Wednesday, June 23, 2010

‘రావణా’యణం – సమీక్ష

సామాజిక-రాజకీయ అంశాల్ని వ్యక్తిగత నేపధ్యాల్లో మలిచి ఎపిక్ (epic) స్థాయి సినిమాల్ని తీసే దర్శకుడు మణిరత్నం. ‘రోజా’ మొదలు ‘దిల్ సే’ వరకూ అలా జరిగిన ప్రయాణంలో మనందరం మణిరత్నం సినీతిహాసాల్లో భాగమయ్యాము. వ్యక్తిగత సమస్యల్ని ఒక సామాజిక కోణంలోంచీ చూపడమూ మణిరత్నంకున్న మరో పార్శ్వం. ‘మౌనరాగం’ నుంచీ ‘సఖి(అలైపాయుదే)’ వరకూ అదీ మనం చూసి మురిసిపోయాము. అలాంటిది ఏకంగా రామయణం లాంటి ఒక ఎపిక్ ని తీసుకుని ముగ్గురు మనుషుల మధ్యనున్న సంబంధాలు, అనుబంధాలూ, ఘర్షణ నేపధ్యంలో ఒక కొత్త కోణాన్ని ‘రావణ్’ ద్వారా ఆవిష్కరిస్తాడని అందరూ ఆశించడం సహజం.
ఈ ఆసక్తిని, అనురక్తిని రావణ్ ద్వారా మణిరత్నం నిలుపుకున్నాడా, లేదా అనేది పెద్ద ప్రశ్న.

‘వీరా’ అనే దళిత నాయకుడు ప్రతీకారం కోసం ‘దేవ్’ అనే పోలీస్ ఆఫీసర్ భార్య ‘రాగిణి శర్మ’ని కిడ్నాప్ చెయ్యడంతో సినిమా ప్రారంభమౌతుంది. ఆ తరువాత వీరా రాగిణితో ఏలా ప్రవర్తించాడు? దేవ్ రాగిణిని రక్షించుకోగలిగాడా? చివరికి వాళ్ళ ముగ్గురి కథ ఏమయ్యింది అనేది రావణ్ చిత్ర కథాంశం.

రామాయణాన్ని వ్యక్తుల కథగా చూస్తే అందులోనూ చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. ముఖ్యంగా భార్యనెత్తుకెళ్ళిపోయిన రాక్షసుడ్ని చంపే రాజు కథగా చూస్తే అందులో మహత్తరంగా అనిపించే విషయమూ ఉండదు. అందుకే మంచీ – చెడుల మధ్య పోరాటంగా దాన్ని కీర్తించి, సమాజంలో విలువల స్థాపనకు ఉపయోగించుకుని ఇతిహాసంగా మార్చేశాం. అయితే, మంచీ చెడుల మధ్య గీతలు మసకబారుతున్న ఈ కాలంలో రాముడిలో దైవత్వం ఎంత మిగిలుంటుంది? రావణుడిలో రాక్షసత్వానికి సహేతుకమైన కారణం ఉండదా? వంటి ప్రశ్నలు ఉదయించడం చాలా సాధారణం. అసలే రావణుడిని హీరోగా ఎప్పుడో నిర్ణయించేసిన ద్రవిడ సంస్కృతి, సాహిత్యాల నేపధ్యమున్న మణిరత్నం ఈ ఆధునిక రామాయణాన్ని, రావణాయణంగా ఎలా మలిచాడో చూడాలనే ఆసక్తితో రావణ్ సినిమా చూస్తే నిరాశ తప్పదు.

సాంకేతికపరంగా ఉన్నతంగా ఉన్నా, హృదయం లేని అందమైన గాజుబొమ్మ తరహాగా మాత్రమే రావణ్ మిగిలిపోయింది. చెప్పాలనుకున్న కథలోని లోపం, కథావిస్తరణలోని బహీనతలూ, స్క్రిప్టులోని బలహీనతల్ని భారంగా మోస్తూ, కేవలం నటనతో సినిమాను నిలబెట్టలేని నటీనటుల నటన వెరసి రావణ్ ఒక ఎపిక్ సైజ్ డిసాస్టర్ అని చెప్పొచ్చు.

