కులాలు పోయి అందరూ బిసీ-సి కోటాలోకి వెళ్తారనుకుంటాను.

3.బౌద్ధమతంలోకి వెళ్ళిన ఎస్.సి ల కోటాలు ఎలా ఇస్తున్నారో నాకు తెలీదు.

4.SC అనేవి కులాలు.ST అనేవి జాతులు.ఇవి వివక్షని, సమాజిక deprivation కీ గురైన కులాలు,జాతులు.ఇవికాక ఆర్థికంగా,సామాజికంగా "వెనుకబడిన" కులాలను BC లేదా OBC లుగా వర్గీకరించి మరికొన్ని రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అవి వివక్షకు సంబంధించిన కులాలు కాదు. కేవలం వెనుకబాటుకు సంబంధించిన కులాలు. అవి ఎంత వెనుకబాటులో ఉన్నాయి, ఆ లిస్టులో ఎన్ని లొసుగులున్నాయి అనేది మరో చర్చనీయాంశం.

5.దళితుడికి in principle and in practice మతం లేదు. కానీ,వివక్షకు ఆధారం మాత్రం హిందూమతం నిర్వచించిన "పంచముల" వర్గీకరణ నుంచీ వచ్చిందిగనక by default హిందువులు అనుకోవాలి. హిందూ framework లోంచీ వివక్షను అర్థం చేసుకోవలసి వస్తోందికాబట్టి, దళితుల్ని హిందువులు నీచంగా చూశారని ఒప్పుకోవాలి. ఈ విధంగా దళితులు హిందూమతంలో ఉంటూనే మతం లేని అమానవీయమైన బ్రతుకులు వెళ్ళదీసారు.

కాబట్టి పోగొట్టుకున్న చోటే వెతుక్కున్నట్లుగా, వివక్ష చూపిన మతంలోనే పోరాడి హక్కుల్ని గెలుచుకోవడం ఒక పద్దతి. కాదని త్యజించడం మరొక పద్దతి. Its a choice.

బౌద్ధమతం గురించి బౌద్ధమతంలోని దళితుల గురించి నాకు పెద్దగా తెలీదు కాబట్టి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదు.

దళితుల ABCD వర్గీకరణ న్యాయమైనదే.

Suresh Kumar Digumarthi said...

@ Praveen Sarma

ఏ కులాల వారు మతం మారినప్పుడు కులం లేదని చెప్పుకుంటున్నారు. మిగతా కులాల వారు మతం మారినా కులాన్ని ఎందుకు వదిలి పెట్టడం లేదో అర్ధమయితే, రిజర్వేషన్ల వద్దకు ఎందుకు పరిగెడుతున్నారో అర్ధమయిపోతుంది.

చెప్పుకోవడానికి ఏముందండీ, అందరం ఏదో ఒకటి చెప్పేస్తాం. పాటించినపుడే అసలు కధ తెలిసేది.

దలిత క్రైస్తవులు, దలిత ముస్లిములు, దలిత హిందువులు... etc అందరూ దలితులే. దలిత పుట్టుకకు వచ్చిన కష్టాలకు వాళ్ళు అతీతులు కాలేదు.

@ mohanrazz

నేను మీతో కొంత వరకూ ఏకీభవిస్తాను. మా ఊరిలో దలిత క్రైస్తవులు [కొంతమంది] దేవునికి నిజాయితీ ఉండడం కోసం, చట్టానికి కట్టుబడి ఉండడం కోసం BC-C గా మారారు. వాళ్లందరికీ వాళ్ల వయసు SC ల కన్నా 10 సంవత్సరాలు ఆలస్యంగానే ఉద్యోగాలు వచ్చాయి.
@ హేతువాది
ఒకప్పటి సమాజంలో వర్గాలు లేకుండా ఉండి ఉంటే, ఇప్పుడు వర్గీకరణలు ఉండేవి కావు. ఇన్ని వర్గాలలో ఉన్న వెనుకబడిన వర్గాలకు ఊతం అందించాలంటే ఏదీ ఒక వర్గీకరణ జరగాల్సిందే

మీరు చెప్పిన వర్గ రహిత ఆర్ధిక సహాయం మంచి ఆలోచనే. కానీ జరుగుతుందా?


దళిత క్రైస్తవులకు (BC-C) SC హోదా కలిపించడం ద్వారా వెనుకబడిన దలితులకు అవకాశాలు తక్కువవుతాయి, నిజమే. మరి దలితులలో క్రైస్తవులంతా చదువు, ధనం, అభివృద్ది రుచి చూసిన వారు కాదు కదా. వారికి దలితులుగా వుంటూ క్రైస్తవ మతాన్ని ఆచరించే స్వేచ్చ ఉండదా? క్రైస్తవ మతం పాటించడానికి ప్రాతిపదిక ఏమిటి. దలితులలో క్రైస్తవులు ఉండకూడదా

ప్రభాకర్‌ మందార said...

