Monday, September 29, 2008

రొమాంటిక్ ప్రేమంటే ?

సాధారణంగా భారీ విషయాలు మాత్రమే రాసే చివుకుల కృష్ణమోహన్ గారు తన బ్లాగు 'సిరివెన్నెల' లో ఈ మధ్య ప్రేమలోని భారీతనాన్ని గుర్తించి, "ప్రేమంటె ఏమిటంటే..ప్రేమించగానె నాకు తెలిసె...2" అని ఒక టపా రాసేసారు. అక్కడ నేనొక వ్యాఖ్య చేసినతరువాత, నాకూ నిజంగానే సందేహమొచ్చింది. తల్లిదండ్రుల ప్రేమలు, సోదర/సోదరి ప్రేమలు, స్నేహితుల ప్రేమలు, బంధువుల ప్రేమలూ ఇంకా మాట్లాడితే అన్నింటినీ,అందరినీ ప్రేమించే విశ్వజనీయమైన ప్రేమమీద ఎవరికీ నిర్వచనపరమైన అభ్యంతరాలు ఉండవుగానీ...రొమాంటిక్ ప్రేమలకొచ్చే సరికీ ఎడతెగని సమస్యలొచ్చిపడతాయెందుకా? అని.


ఈ రొమాంటిక్ ప్రేమల్లో భావనాపరమైన లేక లక్షణ పరమైన చిహ్నాలు కనబడ్తాయేతప్ప, నిర్వచనకు ఆధారం కాదగిన కూలంకషమైన అవగాహనలు ఎవరికీ కనబడవు. అంటే, "గాల్లో తేలిపోతున్నట్టుంది", "అంతులేని ఆనందంగా ఉంది", "ఆకలి వెయ్యటం లేదు", "ప్రపంచం మొత్తంలో మా అంత అధృష్టవంతులు లేరు" వంటి భావనలో లేక వివరణలో,వర్ణనలో మనకు ప్రేమికుల దగ్గర లభిస్తాయేతప్ప, తర్కామోదయోగ్యమైన ఆధారాలు లభించవు. ఈ కారణంగా ‘ప్రేమపిచ్చి పట్టింది’ అనుకుంటామేగానీ, మనదగ్గరున్న తులనా సామాగ్రితో దాన్ని నిర్వచించే సాహసం చెయ్యలేం. పైపెచ్చు, ఈ పైత్యం ‘పుర్రెకోబుద్ది జిహ్వకో రుచి’ టైపులో జంటకో ప్రేమప్రకోపంగా అనిపిస్తాయిగనక, ఒకవేళ నిర్వచించినా, దానిని స్థాయీకరించడానికి అసలు ఆస్కారం లేదు. అందుకే అది "అనిర్వచనీయం" అయిపోయిందేమో!


ఈ నేధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం "రొమాంటిక్ ప్రేమ" అనే పదాల్ని విడదీసి వ్యావహారిక,సాంకేతిక, సాహిత్యక అర్థాల్ని బేరీజు చేసి, నిర్వచించకపోయినా కనీసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దామని ఈ టపా.


నిజానికి "రొమాంటిక్" అన్నపదాన్ని మనం అలవొకగా వాడేస్తాంగానీ, దానికి సమానార్థకమైన తెలుగుపదం వెదకాలంటేనే నాకు కొంత సమయం పట్టింది. ‘శృంగారం’,‘సరసం’ అనేపదాల్ని క్రియావాచక సమానార్థాలుగా వాడగలిగినా,మొత్తం భావాన్ని తెలియజెప్పడానికి సరిపోయే పదం దొరకడం లేదు. కాస్త స్వతంత్రించి మనం అప్పుడప్పుడూ ప్రేమను వ్యక్తపరిచే విధానాన్నికూడా రొమాంటిక్ అనేస్తున్నాం. కాబట్టి ఈ పదానికి అసలు సిసలు,ఖచ్చితమైన తెలుగు పదం లేదేమో అనిపిస్తోంది.


ఇక ఆంగ్లపదాన్ని తీసుకున్నా అర్థాలు కొంచెం గందరగోళంగానే ఉన్నాయి. చాలావరకూ ఈ రొమాంటిక్ అనే పదం "రొమాంటిసిజం" (romanticism) అనే ఒక భావజాలం నుంచీ పుట్టినట్టుగానో లేక రొమాంటిక్/రొమాంస్ అనే పదంనుంచీ ఈ భావజాలం ఉదయించినట్లుగానో చెబుతారు. అంటే ఇక్కడ ..."కుడిఎడమైతే పొరబాటు... కాదు!" అనుకోవాలన్నమాట. ఏదిఏమైనా, ఈ భావజాలం 18వశతాబ్దపు యూరప్ లో ఒక ఆలోచనాత్మక మరియూ సాహితీ ఉద్యమంగా మొదలయ్యిందని ఆధారాలు చెబుతున్నాయి. ఆసక్తికరంగా, ఈ "ఇజం" అప్పటి పారిశ్రామిక విప్లవం వలన ఏర్పడిన భావశూన్యతకు విరుద్దంగా ప్రకృతిని, సున్నితమైన మానవభాలనూ ప్రతిఫలించే అవసరాన్ని గుర్తించి మొదలయ్యింది. అంటే, దీని ఆరంభమే "పనికిరాని పనుల్లో మునిగితేలే రొమాంటిక్ ఫూల్స్" అని సభ్యసమాజం మె/నొచ్చుకునేవారికి సంబంధించిన తంతన్నమాట. కాకపోతే, ఈ పనికిరానిభావజాలమే ఆతరువాత కాలంలో ఫ్రెంచ్ విప్లవానికీ తద్వారా ఆధునిక ప్రజాస్వామ్య పోకడలకీ జన్మనిచ్చిందనుకోండి. అదివేరే విషయం.


బహుశా అందుకేనేమో కేవలం డిక్షనరీ అర్థాల్ని తీసుకున్నా, మన సమస్య తీరదు. "a soulful or amorous idealist", "not sensible about practical matters; unrealistic", "expressive of or exciting sexual love or romance" అంటూ పొంతనలేని అర్థాలే గోచరిస్తాయి. ఇక మనం తెలుగులో ఈ పదాన్ని విరివిగా ఎక్కడబడితే అక్కడ ఉపయోగించేస్తాంకాబట్టి సమాంతరాలు వెదకడం వృధాప్రయాసే!


ఇక్కడ "ప్రేమ" అనే పదానికి ఒకమ్మాయి- అబ్బాయి లేక ఆడా-మగా మధ్యవున్న సంబంధంగా పరిగణిస్తున్నాం, అందుకే మిగతా ప్రేమల గురించి ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక ఈ ప్రేమ అర్థాన్ని "అనిర్వచనీయం" అనేసుకున్నాం కాబట్టి భాషాపరమైన గొడవల్లోకి దిగకుండా కొంత సాంకేతికపరమైన లేక శాస్త్రీయ పరమైన వివరాల్లోకి ప్రవేశిద్దాం. When you reduce things to basics, they look simpler అంటారు. అందుకే ఈ అర్థంకాని భావం వలన కలిగే మానసిక మార్పులకు మూలమైన శారీరక కారణాలను తెలుసుకుని ఒక simplified అర్థం కొరకు ప్రయత్నిద్దాం.


న్యూరో బయాలజిస్టు (Neuro-biologist)ల సిద్దాంతం ప్రకారం, ఇలాంటి ప్రేమల్లో ఇరువురి సాంగత్యం ప్రభావంతో, శరిరంలో విడుదలయ్యే ఫెనీలిథల్మైన్ (phenylethlamine) అనే ఒక కెమికల్ మూలంగా ఈ "అనిర్వచనీయమైన అనుభూతులు" కలుగుతాయట. ఇంకో చిత్రమేమంటే, రోగాలకు మన శరీరం రెసిస్టెంస్ లేక ఇమ్మ్యూనిటీ పెంచుకున్నట్లే దాదాపు 4 సంవత్సరాల కాలంలో క్రమక్రమంగా ఈ "రోగం"కూడా చాలావరకూ తగ్గిపోతుందట. అంటే,యాదృచ్చిక ప్రేమల్లోనూ, పవిత్రప్రేమల్లో కూడా ఈ ఎఫెక్టు నాలుగు సంవత్సరాలే ఉంటుంది.పెద్ద తేడా లేదు. బహుశా అందుకేనేమో, ప్రేమించి పెళ్ళి చేసుకున్నా, పెళ్ళి చేసుకుని ప్రేమించినా నాలుగు సంవత్సరాలలో "మోజు" తీరి, మామూలుగా అయిపోతారు. విఫలప్రేమికులుకూడా, ఒక నాలుగు సంవత్సరాలు గడిస్తే ఎంచక్కా పాత ప్రేమల్ని మరిచి తమ జీవితాలు హాయిగా వెళ్ళబుచ్చుతారు.


ఇంత పచ్చిగా రొమాంటికి ప్రేమల్ని అర్థం చేసుకుంటే ఈ ప్రేమకథలూ, సినిమాలు, ప్రేమికులూ సిల్లీగా అనిపిస్తాయేమో! కానీ ఎంత చెప్పుకున్నా, మన బోరుకొట్టే జీవితాలకు escape from reality చాలా ముఖ్యం. ఇంకాచెప్పాలంటే, అర్థంకన్నా, కారణంకన్నా, విలువలకన్నా మన అనుభూతులూ మనకు ముఖ్యంకాబట్టి...జయహో రొమాంటిక్ ప్రేమ...రొమాంటిక్ ప్రేమ వర్థిల్లాలి...ప్రేమ జిందాబాద్...రొమాంస్ జీవితంలో ఉండాలి.


