Thursday, May 15, 2008

నా కాలేజీ కథ - Part 4.1


"ఈ వెనింగ్ వాక్ లో స్నేహాలూ, ప్రేమలూ"




అటు పాతబడ్డ ర్యాగింగ్, ఇటు కొత్తగా పిచ్చెక్కిస్తున్న క్లాసుల మధ్యన మా జూనియర్ల జీవితాలు కాస్త దారిలో పడుతున్నాయ్. క్లాసుల వేగం పెరిగాయి,దాంతో మరింతమంది అధ్యాపకుల పరిచయం కలిగింది. కానీ ఏఒక్కరూ మా ‘జేమ్స్ బాండ్’ కి సరితూగే రకాలు మాత్రం కాదు. తన బరితెగింపుకు సాటిగలవారెవ్వరు లేరనుకుంటా! ఇక మిగిలిన వాళ్ళ లో, ఒకప్పటి అందగత్తె ‘ప్రేమా రాఘవన్’, డ్రామా లెసన్స్ తీసుకుంటే, రిటైర్ మెంట్ కి ఆరునెలల్లో ఉన్నా లిప్స్టిక్ మాత్రం అరంగుళం అంటించే ‘లక్ష్మి ఆర్య’ రీడింగ్ కాంప్రిహెన్షన్ చెప్పేది. బలశాలి ‘వరోనికా ముత్తణ్ణ’ ఫిక్షన్చ చెబితే, బక్కపలచటి కొత్త కుర్రాడు భాస్కర్ హిస్టరీ చెప్పేవాడు. ఇలా ఎవరికి వారు మమ్మల్ని సాదిస్తుంటే, మా ‘మిస్టర్ రఘునాథ్’ పొయట్రీ తో ప్రత్యేకంగా బెదరగొట్టేవాడు.


ర్యాగింగ్ ముగిసింది. మొదటి "ఫ్రెషర్స్ పార్టీ" పిలుపు మా సెకండ్ ఇయర్ సీనియర్ల దగ్గరనుండీ వచ్చింది. పెళ్ళైపోగానె అంతవరకూ శతృత్వం నెరపిన ఆడమగ పెళ్ళివారు, కలిసి ఒక్కసారిగా విందుభోంచేసినట్టు. నిన్నటి వరకూ కత్తులు దూసిన సీనియర్లు హఠాత్తుగా మిత్రులై పోయారు. చిత్రమేమిటంటే, ఎవరెంత ఎక్కువ ర్యాగింగ్ చేశారో వారంత గట్టి స్నేహితులైపోయారు. అప్పుడే తెలిసింది నాకు, "బావిలో పడితే ఈదాలి,లేకపోతే పోతావ్" అని చెప్పి నేనింకా కాలేజిలో ఉండటానికి ఒక కారణాన్నిచ్చిన సీనియర్ యముడి పేరు ‘దీపేష్’ అని. స్వతహాగా మళయాళీ ఐనా తెలుగు,కన్నడ,తమిళ భాషల్లో చెప్పుకోదగ్గ పాండిత్యముందతనికి. ఒక రకంగా చెప్పలంటే దక్షిణ భారతపండితుడన్నమాట. తను రాసుకున్న మా సెమిస్టర్ నోట్స్ అంతా, రమేష్ కీ నాకూ సమానంగా పంచి కలిసి చదువుకోండని ఉత్సాహపరిచాడు.


