Tuesday, September 23, 2008

వ్యక్తిగత స్వేచ్చ - విచ్చలవిడితనం


నా కథ ‘యాధృఛ్చికం - ఒక ప్రేమకథ’ తరువాత, కొంత చూచాయగానూ మరికొంత సూటిగానూ ‘వ్యక్తిగతస్వేచ్చ’ పట్ల నాకున్న ధృక్కోణాన్ని ప్రశ్నిస్తూ కొంత చర్చ జరిగింది. ఆ చర్చల నడుమ నాకు అర్థమైన విషయం ఎమిటంటే, నేను "వ్యక్తిగత స్వేచ్చ" అనగానే, విచ్చలవిడితనానికి ప్రోత్సాహమిస్తున్నానేమో ! అనే అపోహ చాలామందికి కలగడం. పైపెచ్చు, నేను ఉద్భోధించే వ్యక్తిగతస్వేచ్చ చాలావరకూ ప్రేమలూ, sexuality నేపధ్యంలో ఉండటం వలన ‘లైగింక స్వేచ్చ’కు, ‘వ్యక్తిగతస్వేచ్చ’ అనే ముసుగు తగిలించి ప్రచారం చేస్తున్నానేమో!! అన్న సందేహం కొందరికి కలుగుతోంది. ఈ నేపధ్యంలో వ్యక్తిగతస్వేచ్చ అనే ఒక విస్తృతమైన జీవనవిధానాన్ని గురించి కొంత విశదంగా వివరించాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది.'వ్యక్తిగతస్వేచ్చ విచ్చలవిడితనానికి దారితీస్తుంది' అనేది కొంతవరకూ అపోహైతే, మరికొంత స్వేచ్చ పేరు చెప్పి మిడిమిడిజ్ఞానంతో నిర్ణయాలు తీసుకుని, ఆ తరువాత తీరిగ్గా బాధపడే కొందరి ప్రవర్తన కారణంగా బలపడిన నమ్మకం. వ్యక్తి స్వేచ్చ అనేది మానవవిధానంలోని అత్యంత పరిపూర్ణమైన స్థాయి. ఈ స్థాయి informed decision making capacity ద్వారా వస్తుంది.


జీవితాన్ని ఆనందమయం చేసుకునే "అన్ని" మార్గాల్నీ తెలుసుకుని, అవి తన జీవితంలో తెచ్చే మార్పుల్ని కూలంకషంగా అర్థం చేసుకుని, గుర్తెరిగి ఆ నిర్ణయాన్ని ఒక option గా exercise చెయ్యడాన్నే మనం "informed decision making" అంటాము. దానికోసం అవసరమైన life skills education వ్యక్తులకు కావాలి. కేవలం లైంగిక స్వేచ్చను వ్యక్తిగత స్వేచ్చ అనుకోవడం కొంత అవగాహనా రాహిత్య కిందకే వస్తుంది. బహుశా కొందరు ఈ విసృత విషయాన్ని అర్థం చేసుకోక, కేవలం తమ అవసరానికో లేక ఆపద్ధర్మంగా ఈ రెంటినీ interchangeable గా వాడటం వలనకూడా ఈ అపోహ కలగడానికి ఆస్కారం ఉంది.


'వ్యక్తిగత స్వేచ్చ', 'పెళ్ళి' ఒకదానికొకటి వ్యతిరేకం కాదు. పెళ్ళి అనే విధానంలోకి మనిషి తన ఇష్టంతో, ఒక choice ప్రకారం నిర్ణయించుకోవడంకూడా వ్యక్తిగతస్వేచ్చే కదా ! బాగా చదువుకున్న అమ్మాయి పెద్ద కంపెనీలో ఉద్యోగం వదిలి...I have a better job to attend to అని, మనస్ఫూర్తిగా భర్త, పిల్లలూ,ఇల్లూ చూసుకుంటానంటే తప్పేముంది? ఇది వ్యక్తిగత స్వేచ్చ కాదంటారా? కాబట్టి, బాధ్యత తీసుకొని తమ జీవిత నిర్ణయాల్ని తామే తీసుకునే ప్రతి ఒక్కరూ "అనవసరమైన సామాజిక ఆంక్షల" నుంచీ విముక్తి కోరతారు. తోడికోడలు చెల్లెలి మొగుడు ఏమనుకుంటాడో అని మన జీవితాల్ని మార్చుకునే బదులు, నాకు ఆనందం ఇస్తుంది కాబట్టి ఈ పని నేను చేస్తాను అనడమే వ్యక్తిగత స్వేచ్చ.


దీనివలన సమాజానికివచ్చే పెద్ద ప్రమాదం అస్సలు లేదు. వ్యక్తిగత స్వేచ్చ మూల ఉద్దేశం "ఆనందం". అలాంటప్పుడు,మాటిమాటికీ పోరాడుతూ ఉండటంవల్ల ఆనందం ఉండదు. అందుకే, వీరు సైలెంటుగా ఈ విప్లవాన్ని తమజీవితాల్లోకి అన్వయించుకుని చుట్టాలకూ, పక్కాలకూ, వీలైతే వీరికి లంకెలుగా పనిచేసే తల్లిదండ్రులకూ దూరంగా ఉండి సుఖంగా బతుకుతూ ఉంటారు. వీరి జీవితాలలో ఆనందాలేతప్ప ఆబ్లిగేషన్లుండవు. ఒక సారి మీ జీవితాన్ని పరికించి చూసుకోండి ! ఈ "నలుగురి" వల్లా మీ జీవితంలో ఆబ్లిగేషన్లు ఎక్కువై, మీ హక్కైన ఆనందాన్ని కోల్పోతుంటే...break free కావాలనిపించదూ! అదే వ్యక్తిగతస్వేచ్చకై మనిషి మనసులో మోగే నగారా.