మహేష్ కుమార్ గారూ
ధన్యవాదాలు. మహారాష్ట్ర లో దళిత బౌద్ధులకు ఎస్ సి కోటా వుందని విన్నాను. అది నిజమైతే దళిత క్రైస్తవులకు వర్తింపజేయకపోవడం వివక్షే అవుతుంది. దళిత క్రైస్తవులకు BC -C కోటా ఇవ్వడం మతపరమైన రిజర్వేషన్ కానప్పుడు SC కోట ఇవ్వడం మాత్రం మతపరమైన రిజర్వేషన్ ఎలా అవుతుంది.
ABCD వర్గీకరణ సమస్య సజావుగా పరిష్కార మైతే ఒక కులం వాళ్ళే రిజర్వేషన్లలో సింహ భాగం ఎగరేసుకు పోతారన్న భయమే వుండదు.
సమస్యను సృష్టించడం, నాన్చడం, దేనినీ చిత్తశుద్ధితో శాస్త్రీయంగా పరిష్కరించకపోవడం , రాజకీయ లబ్దికే ఎక్కువ ప్రాధాన్యత నివ్వడం మన ప్రధాన రాజకీయ పార్టీల స్వభావం. కాబట్టి ఈ సమస్య కూడా అంత సులువుగా పరిష్కారం అవుతుందని ఆశించలేం.

Praveen Sarma said...

సురేష్ గారు. పాస్టర్ లు, ఇమాంలు తమ క్రైస్తవ, ఇస్లాం మతాలలో కులాలు లేవని చెపుతారు, తమవి సమానత్వాన్ని ప్రసాదించే మతాలని చెపుతారు. క్రైస్తవ, ఇస్లాం మతాలలోకి మారిన వాళ్ళు కుల ఐడెంటిటీ వదులుకోకపోవడం గురించి అడిగితే సమాధానం చెప్పరు. రిజర్వేషన్ల విషయంలో వీళ్ళ కుల ఐడెంటిటీ ఓపెన్ గా బయట పడుతుంది. మిగితా సందర్భాలలో వీళ్ళ మతాలలో కులం లేదనే నమ్మించడానికి ప్రయత్నిస్తారు. ఇది మతంతో సంబంధం ఉన్న సమస్యే. ఈ సమస్యకి మతంతో సంబంధం లేదని వాదిస్తే ఈ సమస్య గురించి అర్థం కాదు.

Suresh Kumar Digumarthi said...

@ Praveen Sarma గారు
[1] ’క్రైస్తవ, ఇస్లాం మతాలలోకి మారిన వాళ్ళు కుల ఐడెంటిటీ వదులుకోకపోవడం" -ఇవి భారత దేశంలో పుట్టలేదు కాబట్టి, వాటికి కులం లేదు. కానీ భారత దేశంలో కులం లేకుండా ఎవరూ ఉండరు. కొంత జ్నానం వచ్చిన తరువాత కులం వద్దు అని అనుకోవచ్చు. [కాబట్టి మన దేశంలో ఫలానా కులం వాళ్ళు ఫలానా మతాన్ని పాటిస్తారు.]
[2] "రిజర్వేషన్ల విషయంలో వీళ్ళ కుల ఐడెంటిటీ ఓపెన్ గా బయట పడుతుంది" - ఇక్కడ బయటపడేముందండీ, BC-C లు ఎవరు. christianity లోకి convert అయిన దలితులే కదా.
[౩] "మిగితా సందర్భాలలో వీళ్ళ మతాలలో కులం లేదనే నమ్మించడానికి ప్రయత్నిస్తారు" - ఇది మనుగడకోసం పోరాటం. అసలు కులం చెబితే జరిగేదేమిటో తెలుసుకదా. దానినుండి తప్పించుకొనే ప్రయత్నం అంతే. మాకు కులం లేదు అని అందరూ అనరని, అలా అన్న వారి కులమేమిటో అడిగిన వారికి అర్ధమవుతందని వారికి తెలియదు. భ్రమలలో బ్రతుకుతుంటారు
[4]నా వరకైతే దీని వల్ల వేరే మతానికి ఇబ్బంది కలుగుతుందని అనుకోవడం లేదు. ఒకే వర్గంలో ఉన్న అభివృద్ది అంతరాలను అంతం చేయడం మన బాధ్యత అని మాత్రమే అనిపిస్తుంది. చర్చ ఆ దిశగానైతే బావుంటుంది.

Praveen Sarma said...

