Monday, August 31, 2009

మాల-మాదిగల విబేధం : దళితక్రైసవుల రిజర్వేషన్


దళితక్రైస్తవులకు SC రిజర్వేషన్ ఒక రాజకీయ ఎత్తుగడ. ఒకవైపు ఇప్పటికే మాల-మాదిగల చిచ్చును రావణకాష్టంలా రగిలిస్తున్న రాజశేఖర్ రెడ్డి అసలు సమస్యని పక్కదారి పట్టిస్తూ చిన్నగీత పక్కన పెద్దగీత గీసాడు. ఇదే అదనుగా హిందుత్వవాదులు ఈ సమస్యని ఒక రాజ్యాంగాన్ని interpret చేసే సమస్యగా కాకుండా, మతపరమైన సమస్య చేసిపారేశారు. దీంతో అసలు చర్చ చాలా చోట్ల తప్పుదోవపడుతోంది.


సమస్య రిజర్వేషన్ ఉండాలా వద్దా అనేది కాదు.
సమస్య దళితులకు ఇంకా రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా కాదు.
సమస్య జనాభాప్రాతిపదికన వర్గీకరణ చెయ్యాలా వద్దా అనేది కాదు.
సమస్య క్రైస్తవ దళితులకు రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా అనేది కాదు.
సమస్య క్రైస్తవదళితులకు రిజర్వేషన్ కల్పిస్తే హిందూమతానికి అన్యాయం జరిగిపోతుందా అనేది అస్సలు కాదు.

సమస్య క్రైస్తవ దళితులకు SC కేటగిరీలో రిజర్వేషన్ కల్పించాలా వద్దా అనేది మాత్రమే.

మాల-మాదిగల విభేధం నేపధ్యాన్ని తీసుకుంటే; advantage ఉన్న మాలలు ఎక్కువశాతం రిజర్వేషన్ లాభాలు పొందుతున్నారని. సంఖ్యాపరంగా ఎక్కువున్నప్పటికీ మాదిగలు ఆ సౌలభ్యాన్ని అందిపుచ్చుకోలేకున్నారనే వాదన ఆధారంగా మాదిగలు వర్గీకరణను కోరారు.మాల-మాదిగలిద్దరూ గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, దళితక్రైస్తవులకు రిజర్వేషన్ కల్పిస్తే మళ్ళీ అదే జరుగుతుంది. కాన్వెంట్ చదువులు,ఆర్థికపరమైన బలిమి కలిగిన దళితక్రైస్తవులు రిజర్వేషన్లో సింహభాగాన్ని ఎగేసుకెళ్తే నష్టపోయేది మాల-మాదిగలే.

ఇప్పటికే దళితక్రైస్తవులు BC స్థాయిలో 1% రిజర్వేషన్ కి అర్హులు. దళితక్రైస్తవులకు ప్రత్యేకంగా మరికొంత శాతం అదనంగా పెంచి రిజర్వేషన్ కల్పిస్తే వచ్చేనష్టం లేదుగానీ, SC కేటగిరీలో ఇస్తామంటే మాత్రం దళితులకు అన్యాయం జరిగినట్లే.

ఈ చర్చల్లో మతపరమైన కోణం ఒక అనవసరమైన అపోహ మాత్రమే.

****

Sunday, August 23, 2009

బీజేపీ సమస్య ఏమిటి?

బీజేపీ చింతన్ బైఠక్ (అంతర్మధన సభ) అయిపోయింది. ఆర్.ఎస్.ఎస్. "యువనేతలకు అవకాశం ఇవ్వండి" అని బీజేపీకి సలహా (బహుశా అల్టిమేటనమ్) ఇచ్చింది.
ఈ సభ మొదలవ్వకముందే సీనియర్ నేతలు యశ్వంత్ సిన్హా అసంతృప్తి నేతయ్యాడు. జస్వంత్ సింగ్ సాగనంపబడ్డాడు. ఇప్పుడే అద్వానీ సహచరుడు సుధీంద్ర కులకర్ణి "సైద్ధాంతిక విభేధాలంటూ" రాజీనామా సమర్పించాడు.

సభలో... 1) వరుణ్ గాంధీ ‘హేట్ స్పీచ్’ 2) మోడీని భావి ప్రధానిగా ప్రొజెక్ట్ చెయ్యడం 3) మన్మోహన్ సింగ్ ను "వీక్" అనే అద్వానీ విమర్శ 4) అటల్ బిహారీ వాజ్ పేయ్ లేమి; బీజేపీ ఓటమికి కారణాలుగా అంగీకరించబడ్డాయి.

పైన చెప్పిన కారణాలు, ఆపైన చెప్పిన పరిణామాలూ చూస్తేనే బీజేపీలో సాగుతున్న గందరగోళం అర్థమవుతుంది.

వాజ్ పేయ్ బీజేపీ రాజకీయ మనుగడకు అవసరం. కానీ,ఆర్.ఎస్.ఎస్. కు కాదు. వాజ్ పేయ్ రాజకీయాల నుంచీ నిష్క్రమణతో "తనమాటే ఫైనల్" అని తేల్చిచెప్పగల ఒక్కనేతా కరువయ్యాడు. మిగతాపార్టీలకు కూడా ఆమోదయోగ్యమైన ఒక (ఒకేఒక్క) జాతీయనాయకుడు బీజేపీకి దూరమయ్యాడు.

అద్వానీ బలమైన నేత అన్న బీజేపీ, మన్మోహన్ బలహీనుడన్న అద్వానీ మాటల్ని తప్పుబడుతున్నారు. తన అభిప్రాయాన్ని సొంత పార్టీయే తృణీకరించే నేత బలమెంత? ఆర్.ఎస్.ఎస్. లెక్క ప్రకారం ఈయన ఇంటికి సాగనంపదగిన నేత. అద్వానీ తెచ్చిపెట్టుకున్న ‘లోహ్ పురుష్’ ఇమేజ్, చివరకు తనకే చేటుచేసింది. అద్వానీకి కూడా పార్టీ ఉద్వాసనచెప్పే స్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. రేపోమాపో అద్వానీ గౌరవప్రదంగా రాజీనామా చేస్తారు. లేదా బలవంతంగా పార్టీలోని "యువనేతలు" చేయిస్తారు.

గుజరాత్ లో నరేంద్ర మోడీకీ భారతదేశంలో మోడీకీ ఇమేజ్ పరంగా చాలా తేడా ఉంది. గుజరాత్ లో మోడీ ఒక సమర్థ పరిపాలకుడు. అక్కడా తనకు పార్టీతో సమస్యలున్నాయి. భారతదేశాన్ని మొత్తంగా చూసుకుంటే మోడీ ఒక ప్రమాదకరమైన ‘హిందుత్వ సిద్ధాంతానికి’ ప్రతినిధి. ఆర్.ఎస్.ఎస్. ఆమోదమున్నా పార్టీలోనే ఏకాభిప్రాయం లేని నేత. (గుజరాత్ అల్లర్లు పార్టీ ఇమేజ్ ని దెబ్బతీశాయని చాలా మంది నమ్ముతారు. వాజ్పేయి ఈ విషయంగా తీవ్ర అసంతృప్తి చెంది, రాజీనామా వరకూ వెళ్ళారనేది ఈ రోజున బహిరంగ రహస్యం). ఇలాంటి నేత ప్రధాని అవడం అంటే, ‘కొరివితో తలగొక్కున్నట్లే’ అనేది మెజారిటీ హిందూమితవాదుల అభిప్రాయం కూడా.

