Thursday, September 11, 2008

దేశాలకి నైతిక విలువలుంటాయా?

అమెరికా చేస్తున్న అన్యాయాల్ని ప్రపంచం మొత్తం నిరసిస్తున్న తరుణంలో జార్జ్ బుష్ ను అమెరికన్లు రెండో సారి విజయవంతంగా ఎన్నుకున్నారు. ఈ సమయంలో అమెరికాలో వున్న నా మిత్రుడికి నేనొక ఆవేదనాపూర్వకమైన మెయిల్ రాసాను.


స్థూలంగా, " ఈ రాక్షసుణ్ణి అమెరికన్లు మళ్ళీ ఎలా ఎన్నుకున్నారు?" అని ఆ వేగు సారాంశం.


దీనికి సమాధానంగా నామిత్రుడు, "ఒరే పిచ్చి భారతీయుడా ! ప్రపంచం ఏమైపోయినా అమెరికన్లకు పెద్ద తేడా రాదు. వారి అభివృద్ది, ఉన్నతి, క్షేమం వాళ్ళకు ముఖ్యం. జార్జ్ బుష్ ఈ సమయంలో వాటిని కాపాడేవాడుగా కనబడుతున్నాడు. ఆ ఒక్క కారణం చాలు అమెరికన్లు తనకి అనుకూలంగా ఓటెయ్యడానికి. అంతెందుకు, మనదేశంలో గుజరాత్ ని చూడు. మోడీ అంతమంది ముస్లింల చావుకు పరోక్షంగా మరియూ ప్రత్యక్షంగా కారణమని దేశం మొత్తం ఘోషిస్తున్నా మళ్ళీ అతన్ని గెలిపించలేదూ? కారణం...మోడీ నాయకత్వంలో హిందువుల రక్షణ, ఆర్థిక ప్రగతి జరుగుతాయనే నమ్మకం. మరి అక్కడ అక్కరకొచ్చిన "స్వార్థం" ఇక్కడ అమెరికన్లకుంటే వెధవలైపోతారా? " అని సమాధానం రాసాడు.


అప్పటినుండీ నా మనసులో ఒక ధర్మసందేహం మిగిలిపోయింది. అదే...దేశాలకి నైతిక విలువలుంటాయా? అని.


ఈ మధ్య బ్లాగుల్లో కొందరు "అమెరికా అసలు రంగు బయటపడింది" అని. "అమెరికా తన స్వార్థంకోసం భారతదేశంతో అణుఒప్పందం చేసుకుంటోంది" అని. ప్రపంచం బ్యాంకు, ఆయుధాల సరఫరా మొదలైన విధానాల ద్వారా ప్రపంచాన్ని తమ పాదాక్రాంతం చేసుకోవడానికి ఎత్తులు వేస్తోందని...చాలాచాలా ఆరోపణలూ, ఆవేదనలూ, కోపాలూ, ఖండనలు, ఆక్రోశాలూ వినిపించారు. ఈ నేపధ్యంలో మళ్ళీ ఆ ధర్మసందేహం నాలో మొదలయ్యింది. నిజంగా దేశాలకి నైతిక విలువలుంటాయా? అని.


"నైతికత" అనేది సాధారణంగా, వ్యక్తులకూ వారుంటున్న సమాజానికీ సంబంధించిన విషయం.సమాజాన్నిబట్టి కొన్ని హద్దుల్ని prescribe చేసి, వాటిప్రకారం నడుచుకున్న వ్యక్తుల్ని నైతిక నిబద్ధత కలిగినవారుగా గౌరవించి, వాటిని పాటించని వారిని అనైతికులుగా ముద్రవేసి వెలివేయడమో లేక ఖర్మకాలి భరించడమో ఈ సమాజం చేస్తుంది. ఇదే తర్కాన్ని దేశాలకి వర్తింపజెస్తే !!!