లైంగిక స్వేచ్చ, వ్యక్తిగత స్వేచ్చలో ఒక చిన్న భాగం మాత్రమే. Consenting free individuals గా ఉన్నంతవరకూ ఈ విధమైన 'బాధ్యతాయుత' లైంగికత చట్టప్రకారంకూడా నేరం కాదు. కానీ, అది ఇద్దరికీ మధ్య ఒక informed choice గా ఉండటం అతి ముఖ్యం. ఒకరినొకరు మోసం చేసుకుంటూనో లేక ఒకరు ఇంకొకర్ని మోసం చేస్తూ ఉంటే అది వ్యక్తిగతస్వేచ్చ పరిధిలోకి రాదు. కేవలం "మోసం" అవుతుంది. అంతే!


ఇక పెళ్ళి అనే social contract లోకి ఇష్టపూర్వకంగా, స్వనిర్ణయంతో అడుగుపెట్టిన తరువాత, మనకు మనం ఇచ్చుకునే గౌరవం ఆ బంధాన్ని పాటించడం. కానీ ఒకవేళ అలా జరగకపోతే ఆ "తప్పుకు" పూర్తిబాధ్యత వహించి, ఫలితాన్ని గౌరవప్రదంగా అనుభవించాలి. అప్పుడే వ్యక్తిగతస్వేచ్చకు సార్థకత. వ్యక్తిగతస్వేచ్చ అంటే బాధ్యతలు లేని విచ్చలవిడితనం కాదు, తమ జీవితానికి తామే స్వతంత్ర్యంగా బాధ్యత వహించే స్థైర్యం.


మనకోసం మనం బ్రతకడం మనుషులుగా మనహక్కు. కేవలం 'తనకోసమే మనం బతకాలి' అనుకునే ఈ సమాజ పోకడల్ని నిరసించడం వ్యక్తిగత స్వేచ్చని ఆకాంక్షించే వ్యక్తిగా నా కర్తవ్యంగా బావిస్తాను.


వ్యక్తిగత స్వేచ్చ అనే ఒక సమగ్ర జీవన విధానాన్ని చాలా మంది ఒక scoring point గా వాడి లైంగిక స్వేచ్చకు సమానాంతరం చేసేయడం వల్లనే 'మనుషులు వ్యక్తిగత స్వేచ్చను కోరుకుంటే అది విచ్చలవిడితనంగా మారుతుందనే standard conditioning బలంగా నాటబడింది. ఈ అపోహ కొనసాగినంతకాలం, వ్యక్తిగత స్వేచ్చను సమగ్రంగా అర్థం చేసుకోకుండా కేవలం తమ బలహీనతల్ని కప్పిపుచ్చుకోవడానికి కొందరు వాడుతున్నంతకాలం ఈ అపార్థాలూ, అనుమానాలూ, అపవాదులూ,వాదనలూ తప్పవు.


నావరకూ వ్యక్తిగతస్వేచ్చ ప్రతి mature human being యొక్క ఆకాంక్ష కావాలి. అప్పుడే ఒక evolved society గా మనం మనగలం.

*ఈ టపాకు మూలకారణమైన ‘మనసులోమాట’ సుజాత గారికీ, అబ్రకదబ్ర గారికీ ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు.

****

22 comments:

MURALI said...

వ్యక్తిగత స్వేచ్చ అనే పదాన్ని దుర్వినియోగం చేయటం వలన అదో ఇంక్విలాబ్ శబ్దంలా, బూతులా తయారయ్యిందన్న మాట వాస్తవం. ఇప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులు ఆ మాటవింటే బయపడేలా రూపాంతరం చెందింది ఆ పదం.

అబ్రకదబ్ర said...

దుర్వినియోగం చేసేవారివల్ల స్వేచ్ఛ అనే పదానికి విచ్చలవిడితనం అన్న పెడార్ధమొచ్చిందని మీరన్న మాట అక్షరసత్యం. అయితే 'మనకోసం మనం బ్రతకటం మనుషులుగా మన హక్కు' అన్నది నిజమే కానీ రకరకాల కారణాలవల్ల కొన్నిసార్లు సమాజం కోసం మనకి ఇష్టం లేని పనులు చేయాల్సొస్తుంది. ఆ మాత్రం అడ్జస్ట్‌మెంట్ ఉండాల్సిందే, తప్పదు. మరీ ఎక్కువగా సర్దుకుపోయేవారు మాత్రం, చూసేవారిని బట్టి - కొందరికి చేతగానివారుగానూ, కొందరికి నిస్వార్ధపరులుగానూ, మరికొందరికి వ్యక్తి స్వేచ్చకి అర్ధం తెలియని వారుగానూ కనిపిస్తుంటారు. అసలు సర్దుకుపోని వారేమో స్వార్ధపరులు/మొండివాళ్లు గా కనిపిస్తుంటారు.

మహేశా, అంత మంచి తెలుగు రాయగలిగుండీ ఈ మధ్య ఆంగ్ల వాక్యాలెక్కువ మిళాయిస్తున్నావేమిటీ? కొంచెం ఓపిక చేసుకుని పూర్తి తెలుగులోనే రాయి స్వామీ.

teresa said...

చదుతూ నేను ఎమి కామెంట్‌ రాద్దామనుకుంటూ వచ్చానో అదే అబ్రకదబ్ర గారు రాసేశారు. Ditto to his first paragraph!

chaitanya said...

abrakadabra garu,

firstly my congratulations to you for standing up for human values.There is a difference between animals and humans, ie moral values, which the society formed for the good of human beings.

you rightly elicited the same fact abrakadabra garu.I'm proud of you for condemning the wrong, each time with lots of patience ! Men like you are really needed for the society's happiness !Not those, who are waiting to take advatage of women, on the name of a "free society".

The author again wrote an ans, which just re-iterates the story...on the name of freedom, people are " Freeeeee" to do what they want !

నాగమురళి said...

మంచి వ్యాసం. నేను ఇంతకు ముందు దీని గురించి మీరు రాసిన టపాలు గానీ, చర్చ గానీ చదవలేదు. వ్యక్తిగత స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనమనే దురభిప్రాయం నాకెప్పుడూ లేదు.

