Monday, September 29, 2008

రొమాంటిక్ ప్రేమంటే ?

సాధారణంగా భారీ విషయాలు మాత్రమే రాసే చివుకుల కృష్ణమోహన్ గారు తన బ్లాగు 'సిరివెన్నెల' లో ఈ మధ్య ప్రేమలోని భారీతనాన్ని గుర్తించి, "ప్రేమంటె ఏమిటంటే..ప్రేమించగానె నాకు తెలిసె...2" అని ఒక టపా రాసేసారు. అక్కడ నేనొక వ్యాఖ్య చేసినతరువాత, నాకూ నిజంగానే సందేహమొచ్చింది. తల్లిదండ్రుల ప్రేమలు, సోదర/సోదరి ప్రేమలు, స్నేహితుల ప్రేమలు, బంధువుల ప్రేమలూ ఇంకా మాట్లాడితే అన్నింటినీ,అందరినీ ప్రేమించే విశ్వజనీయమైన ప్రేమమీద ఎవరికీ నిర్వచనపరమైన అభ్యంతరాలు ఉండవుగానీ...రొమాంటిక్ ప్రేమలకొచ్చే సరికీ ఎడతెగని సమస్యలొచ్చిపడతాయెందుకా? అని.


ఈ రొమాంటిక్ ప్రేమల్లో భావనాపరమైన లేక లక్షణ పరమైన చిహ్నాలు కనబడ్తాయేతప్ప, నిర్వచనకు ఆధారం కాదగిన కూలంకషమైన అవగాహనలు ఎవరికీ కనబడవు. అంటే, "గాల్లో తేలిపోతున్నట్టుంది", "అంతులేని ఆనందంగా ఉంది", "ఆకలి వెయ్యటం లేదు", "ప్రపంచం మొత్తంలో మా అంత అధృష్టవంతులు లేరు" వంటి భావనలో లేక వివరణలో,వర్ణనలో మనకు ప్రేమికుల దగ్గర లభిస్తాయేతప్ప, తర్కామోదయోగ్యమైన ఆధారాలు లభించవు. ఈ కారణంగా ‘ప్రేమపిచ్చి పట్టింది’ అనుకుంటామేగానీ, మనదగ్గరున్న తులనా సామాగ్రితో దాన్ని నిర్వచించే సాహసం చెయ్యలేం. పైపెచ్చు, ఈ పైత్యం ‘పుర్రెకోబుద్ది జిహ్వకో రుచి’ టైపులో జంటకో ప్రేమప్రకోపంగా అనిపిస్తాయిగనక, ఒకవేళ నిర్వచించినా, దానిని స్థాయీకరించడానికి అసలు ఆస్కారం లేదు. అందుకే అది "అనిర్వచనీయం" అయిపోయిందేమో!


ఈ నేధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం "రొమాంటిక్ ప్రేమ" అనే పదాల్ని విడదీసి వ్యావహారిక,సాంకేతిక, సాహిత్యక అర్థాల్ని బేరీజు చేసి, నిర్వచించకపోయినా కనీసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దామని ఈ టపా.


నిజానికి "రొమాంటిక్" అన్నపదాన్ని మనం అలవొకగా వాడేస్తాంగానీ, దానికి సమానార్థకమైన తెలుగుపదం వెదకాలంటేనే నాకు కొంత సమయం పట్టింది. ‘శృంగారం’,‘సరసం’ అనేపదాల్ని క్రియావాచక సమానార్థాలుగా వాడగలిగినా,మొత్తం భావాన్ని తెలియజెప్పడానికి సరిపోయే పదం దొరకడం లేదు. కాస్త స్వతంత్రించి మనం అప్పుడప్పుడూ ప్రేమను వ్యక్తపరిచే విధానాన్నికూడా రొమాంటిక్ అనేస్తున్నాం. కాబట్టి ఈ పదానికి అసలు సిసలు,ఖచ్చితమైన తెలుగు పదం లేదేమో అనిపిస్తోంది.