వ్యక్తి దేశమైతే...మరి సమాజం ఈ ప్రపంచమవ్వాలి. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలయ్యిందని నాకు అనిపిస్తుంది. సమాజం అనేది ఒక భౌతికవస్తువు కాదు. దానికి రంగు,రుచి,వాసన లేవు.కేవలం దాని ఉనికి చుట్టూవున్న "ఆ నలుగురి" ద్వారా వస్తుంది.అలాంటప్పుడు, ఈ ప్రపంచం ఒక సమాజం రూపంలో దేశాల నైతికతని నిర్ణయించగలదా అనేది ప్రశ్న.


చరిత్రని చూస్తే, ప్రపంచయుద్ధాల తరువాత ‘ఐక్యరాజ్యసమితి’ నిర్మాణం ఈ అవసరంకోసమే జరిగిందని నా నమ్మకం. మనమానవ సమాజంలో హద్దులు నిర్ణయించే అగ్రవర్ణా/వర్గాలలాగానే ఇక్కడా అగ్రరాజ్యాలు తమ జోరు కొనసాగించాయి. దీంతో, తమకు అనుకూలమైన సూత్రాలేతప్ప నిస్పక్షపాతమైన అభిప్రాయాలకు తావులేకుండా పోయింది.


ఈ నేపధ్యంలో, మారిన ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా దేశాల "అవసరాలే"తప్ప, "నైతికత" అప్రస్తుతమైపోయింది. అంటే నైతికతో సంబంధం లేకుండా, ఒక దేశం యొక్క అవసరాలు ఆ దేశ విధానాలని నిర్ణయిస్తాయన్నమాట. ఇదే ఇప్పుడు international studies కూ international diplomacy కి మూలమయ్యింది. అంటే, ఈ కాలంలో దేశాలకు valuesకన్నా policies ముఖ్యమన్నమాట. బహుశా అదే అమెరికాని ఈ ప్రపంచానికి మొగుడ్ని చేసికూర్చోబెట్టింది.


దీన్నిబట్టి చూస్తే, అణుఒప్పందానికి మోకాలడ్డిన చైనాపై మనకు కోపమున్నా, మనకు లాభసాటిగా వుంటుందిగనక వారితో వ్యాపారానికిమాత్రం "సై" అనాలి. కార్గిల్ లో పాకిస్తాన్ మనల్ని వెన్నుపోటు పొడిచినా, కలిసుంటేవచ్చే లాభాల్ని దృష్టిలో ఉంచుకుని శాంతి మంత్రం జపించాలి. అణుఒప్పందం వలన కొన్ని ఆంక్షలు వచ్చిపడినా, దానిలోని లాభాల్ని బేరీజుచేసి సర్ధుకుపోవాలి. సర్వశక్తివంతమైన అమెరికాకు కావల్సిన మితృడిగా మన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి.


మరి మనం అమెరికాని దుమ్మెత్తిపోయడానికి ఎప్పుడూ ఎందుకు సిద్ధంగా ఉంటాం? దీనికి నాకు తెలిసిన సమాధానం, సాధారణంగా మనం వ్యక్తిగత విలువలకోణంలోంచీ అమెరికాని బేరీజు చేసి, ఆ దేశం చేసేది "అనైతికం" అంటాం. అలా అంటున్నప్పుడు అసలు అమెరికన్లు తమ ప్రభుత్వాన్ని అనైతిక ప్రభుత్వం అనుకుంటారా లేదా అనే విషయానికి ప్రాధాన్యత ఇవ్వం. అంటే ఇక్కడ we are being self righteous అన్నమాట. మనకు అమెరికా అంటే కొంత ఈర్షకూడా అయ్యుండాలి. ఎందుకంటే, ప్రపంచాన్ని శాసించే ఆర్థిక, రాజకీయ బలిమి మనదగ్గర లేదుకాబట్టి, కనీసం మన దేశం నైతికంగా బలంగా వుందనుకుని ఆ అహాన్ని ప్రదర్శించడానికి ఇలా తెగడటం మనకు కొంత సంతృప్తి కలిగించొచ్చు. కానీ మన దేశ నైతికతకూడా ఒక రాజకీయ అవసరం అని గ్రహిస్తే ఈ గర్వంకూడా ఫటాపంచలవుతుందేమో !


