Saturday, May 24, 2008

నా కాలేజీ కథ -Part 6







కలహాలూ - కన్నీళ్ళూ

కాలం గడిచేకొద్దీ ఇంగ్లీషుకు భయపడి కాలేజినుండీ పారిపోయే ఆలోచనకు పాతరపెట్టేశాం. మా సీనియరన్నట్టు ‘తెలుగొచ్చినోడికి ఇంగ్లీషు పెద్ద కష్టం కాదు’ అనిపించింది. యాభైమూడు అక్షరాలున్న తెలుగొచ్చినోడికి ఇరవైఆరు అక్షరాలే ఉన్న ఆంగ్లం ఒక లెఖలోకి రాకూడదు మరి. అక్షరమాల సంఖ్య పరంగా కాకపోయినా, చుట్టుపక్కల మాట్లాడే వాళ్ళు, మనం మాట్లాడితే తప్పుపట్టని వాళ్ళూ ఉన్నంతకాలం ఇదోపెద్ద కష్టం కాదనుకుంటా. ఈ ,స్నేహాలూ, ప్రేమకాని ప్రేమలూ ఇలాసాగుతుండగానే, మన జీవితాన్ని మరింత రంగులమయంజెయ్యటానికి మరిన్ని అనుభవాలు కాచుక్కూర్చున్నాయ్. అవే కొన్ని కలహాలూ మరిన్ని కన్నీళ్ళు.


ప్రతి సెమిస్టరూ మా క్లాసువాళ్ళం టూర్ కు వెళ్ళే వాళ్ళం. అంటే అదేదో నాలుగైదు రోజులనుకునేరు, కేవలం పొద్దున బయల్దేరి రాత్రికి హాస్టల్ చేరుకునేట్టన్నమాట. దీన్నే ‘ఎక్స్ కర్షన్’ అంటారని మనకప్పుడే తెలిసిందిలెండి. ఎంతైనా మైసూరు పర్యాటక క్షేత్రంగనక 200 కి.మీ. చుట్టుకొలతలో మా ఎనిమిది సెమిస్టర్లకు సరిపడా, విహార పదార్థాలు కలిగిఉండేది. ఇక ఆల్రేడీ మా సీనియర్లు వెళ్ళొచ్చి సెమిస్టర్ల వారీగా ప్రాంతాలనుకూడా నిర్ణయించి పెట్టేశారు కాబట్టి, మనం చేసేదల్లా సింపుల్గా ఫాలో అవ్వడమే. ఇలా మొదటి సెమిస్టర్ విహారం లో శివసముద్రం,సోమనాధ పురం మరియూ తలకాడు అనే కావేరీ నదీ ప్రవాహక ప్రాంతానికి బయల్దేరదీశారు. ఈ మూడు స్థలాలూ మన తెలుగు సినిమాలద్వారా మనకు సుపరిచితమని అక్కడికెళ్ళాకగానీ తెలియలేదు మనకి. సోమనాధపురం గుడి ‘దళపతి’ సినిమాలో "సుందరి నీవేనేనంట...జన్మకే తోడైనేనుంటా" అని కొప్పుకట్టుకుని రజనీకాంత్, శోభన కోసం పాటపాడేది ఈ గుళ్ళోనే. ఇక శివసముద్రం వాటర్ ఫాల్ గురించిచెపాలంటే మన కె.రాఘవేంద్రుడి ‘పెళ్ళిసందడి’ సిన్మాలో "సౌందర్యలహరి...స్వప్న సుందరీ...నువ్వే నా ఊపిరీ" అనే పాటలో దీప్తీభట్నాగర్ బొడ్డుతోపాటూ అప్పుడప్పుడూ (ఒకవేళ మన అబ్బాయిలు చూసుంటే) కనిపించే జలపాతమే ఇది. ఇక తలకాడు అనే స్థలం కూడా ‘శ్రీ మంజునాధ’ సినిమాలో బహుచక్కగా చూపించిన ఘనత మన బొడ్డుచూపుడు రాఘవేంద్రుడిదే అనుకుంటా.