మీరన్నట్టుగానే వ్యక్తిగత స్వేచ్ఛ ఒక mature human being యొక్క లక్షణం. అది విచ్చలవిడితనానికి దారి తీస్తుంది అని నేను అనుకోను. అయితే నిజంగా విచ్చలవిడిగా బతికే ఉద్దేశ్యం గానీ, స్వభావంగానీ ఉన్నవాళ్ళని కూడా నియంత్రించాలనీ, వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛని కట్టడి చెయ్యాలనీ కూడా నేను అనుకోను. మరొకళ్ళకి హాని కలిగించనంతవరకూ ఎవరు ఎలా ప్రవర్తించినా నష్టమే లేదని నా అభిప్రాయం.

వ్యక్తిగత స్వేచ్ఛ అన్న భావననే సరైన రీతిలో అర్థం చేసుకోలేని మెజారిటీ ఉన్న ఈ సమాజంలో, వ్యక్తిగత స్వేచ్ఛని మించిన ఒకానొక maturity level ఉన్నదని చెప్పబూనడం కూడా అవివేకం అవుతుంది.

అది ఏమిటంటే - బాధ్యతాయుతమైన నియంత్రణ. అంతే కాదు, తన వ్యక్తిత్వం కరిగిపోయి, తన వ్యక్తిగత స్వేచ్ఛ అన్న భావమే మరిచిపోయేంతగా ఒక బాధ్యతలో సంతోషంగా, స్వచ్ఛందంగా లీనమవ్వడం. వ్యక్తిగత స్వేచ్ఛలో ఎంతసేపూ తన పరిధిని ’కాపాడుకోవడం’ మాత్రమే ఉంటుంది. వ్యక్తిగత స్వేచ్ఛ కన్న పై స్థాయిని చేరుకున్నవాళ్ళకి, తమ పరిధి కరిగిపోయి, అందరితోనూ మమేకమైపోవడం ఉంటుంది.

అతి వివేకవంతురాలైన ఒక తల్లి తన పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచుతూనే, సరదాగా ఉంటూ, ఆటపాటల్తో అలరిస్తూ బాధ్యతాయుతంగా పెంచుతుంది. తనకంటూ ప్రత్యేకంగా సరదాలూ, జీవితమూ కావాలని కోరుకోదు.

ఏ వ్యక్తి అయినా సరే, సమాజంలోనూ, కుటుంబంలోనూ తన ‘పాత్ర’ ఏమిటో చక్కగా అవగాహన చేసుకుని, స్వచ్ఛందంగా సంతోషంగా, సరదాగా ఆ పాత్రలో లీనమై తన బాధ్యతల్ని నిర్వర్తిస్తే, అప్పుడు కలిగే అనుభూతి ‘వ్యక్తిగత స్వేచ్ఛ’ కన్నా ఉన్నతమైనది అని నేను భావిస్తాను. అప్పుడా వ్యక్తికి ఒక ’ప్రత్యేకమైన’, తనదైన వ్యక్తిత్వం అంటూ ఏమీ ఉండదు. ఒకానొక గొప్ప ’విస్తృతి’ (expansion) అతనికి అనుభూతమౌతుంది. శరీరంలో కాలూ, చెయ్యీ తమకి తాము స్వంత వ్యక్తిత్వాలు కలిగి ఉండకపోయినా ఒకే శరీరంలోని అఖండ భాగాలుగా ఎలా ప్రవర్తిస్తాయో, అదే విధంగా ఆ వ్యక్తి తన కుటుంబంతోనూ, తన చుట్టూ ఉన్న సమాజంతోనూ మమేకమై అవిభాజ్యమైన అనుభూతిని పొందుతాడు. అప్పుడు అతను అనుభవించే మన:స్థితినే మోక్షమంటారని (అంటే, తనకంటూ ఒక ప్రత్యేకమైన అస్తిత్వం లేని స్థితి), ఒక మహానుభావుడి ద్వారా నేను తెలుసుకున్నాను.

తన చుట్టు ఉన్నవాళ్ళతో మమేకం కావడానికీ, తన వ్యక్తిత్వపు పరిధిని దాటడానికీ, కొంత మానసిక క్రమశిక్షణ అవసరం అవుతుంది. చాలా సహజంగా అటువంటి క్రమశిక్షణ అలవడడానికి కావలసిన సాధనని, వివాహ-కుటుంబ సాంప్రదాయాలూ, మతాచారాలూ, నమ్మకాలూ అందిస్తాయని నా భావన. అందుకోసమే ప్రతిదాన్నీ పవిత్రంగా చూడడాన్ని పెద్దలు అలవాటు చెయ్యడానికి ప్రయత్నిస్తారు.

నేను పైన చెప్పిన విధంగా తమ పాత్రని పోషించిన కొంతమంది ‘పాతకాలం వాళ్ళ’కి ఎంతో అన్యాయం జరిగిందనీ, వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ హరించబడిందనీ మనం అనుకుంటూ ఉంటాము. అయితే ఈ కాలానికి అదంతా ఒక ఉటోపియా. అందమైన కల. లేదా మోసపుచ్చే భావన. అయితే ఆ భావన నాకు నచ్చింది కాబట్టీ, ఇంతకాలానికి నాకు బాగా నచ్చిన ఒక టపా మీరు రాశారు కాబట్టీ, నా భావాలు కూడా మీతో పంచుకుందామనిపించి, ఇదంతా రాశాను.

అబ్రకదబ్ర said...

@నాగమురళి:

అద్భుతంగా చెప్పారు. ఇంతకన్నా గొప్పగా మేమెవరం చెప్పలేమేమో.

@చైతన్య:

నన్ను మునగ చెట్టెక్కించకు బాబూ/పాపా (ఇది అమ్మాయి పేరో అబ్బాయిదో నాకెప్పుడూ కన్‌ఫ్యూజనే). నేనంత ఘనకార్యం ఏమీ చెయ్యలేదు. (ఏమాటకామాటే. మీ పొగడ్త పసందుగా ఉంది. అభిమానగణం మరికాస్త పెరిగాక 'పందిరాజ్యం' పార్టీ తప్పకుండా పెట్టాల్సిందే)

chaitanya said...

abrakadabra garu,
I'm not trying to climb you up on some tree, really !!! it's a heart felt compliment ! so plz take the gift ! '

pandi rajyama'... hahahaha.

raja said...