మొదటి ఫ్రెషర్స్ పార్టీ. అసలదేంటో తెలీదు. అందులో ఎంచేస్తారో తెలీదు. ఎలాగోలా చెప్పినచోటైన కాలేజి క్యాంటిన్ కి, కాలేజి లో చేరేముందు మా అమ్మ ముచ్చటపడి కుట్టించిన కొత్త లాగూ,చొక్కా తొడుక్కుని మిగతా వారితో కలిసి జట్టుగా బయల్దేరాం. మా కోలాహలం చూసి హాస్టలులోని మిగతా సీనియర్లు, ముసిముసి నవ్వులతో "ఎంజాయ్" అని ముచ్చటించారు. ఈ ముసిముసి నవ్వుల మతలబేమిటొ, పార్టీ మొదలయ్యాకగానీ అర్థంకాలేదు. అదోక విన్నూత్నమైన అనుభవమనే చెప్పాలి. కోంత మన ప్రాతివత్యానికి భంగం కలిగించినా ఆనందంగానే అనిపించింది. సీనియర్లు మాతో చాలా కార్యక్రమాలు చేయించినా, ఇప్పటికీ తలుచుకుంటే మనసు ఝల్లుమనే ఆట గురింఛి మాత్రం చెప్పక తప్పదు. ఆ ఆట పేరు "పేపర్ డాన్స్", ఇందులో జంటలు మ్యూజిక్ కి అనుగుణంగా ‘బాల్ డ్యాంస్’ చేస్తూ సంగీతం ఆగిన ప్రతిసారీ పేపర్ ని ఒక మడతపెడుతూ...ఆట కొనసాగించాలి. ఏ జంట ఆడుగు పేపర్ బయట పడితే వారు "ఔట్" అన్నమాట. సీనియరమ్మాయిలు, జూనియరబ్బాయిలతో ఈ డ్యాంస్ చెయ్యాలి అలాగే సీనియర్ అబ్బాయిలు జూనియరమ్మాయిలతో. నన్ను మంజుళ అనే కన్నడమమ్మాయి "వీడు నాకే" అంది, తప్పదా అన్నట్టు పేపరెక్కా. అంత దగ్గరగా నేను జీవితం లో ఏఅమ్మాయినీ చూసెరుగను. తన నడుం మీద నాచేతులు, నా భుజంమీ ద తనవి (బాల్ డ్యాంస్ అంటే ఇదేమరి), ఇక మొదలైంది మ్యూజిక్. నాకు మాత్రం ఏమీ వినపడలేదు, కేవలం మొదటి వంతు మాది గనక, మమ్మల్ని చూస్తూ కూర్చున్న మా క్లాస్ అమ్మాయిలు ముఖ్యంగా "దుర్మార్గుల్లారా" అన్నట్టు ఉన్న ‘అంబిలి’ చూపులు ల పైనే నా ధ్యాసంతా. ఎందుకో ఆ అమ్మాయిన మన పవిత్రత చూపి, ఇంప్రెస్ చెయ్యాలనిపించింది. రెండో రౌండ్ లోనే ఓడిపోయా. మా క్లాసు ‘హరీష్’ గాడు మాత్రం సీనియర్ అమ్మాయిని భుజాలపైకెత్తుకుని మరీ గెలిచిపారేశాడు. ఇక అమ్మాయిల వంతొచ్చింది, నా చూపులన్నీ అంబిలి పైనే. ‘రామకృష్ణ’ అనే తెలుగబ్బాయి తనకు జోడీ. ఆ అబ్బాయి రాటుదేలిన రకం గనక ఈ డ్యాంసుని ఇరగదీస్తే, అంబిలి కూడా తనకు పూర్తి సహకారాన్నిచ్చి ప్రథమస్తానాన్ని గ్రహించారు. అప్పుడు నా కడుపులో మండిన జ్వాల ఇప్పటికీ పొగలొస్తుందని చెప్పొచ్చు. ఈ డ్యాంస్ విషయంలో మనం వేసిన పతివ్రతావేషాన్ని తలుచుకొని, "తరువాత వచ్చే ఫ్రెషర్స్ పార్టీలలో మాత్రం ఈ మూర్ఖం జరగదు" అని నిర్ణయించేశా. ఆ తరువాత జరిగిన వాట్లో ఒక ప్రధమస్థానాన్ని మనంకూడా పట్టేసాం. అప్పుడు నాకు జ్ఞానొదయమైందని చెప్పుకోవచ్చు. "ధైర్యంగా చెడిపోయే అవకాశాలు ఇన్నిఉండగా, చేతగాని బేవార్సు పాతివ్రత్యమెం"దుకని. "ఇక చూస్కో ప్రపంచమా పెద్ద ప్రేమికుడు బయల్దేరాడ"ని, ఓ విజ్ఞప్తి పడేసి మరుసటి రోజునుండీ, కొత్తమార్గం పట్టేశాం.


