Friday, May 16, 2008

నా కాలేజీ కథ - Part 5




"సినిమా తందనాలు"




ఇలా జీవితం సాగుతుండగానే, కాలేజి లో film club ఒకటి ఉందని తెలిసి సంబరపడి హుటాహుటిన సభ్యుడినైపొయా. అప్పటిదాకా రిలీజైన ప్రతి తెలుగు సినిమాని అప్రతిహతంగా బాగున్నా బాగులేకున్నాచూడటం అలవాటుగా ఉన్న నాకు అసలు సినిమాపై ఒక నిర్ధిష్టమైన అభిరుచి అప్పట్లో ఏడ్చినట్లుగా నాకు గుర్తులేదు. ఒక వారం తర్వాత ఏదో బెంగాళీ చిత్రరాజాన్ని క్లబ్ వారు ప్రదర్సిస్తున్నారహొ… అంటూ ఒక నోటిసు వెలువడటం జరిగింది. ఒక్కసారిగా నేనుకట్టిన 200 రూపాయలు కళ్ళముందు కదిలి భగ్గు మంది. దక్షిణ భారతీయులు చదివే కాలేజి కాబట్టి తెలుగుతోబాటు ఏ తమిళమో,కన్నడమో మహా ఐతే మలయాళం సినిమాలు దయతలుస్తాయనుకున్న నాకు బెంగాలి సినిమా ఒక షాకేమరి !




ఈ తంతు ,కథాకమామిషు ఏంటో తెలుసుకుందామని మా ఊరి సీనియరుని ఆశ్రయించా. ఆమహాశయుడు `ఒరే పిచ్చినాగన్నా! film club అంటే సినిమాలు చూసి తందనాలు ఆడటం కాదునాన్నా(ఇక్కడ club కి కూడా ద్వందం తీసాడు మా సీనియరు), సినిమాలు చూసి ఆస్వాదించటం,ఆనందించటం,అభినందించటం అంటూ నా అజ్ఞానాన్ని దూరం చేసాడు. ఏది ఏమైనా నేను కట్టిన పైసలు బూడిదలొ పోసిన పన్నీరు కావడం ఇష్టం లేక అయిష్టంగానే సినిమాని భరించటానికి నిర్ణయించేసుకున్న తరుణంలో... ఇంకో ఔత్సాహిక స్నేహితుడు మరింత సమాచారాన్నిమోసుకొచ్చాడు. ఇదేదో గొప్ప దర్శకుడు దర్శకత్వం నెరపిన మహత్తర చిత్రమని, ఈ సినిమా చూడకపోతే జన్మలకు సార్థకత ఉండదని వినికిడని, ఈ సినిమా కేసెట్టు ప్రత్యేకముగా కలకత్తా నుండి దిగుమతి చేయబడిందని దాని పేరు ‘చారులత’ అని దానిభావం.రోట్లో తలపెట్టి రోకటి పోటుకు వెరిచే రకం మనం కాదని బాహాటంగా కాకున్నా మనసులొ అనేసుకుని సినిమా చూడ్డానికి నేనూ తెగించేసాను.




సినిమా మొదలవక ముందే క్లబ్బు కోఆర్డినేటరు (ఇంకెవరు మా జేమ్స్ బాండ్, ప్రొఫెసర్ రఘునాథ్) లేచి కొన్నిపరిచయ వ్యాఖ్యలు చెయ్యడం మొదలెట్టాడు, సినిమా ముందువేసే న్యూస్ రీలు లాగా ఇదీ భరించక తప్పదని నాకు అర్థమైపోయింది. ఈ సినిమా ని "సత్యజిత్ రే అనే వ్యక్తి దర్శకత్వం వహించార"ని తను చెబుతూ ఒలికించిన గౌరవం చూస్తే, ఒక్క క్షణం "ఆ ‘రే’ ఎవరో మామధ్య కూర్చుని ఉన్నాడేమో అందుకె ఇన్ని రాగాలు పొతున్నాడు ఈ వెధవాయి" అనిపించింది.