I read the story n it seemed 'great' for many people, and i dint understand why ! the girl/guy just know each other for a day !according to author, the end needn't be marriage( okay ,okay) and this is called 'vyakthigatha swecha'! so, a person can choose to use this 'swecha' with whoever he likes ( irrespective of how long n according to him, our society's values are over-rated ! I tell this 'coz it's not possible to know anyone in a day even if u talk 24 hrs to call it 'love' ).

If the other person is in a weak situation, just offer support n get back something in return and then, if the woman expects marriage as a result of it ... it's reminded that it's 'love', which shudnt be give n take ! ( like the author's comments on ramani garu's q ! )

The author questions saying, women also take 'advantage' of men ! true ! no doubt ! but in the story, it's not clearly the case...'coz the women is self-prone to q's herself if it's wrong...this doesnt happen if she's the one who wanted to take advantage of the man !

I just saw abrakadabra garu, sujatha garu, teresa garu,laxmi garu, chivukula garu, ramani garu for raising your voices ! I appreciate all of you for it ! you are all, what it takes to a society of humans, with values and morals !

otherwise, we cud just quit it all up, and follow the animal instincts ( hey, we do have that 'vyatigatha swecha !' )

raja said...

nagamurali garu, i forgot u in the list!

బొల్లోజు బాబా said...

సమాజంలో మన నడత, మానవసంబంధాలపై మీ పోష్టులు నాకున్న అవగాహనకు మంచి పదునుపెడుతూ ఉంటాయి.
ఎప్పుడు చదివినా ఎంతో కొంత కొత్త పరిజ్ఞానాన్ని తెలుసుకొంటూనే ఉంటున్నాను.

అబ్రకదబ్రగారు,మురళి గారు మంచి వివరణలనిచ్చారు.

బొల్లోజు బాబా

Chivukula said...

@నాగమురళి - అద్భుతం.

ప్రసాదం said...

వ్యక్తిగత స్వేచ్చ అన్న పదాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళే ఎక్కువ. తన వ్యక్తిగత ఆనందం కోసం ఏదైనా చేయచ్చు కానీ ఫలితంగా వచ్చే బాద్యతల్నీ తలకెత్తుకోగలగాలి.

చాలా మంచి వ్యాసం.

ప్రసాదం

కత్తి మహేష్ కుమార్ said...

@మురళి: సగంజ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే! ఇక దుర్వినియోగం కానిది బహుశా ఏదీ లేదనుకుంటాను. వ్యక్తిగతస్వేచ్చ అనే పదం ఇందుకు మినహాయింపు కాదు.సమాజం మాత్రం తన అధికారాల్ని దుర్వినియోగం చెయ్యటం లేదంటారా?

@అబ్రకదబ్ర: ఆశ్చర్యంగా లేదుగానీ, మనం చాలా విషయాలలో విభేధిస్తూ అంగీకరిస్తాం. సమాజంలో మనడానికి అవసరమైన అడ్జస్టుమెంట్ ని నేను అంగీకరించినా, అది వ్యక్తిత్వాన్ని హరించేస్థాయికి వస్తే నిర్ధ్వందంగా తిరస్కరిస్తాను. బహుశా స్వార్థపరుడు/మొండివాడు అనే qualification నాకు ఎప్పుడో వచ్చేసినట్లుంది.

ఇక ఆంగ్లపదాల విషయానికొస్తే,కొన్ని భావప్రకటనలకు ఆ భాష తేలిక. అంతేకాక, ఆ భావాల్ని తెలుగులో చెప్పాలంటే దాదాపు ఒక పేరా రాయాల్సి వస్తోంది. కాబట్టి ఇలా కానిచ్చేస్తున్నాను. అయినంతవరకూ తెలుగులో రాయడానికే ప్రయత్నిస్తాను. కుదరకపోతే, ఇక తప్పదు.

@చైతన్య:మీరు తీసుకున్న నైతిక positioning తోనే నాకున్న సమస్య.సమాజం నిస్వార్థంగా మనల్ని ఉద్దరించడానికి లోపాలు లేని వ్యవస్థని సృష్టించిందనుకోవడం ఒక పెద్ద అపోహ.వ్యక్తిగత స్వేచ్చని తన స్వార్థంకోసం చాలా సార్లు సమాజం కన్వీనియంట్ గా అణచడానికి ప్రయత్నిస్తుంది. దాన్నే కరెక్ట్ అనుకుంటే మనిషి ప్రగతి సాధించడు.Conformist approach to living will never lead you to progress of human race and life itself.

తరచిచూస్తే,మానవీయ విలువలకీ, సమాజం ఉధ్బోధించే నైతిక విలువలకీ నక్కకూ నాగలోకానికీ ఉన్నంత వైరుధ్యం ఉంది.నిజానికి వ్యక్తిగతస్వేచ్చే మానవీయ విలువలకి చాలా దగ్గరగా ఉంటుంది.

మీ వ్యాఖ్యలోనూ వ్యక్తిగతస్వేచ్చా- లైగికస్వేచ్చలమధ్యనున్న అపోహ సుస్పష్టంగా గోచరిస్తోంది.

@నాగమురళి:మీరు చెప్పిన వ్యక్తిగతస్వేచ్చని మించిన హద్దులు లేని విశ్వజనీయమైన సౌభ్రాతృత్వాన్ని నేను అంగీకరిస్తాను.

కానీ,పక్కనున్న మనిషి ఆశలకూ ఆంకాంక్షలకూ గౌరవాన్ని ఇవ్వలేని మనుషులు కనీసం వ్యక్తిగతస్వేచ్చ ప్రాముఖ్యతని అంగీకరించకపోయినా కనీసం అర్థం చేసుకుని భావవైశాల్యం చెందగలరేమో అనేదే నా ఆశ.