ఆర్థికంగా-సామాజికంగా-మతపరంగా- రాజకీయంగా ఒకటికాని "హిందువులు" అనే ఒక nebulous community (నిర్ధింష్టంగా ఉంది అని చెప్పనలవికాని సముదాయం) మొత్తంగా బీజేపీ పార్టీకి మద్దత్తుగా ఉన్నట్లు ఏ కొలమానాలు తీసుకుని విశ్లేషించినా ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. అలాంటిది ముస్లింలను ద్వేషించడమే మనల్ని సంఘటిత పరిచే "గొప్ప ఆలోచన" అని నమ్మే వరుణ్ గాంధీ లాంటి నెలతక్కువ హిందుత్వవాదం బీజేపీకిచెరుపునేతప్ప బలిమిని తీసుకురాదు.

------

బీజేపీకి కాంగ్రెస్ కు ప్రత్యామ్న్యాయంగా ఎదిగిన శక్తిగా ఇప్పటికీ మంచి గుర్తింపు ఉంది. ప్రధానప్రతిపక్షం అన్న హోదా ఉంది. చాలా రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. అలాంటిది ఇలాంటి పార్టీ బలహీనపడితే వచ్చే నష్టం కేవలం పార్టీకి కాదు, మొత్తంగా ప్రజాస్వామ్యానికి తద్వారా దేశానికి. కాబట్టి (కొన్ని అభిలషణీయమైన మార్పులతో) బీజేపీ మనుగడ అత్యవసరం.

కొన్ని సూచనలు;
1. బీజేపీ ఆర్.ఎస్.ఎస్.. వీ.హెచ్.పీ వంటి అతివాద-మతవాద సంస్థలకు దూరం జరిగి, ఒక స్వతంత్ర్య రాజకీయ పార్టీ రూపం ధరించాలి: ఈ నిర్ణయం వలన పార్టీ చీలినాచీలొచ్చు. కానీ ఈ సైద్ధాంతిక గందరగోళం మాత్రం ఒక్కసారిగా సమసిపోతుంది. ఒక s clear vision ఏర్పడుతుంది.

2.బీజేపీ తన కార్యకర్తకూ ఓటరుకూ గల తేడాను గుర్తించాలి. సిద్ధాంతాలను రంగరించుకున్న కార్యకర్తలు (వీళ్ళలోనూ ఎక్కువ ఆర్.ఎస్.ఎస్.వాళ్ళే) వేలల్లో ఉంటే, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా "ప్రత్య్యామ్న్యాయ విధానాలను" చూసి ఓట్లేసిన ఓటర్లు కోట్లలో ఉన్నారని తెలుసుకోవాలి. అలాంటి ఓటర్లకున్న ఒకేఒక గొంతు "ఓటు". దానికి గౌరవం ఇవ్వకుండా కార్యకర్తల గుడ్డిదారినే రహదారి అని నమ్మినన్నాళ్ళూ బీజేపీ ఒక మంచిపార్టీగా ఎదగలేదు.

3. సాంస్కృతిక-జాతీయవాద పార్టీ: మతవాదంతో సమస్య గానీ cultural nationalism తో ఎవరికీ సమస్య లేదు. ‘స్వదేశీ’కూడా అందులో భాగమైతే మన ఆర్థిక విధానాలుకూడా ఒకదారిన పడతాయి. అప్పుడప్పుడూ ఈ దిశగా బీజేపీ మాట్లాడినా, మతవాదానికున్న ప్రాముఖ్యత ఈ పార్శ్వా నికి ఇవ్వలేదు. మతవాదసంస్థలతో తెగదెంపుల వలన ఆ సౌలభ్యం లభిస్తుంది.

4. ముసలినాయకులతో పాటూ యువనాయకులుగా చలామణి అవుతున్న మాస్ బేస్ లేని "బోర్డ్ రూం" నాయకుల్ని కూడా ఇంటిదారిపట్టిస్తేగానీ నిజమైన ప్రజానాయకులకు బీజేపీలో సముచిత స్థానం దక్కదు. రాజకీయం ప్రజాజీవితంతో ముడిపడిన పని, టీవీలో సిద్ధాంతాలు మాత్రం వల్లెవెయ్యడానికి కాదు. కేవలం ఆపనులుచేస్తూ అగ్రనాయకులుగా నెగ్గుకొస్తూ పార్టీని బలహీన పరిచిన నాయకులకు (మొత్తంగా అందరూ రాజ్యసభలోనే ఉన్నారు) ఉద్వాసన పలకాలి.

కనీసం ఈ కొన్నైనా చేస్తేగానీ బీజేపీ ఒక బలమైన ప్రత్యామ్న్యాయ రాజకీయ శక్తిగా మిగలదు. చూద్ధాం ఏంజరుగుతుందో!

****

Friday, August 21, 2009

‘కమీనే'లో కమీనా ఎవరు?


కమీనే (రోగ్స్/రాస్కెల్స్ !!!!) సినిమా చూసి ధియేటర్ బయటికొస్తూ ఒక మిత్రుడు అడిగాడు
"ఇంతకీ ఈ సినిమాలో ‘కమీనా’ ఎవడూ?" అని.
అప్పటికి "కమీనా ఏకవచనం. కమీనే బహువచనం. కాబట్టి, సినిమాలో ఉన్నవాళ్ళందరూ కమీనేలే" అని తీర్పుచెప్పి తప్పించుకున్నాను.
ఆ తరువాత ఆలోచిస్తుంటే ఎందుకో జావేద్ అఖ్తర్ గుర్తొచ్చారు.

అబ్బే! ఆయన కమీనా అని కాదు. జావేద్ అఖ్తర్ 2008 లో ఇచ్చిన ఒక లెక్చర్ లోని ఈ క్రింది వాక్యాలు గుర్తొచ్చాయి.

"In the 1940s, we had the Zamindars as villains, which was a reflection of the actual state of affairs. In the 50s, this villain lot was replaced by the factory owner bully. In the 60s, however, the underworld don of big cities ruled the small screen as the bad guy. In the 70s, this underworld don became a hero, In the 1980s, the villain in a Hindi film was invariably a policeman or a politician - yet again a reflection of societal affairs. In the 90s, Pakistan became the villain,In the new millennium, we don't have any villains; such characters in today's movies frighteningly resemble us!"

చిత్రంగా అనిపించినా బహుశా ఇదే నిజం కూడా.
కమీనే సినిమాలోని పాత్రలందరూ వెధవలే. ఇంతోకొంతో మనలో ఉండే వెధవతనాలు కలిగిన రాస్కెల్సే.
అందుకే కమీనేలో అందరూ కమీనేలే...చూసిన మనతోసహా.

‘కమీనే’ సమీక్ష కోసం నవతరంగం చూడండి.

