Tuesday, June 3, 2008

నా కాలేజి జీవితం - Part 7.1


'నవవసంతం'


నా కాలేజి జీవితంలో మరింన్ని అనుభవాల్ని పంచడానికా అన్నట్టు మా కాలేజిలో కొత్తనీరు ప్రవేశించింది. అదే, కొత్త అకడమిక్ సంవత్సరానికి గానూ కొత్త బ్యాచ్ జూనియర్స్. కాకపోతే, మా ‘కాలేజీ’ ని ‘ఇన్స్టిట్యూట్’ని చేసే పనిలో భాగంగా భారత ప్రభుత్వం మా ‘బీఏఎడ్’ కోర్సును కత్తిరించి పారేసింది. కొత్తగా వచ్చిన ఎన్.సీ.ఈ.ఆర్.టీ డైరెక్టర్ సైన్సు విభాగానికి చందినవాడూ, "ఆర్ట్సు ఒక శుద్ద వేష్టు" అన్న బలమైన అభిప్రాయంగలవాడై ఈ అకృత్యానికి పాల్పడ్డాడని ఓ బలమైన నమ్మదగ్గ పుకారు కూడా మా చెవులకి చేరింది. ఈ విపరీతం వలన మాకంటూ ‘సొంత జూనియర్లు’ లేకుండాపోయారు. మా కాలేజి లో ఆఖరి బీఏఎడ్ బ్యాచ్ గా మిగిలాం. సైన్సు మెదడైతే ఆర్ట్సు మనసనీ ఈ రెండూ సక్రమంగా ఉంటేనే మనిషైనా కాలేజైనా మనగలదనికూడా తెలియని ఈ కొత్త డైరెక్టర్ మీద జాలిపడాలో, మాకు జూనియర్లు లేకుండా చేసినందుకు కోపగించుకోవాలో తెలియక, మూకుమ్మడిగాచేరి నిరసించి పారేశామ్. నిస్పృహతో కలిసికట్టూగా నిందించి ఆవేశాల్ని చల్లార్చాం. ఇక భవిష్యత్ ప్రణాళికలో భాగంగా, ఉన్న సైన్సు జూనియర్లనే ‘సొంతం’ గా భావించి ర్యాగింగూ, ఫ్రెషర్స్ పార్టీలు సమర్పించుకుని మాలో కలుపుకోవడానికి నిశ్చయించాం. అనుకున్నదే తడవుగా ఒక నెలనాళ్ళు ర్యాగింగ్ విజయవంతంగా ముగించి, ఫ్రెషర్స్ పార్టీకి తాంబూలాలు వాళ్ళ సైన్సు సీనియర్ల కంటే ముందే ఇచ్చేశాం.అప్పటికే మన ట్యాలంట్ ని కొంత గుర్తెరిగిన మా క్లాస్ మేట్లు ఈ ఫ్రెషర్స్ పార్టీ ఆర్గనైజర్లలో ఒకడిగా పట్టంగట్టి గౌరవింఛుకున్నారు. నా భాద్యత గేమ్స్ డిజైన్ చెయ్యడం. మా సీనియర్లు నేర్పిన చిలిపి ఆటలు మా దగ్గరున్నా, వాటికి మన తెలివితో పదునుపెట్టి, ఈ అదనుకు వాడటానికి నిశ్చయించాను. సాధారణాంగా ఒక ‘చీటీల రౌండ్’ ఒకటి ఉంటుంది. ఇందులో రౌండ్లు రౌండ్లుగా చీటీల బాక్సు తిప్పి చీటీ వచ్చిన వాడి చేత ఏదోఒకటి చెయ్యిస్తారు. ఈ ఆటలో సాధారణంగా ఖర్మగాలి ఎప్పుడూ పాట రానోడికి "పాట పాడు" అనో, లేక ఆట రానోడికి "డ్యాంస్ చెయ్యి" అనో వచ్చి సరదాకాస్తా