క్రమశిక్షణ కోసం ఆపాదించబడిన పవిత్రతల్ని సమాజం తన స్వార్థంకోసం ఉపయోగించుకొంటున్నప్పుడు, వ్యక్తిగతస్వేచ్చ మనిషిని స్వతంత్రుడ్ని చెయ్యగలదని నమ్ముతాను. అది అత్యంత అవసరం కూడా అని ప్రఘాడంగా విస్వసిస్తాను.

@రాజ: కథలో ఎక్కడా justification కోసం ‘వ్యక్తిగతస్వేచ్చ’ అనే పదం నాయకుడుగానీ, రచయితగానీ వాడలేదు. ఈ చర్చ కేవలం నా భావజాలానికి సంబంధించిన ప్రశ్నల నుంచీ ఉదయించిన విషయం మాత్రమే.

మీరు కథలోని ఘటనని, ముఖ్యంగా అమ్మాయితరఫునుంచీ advantage తీసుకోబడింది అని ప్రతిపాదించారుకాబట్టి, కొంత వివరణ అవసరంగా భావిస్తున్నాను.

ఒక కథకుడిగా నా కథను కొలవాల్సిన సాహితీ పరికరాల్ని (literary tools) అందించడం అంగీకారాత్మకం కాకపోయినా,అపోహల్ని తొలగించడానికి అవసరం కాబట్టి ఇక్కడ రాస్తున్నాను.

అమ్మాయి తరఫునుంచీ కథ యొక్క నెరేటివ్ లేకపోయినా, సైకో అనాలసిస్ ద్వారా subtext ని గమనిస్తే, ఆ అమ్మాయి భావాల్ని కనుక్కోవడం పెద్ద కష్టంకాదు. అంతేకాక,దీనికి బలం చేకూరేలా రచయిత కావల్సినన్ని suggestions కథలోకూడా పొందుపరిచాడు.

మొదటి సంభాషణద్వారా ఆక్షణంలో aversion feel అయినా,ఆ అమ్మాయికి తన తండ్రిపట్ల ఉన్న Electra complex ని నాయకుడు అనాలోచితంగా తట్టిలేపాడు. అందుకే వారి రెండో సంభాషణ మొత్తం తన తండ్రిలేమిని గురించి, తద్వారా కలిగిన శూన్యతను గురించీ జరిగింది.

ఈ processలో నాయకుడు "father fixation" కి అనుకూలంగా కనపడటం చాలా సహజ ప్రక్రియ. ఒకసారి అమ్మాయి అలా డిసైడ్ అయ్యాక నాయకుడిలో "anchor" ని వెదుక్కోవడం ఈ ప్రేమకు తొలిమెట్టు.

"మా పరిచయంలో తను ఒక నమ్మకాన్ని చూసుకుంటే, నాకు తనపై కలిగిన ఇష్టం నామీద నాకే మరింత నమ్మకాన్ని కలిగించింది" అనే ఒకవాక్యం ఇద్దరి మన:స్థితికి అద్దం పడుతుంది. ఇక్కడ ఇద్దరిదీ మానసిక పూరకమైన అవసరం. దానిని ప్రేమన్నా,కాంక్షన్నా పెద్ద తేడా లేదు.

కేవలం పెళ్ళి ఉద్దేశంగానే ప్రేమ ఉండాలి ఆనేది ఒక సామాజిక ఆంక్షకాబట్టి దానికి కావల్సిన కొలతలూ,తూలికలూ,బేరీజులూ ఇక్కడ జరగలేనంతమాత్రానా "తప్పు" అనాలా? అన్నదే నా కథ. ఇలాగే జరగాలి అని నా కోరికకాకపోయినా, అలా జరిగినా తప్పులేదు అనేది మాత్రం నా నమ్మకం.

@బొల్లోజు బాబా:మీనుంచీ చాలా నేర్చుకొంటూ ఉన్నాను. నేనూ కొంత తెలియజెప్పగలిగానంటే కొంత repay చెయ్యగలిగానన్నమాట! చాలా స్వాంతన కలిగించే మాటన్నారు.

@ప్రసాద్: అటు సమాజిక కట్టుబాట్లనూ ఇటు వ్యక్తిగతస్వేచ్చనూ దుర్వినియోగం చేసేవాళ్ళు ఎక్కువే, అందుకే రెంటినీ కూలంకషంగా అర్థం చేసుకోవడం అవసరం. ఈ ప్రయత్నం ఆదిశలో భాగమే. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

సుజాత said...

అయితే రాసేశారన్న మాట! ఇంక చర్చించడానికేం లేదు!

athmakatha said...

సెల్ఫ్-రెగులారిటి లేని వ్యక్తిగత స్వేచ్చ...వ్యక్తిగత స్వేచ్చ లేని సెల్ఫ్-రెగులారిటి... రెండూ బూడిదలో పోసిన పన్నీరే...

భైరవభట్ల కామేశ్వర రావు said...