****

Thursday, August 20, 2009

జిన్నా భూతం

జిన్నా భూతం ఒకప్పుడు అద్వానీని కలవరపరిచింది. తన పార్టీలోనే తన పరిస్థితిని కకావికలం చేసింది.
ఇప్పుడు...జస్వంత్ సింగ్ రాజకీయ జీవితానికి చరమగీతం పాడింది.

జస్వంత్ సింగ్ ఉద్వాసన ‘చింతన్ బైఠక్’ మొసలవ్వకముందే "యువతకు పగ్గాలివ్వండి" (ముసలాళ్ళని ఇళ్ళకు పంపండి) అన్న ఆర్.ఎస్.ఎస్. సూచన నేపధ్యంలో జరగడం చాలా అర్థం చేసుకోదగ్గ పరిణామం. బీజేపీ పార్టీ మానసిక-సైద్ధాంతిక పరంగా ఇంకా ‘అఖిలభారత హిందూమహాసభ (1915)’ మూలాల్ని విడవలేదనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఒక రాజకీయ పార్టీగా పరిణితి చెందలేదనడానికి నిదర్శనం మాత్రమే.

చరిత్ర చూసుకుంటే మాత్రం, బీజేపీ జిన్నా భూతాన్ని చూసి ఇంతగా ఝడుసుకోవడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. బహుశా జస్వంత్ సింగ్ కూడా అలాగే అనుకున్నారేమో!

ముస్లిం లీగ్ ఏర్పాటుకూ జిన్నాకు ఎటువంటి సంబంధం లేదు. ఏదో క్వాజీ సలీముల్లా, వకీర్ ఉల్ ముల్క్ వంటి కొందరు మాజీనవాబులు, ముఖ్యంగా ముఘల్ సామ్రాజ్యపు వైభవాన్ని కాపాడుకోవాలనుకుంటున్న రొమాంటిక్ ఫూల్స్ 1900 సంవత్సరంలో యునైటెడ్ ప్రావిన్స్ (ప్రస్తుతం ఉత్తరప్రదేశ్) లో ఉర్థూ స్థానంలో హిందీని పరిపాలనా భాషగా తీసుకురావడంతో కలతచెంది ఏర్పరిచారు. ముఘల్ వైభవాన్ని కాపాడాలని ఏర్పరిచినా, బ్రిటిష్ లాయల్టీని ప్రబోధించిన ఈ ముస్లిం లీగ్ లో జిన్నా 1913 వరకూ చేరలేదు. సెక్యులర్ రాజకీయ సంస్థ(అప్పటికి కాంగ్రెస్ పార్టీ కాదు) అయిన కాంగ్రెస్ లోనే ఉన్నారు. బెంగాల్ విభజన నేపధ్యంలో జరిగిన పరిణామాల దృష్ట్యా మారిన ముస్లిం లీగ్ విధానాన్ని ఆసరాగా తీసుకుని, హిందూ-ముస్లిం ఏకత్వసాధన ఒక అవసరంగా భావించిన జిన్నా ముస్లింలీగ్ లో చేరాడు. అప్పట్లో జిన్నా ముస్లింలకు "సరైన" రాజకీయ ప్రతినిధిత్వాన్ని కోరుకున్నాడే గానీ దేశ విభజననీ హిందూ-ముస్లిం అనైక్యతను కాదు.

1916 లో జిన్నా ముస్లింలీగ్ అధ్యక్షుడయ్యాడు. ముస్లింలకు న్యాయబద్ధమైన సీట్లు కేటాయించే విధంగా కాంగ్రెస్ పార్టీతో ‘లక్నో ఒడంబడిక’ చేసుకున్నాడు. ఈ నేపధ్యంలో, చంపారన్ సత్యాగ్రహంతో హఠాత్తుగా హీరో అయిన గాంధీ కాంగ్రెస్ పై పట్టు సాధించారు. 1920 లో సహాయనిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను సమూలంగా మార్చేసిన గాంధీ విధానం జిన్నాలో అసంతృప్తినీ అపనమ్మకాన్నీ రేకెత్తించింది (జిన్నా అపనమ్మకాన్ని బలపరుస్తూ తరువాత 1928 లో లక్నో ఒడంబడికను కాంగ్రెస్ తుంగలో తొక్కింది). రాజకీయవైఫల్యాన్ని ఊహించిన జిన్నా, లండన్ కు ఫలాయనమంత్రం పఠించాడు.

1930 లో చాలా వరకూ రాజకీయాలకు దూరంగా జిన్నా లండన్ లో కాలం గడిపేసాడు. మొహమ్మద్ ఇక్బాల్ 1930లో ప్రతిపాదించిన ‘రెండు దేశాల సిద్ధాంతం’ మొదలు, సైమన్ కమిషన్, రౌండ్ టేబిల్ సమావేశం, 1935 గరవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వరకూ కనీసం జిన్నా ఊసుకూడా చరిత్రలో కనిపించదు. ఆ తరువాత (1937 నుండీ) 1940 లాహోర్ సమావేశంలో " "Hindus and the Muslims belong to two different religions, philosophies, social customs and literature... It is quite clear that Hindus and Muslims derive their inspiration from different sources of history. They have different epics, different heroes and different episodes... To yoke together two such nations under a single state, one as a numerical minority and the other as a majority, must lead to growing discontent and final destruction of any fabric that may be so built up for the government of such a state." అంటూ ఒక సరికొత్త ముస్లింరాజకీయవాద (‘మతవాద’ కాదు) జిన్నా ఆవిర్భవిస్తాడు.

వ్యక్తిగతంగా జిన్నా మతాన్నెప్పుడూ పాటించలేదు. ఆరంభంలో తన ఉద్దేశం ముస్లింలకు రాజకీయ ప్రాతినిధ్యం. హిందూ-ముస్లిం ఐక్యత. కానీ అతివాదం, ఎమోషనలిజం తప్ప మరెటువంటి విధానమూ పనికిరాని వ్యవస్థ నైరాశ్యంలో తన రాజకీయ మనుగడకోసం, లేని మతం రంగును ఆపాదించుకుని మొండివైఖరి అవలంభించిన ఫలాయనవాద "బలవంతపు మతవాది"గా మారిన రాజకీయనాయకుడు జిన్నా.

దేశవిభజనకు జిన్నా మొండితనం ఎంత కారణమో నెహ్రూ చేతకానితనం, గాంధీ నైరాశ్యం, కాంగ్రెస్ విధానాల వైఫల్యాలు అంతే కారణం. దేశవిభజన జరిగినా ఇండియా-పాకిస్తాన్ మిత్రులుగా మెలగొచ్చనుకున్న జిన్నా భారతీయవ్యతిరేకి కాదు అనేది బహుశా కొంతకాలం బ్రతికుంటే తెలిసేదేమో!

ఆరంభంలో భారతీయ చరిత్రకారులు జిన్నాను ఒక విలన్ గా చిత్రీకరించడం nation building process లో భాగంగా మనం అర్థం చేసుకున్నా, ఇప్పుడు జిన్నాను "సరిగ్గా" అర్థం చేసుకోవడం అవసరం. సమస్యాత్మకం చేసుకోవడం అనవసరం. ముఖ్యంగా అది బిజేపీ చెయ్యడం వారి తెలియనితనాన్నే సూచిస్తోంది. జస్వంత్ సింగ్ జిన్నాను హీరో చేస్తే, విలన్ అయ్యేది కాంగ్రెస్ పార్టీ. అలాంటప్పుడు అది బీజేపీకి లాభం చేసేదేగానీ నష్టం కాదు. బీజేపీ చరిత్రని ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకుందనడానికి ఇదొక ఉదాహరణ అనుకుంటాను.

