తెలుగు ప్యారడీ కింగ్ ఝరుక్ శాస్త్రి గారికి మిత్రుడొకరు మొదటి సారిగా 'కొకు' (కొడవటిగంటి కుటుంబరావు)గారిని పరిచయం చేసారట. ఝరుక్ శాస్త్రిగారు తన హాస్యశైలిలో 'కొకు'గార్ని ఎగాదిగా చూసి మిత్రుడితో, "అబ్బే ఈయన కొకు అవ్వడమేమిటి?! కొకు అంటే ఇంతపెద్ద కొమ్ములూ, కోరలుండాలి, అవీ భయంకరంగా కనబడాలీ, పైగా ముక్కులోంచీ పొగలూ సెగలూ రావాలి. ఇవన్నీ లేకపోతే కొకేమిటి? నేనస్సలు నమ్మను" అన్నారట.*
నిజమే, ఆవేశపూరితమైన రాతలు రాసినంత మాత్రానా పొగలూసెగలూ కక్కుతూ, ఆవేశంతో కనపడినవాళ్ళనల్లా కసకస మనిపించే కోరలతో కపడాలా? ఏమో ఈ మధ్య జరిగిన బుక్ ఫెయిర్లో, e-తెలుగు స్టాల్ దగ్గర కలిసిన కొందరు బ్లాగ్మిత్రుల స్నేహపూరిత వాక్కుల తరువాత నాకు ఈ సందేహమే వచ్చింది. నా బ్లాగులో జరిగే వాడివేడి చర్చలూ, అక్కడక్కడా వేరే బ్లాగు వ్యాఖ్యల్లో వినిపించే నా నిరసనస్వరాలూ,పదేపదే నా భావాల్నీ ‘సుత్తి’తో నిరసించే మరికొందరి ప్రయత్నాల నేపధ్యంలో కత్తి మహేష్ కుమార్ అంటే (ఫొటో ఉన్నాకూడా) ఒక భీకర స్వరూపమో లేక జగడమారి రూపమో మనసులో ముద్రేసుకున్నారనుకుంటాను. నన్ను కలిసిన మరుక్షణం "బ్లాగంత ‘ఇది’గా లేరే!", "కత్తి బ్లాగులో మాట్లాడతాడు బయటమాత్రం వింటాడు","మంచోడే మరీ అంత ప్రమాదకరం కాదు" లాంటి ప్రశంసల్తో ముంచేసారు.
మరో వైపు ,"బ్లాగులో ఫోటోలాగే వున్నావ్" "కొంచెం ఒళ్ళు పెరిగింది,జుట్టు తగ్గింది... మిగతా అంతా నువ్వే" అని కొందరంటే, ఇంకొందరు "మొదటిసారి కలిసినా ఎన్నాళ్ళుగానో తెలిసినట్లేవుంది" అంటూ స్నేహహస్తం అందించారు.
బ్లాగుల్లో ఒకప్పుడు హోరాహోరీగా పోరాడుకున్న నేనూ-తాడేపల్లిగారూ విభేధించుకుంటూ, చర్చించుకుంటూ అతిఎక్కువ సమయం ఒకరితో ఒకరు గడిపాం. ఈ మధ్యకాలంలో చదువరి గారి టపాపై వ్యాఖ్యలూ ప్రతివ్యాఖ్యలతో గడిపినా, కలిసిన మరుక్షణం ఒక కప్పు కాఫీ తాగుతూ e-తెలుగు కోసం కలిసి పనిచెయ్యాలనే నిర్ణయానికొచ్చాం. పప్పు అరుణగారి కలుపుగోలుతనం-కార్యదీక్ష, నల్లమోతు శ్రీధర్ గారి బేషరతు అభిమానం. దూర్వాసుల పద్మనాభంగారి అకుంఠిత సమర్పణభావం. వీవెన్ నిశ్శబ్ధ అంకితభావం. కేశవ్ ఉత్సాహం. ఇబ్బందిగా నవ్వుతూనే ఎవరికీ ఇబ్బంది కలక్కుండా చూసే చావా కిరణ్. ఇంకా పలువురి శ్రమ,దీక్ష చూస్తుంటే తెలుగుకు ఆధునిక హోదా కలిపించే ఉద్యమంలో నేనూ ఒక భాగాన్నేమో అనిపించింది.