మొత్తానికి నాకు తోచిందేమిటంటే, దేశాలకు తమ స్వార్థాలు, తమ దేశప్రజల అభివృద్ధి, క్షేమం ముఖ్యం దానికోసం బలవంతులైతే వారు ఏమైనా చేస్తారు. బలహీన దేశాలు ఆ బలాన్ని పెంపొందించుకోజూస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశాలకు నైతికవిలువలుండటం వర్తమానాన్ని problematic చేస్తాయి కాబట్టి, diplomatic గ్గా వాటిని పక్కనపెట్టి పబ్బంగడుపుకోవడమే సరైనది...అని.


చాలా అసంబద్ధంగా అనిపించినా, ఇందులో కాస్తయినా నిజముందనే నాకు అనిపించింది.


****

14 comments:

అబ్రకదబ్ర said...

నేనూ ఇదే టాపిక్ మీద రాయాలనుకున్నా. మీరు నాకన్నా ముందే రాసెయ్యటం అన్యాయం. ఇకనుండీ భవిష్యత్తులో రాయబోయే బ్లాగ్ టాపిక్స్‌ని ముందే రిజిస్టర్ చేసిపెట్టుకునేలా ఏదైనా ఏర్పాటుండాలి :-)

మీ విశ్లేషణ బాగుంది. నాది మరో తరహా కాబట్టి నేనూ నా ధోరణిలో రాసేస్తా త్వరలో.

బుష్ రెండో సారి ఎన్నికవ్వటానికి యుద్ధమొక్కటే కారణం కాదు. డెమొక్రాట్ల అభ్యర్ధి జాన్ కెర్రీ నమ్మదగ్గవాడు కాదని ఎక్కువమంది అనుకోవటమూ ఒక కారణం. అల్ గోర్‌ని కానీ, జాన్ ఎడ్వర్డ్‌ని కానీ డెమోక్రాట్లు రంగంలో దింపితే మరింత పోటాపోటీగా ఉండేదేమో. కెర్రీ-బుష్‌ విషయంలో 'తెలీని వెధవ కన్నా తెలిసిన వెధవ నయం' అనుకున్న ఓటర్లు చాలామంది. ఇంకా దేశీయంగా స్థానిక కారణాలూ కొన్నున్నాయి. కేవలం అంతర్జాతీయ విధానాలమీద ఆధారపడి ఓట్లేయరు కదా. ముఖ్యంగా, గే మ్యారేజెస్ వంటివాటికి బుష్ వ్యతిరేకం కావటం కూడా మధ్యతరగతి, నడి వయసు ఓటర్లు అతనివైపు మొగ్గేలా చేసింది. Family man, religious person, non-alcoholic గా బుష్ కి ఉన్న ఇమేజ్ కూడా మరిన్ని ఓట్లు రాల్చి పెట్టింది. నిజానికి 2004 ఎన్నికల రోజు నాటికి బుష్ మళ్లీ గెలవబోతున్నాడనేదానిమీద ఇక్కడ ఎవరికీ అనుమానాల్లేవు. ఆ విషయమ్మీద భారతదేశంలోనే అనవసరమైన ఉత్ఖంట.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

అన్నిదేశాలకూ సదరు నైతిక,వాణిజ్య,ఆర్ధిక,సామాజిక తదితరవిలువలకు కొన్ని ముసుకులు ఉంటాయి.దాన్ని స్థూలంగా దౌత్యనీతి అంటారు.సామాజికులు కట్టుబాట్లు అంటారు.ఆధునికులు విలువలు అంటారు.ధాయ్లాండ్ లాంటి చోట్ల మర్ధన కేంద్రాలు ఉంటే మరో చోట మరో కేంద్రాలుంటాయి,ఉదా:ఆయుధౌత్పత్తి కర్మాగారాలు.సంక్షిప్తంగా చెప్పాలంటే "it depends"

శరత్ said...

Anduke mallee Mccain ennikayinaa aascharyam ledu. Ippatike polls lo lead vundita.