కాల్పనిక లోకంలో జరుగుతున్నకథా లేక భౌతిక లోకంలోనా అనే విషయంకూడా అర్థంకాకుండా కథావిస్తరణ క్రమం కనిపిస్తుంది. అది వ్యక్తుల కథా లేక వ్యక్తిత్వాలు-సిద్దాంతాల ఘర్షణా అనే విషయంలో క్లారిటీ లేక సినిమా తడబడుతుంది. వీరా౦- దేవ్ – రాగిణిల కథకు ఒక బలమైన సామాజిక-రాజకీయ-సైద్ధాంతిక నేపధ్యం ఇవ్వగలిగుంటే వాళ్ళ అస్తిత్వాలతో పాటూ సినిమాకూ ఒక ఆర్థం ఉండేది. ఆఖరి 20 నిమిషాల్లో కథ కొంచెం పుంజుకున్నట్లు అనిపించినా, ప్రస్తుతం  over indulgent idea గా మాత్రం మిగిలిపోయింది.


బలహీనమైన స్క్రిప్టుని, బలం లేని డైలాగుల్ని అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, విక్రం లు తమ శాయశక్తులా ఒక వీశమెత్తు పైకి లేవదీయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. కొన్ని సీన్లు చూస్తుంటే వీరా పాత్ర ప్రవర్తనకూ, తన histrionics కూ, ఫిలాసఫీకీ సినిమాలో అసలు స్థానమే లేనప్పుడు అభిషేక్ ఎంత గింజుకుంటే మాత్రం ఏమిటి అనిపిస్తుంది. ఐశ్వర్యా రాయ్ చాలా సినిమాలకన్నా ఈ సినిమాలోని కొన్ని సీన్లలో అందంగా ఉంది. ఆ అందమూ నోరుమూసుకున్నంతరకే. వాచకం లేని తన నటన నోరు తెరిచి డైలాగ్ చెప్పినపుడు పంటికిందరాయే. ఉన్నంతలో విక్రం సహజంగా నటించాడు. ఉపపాత్రల్లో రవికిశన్, గోవిందా బాగాచేస్తే,  ప్రియమణి ఫరవాలేదనిపించింది.

సంతోష్ శివన్ ఛాయాగ్రహణం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, రెహమాన్ సంగీతాలు బాగున్నా, సినిమాకు పెద్దగా ఉపయోగకరం కాలేదు. దర్శకత్వపరంగా చాలా ఛాలెంజింగ్  ఫిల్మ్ అనిపించినా, మణిరత్నం నుంచీ ఏ conceptual integrity, subtext ఆశిస్తామో అది ఏమాత్రం ఈ సినిమాలో కనిపించకపోవడం ఆశ్చర్యంతో పాటూ ఆవేదనను కలిగిస్తుంది.

****

4 comments:

Nrahamthulla said...

నిడమర్రు చార్వాకాశ్రమం స్థాపకుడు కీర్తిశేషులు రామకృష్ణ గారు "రావణాయణం" పేరుతో ఒక పుస్తకం రాశారు.

Weekend Politician said...

మహేష్ గారు,
నేను సినిమా చూడలేదు.మీ review/Analysis చాలా బావుంది. Your writing style and the perspective of your review is great.

Your review is validating what I am hereing about this film in general. your presentation made it simple to understand.

yab said...

Well written as usual. Coming to the movie, I haven't seen it yet. But I kind of stopped expecting great movies from Mani Ratnam for some time. Looks like he is indulging too much in characterization at the cost of the story line. How ever good the other departments are, with out a good story, movie falls flat.

For the story lines he (mani sir) is picking up, there should be a strong underlying concept. may be it has but looks like he is not bothering about conveying it.

Nikhilesh said...

Meeru cheppindi aksharala nijam nenu "ravan" chusanu maniratnam nirasha parichadu songs & Photo graphy chala nachayi songs loo usure poyenu song ayyithe marinu