****

Sunday, September 28, 2008

ప్రతిరోజూ ఒక కొత్త పరిచయం

ఈ మధ్య "50 First Dates" అనే ఒక ఆంగ్లచిత్రం చూసాను. డ్ర్యూబెర్రీ మూర్, ఆడమ్ శాండ్లర్ నటించిన ఈ చిత్రంలో కధానాయికకి ఒక రోడ్డు ప్రమాదం కారణంగా మెదడుకి సంబంధించిన ఒక విచిత్రమైన వ్యాధి ఏర్పడుతుంది. తను ఒక రోజుగడిపి, రాత్రికి నిద్రపోయి, మరుసటిరోజు ఉదయం నిద్రలేస్తే, క్రితం గడిపిన రోజు జ్ఞాపకముండదు. అంటే తను ప్రతిరోజూ ఆ ప్రమాదం జరగడానికి ముందురోజులాగానే భావిస్తూ దినచర్యని మొదలెడుతుందన్నమాట. ఈ స్థితిలో ఉన్న నాయికని నాయకుడు ఇలా ప్రతిరోజూ కొత్తకొత్తగా దాదాపు 50 రోజులు ప్రేమలో పడెయ్యటం ఈ చిత్రంలోని మూలకథ. అందుకే ఈ సినిమా పేరు "50 మొదటి ప్రేమరోజులు".


ఈ సినిమా గొప్పది కాదుగానీ, ఈ చిత్రంద్వారా మానవసంబంధాల విషయంలో నేర్చుకోవల్సిన జీవనసత్యం ఒకటి బోధపడింది. సాధారణంగా రక్తసంబంధం కాకుండా ఏ ఇతర సంబంధం విషయంలోనైనా ఎదుటివారి ఆలోచనల్నిబట్టి, అభిప్రాయాల్నిబట్టి, వారి సామాజిక విధానాన్నిబట్టి మనం ఒక నిర్ధిష్టమైన అభిప్రాయం ఏర్పరుచుకుని సంబంధాలు కొనసాగిస్తాం. అలా ఎప్పటికీ ఎదుటి మనిషి image తో సంబంధాలు కొనసాగిస్తామేగానీ కొత్తగా మన సంబంధాల్ని పునర్నిర్వచించుకోము. అలా కనీసం ప్రయత్నించం. కారణం అదొక సౌలభ్యం. It is always easy to deal with an image of a person than a complex individuals who can't be categorized in to a "brand".


బ్రాండ్ పేరునిబట్టి వస్తువుల మన్నికని నమ్మినట్లు, మనం ఏర్పరుచుకున్న ఎదుటి వ్యక్తి మానసికఛాయను (mental image) నిజమని మనస్ఫూర్తిగా నమ్మడంలో కొంత సౌలభ్యం ఖచ్చితంగా ఉంటుంది. చాలాసార్లు మన సంబంధాలకు కొన్ని prejudices ప్రాతిపదికగా కూడా ఏర్పడుతాయి. అయినా వాటిల్లోని నిజం శాతాన్ని గుర్తించడానికి యత్నించం.


కానీ, ఈ సినిమాలోలాగా మనం రోజూ కలిసే వ్యక్తుల్ని ప్రతిరోజూ కొత్తగా కలిస్తే !?! What if you meet everyone you meet as a new person you are meeting for that day ! బహుశా చాలా సమస్యలు solve అయిపోతాయేమో. అంటే ఇక్కడ మతిమరుపో లేక మెదడుకి సంబంధించిన వ్యాధోకాకుండా, ఒక మానసిక పరిణితి గురించి ఆలోచిద్ధాం.


ప్రతిరోజూ మనం కలిసే మనుషుల్ని ఎల్లప్పుడూ కొత్తగా కలిస్తే, మన అపోహలకూ,అనుమానాలకూ,అపార్థాలకూ అర్థంలేకుండాపోయి, మనసుకి ఎంత ప్రశాంతత కలుగుతుందో కదా! ఒక క్లీన్ స్లేట్ లాగా ప్రతిరోజూ పాత సంబంధాల్నే కొత్తగా మొదలుపెడితే! కొంచెం ఆలోచించండి.


****

Friday, September 26, 2008

ఇక్కడ షివల్రీ (chivalry) లభించదు !

ఆడవాళ్ళు సరదాగా ఏ రెస్టారెంటుకో వెళ్ళినప్పుడు మీ బాయ్ ఫ్రెండో, భర్తో, స్నేహితుడో రెస్టారెంటు గుమ్మం దగ్గరున్న స్వింగ్ డోర్ ని అలవోకగా తీసిపట్టుకుని, ఎయిర్ ఇండియా మహరాజులా కొంచెంగా తలవంకించి, అల్లరిగా మీకళ్ళలోకి చూస్తూ, ladies first అనే అర్థం ధ్వనించేలా నవ్వి, మీకు దారి చూపిస్తే ఎలా ఉంటుంది? మహా సరదాగా, అందమైన అనుభూతిలా అనిపించదూ!


కానీ...అదే మీరు ఒక చర్చావేదికలో మీ మేధస్సును, అనుభవసారాన్ని, భాషాపటిమనూ ఉపయోగించి ఒక అమూల్యమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చితే, "బాగా చెప్పారండీ! ఎంతైనా ఆడవారుకదా, మీ అభిప్రాయాన్ని అంగికరించాలి" అని సగౌరవంగా ఒక మగాడు అంటే ఎలా ఉంటుంది? చిరాగ్గా, పచ్చి బూతులా అనిపించదూ!


ఈ మధ్య నా కథ "యాదృచ్చికం-ఒక ప్రేమకథ" గురించి జరిగిన చర్చల్లో, లక్ష్మి అనే ఒక మహిళా వ్యాఖ్యాత, నా ప్రతి వ్యాఖ్య గురించి "author's ways of commenting when responding to women are really disgusting" అన్నారు. అనవసరమైన విషయాల్ని కూడా అతిగా ఆలోచించేనాకు, ఈ అత్యవసర విషయం మీద కొంత ఆలోచన ఖచ్చితంగా అవసరం అనిపించింది. అది అపోహే అయినా, కనీసం నాకైనా నేను సమాధానం చెప్పుకోవల్సిన అవసరం ఉందనిపించి ఈ టపా రాస్తున్నాను.


"మహిళలు సమానమేగానీ, విభిన్నం...women are equal, but different" అని నేను నమ్ముతాను. కాబట్టి, మనుషులుగా వారి అభిప్రాయాల్ని గౌరవిస్తూనే, మహిళలుగా వారికున్న సామాజిక ధృక్పధాన్ని కూడా ఆమోదిస్తాను. అంతమాత్రానా, వారితో విభేధించకుండా ఉండకపోవడం వారికి నేనిచ్చే గౌరవంగా భావించడం నాకు ఆమోదయోగ్యం కాదు. పైపెచ్చు, ‘కేవలం మహిళలుగనక’ వారి అభిప్రాయాల్ని ఆమోదించడం వారి మేధను కించపరచడంగా నేను భావిస్తాను. అందుకే మహిళలైనా, మగవారైనా నా టపాపై వ్యాఖ్యానిస్తే వారి వ్యాఖ్యలోని విషయానికి ప్రతిస్పందిస్తానేతప్ప, వారి sex ని దృష్టిలో పెట్టుకుని కాదు. ఈ కారణంగా నా బ్లాగులో నేను మహిళా వ్యాఖ్యతలతో విభేధిస్తున్నప్పుడు, సాధారణంగా ఆడవారికి మగవారు చూపించే మగలాలిత్యం...షివల్రీ (chivalry) చూపించను.


ఒక వేళ ఈ విధంగా కాకుండా, కేవలం మహిళలు కాబట్టి వారి ఆలోచనలకూ, అభిప్రాయాలకూ ప్రత్యేకమైన గౌరవం జరగాలనుకుంటే, నా బ్లాగువైపు రాకపోవడమే మంచిది. ఎందుకంటే, "ఇక్కడ షివల్రీ (chivalry) లభించదు !"


****

Tuesday, September 23, 2008

వ్యక్తిగత స్వేచ్చ - విచ్చలవిడితనం


నా కథ ‘యాధృఛ్చికం - ఒక ప్రేమకథ’ తరువాత, కొంత చూచాయగానూ మరికొంత సూటిగానూ ‘వ్యక్తిగతస్వేచ్చ’ పట్ల నాకున్న ధృక్కోణాన్ని ప్రశ్నిస్తూ కొంత చర్చ జరిగింది. ఆ చర్చల నడుమ నాకు అర్థమైన విషయం ఎమిటంటే, నేను "వ్యక్తిగత స్వేచ్చ" అనగానే, విచ్చలవిడితనానికి ప్రోత్సాహమిస్తున్నానేమో ! అనే అపోహ చాలామందికి కలగడం. పైపెచ్చు, నేను ఉద్భోధించే వ్యక్తిగతస్వేచ్చ చాలావరకూ ప్రేమలూ, sexuality నేపధ్యంలో ఉండటం వలన ‘లైగింక స్వేచ్చ’కు, ‘వ్యక్తిగతస్వేచ్చ’ అనే ముసుగు తగిలించి ప్రచారం చేస్తున్నానేమో!! అన్న సందేహం కొందరికి కలుగుతోంది. ఈ నేపధ్యంలో వ్యక్తిగతస్వేచ్చ అనే ఒక విస్తృతమైన జీవనవిధానాన్ని గురించి కొంత విశదంగా వివరించాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది.



'వ్యక్తిగతస్వేచ్చ విచ్చలవిడితనానికి దారితీస్తుంది' అనేది కొంతవరకూ అపోహైతే, మరికొంత స్వేచ్చ పేరు చెప్పి మిడిమిడిజ్ఞానంతో నిర్ణయాలు తీసుకుని, ఆ తరువాత తీరిగ్గా బాధపడే కొందరి ప్రవర్తన కారణంగా బలపడిన నమ్మకం. వ్యక్తి స్వేచ్చ అనేది మానవవిధానంలోని అత్యంత పరిపూర్ణమైన స్థాయి. ఈ స్థాయి informed decision making capacity ద్వారా వస్తుంది.