కలహం 1: ఇక అసలు కథకొస్తే, ఈ విహారం వేళకి అంబిలి (నాకు మాత్రం ‘వెన్నెల’) ప్రేమకాని ప్రేమలో మునిగి తేలుతున్న అమర పేమికుడి అవతారంగా మనం భాసిల్లుతున్న తరుణం ఇది. ఇదే ప్రయత్నంలో ఉన్న మా క్లాస్ మేట్ జగన్నాథ్ కూడా తన ‘మిషన్ అంబిలికి’ ఈ విహారాన్నే ముహూర్తంగా పెట్టినట్టు నాకు వేగులద్వారా వినికిడై, నా జాగ్రత్తలో నేనున్నా. టూర్లో నా దృష్టంతా అంబిలి పక్క సీటు పట్టడంలో ఉంటే, నేనెప్పుడు లేస్తానా అని గుంటకాడి నక్కలాగా జగన్నాధుడి ఆకలిచూపులు. భలేమజా వచ్చిందిలెండి. మా ఈ ప్రణయ కాపలాలమధ్య ఒక విచిత్రం జరిగింది. మొదటి స్టాపు సోమనాధపురం కాగానే, అంతవరకూ నా పక్కనకూర్చున్న అంబిలికోసం మనం దర్జాగా సీట్లో కూర్చునిఉంటే, అంబిలి స్థానే ‘అయిషా’ వచ్చి నాపక్కన చతికిలబడింది. నేను ఈ పరిస్తితి చక్కదిద్దేలోపే జగన్నాధుడు అంబిలి పక్కన చేరి నావైపు ఒక విషపునవ్వు విసిరేశాడు. "హమ్మ భడవా" అని మనసులోనే వాడ్ని దీవించి తరువాతి అవకాశం కోసం తీరిగ్గా ఎదురుచూడ సాగా. ఇంతలో నా తాయిలాన్ని లాగేసుకున్న ఆయిషా, ఈ విషయమే ఎరగన్నట్టూ నేను తనకోసమే అక్కడ దిగబడినట్టూ తనగురించీ, తన కుటుంబాన్ని గురించీ, మా కిద్దరికీ ఉన్న అనుబంధం (అపార్థం చెసుకోకండి మహాశయులారా, తనూ నేనూ నవోదయా విద్యాలయంవారమని) గురించీ అడక్కుండానే ఏకరువుపెట్టేసింది. మన స్నేహాలూ, ప్రేమల లిస్టింగులో అమ్మాయి తురకతన్నాన్ని దృష్టిలో ఉంచుకుని తనను ‘స్నేహం’ లిస్టులో చేర్చాంగనక, మనకొచ్చిన ఢోకాఏమీలేదని సగం దృష్టి తనవైపూ ఇంకోసగం అంబిలీ-జగన్నధీయం వైపు పెట్టి ఇంకోస్టాపు వరకూ మాటలతో నెట్టేశాం. తీరా శివసముద్రం చేరుకొనేసరికీ, ఆయిషా ‘నువ్వేకావాలి’ టైప్ లో, నన్ను వదిల్తే ఒట్టు. తనను చెయ్యిపట్టుకుని వాటర్ ఫాల్ చేర్చడం, పడిపోకుండా పట్టుకోవడం, తను తడిచిన తర్వాత టవలందించడం, తన టల్తోనే నా తల తుడుచుకోవడం లాంటి ఊడిగాన్ని మహదర్జాగా,పురమాయించి మరీ చేయించుకుంది. ఈ కథలన్నీ చూసి అంబిలి ఏమనుకుంటుందో అన్న దడ ఒకవైపైతే, జగనాధ్ గాడు చేస్తున్న గడబిడ మరోవైపు చేరి నా మెదడును వెట్ గ్రైండర్ చేసేసాయంటే నమ్మితీరాలి. ఇక ఇలాకాన్జెప్పేసేసి, వెంఠనే పారిపోయి బస్సెక్కి, అంబిలి అందాకా కూర్చున్న సీట్ లో అందరికన్నా ముందు కొలువుతీరా. వచ్చీరాగానే చిరునవ్వుతో నా పక్క అంబిలి కోర్చోని, "హౌ వాజ్ ద ఫాల్?" అనగానే నా మెదడు ఫౌల్ గేమ్ ఆడేసింది. కాకపోతే, బస్సెక్కుతూ ఆయిషా నన్నుచూసిన చూపుకేగనక పవరుంటే "అక్కడే భస్మమయ్యేవాడినా" అనిపించింది.