****

Monday, August 17, 2009

కులతత్వం - జాతీయవాదం


బానిసవర్గం తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నం ‘కులతత్వం’.
అధికారంలో ఉన్న వర్గం మిగిలిన వర్గాలమీద తన పెత్తనం సుస్థిరం చేసుకోవడానికి చేసే ప్రయత్నం ‘జాతీయవాదం’.

- గోపీచంద్

*****

Sunday, August 16, 2009

అమెరికన్ మూర్ఖత్వమా లేక తెలియనితనమా!


మొన్న అబ్దుల్ కలాం నిన్న షారుఖ్ ఖాన్.


VIP ప్రోటోకాల్ ఉన్నా, సెక్యూరిటీ చెక్ పేరిట కాలికున్న సాక్సులతో సహా ఒలిపించి ఒక అమెరికన్ విమానయాన సంస్థ భారత మాజీ రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ అబ్దుల్ కలాం గారిని అవమానపరిచింది. కలామ్ గారు పెద్దగా పట్టింపులు లేని నిరాడంబరుడు కాబట్టి ఈ ఘటనకు పెద్ద ప్రాముఖ్యత ఇవ్వలేదు. కానీ దీనికి ఘాటుగా స్పందించలేని భారత ప్రభుత్వం కేవలం క్షమాపణలు చెప్పమని ఆ సంస్థకు చెప్పి ఊరుకుంది. అదే మనకున్న పెద్ద సమస్య.

ఒక మాజీ దేశాధ్యక్షుడ్ని కూడా ఒక potential తీవ్రవాదిగా చూసే మానసికదౌర్బల్యం అమెరికా సంస్థకుంటే ఉండొచ్చుగాక, కానీ ఒక గౌరవనీయుడైన మనదేశ పౌరుడిని యదేచ్చగా మనదేశంలోనే అవమానపరిచే హక్కు ఏ విదేశీసంస్థకూ ఉండకూడదు. క్షమాపణలతోపాటూ ఆ విదేశీయాన సంస్థ భారతప్రభుత్వానికిచ్చిన సలహా మరింత హేయమైనది. మనదేశంలో VVIP ల లిస్టు చాలా పెద్దదట. ఆ పెద్ద లిస్టుని కుదించి వారి సేవలు మెరుగుపరిచేలా చూడాలట. ఏమిటీ వీళ్ళ దాష్టీకం? నూటపదికోట్ల మందున్న భారతదేశంలో ఎంత మంది VIP లు VVIPలు ఉండాలనేది వీళ్ళ సౌలభ్యాన్ని బట్టి నిర్ణయించుకోవాలా! Outrageous !!!

అమెరికాలో కొన్ని భారతీయ సంస్థలు స్వాంతంత్ర్య దినోత్సవ వేడులకు జరుపుకుంటూ హిందీ నటుడు షారుఖ్ ఖాన్ ను అమెరికా ఆహ్వానించాయి. న్యూజర్సీ లోని Newark Airport లో దిగంగానే షారుఖ్ ఖాన్ ను అమెరికన్ అధికారులు రెండు గంటలు నిర్భంధించి ప్రశ్నించారు. ఈ ఘటనకు మూల కారణం "ముస్లిం" అని చెప్పకనే చెప్పే "ఖాన్" అనే తన పేరు అనేదాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇస్లాం పేరువింటేనే నీడని చూసి కూడా భయపడే అమెరికా, ముస్లిం విజిటర్లపై నిఘా ఉంచడం అర్థం చేసుకోదగ్గ అంశం. కానీ...షారుఖ్ ఖాన్ కేవలం ఒక సాధారణ ముస్లిం కాదు. ఒక ప్రముఖ భారతీయ నటుడు. భారతదేశానికున్న గ్లోబల్ ఐకాన్స్ లో ఒకడు. ఇలాంటి వ్యక్తి పైన సరైన ఇంటలిజెన్స్ సమాచారం లేకుండా ఇలాంటి చర్యను చేపట్టడం మూర్ఖత్వమైనా అయ్యుండాలి. తెలియనితనమైనా అయ్యుడాలి. లేకపోతే ఏంచేసినా చెల్లుతుందనే గర్వమైనా అయ్యుండాలి.

పైరెండు ఘటనల్లోనూ భారతప్రభుత్వం స్పందన చాలా పేలవంగా ఉంది. మొదటి ఘటనలో ఆ విదేశీయాన సంస్థను నిషేధించి ఉండాల్సింది. మనదేశంలో operate చేస్తూ మన నియమాలు పాటించని ఇలాంటి సంస్థల అవసరం మన దేశానికి లేదు. రెండో ఘటనలో అమెరికన్ అధికారుల చర్యను తీవ్రంగా ఖండించి, ఆ అధికారులపైన సరైన చర్య చేపట్టేలా అమెరికన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలి.

అమెరికా ఎంత అగ్రరాజ్యమైనా ఇలాంటి తలతిక్కపనులు భారతీయులపైన చేస్తామంటే చూస్తూ ఊరుకోని సార్వభౌమాధికారం, ఆత్మగౌరవం కలిగిన దేశంగా భారతదేశం ఒక సందేశాన్ని ప్రపంచానికి తెలపాలి.

****

Saturday, August 15, 2009

ఇంకా కావాలి!



కొంచెం ఉంది...ఇంకొంచెం కావాలి.

थॊडा है, थॊडॆ की जरूरत है !

****

Friday, August 14, 2009

నాటి మధురిమలు – నేటి తికమకలు : లవ్ ఆజ్ కల్

హిందీ చిత్రరంగంలో, నేటి కాలం యువత భావాలకు అద్దంపట్టే చిత్రాలు తీస్తున్న దర్శకుడు ఇంతియాజ్ అలి. ఈ ఆధునిక యువత మెటీరియలిస్టిక్ భావజాలం వెనుక తమదైన ఆలోచన,ఉద్వేగం,అనుభూతి ఉన్నాయనే నిజాన్ని తన చిత్రాలద్వారా హృద్యంగా చెప్పే ప్రయత్నంలో ఇప్పటివరకూ సఫలమయ్యాడమే చెప్పొచ్చు. ‘సోచానథా’ (2005), ‘జబ్ వుయ్ మెట్’ (2007) తర్వాత ఇంతియాజ్ అలి తీసిన మూడో చిత్రం “లవ్ ఆజ్ కల్”.

‘ప్రేమ: నేడు – నాడు’ అనే అర్థం వచ్చే ఈ చిత్రశీర్షిక, చిత్రం కథని చెప్పకనే చెబుతుంది. ఒక ఆధునిక ప్రేమ కథ ఒక నిన్నటి (మొన్నటి) తరం ప్రేమకథల్ని సమాంతరంగా నడిపి, విధానాలు మారినా ప్రేమ భావాలు మారలేదనే సునిశితమైన విషయాన్ని దర్శకుడు ఇంతియాజ్ చెప్పడానికి ప్రయత్నించారు.