జీవితాన్ని ఆనందమయం చేసుకునే "అన్ని" మార్గాల్నీ తెలుసుకుని, అవి తన జీవితంలో తెచ్చే మార్పుల్ని కూలంకషంగా అర్థం చేసుకుని, గుర్తెరిగి ఆ నిర్ణయాన్ని ఒక option గా exercise చెయ్యడాన్నే మనం "informed decision making" అంటాము. దానికోసం అవసరమైన life skills education వ్యక్తులకు కావాలి. కేవలం లైంగిక స్వేచ్చను వ్యక్తిగత స్వేచ్చ అనుకోవడం కొంత అవగాహనా రాహిత్య కిందకే వస్తుంది. బహుశా కొందరు ఈ విసృత విషయాన్ని అర్థం చేసుకోక, కేవలం తమ అవసరానికో లేక ఆపద్ధర్మంగా ఈ రెంటినీ interchangeable గా వాడటం వలనకూడా ఈ అపోహ కలగడానికి ఆస్కారం ఉంది.


'వ్యక్తిగత స్వేచ్చ', 'పెళ్ళి' ఒకదానికొకటి వ్యతిరేకం కాదు. పెళ్ళి అనే విధానంలోకి మనిషి తన ఇష్టంతో, ఒక choice ప్రకారం నిర్ణయించుకోవడంకూడా వ్యక్తిగతస్వేచ్చే కదా ! బాగా చదువుకున్న అమ్మాయి పెద్ద కంపెనీలో ఉద్యోగం వదిలి...I have a better job to attend to అని, మనస్ఫూర్తిగా భర్త, పిల్లలూ,ఇల్లూ చూసుకుంటానంటే తప్పేముంది? ఇది వ్యక్తిగత స్వేచ్చ కాదంటారా? కాబట్టి, బాధ్యత తీసుకొని తమ జీవిత నిర్ణయాల్ని తామే తీసుకునే ప్రతి ఒక్కరూ "అనవసరమైన సామాజిక ఆంక్షల" నుంచీ విముక్తి కోరతారు. తోడికోడలు చెల్లెలి మొగుడు ఏమనుకుంటాడో అని మన జీవితాల్ని మార్చుకునే బదులు, నాకు ఆనందం ఇస్తుంది కాబట్టి ఈ పని నేను చేస్తాను అనడమే వ్యక్తిగత స్వేచ్చ.


దీనివలన సమాజానికివచ్చే పెద్ద ప్రమాదం అస్సలు లేదు. వ్యక్తిగత స్వేచ్చ మూల ఉద్దేశం "ఆనందం". అలాంటప్పుడు,మాటిమాటికీ పోరాడుతూ ఉండటంవల్ల ఆనందం ఉండదు. అందుకే, వీరు సైలెంటుగా ఈ విప్లవాన్ని తమజీవితాల్లోకి అన్వయించుకుని చుట్టాలకూ, పక్కాలకూ, వీలైతే వీరికి లంకెలుగా పనిచేసే తల్లిదండ్రులకూ దూరంగా ఉండి సుఖంగా బతుకుతూ ఉంటారు. వీరి జీవితాలలో ఆనందాలేతప్ప ఆబ్లిగేషన్లుండవు. ఒక సారి మీ జీవితాన్ని పరికించి చూసుకోండి ! ఈ "నలుగురి" వల్లా మీ జీవితంలో ఆబ్లిగేషన్లు ఎక్కువై, మీ హక్కైన ఆనందాన్ని కోల్పోతుంటే...break free కావాలనిపించదూ! అదే వ్యక్తిగతస్వేచ్చకై మనిషి మనసులో మోగే నగారా.


లైంగిక స్వేచ్చ, వ్యక్తిగత స్వేచ్చలో ఒక చిన్న భాగం మాత్రమే. Consenting free individuals గా ఉన్నంతవరకూ ఈ విధమైన 'బాధ్యతాయుత' లైంగికత చట్టప్రకారంకూడా నేరం కాదు. కానీ, అది ఇద్దరికీ మధ్య ఒక informed choice గా ఉండటం అతి ముఖ్యం. ఒకరినొకరు మోసం చేసుకుంటూనో లేక ఒకరు ఇంకొకర్ని మోసం చేస్తూ ఉంటే అది వ్యక్తిగతస్వేచ్చ పరిధిలోకి రాదు. కేవలం "మోసం" అవుతుంది. అంతే!


ఇక పెళ్ళి అనే social contract లోకి ఇష్టపూర్వకంగా, స్వనిర్ణయంతో అడుగుపెట్టిన తరువాత, మనకు మనం ఇచ్చుకునే గౌరవం ఆ బంధాన్ని పాటించడం. కానీ ఒకవేళ అలా జరగకపోతే ఆ "తప్పుకు" పూర్తిబాధ్యత వహించి, ఫలితాన్ని గౌరవప్రదంగా అనుభవించాలి. అప్పుడే వ్యక్తిగతస్వేచ్చకు సార్థకత. వ్యక్తిగతస్వేచ్చ అంటే బాధ్యతలు లేని విచ్చలవిడితనం కాదు, తమ జీవితానికి తామే స్వతంత్ర్యంగా బాధ్యత వహించే స్థైర్యం.


మనకోసం మనం బ్రతకడం మనుషులుగా మనహక్కు. కేవలం 'తనకోసమే మనం బతకాలి' అనుకునే ఈ సమాజ పోకడల్ని నిరసించడం వ్యక్తిగత స్వేచ్చని ఆకాంక్షించే వ్యక్తిగా నా కర్తవ్యంగా బావిస్తాను.


వ్యక్తిగత స్వేచ్చ అనే ఒక సమగ్ర జీవన విధానాన్ని చాలా మంది ఒక scoring point గా వాడి లైంగిక స్వేచ్చకు సమానాంతరం చేసేయడం వల్లనే 'మనుషులు వ్యక్తిగత స్వేచ్చను కోరుకుంటే అది విచ్చలవిడితనంగా మారుతుందనే standard conditioning బలంగా నాటబడింది. ఈ అపోహ కొనసాగినంతకాలం, వ్యక్తిగత స్వేచ్చను సమగ్రంగా అర్థం చేసుకోకుండా కేవలం తమ బలహీనతల్ని కప్పిపుచ్చుకోవడానికి కొందరు వాడుతున్నంతకాలం ఈ అపార్థాలూ, అనుమానాలూ, అపవాదులూ,వాదనలూ తప్పవు.


నావరకూ వ్యక్తిగతస్వేచ్చ ప్రతి mature human being యొక్క ఆకాంక్ష కావాలి. అప్పుడే ఒక evolved society గా మనం మనగలం.

*ఈ టపాకు మూలకారణమైన ‘మనసులోమాట’ సుజాత గారికీ, అబ్రకదబ్ర గారికీ ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు.

****

Monday, September 22, 2008

మానవత్వం మనిషిసాయం కోరుతోంది !

బీహార్లో జరిగిన వరద భీభత్సం సంగతి అందరికీ తెలిసిన విషయమే...కొన్ని లక్షలమంది నిరాశ్రయిలయ్యారు, వందలమంది మరణించారు, కొన్ని కోట్ల రూపాయల ఆస్థినష్టం జరిగింది...ముఖ్యంగా మానవజీవితాలు అతలాకుతలం అయిపోయాయి. మానవత్వం మనిషిసాయం కోరుతొంది.











దసరా పండక్కి మనం కొనే బట్టల్లో ఒక బట్టని తగ్గిద్దాం. దీపావళికి మనం కాల్చే బాణాసంచాలోంచీ కొన్ని వస్తువులు తీసేద్దాం. బీహార్ వరదబాధితులకు మన చేతనైన సహాయం ఆందిద్దాం. మానవత్వాన్ని బ్రతికిద్దాం.

  1. *'Chief Minister Relief Fund, Bihar' A/C No. 10839124928, SBI Patna Secretariat Branch, Patna. * పేరు మీద మీరు ఇవ్వాలనుకుంటున్న మొత్తానికి చెక్ రాయండి.
  2. చెక్ పై మీ పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ మొదలైన వివరాలు రాయండి.
  3. దగ్గరలో వున్న SBI drop box లో వెయ్యండి.
  4. మీకు తెలిసిన స్నేహితులకూ, బంధువులకూ, కొలీగ్స్ కూ ఈ విషయం గురించి తెలియజెప్పండి
వరద సహాయక చర్యల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ క్రిందినంబరుకు ఫోన్ చెయ్యొచ్చు:91-612-2217305/2215027/6452572


*****

Wednesday, September 17, 2008

యాధృచ్చికం - ఒక ప్రేమకథ

"మనం తప్పు చేసామా?" అని అరమోడ్పు కళ్ళతో నా కనుల్లోకి చూసి తను అడిగితే ఏంచెప్పాలి? "నాకు మాత్రం అనిర్వచనీయమైన ఆనందానుభూతి కలిగింది" అని నిజాన్ని చెబితే, తను ఆశ్చర్యపడుతుందో ! అబ్బురపడుతుందో!! గర్వంతో నన్ను హత్తుకుంటుందో !!! తెలీదు.

౦౦౦

తనని కలిసి మూడురోజులే అయింది.

తను ఒక స్నేహితుడి స్నేహితురాలికి స్నేహితురాలు. కాస్త తికమకగావున్నా, చాలా వరకూ యూనివర్సిటీలో పరిచయాలూ, ప్రణయాలూ ఇలాగే మొదలవుతాయి. ఎవరో ఎవరికోసమో ఎవరిద్వారానో ఎలాగో పరిచయమవుతారు. కలవడం. విడిపోవడం. మళ్ళీమళ్ళీ కలవడం. కలుస్తూనేవుండటం. కలవలేకుండావుండటం. కలిస్తేగానీ వుండలేకుండావుండటం. కలిసిపోవడం. మళ్ళీకలవకపోవటం. జీవితాంతం కలిసుండటం లాంటి కబుర్లేన్నో, కథలెన్నో, వ్యవహారాలెన్నో, వెతలెన్నో, వ్యధలెన్నో. అన్నింటికీమించి అనుభవాలూ, జ్ఞాపకాలూ ఎన్నెన్నో.