చెడగొడుతూ ఉండేది. అందుకే మనం మన అతితెలివి ఉపయోగించి చీటీలలో కేవలం నంబర్ ఉండేట్టూ, జూనియర్లు చెయ్యవలసిన లిస్టు సపరేటుగా మా వద్ద ఉండేట్టూ మార్చిపడేసా. దీంతో నా సామిరంగా! మా కిష్టమైంది మాక్కావలసిన జూనియర్తో, నంబరుతో సంబంధం లేకుండా చేయించి పడేసాం. ఈ చీటిలరౌండ్ లోనే కాస్త రొమాన్సు కలిపి "నచ్చిన సీనియర్ కు ప్రపోజ్ చెయ్యి", "నచ్చిన సీనియర్తో డ్యాంస్ చెయ్యి" లాంటి తింగర వేషాల్నికూడా జొప్పింఛేశాం. అంటే కాస్త ఆనందంతో పాటూ ఆశ్చర్యాన్నీ, రొమాన్సునీ కలిపి పార్టీ కి కొత్తరంగులద్దామన్నమాట. అందుకె ఇప్పటీకీ "మీ ఫ్రెషర్స్ పార్టీయే బెస్ట్" అంటారు మా జూనియర్స్.‘పేఫర్ డ్యాంస్’ గురింఛి ఇంతకుముందే చెప్పాకదా! ఆ రౌండ్లో నన్ను జోడిగా తిరుపతి అమ్మాయి ‘సరితా రెడ్డి’ ఎంచుకుంది. రెండురౌండ్లు గడిచేసరికీ ఆ అమ్మాయి ఇబ్బందిని గమనించి మనమే ఔట్ ఐపోయాం. తరువాతి రోజుల్లో ఈ అమ్మాయి తో మంచి స్నేహం కుదిరిందిలెండి. ఎంతైనా ఒక జిల్లావాళ్ళంగా మరి. ఈ ర్యాగింగ్ హడావుడీ, ఫ్రేషర్స్ గలభాలో ఉండగానే మళ్ళీ స్నేహాలూ ప్రేమల లిస్టింగు మనసులో వేసేసుకోవడం జరిగిపోయింది. పార్టీ చివరలో ‘బాల్ డ్యాంస్’ రౌండ్ మొదలైంది. ఈ సారి పార్ట్నర్లని మారుస్తూ డ్యాంసు కొనసాగించాలని మా హరీశ్ కోరడం జరిగింది. అవునుమరి, అందరికీ అందరితో డ్యాంస్ చేసే అవకాశం రావాలిగా! . ఈ రౌడ్లో మన లిస్టులో ఉన్న అమ్మాయిలతో అందరితో డ్యాంస్ చేసి చివరిగా, ‘రంజని’ అనే కల్పక్కం(తమిళనాడు) కు చెందిన మళయాళీ అమ్మాయితో జతకలిసా. ఇంతకు మునుపు ఈ అమ్మాయిని ర్యాగింగ్ టైమ్ లో చూసిఉన్నా, అప్పుడు మన కళ్ళు ‘శ్రీజ’ అనే ఒక అందగత్తెమీద ఉండటంతో ఈ అమ్మాయిని పెద్దగా గమనింఛలేదు. కానీ ఇప్పుడు ఇంత దగ్గరగా చూసేసరికీ "బాగుందే!" అనిపించింది. అద్వితీయమైన అందం కాదుగానీ, కళ్ళుమాత్రం ‘మోహినీ ఆట్టం’ డ్యాంసరుకిమల్లే భలే గమ్మత్తుగా అనిపించాయి. నిజంగానే తను ఆ నృత్యం ఐదు సంవత్సరాలు నేర్చుకుందని తరువాత తెలిసింది.