లండన్ లో ఉన్న ‘జై’ (సైఫ్ అలీ ఖాన్) ‘మీరా’ (దీపికా)లు జీవితాంతం కలిసి ఉండమని తెలిసీ ఇష్టపడతారు. కొంతకాలం కలిసుంటారు. “గొప్ప ప్రేమ పుస్తకాల్లో మాత్రమే ఉంటుంది. మనం సాధారణమైన మనుషులం (ఆమ్ ఆద్మీ – Mango people) కాబట్టి ప్రాక్టికల్గా విడిపోదాం” అనేసి జై, మీరాతో విడిపోతాడు. మీరాకూడా పరిస్థితుల ప్రభావం వలన కలిసుండటం కుదరదు (కెరీర్ పరంగా జై శాన్ఫ్రాన్సిస్కో వెళ్ళాలనుకుంటాడు. మీరా ఇండియా) కనక మంచి స్నేహితులుగా విడిపోదాం అని ఒప్పుకుంటుంది.

ఇలా ఒకసారి విడిపోయిన జంట వివిధ పరిస్థితుల్లో మళ్ళీమళ్ళీ కలుస్తుంది. మళ్ళీమళ్ళీ విడిపోతుంది. పరస్పరం ప్రేమిస్తున్నామనే అనుభూతికన్నా, పరిస్థితులు వారి సహజీవనానికి అనుకూలంగా లేవనే “లాజిక్” వల్ల అన్నిసార్లూ వారి మధ్యనున్న ప్రేమ తీవ్రతని గుర్తించక విడిపోతారు.

ఈ ఆధునిక కలిసివిడిపోయే ప్రేమలమధ్య, మరోవైపు ‘వీర్’ (రిషి కపూర్) జైకి తన (పాతకాలం) ప్రేమకథను చెబుతాడు. చూపులతో ప్రేమించడం. ఒకసారి కూడా మాట్లాడకపోయినా, ఏడుజన్మలకూ ‘హర్లీన్ కౌర్’ (గిస్లీ మాంటేరియో - బ్రెజిల్ నటి) తన భార్యకావాలని ప్రతిజ్ఞ చేసుకోవడం. ప్రేమికురాల్ని (కేవలం) చూడటానికి డిల్లీనుంచీ కలకత్తా ప్రయాణించడం. సాహసించి హర్లీన్ కుటుంబానికి తన పెళ్ళి ఉద్దేశాన్ని చెప్పి రైల్వేస్టేషన్లో తన్నులు తినటం. చివరికి ధైర్యం చేసి హర్లీన్ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్ళి కాబోతున్న తరుణంలో కలకత్తా నుంచీ ఢిల్లీ తీసుక్పొచ్చి పెళ్ళి చేసుకోవడం ఈ పాత కథలోని అంశాలు.

ఈ పాతకథలోని “గుడ్డిప్రేమని” పరిహసించే జై ఆధునిక ‘లాజికల్ ప్రేమ’ తీవ్రతని సంతరించుకుని ఈ జంటజీవితాల్ని ఎలా ప్రభావితం చేసింది? చివరికి వీరిద్ధరూ ఏ పరిస్థితుల్లో శాశ్వతంగా కలిసిపోవడానికి కలుస్తారు? అనేది తెరపై చూడాల్సిన విషయం.

పూర్తి వ్యాసం కోసం నవతరంగం చూడండి.

****

మగధీర’లో రంధ్రాణ్వేషణ


‘మగధీర’ seem to be the flavor of the season. ఎక్కడ చూసినా అదే చర్చలు.

హాలీవుడ్ స్థాయికి తెలుగు సినిమా చేరిందని కొందరు. అసలు హాలీవుడ్డే రాజమౌళి దగ్గర నేర్చుకోవాలని మరికొందరూ పందేలు వేసేసుకుంటున్నారు.

పెట్టిన ఖర్చుకి గ్రాఫిక్స్ కి అయ్యే ఖర్చుకి సరిపోలిస్తే సాంకేతికంగా మగధీర సినిమా తెలుగు సినిమా తెరమీద ఒక అద్భుతం అనేది పరిశ్రమ పెద్దలుకూడా నిర్ణయించేశారని వినికిడి.

ఏ గ్రాఫిక్ ఏ హాలీవుడ్/జపనీస్/కొరియన్/చైనీస్ సినిమా నుంచీ స్ఫూర్తి పొందింది అనేది పక్కనబెడితే, ఈ సాంకేతిక విలువల (ముఖ్యంగా గ్రాఫిక్స్) ఒరవడిలో సినిమాకి అత్యవసరమైన కథ,కథనం (స్క్రిప్ట్)లోని లోపాల్ని అందరూ విస్మరింపబూనటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.

ఆస్కారొచ్చిన చిత్రాల్లోకూడా కొన్ని ‘గూఫులు’ (goof-ups) ఉండటం కొత్తకాదు. ప్రొడక్షన్ వాళ్ళ మహిమో, అసిస్టెంట్ డైరెక్టర్లు కంటిన్యుటీ చూసుకోకపోవడమో,రచయిత దగ్గర సరైన సమాచారం లేకపోవడమో లేక హడావుడి షూటింగ్ మహత్యమో ఇవి “గొప్పగొప్ప”(?) సినిమాలకే తప్పలేదు. కానీ స్క్రిప్టులోని లోపాల్ని ‘సినెమాటిక్ లిబర్టీ’ అనేసుకోవడం ఎంతవరకూ సమంజసం అనేది ఇక్కడ ప్రశ్న. ఇలాంటి కొన్ని లోపాలు మగధీరలో కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. రెండు సంవత్సరాలు కష్టపడి సాంకేతిక విషయాలపై పెట్టిన శ్రద్ధ స్క్రిప్టు మీద ఎందుకు పెట్టలేదా అనే సందేహాన్ని కలిగిస్తాయి.

పూర్తి వ్యాసాన్ని నవతరంగంలో చదవండి.

****

Monday, August 10, 2009

హేతువు - నిజం


Rationality means perspective.
- Ken Wilber
అనుపూర్వికంగా వచ్చే నీతిసూత్రాల మంచిచెడ్డలను గుర్తించకుండా గుడ్డిగా ఫాలోఅయిపోవడాన్ని ప్రశ్నించి, ఈ ఆచారాల ప్రయోజనాన్ని తిరగదోడి పరీక్షించుకుంటూ ఉండటమే హేతువాదం. ఈ ఆనుపూర్విక నీతిసూత్రాలు కుటుంబ- సామాజిక-సాంస్కృతిక- మతపరమైన విధానాల ద్వారా అనునిత్యం reinforce చెయ్యబడి స్థిరత్వాన్ని కాంక్షిస్తూ ఉంటాయి.

ఈ స్థిరపడిపోయిన ఆచారాల వల్ల నిత్యసంచలన స్వభావం కలిగిన సంఘానికి చెడుజరిగే అవకాశం ఉందిగనక, పున:సమీక్షను కోరుతుంది హేతువాదం. ఆ పున:సమీక్ష తర్క,హేతు,మానవశ్రేయస్సు ఆధారంగా జరగాలనుకోవడమే దాని శాస్త్రీయత. హేతువాదం అంటే గుడ్డిగా నమ్మకం కాదు. ప్రశ్నించి తెలుసుకుని నమ్మకాన్ని పెంచుకోవడం లేదా ఉన్న నమ్మకాన్ని మార్చుకోవడం. ఇదొక నిరంతర ప్రక్రియ. Rationality to put it simply, is the sustained capacity for cognitive pluralism and perspectivism.