తను..తన స్నేహితురాలికి తోడొస్తే, నేను మావాడికి తోడెళ్ళాను. "అరుణప్రియ అని నా ఫ్రెండు" అని తన పరిచయం జరిగింది. అప్పటికే తన గర్ల్ ఫ్రెండ్ కళ్ళలోకి కళ్ళుపెట్టేసిన నా మిత్రుడు నన్ను పరిచయం చేసినా, పక్కనేవున్న నాకే వాడు చెప్పింది వినపడలేదు. అలాంటిది తనకు వినపడిందనిమాత్రం నేను ఖచ్చితంగా చెప్పలేను. పెద్దగా ఆసక్తి లేనట్టే "హలో" అని ముభావంగా అంది.ఒక రెండు నిమిషాల తరువాత మా మిత్రులు తమ ఏంకాంతాన్ని వెతుక్కుంటూ "ఇప్పుడేవస్తాం" అని చెప్పి మాకు ఏంకాతాన్నిచ్చి వెళ్ళిపోయారు.

ఏదోఒకటి మాట్లాడాలికాబట్టి "రెండెందుకు" అని నేనే మొదలుపెట్టాను.

ఒక్కక్షణం సందేహంగా మొదలుపెట్టి "ఏమిటి రెండు?" అంది.

"అదే రెండుపేర్లెందుకు? 'అరుణ' 'ప్రియ' అని".

"అదంతే, మా పేరెంట్స్ అలాగే పెట్టారు."

"అంటే అరుణానికి నువ్వు ప్రియమా, అరుణం నీకు ప్రియమా లేక నువ్వే ప్రియమైన అరుణానివా ?"

ఒక్కక్షణం నిశ్శబ్ధం...

"ఏమో ఇప్పటివరకూ ఆలోచించలెదు. ఎవరూ ఇలా అడగలెదుకూడా."

"ఇప్పుడు నేనడిగానుకదా ! ఆలోచిస్తారా?"

"నాకు తెలిసినంతవరకూ, నా నక్షత్రం ప్రకారం నా పేరు 'అ' అక్షరంతో మొదలవ్వాలికాబట్టి 'అరుణ' అని పెట్టారు. మా నాన్నగారికి 'ప్రియ' అనే పేరు ఇష్టం. అందుకని రెంటినీ కలిపి...ఇలా."

"ఓ..బహుశా మీ నాన్నగారికి ఇష్టమైన బంధువులో లేక స్నేహితుల పేరేమో !"

"మా బంధువుల్లో ఆ పేరుగలవాళ్ళెవ్వరూ లేరు. మా నాన్నగారి స్నేహితులు..." అంటూ ఆగి ఒక్క క్షణం ఆలోచించి నావైపు కొంచెం కోపంగా చూసి "అంటే మీ ఉద్దేశం మానాన్నగారి స్నేహితురాలెవరైనా అనా ?" అని నిరసనగా అంది.

అనాలోచితంగా అడిగినా, నేనడిగిన ప్రశ్నలోని అంతర్లీన ఉద్దేశం అదేనేమో ! మన తల్లిదండ్రులకు పెళ్ళికి ముందుగానీ, పెళ్ళి తరువాతగానీ వారిదంటూ ఇక జీవితం వుండగలదని పిల్లలు అనుకోవడం సంస్కారహీనంగా అనిపిస్తుంది.కానీ వారు తల్లిదండ్రులకంటే ముందు వ్యక్తులని. 'వ్యక్తిగతం' వారి హక్కని మర్చిపోతాం.తనకి కోపంరావడం సహజమే అనిపించినా, నేనిలా అడగటం మాత్రం యధాలాపంగా జరిగిందంతే.

ఆ కోపం వర్షించే చూపులో నాకొక పరిచయమున్న కళ్ళు కనిపించాయి. అప్పటివరకూ ఈ సాయంత్రపు అరచీకటిలో తన దేహాన్ని గుర్తించానకానీ రూపాన్ని కాదు. కానీ ఇప్పుడా కళ్ళు...నన్ను ఆకర్షించే కళ్ళు, ప్రేమించేకళ్ళు, కాంక్షించదగిన కళ్ళు, ఎనాళ్ళుగానో తెలిసున్నకళ్ళు. ఆకళ్ళలో అంతటా నా మీద కోపం. త్వరగా సర్ధుకుని "నా ఉద్దేశం అది కాదు" అని చెబుదామనుకున్నాను. కానీ "మరి ఏ ఉద్దేశంతో అన్నారు?" అంటే నాదగ్గర సమాధానం లేదు.

తనే అంది "మీరెప్పుడూ ఇలాగే మాట్లాడుతారా?" అని.

"ఎప్పుడూ ఏమోగానీ, ఇప్పుడిలా జరిగిపోయిందంతే"

తను ఛివాలున లేచింది. వెళ్ళిపోయింది.
౦౦౦

మరుసటిరోజు హాస్టల్లో చేసిన ఉప్మాని తప్పించుకోవడానికి క్యాంటిన్లో పూరీని ఆశ్రయించాను. పూరీ తీసుకుని టేబుల్ పైన పెట్టి కుర్చీలో కూర్చున్నాను. ఎదురుగా "హలో" అంటూ తను. ఉదారంగు కాటన్ టై అండ్ డై సల్వార్ కమీజ్, దుపట్టాని దుప్పటిలాగా కప్పెయ్యకుండా కేవలం మెడను దాస్తూ వెనుకగా వేసుంది.తన మేని ఛాయలో కనీకనిపించకుండా కలిసిపోయిన ఒక సన్నటి బంగారు గొలుసు. ఆకర్షనీయమైన ముఖం. ప్రశ్నించే ముక్కు. ఎదిరించే నుదురు. చక్కటి గీసిన పెదవులు. అల్లరిపిల్లల్ని బలవంతంగా కట్టిపెట్టినట్లున్నా చిత్రమైన జుట్టుముడి. అవే కళ్ళు...'నా' కళ్ళు.

"హలో మీ హాస్టల్లోనూ ఉప్మాయేనా" అంటూ కూర్చోమన్నాను.

ఒక్క క్షణం సందేహంగా ముఖంపెట్టి, మళ్ళీ ఏదో తెలిసినట్లు నవ్వింది.

"లేదు ల్యాబ్ కెళ్తూ మిమ్మల్ని చూసి ఇటొచ్చాను"

"ఓహ్ ! నన్ను కలవడానికొచ్చారా?"

"ఏం రాకూడదా !"

"అలాగని కాదు. నిన్న మీరు కోపం,తో వెళ్ళిపోయేసరికీ మళ్ళీ కలిసే అదృష్తం లేదనుకున్నాను."

"అదృష్టమా !!!"


"నేనలాగే అనుకున్నాను."

మా నాన్నగారు రెండేళ్ళక్రితం చనిపోయారు. వారు నన్నెప్పుడూ 'ప్రియ' అనే పిలిచేవారు. నిన్న మీరు హఠాత్తుగా అలా మాట్లాడే సరికీ చాలా కోపమొచ్చింది. అక్కడే ఏడ్చేస్తానేమో అనిపించింది. అందుకే వెళ్ళిపోయాను.

"ఐయాం రియల్లీ సారీ. నేనేదో ఊహించుకుని కావలనే అడగలేదు."

ఆ తరువాత హాస్టల్ కెళ్ళిన తరువాత ఆలోచిస్తే నాకూ అలాగే అనిపించింది. అలాగే, మీరు సూచించిన "స్నేహితురాలి కోణం" ఒకవేళవున్నా, నాకు ఇబ్బందిగా అనిపించినా,అందులో తప్పేమిటనిపించింది."

"ఇబ్బంది అనిపించడం సహజం లెండి. తల్లిదండ్రుల్ని కేవలం వ్యక్తులుగా చూడటం అంత సులభం కాదు. అదీ ఇలాంటి విషయాలలో. పదాలకు అర్థాలున్నట్లే పేర్లకీ నక్షత్రాలు, కుటుంబ ఆకాంక్షలూ, అనుభవాలూ,ఆలోచనలతో కూడిన నేపధ్యాలుంటాయి. ఆ నేపధ్యాన్ని అర్థం చేసుకుంటే ఆ వ్యక్తి పరిచయం మరింత అర్థవంతం అవుతుందనే ఉద్దేశంతో అడిగాను అంతే "

"కానీ ఇలాంటి నేపధ్యం ఉండొచ్చనే ఆలోచనే..." అంది తనలోతానే మాట్లాడుకున్నట్లుగా.

నిన్న కేవలం మన సంభాషణ మొదలుపెట్టడానికి అలా అడిగాను. కానీ మొత్తం మన మాటలన్నీ దానిమీదే జరిగేట్టుగా వున్నాయే !"

అబ్బే అదేంకాదు లెండి. నేనిప్పుడు ల్యాబ్ కెళ్ళాలి. ఇంకోసారి కలిసినప్పుడు ఇంకేదైనాకూడా మాట్లాడొచ్చు"

"ఎప్పుడు?"

"ఎప్పుడైనా"


"ఈ రోజు సాయంత్రం !"

"సరే" అంటూ లేచింది. "బై" అంటూ ల్యాబ్ వైపుగా అడుగులు వేసింది.