పార్టీ ముగుసిన వారానికల్లా స్నేహాలూ, ప్రేమల లిస్టుకి ‘చెల్లెళ్ళ’ లిస్టుకూడా చేర్చాల్సొచ్చింది. కొందరు జూనియరమ్మాయిలు "భయ్యా" అని భయంకరంగా పిలవడం మొదలెట్టారు మరి. ఈ ‘భయ్యా’ అని పిలిచే ‘బహన్’ ల లిస్టులో మొదటిది ‘ఊర్మిళ’ అనే ఢిల్లీ అమ్మాయి. ఇక మన ఖర్మకొద్దీ ‘శ్రీజ’ కూడా ఆలిస్టులోకి చేరిపోయింది. "మనం ట్రై చేస్తున్నాంకాబట్టి ఇలా బ్రదర్ ఫిట్టింగ్ పెడుతున్నట్టున్నారు" అని మా హరీశ్ గాడు చాలా సీరియస్ గా ఫీలయ్యాడుకూడా. ఈ నా చెల్లెళ్ళ లో ఆద్యురాలైన ఊర్మిళ కు కొత్తగా ఏర్పడిన ప్రాణస్నేహితురాలు రంజని. ఈ పిల్లకూడా ఎక్కడ "భయ్యా" అని ఉన్న ప్రాణాల్ని తీస్తుందో అన్న భయం ఒక పక్క పీడిస్తున్నా, ఈ ఇద్దరితో కలిసి కొన్నాళ్ళు విజయవంతంగా ఈవెనింగ్ వాక్ చేస్తూ స్నేహం చేసాను. ఇలా రెండువారాలు ఈవెనింగ్ వాక్ లాగించాక ఒక శనివారం పూట మరుసటిరోజు కలిసి సినిమాకెళ్దామనే ప్లాన్ ఉదయించింది.ఆదివారం సినిమాకెళ్ళే సమయానికి గేటుదగ్గరున్న మనకు రంజని ఒక్కటే వస్తూ కనిపించింది. "అంటే ఇక మన సినిమా ప్రోగ్రాం క్యాన్సిలన్నమాట" అనుకుంటుండగానే, దగ్గరకు వచ్చి "ఊర్మిళ మనం వెళ్తున్నది తమిళ సినిమా కాబట్టి డ్రాప్ అయింది"అనీ, "మనిమిద్దరమే వెళ్దాం" అంది. మనసులో ఒక్కసారిగా వెయ్యి ఫౌన్టేన్లు ఎగసినట్టైంది. నిజమే మరి, మొదటిసారిగా ఒక అమ్మాయితో జంటగా సినిమా అంటే అలానే అనిపిస్తుందేమో! ఎలా ఆటో ఎక్కానో, ఎలా ధియేటర్ చేరానో, టికెట్టు ఎవరుతీశారో ఈ ఆనందంలో తెలిసిరాలేదు. సినిమా మొదలైంది. ‘ఆశై’ అని మణిరత్నం నిర్మించిన సినిమా ఇది. దీన్ని ‘ఆశ...ఆశ...ఆశ’ అని తెలుగులో డబ్ చేశారుకూడా. అజిత్, శుభలక్ష్మి హీరోహీరోయిన్లు, ప్రకాష్ రాజ్ ఇందులో విలన్. లవ్ స్టోరీ అవడం వల్ల ప్రేమ దృశ్యాలు వచ్చినపుడు రంజని ముఖం చూడాలనే కోరికను అణగద్రొక్కుకుని కాస్త సినిమా చూశాను. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ తన భార్యను కోల్డ్ బ్లడెడ్ గా చంపే సీన్ రాగానే, భయంతో రంజని చేతులు నా చేతుల్ని పట్టుకున్నాయ్, తనకు భయం పోగొట్టే ప్రయత్నంలో భాగంగా నా చెయ్యి తన భుజాల్ని చేరాయి. ఇక సినిమా అంతా, ఫోటో ఫ్రేమల్లే అలాగే ఉండిపోయాం. సినిమా అయిపోయిన తరువాత జనాల మధ్యన తనను రక్షించే హీరోలా చెయ్యి