ఇక ‘తలకాడు’ కొచ్చేసరికీ, నా తలకు బహుమతి ప్రకటించిన తీరులో నన్నుచూసి "గోరా చెహరా..కాలా దిల్" అని ఓ హిందీ పాట విసిరింది ఆయిషా. మనది పెద్ద ‘గోరా చెహరా’ కాకపోయినా, తన ఉద్దేశం నా ‘కాలా దిల్’ మీదనే అని నా మితృడు హరీశ్ చెప్పేవరకూ నేను చేసిన తప్పర్థం కాలేదు. తురక బాపతుకాబట్టి స్నేహం లిస్టులో నేను పెట్టేసుకున్నా, ఆ అమ్మాయి నన్ను ప్రేమించిందేమో అని మా వాడి డౌటు. "ప్రేమిస్తే పెళ్ళిచేస్కోవాలి" అనే, నా మధ్యతరగతి మట్టిబుర్రకి ఇలాంటి ‘కేవలం ప్రేమలు’ అర్థమవ్వటానికి దాదాపు మరోసంవత్సరం పట్టింది. కానీ ఈ ప్రహసనం పుణ్యమా అని ఆయిషాతో నా కలహం మొదలైంది. ఇక చూస్కో నా రాజా...తను చాన్స్ దొరికితే నన్ను ఇరుకున పెట్టడానికి చేసిన ప్రయత్నాల్తో నా తల అప్పుడప్పుడూ బొప్పికట్టించేసినంత పనిచేసేది. ఈ సంఘటన తరువాతే తను ‘రేఖ’ ఏకైక స్నేహితురాలై, మనుషులకు దూరమైందని మా హరీశ్ గాడు ఇప్పటికీ అంటాడు. ఇందులో ఎంత నిజముందో నాకు పూర్తిగా తెలీదుగానీ, నా మొదటి కలహం మాత్రం ఇలా మొదలైంది.



ఇలాంటి అనుభవాలతో మన తెలియనితనం కోంత తగ్గుతూ కొంత తెంపరితనం నాలో వచ్చిందని రెండో సెమిస్టర్ కి వచ్చేసరికీ, నాకునేను అనేసుకున్నా. కాకపోతే మన బతుక్కి కాస్త తెలివికూడా వస్తే తెగచించెయ్యవచ్చని ఆశగా ఉండేది. నాకోరికకి ఫలితంగా నా తెలివైనతనానికి దోహదం చేసిన ఆలోచనలూ,అభిప్రాయాలూ మరో కలహం నుండీ పుట్టాయంటే విచిత్రంగా ఉంటుంది. అది నాకూ ఇంకో అమ్మాయికీ మధ్య కాదండోయ్, ఒక అమ్మాయికీ మరో అమ్మాయికీ మధ్య కలహం నుండీ పుట్టింది. ‘రేఖ’ కూ ‘గౌరి’ కీ మధ్య మొదటి సంవత్సరంలో మొదలైన ఈ కలహం చివరి సంవత్సరంలో కూడా తీరలేదు.


కలహం 2: సరిసమానమైన అందం తెలివితేటలూ కలిగిన ఈ ఇద్దరమ్మాయిలూ స్నేహితులైతే బహుశా బ్రహ్మాండం బద్దలైఉండేదేమో గానీ, వీరి అభిప్రాయ భేధాలు మాత్రం నాబోటి క్లాస్ వారికి ప్రమోదాన్నీ, కొంత జ్ఞానాన్నీ పంచాయని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. స్వతహాగా అతి స్వార్థపరురాలైన (self centred) ఐన రేఖ కూ, ఆ గుణమే ఎరుగని గౌరికీ మధ్య శతృత్వం సహజమే అనుకోవచ్చు. కాకపోతే, యూనివర్సిటీవాడు గోల్డ్ మెడల్ కూడా క్లాసుకు ఒకటే పెట్టడం ఈ విభేధానికి అగ్ని కి ఆంజ్యం తోడుచేసిందని చెప్పొచ్చు. open market పుణ్యమా అని ప్రపంచీకరణ అప్పుడప్పుడే భారతదేశం లో ఓనమాలు దిద్దుకుంటుంటే, బెంగుళూరుకు చెందిని రేఖ మాత్రం అప్పటికే "ముమ్మూర్తులా ఈ భావాలకు నిలువుటద్దంలా తయారయ్యింది" అనిపిస్తుంది. మనుషుల్ని డిస్పోజబుల్ వస్తువులుగా, అందాన్ని ఒక valuable commodity గా తను ఉపయోగించిన విధానం, జీవనశైలీ చూస్తే అప్పట్లో నాకు అప్పుడప్పుడూ గుండె ఆగేదేమో. ఇప్పుడు తలుచుకుంటే మాత్రం "she was way ahead of our times" అనిపిస్తుంది.