మరుసటి రోజు, క్లాసైపోయిన అరగంటకే కొత్త బిచ్చగాడి టైపులో అమ్మయిల హాస్టలుకెళ్ళి అంబిలి కోసం కబురంపా. ఆశ గా ఎ దురుచూస్తుండగానే, అంబిలి స్థానే తన రూమ్ మేటు ‘వసుమతి’ ప్రత్యక్ష్మమయ్యింది(తనదీ మా క్లాసే). "వాట్ మగేష్ (తమిళ మిత్రులు నా పేరును ఇలాగే చీల్చిచండాడతారు), ఎనీథింగ్ అర్జంట్? అంబిలీ ఈజ్ ఫ్రెషనింగ్ అప్" అంది. అసలే మన కొత్త ప్రేమ ముహూర్తం మట్టిలో కొట్టుకుపోయిందన్న బాధలో నేనుంటే, ఈ పిల్ల అరవగోలేమిటని చికాకేసింది. అయినా నవ్వు పులుముకుని, "నథింగ్, జస్ట్ వాంటెడ్ టూ సీహర్" అన్నా. అప్పటికే, అంబిలి చేతిలో పుస్తకాలు పట్టుకుని "వాట్ మహేష్?" అంటూ బయటకొచ్చింది. వసుమతి ముందు ఏంచెప్పాలో తెలీక, ఓ వెర్రినవ్వు నవ్వి మిన్నుకుండిపోయా. ఇంతలో తనే "వుయ్ ఆర్ గోయింగ్ టు లైబ్రరీ, వైడోట్ యూ కమ్ విత్ అజ్" అని స్వాగతించింది. "గుడ్డికన్నా మెల్లమేలురా కన్నా!" అనుకుని ఆ ఇద్దరమ్మాయిల వెంటా అంగరక్షకుడీవలే గ్రంథాల్యానికి బయల్దేరా. ఆ రోజు నా ప్రహసనం అలా ముగిసేసరికీ, ఈ సారి కొంచం ముదుచూపుతో పధకం వేసా. క్లాసులోనే డైరెక్టుగా, ఈ రోజు సాయంత్రం నిన్ను కలవడానికి మనమొస్తామని అంబిలితొ చెప్పేసా. దానికాపిల్ల అమాయకంగా "ఎందుకూ ?" అంది. "మాట్లాడాలి" అన్నా. "ఇప్పుడే మాట్లాడొచ్చుగా!" అంది. "ఇప్పుడు వీలుకాదు, అప్పుడే సరైన సమయమ"ని సర్దిచెప్పా. ఇంత తతంగం జరుగుతున్న సేపూ వసుమతి తన దారిన తానెళ్ళక ద్వారం దగ్గర నిలబడే ఉంది. ఈ పిల్లేదో మన మొదటిప్రేమకు ఎసరెట్టెట్టుందనుకుని ఒక్క క్షణం అనుకుని, మళ్ళీ మన ప్రేమ మీద మనకు బహుమెండైన నమ్మకముందనుకుని మరోక్షణం లో త్రోసిపారేశాం. అయినప్పటికీ, బయటకెళ్ళిన తరువాత వసుమతి వద్దన్నట్టూ, అంబిలి వెళ్తానన్నాట్టూ మహ గొప్ప ఊహలుమాత్రం మనసులో వచ్చేసాయ్.