పట్టుకుని ధియేటర్ బయటిదాకా తీసుకువచ్చా. అప్పటీకే మనం ఆకాశంలో విహరించేస్తున్నామని చెప్పొచ్చు. నా ముఖం బహుశా ఆ సమయంలో వెయ్యి వాట్ల బల్బు లాగా వెలిగిపోయిందని నా గట్టి నమ్మకం. అద్దమెక్కడా కనపళ్ళేదుగానీ, ఈ సెన్సాఫ్ అచ్చీవ్ మెంట్ కు మన ముఖాన్ని మనమే ముద్దాడి గౌరవించుకొనుందును. కాలేజ్ చేరే సరికీ సాయంత్రమైంది. చేరగానే ఊర్మిళ ఎదురై "कहा गऎथॆ तुम्लॊग? दिन भर डुंड रहीथी" అంది. అంటే మా కోసం పొద్దున్నుండీ పడిగాపులు పడుతోందని అర్థం. ఈ మాట వినగానే ఒక్క క్షణం షాకై, రంజని వేపు సమాధానం కోసం చూశా. తను తలదింఛుకొనుంది. నాకుమాత్రం తలదింఛుకొని నవ్వినట్టనిపించింది. నా మట్టుబుర్రకి విషయం కొంత అర్థమైనట్టనిపించింది.ఇలా నా ప్రేమకథ ప్రారంభమైన రోజుల్లోనే మా కాలేజీ లో ప్రతిసంవత్సరం జరిగే పాటలపోటీలు జరిగాయి. మొదటి సంవత్సరం మనకు ఒక్క ప్రైజూ వచ్చిన పాపాన పోలేదుగానీ, ఫరవాలేదనే గుర్తింపు మాత్రమే దక్కింది. ఈ సారి మనం ఖచ్చితంగా రెచ్చిపోదామని నిర్ణయించి పేరు నమోదు చేశేసాం. తీరా పోటీ తారీఖున చూస్తే దాదాపు 120 మంది గాయనీ గాయకులు మనతో కుస్తీకి సిద్దంగా ఉన్నారు. సోలోసాంగ్ తయారుగా ఉన్నా, డ్యూయెట్టుకోసం కసరత్తు చేసి ‘శైలజ’ అనే ఒక సీనియరమ్మాయిని ఒప్పించగలిగాను. పోటీ ప్రారంభమైందొ. సోలో పాటగా మనం అప్పటి మన మన:స్థితికి దగ్గరగా " सभाला है मैनॆ बहुत अप्ने दिल कॊ, जुबा पर तेरा फिर भि नाम आरहा है" అనే పాటను పాడాను. ఈ పాటకు అర్థం ‘నా మనసునెంతగా బుజ్జగించి వద్దన్నా, నా పెదాలు నీపేరే పలుకుతున్నాయ్’ అని. ఇక డ్యూయెట్టు కూడా "राह मॆ उन सॆ मुलाकात हॊगई, जिसॆ डर तेथॆ वही बात हॊगई" అని మహా ప్రేమ గీతం లెండి. దీనర్థం ‘వస్తూ వస్తూ తన దర్శనమైంది, ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిపోయింది’ అని, అనుకోకుండా కలిగే ప్రేమగురించిన గీతమది. మన కొత్తప్రేమ బలమో, ఫీలింగ్ ను నింపిన మన గళమో ఏది మ్యాజిక్ చేసిందో తెలీదుగానీ రెండు ప్రైజులూ మనకేయిచ్చి పోటీకి వచ్చిన జడ్జులు దీవించేశారు. ఇక నేను పాట స్టేజిపై పాడుతున్నంతసేఫూ, కొన్ని వందలకళ్ళు నా మీదకాక రంజని మీదున్నాయని, ఈ చూపుల్ని భరించలేక తను సిగ్గుతో చితికిపోయిందని తను నాతో గర్వంగా చెప్పింది. ఆ క్షణాన నా చాతీ ఒక్క పదంగుళాలు అదనంగా పొంగింది.