సినిమా మొదలైంది, సన్నగా ఎక్కడొ దూరంగా నాకు తెలిసిన సంగీత ధ్వని తెరమీద ఉన్న చీకటి లోంచి titles మధ్యన వినిపించింది. ఆ క్షణం లో, నా జీవితంలో ఎప్పటి నుండో చూడాలనుకున్న సినిమా ఇదేనేమో అనిపించింది. ఎందుకలా అనిపించిందో ఇప్పటివరకు సమాధానం దొరకని ప్రశ్నల్లొ ఒకటి. మనకు బెంగాళీ భాష రాదు, సబ్ -టైటిళ్ళు చదివేంత ఆంగ్లం అసలు రాదు ఐనా సినిమా అర్థమైపోసాగింది. అంతవరకూ కొన్ని తమిళ సినిమాలు చూసే అలవాటు మన్ది చిత్తూరు అవటంవలన స్వతహాగా వచ్చిన విషయమైనప్పటికీ, ఈ అసలు పరిచయమే లేని భాష పట్టుబడక పోయినా, భావాలుమాత్రం మనసుకు తెలిసిపోయాయి. "అదేంచిత్రమో! సినిమా అంటే అలాగే ఉండాలేమో!"




ఇలా మనం తీరిగ్గా ఆలోచిస్తుండగానే, ‘చారు’ తెరమీదకి వచ్చింది. మధుబాల(పాత తరం హిందీ నటి) తరువాత నా కంటికి ఇంతవరకు ఏ కథానాయిక ఆనలేదనేచెప్పాలి కాని ఈ గుండ్రటి బెంగాలి వదనం ఒక్క సారిగా నన్ను ప్రేమలొ పడేసినట్టుఅనిపించింది. మాధబి(వి) ముఖర్జీ తన పేరని తరువాత తెలిసింది, కాని ఆ మోము లోని నిఘూఢ విషాదం చూసి ఒక్క ఉదుటున, "తెరచించుకు వెళ్ళి ఓదార్చుదాం" అనిపించింది. ఆ నటి ఒక్క చూపులొ చూపించిన భావప్రకటన సినిమా మొత్తానికి మూలవస్తువని తరువాత తెలియ వచ్చింది. బహుశా దీనినే గొప్ప నటన మరియు దర్శకత్వ ప్రతిభ అంటారేమో. నాయిక ఒంటరితనం, జీవితం మీది జిజ్ఞాస, ప్రేమ,ఉత్సుకత దానితొపాటు తన ఉనికినే గుర్తించని భర్త భూపతి (శైలెన్ ముఖర్జీ) నిరాసక్తతని ఒక్క ‘opera glassess’ దృశ్యం లొ చూపించిన విధానం చూసి, "సినిమా అంటే ఇదేరా!" అనిపించిందంటె నమ్మాలి.




ఇలా సత్యజిత్ రే తో మొదలై, హృత్విక్ ఘటక్, అడూర్ గోపాలకృష్ణ, మృణాల్ సేన్, గిరీశ్ కాసరవెళ్ళి, జీవీ అయ్యర్, గురుదత్, బిమల్ రాయ్, శ్యామ్ బెనెగల్, గోవింద్ నిహలానీ వంటి మహామహుల సినిమాలని మా జేమ్స్ బాండ్ పట్టుబట్టి చూపించేసి, నా అజ్ఞానాన్ని దివిటిపెట్టి మరీ నిరూపించేసాడు. సినిమా అంటే, నాలుగు ఫైట్లు, ఆరు పాటలు (అందులో ఒకదాంట్లో ఏ జయమాలినో,జ్యోతిలచ్చిమో,అనూరాధో అధమం సిల్కుస్మితో ఉండాలిమరి), కాస్త చెల్లెలు లేక అమ్మ సెన్టిమెన్టు(ఏ క్యాన్సరో, రేపో ఐతే మరీ బాగు), ఒక పనికిమాలిన విలనూ,ఒక తప్పిపోయిన కుటుంబం(కలవడానికి ఒక పాటగూడా మహబాగా అవసరం ఇక్కడ) , కక్షలూ,కార్పణ్యాలూ, పగలూ ప్రతీకారాలూ,కారాలూ మిరియాలూ,మోటు సరసాలూ,వీరబాదుడులూ ఇలా మన తెలుగు సినీ పాండిత్యాన్ని నరనరాలూ జీర్ణించుకున్న ఈ ‘ఎర్రబస్సు మహేష్’ కు ఈ కొత్త తరహా సినిమాలు, ఎన్టీయోడి సినిమాలో ఏఎన్నారు స్టెప్పులోస్తే ఎంత చిత్రంగా ఉంటుందో అంతే చిత్రంగా అనిపించింది. కానీ ఒక్కటి మాత్రం చెప్పుకోవాలి ఈ సినిమాలలో మనకర్థంకాని విషయం, మనిషికి అవసరమైన అనుభవం కొంత ఉందనిపించింది. చూడగా చూడగా ఆర్టు సినిమా అంటే "సాగదీసి చెవులు మూయడం కాదు, నిజాల్ని, జీవిత అనుభవాల్నీ,మనసుకు నచ్చే కథల్నీ తెరకెక్కించడం" అని తెలుసుకునేట్టు చేశాయి. అప్పటివరకూ అప్పుడప్పుడూ దూరదర్శన్ లో ఆదివారం మధ్యాహ్నాల్లో ఆర్టు సినిమాలు చూసి ఝడుసుకునే నాకు ఒక కొత్త ప్రపంచం తెలిసినట్టైంది.