ఇక ‘గౌరి’ విషయానికి వస్తే, వాళ్ళ నాన్నగారు డాక్టర్ విశ్వనాధ్ ఇదే కాలేజిలో ‘ఫోనెటిక్స్ అండ్ లింగ్విస్టిక్స్’ ప్రొఫెసర్ గా చేసి రిటైర్ అయ్యారు. ఈయన ఆసియా ఖండంలోనే ఒక ప్రముఖభాషా శాస్త్రవేత్తగా ఖ్యాతిగడించిన ఘనాపాటి ఇతను. ఇంత గొప్పవ్యక్తి కూతురు తెలివైనదైతే పెద్ద ఆశ్చర్యపడాల్సిన పనిలేదుకానీ, ఈ అమ్మాయిమాత్రం సుగుణాల పుట్ట, దాదాపు ఒక దేవత. ‘కాదు’,‘లేదు’,‘తెలీదు’ లాంటి పదాలస్సలు జీవితంలోనే వాడని గమ్మత్తైన వ్యక్తి. ఈ రెండు భిన్నధృవాలుండటం వల్లనే బహుశా మా క్లాసుకొక బ్యాలన్సు వచ్చిందని నా నమ్మకం.

పద్యాలు చదివి వాటికి ప్రతిపదార్థం, తాత్పర్యం భట్టీయం వేయించే మన తెలుగు సాహితీ పోకడలకు దూరంగా "ఆంగ్ల సాహిత్యంలో కవితలనూ,కథలనూ,నవలలనూ,నాటకాలనూ చదివి, ఆరాతీసి, ప్రశ్నించి మనదంటూ ఒక అర్థంతీసి అనుభవించాలి" అని మా జేమ్స్ బాండ్ చెపాడు. పై విషయం కన్ఫూజన్ గా మీకు అనిపిస్తే అప్పటి నా పరిస్థితి మీకు అర్థమైనట్టే. మనం ఈ దారిలో కొంత ప్రయత్నించినా, అపార్థాలే గానీ అర్థాలు స్ఫురించిన జ్ఞాపకం మొదటి సంవత్సరం లో అసలు లేదనుకుంటా. ఉదాహరణకి, షేక్స్పియర్ గారి ‘హేమ్లెట్’ నాటకంలో "టుబీ ఆర్ నాట్ టుబీ" అన్నా ఫేమస్ డైలాగు విని, "వీడికిదేం ఖర్మ మన ఎన్టీయార్ ‘రాజ మకుటం’ చూస్తే సమాధానం తెలిసేదిగా" అనుకున్నా. ఆ తరువాత తెలిసింది మన దగ్గరున్న దాదాపు చాలా జానపద కథలకు పితృసమానుడు (అబ్బ) ఈ షేక్ సాహెబ్ పీర్ గారే (షేక్స్పియర్ ని అలా ముద్దుగా పిలుచుకుంటాం) అని. అసలు ‘రాజ మకుటం’ సినిమా మాత్రుక ఈ హేమ్లెట్టే అని తరువాత మనకు జ్ఞానోదయమైంది లెండి. ఇటువంటి అజ్ఞాన తిమిరాంధకారం లో దర్జాగా సమయం వెళ్ళదీస్తున్న తరుణంలో, ఈ ఇద్దరు తరుణులూ పోటీపడి కవితలకీ, కథలకీ, నవలలకీ, నాటకాలకీ క్లాసులో చెప్పే భాష్యాలు, కాస్త మన బుర్రల్లో బల్బులు వెలిగించాయనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.