ఈ తతంగం మొత్తంలో ‘నువ్వంటే నాకిష్టం’, ‘నేను నిన్ను ప్రేమిస్తునాను’ వంటి జెండా వందనాలూ, జాతీయగీతాలూ పాడుకోకపోయినా, ప్రేమ స్వాతంత్ర్యాన్ని మాత్రం యధేచ్చగా అనుభవించాం. బహుశా ప్రేమికులు ‘నేను నిన్నుప్రేమిస్తున్నాను’ అని ఒక స్టేట్ మెంట్ ఇచ్చిమరీ ప్రేమించరనుకుంటా! ఇక మేమంటారా? ఆగి ఆగి కురిసే ఆగష్టు వర్షాలు. చేతిలో చెయ్యీ, చూపులో చూపూ కలిపిన తిరిగిన సెప్టెంబరు సాయంత్రాలు. మైసూరు దసరా సంబరాలను మరిపించిన మా సరదాలూ. కొత్త చెలిమిని మరింత గట్టిపరచిన నవంబరు నాటి కొత్తచలీ. ఇలా సెమిస్టరు లోని నెలల సాక్షిగా ఆనందాన్ని, కొత్త సాంగత్యాన్ని అనుభవించాము. పచ్చకామెర్ల రోగికి లోకం పచ్చగా కనపడ్డం ఎంత అబద్ధమో, ప్రేమలో ఉన్నవాడికి ప్రపంచం మరింత అందంగా అనిపింఛడం అంత నిజమనుకుంటా. మా కాలేజిలో ‘గుల్ మొహర్ అవెన్యూ’ అని ఒక రోడ్ ఉంది. ఎత్తైన ఈ గుల్ మొహర్ చెట్లలో వర్షాల తరువాత ఎరుపు-నారింజ రంగు పూలు పూసి, అవి రోడ్డు మీద రాలిన దృశ్యం మిర్రర్ ఇమేజ్ లా అప్పుడుకనపడి మనసుకు ఆహ్లాదాన్ని కల్పించినట్టు మరెప్పుడూ అనిపించలేదు నాకు. ఇక డిసెంబర్ చలిశెలవుల్లో, నాలుగు లెటర్ల మధ్య మేము అనుభవించిన విరహం అనిర్వచనీయం. ఈ ఎడబాటు తరువాత జనవరిలో మేము కలిసి మొదట మాట్లాడుకున్నది, కలిసి మేము ఫంఛుకొబోయే బ్రతకు గురించీ, కాబోయే మా పెళ్ళి గురించీ, ఆలూలేదూ చూలూ లేదు అన్నట్టు మాకు పుట్టబోయే పిల్లల గురించీ. ఇప్పుడు సిల్లీగా అనిపింఛొచ్చి కానీ, ఆ వయసు ఆవేశం అలాంటిది. ఇంతటి ప్రేమావేశంలోనూ ముద్దులూ కౌగిలింతలూ మినహా మా ప్రేమ హద్దులెప్పుడూ దాటలేదు. నా పిరికితనమో, నేను పుట్టిపెరిగిన సమాజం నాలో నింపిన విలువల మహత్యమో, హద్దులు దాటితే జరిగే పరిణామాల పట్ల భయమో ఇవన్నీ కలగలిపిన నా మానసికస్థితో దీనికి కారణం కావచ్చు. కానీ ఈ కారణం నా జీవితాన్నో మరో విచిత్రమైన మలుపు తిప్పడానికి తయారుగా ఉందని నాకు అప్పుడు తెలీదు.