ఆ సాయంత్రం రానే వచ్చింది. ఈ సారి అంబిలి ఒంటరిగా కూడా వచ్చింది. కబుర్లేవో చెప్పుకున్నాం, ఆంధ్రా ఆవకాయ నుంచీ, కేరళ టెంకాయ వరకూ. ఎంత గోప్ప మాటలు మాట్లాడుకున్నాం అనుకున్నా. అంతసేఫూ బాగఆనేఉ న్నా, రూముకెళ్ళగానే ఎంత ప్రయత్నించినా, "తిరిగి గుర్తుకు రమ్మన్నా రావే! అవి సొల్లు కబుర్లో లేక ప్రేమలో ఇలాగే మాట్లాడు కుంటారో" మనకు తెలియదు గనక, రెండొదే రైట్ అనుకుని ఆరాత్రి ప్రశాంతంగా కునుకు తీశాం. అలా ఓ నాలుగు రోజులు ‘ఈవెనింగ్ వాక్’ భాగ్యం అంబిలి తో ప్రాప్తించింది. ఐదో రోజు, నే తన హాస్టల్ కు వెళ్ళే సరికీ, తను బయతీకెళ్ళిందన్న చావుకబురు చల్లగా తెలిసింది. "బహుశా, లైబ్రరీ అనుకుంటా" అన్జెప్పి రోడ్డెక్కే సరికీ, ఎదురుగా మా క్లాస్ వెధవ ‘జగన్నధ్’ తో అంబిలి తన నడక సాగిస్తుంటే, ఈ ఒక్క భాషా చక్కగారాని (మరాఠీ తండ్రి, తెలుగు తల్లి,పుట్టింది కర్ణాటక లోని బీదర్ లో. కాబట్టి అన్ని భాషలలోనూ ఈ తడికి ప్రవేశమైతే ఉందిగానీ, ప్రావిణ్యం మాత్రం నిండుసున్నా) వీడు వేసిన వాడికే అర్థంకాని జోకుకి, పగలబడి నవ్వుతూ కనిపించింది. ఆ క్షణంలో నా హృదయం ముక్కలైన శబ్దం నాక్కూడా వినిపించినట్టయింది. తీరాచూస్తే, పక్కనే ఉన్న హాస్టలు గదినుంచీ రాత్రి తాగిన బీరుసీసాలు పారేస్తూ మా సీనియరోకడు కనిపించాడు."అంటే పగిలింది మన తాలూకు కాదన్న మాట" అనుకుని, కాస్త తీవ్రంగా అంబిలివైపు చూసే ప్రయత్నం చేసా. అంతలో తనే, "కమ్ మహేష్ జాయినజ్" అంది. ఆ ముక్కకి జగన్నాథ్ ముహంలో కదిలిన భావాలు, ఒక్క క్షణం ముందు నా ముఖంలో కదిలినవే అనిపించింది. అప్పుడర్థమైంది ఈ మట్టిబుర్రకు, మాట్లాడి చనువు చూపింఛినంత మాత్రానా ప్రేమ కానక్కరలేదని. అమ్మాయిలతో ‘కేవలం స్నేహం’ కూడా చెయ్యొచ్చని.


(నా సౌలభ్యం కోసం ఈ అంకాన్ని రెండుగా విభజించడమైనది, రెండవ అంకం 4.2 త్వరలో)


9 comments:

Bala R Battu said...

ఓ మీత్రమా, ఎన్నొ ఎన్నొ భావలు ఇ అక్షరాల్లొ ఎల ఒదిగి పొతున్నాయ్.

Bolloju Baba said...

బ్యూటిఫుల్, బ్యూటిఫుల్.
గుర్రంబండిలో ఎప్పుడన్నా ప్రయాణించారా? టక్కు టక్కు మంటూ శబ్ధాలు, శరీరం తరువాత ఏ వైపుకు వూగుతాదో తెలీని వూపులు, మద్యమద్యలో గుర్రం సకిలింపు, జట్కావాడు ఆ బండి చక్రానికి చర్నాకోలు అడ్డంపెట్టి పలికించే ట్ట,ట్ట,ట్ట,ట్ట మనే హారను.

ఆ అనుభవం జ్జప్తి కి వచ్చినప్పుడల్లా హృదయంలో సంతోషం గుప్పుమంటుంది.

