Sunday, September 28, 2008

ప్రతిరోజూ ఒక కొత్త పరిచయం

ఈ మధ్య "50 First Dates" అనే ఒక ఆంగ్లచిత్రం చూసాను. డ్ర్యూబెర్రీ మూర్, ఆడమ్ శాండ్లర్ నటించిన ఈ చిత్రంలో కధానాయికకి ఒక రోడ్డు ప్రమాదం కారణంగా మెదడుకి సంబంధించిన ఒక విచిత్రమైన వ్యాధి ఏర్పడుతుంది. తను ఒక రోజుగడిపి, రాత్రికి నిద్రపోయి, మరుసటిరోజు ఉదయం నిద్రలేస్తే, క్రితం గడిపిన రోజు జ్ఞాపకముండదు. అంటే తను ప్రతిరోజూ ఆ ప్రమాదం జరగడానికి ముందురోజులాగానే భావిస్తూ దినచర్యని మొదలెడుతుందన్నమాట. ఈ స్థితిలో ఉన్న నాయికని నాయకుడు ఇలా ప్రతిరోజూ కొత్తకొత్తగా దాదాపు 50 రోజులు ప్రేమలో పడెయ్యటం ఈ చిత్రంలోని మూలకథ. అందుకే ఈ సినిమా పేరు "50 మొదటి ప్రేమరోజులు".


ఈ సినిమా గొప్పది కాదుగానీ, ఈ చిత్రంద్వారా మానవసంబంధాల విషయంలో నేర్చుకోవల్సిన జీవనసత్యం ఒకటి బోధపడింది. సాధారణంగా రక్తసంబంధం కాకుండా ఏ ఇతర సంబంధం విషయంలోనైనా ఎదుటివారి ఆలోచనల్నిబట్టి, అభిప్రాయాల్నిబట్టి, వారి సామాజిక విధానాన్నిబట్టి మనం ఒక నిర్ధిష్టమైన అభిప్రాయం ఏర్పరుచుకుని సంబంధాలు కొనసాగిస్తాం. అలా ఎప్పటికీ ఎదుటి మనిషి image తో సంబంధాలు కొనసాగిస్తామేగానీ కొత్తగా మన సంబంధాల్ని పునర్నిర్వచించుకోము. అలా కనీసం ప్రయత్నించం. కారణం అదొక సౌలభ్యం. It is always easy to deal with an image of a person than a complex individuals who can't be categorized in to a "brand".


బ్రాండ్ పేరునిబట్టి వస్తువుల మన్నికని నమ్మినట్లు, మనం ఏర్పరుచుకున్న ఎదుటి వ్యక్తి మానసికఛాయను (mental image) నిజమని మనస్ఫూర్తిగా నమ్మడంలో కొంత సౌలభ్యం ఖచ్చితంగా ఉంటుంది. చాలాసార్లు మన సంబంధాలకు కొన్ని prejudices ప్రాతిపదికగా కూడా ఏర్పడుతాయి. అయినా వాటిల్లోని నిజం శాతాన్ని గుర్తించడానికి యత్నించం.


కానీ, ఈ సినిమాలోలాగా మనం రోజూ కలిసే వ్యక్తుల్ని ప్రతిరోజూ కొత్తగా కలిస్తే !?! What if you meet everyone you meet as a new person you are meeting for that day ! బహుశా చాలా సమస్యలు solve అయిపోతాయేమో. అంటే ఇక్కడ మతిమరుపో లేక మెదడుకి సంబంధించిన వ్యాధోకాకుండా, ఒక మానసిక పరిణితి గురించి ఆలోచిద్ధాం.


ప్రతిరోజూ మనం కలిసే మనుషుల్ని ఎల్లప్పుడూ కొత్తగా కలిస్తే, మన అపోహలకూ,అనుమానాలకూ,అపార్థాలకూ అర్థంలేకుండాపోయి, మనసుకి ఎంత ప్రశాంతత కలుగుతుందో కదా! ఒక క్లీన్ స్లేట్ లాగా ప్రతిరోజూ పాత సంబంధాల్నే కొత్తగా మొదలుపెడితే! కొంచెం ఆలోచించండి.