‘రేఖ’ తన (ఆల్రేడీ చదివిన) పాండిత్యం తో రచయిత భాషకు అర్థం చెబితే, ‘గౌరి’ రచయిత భావాల్ని అప్పటి సమాజంలోని పరిస్తితులను ఉదహరిస్తూ బహిర్గతం చేసేది. రేఖ రచయిత ఉద్దేశ్యాన్ని చెప్తే, గౌరి రచయిత పరిచయం చేసిన మానవీయ విలువలనూ, ప్రస్తుత కాలంలో వాటియొక్క ఔన్నాత్యాన్ని తెలియజెప్పేది. ఇలా ఈ ఇద్దరు ఆడసింహాలూ సాహిత్యాన్ని చీల్చిఛండాడితే, వాటినుండీ రాలిన ముత్యాల్ని ఒక చోట కూర్చి మనతెలివితేటల మూటల్ని నింపేవాడిని, బహుశా చాలావరకూ మా క్లాస్ వాళ్ళు ఈ పనిచేసే పరీక్షలు గట్టెక్కారని నా గట్టి నమ్మకం. అఫ్ కోర్స్ మనం మాత్రం సగర్వంగా ఈ బాపతే. ఇలా మొదట్లొ సంగ్రహించినా, రాన్రానూ సొంతంగా గ్రహించే తెలివి ఈ ప్రక్రియద్వారానే ప్రారంభమైందని నా విశ్వాసం. ఈ ప్రగతిలో మా జేమ్స్ బాండ్ పాత్రకూడా ఉందండోయ్! "ఆంగ్ల సాహిత్యం మన సమాజపు విలువలూ, సంస్కృతికి దూరంగా జన్మించింది కాబట్టి, ఒక వేళ మనం చదివి ‘అర్థం చేసుకున్నా’, పూర్తి స్థాయిలో ‘అనుభవించడం’ కష్టం. అందుకే, ఆంగ్ల సాహిత్యపు సొబగులను అర్థచేసుకుని, సొంత భాషా సాహిత్యంలో అనుభవాన్ని వెతకండి" అని ఇతను చెప్పిన మాటల ఆధారంగానే మనకు చలం, చిట్టిబాబు, బుచ్చిబాబు, తిలక్, చివుకుల పురుషోత్తం,మధురాంతకం మొదలగు రచయితల సాహిత్యంతో పరిచయ భాగ్యం కలిగింది. ఇలా ఇంగ్లీషు సాహిత్యం పుణ్యమా అని తెలుగు సాహిత్య పరిచయప్రాప్తి కల్గడం విధి లిఖితం కాక మరేమి చిత్రమో! ఇలా మరొక కలహం మనకు (ఉన్న తెలివి పోకున్నా) కొంత కొత్త తెలివిని రప్పించింది.



కలహం 3: "ఏరా కనపడ్డం లేదు!" అంటే, "నేనేమైనా చాముండీ హిల్సా ఎప్పుడూ కనపడ్డానికి?" (మైసూర్ లో ఎక్కడినుంచీ చూసినా చాముండీ హిల్స్ కనపడుతుంది లెండి) అని హాస్యపూరిత ఎకసెక్కాలాడే మంచిమిత్రుడు హరీశ్ తో కూడా మనకు కలహమొకసారి దాపురించింది. రెండవ సెమిస్టెర్ టుర్ కి నిలబడి ప్రయాణంలో డ్యాంస్ చెయ్యటానికి వీలులేకుండా తను చిన్న వెహికల్ బుక్ చేసేసరికీ(తనప్పుడు ఈ విషయాలు చూసుకునే క్లాస్ లీడర్ లెండి), మన నోటి దూలతీరా ఏదో వాగేశామ్. ఈ దెబ్బకి గురుడు దాదాపు ఒక సంవత్సరం నాతో మాట్లాడలేదు. ఆ తరువాత, ఇప్పటికీ మేము తుమ్మ జిగురు రేంజి దోస్తులం. అదో పిచ్చి సమయం అంతే!