కత్తి మహేష్ కుమార్ said...

@అబ్రకదబ్ర: ఒకే కథని ఇద్దరు దర్శకులు ఒకేలా ఎలా తియ్యలేరో, ఇకే విషయంమీద ఇద్దరు రాస్తే వాటిల్లో చాలా భిన్నత్వం ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీ టపాకోసం ఎదురు చూస్తాను.

@రాజేంద్ర: నిజమే శాశ్వతప్రయోజనాలు తప్ప నైతికవిలువలు దేశాలకి అవసరం లేదు. అలాగే నైతికత ప్రతి సమాజానికీ, సంస్కృతికీ, దేశానికీ మారుతూ ఉంటాయి.

@శరత్: as long as American's interest is paramount they will do anything. That's "right" as well.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

నూటికి నూఱు శాతం ఏకీభవిస్తున్నాను.

Saraswathi Kumar said...

మరి ప్రజాస్వామ్యం జిందాబాద్ అంటుంటారుగా! ఇంతకూ మీరు సమర్ధించేది దేనిని? స్వార్థం పోయి ఈ దేశాలకు నైతికత ఎలా అలవడుతుందంటారు?

ఆ మార్పు కూడా ప్రజాస్వామ్య పద్దతిలోనే జరగాలనే కదా మీరు చెప్పేది. ప్రజాస్వామ్యమే స్వార్ధ పరులకోసం ఏర్పడినది. ప్రజాస్వామ్యాన్ని సమర్ధించే వారు ఈ స్వార్ధబుద్ధులకు నొచ్చుకుంటే ఎలా?ప్రజాస్వమ్యమున్నంతకాలం స్వార్ధం మూడుపువ్వులు ఆరుకాయలుగా వెలుగొందుతుంది.కనుక ఇటువంటి విషయాలను (మీరు ప్రజాస్వామ్యవాదులు కనుక) కాజువల్‌గా తీసుకోండి.

lalitha said...

అతిధి దేవోభవ
నా బ్లాగును దర్సి0చిన మొదటి అతిధి కి నెనర్లు
ఇంకా నా బ్లాగుకి తోరణాలు కట్టలేదు. ముగ్గులు వేయలేదు.
అవన్ని అయ్యాక పి0డి వ0టలు చేసి, అపుడు కూడలి లో నిలబడీ అ0దరిని పిలవాలని చూస్థున్న
మీ ప్రొత్సహనికి మల్లీ thanks

కత్తి మహేష్ కుమార్ said...

@సరస్వతీ కుమార్:ఈ తంతుచూసి నేను బాధపడిపోతున్నాని మీకు అనిపిస్తే మీకు ఈ టపాసారం అర్థం కాలేదన్నమాటే!

International politics is different from internal democracy. నేను చెప్పేదల్లా, దేశాలు తమ ప్రజల క్షేమాన్ని, దేశరక్షణనీ, ప్రయోజనాలనీ దృష్టిలో పెట్టుకుని ఏదిచేసినా సరైనదే అని. ఆ చర్యల్ని వ్యక్తిగత కొలమానాలైన నైతికతతో కొలవకూడదు. ఎందుకంటే, వాటికి అవసరాలే ప్రాతిపదికతప్ప నైతిక విలువలు కాదు.So,its all about 'policy' not 'principles'.

ప్రజాస్వామ్యాన్ని ఒక ఎన్నికలతో ముడిపెట్టి దానిమీద value judgment ఇస్తున్న మీరు "మనదేశానికి ఎలాంటి వ్యవస్థకావాలి" అనే వ్యాసం రాశారంటే నమ్మలేకుండా ఉన్నాను. ప్రజాస్వామ్యం అనేది ఒక ఆలోచన, ఒక సిద్ధాంతం, ఒక జీవనవిధానం. కేవలం రాజకీయ వ్యవస్థకాదు.

Democracy is about respecting each others space, ideas and ways of life and living with agreed disagreements.