అలాగని మా మిత్రబృందమంతా మన లాంటి ‘అతిమార్పుగాళ్ళ’నుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఇంగ్లీషు సినిమా లో ఒకటీఅరా ముద్దులు, అక్కడక్కడా టాప్ లెస్ సీన్లున్నా "కేవలం ఒకట్టిన్నర గంట సినిమాకి ఇరవైరూపాయలు తగలెయ్యడం దండగనీ మూడు గంటల తెలుగుసినిమాయే నయం అని" కాలేజంతా వాదించిన రమేష్ నుంచీ, "చిరంజీవి సినిమా కాకపోతే, అదసలు సినిమాయే కాదు" అనే మా రూమీ విజయనరసింహుళ్ళూ ఉన్నారు. ఇక మా ఫిల్మ్ క్లబ్బుని చీల్చి చండాడని వాళ్ళు చాలా తక్కువే అని చెప్పాలి. "ఎంతసేపూ ఈ పచ్చడిమెతుకులేనా? అప్పుడప్పుడు మసాలా కావాలి" అని, మీరా నాయర్ తీసిన ‘కామసూత్ర’ సినిమాని పట్టుబట్టి (కో-ఆర్డినేటరు లేని సమయంలో) చూపించిన హరీశ్ ను ఎట్లా మర్చిఫొగలను. పైగా "ఈ సినిమా ఆడవాళ్ళు తప్పక చూడాలని", ఒక ఫెమినిస్ట్ భాష్యాన్ని అర్థవంతంగా క్రోడీకరించి లెక్చరుదంచిన ఈతడి సాహసానికి "ఔరా!" అనుకున్నరోజు నాకు బాగాగుర్తు. ఆ తరువాత కాలంలో మనమూ ఈ క్లబ్బుకి సెకరెట్రీగా చేసి సినిమా రుణం తీర్చుకున్నామనుకోండీ అది వేరేవిషయం.



ఇలా ఫిల్మ్ క్లబ్బు అర్థవంతమైన సినిమాలు చూపిస్తే, మైసూర్లో ఉండటం మూలంగా అప్పట్లో వచ్చిన ఆంగ్లసినిమాలన్ననింటినీ మనం క్రమం తప్పకుండా విరగదీశామని మన ప్రత్యేక మనవి. ఇంతాకాక మన మిడిమిడి హిందీ సినీ పరిజ్ఞానం కూడా, కాలేజి పుణ్యమా అని విరగకాసిందని చెప్పాలి. ఇదో చిత్రమైన కథ లెండి. మనం దూరదర్శనాన్ని ఎంత ‘దుర్దర్శనం’ అనుకున్నా, కేబుల్ టీవీ లేని మా హాస్టల్ జీవితాలలో అదే మాకు కామధేనువూ, కల్పవృక్షం కూడా అయ్యి సినీమాయని పండించింది. ఆ సమయంలో వారానికి మూడు హిందీ సినిమాలు శుక్ర,శని,ఆది వారాల్లో దూరదర్శన్ ప్రసారం చేసేది. అసలే ఉన్న ఒక్క టీవీ ముందూ చూసేందుకు అందరూ గుమిగూడితే మనకు బాల్కనీరేంజి వీక్షణం లభించదని గ్రహించిన నేనూ మా హరీశూ, మన మెట్టబుద్దుపయోగించి మద్యాహ్నాల్లోనే పరుపు తీసుకెళ్ళి, ఎర్రబస్సులో టవలేసి సీటుపట్టిన స్టైల్లో హాస్టల్ టీవీ స్థలాన్ని ఆక్రమించుకుని దర్జాగా రాజభోగం వెలగబెడుతూ సినిమాని ఆస్వాదించేవాళ్ళం. ఇప్పుడు లెఖగడితే మేము వెలగబెట్టిన సినిమాల సంఖ్య దాదాపు ఐదువందల పైమాటే. నమ్మశక్యంగా లేదుకదూ? ఒక లెక్కేసుకోండి మరి! నాలుగు సంవత్సరాలలో ఉన్న 192 వారాలలో ప్రతివారం మూడు సినిమాలు. ఈ లెక్కన మనం దయతలచని హిందీ సినిమా లేదని నాకు మహగట్టి నమ్మకం. ఇక్కడ దూరదర్శన్ జిందాబాద్! అనేసుకోవచ్చు.