మహేశ్ గారు,
ఎప్పటిలానే ఓ వేడివేడి అంశాన్ని టపాకట్టించారు :-)
మీరు రాసిన దాంట్లో పెద్దగా ఖండించడానికేవీ లేదు. అయితే కొన్ని ప్రశ్నలని మాత్రం రేపింది.
"informed decision making" అంటే "జీవితాన్ని ఆనందమయం చేసుకునే "అన్ని" మార్గాల్నీ తెలుసుకుని, అవి తన జీవితంలో తెచ్చే మార్పుల్ని కూలంకషంగా అర్థం చేసుకుని, గుర్తెరిగి ఆ నిర్ణయాన్ని ఒక option గా exercise చెయ్యడాన్నే మనం "informed decision making" అంటాము" అని వివరించారు, బావుంది. అయితే
1. ఇంతటి గొప్ప అవగాహనా శక్తి ఎవరికైనా ఉంటుందా? ఎంతమందికి ఉంటుంది? లేనివాళ్ళ సంగతేమిటి?
2. ఎవరి జీవితాన్ని ఆనందమయం చేసుకోడానికి? తన జీవితం మాత్రమేనా? ఒకరి ఆనందం మరొకరికి బాధ కలిగించేదయితే అప్పుడు కూడా అది సరైన నిర్ణయమే అవుతుందా?
3. ఇలాటి అవగాహన రావాలంటే, "life skills education" అవసరం అన్నారు. ఇదేవిటి? ఎలా సంపాదించవచ్చు?
4. "తోడికోడలు చెల్లెలి మొగుడు ఏమనుకుంటాడో అని మన జీవితాల్ని మార్చుకునే బదులు, నాకు ఆనందం ఇస్తుంది కాబట్టి ఈ పని నేను చేస్తాను అనడమే వ్యక్తిగత స్వేచ్చ." అన్నారు నిజమే. అది తోడికోడలు చెల్లెలి మొగుడు కాకుండా తన సొంత మొగుడైతే? దీనికి గీతలేమైనా ఉన్నాయా? ఉంటే ఏమిటి ఎవరు నిర్ణయిస్తారు?
5. "ఇక పెళ్ళి అనే social contract లోకి ఇష్టపూర్వకంగా, స్వనిర్ణయంతో అడుగుపెట్టిన తరువాత, మనకు మనం ఇచ్చుకునే గౌరవం ఆ బంధాన్ని పాటించడం. కానీ ఒకవేళ అలా జరగకపోతే ఆ "తప్పుకు" పూర్తిబాధ్యత వహించి, ఫలితాన్ని గౌరవప్రదంగా అనుభవించాలి. అప్పుడే వ్యక్తిగతస్వేచ్చకు సార్థకత." అన్నారు ఇదీ బావుంది. అయితే ఈ పెళ్ళివ్యవహారం ఇద్దరు వ్యక్తులకి సంబంధించింది కాబట్టి ఒకరి తప్పుకు మరొకరు ఎంతవరకూ బాధ్యత వహించాలి? ఉదాహరణకొక వ్యక్తికి భార్యా (ఇంకా ఎదగని)పిల్లలూ ఉన్నారు. అతనికి హఠాత్తుగా ఈ లోకం మీద విరక్తి పుట్టి, అడవులకి వెళ్ళి తపస్సు చేసుకోవాలనుకుంటాడు. అప్పుడతని నిర్ణయాన్ని వ్యక్తిగత స్వేచ్ఛ అని గౌరవించాలా, బాధ్యతా రాహిత్యం అని నిరసించాలా?
6. "నావరకూ వ్యక్తిగతస్వేచ్చ ప్రతి mature human being యొక్క ఆకాంక్ష కావాలి". "Matured Human being" అంటే? ఎవరికి వారే తమనితాము matured అనుకుంటారు కదా?

రమణి said...

నాగమురళీ గారు చాలా బాగా చెప్పారండి. మీతోటి అబ్రకదబ్రగారితోటి ఏకీభవిస్తున్నాను.

కత్తి మహేష్ కుమార్ said...

@భైరవభట్ల కామేశ్వర రావు: "మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవి" అని నేను చెప్పలేకున్నా,ఈ విషయం మీద నేను నమ్మే కొన్ని అభిప్రాయాల్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను.
1.Informed decision making కోసం కావల్సింది బ్రహ్మజ్ఞానం కాదు. కొంత ఇంగితజ్ఞానం,వ్యక్తిత్వం ఉంటేచాలు.దానికి తోడు జీవితాన్ని ప్రేమించడం,కొత్త విషయాలు తెలుసుకోవాలనే భావవైశాల్యం కావాలి. చాలా వరకూ సమస్య ఈ చివరి విషయంలో వస్తుంది.

మన చదువులు గుడ్డెద్దుచేలోబడ్డట్టు బట్టీపట్టించినవి అవ్వడం వలన, ప్రశ్నించి నేర్చుకునే విధానాన్ని తృణీకరించడం వలన, చాలావరకూ second hand life వెళ్ళదీస్తూ జీవితాన్ని బ్రతకడంతప్ప ప్రేమించి ఆస్వాదించడానికి తగ్గ ప్రాముఖ్యత ఇవ్వలేకపోతున్నాము.

ఈ స్పృహ సంపాదించడానికి ఎక్కువ సమయంగానీ, ప్రత్యేకమైన కోచింగ్ గానీ అవసరం లేదు.కాస్త open mind ఉంటే చాలు. ఇదీ కష్టమే అనుకుంటే...ఇక మార్పు దరిదాపుల్లో లేనట్లే.

2.Your freedom ends at my nose అన్నట్లు, ప్రతిఒక్కరి స్వాతంత్ర్యం ఎదుటివారి స్వేచ్చను హరించనంతవరకూ మాత్రమే పరిమితమై ఉంటుంది.కానీ సమాజాన్ని ఉద్దరిస్తున్నామనుకునేవారు ఈ స్వేచ్చనే సమాజాన్ని ఉద్దరించడానికి హరిస్తున్నామంటారు. అక్కడినుంచీ వచ్చేదే ఈ భావవైరుధ్యం.

3.Life skill education గురించి బహుశా ఇంకో టపా రాయాల్సి వస్తుందేమో! కానీ ఇక్కడ కొంత ఉటంకిస్తాను. పేరు suggest చేసినట్లు,ఒక వ్యక్తిలో జీవితానికి అవసరమయ్యే సామర్థ్యాన్ని పెంపొందించే చదువే ఇది.

దీని పార్శ్వాలు చాలానే ఉన్నా,Communication &interpersonal skills, decision making and critical thinking skills,coping and self management skills దీనిలో ముఖ్యమైన భాగాలుగా గుర్తిస్తారు. వీటి గురించి తెలుగులో కొంత విశదంగా మరో టపాలో రాయడానికి ప్రయత్నిస్తాను.

ఇవి సంపాదించడానికి కొంత ఉత్సుకత,మరికొంత బ్రతుకుని అధికారికంగా జీవించాలనే కోరికా ఉంటే చాలు.