మీ అర్థాన్ని కొంచెం విశాలం చేసుకుంటే నేను పైటపాలో చెప్పిన international politics and moral of the nations అర్థమయ్యే అవకాశం మెండుగా వుంటుంది. మరో సారి చదివి ప్రయత్నించండి.

@తాలబా: నెనర్లు.

@లలిత: స్వాగతం.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

"ప్రజాస్వామ్యం అనేది ఒక ఆలోచన, ఒక సిద్ధాంతం, ఒక జీవనవిధానం. కేవలం రాజకీయ వ్యవస్థకాదు."

ఇక్కడ మనకు కొంత స్పష్టత అవసరం. ఇది ""ఇస్లాం ఒక జీవన విధానం" అనడం లాంటిదే. ఈ ప్రజాస్వామ్య జీవన విధానం అని చెప్పుకుంటున్నది. ఎన్నికలూ వగైరా రాజకీయ ఉపరితల నిర్మాణం లేకుండా సాధ్యపడదు. ఒక కోణంలోంచి అదే Main stream ప్రజాస్వామ్యం, ఇహ మిగతావన్నీ దానికి supporting structures మాత్రమే. అవన్నీ ఆచరణలో పక్కవాద్యాలు. అందుచేత ప్రజాస్వామ్యం ఫక్తు రాజకీయ వ్యవస్థే తప్ప మఱింకేమీ కాదు. ఇది రాజకీయాలకు అతీతంగా మనగలిగేదే గనక(capable of surviving independent of political super-structure) అయితే పూర్వకాలంలో ఏ దేశంలోనూ ప్రజాస్వామిక పౌర సంస్థలేవీ లేవెందుకు ? అని ప్రశ్నించుకోవాల్సి వస్తుంది.

దీనికి సమాధానం ఒక్కటే - సమాచార వ్యవస్థలు అభివృద్ధి చెందిన సమాజాల్లోనే ప్రజాస్వామ్యం ఉంటుంది తప్ప అవి లేని సమాజాల్లో మనం కోరుకుంటున్న స్థాయిలో ప్రజాస్వామ్యం ఉండదు. మనం చూస్తున్న ప్రజాస్వామ్యాలు అంతకుముదున్న వ్యవస్థల మీద తిరుగుబాటుగా వచ్చినటువంటివి. ఇవి actionary కాదు, reactionary. అందుచేత ఇవి ఎలా వచ్చాయో అలాగే పోయే అవకాశం ఉంది.

ప్రజాస్వామ్యంలో వ్యక్తీ, ప్రజలూ వేఱు, వేఱు. ప్రజల విషయంలో వ్యక్తిగత నిర్ణయాలు ఏ విధంగానైతే చెల్లవో, వ్యక్తిగత విషయాల్లో ప్రజా నిర్ణయాలు అదే విధంగా చెల్లవు. అందుచేత వ్యక్తి యొక్క వైయక్తిక జీవితంతో ముడిపడ్డ ఆస్తి, చదువు, పరిశోధన, పెళ్ళి, కుటుంబమూ, మతమూ, వ్యాపారమూ మొదలైన విషయాల్లో ప్రజాస్వామ్యానికి తావు ఉండదు. ఉండడంలేదు కూడా మనం చూస్తున్న, మనం ప్రత్యక్షంగా జీవిస్తున్న ప్రజాస్వామ్య సమాజంలోనే !

అలాగే ఒక ప్రాజెక్టుకు సంబంధించి మంచి చెడులూ, సాధ్యాసాధ్యాలూ మొదలైన వాటి గుఱించి అడగాల్సింది అందులో విశేష కృషి చేసిన ఒక శాస్త్రవేత్తని, అంతే తప్ప ప్రజల్ని కాదు.

ప్రజాస్వామ్యానికి ఇన్ని పరిమితులున్నాయి.

Saraswathi Kumar said...

ఇంటర్నల్ డెమోక్రసీ నడిపేవారే ఇంటర్నేషనల్ డిప్లోమసీ కూడా నడుపుతుంటే ఇక్కడి స్వార్థం అక్కడ కనిపించకుండా ఉంటుందా?!