ఇక ఆంగ్లపదాన్ని తీసుకున్నా అర్థాలు కొంచెం గందరగోళంగానే ఉన్నాయి. చాలావరకూ ఈ రొమాంటిక్ అనే పదం "రొమాంటిసిజం" (romanticism) అనే ఒక భావజాలం నుంచీ పుట్టినట్టుగానో లేక రొమాంటిక్/రొమాంస్ అనే పదంనుంచీ ఈ భావజాలం ఉదయించినట్లుగానో చెబుతారు. అంటే ఇక్కడ ..."కుడిఎడమైతే పొరబాటు... కాదు!" అనుకోవాలన్నమాట. ఏదిఏమైనా, ఈ భావజాలం 18వశతాబ్దపు యూరప్ లో ఒక ఆలోచనాత్మక మరియూ సాహితీ ఉద్యమంగా మొదలయ్యిందని ఆధారాలు చెబుతున్నాయి. ఆసక్తికరంగా, ఈ "ఇజం" అప్పటి పారిశ్రామిక విప్లవం వలన ఏర్పడిన భావశూన్యతకు విరుద్దంగా ప్రకృతిని, సున్నితమైన మానవభాలనూ ప్రతిఫలించే అవసరాన్ని గుర్తించి మొదలయ్యింది. అంటే, దీని ఆరంభమే "పనికిరాని పనుల్లో మునిగితేలే రొమాంటిక్ ఫూల్స్" అని సభ్యసమాజం మె/నొచ్చుకునేవారికి సంబంధించిన తంతన్నమాట. కాకపోతే, ఈ పనికిరానిభావజాలమే ఆతరువాత కాలంలో ఫ్రెంచ్ విప్లవానికీ తద్వారా ఆధునిక ప్రజాస్వామ్య పోకడలకీ జన్మనిచ్చిందనుకోండి. అదివేరే విషయం.


బహుశా అందుకేనేమో కేవలం డిక్షనరీ అర్థాల్ని తీసుకున్నా, మన సమస్య తీరదు. "a soulful or amorous idealist", "not sensible about practical matters; unrealistic", "expressive of or exciting sexual love or romance" అంటూ పొంతనలేని అర్థాలే గోచరిస్తాయి. ఇక మనం తెలుగులో ఈ పదాన్ని విరివిగా ఎక్కడబడితే అక్కడ ఉపయోగించేస్తాంకాబట్టి సమాంతరాలు వెదకడం వృధాప్రయాసే!


ఇక్కడ "ప్రేమ" అనే పదానికి ఒకమ్మాయి- అబ్బాయి లేక ఆడా-మగా మధ్యవున్న సంబంధంగా పరిగణిస్తున్నాం, అందుకే మిగతా ప్రేమల గురించి ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక ఈ ప్రేమ అర్థాన్ని "అనిర్వచనీయం" అనేసుకున్నాం కాబట్టి భాషాపరమైన గొడవల్లోకి దిగకుండా కొంత సాంకేతికపరమైన లేక శాస్త్రీయ పరమైన వివరాల్లోకి ప్రవేశిద్దాం. When you reduce things to basics, they look simpler అంటారు. అందుకే ఈ అర్థంకాని భావం వలన కలిగే మానసిక మార్పులకు మూలమైన శారీరక కారణాలను తెలుసుకుని ఒక simplified అర్థం కొరకు ప్రయత్నిద్దాం.


న్యూరో బయాలజిస్టు (Neuro-biologist)ల సిద్దాంతం ప్రకారం, ఇలాంటి ప్రేమల్లో ఇరువురి సాంగత్యం ప్రభావంతో, శరిరంలో విడుదలయ్యే ఫెనీలిథల్మైన్ (phenylethlamine) అనే ఒక కెమికల్ మూలంగా ఈ "అనిర్వచనీయమైన అనుభూతులు" కలుగుతాయట. ఇంకో చిత్రమేమంటే, రోగాలకు మన శరీరం రెసిస్టెంస్ లేక ఇమ్మ్యూనిటీ పెంచుకున్నట్లే దాదాపు 4 సంవత్సరాల కాలంలో క్రమక్రమంగా ఈ "రోగం"కూడా చాలావరకూ తగ్గిపోతుందట. అంటే,యాదృచ్చిక ప్రేమల్లోనూ, పవిత్రప్రేమల్లో కూడా ఈ ఎఫెక్టు నాలుగు సంవత్సరాలే ఉంటుంది.పెద్ద తేడా లేదు. బహుశా అందుకేనేమో, ప్రేమించి పెళ్ళి చేసుకున్నా, పెళ్ళి చేసుకుని ప్రేమించినా నాలుగు సంవత్సరాలలో "మోజు" తీరి, మామూలుగా అయిపోతారు. విఫలప్రేమికులుకూడా, ఒక నాలుగు సంవత్సరాలు గడిస్తే ఎంచక్కా పాత ప్రేమల్ని మరిచి తమ జీవితాలు హాయిగా వెళ్ళబుచ్చుతారు.