పూరీ తినకుండానే నాకు కడుపునిండినట్లనిపించింది.

ooo

ఆ రోజు సాయంత్రం కలిసాం. కూర్చున్నాం. మాట్లాడాం. స్కూలు, కాలేజి, కుటుంబం, స్నేహితులు, రుచులు, అభిరుచులు, అభిలాషలు, ఆశయాలు, ఆలోచనలూ, ఆదర్శాలూ, అన్నీ... అన్నీ...మాట్లాడాం. భోజనానికి సమయం అయ్యిందన్న స్పృహ లేకుండా మాట్లాడాం. మేముతప్ప మిగతా ప్రపంచం లేదన్నట్లు మాట్లాడుకున్నాం. ఈ లోకంతో మాపనైపోయిందన్నట్లుగా, ఈ విశ్వాన్ని గెలిచామన్నట్లు, ఇన్నాళ్ళూ ఎవరితోనూ మాట్లాడనట్లు మాట్లాడుకున్నాం.

మాటలింకా పూర్తికాలేదుకానీ, చేతిలో వాచ్ మాత్రం రాత్రి 11 గంటలు చూపించింది. నేను వాచ్ చూడటం తను గమనించింది.

"చాలా లేటయ్యింది కదా !" అంది అపాలజిటిగ్గా.

"లేదు. చాలా త్వరగా సమయం గడిచిపోయింది"

తన కళ్ళలో మెరుపు. 'నా' కళ్ళలో మెరుపు. నాకళ్ళలోనూ మెరుపే ! సిగ్గుతో ఎరుపెక్కిన తన చెక్కిలి, వేడిగాలులు వెలువరిస్తున్న నా చెంపలు. ఇద్దరికీ ఏదో జరిగిందని అర్థమయ్యింది. కాకపోతే అదేమిటో పూర్తిగా తెలీదు. "ఇదే" అని ఖచ్చితంగా అసలు తెలీదు.

ప్రియని హాస్టల్లో వదిలాను. నా ఆలోచనల్ని మాత్రమే నావెంట తీసుకుని నేనూ హాస్టల్ వైపు కదిలాను. ఆ రాత్రి నాకు నిద్ర లేదు. తనకొచ్చిందని కూడా అనిపించలేదు. తెలవారుతుండగా వచ్చిన కొంత నిద్రనికూడా, ఈ రోజు ఎప్పుడు, ఎక్కడ కలుస్తామో నిర్ణయించుకోలేదనే ఆలోచన భంగం చేసింది.ఇంకా పొద్దున ఐదుగంటలవుతోంది. బయట ఇంకా చీకటిగానేవుంది. వెంఠనే తన హాస్టల్ కు ఫోన్ చేసాను.

"హలో ఎవరు కావాలి?" అని అటువైపునుంచీ ఒక పరిచితమైన గొంతు.

మెల్లగా "ప్రియ" అన్నాను.

అటువైపు నుంచీ ఒక్క క్షణం నిశ్శబ్దం. "హ్మ్ నేనే" అంది ప్రియ. అవును అది ప్రియ గొంతే. అంతే, "వస్తున్నాను" అని చెప్పి ఫోన్ పెట్టేసి బయల్దేరాను.

ఐదు నిమిషాల్లో తన ముందున్నాను. రాత్రంతా నిద్రపోని కళ్ళు కలిసాయి. అలసట, బడలిక, నిద్రలేమి అన్నీ..ఇప్పుడు లేవు.

మొదటిసారిగా ఇద్దరం అసంకల్పితంగా చేతిలో చెయ్యేసి నడిచాము. అప్పటివరకూ సన్నగా అనిపించిన రోడ్లు విశాలంగా కనిపించాయి. ఆకులురాలిన చెట్లు చిగురించినట్లనిపించింది.

మేమిద్దరం నడుచుకుంటూ యూనివర్సిటీ లోవున్న లేక్ (lake) చేరేసరికీ ప్రియ కళ్ళలో కన్నీరు. అప్పటివరకూ నా చేతిలోవున్న తనచెయ్యి మరింత బలంగా బిగుసుకుంది.

"హేయ్ ! ఏమయ్యింది?" అని మాత్రం అడగగలిగాను.

ప్రియ నావైపుచూస్తూ, "ఎలా చెప్పాలో తెలియటం లేదు. మా నాన్నగారు పోయిన తరువాత గత రెండు సంవత్సరాలుగా మా వదిన పెట్టిన బాధలన్నీ నిన్న మీతోమాట్లాడుతుండగా మర్చిపోయాను. నాకంటూ కొన్ని ఆలోచనలూ, ఆశలూ,ఆశయాలూ ఉన్నాయనే విషయమే నిన్నటివరకూ మర్చిపోయాను. మీతో వుంటే మళ్ళీ నాకు జీవించినట్లుంది. నాకంటూ ఒక అస్థిత్వం వున్నట్లనిపించింది. నన్ను నేను ప్రేమించుకోగలననే విశ్వాసం వచ్చింది" అంటూ అక్కడేవున్న ఒక పెద్ద బండరాతిపై కూర్చుంది.

ఇంకా తన చెయ్యి నా చేతిలోవుంది. బలంగా ఇంకా బలంగా అది నన్ను పట్టుకునే వుంది.

నా భుజం మీద తన తల. నా చొక్కాపై తన కన్నీళ్ళు. నా చెయ్యి తన చెక్కిళ్ళ తడిని తుడిచాయి. నా చెయ్యివదిలి తన చేయి నా భుజాన్ని సాయమడిగాయి.

మగాడు తన సాహసాన్ని, ఆడది తన కష్టాల్నీ చెప్పుకుంటేగానీ స్నేహం హద్దులుదాటి బంధాలు ఏర్పడవేమో ! ఇప్పుడదే జరిగింది. మా పరిచయంలో తను ఒక నమ్మకాన్ని చూసుకుంటే, నాకు తనపై కలిగిన ఇష్టం నామీద నాకే మరింత నమ్మకాన్ని కలిగించింది.

ఈ నమ్మకాలు కలిసిన సామీప్యంలో అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడి సాక్షిగా మేం ఏంచేసామో మాకు తెలుసు. కానీ ఏం జరిగిందో ఇద్దరికీ తెలీదు.

౦౦౦

"మనం తప్పు చేసామా?" అని అరమోడ్చిన కళ్ళతో నా కనుల్లోకి చూసి ప్రియ అడిగింది.

"నాకు మాత్రం అనిర్వచనీయమైన ఆనందానుభూతి కలిగింది" అని నిజాన్ని చెబితే, తను ఆశ్చర్యపడుతుందో ! అబ్బురపడుతుందో!! గర్వంతో నన్ను హత్తుకుంటుందో !!! తెలీదు.

తన నుదిటిపై చెయ్యి వేసి "మన 'చర్యకు' సామాజిక విలుని ఆపాదించగలమేగానీ, అనుభవానికి కాదు. ఈ అనుభవం అలౌకికమైతే ఈ చర్యకు సమాజం చేత ఆపాదించబడే 'విలువ'తో సంబంధం లేదు. నా వరకూ ఇది అసంకల్పితమైన, అనిర్వచనీయమైన, ప్రేమైకమైన, అందమైన అనుభవం. అందుకే మనం ఏం చేసామో తెలుసుగానీ, నిజంగా ఏంజరిగిందో చెప్పగలవా? మనం యాధృచ్చికంగా కలిసిన క్షణమే, ఇలా జరగాలనే నిర్ణయం జరిగిపోయింది. ఇప్పుడు కేవలం ఆ నిర్ణయం అమలయ్యిందంతే. అది 'తప్పు' అని నువ్వు భావిస్తే ఈ చర్యకేతప్ప అనుభవానికి విలువలేకుండా పోతుంది" అన్నాను.

ప్రియ నాకళ్ళలోకి అర్థమైనట్లు చూసింది.

కలయికే గమ్యంగా కొన్ని ప్రేమలు మొదలైతే, మరికొన్ని కలయిక తరువాత వైవిధ్యం నశించి నీరసిస్తాయి. కొన్నిప్రేమలు ఆకర్షణకోల్పోతే, మరికొన్ని కలయిక తరువాత కేవలం ‘బాధ్యతలుగా’ మిగిలిపోతాయి. కానీ... మా ప్రేమకథ అప్పుడే మొదలయ్యింది.

Saturday, September 13, 2008

బాంబు బ్లాస్టులకి అలవాటుపడదామా !

మళ్ళీ మరో టార్గెట్...ఈ సారి ఏకంగా రాజధాని ఢిల్లీ.



5 ప్రదేశాల్లో 7 బాంబులు పేలాయి...20 మందికి పైగా మరణిస్తే, 100 కిపైగా క్షతగాత్రులు..పేలడానికి సిద్దంగా వున్న మరో బాంబుని ఒక ప..దే..ళ్ళ చిన్న పిల్లవాడు కనుగొన్నాడు.


‘పోటా’ వుంటే ఈ ఘటన జరిగేది కాదని బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తుంది.
అసలు ‘గుజరాత్’ జరక్కుండా ఉంటే, ఇంత ప్రమాదకర స్థితి ఏర్పడేది కాదని కాంగ్రెస్ ఎత్తిపొడుస్తుంది.
కాశ్మీర్ సమస్య నాన్చకుండా తేల్చుంటే, టెర్రరిజం అసలుండేదికాదని బీజేపీ చరిత్ర తిరగదోడుతుంది.
ముస్లింలను భయభ్రాంతుల్ని చెయ్యకుండా ఉంటే, ఈ పరిస్థితి వుండేది కాదని కాంగ్రెస్ అంటుంది.
కాంగ్రెస్ కుహానా సెక్యులరిస్టు విధానాలవలన ఈ స్థితి దాపురించిందని బీజేపీ మళ్ళీ గుర్తుచేస్తుంది.


దేశాన్ని రక్షించలేని ఈ ప్రభుత్వం పాలనకు పనికిరాదని బీజేపీ రాబోయే ఎన్నికలకు తన వ్యూహం సిద్ధం చేస్తుంది.
మూలసమస్యల్ని తీర్చాలని కాంగ్రెస్ ముస్లింలను బుజ్జగించే మరిన్ని కార్యక్రమాలతో తమ ఎన్నిక ఖాయమయ్యేలా చూసుకుంటుంది.
వామపక్షాలు ఎప్పటిలాగే ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాన్నీ కసితీరా కడిగేసి..తమ నిబద్ధతను చాటుకుంటాయి.
మీడియాకు ఈ వారాంతరంలో బాంబుల పండుగ చేసుకుని నిరంతర వార్తల్ని కురిపిస్తాయి.