మీరు ఆస్వార్ధాన్నే వ్యక్తిగత విలువల కోణంలో చూడకూడదు అని చెప్పారు. అలానే ‘వాస్తవం అలా ఉంది ఏంచేద్దాం?’ అనే ధోరణిని వ్యక్త పరుస్తూనే ఆ వాస్తవాన్ని జస్టిఫై చేయటానికి ప్రయత్నించారు. వాస్తవం శాశ్వతమైనది కాదు దానిని ఏదోరకంగా జస్టిఫై చేసుకోవడానికి.

ప్రజాస్వామ్యానికి లాండ్ మార్క్ ఎన్నికలే కదా! ఒక వేళ ఎన్నికలతో నిమిత్తం లేకుండా మిగతా పరిస్థితులు చూసినా మీరు ఈ వ్యవస్థను ఎందుకు ఇంతగా సమర్ధిస్తున్నారో అర్ధం కావటం లేదు. ఇప్పుడు ఉన్న వ్యవస్థలలో ప్రజాస్వామ్యం better అయితే అవవచ్చు. కానీ ఇంతకంటే మంచి వ్యవస్థ రాకుండా ఎవరూ ఆపలేరు. చరిత్రగతి సర్వస్వతంత్రమైనది.

ప్రజాస్వామ్యం ఒక ఆలోచన, ఒక సిద్ధాంతం, ఒక జీవన విధానం అని నేను కూడా ఒప్పుకుంటాను. ఆ ఆలోచనను, ఆ సిద్ధాంతాన్ని, ఆ జీవన విధానాన్ని ఒక్కోసారి ‘కాపిటలిజం’ అని కూడా అంటారు. ఆ జీవన విధానంలో ప్రయోజనాలతో పాటు లోపాలు కూడా ఉన్నాయి.

“దేశాలకు తమ స్వార్ధాలు, తమ దేశప్రజల అభివృద్ధి, క్షేమం ముఖ్యం”

ఇదే నిజమైతే వలసపాలకులు ప్రపంచదేశాలను దోపిడీ చేసిన విషయాన్ని మీరు అడ్డంగా సమర్ధిస్తున్నట్లే కదా!

ఇప్పుడున్న పరిస్థితులలో మీరు చెప్పిన స్వార్ధం సరైనదే అనిపించవచ్చు.కానీ అలా అనిపింపచేస్తున్న పరిస్థితులను మనం ఎందుకు అంగీకరించాలో చెప్పగలరా?

ఓ పక్క పరిస్థితులు మారకుండా ప్రజాస్వామ్యమే కొనసాగాలనేది మీరే. మరో పక్క ఇప్పుడున్న పరిస్థితులలో ఈ అన్యాయాలు, ఈ స్వార్ధాలు సరైనవే అని సర్దుకుపోక తప్పదు అని చెప్పేదీ మీరే. (అలాగే వాటిని ఏ దృష్టికోణంతో చూసి మనలను మనం బుజ్జగించుకోవాలో చెప్పేది కూడా మీరే.) బావుంది మీ వాదన.

అంత ఖర్మ ఏం పట్టింది. పరిస్థితులను మార్చడం కోసం పోరాడటానికి అనేకమంది సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు ఇప్పుడున్న పరిస్థితులతో సర్దుకుపోవలసిన అగత్యం గానీ అందుకు కొత్త కొత్త దృష్టికోణాలను అలవరచుకోవలసిన అవసరంగానీ లేదు.

ఉమాశంకర్ శివదానం said...

మహెష్,

మీ వ్యాఖ్య.

"నేను చెప్పేదల్లా, దేశాలు తమ ప్రజల క్షేమాన్ని, దేశరక్షణనీ, ప్రయోజనాలనీ దృష్టిలో పెట్టుకుని ఏదిచేసినా సరైనదే అని. ఆ చర్యల్ని వ్యక్తిగత కొలమానాలైన నైతికతతో కొలవకూడదు. ఎందుకంటే, వాటికి అవసరాలే ప్రాతిపదికతప్ప నైతిక విలువలు కాదు.So,its all about 'policy' not 'principles'. "

మీ వ్యాసం బావుంది కాని, వ్యాఖ్య అసంజసం గా ఉంది.