ఇలా జరిగిన మన సినీ తందనాలలో మునిగితేలుతూ అప్పటివరకూ తెలుగు సినిమా వరకూ పరిమితమైన నా తెలివి భారతీయ సినిమా, హిందీ సినిమా, ఇంగ్లీష్ సినిమా, ఆర్టు సినిమా ఇలా కలుపుకుని పెంచేశాం. ఈ తందనాలుకాస్తా, "జీవితంలో ఒక్కసినిమా అయినా తియ్యల"నే బలమైన కోరికని కల్గించి పారెశాయ్. ఆ కల ఇప్పటికీ ప్రతిరోజూ కంటున్నదే.

(కలహాలూ - కన్నీళ్ళూ అనే 6వ భాగం త్వరలో)

6 comments:

San .D said...

ఇరగదీస్తున్నారండీ. ఈ కధ మొత్తం ఆయ్యిపోయాక పి.డి.ఎఫ్ కింద అందించడం కుదురుతుందేమో చూడండి.

oremuna said...

గొప్ప రచయితవు అవుతావబ్బాయ్!

ఓ మాంచి పూర్తి ఫిక్షన్ కూడా త్వరలోనే నీ బ్లాగులో చూడాలి.

నిషిగంధ said...

మళ్ళీ కళ్ళ ముందు ఆనాటి కబుర్ల బెంచీలు, క్యాంపస్ పచ్చిక, హెడ్ ల గుర్రు చూపులు.. కలిసి చూసిన సినిమాలలో నవ్విన నవ్వులు, అందరి కన్నీళ్ళకీ తడిచి బరువెక్కిన ఒకటే కర్చీఫ్.. అబ్బా ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారండీ!! నేను నా కాలేజీ 4 సంవత్సరాలు కర్ణాటక లోనే చదివాను.. అబ్బాయిలు అమ్మాయిలు కలిసి కూర్చోవడం అనేది అక్కడే తెలిసింది.. పక్కనున్న అబ్బాయేమో దర్జాగా, విశాలంగా కూర్చుని "ఆర్ యూ కంఫర్టబుల్" అని అమాయకంగా అడిగేవాడు :))

అన్ని పార్ట్స్ ఒకేసారి చదవాలని అనుకుని కూడా 5వ పార్ట్ చూడగానే ఆగలేక దాచుకున్న తాయిలం కొంచెం కొంచెం తిన్నట్టు ఇప్పుడే అన్నీ చదివేసాను.. అందుకే అన్నిటికీ కలిపి కామెంటుతున్నా :-)

vasantam said...

ఈ ఎపిసోడు అద్దిరింద్ది మహేశా!!! తెలుగు సినిమాలకి కథ,మాటలు స్క్రీన్ ప్లే సమకూర్చే ప్రయత్నాలు చేసుకోవచ్చు. చక్కటి హాస్యంతో వ్రాస్తున్నావ్.మరిన్ని మంచి ఎపిసోడు లకోసం ఎదురుచూస్తూ...అభినందనలతో...వాసు.బొజ్జ

Kathi Mahesh Kumar said...

@నిషిగంధ, నా జ్ఞాపకాల అలలు మీ జ్ఞాపకాల కడలినికూడా తాకడం చాలా ఆనందంగా ఉంది.నా అనుభవాలలో ఒక యూనివర్సాలిటీ ఉందన్న నమ్మకం నాకు కలిగించిన అందరికీ నెనర్లు.

@ సందీప్, పీడీఎఫ్ అందించేద్ధాం. సమస్య కాక పోవచ్చు బ్రదర్.

@ఒరేమునా బాబాయ్, త్వరలో ఫిక్షన్ పనికూడా పట్టే ప్రయత్నం లో ఉన్నా! కావల్సింది మీ ఆశీర్వాదం. అదిప్పుడు దొరికిందికాబట్టి, ఇక ఇరగదీయడమే తరువాయి.

@వాసుగారు, నెనర్లు. మా నవతరంగం మిత్రులతో కలిసి స్కిప్టు పనులు మొదలెడుతున్నాం.

Inspired Souls said...

This is the life of every film maker I think...
Though i watched pather panchali first and then charulatha!!

This is my favourite episode sir!! and u rock!!