4.వ్యక్తిగతస్వేచ ముఖ్యోద్దేశం వ్యక్తి సంతోషమైనప్పుడు, తన సంతోషాన్ని కాపాడే వ్యక్తుల్ని మాత్రమే దరికిజేరనిచ్చి మిగతావాళ్ళ అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడమే దీనిలోని కిటుకు!

ఇక్కడ భర్త జీవితంలో "అవిభాజ్య" భాగంకాబట్టి,negotiation space తక్కువగా ఉన్నా స్వేచను కాపాడుకునే బాధ్యత ఆ వ్యక్తికి ఉంటుంది. అదీ సామరస్యంగా...If you remember..."present happiness should not be the reason for your future shock"

5.వ్యక్తిగత స్వేచ్చ మీనుంచీ గౌరవాన్నిగానీ, నిరసనలుగానీ expect చెయ్యటం లేదు.తన జీవితాన్ని తాను విజయవంతంగా వెళ్ళదియ్యడంలో మీ(సమాజం) ప్రమేయం అవసరం లేదు అంటోంది. అలాంటప్పుడు మీ approval అవసరం ఉందంటారా?

ఇక మీరు లేవనెత్తిన ప్రశ్నకు మళ్ళీ 2 లో ఉన్న అభిప్రాయమే వర్తిస్తుంది.

6.ప్రతివ్యక్తినీ ఒక ప్రత్యేక వ్యక్తిగా గుర్తించడం అవసరం. No two individuals are same. ఈ ప్రకారంగా ప్రతిఒక్కరి level of maturity కూడా వేరుగా ఉంటుంది. దాన్నిబట్టే వాళ్ళ aspiration for వ్యక్తిగతస్వేచ్చ ఉంటాయి.

వ్యక్తిగతస్వేచ్చకు మూసలుకట్టి standardize చెయ్యలేము. అది ఈ భావనకే విరుద్ధం.

@సుజాత: చర్చ ఇంకా కొనసాగించచ్చులెండి. ఇదేమీ దైవ వాక్యం కాదుకదా "ఇదే ఫైనల్" అనడానికి!

@ఆత్మకథ: మీతో ఏకీభవించకుండా ఉండలేం.

నాగమురళి said...

సందర్భం వచ్చింది కాబట్టి నేను చదివిన ‘ఆవు వ్యాసం’ గురించి ఉటంకించకుండా ఉండలేను.

వ్యక్తి స్వేచ్ఛని హరించడానికి ఆధునిక యుగంలో పెద్ద యెత్తున జరిగిన ప్రయత్నాలన్నిటికీ ఒక ప్రాతిపదిక ఉన్నది. ఆ ప్రాతిపదిక ఏమిటంటే, ప్రతి మనిషీ ఒక తెల్ల కాగితం (Blank Slate) లాగా జన్మిస్తాడనీ, ఆ కాగితం మీద ఏది రాస్తే, అది అలాగే ప్రవర్తిస్తుందనీ, ఇది చాలా scientific theory అనీ నమ్మడం. సమానత్వం పేరుతో అందరు మానవులూ clones మాదిరిగా లోపల ఒకటే అని భావించడం. ఎవరి ప్రత్యేకతని బట్టి వాళ్ళకి ప్రత్యేక అవకాశాలు కల్పించాలని ఎవరైనా అంటే, రాళ్ళేసి కొట్టడం.

ఈ విధమైన scientific గుడ్డి నమ్మకాల మూలంగానే కమ్యూనిస్టు, ఫాసిస్టు రాజ్యాల్లో లక్షలమందిని ఊచకోతలు కొయ్యడం జరిగిందని Steven Pinker తను రాసిన ‘The Blank Slate' అన్న పుస్తకంలో రాస్తాడు.

ఆ పుస్తకం చదివాకా అనిపించింది - మనం చాలా simple minded people అనీ, కొన్ని చిన్న చిన్న సత్యాల్ని పట్టుకుని, పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రంలాగా వాటినే వల్లిస్తూ ఉంటామనీను.

భైరవభట్ల కామేశ్వర రావు said...