****

Our theory of truth must be such as to admit of its opposite, falsehood.
- Bertrend Russel

మన భౌతిక వస్తువుల అనుభవానికి వ్యతిరేకంగా ఏమీ ఉండదు. ఎందుకంటే ఆ భౌతిక వస్తువు ఉంటే ఉంటుంది. లేకపోతే లేదు. కానీ మన "నిజం" జ్ఞానానికి, దాని అనుభూతికీ "అబద్ధం" అనే ఒక వ్యతిరేక పదం తయారుగా ఉంది. అందుకే నిజం అన్న ప్రతిదీ ప్రశ్నించబడుతుంది. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలోనైనా నిజం తన వ్యతిరేకపదాన్ని ఎదుర్కోక తప్పదు.

ఈ రెడీ వ్యతిరేకత కారణంగా నిజాలలో ఎప్పుడూ వైరుధ్యం ఉంటుంది. దానికున్న మరో ముఖ్యమైన కారణం "నమ్మకం". నిజం- అబద్ధం రెండూ నమ్మకంపై ఆధారపడిన అనుభూతులు. భౌతిక వస్తువుల్లాగా అనుభవించి నిర్ధారించుకునే సౌలభ్యం ఇక్కడ లేదు. అబద్ధాన్ని నిజంగా నమ్మొచ్చు. నిజాన్ని అబద్ధంగా నమ్మొచ్చు. ఒక్కోసారి అబద్ధాన్ని మరింత బలంగా నమ్మొచ్చు. అందుకే, ఆ నమ్మకాల నిజానిజాల్ని సమీక్షించుకోవడం అత్యంత సమస్యాత్మకం.

ఆ సమస్యతీరినా...అర్జంటుగా తలెత్తే మరో సమస్య, నిజాన్ని అబద్ధానీ "నిర్వచించడం". ఏదీ ఒకసారి ప్రయత్నించండి!

****

Saturday, August 8, 2009

గొడ్డుమాంసం - ఒక సంస్కృతి


బీఫ్ బర్గర్లపై జరిగిన ఇటాలియన్ రగడ గురించి నేను రాసిన వెజ్ దేవతలూ - నాన్వెజ్ దేవతలూ
టపా చదివి ఒక మిత్రుడు "ఎక్కడిదో ఎందుకు? మన HCU లో జరిగిన గొడవ గురించి రాయకపోయావా!" అని అడిగారు.


"నిజమే! మనచుట్టూ ఇన్ని ఘటనలు జరుగుతుండగా ఎక్కడో ఇటలీలో జరిగిన విషయాన్ని చర్చించుకోవడం ఎందుకూ" అనిపించింది.

అసలేం జరిగిందంటే...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ‘సుకూన్’ అని ఒక కల్చరల్ ఫెస్టివల్ జరుగుతుంది. వారాంతరంలో జరిగే ఈ సాంస్కృతిక మేళాలో వివిధ ప్రాంతాల వంటలు, సంస్కృతుల మేళవింపుని విధ్యార్థులు ప్రదర్శనకు పెడతారు. విద్యార్థులే నిర్వహించే ఈ స్టాల్స్ లో భారతదేశంలోని వివిధ ప్రదేశాల వంటకాలు రుచిచూసే అవకాశం ఉంటుంది.

2006 లో కొందరు దళిత విద్యార్థులకి తాము ఇష్టపడితినే బీఫ్ బిర్యానీ "కళ్యాణి బిర్యాని" పెడితే బాగుంటుందనిపించింది. హైదరాబాద్ లో ఈ బిర్యానీకి మంచి గిరాకీ ఉంది. యూనివర్సిటీలో కూడా 15% కేరళ విద్యార్థులు, దాదాపు మరో 17 శాతం దళితులు, ఇంకో 6-7 శాతం ముస్లింలలో మెజారిటీ భాగం ఈ బిర్యానీ తినేవాళ్ళే కాబట్టి సేల్స్ కూడా బాగుంటుందని మొదలెట్టారు.

మొదలెట్టిన మొదటి రోజు వండింది రెండు గంటల్లో అయిపోతే, మళ్ళీ ప్రత్యేకంగా వండించి తీసుకురావల్సి వచ్చింది.
ఈ రెండో వాయి వచ్చేసరికీ కొందరు "ఇది మన సంస్కృతికి విరుద్ధం" అంటూ అడ్డుచెప్పారు. గొడవ వైస్ ఛాన్సిలర్ వరకూ వెళ్ళింది. అప్పుడే కొత్తగా వచ్చిన వైస్ ఛాన్సిలర్ ముందుగా ఒక చర్చ జరిపి తరువాత నిర్ణయం చేద్ధాం ప్రస్తుతానికి ఆపండి అన్నారు.

సో...ఆ సుకూన్ లో బీఫ్ బిర్యానీ అర్థాంతరంగా ఆగిపోయింది.

మళ్ళీ...మరో సంవత్సరం...2007 సుకూన్ ఆరంభం ఇంకా ఉందనగానే...
గొడ్డుమాంసం "మన సంస్కృతి కాదు" అనే పెద్దలు ముందుగానే వైస్ ఛాన్సిలర్ దగ్గర అభ్యంతరం లేవనెత్తారు.

ఈ స్టాల్ పెట్టాలనుకున్నవాళ్ళది సింపుల్ ఆర్గ్యుమెంట్. "బీఫ్ బిర్యాని మేము తింటాం. మా కుటుంబాలు తింటాయి. కాబట్టి అది ‘మా సంస్కృతి’ దీన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు."

ఈ చర్చలు జరుగుతున్నప్పుడు ఎవరో కొంత ఉత్సాహం చూపి National Institute of Nutrition నుండీ ఒక లెటర్ తీసుకొచ్చారు. అందులో బీఫ్ పౌష్టిక విలువలు ఉటంకించబడి, ఒకానొక రెకమండెడ్ ఆహారపదార్థంగా బీఫ్ ను గుర్తిస్తూ రాసుంది. ఆ లెటర్ ప్రకారం న్యూట్రియన్ట్స్, ప్రొటీన్లు అపారంగా ఉండి, కొవ్వుపదార్థాలు అతి తక్కువ ఉండే బీఫ్ ఆరోగ్యకరం. నిజానికి మిగతా మాంసాలకన్నా గొడ్డుమాంసం శ్రేష్టం.

అంతే...గొప్పోళ్ళ సంస్కృతి కేకలు హుష్ కాకి.

అప్పట్నుంచీ ప్రతిసంవత్సరం కళ్యాణీ బిర్యానీ సుకూన్లో లభ్యం. కథ సుఖాంతం.

ఇదండీ మన హైద్రాబాద్ కథ.