ఇక 25 వతేదీన మహిళాబ్లాగర్ల హడావుడి ఇప్పటికే బ్లాగు లోకంలో విశ్వప్రసిద్ధం...
హమ్మో...నేనూ ఎమోషనల్ అయిపోతున్నాను....
ఇహ చెప్పోచ్చేదేమిటంటే! నా విభేధాలు సిద్ధాంతాలతో,ఆలోచనలతో,అభిప్రాయాలతోకానీ వ్యక్తులతో కాదు అని నేను పదేపదే నా బ్లాగులో మొత్తుకునేమాట నిఝంగా నిజం. నాకు అర్థరహితం అనిపించి సిద్ధాంతాలను నిరసిస్తాను. అలవికాని ఆలోచనలు అనిపించినవాటిని నిలదీస్తాను. స్వార్థాశయంగల అబిప్రాయాలను తెగనాడతాను. అంతమాత్రానా నాకు వ్యక్తులతో విభేధాలుండవు.కోపాన్నికూడా ఒక్క కరుకుపదంకూడా వాడకుండా తెలియజెప్పాలనే నా ప్రయత్నం. కసినికూడా కసుక్కుమనే పదరహితంగా వెళ్ళగక్కాలనే నా ఆశయం. కానీ, నా టపాలు ఎత్తిపొడుపుల్లాగా అనిపిస్తాయని ఒక మిత్రుడు చెప్పారు. అది ఉద్దేశపూర్వకమేగానీ అవి వ్యక్తుల్ని ప్రశ్నించడానికి కాకుండా వ్యవస్థలోని నాకు తెలిసిన లోపాల్ని వ్యక్తపరచడానికి మాత్రమే. వ్యక్తిస్వతంత్ర్యాన్ని నేను ప్రభోధిస్తే అది నా అనుభవాల సారమేగానీ,దాని ఆధారంగా అదే సత్యమని ఉద్భోధించే ఉద్దేశం కాదు నాది. రాజకీయ ఉద్దేశాల్నీ, కులమత భేధాల్నీ, దేశభక్తినీ సాధికారంగా ప్రశ్నిస్తానేగానీ గుడ్డిగా నమ్మే అలవాటుని ప్రోత్సహించను. అంతమాత్రానా అవంటే గౌరవం లేకకాదు.అందరూ గౌరవించేరీతిలో అవి ఉండాలనే తపనతో.
అయినా కొందరికి నా టపాలు ఘాటుగా అనిపిస్తాయి. బహుశా నా టపాల్ని ఆలోచించడానికి కాక వ్యక్తిగతజీవితానికి అన్వయించుకుని పొంతనలేక ఉక్రోషంతో, ఈ ఆలోచనల్ని నిత్యజీవితంలో అవలంభించే ధైర్యం లేక ఆక్రోశంతో అలా అనిపించొచ్చు.ఈ ఆలోచనల్ని అంగీకరిస్తే వారు బ్రతికే భద్రలోకం వీళ్ళని "మంచి వాళ్ళు కారు" అనుకుంటుందనే భయమూ కావచ్చు.