****

17 comments:

Anonymous said...

హలో, బ్లాగు లోకానికి స్వాగతం!

kasturimuralikrishna said...

మహేష్ కుమార్ గారూ

ఆ సినిమా నేనూ చూసాను. నాకు చాలా నచ్చింది.జిడ్డు కృష్ణమూర్థి ప్రకారం వీలయితే ప్రతి రాత్రి నిద్ర ఒక మరణం లాగా వుండాలి. ఏరోజువి ఆ రోజే మరచిపోయి, మరో రోజు కొత్తగా ఆరంభించాలి. ప్రతి రోజూ ఓ కొత్త జన్మ అన్నమాట. మనిషికి సంతాన బాధ్యత లేకపోతే ఈ సిద్ధాంతం బాగానే వుంటుంది. జంతువుని దాటి ఎదిగినప్పటినుంచీ మనిషి మళ్ళీ జంతువవ్వాలనే తపన పడుతున్నాడంటాడో తత్వవేత్త. ఇది నిజమేమో!

ravindra said...

అవును. ప్రతీరోజు కొత్తగా మొదలుపెట్టడం అనేది నిజంగా చేయగలిగితే... వావ్ . ఇదే కాన్సెప్ట్ ని 'ఉల్లాసంగా..ఉత్సాహంగా' సినిమాలో ఉపయోగించాడు.అలాగే అజయ్ దేవగన్, కాజోల్ లది కూడ ఈమధ్య ఇటువంటి మూవీ వచ్చింది.

Purnima said...

>>ప్రతిరోజూ మనం కలిసే మనుషుల్ని ఎల్లప్పుడూ కొత్తగా కలిస్తే, మన అపోహలకూ,అనుమానాలకూ,అపార్థాలకూ అర్థంలేకుండాపోయి, మనసుకి ఎంత ప్రశాంతత కలుగుతుందో కదా!

మరి పరిచయాల వల్ల కలిగే కొన్ని పాజిటివ్ ఫీలింగ్స్ మాటేంటి? నమ్మకం, స్నేహం, ఆప్యాయత ఇవ్వన్నీ మొదటి పరిచయంలో సాధ్యపడవు కదా? ఇలా ఉంటే అపార్థాల మాటేమో గానీ, అసలు ఎవరమూ ఎవరికీ తెలిసే అవకాశం లేదనిపిస్తోంది నాకు.

>> ఒక క్లీన్ స్లేట్ లాగా ప్రతిరోజూ పాత సంబంధాల్నే కొత్తగా మొదలుపెడితే!

ఎంత నడిచినా అక్కడే ఉన్నట్టు ఉంటుంది. జీవితం పుస్తకంలా ఉంటేనే బాగుంటుందేమో కదా, ఇష్టమైనా, కష్టమైనా ప్రతీ పేజీకి పక్క పేజీకి ఏదో రకమైన సంబంధం ఉంటుంది. అప్పుడే సంపూర్ణం అనిపిస్తుంది. జీవితం బ్లాగులా అయితే టపా టపాకి సంబంధం లేనట్టు, దేని దారి దానిదే అయితే.. హమ్మ్..అంత బాగుండదు. (ఏమిటో.. అనిపించింది, రాశేసా)

Somehow this is what I feel, very strongly. మీరు మానసిక పరిణితి అన్నా.

రాధిక said...

purnima totally agree with u.

బొల్లోజు బాబా said...

ఆలోచన భలే బాగుందే.
ప్రతీ ఒక్కరినీ ప్రతిదినమూ కొత్తగా కలిసినట్లు ప్రవర్తించటమా. సూపర్.
అలోచించటానికైతే బాగుంది కానీ ఊహించుకొంటూంటే భయమేస్తుంది.
ఎందుకంటే రేప్పొద్దున్న క్లాసుకెళ్ళి ఒరేయ్ అబ్బాయిలూ నిన్నెంతవరకూ చెప్పుకున్నాం అని అడిగే బదులు క్లాసెలా మొదలు పెట్టాలా అని.
సరదాగా

అలోచన అద్బుతంగా ఉంది.
బొల్లోజు బాబా

కొత్త పాళీ said...

పాపం మహేష్ ఎంతో తాత్త్విక ఆలోచనతో చక్కటి విషయం రాస్తే మీరంతా మీ ప్రాక్టికల్ గొడవల్తో దాన్ని నేలబారు చేసేశారే? :)

ఈ సినిమాలో విషయానికి ఒక మాదిరి ప్రతిబింబం లాంటిది బిల్‌ మర్రే నటించిన గ్రౌండ్ హాగ్ డే సినిమా. అందులో వాడు తప్ప మిగతా ప్రపంచం అంతా ఆ గ్రౌండ్ హాగ్ డేలో ఇరుక్కు పోయి ఉంటుంది. నిన్న ఏం జరిగింది అనే జ్ఞాపకశక్తి వాడికొక్కడీకే ఉంటుంది.
తమాషా ఏంటంటే ఇలాంటి కాన్సెప్టులు .. ఏదో ఒక సామాజిక చట్రంలో ఇమిడిపోయి యాంత్రికం గా బతికేస్తున్న మనల్ని ఒక్క ఊపు ఊపి, కాసేపు ఆలోచించమని నిలదీస్తాయి. జెన్‌ ఆచార్యులు ఈ క్షణంలోనే జీవించు అని బోధించినా, తత్త్వవేత్తలు కార్పే డియెం అన్నా, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటే .. ఒక చేతనతో బతకాలని.
మంచి ఆలోచన మహేష్ .

Teja said...

Mahesh garu meeru cheppina 50 first dates cinema ni mana telugu varu freemake chesaru...kakopothe ikkada utter flop aa movie satyabhama, *ing bhoomika, sivaji,
Human relations gurunchi meeru Mr.Medhavi chudandi chala baguntundhi

Anonymous said...

మీరు బలే రాస్తారే,ఇదేమొదటిసారి మీ బ్లాగు చూడటంనాకు మీరాతలు నచ్చాయి.

Anonymous said...

ప్రతి రోజూ క్లీన్ స్లేట్తో ప్రారంభిస్తే చాలా బావుంటుంది.
సమస్యల్లా దాన్ని ఏ మానసిక రుగ్మతా లేకుండా సాదించటమే.

బొల్లోజు బాబా said...

@కొత్తపాళీ గారు, మహేష్ గారూ, :-|

బొల్లోజు బబాబా

Anonymous said...

Ms. Drew Barrymore కాదా?
డ్రు బారిమోర్?!

కత్తి మహేష్ కుమార్ said...

@పూర్ణిమ: ఇదొక ఆలోచనమాత్రమే!starting every day afresh అనేది చాలా ముఖ్యమైందిగా అనిపిస్తుందినాకు. పాతరోజునాటి బాధలూ,బాదరబందీలూ,కోపాలూ,అపోహలూ మళ్ళీ మొయ్యకుండా, కొత్తగా రోజు మొదలెట్టడం బాగుంటుందని చెప్పడం నా ఉద్దేశం. అది అన్ని విషయాలలో లేక అందరి విషయాలలో possible కాకపోవచ్చు.

@చదువరి: మళ్ళీ నాకు కొత్తగా స్వాగతం ఎందుకుపలికినట్లో!?!

@బొల్లోజు బాబా: మతిమరుపో లేక మెదడుకి సంబంధించిన వ్యాధో లేకుండా, కేవలం ఒక పరిణితితో క్రితం రోజు చేదు అనుభవాల్ని కొత్తరోజులో ఒలక్కుండా చూడటం అదృష్టమే కదండీ!కష్టమే..కానీ ప్రయత్నిస్తే! అన్న ఆలోచనే ఇది.

@కొత్తపాళి: హమ్మయ్య...మీరొచ్చేసారు. అది చాలు!ఏదో సినిమా చూసి ఆ ఆలోచన వచ్చింది. అందుకే పంచేసుకున్నాను.

@మురళి: నిజమే! మరింత సమాచారానికి ధన్యవాదాలు.

@గంగాభవాని: ప్రయత్నిస్తే ఏ రుగ్మతా లేకుండా దీన్ని సాధించడం కష్టం కాకపోవచ్చు.

@తేజ,లలిత,రాధిక,రవీంద్ర ధన్యవాదాలు.

@నెటిజన్: ఇంగ్లీషు పేర్లు తెలుగులో రాయాలంటే ఈ తంటా తప్పదేమో!

ప్రతాప్ said...

ఇదే కాన్సెప్టుతో (ఇదే కాన్సెప్టు కాదు దాదాపు రీమేక్) తెలుగులో కూడా ఒక సినిమా వచ్చింది అనుకొంటాను, శివాజీ, భూమిక జంటగా. పేరేంటో ఎంత ఆలోచించినా గుర్తుకు రావడం లేదు.

Anonymous said...

Hi Mr. Mahesh
Really u didn't understood why Chaduvari wrote that comment, on what topic u wrote this article Man? That is top 1 comment which is related to this topic. Think ..

కత్తి మహేష్ కుమార్ said...

@Anonymous: నాకు అర్థమయ్యింది. నేను రాసినదాన్ని ఖచ్చితంగా పాటిస్తూ నాకు పున:స్వాగతం జరిగిందని. కానీ నాకింకా అంత మెచ్యూరిటీ (పరిణితి) లేదనుకుని,I am playing my part.

@ప్రతాప్: ఈ సినిమాని "సత్యభామ" అనే పేరుతో ఫ్రీమేక్ చేసారని పైన తేజగారు చెప్పారు.

kvmkishore said...

ఇదే! ఎజ్జాక్ట్లి ఇదే విషయం చెవిలో బొమ్మరిల్లు కట్టుకొని మా managerకి చెప్పాను... అయినా వెధవది రోజు నిన్న ఇచ్చిన పని ఎక్కడిదాక వచ్చింది అని ప్రాణం తోడేస్తాడంటె నమ్మండి... just kidding... మీరు చెప్పింది అక్షర సత్యం... ఇందులో చాలా లోతైన తాత్విక చింతన ఉంది... మనిషి నిత్య జీవితం లో జరిగేవాటిని అన్నింటిని మనసులోను మస్థిష్కంలోను ఉంచేసుకొని తను ఇబ్బంది పడుతు చుట్టు ఉన్నవాళ్ళను కూడ ఇబ్బంది పెట్టే సందర్భాలు ఎన్నో.. ఆటో వాడు తప్పుడు మీటర్ తో ఒక పది రూపాయలు కొట్టేసాడని colleagues తో ఆ రోజంతా ముభావంగా ఉండె వాళ్ళు, బాసు తిట్టాడని పెళ్ళాం పిల్లల మీద కస్సుబుస్సులు ఆడె వాళ్ళు ఎంతమంది లేరు... పలక మీద రాతలు చెరిపెసినట్టు ఆ చేదును చెరిపేసుకోగలిగితే వీలైతె ప్రతి గంటకొకసారి చచ్చి మళ్ళి పుడితె జగమే కదా స్వర్గ సీమ... అయినా ఎంత ఖరీదు పెట్టి కొన్న చెప్పులైనా ఇంటి బయట వదిలేసి వెళ్తాం కానీ పట్టుకెళ్ళి ఫ్రిద్గె లొ పెట్టుకుంటామా చెప్పండి.... so ఎప్పటికప్పుడు fresh గా start చెయ్యటం మంచి ఆలోచనే...