(`నవవసంతం' రెండవభాగం (7.2)త్వరలో)


----------------------------------------------
14 comments:

నిషిగంధ said...

అబ్బా మహేష్ గారూ, అసలు సిసలు సీరియల్ రైటర్ లా మీరిలా సస్పెన్స్ లో ఆపేస్తే ఎలా అండి!? పోయినసారి గౌరి తో కళ్ళనీళ్ళు తెప్పించి ఇప్పుడు రంజనితో 'ప్రేమంటే ఇదేరా' అనిపిస్తున్నారు :-)

btw, నాక్కూడా Naraaz song 'sambhalaa hai maine' అంటే పిచ్చిష్టం.. ఆ పాటతో అప్పట్లో అతుల్ అగ్నిహోత్రి కి పంఖా, ఎ.సి. అయిపోయా కానీ ఎందుకో అతను ఎక్కువ సినిమాల్లో రాలేదు, పాపం నేను!

రానారె said...

మహేశ్ గారూ, మొన్నొకరోజు మీ బ్లాగు మొత్తం అన్ని టపాలూ చదివాను. బ్రహ్మాండంగా రాస్తున్నారు. మీ జీవితకథలోని ఈ భాగం కోసం చూస్తూవున్నాను. వచ్చింది. ఇదొక్కటీ కొంచెం అంటీముట్టనట్టుగా వుందనిపించింది. ఒకే భాగంలో చాలా సంఘటనలు చెప్పబూనడంవల్ల కావచ్చు. వాక్యాల్లో శబ్దసారూప్యం అందంగావుంది, ఆ అందాన్ని తెచ్చే ప్రయత్నంలో అచ్చుతప్పుల మచ్చలు రాకుండుగాక. ఉదాహరణకు:

"కొత్త చలిమిని మరింత గట్టిపరచిన నవంబరు నాటి కొత్తచలీ."

"... ఉన్నా ప్రాణాల్ని తీస్తుందో అన్న భయం ఒక పక్క పీడిస్తున్నా ఈ ఇద్దరితో కలిసి కొన్నాళ్ళు "

ఫజ్లుర్ రహమాన్ నాయక్ said...

అబ్బా, మహేష్ గారు, ఇరగదిస్తున్నరండి. మొత్తానికి ఇప్పుడు మీ భాగస్వామి ... ఈ అమ్మయేనా ?? చాలా ఇంట్రేస్తింగ్ గా వ్రాస్తున్నారు ... కీప్ ఇట్ అప్.

Anonymous said...

Fantastic work! Mee blogs anni chala bagunnayi! keep up the good work! waiting for your next episode :-)

శ్రీ said...

మీ తొలిప్రేమ సన్నివేశాలు "కత్తి" లాగున్నాయి.

అబ్రకదబ్ర said...

విచిత్రమైన మలుపు అన్నారు - ఇంకెవరితోనైనా పెళ్లైందా కొంపదీసి మీకు?

Uttara said...

నా జీవితం లొ అనేక సార్లు ప్రేమ కల్గింది కాని ఒక్క సారె ఆ ప్రేమ ఏమితొ తెలిసింది

Kathi Mahesh Kumar said...

@నిషిగంధ,కావాల్అని సస్పెన్సు లో ఆపలేదండీ.ఇంత టైపు చేసేసరికీ నా కంప్యూటర్ స్క్రీను ‘టిమ టిమ’లాడేసరికీ , ఇక్కడితో ఆపి మరో చాప్టర్ చేసేసా అంతే.ప్రేమంటే ఇదికాదని నా తరువాతి చాప్టర్ చెబుతుంది చూడండి.
పాపం అతుల్ అగ్నిహోత్రికూడా !.

@రనారె,అంటీముట్టనట్టుగా అనిపిస్తోందా? ఇంకా బాగా రాయడానికి ప్రయత్నిస్తాను. కానీ ఇది కాస్త ఎమోషనల్ విషయం కాబట్టి అలా అనిపిస్తోందేమో!!!

@రహమాన్, తరువాతి భాగం చదివితే మీకే తెలుస్తుంది సార్.

@లాజిక్ లవంగం,శ్రీ,అబ్రకదబ్ర & ఉత్తర నెనర్లు. తరువాత భాగం చదివి మీ అభిప్రాయాలు రాయగలరు.