@ మహేష్:
1. Informed decision making గురించి అడిగితే, మీరు second hand life, open mind అంటూ మరో రెండు పదాలు పడేసారు! ఇవన్నీ చాలా subjective terms, Informed decision makingతో సహా అని నాకనిపిస్తుంది. అలాగే, మీరన్న ఇలాటి అవగాహనా శక్తి ఎంతమందికి ఉండగలదునుకుంటున్నారో చెప్పలేదు. నాకయితే ఎవరికీ మీరన్న "అన్ని" మార్గాలని గురించి తెలియడం, మార్పులగురించి కూలంకషంగా చర్చించగలగడం వంటివి అసాధ్యం అనిపిస్తోంది. ఆ రకంగా ఆలోచిస్తే నాకిది బ్రహ్మజ్ఞానమనే తోస్తోంది.
2. దీన్నికూడా మీరు open endendగానే సమాధానం ఇచ్చారు. ఇక్కడకూడా నాకు subjectivity ఎక్కువగా కనిపిస్తోంది.
3. మీరు చెప్పిన skills నాకు తెలిసి managementలో కొన్ని ప్రత్యేకమైన ఫలితాలని దృష్టిలో పెట్టుకొని ఇచ్చే శిక్షణలో భాగాలు. జీవితానికీ ఇలాటి విలువలే ఉండాలని మీ ఉద్దేశం అయి ఉండొచ్చు. ఉండక్కరలేదని నా ఉద్దేశం.
4. "భర్త జీవితంలో అవిభాజ్య భాగం" అన్నారు, కానీ (ప్రతి)భార్య దృష్టిలో కాకపోవచ్చు.
5. దీనికి రెండవ ప్రశ్న జవాబే అన్నారు కాబట్టి, ఒక నిర్దిష్టమైన సమాధానం లేదనే నాకర్థమయ్యింది.
6. "వ్యక్తిగతస్వేచ్చకు మూసలుకట్టి standardize చెయ్యలేము. అది ఈ భావనకే విరుద్ధం". దీనితో నేను ఏకీభవిస్తాను.
ఈ చివరి పాయింటు నుంచి, ఇది చదివాక నాకు వచ్చిన ఆలోచనలని వివరించడానికి ప్రయత్నిస్తాను.
మనిషి సంఘజీవిగా ఎప్పుడు మారేడో, అప్పుడే వ్యక్తికీ సంఘానికీ మధ్య సంఘర్షణ కూడా మొదలయ్యింది. ఏ కాలంలోనైనా, ఏ సమాజంలోనైనా, వ్యక్తిగత స్వేచ్ఛకీ సంఘానికీ మధ్య ఎంతోకొంత వైరుధ్యం ఉంది. వ్యక్తికి ఎలాటి స్వేచ్ఛ ఉండాలి, ఎంత స్వేచ్ఛ ఉండాలి అన్నది సంఘం నిర్ణయిస్తుంది. సంఘం అంటే ఇక్కడ నా ఉద్దేశం "బలమైన" వర్గం. ఈ బలమైన వర్గం ఆర్థిక సంబంధాలపై ఆధారపడి ఏర్పడుతుంది అని మార్క్సిజం చెపుతుంది. దానితో నేను పూర్తిగా అంగీకరించక పోయినా, "బలమైన" వర్గం సంఘంలో కట్టుబాట్లని నిర్ణయిస్తుందనడంలో ఎలాటి సందేహం లేదు. సంఘం విధించిన కట్టుబాట్లకి వ్యతిరేకత చూపేవారు ఎప్పుడూ ఉన్నారు, ఉంటారు. అంటే వ్యక్తిగత స్వేచ్ఛకి ప్రాధాన్యం ఇచ్చేవారు అన్ని కాలాల్లోనూ అన్ని సమాజాల్లోనూ ఉంటారు. అయితే "వ్యక్తిగత స్వేచ్ఛ" అంటే ఏమిటి అన్నది వేర్వేరు కాలాల్లోనూ, వేర్వేరు సమాజాల్లోనూ వేరువేరుగా ఉంటుంది. ఒకే కాలంలో, ఒకే సమాజంలో ఒకరికి వ్యక్తిగత స్వేచ్ఛ అయినది వేరొకరికి విశృంఖలత కావచ్చు కూడా! అయితే ముందు చెప్పినట్టుగా "బలమైన" వర్గానికి ఏది విశృంఖలతో అది సమాజం మొత్తమ్మీద విశృంఖలతగా చెలామణీ అవుతుంది. దాన్నికాదని దానిమీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఉంటారు. అలాటివాళ్ళు "బలమైన" వర్గంగా మారితే అప్పుడు పూర్వమున్న విశృంఖలత వ్యక్తిస్వేచ్ఛగా మారుతుంది. ఇంతకుముందున్న వ్యక్తిస్వేచ్ఛ సంఘం విధించిన సంకెలగా, కట్టుబాటుగా అనిపిస్తుంది.
ఇది ఇటునుంచి అటుకూడా కావొచ్చు. అంటే, ఒక కాలంలో వ్యక్తిస్వేచ్ఛ మరో కాలంలో విశృంఖలతగా పరిగణింప బడవచ్చు.
అంచేత మనం అనుకుంటున్న ఈ వ్యక్తిస్వేచ్ఛ, విశృంఖలత ఇవేవీ "శాశ్వత" విలువలు కావు. శాశ్వత విలువలంటూ ఏమైనా ఉన్నాయా అంటే ఏమో నాకు తెలియదు అని నా సమాధానం.
self-regulation, స్వేచ్ఛని దుర్వినియోగం చెయ్యటం ఇవన్నీ కూడా సాపేక్షమైన పదాలే (relative terms).

everythingisprecious said...

@భైరవభట్ల కామేశ్వర రావు
మీ మొదటి వ్యాఖ్య ఈ టపా చూసాక నాకు వచ్చిన సందేహాలను articulate చేసింది.
కానీ మీ రెండొ వ్యాఖ్యలో...వ్యక్తిస్వేచ్చ శాశ్వత విలువ కాదని చెప్పారు. ఒకనాటి వ్యక్తిస్వేచ్చ విశృంఖలతగా పరిగణింపబడటం(vice-versa), వ్యక్తి స్వేచ్చ పట్ల సమాజం యొక్క perceptionlo వచ్చిన మార్పు మాత్రమే.
వ్యక్తి స్వేచ్చ ఎప్పటికీ ఒకటే కదా.

@కత్తి మహేష్ కుమార్
Each person's aspirations are predisposed by his/her experiences. My experience is true for me. It need not necessarily be true for others. Just as individual freedom cannot be standardized, experience also cannot be standardized.
Though You didn't mean standardization of experience explicitly , the skills you had mentioned imply such a thing.

కత్తి మహేష్ కుమార్ said...

@గంగాభవాని:life skill education అనేది ఒక జీవితంలో ఉపయోగపడేనిర్ణయాలు తీసుకోవడానికి పనికొచ్చే frame work ని మాత్రమే చెబుతుంది. కానీ దాన్ని అన్వయించుకుని జీవితాన్ని అనుభవించడం (experiencing it)మళ్ళీ వ్యక్తి ఆధారితమైనదే.

ఈ విధానం experience ని standardize చేసేప్రయత్నం అస్సలు చెయ్యదు.కేవలం నిర్ణయానికి కావల్సిన పనిముట్లని మాత్రం అందిస్తుంది. బహుశా life skills గురించి వివరిస్తూ ఒక టపా రాయాల్సిన తరుణం దగ్గరపడిందేమో!

@భైరవభట్ల కామేశ్వర రావు: నా అభిప్రాయాలు మిమ్మల్ని సంతృప్తి పరచలేదంటే నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే,నా దగ్గర నిర్ధిష్టమైన సమాధానాలు అదీ with quantification లేవు.ఉన్నవల్లా కొన్ని అభిప్రాయాలు, నమ్మకాలు వాటిని పాటించడానికి నేనుచేసే ప్రయత్నం. I am still in the process of discovery.