"పేరుకే అది పెద్ద విశ్వవిద్యాలయం
దీని కన్నా మా ఊరే నయం
మా ఊరి పెద్దకాపు
మా పేట చివర నిలబడి
మా తాతని...
ఏరా పెద్ద మాదిగి, పనిలోకొస్తున్నావా? లేదా?
అని అడిగితే...విలువలేని ఈ ఊరి నుండి పోవాలని
కష్టపడి చదివి ఈడికొచ్చాను
అందరూ బాగా చదువుకున్నోళ్ళే కదా...
కులం మధ్యలోకి రాదనుకున్నా...

కాని ఇక్కడ.
హాయ్ అని సొగసుగా పలకరించినా
చాటుగా వీడు దళితుడు అనుకుంటారు
మా ఊర్లో ఐతే మేమేం తిన్నా ఎవరూ అడగలేదు
కానీ ఇక్కడ...అమ్మో...ఇదేం లోకం రా బాబూ
నేనేం చేసిన చర్చే.

నేనొక్కడినే బాగా చదివితే..
ఇంకే మీకు రిజర్వేషన్ ఎందుకు అంటారు
నేనొక్కడిని చదవకపోతే..
వీళ్ళింతే బద్దకస్తులు అంటారు
నేను బాగా పని చేస్తే బండోడు అంటారు
పనిచేయకపోతే బతుకెందుకు అంటారు
చివరకు నా తిండిని... నా తిండిని కూడా వద్దంటారు
చ్హీ.. నా తిండిని నేను తినడానికి కూదా
వేరొకడి అనుమతి కావాలా?
ఏమో.. చదువులేని మా ఊరు పెద్దకాపు కూడా
ఎప్పుడూ అడగలేదు"
{Regarding Beef fight in HCU)

- సురేష్ కుమార్ దిగుమర్తి

****

Friday, August 7, 2009

కట్నానికి మరోవైపు... సుఖాంతం



జూలై 2008 లో "కట్నానికి మరోవైపు" అని, ‘కట్నం తీసుకోకూడదు’ అనుకున్న ఒక మిత్రుడి బాధలు చెప్పాను.
ఆ టపా మీద అప్పట్లో బ్లాగుల్లో చాలా చర్చలే జరిగాయి.

ఆ మిత్రుడు శంకర్ ది ఈ రోజు ( అగష్టు 7,2009) కాకినాడలో పెళ్ళి. ఇప్పుడే పెళ్ళి భోజనం చేసొస్తున్నాను.

కాణీ కట్నం తీసుకోలేదు.
ఆడపడుచుల కట్నాలూ లాంఛనాలూ లేవు.
సొంత ఖర్చుతో రిజిస్టరాఫీసులో పెళ్ళి, ఒక చిన్న రిసెప్షన్ తో జంట ఒకటయ్యారు.

తన ఆశయం, ఆదర్శం గురించి కుటుంబానికీ, బంధువర్గానికీ చెప్పి ఒప్పించడానికీ. ఆ ఆదర్శాన్ని అర్థం చేసుకుని సహకరించే అమ్మాయిని వెతికిపట్టుకుని పెళ్ళి చేసుకోవడానికి ఒక సంవత్సరం పట్టింది.
కానీ...సాధించాడు.

శంకర్ లాంటి ఎందరో ఉండాలని కోరుకుంటూ....మిత్రుడు శంకర్ కి నా అభినందనలు

****

Sunday, August 2, 2009

ఆధ్యాత్మిక తత్వచింతనకు మతమేమిటి?


నియో-హిందుత్వ రాజకీయ భావజాలంలో కొట్టుమిట్టాడుతున్న కొందరికి తత్వశాస్త్రానికీ,ఆధ్యాత్మికతకూ కూడా మతాన్ని అంటగట్టే అలవాటు అలవోకగా వస్తున్నట్లుంది. నిన్నమొన్న పుట్టిన మతం, ఆది ప్రశ్నలైన "ఈ జీవితం ఏమిటి? దీనికి అర్థం ఏమిటి? ఈ చుట్టూవున్న ప్రపంచంతో దాని సంబంధం ఏమిటి?" అనే వాటికి అనాదిగా సమాధానాలు వెతుకుతున్న మానవజాతి జిజ్ఞాసకు మూలం అనే వాదన అచ్చంగా హాస్యాస్పదం.


ఆధ్యాత్మికతత్వం యొక్క అనాది తత్వం ముందు మతం గోళీలాడే బచ్చా కాదా!

మతం ఒక వర్గంతో ముగుస్తుంది. ఆధ్యాత్మిక తత్వచింతన మనుషుల జీవితాన్ని అర్థం చేసుకునే శోధనతో మొదలౌతుంది. ఈ విధంగా చూస్తే మతంతో ఆధ్యాత్మికతను ఆరంభించినా మతం కట్టుబాట్లను వీడితేగానీ నిజమైన ఆధ్యాత్మికత మొదలు కాదు. మతానికి అతీతమైన భక్తిలేనిదే ఆధ్యాత్మికతకు అర్థం లేదు. తత్వచింతన ఆ ఆధ్యాత్మికతకు దారిచూపే ఒక సాధనం మాత్రమే. అంతే.

తత్వచింతన కేవలం హిందూమతంలో ఉంది అని వాదించేవాళ్ళకు "మనిషి" మీద కనీస గౌరవం లేదని నాకు అనిపిస్తుంది. మనిషి ఏ ప్రాంతంవాడైనా, ఏ దేశంవాడైనా ఏ మతం వాడైనా ఏ కాలానికి చెందినా, పుట్టకముందూ మరణించిన తరువాతా ఏమవుతుందో ఎరుగని స్థితిలో కనీసం జీవితం గురించైనా తెలుసుకుందాం, ఈ జీవిత పరమార్ధాన్ని గ్రహించుకుందాం అనే ఆలోచన చెయ్యకుండా ఉంటాడా?

ఆధ్యాత్మిక తత్వచించతనకి మూలం మనిషి. కాబట్టి దానికి ఏమతంతోనూ విరోధం లేదు. కేవలం ఒక మతానికి చెందినది అంతకన్నా కాదు. అది మనిషి జీవితానికి సంబంధించినది. మానవత్వానికి చెందింది. నమ్మకం,అపనమ్మకం రెండూ తత్వచింతనకు తోడ్పాటునిచ్చాయి. వివిధమార్గాల్లో "సత్యాన్ని" శోధించడానికి అవకాశాన్ని ఇచ్చాయి. ఈ మూలాల్ని గ్రహించని వాళ్ళ అబిప్రాయాలకు విలువేమిటి?

ఒకవైపు చార్వాకులూ మరోవైపు బౌద్ధ-జైనాలు తత్వవిచారణను మానవప్రపంచంలోని ఈ భాగంలో మొదలుపెడితే దాదాపు ఇదే సమయంలో గ్రీకు తత్వవేత్తలైన సోక్రటీస్,అరిస్టాటిల్ లు సాధనలు చేశారు. వారి మాటల్లోనే ఈజిప్టు తత్వంగురించి మనకు కొంత తెలుస్తుంది. ఇక చైనాలో కన్ఫూసియస్,మోట్సులు వివిధ కోణాల్లో మానవతత్వచింతనను ఆవిష్కరించారు. మానవజాతికి ఆధ్యాత్మికతత్వచింతనకు ఇంత ఘనమైన చరిత్ర ఉండగా, దాన్ని ఒకేఒక హిందూమత ఘనకార్యంగా చెప్పుకునేస్తే ఎట్లా?