తెగిపడిన మానవ అవయవాలు... చచ్చిపడిన మృతదేహాలు...పేలిపోయిన పరిసరాలు...సొంత మనుషుల్ని కోల్పోయినవారి కన్నీళ్ళు మాత్రం ఆలాగే ఉంటాయి.
ఇంకో నగరంలో, మరోచోట బాంబుపేలుడికోసం మరిన్ని తయారవుతూ ఉంటాయి.
బాంబుబ్లాస్టులకి అలవాటుపడదామా !

****

Thursday, September 11, 2008

దేశాలకి నైతిక విలువలుంటాయా?

అమెరికా చేస్తున్న అన్యాయాల్ని ప్రపంచం మొత్తం నిరసిస్తున్న తరుణంలో జార్జ్ బుష్ ను అమెరికన్లు రెండో సారి విజయవంతంగా ఎన్నుకున్నారు. ఈ సమయంలో అమెరికాలో వున్న నా మిత్రుడికి నేనొక ఆవేదనాపూర్వకమైన మెయిల్ రాసాను.


స్థూలంగా, " ఈ రాక్షసుణ్ణి అమెరికన్లు మళ్ళీ ఎలా ఎన్నుకున్నారు?" అని ఆ వేగు సారాంశం.


దీనికి సమాధానంగా నామిత్రుడు, "ఒరే పిచ్చి భారతీయుడా ! ప్రపంచం ఏమైపోయినా అమెరికన్లకు పెద్ద తేడా రాదు. వారి అభివృద్ది, ఉన్నతి, క్షేమం వాళ్ళకు ముఖ్యం. జార్జ్ బుష్ ఈ సమయంలో వాటిని కాపాడేవాడుగా కనబడుతున్నాడు. ఆ ఒక్క కారణం చాలు అమెరికన్లు తనకి అనుకూలంగా ఓటెయ్యడానికి. అంతెందుకు, మనదేశంలో గుజరాత్ ని చూడు. మోడీ అంతమంది ముస్లింల చావుకు పరోక్షంగా మరియూ ప్రత్యక్షంగా కారణమని దేశం మొత్తం ఘోషిస్తున్నా మళ్ళీ అతన్ని గెలిపించలేదూ? కారణం...మోడీ నాయకత్వంలో హిందువుల రక్షణ, ఆర్థిక ప్రగతి జరుగుతాయనే నమ్మకం. మరి అక్కడ అక్కరకొచ్చిన "స్వార్థం" ఇక్కడ అమెరికన్లకుంటే వెధవలైపోతారా? " అని సమాధానం రాసాడు.


అప్పటినుండీ నా మనసులో ఒక ధర్మసందేహం మిగిలిపోయింది. అదే...దేశాలకి నైతిక విలువలుంటాయా? అని.


ఈ మధ్య బ్లాగుల్లో కొందరు "అమెరికా అసలు రంగు బయటపడింది" అని. "అమెరికా తన స్వార్థంకోసం భారతదేశంతో అణుఒప్పందం చేసుకుంటోంది" అని. ప్రపంచం బ్యాంకు, ఆయుధాల సరఫరా మొదలైన విధానాల ద్వారా ప్రపంచాన్ని తమ పాదాక్రాంతం చేసుకోవడానికి ఎత్తులు వేస్తోందని...చాలాచాలా ఆరోపణలూ, ఆవేదనలూ, కోపాలూ, ఖండనలు, ఆక్రోశాలూ వినిపించారు. ఈ నేపధ్యంలో మళ్ళీ ఆ ధర్మసందేహం నాలో మొదలయ్యింది. నిజంగా దేశాలకి నైతిక విలువలుంటాయా? అని.


"నైతికత" అనేది సాధారణంగా, వ్యక్తులకూ వారుంటున్న సమాజానికీ సంబంధించిన విషయం.సమాజాన్నిబట్టి కొన్ని హద్దుల్ని prescribe చేసి, వాటిప్రకారం నడుచుకున్న వ్యక్తుల్ని నైతిక నిబద్ధత కలిగినవారుగా గౌరవించి, వాటిని పాటించని వారిని అనైతికులుగా ముద్రవేసి వెలివేయడమో లేక ఖర్మకాలి భరించడమో ఈ సమాజం చేస్తుంది. ఇదే తర్కాన్ని దేశాలకి వర్తింపజెస్తే !!!


వ్యక్తి దేశమైతే...మరి సమాజం ఈ ప్రపంచమవ్వాలి. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలయ్యిందని నాకు అనిపిస్తుంది. సమాజం అనేది ఒక భౌతికవస్తువు కాదు. దానికి రంగు,రుచి,వాసన లేవు.కేవలం దాని ఉనికి చుట్టూవున్న "ఆ నలుగురి" ద్వారా వస్తుంది.అలాంటప్పుడు, ఈ ప్రపంచం ఒక సమాజం రూపంలో దేశాల నైతికతని నిర్ణయించగలదా అనేది ప్రశ్న.


చరిత్రని చూస్తే, ప్రపంచయుద్ధాల తరువాత ‘ఐక్యరాజ్యసమితి’ నిర్మాణం ఈ అవసరంకోసమే జరిగిందని నా నమ్మకం. మనమానవ సమాజంలో హద్దులు నిర్ణయించే అగ్రవర్ణా/వర్గాలలాగానే ఇక్కడా అగ్రరాజ్యాలు తమ జోరు కొనసాగించాయి. దీంతో, తమకు అనుకూలమైన సూత్రాలేతప్ప నిస్పక్షపాతమైన అభిప్రాయాలకు తావులేకుండా పోయింది.


ఈ నేపధ్యంలో, మారిన ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా దేశాల "అవసరాలే"తప్ప, "నైతికత" అప్రస్తుతమైపోయింది. అంటే నైతికతో సంబంధం లేకుండా, ఒక దేశం యొక్క అవసరాలు ఆ దేశ విధానాలని నిర్ణయిస్తాయన్నమాట. ఇదే ఇప్పుడు international studies కూ international diplomacy కి మూలమయ్యింది. అంటే, ఈ కాలంలో దేశాలకు valuesకన్నా policies ముఖ్యమన్నమాట. బహుశా అదే అమెరికాని ఈ ప్రపంచానికి మొగుడ్ని చేసికూర్చోబెట్టింది.


దీన్నిబట్టి చూస్తే, అణుఒప్పందానికి మోకాలడ్డిన చైనాపై మనకు కోపమున్నా, మనకు లాభసాటిగా వుంటుందిగనక వారితో వ్యాపారానికిమాత్రం "సై" అనాలి. కార్గిల్ లో పాకిస్తాన్ మనల్ని వెన్నుపోటు పొడిచినా, కలిసుంటేవచ్చే లాభాల్ని దృష్టిలో ఉంచుకుని శాంతి మంత్రం జపించాలి. అణుఒప్పందం వలన కొన్ని ఆంక్షలు వచ్చిపడినా, దానిలోని లాభాల్ని బేరీజుచేసి సర్ధుకుపోవాలి. సర్వశక్తివంతమైన అమెరికాకు కావల్సిన మితృడిగా మన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి.


మరి మనం అమెరికాని దుమ్మెత్తిపోయడానికి ఎప్పుడూ ఎందుకు సిద్ధంగా ఉంటాం? దీనికి నాకు తెలిసిన సమాధానం, సాధారణంగా మనం వ్యక్తిగత విలువలకోణంలోంచీ అమెరికాని బేరీజు చేసి, ఆ దేశం చేసేది "అనైతికం" అంటాం. అలా అంటున్నప్పుడు అసలు అమెరికన్లు తమ ప్రభుత్వాన్ని అనైతిక ప్రభుత్వం అనుకుంటారా లేదా అనే విషయానికి ప్రాధాన్యత ఇవ్వం. అంటే ఇక్కడ we are being self righteous అన్నమాట. మనకు అమెరికా అంటే కొంత ఈర్షకూడా అయ్యుండాలి. ఎందుకంటే, ప్రపంచాన్ని శాసించే ఆర్థిక, రాజకీయ బలిమి మనదగ్గర లేదుకాబట్టి, కనీసం మన దేశం నైతికంగా బలంగా వుందనుకుని ఆ అహాన్ని ప్రదర్శించడానికి ఇలా తెగడటం మనకు కొంత సంతృప్తి కలిగించొచ్చు. కానీ మన దేశ నైతికతకూడా ఒక రాజకీయ అవసరం అని గ్రహిస్తే ఈ గర్వంకూడా ఫటాపంచలవుతుందేమో !


మొత్తానికి నాకు తోచిందేమిటంటే, దేశాలకు తమ స్వార్థాలు, తమ దేశప్రజల అభివృద్ధి, క్షేమం ముఖ్యం దానికోసం బలవంతులైతే వారు ఏమైనా చేస్తారు. బలహీన దేశాలు ఆ బలాన్ని పెంపొందించుకోజూస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశాలకు నైతికవిలువలుండటం వర్తమానాన్ని problematic చేస్తాయి కాబట్టి, diplomatic గ్గా వాటిని పక్కనపెట్టి పబ్బంగడుపుకోవడమే సరైనది...అని.


చాలా అసంబద్ధంగా అనిపించినా, ఇందులో కాస్తయినా నిజముందనే నాకు అనిపించింది.


****

Wednesday, September 10, 2008

తమిళవాసనల “స-రో-జ”

* నా బ్లాగులో టపాలు సెంచరీ (100) దాటాయి.