ఇంకా..ఇంకా మరెన్నోమరెన్నో కారణాలు కావచ్చు. ఆకారణాలతోనే నా బ్లాగు చదవాలి. చదవకపోతే చదివించేలా చేసే బాధ్యత నాదే! చదివితే స్పందించాలి. స్పదించకపోతే స్పందించేలా చేసే బాధ్యత నేనే తీసుకుంటాను. నావరకూ ‘పర్ణశాల’ ప్రశాంతంగానే ఉంటుంది. ఆలోచనలకు నెలవుగానే వుంటుంది.అందరికీ స్వాగతం ఆదరించేవారికీ,విమర్శించేవారికీ,విశ్లేషించేవారికీ, విభేధించేవారికీ అందరికీ... అందరికీ.. స్వాగతం.
నూతన సంవత్సర శుభాకాంక్షలు
*పిట్టకథ చెప్పిన కొత్తపాళీగారికి ధన్యవాదాలు.
Tuesday, December 30, 2008
కొమ్ములూ- కోరలూ-పర్ణశాల - e-తెలుగు
Posted by Kathi Mahesh Kumar at 7:27 PM 27 comments
Labels: వ్యక్తిగతం
Sunday, December 28, 2008
మా ముకుందుడి ‘భాష’ తంటాలు
నేను తెలుగు.మా ఆవిడ బెంగాలీ. నాకు బెంగాలీ మాట్లాడ్డం రాది. మా ఆవిడకి తెలుగు మాట్లాడ్డం రాదు. ఇద్దరికీ దాదాపు చాలావరకూ అర్థమవుతుంది. అందుకే ఇంట్లో మాట్లాడే భాష హిందీ. మా అబ్బాయి ముకుంద్ చిన్నప్పట్నించీ ఇంట్లో హిందీ వింటూ పెరగటం వలన వాడి మాతృభాష హిందీ. అందుకే మాతృభాష అనడంకన్నా ‘ఇంటిభాష’ లేక ‘మొదటిభాష’ అంటే ఈ సందర్భంలో అర్థవంతంగా ఉంటుందని నా భావన.
బాల్యంలో ఏభాషలో అయితే మీ అవసరాలనూ,అనుభవాలనూ,ఆలోచనలనూ చెప్పడం చేస్తారో అదే ‘ఇంటిభాష’/‘మొదటి భాష’ అని నా ఉద్దేశం. దానికి పవిత్రత గౌరవం,గొప్పతనం లాంటివి లేవు. అది ఒక సహజ ప్రక్రియ అంతే. ఇంకా చెప్పాలంటే అదొక default setting. భాష నేర్చుకునే క్రమంలో మొదటగా వినడం తరువాత తిరిగిపలకటం ఆ తర్వాత మాట్లాడటంగా జరుగుతుంది. ఆ తర్వాత అవసరాన్నిబట్టి చదవటం, రాయటం నేర్పించబడతాయి లేక నేర్చుకోబడతాయి.నేను తెలుగు భాష ఇలాగే నేర్చుకున్నాను. నా కుటుంబ మరియూ చుట్టూవున్న సహజవాతావరణంలో తెలుగు ఆవరించుకుని ఉండటం, నా ప్రాధమిక విద్య తెలుగులో సాగటంతో తెలుగు నా ఇంటిభాషతో పాటూ వ్యవస్థ భాష(Institutional language) కూడా తెలుగయ్యింది. ఆ తరువాత కాలక్రమంలో వ్యవస్థభాష ఆంగ్లంగా రూపాంతరం చెందింది.
శిక్షణ రీత్యా భాషా బోధకుడిగా, ఏ సందిగ్ధతలేకుండా పిల్లలు తమ బాల్యావసరాలు,భావాలూ వ్యక్తికరించడానికి ఒకే భాష ఉండాలనే సిద్ధాంతాన్ని నమ్ముతాను. అందుకే ఇంట్లో హిందీతప్ప మరోభాష వాడకం చెయ్యలేదు.అందుకే పితృభాష అయిన తెలుగు, మాతృభాష అయిన బెంగాలీని ఇంటిభాష గా చెయ్యలేదు. ఇంగ్లీషునైతే ఉద్దేశపూర్వకంగా మరింత దూరంగా ఉంచడం జరిగింది. ఇప్పుడు మా ముకుంద్ తనంతట తాను ఆసక్తిచూపడంతో కొంత తెలుగు బెంగాలీ నేర్పడం జరుగుతోంది. కానీ సమస్యల్లా వాడి స్కూల్లో ఇంగ్లీషురూపంలో వచ్చింది.
