Sunday, August 23, 2009

బీజేపీ సమస్య ఏమిటి?

బీజేపీ చింతన్ బైఠక్ (అంతర్మధన సభ) అయిపోయింది. ఆర్.ఎస్.ఎస్. "యువనేతలకు అవకాశం ఇవ్వండి" అని బీజేపీకి సలహా (బహుశా అల్టిమేటనమ్) ఇచ్చింది.
ఈ సభ మొదలవ్వకముందే సీనియర్ నేతలు యశ్వంత్ సిన్హా అసంతృప్తి నేతయ్యాడు. జస్వంత్ సింగ్ సాగనంపబడ్డాడు. ఇప్పుడే అద్వానీ సహచరుడు సుధీంద్ర కులకర్ణి "సైద్ధాంతిక విభేధాలంటూ" రాజీనామా సమర్పించాడు.

సభలో... 1) వరుణ్ గాంధీ ‘హేట్ స్పీచ్’ 2) మోడీని భావి ప్రధానిగా ప్రొజెక్ట్ చెయ్యడం 3) మన్మోహన్ సింగ్ ను "వీక్" అనే అద్వానీ విమర్శ 4) అటల్ బిహారీ వాజ్ పేయ్ లేమి; బీజేపీ ఓటమికి కారణాలుగా అంగీకరించబడ్డాయి.

పైన చెప్పిన కారణాలు, ఆపైన చెప్పిన పరిణామాలూ చూస్తేనే బీజేపీలో సాగుతున్న గందరగోళం అర్థమవుతుంది.

వాజ్ పేయ్ బీజేపీ రాజకీయ మనుగడకు అవసరం. కానీ,ఆర్.ఎస్.ఎస్. కు కాదు. వాజ్ పేయ్ రాజకీయాల నుంచీ నిష్క్రమణతో "తనమాటే ఫైనల్" అని తేల్చిచెప్పగల ఒక్కనేతా కరువయ్యాడు. మిగతాపార్టీలకు కూడా ఆమోదయోగ్యమైన ఒక (ఒకేఒక్క) జాతీయనాయకుడు బీజేపీకి దూరమయ్యాడు.

అద్వానీ బలమైన నేత అన్న బీజేపీ, మన్మోహన్ బలహీనుడన్న అద్వానీ మాటల్ని తప్పుబడుతున్నారు. తన అభిప్రాయాన్ని సొంత పార్టీయే తృణీకరించే నేత బలమెంత? ఆర్.ఎస్.ఎస్. లెక్క ప్రకారం ఈయన ఇంటికి సాగనంపదగిన నేత. అద్వానీ తెచ్చిపెట్టుకున్న ‘లోహ్ పురుష్’ ఇమేజ్, చివరకు తనకే చేటుచేసింది. అద్వానీకి కూడా పార్టీ ఉద్వాసనచెప్పే స్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. రేపోమాపో అద్వానీ గౌరవప్రదంగా రాజీనామా చేస్తారు. లేదా బలవంతంగా పార్టీలోని "యువనేతలు" చేయిస్తారు.

గుజరాత్ లో నరేంద్ర మోడీకీ భారతదేశంలో మోడీకీ ఇమేజ్ పరంగా చాలా తేడా ఉంది. గుజరాత్ లో మోడీ ఒక సమర్థ పరిపాలకుడు. అక్కడా తనకు పార్టీతో సమస్యలున్నాయి. భారతదేశాన్ని మొత్తంగా చూసుకుంటే మోడీ ఒక ప్రమాదకరమైన ‘హిందుత్వ సిద్ధాంతానికి’ ప్రతినిధి. ఆర్.ఎస్.ఎస్. ఆమోదమున్నా పార్టీలోనే ఏకాభిప్రాయం లేని నేత. (గుజరాత్ అల్లర్లు పార్టీ ఇమేజ్ ని దెబ్బతీశాయని చాలా మంది నమ్ముతారు. వాజ్పేయి ఈ విషయంగా తీవ్ర అసంతృప్తి చెంది, రాజీనామా వరకూ వెళ్ళారనేది ఈ రోజున బహిరంగ రహస్యం). ఇలాంటి నేత ప్రధాని అవడం అంటే, ‘కొరివితో తలగొక్కున్నట్లే’ అనేది మెజారిటీ హిందూమితవాదుల అభిప్రాయం కూడా.

ఆర్థికంగా-సామాజికంగా-మతపరంగా- రాజకీయంగా ఒకటికాని "హిందువులు" అనే ఒక nebulous community (నిర్ధింష్టంగా ఉంది అని చెప్పనలవికాని సముదాయం) మొత్తంగా బీజేపీ పార్టీకి మద్దత్తుగా ఉన్నట్లు ఏ కొలమానాలు తీసుకుని విశ్లేషించినా ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. అలాంటిది ముస్లింలను ద్వేషించడమే మనల్ని సంఘటిత పరిచే "గొప్ప ఆలోచన" అని నమ్మే వరుణ్ గాంధీ లాంటి నెలతక్కువ హిందుత్వవాదం బీజేపీకిచెరుపునేతప్ప బలిమిని తీసుకురాదు.

------

బీజేపీకి కాంగ్రెస్ కు ప్రత్యామ్న్యాయంగా ఎదిగిన శక్తిగా ఇప్పటికీ మంచి గుర్తింపు ఉంది. ప్రధానప్రతిపక్షం అన్న హోదా ఉంది. చాలా రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. అలాంటిది ఇలాంటి పార్టీ బలహీనపడితే వచ్చే నష్టం కేవలం పార్టీకి కాదు, మొత్తంగా ప్రజాస్వామ్యానికి తద్వారా దేశానికి. కాబట్టి (కొన్ని అభిలషణీయమైన మార్పులతో) బీజేపీ మనుగడ అత్యవసరం.