కొత్త పాళీ said...

రానారె అన్నదే నాకూ అనిపించింది ఈ వాయిదా చదువుతుంటే. అది కొంతవరకే. బహుశా ఫ్రెషర్సు పార్టీలు ఎలా చేశారు అని ఇంత పొడుగు వర్ణన వలన కావచ్చు. రంజని రంగప్రవేశంతో ఆ బోరు కాస్తా ఎగిరి చక్కాపోయింది.
@ ఫజ్లుర్ రహమాన్ - బ్లాగు అంగడి తెరిచారుగా, మరి సరుకు ఎప్పుడు నింపుతారు? త్వరగా మొదలెట్టండి. శుభస్య శీఘ్రం, ఆలస్యం అమృతం విషం ఎట్సెట్రా ..
@ ఉత్తర - మీ బ్లాగు ఆహ్వానితులకు మాత్రమే అని ఉంది? ఎందుకో అంత రహస్యం!

వికటకవి said...

అబ్బా, ఎంతైనా మన టీవీ సీరియళ్ళ వాసన ఎక్కడికి పోతుంది. పసందైన చోటే విరామం పెట్టేసారుగా... :-)

రాధిక said...

"ఇంతటి ప్రేమావేశంలోనూ ముద్దులూ కౌగిలింతలూ మినహా మా ప్రేమ హద్దులెప్పుడూ దాటలేదు." కౌగిలింతలు,ముద్దులు హద్దు దాటడం కాదా అని అడుగుదామనుకున్నాను.కానీ దీని తరువాతి భాగం చదివేసాను కాబట్టి ఆ మాట అడగలేకపోతున్నాను.

Kathi Mahesh Kumar said...

@కొత్త పాళీ గారూ,నేను కూడా ఇప్పుడు చదువుతుంటే అనిపించింది. కాకపోతే రంజని నా వైపు ‘ఆకర్షితురాలు’ కావడానికి ఈ ఫ్రెషర్స్ పార్టీ దోహదపడిందని నా నమ్మకం. అందుకే కాస్త ఈ విషయమై ‘ఇండల్జెంస్’.

@వికటకవి గారూ, టీవీ సీరియళ్ళ వాసన కాదు సార్! ఇక్కడ నా ల్యాప్ టాప్ ఘోషణ జరిగింది. అంట పొడుగు బరహ లో టైప్ చేసేసరికీ తెర బ్లింక్ అవ్వసాగింది. అందుకే అంతటితో ఆపి ‘ఛాప్టర్ 7.1’ అనేశా.

@రాధిక గారూ, ముద్దులూ,కౌగిలింతలు ‘హద్దులు దాటడం’ కొన్ని(సమాజాల) కొలమానాల ప్రకారం అయివుండవచ్చు.కానీ,మారుతున్న కాలంలో మరీ వేగంగా మారిన విలువలకు నేనొక ‘విక్టింని’(అప్పట్లో). ఇక తరువాతి భాగం చదివారుకాబట్టి ఇప్పటికే అర్థమైపోయింది కదా!

Usha said...

Helo Kumar gde [:)]

yes meeru choopinchina change sari chesaa choodandi.
okkosari tondarlo kuda konni post lu pettepudu spell cheks n bhavaala pondika missayyanu
mallaa anni okasari chek chesi pettali but koddiga bzy volana kudaratam ledu n andulonu maaku net last 3 months ledu just 1 week ayyindi mallaa maa intlo net connection vochchi so adi sangati
edoo silly reason ichchaa anukuntunnaraa ledandi babu idi 200% satyammmmm

Thanks
Usha

Anonymous said...

Anna, I must say u have made an excellent effort in putting all that in the blog form. But i couldn't enjoy the reading as it was proving difficult to follow the computer form of Telugu.
Please post an English version also for lesser mortals like me.
All the best.
Regard - Hemanth