ఈ మధ్యకాలంలో ప్రయోగాత్మక తమిళ చిత్రాలు తీస్తున్న దర్శకులలో ఒకరు ‘వెంకట్ ప్రభు’. ఇతడు ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు గంగై అమరన్ (ఇళయరాజా సోదరుడు) కుమారుడు. మొదటి సినిమా “చెన్నై 600028″ తో తన చిన్ననాటి మిత్రుడు ఎస్.పి.చరణ్ (ఎస్.పి.బాలసుబ్రమణ్యం కుమారుడు) నిర్మాతగా వ్యవహరించగా, దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ఒక విజయాన్ని సాధించాడు. స-రో-జ ఇతడి మలి చిత్రం.


ఈ చిత్రం యొక్క సమీక్ష నవతరంగం కోసం రాశాను చదవగలరు.






Monday, September 8, 2008

ప్రేమ కట్నా(ష్టా)లు

"ప్రేమ పెళ్ళిలోకూడా ఈ కట్నాలగొడవేమిటి?" ఆని అడిగితే,


"మా ప్రేమని పెద్దోళ్ళు అంగీకరించారు కాబట్టి, పెళ్ళికోసం వాళ్ళ ఆశల్నీ, ఆలోచనల్నీ, ఆశయాల్నీ అంగీకరించాలికదా !" అంటారు.


ఇదొక give and take మాత్రమే అన్నమాట. మన ప్రేమని సహృదయతతో అంగీకరించారు కాబట్టి, వారి చాదస్తాన్ని, కొండొకచో అత్యాశని మనం అంతే విశాలంగా అంగీకరించాలన్నమాట.
బాగుంది. ప్రేమ పెళ్ళిల్లలో కూడా ఈ కట్నాలు విజయవంతంగా వర్ధిల్లడానికి చాలా బలమైన కారణం. చాలా బాగుంది.



‘ఇష్టపడి ప్రేమిస్తే కట్నంలో కన్షెషన్ ఇస్తేఇవ్వొచ్చుగానీ, అసలు కట్నమే లేకపోతేమాత్రం సమాజంలో చాలా అవమానమైపోతుంది’ అనేది ఈ మధ్యకాలంలో కొడుకులున్న తల్లిదండ్రుల్లో పెరుగుతున్న ధోరణి. వేరే కులం పిల్లని ప్రేమించినా (అది వారికన్నా "ఎక్కువ" లేక "సమానమైన" కులమైతేనే) దాన్ని ఒప్పుకుని, progressive ఆలోచనలున్న తల్లిదండ్రులుగా మార్కులు కొట్టేయ్యచ్చు, "మావాడి ఆనందం కోసమండీ" అంటూ కూనిరాగాలు తీసి సోషియల్ స్టేటస్ పెంచుకోవచ్చు. కానీ కట్నం దాకా వచ్చేసరికీ ప్రేమ వివాహమైనా, కుదుర్చిన పెళ్ళైనా "దేనిదారి దానిదే !" అంటారు.



మగపిల్లాడ్నికన్న తరువాత, ఎంతో కొంత (సాధ్యమైనంత ఎక్కువే) కట్నంలేకుండా పెళ్ళిచేస్తే నలుగురిలో (?) అవమానం జరిగిపోతుందని కొందరు. సమాజంలో తాహతుకు చిహ్నంగా మాత్రమే కట్నం తీసుకుని అమ్మాయి పేరుమీదనే వేస్తామని కొందరు. "ఆ డబ్బులు మా పిల్ల భవిష్యత్తుకోసమేకదా !" అని మరి కొందరు. కట్నానికి అమూల్యమైన ప్రాతిపదికని అందించి ఈ విధానాన్ని తలకెక్కించుకుంటున్నారు. ఇక యువత "have a cake and eat it too" అన్నతరహాలో, నచ్చిన అమ్మాయి, తెచ్చిన కట్నం రెండూ బాధ్యతగా సాధించేసుకుని...తూచ్ !! మా కుటుంబ సాంప్రదాయమనో లేక తల్లిదండ్రుల సంతృప్తి అనో సర్దుకుపోతున్నారు.



ఇన్నాళ్ళూ ప్రేమ పెళ్ళిల్లవలనైనా కట్నాలు తగ్గుతాయనే ఒక పేరాశ ఉండేది. అదికాస్తా ఇప్పుడు హుష్ కాకి అయిపోయింది. కనీసం యువత ఈ కట్నాన్ని నిరసించి, ఇష్టమొచ్చిన పిల్లని స్వయంగా పెళ్ళిచేసుకునే రోజులొస్తాయనే ఆశ అడుగంటిపోతోంది.



మన వివాహవ్యవస్థ ఇంత బలమైనదో, సమాజంలోని ఆ ముఖాలుతెలియని నలుగురూ మన జీవితాల్ని అంత బలంగా శాసిస్తారో లేక మనుషుల్లో తేరగా వచ్చే డబ్బుపై వున్న ఆశ బలమైనదో తెలీదుగానీ, కట్నం అనే సాంప్రదాయం మాత్రం నిత్యనూతనంగా తన కొత్తరూపాల్ని ఎత్తుతూనే ఉంటుంది. పెద్దలు కుదిర్చిన పెళ్ళైనా ప్రేమ పెళ్ళిళ్ళకైనా ఇదిమాత్రం ప్రధమ తాంబూలం అందుకుంటూనే ఉంటుంది.



మన వివాహవ్యవస్థ జిందాబాద్ ! మెరుగైన సమాజం జిందాబాద్ !! సమాజం బాధ్యతని నెత్తినేసుకుని ఉద్దరించే ఆ నలుగురికీ జేజేలు !!! కట్నం పేరుతో extortion చేసే అందరికీ వందనాలు.



****

సత్యశోధన


మొన్నే తెలిసింది !
కానీ, ఈ రోజది లేదు.
సత్యం నిత్యమంటారు.
మరైతే మొన్నతెలిసింది ఈ రోజు మారిందే ?

తెలిసొచ్చిన సత్యమే ప్రమాణంగా
మిగతా నిజాల్ని కొలవాలనుకున్నాను.
సత్యమే సందేహాస్పదం అయ్యాక,
కొలవడానికి ఏమీ మిగల్లేదు !

సత్యం నిత్యం కాదనే నిజం
అనునిత్యం తెలుసుకోవడమే సత్యమా !
అయితే,
ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి
మనిషి పడే కష్టమెంత?
అడ్డుకుని మాయమాటలు చెప్పి
మోసగించే ఈ సమాజానికి
నిజంవల్ల కలిగే నష్టమెంత?

అద్దంలో ఓసారి చూసుకుని
నా సత్యాన్ని నేను వెతుక్కోవాలి.
ఎక్కడపోగొట్టుకున్నానో అక్కడే సాధించాలి.
అనుక్షణం శోధించాలి.

***

Sunday, September 7, 2008

అష్టా - చమ్మా : Its all about a name


నిన్నే "అష్టా- చెమ్మా" సినిమా చూసాను. ఈ మధ్యకాలంలో నేను చూసిన తెలుగు సినిమాలలో ఇదే బెస్ట్ అనిపించింది. నేను ఈ సినిమా చూసాక రాసిన సమీక్షని నవతరంగంలో చదివి మీ అభిప్రాయాల్ని తెలుపండి. సినిమా తప్పకుండా చూడండే !

మీమహేష్

Friday, September 5, 2008

టీచర్లు ఎంచేస్తారు?

ఒక బడాబాబుల పార్టీ భోజనాలదగ్గర, బఫే తింటూ భారతదేశ ప్రగతి గురించి చర్చలు జరుగుతున్నాయి.

ఇంతలో ఒక లోకం తెలిసిన కంపెనీ CEO "ఇంకేమీ చెయ్యడం చేతగాక, టీచర్లైనవాళ్ళ దగ్గర మన పిల్లలు చదువు ఎలా నేర్చుకుంటారో నాకైతే యమ సందేహంగా వుంది" అన్నాడు.

ఇంతలో మరో పెద్దమనిషి "నిజమేనండోయ్, అదేదో సామెత చెబుతారుకదా ! Those who can't DO, they TEACH అని" అంటూ పెద్దగా నవ్వేసాడు.

ఇద్దరూ కలిసి పక్కనే నిశ్శబ్దంగా వారి మాటలు వింటున్న అనిత అనే టీచర్ తో "అనిత టీచర్లు నిజంగా ఏం చేస్తారో చెప్పు" అని ఎద్దేవాచేసారు.

తను ఒక్క క్షణం మౌనం వహించి చెప్పడం ప్రారంభించింది.

"తన సొంత కష్టంతో ఎంత స్థాయిని చేరుకోగలడో తెలియని విధ్యార్థికి తన సామర్ధ్యాన్ని తెలియజెప్పడం టీచర్ చేసే పని."

"విద్యార్థి కష్టంతో సంపాదించిన పది మార్కుల్నికూడా ‘పద్మశ్రీ’ బిరుదంత అపురూపంగా అనిపించేలా చెయ్యగలిగేదే టీచర్"

"తల్లిదండ్రులు టీవీ లతో, ప్లేస్టేషన్లతో, ఐ-పాడ్ ల వంటి ఆకర్షణలతోకూడా కనీసం ఐదునిమిషాలుకూడా కుదురుగా కూర్చోబెట్టలేని విధ్యార్థిని నలభై నిముషాలసేపు తమ విద్యతో కూర్చోబెట్టేదే టీచర్."

"నేను టీచర్ గా ఏంచేస్తానో తెలుసా....

పిల్లల్ని ఆలోచింపజేస్తాను, అబ్బురపడేలా చేస్తాను, ప్రశ్నించేలా చేస్తాను. వారి చర్యలకు వారిని బాధ్యులుగా చేస్తాను. బాధ్యతల్ని సంతోషంగా భుజాలకెత్తుకునే పౌరుల్ని చేస్తాను.

వారిలోవున్న గ్రహణ శక్తిని, ఆలోచనా ప్రవాహాన్ని, అనుభవాల్నీ జీవితానికి అన్వయించుకుని పరిపూర్ణులుగా తయారయ్యేలా చూస్తాను.