ఇంత పచ్చిగా రొమాంటికి ప్రేమల్ని అర్థం చేసుకుంటే ఈ ప్రేమకథలూ, సినిమాలు, ప్రేమికులూ సిల్లీగా అనిపిస్తాయేమో! కానీ ఎంత చెప్పుకున్నా, మన బోరుకొట్టే జీవితాలకు escape from reality చాలా ముఖ్యం. ఇంకాచెప్పాలంటే, అర్థంకన్నా, కారణంకన్నా, విలువలకన్నా మన అనుభూతులూ మనకు ముఖ్యంకాబట్టి...జయహో రొమాంటిక్ ప్రేమ...రొమాంటిక్ ప్రేమ వర్థిల్లాలి...ప్రేమ జిందాబాద్...రొమాంస్ జీవితంలో ఉండాలి.


****

8 comments:

A Romantic Soul said...

మహేష్‌గారూ,

మీకు పూర్తిగా తెలియని ఈ "అట" విషయాలగురించి మాట్లాడి తప్పుడు కంక్లూషన్లకొచ్చేయకండి. బహుశా ఆ కెమికల్ వల్ల అనిర్వచనీయమైన అనుభూతులు కలగడం లేదేమో; అనిర్వచనీయమైన అనుభూతుల ఫలితంగా ఆ కెమికల్ విడులౌతుందేమో. ఏదీ సత్యం కాదండీ. మీరు పచ్చిగా అర్థం చేసుకోలేదు; విషయాన్ని వేరే కోణంలోంచి చూస్తున్నారంతే. It doesn't prove anything against romanticism—incidentally I hate that name (I mean the categorization). నేను పుట్టినప్పట్నించీ ఈ రోగంతో భాధపడుతున్నాను; ఇంకా తగ్గలేదు. ఇకముందు తగ్గుతుందన్న ఆశా లేదు. రిసీవింగ్ ఎండ్లో వ్యక్తులు మారొచ్చు తప్ప నా ప్రేమ తీరు మారడం లేదు.

Romance is not an escape from reality; it's altogether an another form of reality. మీరు రియాలిటీ అంటున్నదాంట్లో ఎంత వాస్తవికత ఉందో, మీరు "రోగం" అంటున్నదాంట్లో అంతే వాస్తవికత ఉంటుంది.

ప్రేమకు "రోగం", "మోజు" ఇలాంటి రెచ్చగొట్టే నామాంతరాల్ని వాడటం ఎందుకు? వాటిని కోట్స్‌లో పెట్టటమే చెప్తోంది మీరు రెచ్చగొట్టాలనుకుంటున్నారని. ఇది మీ బ్లాగు మీ ఇష్టం. కానీ కొన్ని కొంతమందిని భాధపెడతాయి. కాస్త కసి తగ్గించుకుని రాయండి. మరొకటి: మీరు నమ్మే విషయాల్నే రాయండి. వాదనల కోసం ఏమీ రాయకండి. ఎందుకంటే, మీరీ టాపిక్ ఎత్తుకోవడమే మీరో "రొమాంటిక్" అని చెప్తుంది.

Anonymous said...

Mr. Mahesh,

I am sorry to hurt you, but telling you the true, feeling bore by reading these kind of posts like Romantc, Chivalry. If I am not wrong these kind of feelings of behavour depends on individual person. I am not understing why you are more posts prompting on these issues.