సురేష్ గారు. ఒకప్పుడు చైనా, ఇరాన్ దేశాలలో కూడా కుల వ్యవస్థ ఉండేది. కానీ ఆ దేశాలలో కుల వ్యవస్థ తరువాత మాయమైపోయింది. ఇండియాలో కుల వ్యవస్థని హిందూ మతం సమర్థించడం వల్లే ఇండియాలో కులాలు ఇంకా ఉనికిలో ఉన్నాయి. మాకు హిందూ మతం వద్దు అని బహిరంగంగా ప్రకటించుకుని క్రైస్తవ, ఇస్లాం మతాలలో చేరిన వాళ్ళు కూడా రిజర్వేషన్ల విషయానికి వచ్చేసరికి తమకి కూడా కుల ఐడెంటిటీ ఉందనీ, మతం మారినంతమాత్రాన కులం పోదనీ వాదించడం వల్లే మత రిజర్వేషన్ల వివాదం వచ్చింది. పాస్టర్లూ, ఇమాంలూ తమ క్రైస్తవ, ఇస్లాం మతాలలో కులాలు లేవు అని చెప్పుకుంటుండగా ఆ మతాలలో చేరిన వాళ్ళు కులాలని ఆచరించడం బహిరంగంగానే కనిపిస్తోంది.

Suresh Kumar Digumarthi said...

@ Praveen Sarma

ప్రవీణ్ గారూ, కులం హిందూ మతంలో భాగం, క్రైస్తవ, ముస్లింలలో కాదు కాబట్టి [అని వారు చెప్పుకుంట్టున్నారు కాబట్టి] వారికి కుల identity claim చేయకూడదు అంటున్నారు. అంతేనా.
మతం మారినందువల్ల వారికి సమాజంలో ఎంత లాభం జరిగింది. అప్పటి వరకూ ఉన్న ఆధిపత్య వర్గాలతో సమానమైన identity వచ్చిందా. అలా రాకపోవడానికి కారణం వారి వెనుకటి కులమే కదా. అలా కాకపోతే జార్జి రెడ్డి, ధామస్ చౌదరి, ఎజ్రా శాస్త్రి ఉండరు కదా. అంటే కుల ప్రభావం వారి మతం మారినా కొనసాగుతూనే ఉంది కదా.
నా అనుభవం వరకూ కులం మనతో ఉంటుంది. మన అభిరుచుల బట్టి మతం మారుతూ ఉంటాం.
కాబట్టి మతం-కులం వేరు చేసి మనం బ్రతకడం లేదు. దానికి కారణం చాలా చిన్నది ప్రవీణ్ గారూ. అందరికీ సమాన హక్కులు, అవకాశాలు వచ్చేవరకూ సమానత్వం రాదు. నరం లేని నాలుకతో నానా రకాలుగా మాట్లాడుతాం. అందుకే నేను వాళ్ళేం మాట్లాడేరో అని కాక practice ని మాత్రమే consider చేస్తున్నాను. వాళ్ళ మాటలు, చేతలు justify చేస్తూ ఎన్నటికీ మన చర్చ పూర్తి కాదు. ఎవరు ఏమి చెప్పినా, ఏమి జరుగుతుందన్నదే నాకు మూలం. I too have problem with what they say.

'రిజర్వేషన్ల విశయానికి వచ్చేసరికి’ ఇది operation aakarsh లాంటిది. ఇప్పుడు మనమున్న స్తితి కన్నా మెరుగుపడతామనుకున్నవారంతా సమర్ధిస్తారు. ఉన్న అవకాశాలు తగ్గుతాయకున్నవారంతా వ్యతిరేకిస్తారు. దీనికి కులం మతం లేదు. ఎవరి వల్ల ఉపయోగం ఉంటే ప్రభుత్వం వారికి అనుకుణంగా నడచి, తనని తాను నిలబెట్టుకుంటుంది. ఇది ప్రభుత్వమే ఆడే ఆట మని మాత్రం చెప్పక తప్పదు.

graphic war said...