కలహం 4: ఇక మరో కథ మా కుర్గీ(కూర్గ్ అనే ప్రాంతం అమ్మాయి) ‘మాల’ ది. రెండొ సెమిస్టర్ లో మన మనసు కాస్త ఈ ఎర్రగా బుర్రగా ఉన్న అమ్మయిమీదకు పోయిందిలెండి. "హమ్మో! భడవా" అని ఆశ్చర్యపోకండి, ముందే చెప్పాం గదా "మనం చలం టైపులో చాలా సార్లు ప్రేమించామని!". ఇలా ఈ అమ్మాయిని ప్రసన్నం చేసుకునే దిశగా ఈవెనింగ్ వాక్ లు చాలా నెరిపాం. తీరా ఒకరోజు ఆ అమ్మాయి దీనంగా మొహం పెట్టి, I am a girl mahesh, try to understand" , "ఇక నీతో వాక్ లు కట్టు" అంది. దానికి మనం దర్జాగా, "తల్లీ నువ్వు అమ్మాయివి కాబట్టే ఇంతగా పడిగాపులు, ఆపసోపాలూ పడుతున్నా, లేకపోతే ఇన్నికష్టాలు నాకెందుకూ" అన్నా. అంతే, నేనేదో మహాపాపం చేసినట్టుగా చూసి కొన్నాళ్ళు నాతో "కటీఫ్" చెసేసింది. ఆఖరు సంవత్సరంలో ఒకసారి నా దగ్గరకొచ్చి, " you are far better than many pretentious men" అని ఓ పెద్ద కాంప్లిమెంట్ కూడా ఇచ్చింది. నిజమే, మనం వెధవతనం లో కూడా చాలా సిన్సియరు మరి.



కన్నీళ్ళు: నా సాహిత్య ప్రగతిలో, నా జీవన ప్రయాణంలో తన సహకారాన్నందించిన ‘గౌరి’, అంబులెన్స్ లో ఫైనల్ సంవత్సరం పరీక్షలు రాయడానికి వచ్చిన క్షణం, జీవితంలో ఏప్పుడోగానీ తడవని నా కళ్ళు ఒక్కసారిగా నా ప్రమేయం లేకుండా వర్షించాయి. "కడుపులో విడదీయరాని ట్యూమరట, ఎప్పుడో ఒకప్పుడు ‘పోతుందని’ తనకి ఎప్పుడో తెలుసట" అని నాకు తెలిసిన క్షణం లో నిజంగా నరమంటే ఏమిటో నా మనసుకు తెలిసింది. మూడు మార్కుల తేడాతో రేఖ కు యూనివర్సిటీ వారిచ్చే బంగారు పథకం దక్కినా, మా జీవితాల్ని బంగారం చేసిన దేవత మాత్రం గౌరినే. ఒక సంవత్సరం తరువాత గౌరి చనిపోయింది. "She was a worthy apponent I ever had" అని రేఖ అందని విన్నాను. కానీ మా క్లాసులోని నాలాంటి చాలామందికి, "She was THE best humanbeing, we had ever known". జీవితంలో తన ఆనందాల్ని తప్ప బాధను పంచని ఒక దేవత నా కళ్ళకు కన్నీళ్ళిచ్చి ఈ ప్రపంచానికి వీడ్కోలు చెప్పింది. "She is still part of me, that she will always be."

ఇలా కొన్ని కలహాలూ, ప్రేమ విరహాలూ, ఒక ఆత్మ బంధువు వీడ్కోలుతో నా కాలేజి జీవితం కొనసాగుతూ ఉంది.

(‘నవవసంతం’ అనే 7 వ భాగం త్వరలో)
-------------------------------------------------

19 comments:

Bala R Battu said...

Hey it is a best blog to enjoy our memories

Bala R Battu said...

నా యవ్వనం ఇలాగె గడిచింది. ఎందరొదెవకన్యలు నాహ్రుదయంతారాలలొ వరుధినిలయి, వెన్నల్ని నఖ్సత్రాలని దగ్గరగా చూసె భాగ్యాన్ని ప్రసాదించారు. నీకథ చదువుతూంటె వాల్లందరు ఒక్కసారె వెన్నెల్లొ అడపిల్లల్లా నాచూట్టూ చెరి ఎవొ రహస్యల్ని మల్లిచెపుతునంటె ఉంది.

Bala R Battu said...

ఎక్కడవి ఇ అక్షరాలు

ఎక్కడ దాగున్నాయి ఇన్నాల్లు

కల్లలొనా

కవితల్లోన

జ్ఞాపకల్లొనా..

.......

సుజాత వేల్పూరి said...