అలా తయారైన నా విధ్యార్థులు జీవితంలో వున్నత శిఖరాల్ని చేరడానికి నేను పునాదినౌతాను. నా విద్యార్థుల్లోనే కొందరు మీలా CEOలవుతారు. ఇంకొకరిలా వ్యాపారస్తులవుతారు.

టీచర్లు మాత్రం ఈ చిన్నచిన్న పనుల్నే జీవితాంతం చేస్తారు." అని ముగించింది.

ఇద్దరినోట్లోంచీ మరో మాటకూడా రాకుండా పార్టీ ముగిసింది.

****

అందరికీ ‘టీచర్స్ డే’ శుభాకాంక్షలు


* నేను ఇంగ్లీషులో చదివిన ఒక ఘటన ఆధారంగా

Thursday, September 4, 2008

నా బ్లాగు 10,000 సందర్శకులు దాటింది.


ఇప్పుడే C.B.రావు గారు తమ టపాలో ‘నా ప్రపంచం’ బ్లాగు పదివేల క్లిక్కుల మాట చూసి, ఇంతకూ నా బ్లాగుకి ఎంతమందొచ్చారో చూద్దామని వచ్చాను. ఆశ్చర్యంగా నా బ్లాగు సందర్శకుల సంఖ్య పదివేలు దాటి ఇప్పుడు పదకొండు వేల దిశగా పరుగులెడుతోంది. ఈ సందర్భంలో ఆశ్చర్యంతొపాటూ బోలెడంత ఆనందంగానూ ఉంది.


ఈ సందర్భంగా నా బ్లాగు సందర్శకులకూ, వ్యాఖ్యాతలకూ, విమర్శకులకూ, అభిమానులకూ, నా బ్లాగు అస్సలు నచ్చనివారికీ, కొంచెంగా మాత్రం నచ్చేవారికీ అందరికీ నా కృతజ్ఞతలు.


***

Wednesday, September 3, 2008

ఆవిరైన ఆ క్షణం


ఆ క్షణంలో...
నమ్మిన నిజాలు
నగ్నంగా నిలబడతాయి
అర్జించిన ఆలోచనలు
అర్థరహితంగా మిగుల్తాయి
అమూల్యమన్న ఆదర్శాలు
ఆనవాలు లేకుండాపోతాయి
పవిత్రమనుకున్న విలువలు
పటాపంచలవుతాయి
నెత్తికెత్తుకున్న నియమాలు
నామరూపాల్లేకుండాపోతాయి



ఆ క్షణం ఎదురైన ప్రతిసారీ
ఎవరూ మిగలరు
ఏమీ మిగలవు
అన్నీ అంతర్ధానమైపోతాయి
గర్వం, వ్యక్తిత్వం
నమ్మకం, ఆదర్శం
అన్నీ...అన్నీ
ఆ క్షణం వేడికి
ఆవిరై ఆనవాలు లేకుండాపోతాయి



ఆ అద్భుతం ప్రతి క్షణం జరుగుతుంది
ఆ ఆవిర్లు అనుక్షణం మనచుట్టూ ఆవరిస్తాయి
ఆవిరి పరదామాటున
ఒక కొత్తలోకం ఆవిష్కరింపబడుతుంది
మళ్ళీ ఆక్షణం మనముందు సాక్షాత్కరిస్తుంది
ఆ క్షణంలో...

Tuesday, September 2, 2008

వ్యాపారాల్లో లోకలైజేషన్ (స్థానికీకరణ) - గ్లోబలైజేషన్


ఈ మధ్య మొదటిసారిగా నా మిత్రుడు తీసుకెళ్తే ఐమ్యాక్స్ లోని మెక్ డొనాల్డ్ రెస్టారెంటుకివెళ్ళాను. నాకు పిజ్జాలూ బర్గర్లు లాంటివి పెద్దగా పడవుగానీ, ఈ మెక్ డొనాల్డ్స్ లోకి అడుగుపెట్టగానే నన్ను ఆకర్షించింది ఒక మూలన అద్దంపై తెలుగులో ఏదో పేపర్ కట్టింగులతో కొలాజ్ లాగా అంటించబడిన పోస్టరు. పైనవున్న ఫోటో అక్కడిదే.



కరువు, అధికధరలు, ద్రవ్యోల్బణం నేపధ్యంలో వారు తక్కువ ధరకే అందిస్తున్న హ్యాపీ ప్రైజ్ మెన్యూ గురించినవారి అడ్వర్టైజ్మెంట్, ఈ గ్లోబల్ ఫుడ్ చైన్ వారి effective స్థానికీకరణకు చిహ్నంగా అనిపించింది. ఈ మధ్యకాలంలో కొన్ని భారతీయ బ్రాండ్లు తమ ప్రకటనల్లో తెల్లతోలు ముఖాలూ, పాశ్చాత్య పోకడలూపోతుంటే, ఈ అమెరికన్ వ్యాపారస్తులు మాత్రం స్థానిక సమస్యల్ని తమ ప్రకటనల్లో సృజనాత్మకంగా వాడటం చాలా ఆసక్తికరంగా అనిపించింది.



ఇదే విషయాన్ని వుపయోగించుకుంటూ ‘బిగ్ బజార్’ వారుకూడా ఆగస్టు నెలలో ఒక మెగా సేల్ పెట్టారు కూడా. కాకపోతే పాంటలూన్ (pantaloons) సంస్థకు కూడా అధిపతులైన వీరు (ఈ రెండు వ్యాపారాలూ ‘బియానీ’ కుటుంబానికి చెందినవి) తమ బట్టలను అమ్మటానికి గ్లోబలైజేషన్ పంధానివుపయోగిస్తే, బిగ్ బజార్ లో నిత్యావసర వస్తువుల్ని అమ్మడానికి లోకలైజేషన్ విధానాన్ని అందిపుచ్చుకోవడం గమనించదగిన విషయం. అంటే మన భారతీయులు aspirational బట్టలు కట్టుకోవడానికి ప్రాధాన్యతనిస్తే, ఖర్చుతగ్గే నిత్యావసరవస్తువుల కొనుగోలుకి ప్రాధాన్యతనిస్తామన్నమాట. ఇలాంటి ప్రకటనలు చూసి విశ్లేషిస్తే నిజానికి మనకన్నా, ఈ వ్యాపారస్తులు మన మనస్తత్వాల్ని బాగా అర్థం చేసుకున్నారా అనిపించక మానదు.



కొన్ని బ్రాండ్స్ అసలు మన దేశానికి చెందినవేనా అనిపించేలా వుంటే, మరికొన్ని ఖచ్చితంగా విదేశాలవే అనిపించేలా చేస్తారు. ఉదాహరణకు చెప్పులూ, షూలూ అమ్మే ‘బాటా’(Bata) కంపెనీ ఐదు సంవత్సరాల క్రితంవరకూ మనదేశానికి సంబంధిందే అనుకున్నాను. మొన్నటివరకూ ‘వుడ్ ల్యాండ్’ (woodland) విదేశీ కంపెనీ అనుకున్నాను. కానీ అది ఢిల్లీకి చెందిందని ఈ మధ్యనే తెలిసింది. అలాగే ‘పీటర్ ఇంగ్లండ్’ (Peter England) షర్టులు మన హైదరాబాద్ కు చెందిన కంపెనీ బ్రాండని మనలో ఎంతమందికి తెలుసు?



ఈ మధ్య ‘బిగ్ బజార్’ అధిపతి ‘కిశోర్ బియానీ’ తన ఆత్మకథలో, భారతీయులకు ఏదైనా వస్తువును అమ్మటానికి గల మూల సూత్రాన్ని"We should change the rules not the values" అని వివరించారట. దీనికి ఉదాహరణగా చెబుతూ, "తాము కొనే బియ్యాన్ని చేతితోపట్టి చూస్తేగానీ భారతీయ కొనుగోలుదారునికి సంతృప్తివుండదు. అలాంటిది కేవలం ప్లాస్టిక్ ప్యాకెట్లలో బియ్యాన్ని పెడితే కొనేవాళ్ళు తక్కువగావుంటారు. అందుకే, మా బిగ్ బజార్లో డ్రమ్ముల్లో విడి బియ్యం చూసేందుకు పెట్టి, వాటినే ప్యాకెట్లుగా కొనడానికికూడా సిద్దంగా వుంచుతాం. ఒక వేళ ఎవరైనా డ్రమ్ముల్లోదే కొనాలనుకుంటే ఆ సౌలభ్యంకూడా కల్పిస్తాం" అన్నారట.



నిజమే, మనకు సాంప్రదాయబద్ధంగా అమరిన కొన్ని విలువలూ, అలవాట్లూ అలాగేవుంటాయి. పిజ్జా ఆవకాయ పచ్చడితోతిన్నట్లు, మన పంధాలు మారినా విలువలు,అలవాట్లూ మాత్రం అంత ఈజీగా మారవు. ఇంతగా మనల్ని మనకన్నాబాగా అర్థం చేసుకుంటున్నారు కాబట్టే, మనచేత వారి వస్తువుల్ని కొనిపించడానికి ఇంత బాగా సిద్దం చెయ్యగలుగుతున్నారు. సోపు కొందామని బిగ్ బజారుకి వెళ్ళి, మొత్తం నెలసరి సామాన్లతో తిరిగొచ్చిన మీ పక్కింటివాళ్ళనో లేక ఇలా కనీసం ఒకసారైనా చేసిన మిమ్మల్నో ప్రశ్నిస్తే ఈ మార్కెటింగ్ మహత్యాలు తెలిసివస్తాయి.



మధ్యతరగతిలో కొనుగోలు శక్తి పెరుగుతున్న ఈ తరుణంలో ఈ గ్లోబలైజేషన్లో లోకలైజేషనూ, లోకలైజేషన్లో గ్లోబలైజేషనూ తప్పవు మనకి. మార్కెట్ దేవతకీజై ! జై !!


****