సోదరులారా...
మనలో మనకి ఎందుకీ పితలాటకం. క్రైస్తవమతం స్వీకరించినంత మాత్రాన మాల మాలకాకుండా, మాదిగ మాదిగ కాకుండా పోతాడా? మీరన్నట్టు మత సంస్థల స్కూళ్ళలోఇంగ్లీషు చదువులు చదువుతున్నవారు ఎంత పర్సెంట్ వున్నారో చెప్పగలరా? చాలా చాలా తక్కువ మంది. భారతదేశంలో రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్లో ‘‘మతస్వేచ్ఛ’’ ఒకటి. అయితే రాజకీయ నాయకుల పుణ్యమా అని మాల - మాదిగల మధ్య కీచులాటలకు దీన్ని ఒక పావుగా వాడుకుంటున్నారు. దళిత క్రైస్తవులు మాలల్లో ఎంత మంది వున్నారో, మాదిగల్లోనూ అంతే మంది వున్నారు. మతం మార్చుకున్నందువల్ల రెండు కులాల్లోని వారూ నష్టపోతున్నారు. ఎటొచ్చి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నవారిలో మాలలూ వున్నారు, మాదిగలూ వున్నారు. ఇక్కడ స్పష్టత వుండాల్సినఅంశమేమిటంటే మతం మారినా మారని బతుకులు. క్రిస్టియానిటీలోనూ వున్న అగ్రకుల ఆధిపత్యం. ముఖ్యంగా ఇక్కడ అగ్రకుల ఆదిపత్యం వుందనే విషయం అందరికీ తెలిసిందే. ఫాస్టర్స్ అయినా, ఫాదర్స్ అయినా ఎక్కువ శాతం మంది వారే. మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కాని అందరూ సమానం అని చెప్పే క్రైస్తవమతంలో కూడా ఒక అగ్రకులానికి చెందిన ఫాస్టర్ లేదా ఫాదర్ ఒక దళిత క్రైస్తవుడి ఇంట్లో కనీసం భోజనం కూడా చేయడు. ఏదైనా ఫంక్షన్స్ జరిగితే వారికి బియ్యం, కూరగాయలు, లేదా మాంసం వంటి వాటిని ఇంటికి పంపించాలి.
ఏ వివక్ష నుండి బయటపడాలని మతం మార్చుకున్నారో అదే వివక్ష ఇక్కడ కూడా కొనసాగుతూనే వుంది. అయితే దాని రూపాలు వేరుగా వుంటాయి.
దళిత సోదరులారా..... మనలో వున్న అభిప్రాయ బేధాలను రాజకీయ నాయకులు పెంచి పోషిస్తున్నారు. మనలోనూ రాజకీయ వ్యామోహం గల కొందరిని పావులుగా ఉపయోగించుకుని పబ్బం గడుపుతున్నారు. మాలలైనా, మాదిగలైనా ఎందరు ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తోటి ఎస్సీలకు ఉపయోగపడుతున్నారు. కనీసం ఎస్సీ కార్పొరేషన్ల ద్వారానైనా వచ్చే ఫండ్స్ ను ఎంతమందికి ఉపయోగించేలా వీరు చేస్తున్నారు.
రాజ్యాంగపరంగా మనకు సంక్రమించిన మన హక్కులను కాపాడుకోవడానికి ఐక్యంగా ఉద్యమించాలి. చదువులోనూ, రిజర్వేషన్లు పొందడంలోనూ, ఆర్థిక స్థితిగతుల్లోనూ కొంత తేడాలు వుండివుండవచ్చు. అవి ఏమేరకు వున్నాయి. వాటి మూలాలు ఏమిటి అనే దిశగా ఆలోచించి.... ఇంకా అట్టడుగునే వున్న లక్షలాది మంది మన సోదరులను ముఖ్యంగా విద్యావంతులను చేసే దిశగా ప్రయత్నించాలి. అగ్రకులాల్లో కొంత మంది కొన్ని ట్రస్టులు నడుపుతూ వారివారిని పైకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అదే రీతిగా మనలోనూ వున్న స్థితిమంతులు కొందరైనా అట్టడుగున మగ్గుతున్నవారికి చేయూతనిచ్చేదిశగా ఆలోచించాలి.
ఇక్కడో ఉదాహరణ : వెంకటస్వామి ఎంపీగా, పారిశ్రామిక వేత్తగా ఎంత ఎదిగాడు. ఆయన ఎంతమందికి ఉపాది అవకాశాలు కల్పిస్తున్నాడు. ఎందరు దళితులను చేరదీశాడు. అలాగే ఎంపీ హర్షకుమార్. వీళ్ళ పేర్లు ుదాహరణకు మాత్రమే చెప్పాను తప్ప వీళ్ళను తప్పుబట్టాలని కాదు. ఇలాంటివారు మనలో చాలామంది వున్నారు.
అంతేగాకుండా ప్రభుత్వాఫీసుల్లో వున్న ఉన్నతాధికారులు సాటి దళితుడ్ని ఏవిధంగా చూస్తున్నారో చాలామందికి తెలుసు.
నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే... దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ల వల్లనే మిగతావారి పురోభివృద్ధి ఆగిపోతుందన్నట్టుగా కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఇది సరైంది కాదు.
రాష్ట్రవ్యాప్తంగా వున్న మాల, మాదిగల్లో ఎంతమంది క్రైస్తవులున్నారు. వారిలో ఎందరు క్రైస్తవ సంస్థల ద్వారా లబ్ది పొందుతున్నారు, వారి ఆర్థిక స్థితిగతులు ఏమిటి అనేది ఒక సర్వే జరపడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు.