Monday, September 8, 2008

ప్రేమ కట్నా(ష్టా)లు

"ప్రేమ పెళ్ళిలోకూడా ఈ కట్నాలగొడవేమిటి?" ఆని అడిగితే,


"మా ప్రేమని పెద్దోళ్ళు అంగీకరించారు కాబట్టి, పెళ్ళికోసం వాళ్ళ ఆశల్నీ, ఆలోచనల్నీ, ఆశయాల్నీ అంగీకరించాలికదా !" అంటారు.


ఇదొక give and take మాత్రమే అన్నమాట. మన ప్రేమని సహృదయతతో అంగీకరించారు కాబట్టి, వారి చాదస్తాన్ని, కొండొకచో అత్యాశని మనం అంతే విశాలంగా అంగీకరించాలన్నమాట.
బాగుంది. ప్రేమ పెళ్ళిల్లలో కూడా ఈ కట్నాలు విజయవంతంగా వర్ధిల్లడానికి చాలా బలమైన కారణం. చాలా బాగుంది.



‘ఇష్టపడి ప్రేమిస్తే కట్నంలో కన్షెషన్ ఇస్తేఇవ్వొచ్చుగానీ, అసలు కట్నమే లేకపోతేమాత్రం సమాజంలో చాలా అవమానమైపోతుంది’ అనేది ఈ మధ్యకాలంలో కొడుకులున్న తల్లిదండ్రుల్లో పెరుగుతున్న ధోరణి. వేరే కులం పిల్లని ప్రేమించినా (అది వారికన్నా "ఎక్కువ" లేక "సమానమైన" కులమైతేనే) దాన్ని ఒప్పుకుని, progressive ఆలోచనలున్న తల్లిదండ్రులుగా మార్కులు కొట్టేయ్యచ్చు, "మావాడి ఆనందం కోసమండీ" అంటూ కూనిరాగాలు తీసి సోషియల్ స్టేటస్ పెంచుకోవచ్చు. కానీ కట్నం దాకా వచ్చేసరికీ ప్రేమ వివాహమైనా, కుదుర్చిన పెళ్ళైనా "దేనిదారి దానిదే !" అంటారు.



మగపిల్లాడ్నికన్న తరువాత, ఎంతో కొంత (సాధ్యమైనంత ఎక్కువే) కట్నంలేకుండా పెళ్ళిచేస్తే నలుగురిలో (?) అవమానం జరిగిపోతుందని కొందరు. సమాజంలో తాహతుకు చిహ్నంగా మాత్రమే కట్నం తీసుకుని అమ్మాయి పేరుమీదనే వేస్తామని కొందరు. "ఆ డబ్బులు మా పిల్ల భవిష్యత్తుకోసమేకదా !" అని మరి కొందరు. కట్నానికి అమూల్యమైన ప్రాతిపదికని అందించి ఈ విధానాన్ని తలకెక్కించుకుంటున్నారు. ఇక యువత "have a cake and eat it too" అన్నతరహాలో, నచ్చిన అమ్మాయి, తెచ్చిన కట్నం రెండూ బాధ్యతగా సాధించేసుకుని...తూచ్ !! మా కుటుంబ సాంప్రదాయమనో లేక తల్లిదండ్రుల సంతృప్తి అనో సర్దుకుపోతున్నారు.



ఇన్నాళ్ళూ ప్రేమ పెళ్ళిల్లవలనైనా కట్నాలు తగ్గుతాయనే ఒక పేరాశ ఉండేది. అదికాస్తా ఇప్పుడు హుష్ కాకి అయిపోయింది. కనీసం యువత ఈ కట్నాన్ని నిరసించి, ఇష్టమొచ్చిన పిల్లని స్వయంగా పెళ్ళిచేసుకునే రోజులొస్తాయనే ఆశ అడుగంటిపోతోంది.



మన వివాహవ్యవస్థ ఇంత బలమైనదో, సమాజంలోని ఆ ముఖాలుతెలియని నలుగురూ మన జీవితాల్ని అంత బలంగా శాసిస్తారో లేక మనుషుల్లో తేరగా వచ్చే డబ్బుపై వున్న ఆశ బలమైనదో తెలీదుగానీ, కట్నం అనే సాంప్రదాయం మాత్రం నిత్యనూతనంగా తన కొత్తరూపాల్ని ఎత్తుతూనే ఉంటుంది. పెద్దలు కుదిర్చిన పెళ్ళైనా ప్రేమ పెళ్ళిళ్ళకైనా ఇదిమాత్రం ప్రధమ తాంబూలం అందుకుంటూనే ఉంటుంది.



మన వివాహవ్యవస్థ జిందాబాద్ ! మెరుగైన సమాజం జిందాబాద్ !! సమాజం బాధ్యతని నెత్తినేసుకుని ఉద్దరించే ఆ నలుగురికీ జేజేలు !!! కట్నం పేరుతో extortion చేసే అందరికీ వందనాలు.



****

33 comments:

Purnima said...

"మా ప్రేమని పెద్దోళ్ళు అంగీకరించారు కాబట్టి, పెళ్ళికోసం వాళ్ళ ఆశల్నీ, ఆలోచనల్నీ, ఆశయాల్నీ అంగీకరించాలికదా !" అంటారు.

ఎవరు అంటారు? అన్న వాళ్ళే ఈ సమాజానికి ప్రతీకలా? వారు తప్పించి సమాజంలో ఇక ఎవరూ లేరా? వారు ఇలా అంటున్నారు కాబట్టి, వారిలా చాలా మంది ఉన్నారు కాబట్టి, వారు చేసేది/ చెప్పేది రైటా? వీళ్ళను చూసుకుంటూ ఇక ఏమీ చేయలేము అనుకుంటూ మనం చేతులెత్తేయడమేనా? వారిని కాదని మనం బ్రతకలేమా? జై కొట్టాల్సిందేనా? ఎన్ని తరాలు ఇలానే చేసుకుంటూ పోతాము? ఈ తరం ఆశల్ని ఆశయాల్ని రాబోయే తరం ఎందుకు మోయాలి?

మిమల్ని కాదు ప్రశ్నిస్తుంది, కానీ ప్రశ్నలు ఆగటం లేదు.

Anil Dasari said...

ఈ రోజుల్లో నిజంగా ప్రేమ వివాహాలు చేసుకునేవాళ్లు (పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకునేవాళ్లు కూడా) చాలామంది కట్నాలతో ప్రసక్తి లేకుండానే పెళ్లి చేసుకుంటున్నారు. ఇకపోతే, కట్నం అనేది రెండు చేతులు కలిసిన చప్పట్లలాంటిది. అది తప్పే అయితే, అందులో పుచ్చుకునేవాళ్లదెంత బాధ్యతో, ఇచ్చేవారిదీ అంతే. 'తప్పే అయితే' అనెందుకన్నానంటే, కొన్నిసార్లు ఇది ఇచ్చేవారికీ, పుచ్చుకునేవారికీ ఇద్దరికీ ఆమోదయోగ్యమయినదే కాబట్టి. అటువంటి కేసుల్లో, వాళ్లకి లేని దురద మనకెందుకు?

Kathi Mahesh Kumar said...

@అబ్రకదబ్ర: మీరు అదృష్టవంతులు. ఒక అద్భుతలోకంలో నివసిస్తున్నారు. మా ఊర్లో ఇంకా కట్నం లేని ప్రేమ/కుదిర్చిన పెళ్ళిళ్ళు చాలా అరుదుగా జరుగుతున్నాయి.నిజానికి ఆసంఖ్య వేళ్ళమీద లెక్కెంచుకోవచ్చు.

ఇక "దురద" సంగతంటారా...true మనకు సమాజాన్ని వివక్షనుంచీ వేరుచేసే చాలా విషయాలలో దురద అనవసరం. ప్రస్తుతం చాలా మంది అలాగే అనుకుంటారు, అమలుకూడా చేస్తున్నారు.

పెళ్ళాన్ని కొట్టే ప్రతొక్కడూ "ఇది మా మొగుడూపెళ్ళాల విషయం అంటాడు". ఆడపిల్లకాబట్టి అబార్షన్ చేయించే ప్రతి ఒక్కరూ "ఆడపిల్లతో ఎన్ని సమస్యలో తెలుసా?" అంటారు. స్వచ్చందంగా సతీసహగమనం చేస్తే మీకేం రోగం ఇలా దురదపుట్టి వ్యతిరేకిస్తారు అంటారు. ఈవ్ టీజింగ్ చేసే ప్రతివాడూ, "we are having fun man, whats your problem?" అంటాడు.

నిజమే! మనకెందుకు దురదా! కట్నానికి సంబంధించిన మానసిక లేక శారీరక వేధింపులు మన ఇంట్లో జరిగినప్పుడు మాత్రమే అది సమస్య. ఇద్దరికీ అంగీకారాత్మకమైతే ఎదుటోడు హత్యచేసినా మనకు దురద అనవసరం.

@పూర్ణిమ: ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. హాయిగా పెద్దలు చెప్పినట్లు వారి ఆశల్ని,ఆశయాల్నీ మనం మొయ్యాల్సిందే. ఎందుకంటే, ఇందులో మగాడికి బోలెడంత లాభముంది. మగాడి తల్లిదండ్రులకి బ్రహ్మాండమైన "అమ్యామ్యా" వుంది.

ఉద్యోగంచేసే ఆడపిల్ల అయినా కట్నాన్ని బట్టే సామాజిక గౌరవాన్ని "తెచ్చుకుంటుంది". అత్తగారి ప్రేమాభిమానాల్ని పొందుతుంది.డబ్బుతోపాటూ వచ్చే సేవకురాలు ఈ విధానం వల్లగాక మరెలా వస్తారు చెప్పు?

శ్రీధర్ said...

అప్పడాలు కాల్చడం తప్ప ఏమి చేతకాని ఆడ పిల్లలు అత్త గారింటి కి వెల్లె అవకాశాన్ని మీ ఆదర్శాలతొ అనగ తొక్కాలని చుస్తున్నారు అద్యషా

Anil Dasari said...

@మహేష్

పొంతన లేని ఉదాహరణలిచ్చి నా కామెంటుని పక్కదారి పట్టిస్తున్నారు మీరు. నేనన్నది 'కట్నం ఇచ్చేవారికీ, పుచ్చుకునే వారికీ అంగీకారాత్మకయిన సందర్భాల్లో మనం కలగజేసుకోవటం దేనికి' అని. దానిలో వరకట్నపు చావులు సమర్ధనీయమే అనో, భార్యని గొడ్డులా బాదటం సరైనదే అనో, సతీ సహగమనం మంచిదే అనో అర్ధం కనిపిస్తుందా మీకు?

మీకో ఉదాహరణ చెబుతాను. నాకు బాగా తెలిసిన ఒక కుటుంబం ఉంది. వాళ్ల అమ్మాయికి ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేశారు. అమ్మాయి పెద్ద చదువులే చదివింది, హైదరాబాదులో ఓ కాలేజిలో లెక్చరర్ ఉద్యోగం చేస్తుంది. అబ్బాయి పెళ్లి అయ్యాక ఏడాదిలోపు అమెరికాలో ఉద్యోగం తెచ్చుకుని వెళ్లాడు. వెళ్లిన వాడు ఏడేళ్లయినా అమ్మాయిని తన దగ్గరకి తీసుకెళ్లటం లేదు. ఎప్పుడూ ఏదో ఒక వంక చెబుతాడు. అమ్మాయి తల్లిదండ్రులు అల్లుడిని అమెరికానుండి వెనక్కి పంపించేయటానికి ఇక్కడ ఏవైనా ప్రయత్నాలు చేయమని నన్ను ప్రాధేయ పడ్డారు. అవతల ఆ అమ్మాయికి భర్త ఏనాటికైన తనని అమెరికా తీసుకెళ్తాడు (లేదా, ఇండియా వచ్చేసి తనతో కలిసి ఉంటాడు) అని నమ్మకం. ఆమె భర్తపై ఫిర్యాదు చెయ్యటానికి సిద్ధంగా లేదు. ఎవరు చెప్పినా వినదు. ఆమె తల్లిదండ్రులకేమో అల్లుడు వేరే పెళ్లి చేసుకుని ఉంటాడని అనుమానం. ఎలాగైనా అతన్ని అమెరికానుండి వెనక్కి రప్పించాలని వాళ్ల తాపత్రయం. కూతురికి ఇష్టం లేకపోయినా ఆ వ్యవహారమంతా నేనే ఎలాగోలా చూసుకోవాలని వాళ్ల ఉద్దేశం. ఆ అమ్మాయికి ఏ సమస్యా లేనప్పుడు (at least, సమస్య ఉన్నట్లు ఆమె అనుకోనప్పుడు) హీరోయిజం చూపిస్తూ వాళ్ల గొడవలో వేలు పెడితే నాకు లేనిపోని ఇబ్బందులు రావా? ఆమెకి లేని 'దురద' నాకెందుకు? ఇన్నాళ్లైనా భర్త నైజం గ్రహించలేకపోవటానికి ఆమె చిన్నపిల్లో, లోకం తెలియని అమాయకురాలో కాదు కూడా.

సమాజంలో చాలా విషయాలు ఇలాగే ఉంటాయి. సమాజాన్ని టోకున ఉద్ధరించటం అనే భావన సిద్ధాంతాలు తయారు చెయ్యటానికే కానీ కుటుంబాలని బాగు చెయ్యటానికి పనికి రాదు. ప్రతి సమస్యనీ ఇలా కుటుంబ/వ్యక్తి స్థాయిలోనే చూడాలని నా అభిప్రాయం.

రాధిక said...

"ప్రతి సమస్యనీ ఇలా కుటుంబ/వ్యక్తి స్థాయిలోనే చూడాలని నా అభిప్రాయం." agree with u sir

Chivukula Krishnamohan said...

"సమాజాన్ని టోకున ఉద్ధరించటం అనే భావన సిద్ధాంతాలు తయారు చెయ్యటానికే కానీ కుటుంబాలని బాగు చెయ్యటానికి పనికి రాదు. ప్రతి సమస్యనీ ఇలా కుటుంబ/వ్యక్తి స్థాయిలోనే చూడాలని నా అభిప్రాయం."

అబ్రకదబ్ర గారూ, పూర్తిగా మీతో ఏకీభవిస్తున్నాను.

Kathi Mahesh Kumar said...

@అబ్రకదబ్ర: కట్నమనేది ప్రస్తుత సమాజానికి అవసరమైన ఒక parallel (black)economy. అందుకే అది సర్వసాధారణమైపోయి "అంగీకారాత్మకం" అయిపోయింది. కానీ చాలా మంది ఆడపిల్లల తల్లిదండ్రుల జీవితాలు ఈ కట్నం పోగెయ్యడంలో గడుస్తాయనడం కాదనలేని సత్యం.

ఇది వ్యక్తిగతం లేక కుటుంబ స్థాయి విషయం అయినప్పుడు వరకట్న నిషేధచట్టం అప్రస్తుతం. ఈ స్వేచ్చని upheld చేస్తూ, ఆ చట్టం యొక్క నిర్మూలనకు పాటుపడదాం.

"కళ్ళు మూసుకుని కన్వీనియంట్ గా బతికెయ్యడం" మనందరికీ ఈ సమాజం చేసే కండిషనింగ్.ఆడవారిని ఇలా వ్యక్తిత్వం లేని వారిగా తయారుచేసి రెండవస్థాయి నాగరికులుగా చెయ్యడంకూడా ఈ great conspiracy లో భాగమే. నిజానికి కట్నం is mostly perpetuated by women rather than men.Women are used as effective tools in this process. అది కట్నాన్ని ఒక సాంప్రదాయంగా అంగీకరించడంలో కావచ్చు లేక స్వచ్చందంగా (గర్వంగా) కట్నం ఇవ్వడంలోనైనా కావచ్చు. అంత మాత్రానా, "వారికి సమస్య లేదంటే (అనుకుని) సరే" అనే ధోరణి ప్రమాదకరమేమో అనిపిస్తుంది.

ఇక్కడ ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకో లేక వారి కుటుంబ వ్యవహారాల్లోకో మనమెళ్ళి ఉద్దరించడం గురించి చెప్పడం లేదు. కట్నం అనే ఒక సామాజిక రుగ్మత ఎంత విశ్వవ్యాప్తమైపోయిందో అని మాత్రమే తెలియజెబుతున్నాను. ఇది చదివి తమ జీవితాల్ని బేరీజు చేసుకుని కొందరి మారినా, లేక పూర్ణిమలా కనీసం ప్రశ్నించుకున్నా నా ఆశయం నెరవేరినట్లే.

కట్నాన్ని అల్రెడీ తమ జీవితాల్లో గౌరవప్రదమైన స్థానం ఇచ్చేసినవారికి ఈ చర్చ కొంత కంటగింపుగా వున్నా, కనీసం రాబోయే తరం మార్పు కోరుకుంటుందనే నా ఆశంతా.

Unknown said...

పెళ్ళి అనేదే (భవ)బంధం. పైగా ఇది వ్యక్తిగతం మహా అయితే కుటుంబపరమైన విషయం. దానికి సమాజాన్ని ఉద్దరించే బాధ్యతను అంటగడితే ఇలాంటి ఆలోచనలేవస్తాయి.

ఇతరుల పెళ్ళి తంతుగురించి పట్టించుకోకుండా, దాన్నిబట్టి value judgments ఏర్పరుచుకోకుండా వ్యక్తులతో సంబంధాలు కొనసాహించడానికి ప్రయత్నించండి. అప్పుడే మీ ధర్మసందేహాలు తీరుతాయి.

Kathi Mahesh Kumar said...

@లక్కీ: పెళ్ళికి సమాజాన్ని ఉద్దరించే బాధ్యత లేదుగానీ, కట్నం అనే సాంప్రదాయం మహిళల్ని కించపరిచే విధంగా వుందనేది మీరు అంగీకరించకపోయినా నిజం.

ఇక్కడ నేను వ్యక్తుల్ని గురించి ఉటంకించి, టపా రాయలేదు. ఒక సామాజిక ట్రెండ్ గురించి నా observation మాత్రమే. కాబట్టి, ఇక్కడ వ్యక్తులపై value judgment ప్రసక్తే లేదు. నిజజీవితంలో నాకు తెలిసినవాళ్ళు ఇలా చేస్తే, కొంత అర్థంమయ్యేట్లు చెప్పడానికి మాత్రం ప్రయత్నిస్తాను.అది నా బాధ్యతగా భావిస్తాను.అంతేతప్ప వారి పరిస్థితుల్నీ, మానసిక స్థితినీ, సామాజిక stand point ని సమూలంగా మార్చడానికి కంకణం కట్టుకోను. పైపెచ్చు వారిని నిరసించడానికీ పూనుకోను.అలా నేను self righteous అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది.

నేను ఉద్భోధించే వ్యక్తిగత స్వేచ్చ వారికీ వుందనే కనీస జ్ఞానాన్ని మరిచి,వారిని ఉద్దరించడానికి నేను బయల్దేరను. నా ఆదర్శాలని ultimate truth లాగా వల్లె వేయడానికి పూనుకోను. My values might mean life to me, but I don't believe in changing people by preaching them.కానీ నేను నమ్మినదాన్ని ఆచరించి, దాన్ని విని కనీసం ఆలోచించేవారిని అందుకోవడానికి నా ప్రయత్నాలు మాత్రం చేస్తూనే వుంటాను.

I don't want to convert people, but I want to tell people what I know.ఈ టపాకూడా అందులో భాగమే.

You are welcome to disagree with me or disown me. But, that's "my" understanding of present day world.

సుజాత వేల్పూరి said...

"మా అమ్మా నాన్నా నిన్ను కోడలిగా ఒప్పుకున్నారు కదా, మరి అందుకు ప్రతిగా కట్నం ఇమ్మని చెప్పవా మీ అమ్మా నాన్నకి" అనడిగే వాడు ప్రేమికుడెలా అవుతాడు? వెధవ అవుతాడు. ఇక దానికి ప్రేమ వివాహమని, గాడిద గుడ్డనీ పేర్లెందుకు? మీ ఇద్దరికీ ఇష్టమై, పెద్దవాళ్ల అంగీకారం కూడా ఉంటే బాగుంటుందని అనిపిస్తే వాళ్లకు చెప్పాలి. వాళ్ళొప్పుకుంటే సరే! "కట్నం ఉంటే ఒప్పుకుంటాం" అని వాళ్లంటే, ఏం చెయ్యాలి? వాళ్ళ అభిప్రాయాన్ని తుంగలో తొక్కి, మీ పెళ్ళి మీరు చేసుకోవాలి. మీ జీవితాన్ని మీరు ఏర్పరచుకోవాలి! ఇదే జరగాల్సింది!

పూర్ణిమా,
అసలు కట్నం ఇవ్వకుండా పెళ్ళి చేసుకోడానికి అవమానంగా ఫీలయి ఏడ్చి చచ్చే ఆడపిల్లలు బోలేడు మంది. వాళ్ళొఖ్ఖళ్ళేనా సమాజంలో? అంటే, వాళ్ళోఖ్ఖళ్ళే కాదు గానీ వాళ్ళే ఎక్కువ! మెజారిటీ వాళ్ళదే!మన సర్కిల్ చిన్నది కాబట్టి మనం సమాజాన్ని మంచి నైతిక కోణంలో చూడ్డానికి అలవాటు పడితే ఇదిగో ఇలాంటి వాళ్ళున్నారని ఒప్పుకోడానికి బాధగా ఉంటుంది.

అబ్రకదబ్ర గారు,
మీరు చెప్పిన ఉదాహరణ సరే! అసలు ప్రేమ, ఆప్యాయత, మొదలైన భావాలతో ఏర్పడాల్సిన వివాహం అనే సహజీవనంలో డబ్బు అనే పదార్థం ఎందుకు తొంగి చూడాలని నా ప్రశ్న? ఇది ఎక్కడితో ఆగుతుంది? మీరు చెప్పినట్టు ఇరువైపుల వారికీ అంగీకారమై కట్నం ఇవ్వడం, తీసుకోవడం జరిగిందని అనుకుందాం! ఆ తర్వాత...? మొదటి ఆషాఢ మాసంలో అబ్బాయికి ఆషాఢ పట్టీ(ఇదివరలో ఈ ఆచారం బ్రాహ్మల్లో ఉండేది, డబ్బులొచ్చే మార్గం కదా, ఇప్పుడు అన్ని సామాజిక వర్గాలకూ పాకింది), తరవాత శ్రావణ మాసం, తరవాత అమ్మాయి ప్రసవం, బారసాల, ఆన్నప్రాసన, ఇల్లు కట్టుకోవడానికి సహాయం, గృహప్రవేశం...ఎన్ని? వీటిలో ఎన్నింటికి వధువు తరఫు వారు ఇష్టపూర్వకంగా ఖర్చు పెడతారు? పరస్పర అంగీకారం ఎక్కడ? డిమాండ్స్ తప్పించి?కట్నానికి ఒప్పుకుంటే మిగిలిన అన్నిటికీ ఒప్పుకున్నట్టే!

ఒకరి విషయం మనకెందుకు? అనే సామాజిక స్థాయిలో ఉన్నామా మనం? అలా అనుకుంటే ఎన్ని సామాజిక ఉద్యమాలు మొదలవకుండా ఉండాలి?

ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి జీవించడానికి "నాకెంతిస్తావు?" "అంత కాదు గానీ ఇంకో మాట చెప్పు" అని బేర సారాలు జరుగుతున్నాయంటే..దానికి సహజీవనమనో, పెళ్లనో గౌరవనీయమైన పేర్లెందుకు?

Anil Dasari said...

అదేంటో, నేనేం చెప్పినా అంతా కట్నాన్ని సమర్ధిస్తున్నా అన్న అర్ధంలోనే చదువుతున్నట్లున్నారు. నా ఉదాహరణలు 'బాధితులకి realization, motivation లేనప్పుడు మనం వాళ్లని ఉద్ధరించాలని కష్టపడటం ఎందుకు' అనేదాని గురించి.

ఇకపోతే, కట్నాల విషయంలో రెండు వర్గాలదీ తప్పే. ఎవడో వచ్చి కట్నమిస్తేనే చేసుకుంటా అంటే పోరా వెధవా అనొచ్చు కదా. ఆ మాట అప్పుడే అనకుండా తర్వాత గొడవ చెయ్యటమెందుకు? తీసుకునేవాడు వెధవే. ఇచ్చేవాళ్ల సంగతేమిటి? ఏమాశించి ఇస్తున్నారు? పిల్ల సుఖం ఆశించి అని చెప్పొద్దు. నేనైతే ఇచ్చేవాళ్లనీ, పుచ్చుకునేవాళ్లనీ ఇద్దరినీ ఒకే గాట కడతా. ఇద్దర్నీ చెప్పుచ్చుకుని కొడతా.

హమ్మయ్య.. ఈ సారి చాలా క్లియర్‌గా చెప్పేశా :)

Anonymous said...

మహేశ్ గారు, మంచి చర్చే లేవనెత్తారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారాలు వెతకాలంటే, gross level లో మనం మన సంస్కృతిని, సంప్రదాయాలను ప్రశ్నించుకోగలగాలి, అవసరమయితే. అలా కాకపోతే, we'll end up dealing with symptoms, rather than original decease. ఇది నా అభిప్రాయం.

నా విషయం వరకు వస్తే, నేను సంతలో అమ్ముడవలేదు. ఈ విషయం లో నేను కాస్త గర్వపడతాను.

ఏకాంతపు దిలీప్ said...

అబ్రకదబ్ర గారు, కానీ మీరు మొదట చెప్పాలనుకున్నదానిని మాత్రం అర్ధం
చేసుకునే ప్రయత్నం చెయ్యరు. :-) అలా అర్ధం చేసుకుంటే చాలా వరకు సమస్య
కనపడదు కాబట్టి!


ఉన్నవాడు ఏదైనా తనకిష్టమొచ్చినట్టు చేస్తాడు.
లేని వాడు తనకిష్టమైనది జరగకపొతే మనకి కుదరదు అని సర్దుకుపోతాడు.
కొందరు లేని వాళ్ళు ఉన్న వాళ్ళకి మల్లే ఉండాలని ఆశ పడుతుంటారు.

సమాజంలో ఒక ఆచారం ఉంటుంది. అది కొందరు అందంగా, ఆరోగ్యకరంగా పాటిస్తారు.
అది అలా పాటించేవారందరికీ ఆమోదయోగ్యంగానే ఉంటుంది. ఇలాంటి వాళ్ళని చూసి
ఆ ఆచారం పాటించనివాళ్ళు కూడా పాటించడం మొదలుపెడతారు.
అలా మొదలుపెట్టినప్పుడు, ఎవరినైతే అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారో అలా ఒక్కోసారి
చెయ్యలేకపోతారు. అలాంటి సంధర్భాల్లో ఆచారం అక్రమంగా కనపడుతుంది.

కొందరు ఆచారాన్ని అరాచకంగా పాటిస్తారు. అది ఎవ్వరికీ ఆమోదయోగ్యంగా ఉండదు.

అసలు ఇప్పుడు ఇచ్చి/పుచ్చుకునేదాన్ని చాలా మంది విషయంలో కట్నం(పాతకాలం లాగానే)
అంటారో లేదో కూడా ఒకసారి ప్రశ్నించుకోవాలి.

ఏకాంతపు దిలీప్ said...

తల్లి దండ్రులకి అమ్యామ్యాలు వచ్చేస్తాయి అనుకుని, పెద్దవాళ్ళని అర్ధం చేసుకోవడానికి
ప్రయత్నించడం పూర్తి అవగాహన లేకుండా మాట్లాడటమవుతుంది.
అలా అందరి విషయంలో జరగదు కాబట్టి. ఒకవేళ అలా జరుగుతుంటే దీన్ని వాళ్ళు సరిగ్గా పాటించనట్టే.


ఈ ఇచ్చుకోవడాలు/పుచ్చుకోవడాలు ఉండకుండ ఉండాలి అంటే, ఒక తరం తను సంపాదించుకున్నది
తన తరవాత తరానికి ఇవ్వకూడదు అనే నియమం పెట్టుకుంటేనే సాధ్యం అవుతుంది.

ఎన్ని తరాలు వెళ్ళినా అలా జరగదు కాబట్టి ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతూనే ఉంటుంది.

కొంతమంది ఆదర్శంతో తన తరవాత తరానికి ఇవ్వరు, పుచ్చుకోరు. అలాంటి వాళ్ళు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తారు.
కొంతమంది ఇవ్వడానికి ఏమీ సంపాదించుకోరు. అలాంటి వాళ్ళల్లో కొంతమంది ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తారు.
కొంతమంది ఇలా ఇచ్చి పుచ్చుకోవడం సరిగా జరగక అనర్ధాలు జరగడం చూసి మంచిదికాదేమో అనుకుంటారు.


అది ఆమోదయోగ్యంగా జరుగుతున్నంత వరకు ఎవరికీ నష్టం లేదు.

కానీ ఆ పేరు చెప్పి అనర్ధాలు జరిగితే మాత్రం ఖండించాల్సిందే.

ఏకాంతపు దిలీప్ said...

ఇది చివరకి ఆయా కుటుంబాల సమస్యగానే అర్ధం చేసుకోవాల్సి వస్తుంది. చివరికి ఆస్థిని
ఏ విధంగా పంచుకోవాలనుకుంటున్నారు అనేదాని మీద ఆధారపడి ఉంటుంది.

చిన్న కుటుంబాలొచ్చిన తరవాత ఆస్థిని పెళ్ళప్పుడే పంచుకోవడం పరిపాటైపోయింది.
అది ఆడ వాళ్ళకైనా, మగవాళ్ళకైనా. పూర్వం ఆడవారి పేరు మీద ఆస్థి చెల్లేది
కాదు. అప్పుడు మగాడి పేరు మీదే అంతా ఉండేది. అది కట్నం అన్నారు. అప్పట్లో అది దురాచారమే.
ఎందుకంటే అటు పుట్టింట్లోను, ఇటు మెట్టినింట్లోనూ ఆస్థిపై ఎమీ హక్కులుండేవి కాదు కాబట్టి.

ఇప్పుడు చెల్లుతుంది. ఆస్తి పంచుకోవడం పూర్తిగా చట్టబద్ధం. ఈ కాలంలో పెళ్ళప్పుడు అమ్మాయికిచ్చేది
అబ్బాయి పేరు మీద రాయడం చాలా అరుదు. కనీసం నాకు తెలిసినంతవరకు అలానే జరుగుతుంది.
అందుకే దీన్ని కట్నం అంటారో లేదో ఒకసారి ప్రశ్నించుకోవాలి.

ఒకవేళ అమ్మాయిలు సమస్యని పూర్తిగా అర్ధం చేసుకోకుండా నాకు ఆస్థిలో వాట వద్దు
అనుకున్నట్టైతే వాళ్ళు ఆస్థి పరమైన కొన్ని హక్కులు పోగొట్టుకుంటున్నట్టే. అది మరలా వాళ్ళని వాళ్ళు
కొన్ని తరాలు వెనక్కి నడిపించుకుంటున్నట్టే. ఒకవేళ అల వద్దనుకుంటే, ఎందుకు వద్దనుకుంటున్నారో
తమ వాటాగా వచ్చేదాన్ని ఏమి చెయ్యాలనుకుంటున్నారో అవగాహన ఉండటం మంచిది. లేకపోతే
వయసులో ఆవేశంగా నిర్ణయాలు తీసుకుని, వయసయిపోయాక చేదోడు లేకుండా అసహాయులుగా అభాసుపాలవుతారు.

సమస్యని పూర్తిగా అర్ధం చేసుకోకుండా, ఏవో కొన్ని దురాగతాలని చూపి ఉద్యమాలు లేపినంతమాత్రాన ఏమీ జరగదు.

చేసినవాళ్ళు ఉద్యమకారులుగా గుర్తింపు పొందుతారేమొ కానీ, సమస్య పరిష్కారం కాదు.

సుజాత వేల్పూరి said...

అబ్రకదబ్ర,
మీరు కట్నాన్ని సమర్థిస్తున్నారని నేనెలా అంటాను? మీరు మీ బ్లాగులో ఒక సారి "...కట్నం తీసుకోకుండా పెళ్ళి చేసుకున్నా...దానికి నా అహమే కారణం.." అని చెప్పినట్టు గుర్తు!(కరెక్టుగా చెప్పానా, అవే పదాలా, తప్పు చెప్పానా? గుర్తులేదు సరిగా)"మనకెందుకు" అని వదిలేయడం సరికాదని మాత్రమే అన్నాను నేను.

Kathi Mahesh Kumar said...

@దిలీప్: కట్నం ఒక వ్యక్తిగత కుటుంబ స్థాయిదాటి ఒక సామాజిక స్టేటస్ సంపాదించేసుకుంది. ఆస్థి పంపకాలతో సంభంధాలు లేకుండా ఉద్యోగానికీ,కులానికీ బట్టి కట్నం రేట్లున్న మన ఆంధ్రప్రదేశ్ లో మీరు కట్నం యొక్క ప్రాతిపదికని ఇంత scientific గా చెప్పడానికి ప్రయత్నించడం చిత్రంగా వుంది.

ఇప్పుడు కట్నం స్త్రీధనమో, ఆస్థి పంపకమోకాదు. అదొక సామాజిక గౌరవం. ఎవరెంతిస్తే అంత, ఎవరు ఎంతతీసుకుంటే అంత గౌరవం. ఇందులో ఆమోదయోగ్యాలూ, అరాచకాలూ లేవు దోపిడీతప్ప.దీనికా మీరు ఆచారం అని పేరు పెడుతున్నారు...

పెద్దవాళ్ళని ఏమని "అర్థం" చేసుకోవాలి? డబ్బు "అవసరం" లేకపోయినా కేవలం మగపిల్లవాడి తల్లిదండ్రులైనందుకు అధికారికంగా డబ్బుతీసుకోవడం వారి హక్కు అని అర్థం చేసుకోవాలా ! లేక ఆడపిల్లను కన్నందుకు, కడుపుకట్టుకునైనా కట్నం డబ్బులు ముట్టజెప్పాలనే నిర్ణయానికొచ్చినందుకు అర్థం చేసుకోవాలా !! ఎందుకు హర్షించాలి? ఎలా అర్థం చేసుకోవాలి?

ఆస్థి పంచుకోవడానికీ కట్నం అడగటానికీ అసలు లంకెలేదని మీరు గుర్తించాలి. పెళ్ళి సమయంలో కేవలం ఆడపిల్ల గనక చెల్లించే రుసుము కట్నం. ఆ తరువాత ఆస్థి separate గా కావాల్సిందే.ఆడవారికి ఆస్థిహక్కు కల్పించిన తరువాత కట్నం రేట్లు ఇంకా పెరిగాయని గుర్తించండి. Right to property has nothing to do with dowry system.

సమస్యని అర్థం చేసుకోకుండా ఎవరూ ఈ విషయాల గురించి మాట్లాడటం లేదు. కాకుంటే చాలా మంది ఇది అసలు "సమస్యే కాదు" అనుకోవడం వలన వస్తున్న తికమక ఇది. శరీరంలో రక్తమంత సాధారణంగా మన జీవితాల్లో కట్నం మన సమాజంలో ఆవరించుకుంది. అందుకే చట్టవ్యతిరేకమే అయినా సామాజిక sanction వుండటమేకాక, గౌరవప్రదంగా మారింది.

ఏకాంతపు దిలీప్ said...

@ మహేష్
మీరు ఈ విషయాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేదని చెప్పగలను.

ఈనాటి పరిస్థితుల్లో అమ్మాయికి ఏదైనా ఇవ్వగలిగింది ఉంటే అది పెళ్ళప్పుడే ఇచేస్తున్నారు. పంచే ఆస్థినే కట్నంగా చూస్తున్నారు తప్పితే, కట్నం వేరుగా ఉండదు.ఆ ఇచిన ఆస్థి పెళ్ళి కొడుకి పేరు మీద ఉండదు, అత్త మామల పేరు మీద కూడా ఉండదు అన్న కనీస జ్ఞానాన్ని మీరు తెలుసుకుని ఉండాలి. అమ్మాయి పేరు మీదే ఉంటుంది. కొడుకుకి కూడా పెళ్ళప్పుడు రాస్తున్నారు. తల్లిదండ్రులు తమ జీవనం కోసం కొంచెం ఉంచుకుంటున్నారు. వాళ్ళ తదనంతరం ఆ ఉంచుకున్న ఆస్థి కూడా పిల్లలకి సమానంగా పంచుతున్నారు. ఇక్కడ అంతా ఆమోదయోగ్యంగానే ఉంటుంది. అంతా సంతోషంగానే జరిగిపోతాయి. ఒకవేళ ఈ విషయాన్ని మీరు ఒప్పుకోకపోతే మీరు పాత చింతకాయ పచ్చడిని తింటున్నట్టే. ఒకసారి ఈకాలంలోకి రండి. అంతా మీరు చూపిస్తున్న బూచిలా ఉండదు.


పెళ్ళప్పుడు అమ్మాయి వాటా కన్నా ఎక్కువ ఆశిస్తూ బేర సారాలు జరపడం అనేది అందరూ( అందరూ అనేట్టు కట్నం తీసుకునేవాళ్ళు కూడా) ఖండించే విషయమే. అలా జరగడాన్ని దురాచారం అంటున్నాను.

స్త్రీ ధనాన్ని, ఆస్థి పంపకాన్ని ఒక్కచోట కట్టకండి.

కట్నం అంటే ఆస్థి పంపకం కాదు ఇప్పుడు అంటున్నారు. మీకు తెలిసి అది ఎప్పుడైనా ఆస్థి పంపకమా? అని అడుగుతున్నాను.

నేను కట్నం గురించి సైంటిఫిక్ గా చెప్పడానికి ప్రయత్నించడంలేదు. అది ఆమోదయోగ్యంగా, ఆరోగ్యకరంగా నెరవేర్చుకునే కుటుంబాలలో ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉందో చెప్పడానికి ప్రయత్నించాను.

ఇప్పుడు ఆ ఆస్థి ఇచ్చి పుచ్చుకోడం కట్నం అనే పాత పేరుతోనే జరుగుతుంది. ఆ పేరుని చూసి, అభ్యంతరం వ్యక్తపరిచేవాళ్ళు అసలు ఏంజరుగుతుందో చూడకుండా పాత కాలపు ఆలోచనలతోనే అసలు ఆ పద్ధతినే వ్యతిరేకిస్తున్నారు. కానీ ఇచ్చి పుచ్చుకునేవాళ్ళు మాత్రం ఆనందంగా బతుకుతున్నారు.

సమాజంలో కొన్ని ఆచారాలు ఉంటాయి. కొన్ని అందరూ పాటించేవి ఉంటాయి. కొన్ని కొందరే పాటించేవి ఉంటాయి. ఆ ఆచారాన్ని ఆరోగ్యకరంగా పాటించేవాళ్ళు ఉంటారు. అరాచకంగా పాటించేవాళ్ళు ఉంటారు. నేను అరాచకంగా( అంటే బేరసారాలు జరపడం, హింసించడం ) జరిపేవాటికి వ్యతిరేకమే.

"ఆస్థి పంచుకోవడానికీ కట్నం అడగటానికీ అసలు లంకెలేదని మీరు గుర్తించాలి. పెళ్ళి సమయంలో కేవలం ఆడపిల్ల గనక చెల్లించే రుసుము కట్నం. ఆ తరువాత ఆస్థి సెపరతె గా కావాల్సిందే.ఆడవారికి ఆస్థిహక్కు కల్పించిన తరువాత కట్నం రేట్లు ఇంకా పెరిగాయని గుర్తించండి."
లంకే ఉంది అని మీరు అర్ధం చేసుకోవాలి. ఆ హక్కు వచ్చినతరవాత ఆడవారికి వారికి న్యాయంగా రావాల్సిన వాట వస్తుంది కాబట్టి( దాన్నే కట్నం అంటున్నారు కాబట్టి) కట్నం పెరిగినట్టు మీరు గుర్తించాలి.

"Right to property has nothing to do with dowry system."

డౌరీ సిస్టెం అని దాన్ని వ్యవస్థీకరిస్తున్నారు అదేదో మీరే కనిపెట్టినట్టు. నా చుట్టు జరిగే పెళ్ళిళ్ళన్నిటిలోను నేను పైన చెప్పేట్టే జరుగుతుంది. పేళ్ళప్పుడు చాలా వరకు ఆస్థి పంపకం జరిగిపోతుంది. మిగిలినది తల్లిదండ్రులు పోయిన తరవాత పంపకం జరుగుతుంది.

అసలు కట్నంగా చెప్పుకునేదాని గురించి కొంత అవహగాహన కలిగించడం నా ఉద్దేశం. అంటే మీరు పూర్తిగా దురాగతాలను చూసి వ్యతిరేస్తున్నప్పుడు, నేను ఎటువంటి దురాగతాలు జరగకుండా ఆనందంగా, ఆమోదయోగ్యంగా జరిగే సంగతిని కూడా చెప్తున్నాను.

ఇప్పుడు ఆ పద్ధతిని మంచిగా పాటించని వాళ్ళు కొన్నాళ్ళ తరవాత ఇచ్చేవన్నీ అమ్మయిపేరు మీద రాసి ఇస్తారు అంతేగానీ ఇది అంతం అవ్వదు. తల్లిదండ్రులు తమ సంతానానికి తము సంపాదించినది ఇవ్వాలి అనుకున్నంతవరకు అంతం అవ్వదు.

కామేశ్వరరావు said...

మహేష్ గారి టపా గురించి ఇంత పెద్ద చర్చ నాకైతే చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది!
వ్యక్తిగత సమస్యకీ సామాజిక సమస్యకీ మధ్యనున్న తేడా గమనించకపోవడం ఇంత గందరగోళాన్ని సృష్టించిందనుకుంటాను. ఒక సమస్య సమాజంలో చాలా కొద్దిమంది వ్యక్తులకి మాత్రమే పరిమితమై, అది ఆ వ్యక్తులని మాత్రమే affect చేస్తే అది వ్యక్తిగతసమస్య అవుతుంది. ఒక సమస్య సమాజంలో ఎక్కువ (significant percentage) మంది వ్యక్తులకి వర్తించి, కొందరు వ్యక్తులవల్ల సమాజంలో మరికొందరు వ్యక్తులు affect అవుతూ ఉంటే దాన్ని సామాజికసమస్య అంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని "కట్నం" వ్యక్తిగతసమస్యో సామాజికసమస్యో ఆలోచించండి.
పెళ్ళి అనేది కేవలం ఇద్దరు వ్యక్తులకీ లేద రెండు కుటుంబాలకీ మాత్రమే సంబంధించిన వ్యవహారం అని అనుకోవడం తప్పని ముందుగా అర్థం చేసుకోవాలి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, అది సాంఘికమైన కట్టుబాటు. పెళ్ళికి మనకి తెలుసున్నవాళ్ళందరినీ పిలవడమూ, పెళ్ళిని చట్టబద్ధంగా నమోదు చేసుకోవడమూ, సమాజంలో చాలా పనులకి మన వైవాహిక స్థితి అవసరం ఉండడమూ ఇలా చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు, పెళ్ళి సామాజికమైన అంశమని గుర్తించడానికి. ఇదే నేపథ్యంలో, ఆడపిల్లకి పెళ్ళికాకపోతే సామాజికంగా ఎదుర్కోవాల్సిన వివక్షని గుర్తించాలి. మళ్ళీ, "ఎవరో అతి కొద్దిమంది పెళ్ళికాకుండా హాయిగా జీవితాన్ని సాగిస్తున్నారు" అని చెప్పి ఇది సామాజికసమస్య కాదనడం పొరపాటు.
ఇప్పుడు కట్నం విషయానికి వస్తే, ఒకటి - ఈ కట్నం అనేది ఎంతమంది ఆడపిల్ల తల్లిదండ్రులకి ఒక గుదిబండగా మారిందీ? కట్నం వేధింపులు ఎంత శాతం సమాజంలో ఉన్నాయి? నాకు తెలిసి (మానవ హక్కులు మొదలైన NGOల రిపోర్ట్ల ప్రకారం), ఇది చాలా significant percentageలోనే ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా సామాజికసమస్యగానే పరిగణించాలి.
రెండు - కట్నం (ఏ రూపంలోనయినా) "డిమాండ్" చెయ్యడం (మగపెళ్ళివారు ఇవ్వమనికానీ, ఆడపెళ్ళివారు ఇస్తామనికానీ) హీనమని నా అభిప్రాయం. ఎందుకంటే అది పెళ్ళిని వ్యాపారంగా దిగజారుస్తుంది కాబట్టి (వ్యాపారాత్మక ధోరణి ఉన్నవాళ్ళు దీన్ని తప్పుపట్టకపోవచ్చు గాక). చిత్రమేవిటంటే, కట్నం ఇవ్వగలిగిన స్తోమత ఉన్నవాళ్ళకి ఈ "డిమాండ్" తప్పుగా తోచదు. కాబట్టి దీన్ని సమస్యగా పరిగణించరు. కానీ దీనివల్ల నష్టపోతున్నది స్తోమత లేనివాళ్ళు. వాళ్ళ శాతం మన దేశంలో ఎక్కువ. అంచేత ఇలా చూసినా ఇది వ్యక్తిగత సమస్యకాదు, సామాజిక సమస్యే. కాబట్టి "కట్నం" డిమాండు చెయ్యడం నైతికంగా (నా నైతికవిలువల ప్రకారం) తప్పు, సామాజిక సమస్య కూడాను. ఇక ఆస్తిపంపకం విషయానికివస్తే, అది పెళ్ళిసందర్భంలో (స్వఛ్చందంగానే అయినా) ఎందుకు జరగాలి? ఇదీ స్వఛ్చందంగా కట్నం ఇవ్వడం లాటిదే. ఎంతోకొంత ఆస్తి పోగుచేసినవాళ్ళకి ఇది తప్పుగా తోచకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ఈ ఆచారం అమలులోకివచ్చిందో, అప్పుడే దీనిగురించిన "డిమాండ్" అమలులోకి వచ్చినట్టే! ఎవడు ఎక్కువ ఆస్తిని తన కూతురుపేర రాస్తాడో వాడికే preference ఇవ్వడం, పెళ్ళయ్యాక భార్యని తన ఆస్తివాటా రాయించుకోమని వేధింపు - ఇవన్నీ దాని పర్యవసానమే.
ఈ ఆచారాన్ని కొంతమంది సజావుగానే పాటించవచ్చు. కానీ అది ఎక్కువమందికి కీడు చేస్తోంది. ఎవరు సజావుగా పాటిస్తున్నారో ఎవరు లేదో పోల్చడమూ కష్టమే! అంచేత దీన్ని మొత్తంగా నిర్మూలించడానికి ప్రయత్నించక తప్పదని నా ఉద్దేశం. శరీరంలో ఒక భాగంలో కేన్సరు బాగా పాకిపోతే, ఆ శరీరభాగం తీసివెయ్యక తప్పదు. అందులో కేన్సరుకణాలు కానివికూడా ఉంటాయి కదా!
ఈ సమస్యకి నాకు తోచిన రెండు ముఖ్య కారణాలు:
1. కట్నం అడగడమూ, ఇవ్వడమూ నైతికంగా తప్పు కాదు అన్న భావన
2. పెళ్ళికాని ఆడవాళ్ళ పట్ల సమాజంలో వివక్ష
ఈ రెండిటి మీదా ప్రజలలో (ముఖ్యంగా యువతలో) అవగాహన ఏర్పడినప్పుడే దీనికి పరిష్కారం. చట్టం యీ విషయంలో పూర్తిగా విఫలమయ్యిందన్నది నిర్వివాదాంశం. తాము సంపాదించుకొనే స్థాయికి వచ్చిన తర్వాత, తమ తల్లిదండ్రుల సంపాదన తాము వాడుకోకూడదూ అన్న వివేచన యువతకి కలిగితే, అంతకన్నా మంచి పరిణామం మరొకటి ఉండదు (అది కట్నం సమస్యనే కాదు, చాలా సమస్యలని పరిష్కరిస్తుంది!).

Kathi Mahesh Kumar said...

@దిలీప్ : కట్నాన్ని "ఆనందంగా, ఆమోదయోగ్యంగా" కొందరు పాటిస్తున్నారని మీరు అనడాన్ని మించిన ప్రమాణంగా ఈ ఆచారం యొక్క వ్యవస్థీకరణకు చూపనఖ్ఖరలేదు.

ఏ మ్యారేజ్ బ్రోకర్ దగ్గరకో బ్యూరోదగ్గరకైనా వెళ్తే, మీకు కులాల్నిబట్టీ, అబ్బాయి ఉద్యోగాన్ని బట్టీ కట్నం రేట్లున్నాయి అని నేను అంటుంటే, మళ్ళీ మీరు అమ్మాయికిచ్చే ఆస్థిపంపకమే కట్నం అని వాదిస్తుంటే, మీరు తెలీనివారైనా వుండాలి లేక కట్నాన్ని నరనరాలూ "సాధారణమే" అని జీర్ణించుకుపోయిన యువతకు ప్రతినిధైనా అయ్యుండాలి.

పైపెచ్చు నాకు ఈ విషయం సహృదయతతో అర్థం చేసుకునే మనసు లేదనీ, ఇంకా పాత చింతకాయపచ్చడిని తింటున్నాననీ ఎద్దేవా చేస్తున్నారు. ఈ కట్నాల బిరియానీకన్నా నాకు పాతచింతకాయపచ్చడే బెటర్.

కాకపోతే, కన్వీనియంట్గా మీరు, సాధారణంగా జరుగుతున్నదాన్ని కట్నం అనే పాతపేరుతో నాలాంటివాళ్ళు "బూచిని" చేస్తున్నారనడం మీ limited understanding of this social evil ని తెలుపుతోంది. ఒకసారి హైదరాబాద్ దాటి ప్రపంచాన్ని చూడండి. కొన్ని లక్షల మధ్యతరగతి కుటుంబాలు ఈ విధానం వల్ల తమ జీవితాల్ని గుల్ల చేసుకుంటున్నాయో తెలుసుకోండి. మీకు తెలిసిన ఆనందకరంగా కట్నాన్ని అనుభవిస్తున్న వారికన్నా వీరి సంఖ్యం కొన్ని వేల రెట్లు ఎక్కువనే నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి.

భైరవభట్ల గారు రాసిందికూడా చదవండి.

Anil Dasari said...
This comment has been removed by the author.
Anil Dasari said...

@మహేష్

మీతో విబేధించే కామెంట్లపై మీ ప్రతిస్పందన అప్పుడప్పుడూ వ్యక్తిగత స్థాయిలోకి వెళుతుంది. రాసే విధానంలో హుందాతనానికేమీ ఢోకా లేకపోయినా, అందులోనుండి వ్యంగ్యం తొంగి చూస్తుంది. కాస్త గమనించండి.

@సుజాత

నేను పాటించాను కదా అని దాన్ని అందరి మీదా రుద్దకూడదు కదండీ. వద్దనుకోవటానికి నా కారణాలు నావి .. అహం మొదటిది, అదికాక మరికొన్ని. అలాగే, కావాలనుకోవటానికి ఎవరికుండే కారణాలు వాళ్లకుంటాయి కదా. అయినా, వరకట్నం విషయంలో ఇంతకు ముందంత ఘోరంగా రోజులు లేవనే నేను అనుకుంటున్నాను. ఉద్యోగావకాశాలు పెరగటం, అమ్మాయిలూ అబ్బాయిలూ స్వతంత్రంగా బ్రతకటానికే ఇష్టపడటం, చిన్న కుటుంబాలు, ఇతరత్రా కారణాలెన్నో దీనికి. దిలీప్ చెప్పింది చాలావరకూ నిజం. వేధింపుల దాకా పోనంత వరకూ ఇందులో మిగతావాళ్లు కలగజేసుకోనవసరం లేదని నా అభిప్రాయం.

Kathi Mahesh Kumar said...

@అబ్రకదబ్ర: వ్యాఖ్యనిబట్టే నా సమాధానాలు ఉంటాయి. ఒకవేళ ఎక్కడైనా నా సమాధానంలో వ్యగ్యం తొంగిచూస్తే, దయచేసి నేను సమాధానం ఇస్తున్న వ్యాఖ్యని ఒక సారి చూడగలరు. వారి వ్యాఖ్యల్లోని ఎత్తిపొడుపుకన్నా నా వ్యగ్యం sophisticated గానే వుందని గ్రహించగలరు.

నా ఉద్దేశం నేను నమ్మినదాన్ని అందరి మీదా రుద్దడం ఏమాత్రం కాదు. వ్యాసంలో ఆ తరగా సూచనకూడా ఎక్కడా లేదు.నేను విన్న నిజం, నాకొచ్చిన ఆలోచన, నేనుపడ్డ ఆవేదనే ఈ టపా ప్రాతిపదిక.