కత్తి మహేష్ కుమార్ said...

@A Romantic Soul: నేనూ రొమాంటిక్కే! అందుకే నా ముక్తాయింపులో విలువలకూ,ఇజాలకూ,బంధాలకూ నిమిత్తంకాని ఈ అనుభూతి ప్రాముఖ్యతని చెప్పడానికి ప్రయత్నించాను.

కోట్స్ లో పెట్టడానికి కారణం రెచ్చగొట్టాలని కాదు .ఆల్రెడీ రెచ్చిపోయిన కొందరికి మళ్ళీ గుర్తు చెయ్యాలనే.వాటికి కొన్ని రెఫరెన్సులున్నాయి లెండి. నా బ్లాగు రెగ్యులర్గా చదివేవాళ్ళకి అర్థమవుతాయి.

నాకు తెలిసిన చాలాకొద్ది సమాచారంతో నేను కొంత ఆలోచించడానికి ప్రయత్నించాను. అంతేతప్ప కంక్లూషనుకు రాలేదు.

@అనానిమస్: నేను టపా విషయాలు "ఎంచుకుని" రాయను. ఎప్పుడు ఏది అనిపిస్తే అది రాస్తాను. ప్రతి టపా రాయటానికి కారణమో, ప్రేరణో, అసహనమో,ఆలోచనో,ఆవేదనో,ఆనందమో ఇలా ఎన్నో కారణాలుంటాయి.Its all about that point in time.

బొల్లోజు బాబా said...

భలే పోష్టు. దీనిగురించే కొద్దిరోజులుగా ఆలోచిస్తున్నాను. దానిలో కొద్ది భాగం.ఎన్ని రోజులు కలిపి మండించినా
ఎన్ని రోజాల్ని కలిసి పండించినా
నువ్వు నువ్వే, నేను నేనే.
నేనే నువ్వు అనుకోవటం
నువ్వే నేను అనుకోవటమంత మాయ.

అయినా సరే
లోకం దృష్టిలో మనిద్దరిదీ
ఎప్పటికీ అన్యోన్యదాంపత్యమే.
బహుసా ఇదే నాకామెంటేమో.

బొల్లోజు బాబా

అబ్రకదబ్ర said...

కొన్నిటిని తర్కవితర్కాలతో తలబాదుకోకుండా కేవలం అనుభవించటం మంచిదేమో. ఈ రొమాంటిక్ రోగమో, మోజో, మరోటో అంటిన వాళ్లవి యమయాతనల్లాగున్నాయి చూడబోతుంటే. అంటని వాళ్లపనే హాయిలాగుంది. విశేషమేమిటంటే, ఈ రోగపీడితులు రోగం లేనివాళ్లని వింతజీవుల్లా చూడటం! వీళ్ల దృష్టిలో వాళ్లు రాళ్లూ రప్పలూ!!

కొత్త పాళీ said...

I think it was psychologist Erich Fromm who wrote a very nice book on love .. in all its forms. Worth reading

చివుకుల కృష్ణమోహన్‌ said...

మీ టపాలో ఉటంకించబడ్డానంటే కొంచెం గర్వంగా ఉన్నప్పటికీ, కొన్ని సందేహాలు పట్టి పీడిస్తూనే ఉన్నాయి.
1. భారీ అంటే ఏమిటో? మహా భారీ మనుష్యులు మీకంటానా? అయినా ఇవ్వడం మీ దయ. తీసుకునేది మా ప్రాప్తం. అందులో పెద్ద ఇబ్బందేమీ లేదు.
2. "ఈ మధ్య ప్రేమలోని భారీతనాన్ని గుర్తించి" - ఇక్కడే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈ మధ్య ప్రేమలోని భారీతనాన్ని నేను గుర్తించానని మీకెలా తెలిసిందో? సర్వజ్ఞులు, మీకు ఎలాగైనా తెలియచ్చనుకోండి - కాకపోతే "ఈ మధ్యే తెలియడం" ఏమిటో నాకే ఇంకా అర్థం కావడంలేదు.

సుజాత said...

కృష్ణమోహన్ గారు,
మీరు భలే చతురులు సుమా!