మహేష్ గారు,
కవన శర్మ గారు 'బంగారు రోజులు ' అనే నవల రాశారు. చదివారా మీరు? మీ అనుభవాలు చదువుతుంటే, ఆ నవల గుర్తొస్తోంది. మీరు ఇక్కడ బ్లాగటం అయిపోయాక అన్ని అనుభవాల్నీ ఇలా మాకు చెపుతున్నట్టు కాక, మరి కొన్ని సంభాషణల్ని, వర్ణనల్ని, మరి కొంత ప్రణయావేశాన్ని, భావోద్వేగాలను జోడించి ఒక నవలగా రూపొందించి ఒక పబ్లిషరు మొహాన విసరండి. మారు మాట్లాడకుండా వేసుకుంటాడు. వేసుకోలేదనుకోండి, మనమే వేసేద్దాం! హైదరాబాదులో(జూన్ నుంచి అక్కడే మా ఇల్లు) ఒక శుభ ముహూర్తాన వర్షం పడని సాయంత్రం పుస్తకావిష్కరణ పెట్టేద్దాం! బ్లాగర్లంతా వస్తారు. అక్కడే సేల్స్ కౌంటర్ పెడదాం! ఏమంటారు?

ఇదంతా నేను సీరియస్ గా చెప్తున్నాను.ఆలోచించండి మరి!

కాలేజీ అనుభావాలు లేని వాళ్ళు అరుదు. అవి ఎవరి అనుభవాలైనా అందరమూ మళ్ళీ పాతరోజులకెళ్ళిపోయి ఆనందిస్తారు! అందువల్ల ఆ back ground తో రాసే నవల్స్ ఎప్పుడూ హిట్టే! నవీన్ అంపశయ్య, కేశవ రెడ్డి గారి సిటీ బ్యూటిఫుల్ ఇవే కోవలోవి, అవి చదివి చూడండి!

Unknown said...

చదువుతున్నంత సేపు నవ్వుతూనే ఉన్నా .... బాసు .... మీలో ఒ మాంచి రచయిత దాగున్నాడు .... ఒ మంచి కాన్సెప్ట్ తో బుక్ రాయడం మొదలుపెట్టండి ..మొత్తం ఆరు పార్ట్లు ఈ రోజే చదివాను ....

Unknown said...

mee last paragraph "kannillu" Chadavakundane naa modati comment rasunu i am sorry...nijanga ... alanti snehituralini poguttukovadam duradrustakaram ....

Mee nava vasantam kosam yeduru choostunna nu...

oremuna said...

You are writing so well.

----

I hope you are keeping in mind of "the privacy lines" we have in between every scene of our life.

---------

Bolloju Baba said...

వామ్మో ......నేను వ్రాయలనుకున్నవన్నీ ఉత్తర గారు వ్రాసేసారు. లబో దిబో.

బొల్లోజు బాబా

వికటకవి said...

జీవితచరిత్ర అంటే భయపడి పారిపోయే రోజులు ఇవి. మీరు అనుభవాల పేరిట చాలా చక్కగా రాస్తున్నారు చదివించేలా. కొనసాగించండి.

http://blog.vikatakavi.net

vasantam said...

CoooooooooooooooooooooL
+
:(
+
:-)

Kathi Mahesh Kumar said...

@ఉత్తర, నా అనుభవాలు మీ అనుభూతుల్ని గుర్తుకు తెస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది.


@సుజాత గారు, నా కథలో ‘కంటెంట్’ ఉన్నా, కాస్త ‘ఫామ్’ లో మార్పులు చేస్తే పబ్లిషింగ్ కు పనికొస్తుందన్న మీ ప్రోత్సాహానికి ధ్యాంక్యూలు. ఈ బ్లాగంతా రాసిన తరువాత, మీవంటి సహృదయుల సహాయంతో ఈ పని కావించడానికి ప్రయత్నాలు సాగిస్తాను.నేను మీరుచెప్పిన నవలల్లో ‘అంపశయ్య’ మాత్రం చదవడం జరిగింది. ఇక ఈ మధ్య మా అన్నయ్యతో నా బ్లాగు గురించి చర్చలో ఉండగా, చిన్నప్పుడు మేము కలిసి చదివిన ‘బారిష్టర్ పార్వతీశం’శైలి నా కథలో ఒలికిందని నేను గ్రహించాను. ఇది ఒక స్వగతం పక్షంగా చెప్పే అనుభవాల కథ. మీరు బహుశా చదివే ఉంటారు.