నిజానికి హిందూమత పరిరక్షకులనుకుంటున్న శంకరాచార్యుడు చెప్పింది అద్వైతం కాదా! రామానుజుడు ప్రభోధించింది విశిష్టాద్వైతం కాదా! మధ్వాచార్యుడిది ద్వైతం కాదా!! ఇవి మతానికి కాదు మనిషికి చెందుతాయన్న కనీసస్పృహ రానంతవరకూ మానవత్వానికి "ముక్తి" లేదు.

చరిత్ర తెలియకపోయినా క్షమించెయ్యొచ్చు. ‘మతం’ తత్వానికి మూలం అనుకుంటే మాఫ్ చెయ్యొచ్చు. కానీ తత్వశాస్త్రం మొత్తం ఒక వర్గం/కులం సొత్తు అనే వాళ్ళ మతిభ్రమణాన్ని ఏంచెయ్యాలో అర్థం కావడం లేదు.

‘ఆధ్యాత్మికత జీవనమూల్యానికి కాక పరలోక ముక్తికి’ అని నమ్మబలికి మానవత్వాన్ని మంటగలుపుతున్న మతం పోకడల మధ్య, ఆద్యాత్మికతత్వచించనకు మతం రంగును పులిమి దాన్నొక బూతు చెయ్యకండి. దానికి వర్గ/కుల ఆపాదనలు చేసి సాటి మానవుల్ని కించపరచకండి.

****

Saturday, August 1, 2009

ఇమేజ్ ‘ట్రాప్’


ఒక రచయిత మిత్రుడు మంచి కథలు రాస్తాడు.
సినిమా కథ రాయాలని ఆశలేదుగానీ, సినిమాకు పనికొచ్చే మంచి కథలు తనదగ్గరున్నాయని భావిస్తాడు.
ప్రస్తుతానికి ఒక పత్రికలో పనిచేస్తున్నాడు.

‘కరెంట్' అనే ఒక పిచ్చి ప్రేమ(తీసే)కథతో వచ్చిన సినిమా చూసిన ఆ మిత్రుడు తాళలేక, "ఇంత ఛండాలంగా ఉండే కథకన్నా నా దగ్గరున్న కథలో నొబిలిటీ ఉంది" అని డిక్లేర్ చేశాడు.
తన దగ్గరున్న కథ నేను విన్నాను. బాగుంది. రెగ్యులర్ ప్రేమకథలకన్నా మించిన ఉదాత్తత ఉంది. ఒక తాత్విక కోణం, మానవీయ స్పందన కలగలిపిన కథాంశం ఉంది. "ఎలాగూ పరిశ్రమలోని వాళ్ళతో పరిచయముందికదా ఒకసారి ఈ కథ ఎవరికైనా చెప్పి చూడ్రాదూ!" అని నేనొక ఉచిత సలహా పారేసాను.

తను ప్రయత్నించాడు. ఒకరిద్ధరు భవిష్యత్ దర్శకులతో చర్చించాడు. "బాగుందిగానీ ఎవరైనా (హీరో) చెయ్యడానికి రెడీ అయితే" అని ‘హీరో దయ’ అని ప్రకటించేశారు.

ఒక హీరోల లిస్టొకటి తయారు చేశాడు.
సుమంత్ - ఏమో!
రామ్ - ఎవరికీ అందడు
అల్లు అర్జున్ - అస్సలు దొరకడు
రామ్ చరణ్ తేజ - రాజమౌళి వదిల్తేగా!
నాని - ఎక్కడున్నాడో తెలీదు
సుశాంత్ - ప్రయత్నించొచ్చు

ఇలా తిరిగితిరిగీ సుశాంత్ దగ్గరికొచ్చి కరెంట్ కొట్టినట్లు ఆగిపోయాడు. అప్పుడు నేనే అన్నాను "ఎలాగూ కరెంట్ దెబ్బ తినున్నాడుకదా, ఈ ప్రేమకథ అయితే వర్కౌట్ అవుతుందని చెప్పొచ్చు. కానీయ్!" అని. అష్టకష్టాలూ పడి, ఉన్న పరిచయాల్ని ఉపయోగించి సుశాంత్ ఆఫీస్ నంబరు దొరకబుచ్చుకున్నాడు.

పోన్ చేశాడు...
"ట్రింగ్ ట్రింగ్"
"హలో!" "హలో!!"
"సుశాంత్ గారిని కలవాలండీ"
"మీరెవరండీ"
"రైటర్ని. సార్ కి కథ చెప్పాలి"
"బాబు కొత్త కథలు వింటున్నారు. కానీ మీరు ఇంతకు ముందు ఎవరిదగ్గర పనిచేశారో చెప్తారా."
"ఎవరి దగ్గరా లేదు"
"ఐతే ఎట్లా?"
"ఏమిటి ఎట్లా! కథ చెప్పడానికి కథకావాలిగానీ ఎవరిదగ్గరైనా పనిచెయ్యడం ఎందుకు?"
"అట్లా కుదరదండీ"
"ఐతే ఒక నాలుగు నెలలు ఎవరిద్దగ్గరైనా పనిచేసొచ్చి కథ చెప్పమంటారా?"

....అవతలి వైపునుంచీ ఒక నిమిషం నిశ్శబ్ధం....

"మీరట్లా మాట్లాడిదే ఎట్లాగండీ. కథ ఉందని ఎందరో వస్తుంటారు వాళ్ళందరికీ బాబుతో మాట్లాడే ఛాన్స్ ఇస్తే ఎట్లా? అందుకే అడిగాను"
"సారీ. అయితే మీరు మొదట కథ విని ఆ తరువాత సుశాంత్ గారికి చెప్పండి."
"ఇంతకీ మీరు ఎక్కడ పనిచేస్తారు సార్?"
"......"(పత్రిక పేరు)
"ఐతే రండి సార్ మాట్లాడదాం."

రెండ్రోజుల తరువాత సెక్రట్రీ అపాయింట్మెంట్ దొరికింది. అరగంటలో కథ చెప్పాడు.

"కథ బాగుందిగానీ. చాలా క్లాస్ గా ఉందండీ. బాబు ఇమేజ్ కి సరిపోదనుకుంటాను."
"ఇప్పుడుకాకపోతే ఇంకెప్పుడు ప్రయోగాలు చెయ్యాలండీ? అయినా, సుశాంత్ చేసింది రెండు సినిమాలేకదా. రెండూ పెద్ద హిట్లు కూడా కావు. మరి అప్పుడే ఇమేజ్ ఎక్కడొచ్చిందీ?" అని అడిగేశాడు నా మిత్రుడు.

అంతే ఆ తరువాత "కథ" ముందుకు నడవలేదు. ఇక ఆ సెక్రెటరీ అక్కడుండేంత వరకూ మావోడికి ఎంట్రీ దొరకదు. చుట్టూవున్న వాళ్ళు సృష్టించిన ఇమేజ్ ట్రాప్ నుంచీ బయటపడే వరకూ సుశాంత్ కి మంచి కథ దొరకదు.
****