అంతా బానే ఉంది గాని ఇంతకి మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు? దెశాలకి నైతికత లేదూ అంటున్నారా? లెక ఉండనవసరం లెదు అంటున్నారా? నైతికత లేదు అంటారా, అది కొత్తగా చెప్పనవసరం లెదు. తప్పు చెసిన వ్యక్తి దానిక తగ్గ వాదన ని ముందే తయారు చెసి పెట్టుకుంటాదు. కాబట్టే ఆ తప్పు చేస్తాడు. దెశాలకీ ఇది చక్కగా వర్తిస్తుంది. కాబట్టి వ్యక్తిని దెశాన్ని పొల్చడం సులభం.

ఉండనవసరం లేదు అంటే మాత్రం ఒప్పుకోవడం కష్టం. ఉంది కాబట్టే అమెరికా ఏ పని మొదలెట్టినా మొదట అంతర్జాతీయ సమాజం నుంచి ఏమాత్రం వ్యతిరేకత వస్తుందా అని ఆలొచిస్తుంది. దాన్ని minimize చెయ్యటానికే అప్పటికప్పుడు ఆఘమేఘాల మీద , రాత్రికి రాత్రి దెశాధినెతల్ని కలవడం మద్దతు కూడగట్టు కొవడం. ఆమెరికా ని ఒక ఉదాహరణ గా మాత్రమె తీసుకున్నాను. ఏ దెశానికైనా ఇదే వర్తిస్తుంది. ఇప్పుడు మనం మన పక్క దెశం మీద దాడి చెయ్యాలంటే దానికి తగ్గ కారణాలను అంతర్జాతీయ సమాజానికి చూపుతాం అంతే కాని దానికి Policy ముసుగెయ్యం. ఆ కారణాలు సహేతుకమా కాదా అనేది తర్వాత వస్తుంది. ఎవరు ఎంత చక్కగా నిజానికి మసిపూసి మారేడుకాయ చేస్తాడొ వాడిదే విజయం. మనుషులకి దెశాలకి రెంటికి వర్తించే నిజం ఇది.

వ్యక్తి ని దేశాన్ని పొల్చడానికి అంత కష్ట పడనవసరం లెదు. మనుషుల్లొ ఉన్న ద్వంద ప్రవౄత్తి దెశాలకీ చక్క గా వర్తిస్తుంది. ఇరాక్ యుద్దం మీద సొంత ప్రజలకే సమాధానం చెప్పడానికి అమెరికా ఇబ్బంది పడుతోంది. Policy ముసుగెయ్యడానికి అదేమీ చిన్న విషయం కాదు.
నైతికత ఉంది కాబట్టే NATO, OPEC, SAARC ఇలాంటి అనెక కూటములేర్పడ్డాయ్. లాభం అన్నిదెశాలకి అందాలని ఇన్ని రకాల వాణిజ్య ఒప్పందాలూ ఏర్పడ్డాయ్. నైతికత ఉంది కాబట్టే భూకంపాలు, వరదలు సంభవించినప్పుడు పక్కదెశాలు,డబ్బున్న దెశాలు స్పందిస్తాయ్.

ఊండనవసరం లెదు అన్నప్పుడే ఒక హిట్లర్ లాంటి వాళ్ళు పుడతారు.

simply sarat said...

మహేష్ గారు నా టపాకి ఇలా సమాధానం ఇచ్చినందుకు కృతఙతలు. మీరు నా టపా లింకు కూడా ఇచ్చి ఉంటే మరింత బాగుండేది. వాదనలోనుండే నిజం పుడుతుందంటారు, బహుశా అది నిజమే కావచ్చు, ఆ నిజం కోసమే నా తాపత్రయం కూడానూ ..