మీ కధనం కూడా ఓ గుర్రబ్బగ్గీ ప్రయాణంలా ఉంది. చిన్న చిన్న అందమైన కుదుపులు, బుల్లిబుల్లి కొసమెరుపులు, చమత్కారాల చెణుకులు మీ టపాని ఆద్యంతం సస్పెన్స్ భరితం చేసేసాయి. తదుపరి టపాకై ఎదురుచూస్తున్నాను.

టోపీ పైకెత్తేసా.

బొల్లోజు బాబా

Unknown said...

chala baga rasthunnaru ...nice wit !!!

Unknown said...

meeru telugu rayadaniki eey editor use chestharu please naku suggest cheyandi...

Kathi Mahesh Kumar said...

@ఉత్తర, అలి బాబా గార్లకి నెనర్లు.

@మురళి కి, నాకు ‘ఎడిటర్ల’ సంగతి తెలియదుగానీ, బరహ (www.baraha.com) పట్టి తెలుగు దిద్దుతున్నాం.

సుజాత వేల్పూరి said...

అయితే మళయాళీల మీద మీ అద్భుతమైన స్టడీకీ పునాది అక్కడే పడిందన్నమాట!

vasantam said...

మహేశా,
ఒక కొత్త కాలేజి కుర్రాడి మనస్థితిని చక్కని శైలిలో నవ్వుకొనే విధంగా వ్రాస్తున్నారు.సందోర్బోచిత బొమ్మల్ని పెట్టడము చక్కగా వుంది.ఇవి మీకు ఎక్కడ దొరికాయి?
waiting for next part,keep it up!!!
PS:కొత్త పాళీ గారన్నట్టు 'మహేశా" అని పిలుస్తేనే బావున్నట్టుంది.

Kathi Mahesh Kumar said...

అందరికీ నెనర్లు.

@సుజాత గారు, దొంగని పట్టేసారన్నమాట. అవునండీ మళయాళ సావాసం ఇక్కడే మొదలు.

@వాసు గారు, బొమ్మలు నెట్ దేవాయనమ: అండీ. వెదకడం, వాటిని ఇక్కడప్పెట్టడం వరకే మన పని.

పక్కింటబ్బాయి(మా పక్కింటోళ్లకి) said...

ఆ క్షణంలో నా హృదయం ముక్కలైన శబ్దం నాక్కూడా వినిపించినట్టయింది. తీరాచూస్తే, పక్కనే ఉన్న హాస్టలు గదినుంచీ రాత్రి తాగిన బీరుసీసాలు పారేస్తూ మా సీనియరోకడు కనిపించాడు."అంటే పగిలింది మన తాలూకు కాదన్న మాట" అనుకుని, కాస్త తీవ్రంగా అంబిలివైపు చూసే ప్రయత్నం చేసా. అంతలో తనే, "కమ్ మహేష్ జాయినజ్" అంది. ఆ ముక్కకి జగన్నాథ్ ముహంలో కదిలిన భావాలు, ఒక్క క్షణం ముందు నా ముఖంలో కదిలినవే అనిపించింది. అప్పుడర్థమైంది ఈ మట్టిబుర్రకు, మాట్లాడి చనువు చూపింఛినంత మాత్రానా ప్రేమ కానక్కరలేదని. అమ్మాయిలతో ‘కేవలం స్నేహం’ కూడా చెయ్యొచ్చని
*******
పై వాక్యాలు అద్భుతం ఒక కుర్రాడు వ్యక్తిగా మారే సమయానికి ఇంతకంటే భాష్యం కష్టం.మరో విషయం చెప్పనా,నాకు మొట్టమొదటి సారి అమ్మయిల్తో మాట్లాడినప్పుడు(ఎప్పుడో ఐదేళ్ల క్రితం)కలిగిన గుండెవేగం పుంజుకునే ప్రక్రియ మీ టపా చదవడం పూర్తిచేసాకా మొదలైంది(ఎందుకో కారణం అర్ధం కావట్లేదు).