@పజ్లుర్ గారు, ఫరవాలేదండీ! ఇంకోసారి బ్లాగంతా చదివి కామెంటండి సరిపోతుంది.


@ఒరెమునా గారు, కనీసం సొంత కథ చెప్పేటప్పుడన్నా ‘కెథారసిస్’ అవసరం అని నా అభిప్రాయం. కాబట్టి డీసెంసీ హద్దులు దాటని ప్రైవసీ వయొలేషన్ ఫరవాలేదనుకుంటా. ఇక హాయిగా కాపురాలు చేసుకుంటున్న నా ప్రేమికురాళ్ళకు (?) ఈ బ్లాగు హానిచెస్తుందా అంటే! ఆ అవకాశమే లేదు. ఎందుకంటే దాదాపు అందరూ మన భాష వాళ్ళుకాదు, నా కథ చదివే అవకాశం చాలా చాలా తక్కువ. ఐనా మనం రాస్తున్నవి పచ్చి నిజాలండీ బాబూ!

@బాబా గారు, మీకూ నా అనుభవాలు మీ అనుభూతుల్ని తిరిగి పరిచయం చేస్తే నా అదృష్టమే!

@వాసు గారు, మీ అన్ కండిషనల్ మద్దతుకు నెనర్లు.

@వికటకవి గారూ, మీ నమ్మకాన్ని నిలుపుకొనే ప్రయతన్నాన్ని కొనసాగించగలను.

Kottapali said...

The twist in the end .. perhaps a twist of fate - is heart-wrenching.

మీ సొంతమైన పదప్రయోగాల్తో అలరిస్తున్నారు. కథని పట్టుగా చెప్పడంలో మంచి ప్రతిభ ఉంది. రచన కొనసాగించండి.

బైదవే .. సుజాతగారూ, కవనశర్మ బంగారు రోజుల్తో పోలిక నేనొప్పను. కాలేజి రోజుల నెమరువేత అన్నంత వరకే ఆ పోలిక.

Sankar said...

'చాలా వరకూ నిజం, కోంతవరకూ కల్పన జోడించిన నా కాలేజ్ కథ ఇది ' అన్నారు ( మొదటి భాగం ). ఇంతకీ అంబిలి నిజాల లిస్టుకు చెందుతుందా లేక కల్పనల లిస్టుకా?

Kathi Mahesh Kumar said...

@kottapaali, Thank you for your keen observation.

@Shankar, Ambili is a `fact' and not a figment of imagination.

Unknown said...

బాగా రాస్తున్నారు. భేష్...

విహారి(KBL) said...

chala baga rastunnaru.
last twist naku chala bhadanipinchindi.

Kathi Mahesh Kumar said...

@ప్రవీణ్ & విహారి, నెనర్లు.

జీవితం అంత సాఫీగా ఉండదు కదండీ! కానీ ఈ అనుభవాలే జీవితానికి ఒక అర్థాన్నీ పరమార్థాన్నీ కల్పిస్తాయనుకుంటా.

Prasad said...

Hello Mahesh,
Great, I have read all the parts of your college life. Amazing. Your style is unique and fantastic. I never thought as your senior that you are such a talented person. I admire your writing skills. I have decided that I should read every post right from the beginning. I wish you all the best. I expect a good novel and beautiful poetry from you.

After reading your college story, I wonder how much memory you have. It is fresh and clear as if it had happened yesterday. I forgot many things of my life in RCE, Mysore. I can't but appreciate you for your great memory and great style of narration.

I have scanned other topics as well. You seemed to have become what Raghunath had expected from everyone of us. I am really proud of you and glad that you are my junior and also from my native place Vayalpad.

C G Lakshmi Prasad.

Inspired Souls said...

She was a worthy apponent I ever had" అని రేఖ అందని విన్నాను. కానీ మా క్లాసులోని నాలాంటి చాలామందికి, "She was THE best humanbeing, we had ever known". జీవితంలో తన ఆనందాల్ని తప్ప బాధను పంచని ఒక దేవత నా కళ్ళకు కన్నీళ్ళిచ్చి ఈ ప్రపంచానికి వీడ్కోలు చెప్పింది. "She is still part of me, that she will always be."

great words.. and terrific timing!!