మీరు అమెరికాలో ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకత అస్సలు లేదనే దురభిప్రాయంతో ఉన్నారు. ఇరాక్ లో చనిపోయిన ఒక సైనికుని తల్లి ఇరాక్ లో అమెరికా సేనలని మోహరించడానికి వ్యతిరేకంగా జరిపిన పోరాటం ఎంత సంచలనం కలిగించిందో మీకు తెలియదనుకుంటా.. ఇప్పుడిప్పుడే అమెరికన్లకి కూడా అర్ధం అవుతోంది ఈ సామ్రాజ్యవాధ విధానాలవలన తామెలా నష్టపోతున్నమో!!

ఒక అన్యాయాన్ని అన్యాయం అని చెప్పడంలో ఉన్న తప్పేంటో కాస్త వివరించగలరా! కాకపోతే దానిని మీరు అన్యాయం అనలేకపోతున్నరేమో!! మీరు చెప్పిన 'నైతికత ' లేనప్పుడే ఉద్యమాలు మొదలవుతాయి, ఆ 'నైతికత ' ని సాధించడం కోసం వ్యవస్థలను మార్చేంత పెద్దవిగా మారుతాయి. రష్యా, చైనా విప్లవాలు తమ తమ దేశాలకు ఈ నైతికత సాధించి పెట్టాయి. మీరు అంటున్న ఆ నైతికత మన దేశానికి కూడా లేదు కాబట్టే ఇక్కడా ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇక్కడి వ్యవస్థలను మార్చడానికి ప్రయత్నిస్తున్నాయి. అమెరికా ని ప్రశ్నించడానికి అహం తో పనేంటి మహేష్ గారు ?

"మొత్తానికి నాకు తోచిందేమిటంటే, దేశాలకు తమ స్వార్థాలు, తమ దేశప్రజల అభివృద్ధి, క్షేమం ముఖ్యం దానికోసం బలవంతులైతే వారు ఏమైనా చేస్తారు. బలహీన దేశాలు ఆ బలాన్ని పెంపొందించుకోజూస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశాలకు నైతికవిలువలుండటం వర్తమానాన్ని problematic చేస్తాయి కాబట్టి, diplomatic గ్గా వాటిని పక్కనపెట్టి పబ్బంగడుపుకోవడమే సరైనది...అని."

అంటే ఎవరు ఎన్ని అన్యాయాలని చేసిన చూస్తూ కూర్చోవాలా మహేష్ గారు? ఇక్కడ పోరాడేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారని మీకు తెలియదా. ఒకరికి లొంగిపోవడం చేతకాని తనం. భారతీయులో లేదా మరొక వెనకబడిన దేశ ప్రజలో చేతకానివాళ్ళు అనుకోవడం పొరపాటు. మీ వాధన అసంబద్దమని మీరే అంటున్నారుగా!! ఇంతకీ మీరు క్యాపటలిస్టా లేక కమ్యూనిస్టా , కమ్యూనిస్టు కాదని మాత్రం తెలుస్తోంది, ప్రజాస్వామ్యవాదినంటారేమో!

మీరు తప్పక చూడాల్సిన లింకులు కొన్ని..


http://findarticles.com/p/articles/mi_qn4156/is_20050925/ai_n15618134

http://www.commondreams.org/archive/2007/05/11/1122/

Han said...

ఈ లోకంలో మతవాదులుంటారు - వాళ్ళు మూర్ఖులు.
ఈ లోకంలో కులవాదులుంటారు - వాళ్ళు మూఢులు.
ఈ లోకంలో ప్రజాస్వామ్యవాదులుంటారు - వాళ్ళు ఆలోచనాపరులు, సంఘసంస్కర్తలు, పురోగమనవాదులు. దీనికి రెండు కారణాలు.
ఒకటి - ఎందుకంటే ఈ ప్రపంచం ఆవిర్భావం నుంచీ కనుక్కోబడిన అతి గొప్ప సత్యం ప్రజాస్వామ్యం కాబట్టి.
మరో కారణం మీ అందరకూ తెలుసు.

independent said...

http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?sectionName=&id=730f95ea-d250-4fc2-81ed-73834e54e344&&Headline=Thank+you%2c+Mr+Bush&strParent=strParentID