కొన్ని సూచనలు;
1. బీజేపీ ఆర్.ఎస్.ఎస్.. వీ.హెచ్.పీ వంటి అతివాద-మతవాద సంస్థలకు దూరం జరిగి, ఒక స్వతంత్ర్య రాజకీయ పార్టీ రూపం ధరించాలి: ఈ నిర్ణయం వలన పార్టీ చీలినాచీలొచ్చు. కానీ ఈ సైద్ధాంతిక గందరగోళం మాత్రం ఒక్కసారిగా సమసిపోతుంది. ఒక s clear vision ఏర్పడుతుంది.

2.బీజేపీ తన కార్యకర్తకూ ఓటరుకూ గల తేడాను గుర్తించాలి. సిద్ధాంతాలను రంగరించుకున్న కార్యకర్తలు (వీళ్ళలోనూ ఎక్కువ ఆర్.ఎస్.ఎస్.వాళ్ళే) వేలల్లో ఉంటే, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా "ప్రత్య్యామ్న్యాయ విధానాలను" చూసి ఓట్లేసిన ఓటర్లు కోట్లలో ఉన్నారని తెలుసుకోవాలి. అలాంటి ఓటర్లకున్న ఒకేఒక గొంతు "ఓటు". దానికి గౌరవం ఇవ్వకుండా కార్యకర్తల గుడ్డిదారినే రహదారి అని నమ్మినన్నాళ్ళూ బీజేపీ ఒక మంచిపార్టీగా ఎదగలేదు.

3. సాంస్కృతిక-జాతీయవాద పార్టీ: మతవాదంతో సమస్య గానీ cultural nationalism తో ఎవరికీ సమస్య లేదు. ‘స్వదేశీ’కూడా అందులో భాగమైతే మన ఆర్థిక విధానాలుకూడా ఒకదారిన పడతాయి. అప్పుడప్పుడూ ఈ దిశగా బీజేపీ మాట్లాడినా, మతవాదానికున్న ప్రాముఖ్యత ఈ పార్శ్వా నికి ఇవ్వలేదు. మతవాదసంస్థలతో తెగదెంపుల వలన ఆ సౌలభ్యం లభిస్తుంది.

4. ముసలినాయకులతో పాటూ యువనాయకులుగా చలామణి అవుతున్న మాస్ బేస్ లేని "బోర్డ్ రూం" నాయకుల్ని కూడా ఇంటిదారిపట్టిస్తేగానీ నిజమైన ప్రజానాయకులకు బీజేపీలో సముచిత స్థానం దక్కదు. రాజకీయం ప్రజాజీవితంతో ముడిపడిన పని, టీవీలో సిద్ధాంతాలు మాత్రం వల్లెవెయ్యడానికి కాదు. కేవలం ఆపనులుచేస్తూ అగ్రనాయకులుగా నెగ్గుకొస్తూ పార్టీని బలహీన పరిచిన నాయకులకు (మొత్తంగా అందరూ రాజ్యసభలోనే ఉన్నారు) ఉద్వాసన పలకాలి.

కనీసం ఈ కొన్నైనా చేస్తేగానీ బీజేపీ ఒక బలమైన ప్రత్యామ్న్యాయ రాజకీయ శక్తిగా మిగలదు. చూద్ధాం ఏంజరుగుతుందో!

****

6 comments:

Suresh Kumar Digumarthi said...

మ్..బి.జె.పి పూర్తి లౌకిక పార్టీ గా మార్చే ప్రయత్నం. బావుంది.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

బీజేపీ మనుగడ అత్యవసరం
ప్రస్తుతభారతదేశానికి సరైన ప్రతిపక్షం అవసరం కాబట్టి బీజేపీ అవసరం మాత్రం చాలా ఉంది.

బొల్లోజు బాబా said...

బాగుంది విశ్లేషణ
బొల్లోజు బాబా

వర్మ said...

మీరు వారినుండి మరీ ఎక్కువ ఆశిస్తున్నారనిపిస్తోంది. ఆ పార్టీ మనుగడే కరడుగట్టిన మతవాదులపై ఆధారపడి వుంది. వాళ్ళకు మరింతమంది మోడీలను తయారుచేసే అవకాశాలమేరే ఎదురుచూస్తున్నారు. వారు రాజకీయ పార్టీగా మారడానికి అంత తొందరగా ముందుకు వస్తారా? దేశంలో సగభాగంగా వున్న దక్షీణ భారత్, ఈశాన్య రాష్ట్ర ప్రజల మనోభావాలను పరిగణలోనికి తీసుకోకుండా వారు ఆ నాలుగైదు రాష్ట్రాల మతమౌఢ్యంపై ఆధారపడి ప్రణాలికలు వేసుకుంటున్నారు. అక్కడ కూడా ఇప్పుడు మార్పు వస్తోంది. ఏనాడు వాళ్ళు ముస్లిం ప్రజానీకాన్ని ఈ దేశ ప్రజలుగా గుర్తించలేదు. గుర్తిస్తే వాళ్ళకు మనుగడ లేదన్న అభద్రతలో వున్నారు. వారి నిక్కరు యూనిఫారం వదిలితేనే మీ కల నెరవేరవచ్చు.

డుబుగు said...

LOL.

I can not help but laugh about the turns tha BJP taken after both the recent elections. 2004, 2009.

Hope BJP is not a party near to extinction

అడ్డ గాడిద (The Ass) said...

hahahaha well written