"మీవాళ్ళలో ఈ మధ్య రేట్లు ఎలావున్నాయి?" అని పక్కవారిని అడగ్గానే, కులాలవారీగా రేట్లు తెలుస్తున్నప్పుడు.అసలు కట్నం ఆస్థిపంపకంలోనే భాగాలుగా అంగీకారాత్మకంగా జరిగుతున్నాయనే వాదన యొక్క హేతువుని మాత్రమే ప్రశ్నిస్తున్నాను.

సుజాత వేల్పూరి said...

అబ్రకదబ్ర,
అమ్మాయిలూ, అబ్బాయిలూ స్వతంత్రంగా బతకాలనుకోవడం, ఉద్యోగావకాశలు పెరగడం....కట్నం వీటన్నింటికీ అతీతమైనది. మీరు అనుకుంటున్నట్టు ఇదివరకటి కంటే పరిస్థితి మెరుగు పడలేదు సరి కదా ఇంకా హీనంగా మారిపోతోంది రోజు రోజుకీ! కులాల పేర్లు ఎత్తానని అనుకోకపోతే, కమ్మ, రెడ్డి కులాల్లో ఇప్పుడు 'రేట్లు ' కోట్లలో ఉన్నాయంటే నమ్మగలరా? ఎందుకు? రూపాయి విలువ పడిపోవటం వల్లనంటారా? లేక మనుషుల్లో డబ్బాశ పెరిగిపోవడం వల్లనంటారా?

రంగనాయకమ్మ ఒక కథలో అంటుంది "బాల్య వివాహాలు పోయాయి, కన్యాశుల్కం పోయింది..సహగమనం పోయింది...ఇదీ(ఒక దురాచారం గురిచించి ప్రస్తావిస్తూ) పోతుంది..కాకపోతే కొంచెం టైం కావాలి" అని...! అది కట్నానికి వర్తించదు. మా అక్కల పెళ్ళిళ్ళ (ఇరవై రెండేళ్ళ నుంచి) వింటున్నాను....కొన్నాళ్ళు పోతే కట్నాలు పోతాయి, ఇంకా మాట్లాడితే కన్యాశుల్కం వస్తుంది...అనే మాటలు! ఆడపిల్లల సంఖ్య రోజు రోజుకీ ఘోరంగా పడిపోతున్నా...కట్నాలకేమీ ఢోకా లేకుండా నడిచిపోతూనే ఉంది.

"కట్నం కావాలనుకోవడానికి ఒకటే కారణం! "డబ్బు" ని వద్దనుకోలేకపోవడం! అంతకంటే బలమైన కారణాలు ఏమి కావాలి ?

Anil Dasari said...

@సుజాత:

ఈ వాదన తెగేది కాదు. ఎవరి అభిప్రాయాలూ మారెవి కూడా కాదు. దీన్నింతటితో వదిలేద్దాం :) అయితే చివరగా నాదో మాట.

>> "కమ్మ, రెడ్డి కులాల్లో ఇప్పుడు 'రేట్లు ' కోట్లలో ఉన్నాయంటే నమ్మగలరా?"

నమ్మను. ఆ రెండింటిలో ఒకదానికి చెందినవాడిగా insider news నాకు బాగా తెలుసు. బయటివాళ్లనుకునేంత వెర్రిగా కోట్లలో కట్నాలు కట్టబెట్టే ఆచారమేమీ అక్కడ లేదు. వీళ్లలో ఆస్థిపరుల సంఖ్య ఎక్కువ కాబట్టి వీళ్లందరూ కట్నాలు వెర్రిగా ఇచ్చి పుచ్చుకుంటారనే అభిప్రాయం బయటివాళ్లలో పాతుకుపోయుండొచ్చు. (Whistle blower అవతారమెత్తానని కులబహిష్కారం చేసేస్తారేమో నాకు :)

సుజాత వేల్పూరి said...

అబ్రకదబ్ర,
అవును, ఇది తెగదు, వదిలేద్దాం!

మీరు నమ్మకపోయినా ఆంధ్రాలో జరుగుతున్న సంగతులు చెప్తున్నాను. ఆగస్టు పదిన మా కిందింట్లో పెళ్ళి జరిగింది. రెడ్లు! కాలిఫోర్నియాలో ఉద్యోగం! కొంచెం పొలిటికల్ బాక్ గ్రౌండ్ కూడా ఉంది ఫామిలీకి! పిల్లతో పరిచయం ఇంటర్నెట్లో!ప్రేమ అని పేరు. పెళ్ళి గురించి పెద్ద మాట్లాదుకున్నారు. కట్నం 1.75 కోట్లు, మిగిలిన పాతిక లక్షలు బంగారం! మీకు రావిపాడులో చుట్టాలున్నారంటే ఊహించాను మీరెవరో! అయితే మీలో మాత్రం తక్కువా ఏమిటి? కానీ మిమ్మల్ని మాత్రం మన్స్పూర్తిగా అభినందిచాల్సిందే!

ఇలాంటివి బోలెడు. కోటంటే కోటి కాకపోవచ్చు! అంతకు సమీపంలోనే ఉన్నాయి రేట్లు!

జ్యోతి said...

కామెంటు ముదిరి టపా ఐనట్టుంది. పెళ్ళీడుకొచ్చిన అమ్మాయి, అబ్బాయి ఉన్న తల్లిగా నా అభిప్రాయలు నా బ్లాగులో చూడండి.

MURALI said...

కట్నం పుచ్చుకోనేవారిగురించే కాదు ఇచ్చేవారి గురించి కూడా తెలుసుకోవాలి గా. తమ అమ్మాయిని ప్రేమించిన స్కూలుమాష్టరు కి కాకుండా ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని ఎన్ని లక్షలు పోసయినా తెస్తాం అనుకునే తల్లిదండ్రులు లేరా? కుర్రాడు బుద్దిమంతుడు మంచివాడూ అయితే సరిపోడు. మా అల్లుడు ఇది అని గర్వంగా చెప్పుకొనే స్థాయి కావాలి. మా పక్కింటి వాళ్ళ కంటే, మా బందువులందరికంటే గొప్ప అల్లుడు కావాలి అనుకోనే వాళ్ళు ఉన్నప్పుడు కట్నం ఇలానే కొనసాగుతుంది.



మంచి స్థాయి ఉద్యోగాలు ఉంటే తప్ప అబ్బాయిలకి పిల్లనివ్వరు. అబ్బాయిలు తమకు నచ్చే అమ్మాయికావాలంటే మంచి ఉద్యోగం ఆస్థి తప్పనిసరి అయి కూర్చుంది. వీటిని అందిపుచ్చుకోడానికి మధ్యతరగతి అబ్బాయిలు చదువుకోసం ఉద్యోగ ప్రయత్నం కోసం లక్షలు ఖర్చుపెడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో కట్నం అనివార్యమైన సంధర్భాలు ఉన్నాయి. కాబట్టి మన చర్చల్లో వీటికి కూడా స్థానం కల్పించాలి

Bolloju Baba said...

పోష్టు అదిరింది.
కామెంట్లు రంజుగా ఉన్నాయి.
బుర్ర ఫ్రై అయ్యింది.
థాంక్స్

బొల్లోజు బాబా

Anonymous said...

ప్రేమ గుర్తు పక్కన డాలర్ సింబల్ పెట్టారేంటి? అమెరికాలో కట్నాల గొడవ లేదనుకుంటాను :)

కొత్త పాళీ said...

చర్విత చర్వణం .. ఎప్పటికీ ఉయ్యలేం!

-- said...

With the kids earning fiv figure salaries, is dowry still relevant these days?

imho, With all the education and empowerment of girl child, the parents of telugu grooms are at the receiving end. Grooms are finding it difficult to adjust to the demanding brides

i composed some observations on my blog at http://indyhandy.blogspot.com/

--Cine Valley