క్రితం సంవత్సరం LKG లో చేర్పించిన కొన్నాళ్ళకి, పేరెంట్స్ మీటింగులో వాళ్ళ మేడమ్ నా ముందుకుతీసుకొచ్చిన సమస్య "your son do not follow instructions in English" అని.దానికి నేను మర్యాదగా,"Sure I understand. We speak Hindi at home and I would expect school to teach him English" అనిచెప్పాను. కానీ, ‘ఇంట్లో మీరు నేర్పిస్తేకదా మీవాడికి స్కూల్లో సూచనలు పాటించడానికి సులువయ్యేదీ’ అని స్కూలువాళ్ళ గోల. నాభాధేమిటంటే నేను ఇంట్లో తెలుగు మాట్లాడుతూనే బయటప్రపంచానికి కావలసిన institutional language అయిన ఆంగ్లాన్ని నేర్చుకున్నప్పుడు, హిందీ మాట్లాడే నాకొడుక్కు స్కూల్లో వీళ్ళు ఇంగ్లీషు నేర్పలేరా? ఇంత మాత్రానికి వేలకువేలు ఫీజులు నేనెందుకు కట్టాలి? అని. ఈ విషయం స్కూల్లో కొంత చర్చించిన తరువాత, మా ఆవిడ నన్ను బలవంతంగా(తలాతోకా లేని ఆర్గ్యుమెంట్ చేస్తున్నానని) ఆ మీటింగ్ నుంచీ లాక్కొచ్చేసింది.
ఏమిటో... నా వాదనలో తప్పుందో... లేక నా ఆలోచనలో తప్పుందో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. కాకపోతే, ఇప్పుడు మాఆవిడ ఇంగ్లీషు పదాలూ,వాక్యాలు ఇంట్లో మా ముకుందుడిపై విరివిగా ప్రయోగిస్తోంది.
Posted by Kathi Mahesh Kumar at 11:12 AM 28 comments
Labels: వ్యక్తిగతం
Saturday, December 27, 2008
స్వగతం
నమ్మకం:
నా పరిధిలో తెలుసుకున్నవాటితో నా అభిప్రాయాలు ఏర్పడుతాయి.అవి ఎంతబలమైనవి అనేది నేను తెలుసుకున్న source నుంచో లేక నేను convince అయిన తీరునుంచో జరుగుతాయి.నా అత్మవిశ్వాసానికి కారణం నేను తెలుసుకున్న జ్ఞానంపై నేను ఏర్పరుచుకున్న నమ్మకం.మళ్ళీ ఎవరైనా నా నమ్మకాన్ని సవాలుచేసి, నా కళ్ళు తెరిపించేంతవరకూ అదే నాకు "సత్యం". అందుకే ఈ సాధికారత.
విశ్వాసం:
అతివిశ్వాసానికీ ఆత్మవిశ్వాసానికీ తేడా ఎంతో... ఎలావుంటుందో... సొంత కొలతల్లో లేక ఎదుటిమనిషి నలతల్లోంచీ కనిపెట్టెయ్యడం అర్థరహితం. కారణం, అవి చాలా వ్యక్తిగతపరిధిలోంచీ చేసే నిర్ణయాలు. వాటిని నిరపేక్ష సిద్ధాంతాలుగా అంగీకరించిన క్షణాన, నా వ్యక్తిత్వానికీ నేను వ్యక్తిగానమ్మిన సాపేక్ష సిద్ధాంతానికీ విఘాతం కలిగినట్లే లెక్క.
ఎదుటివారు నాగురించి చేసే వ్యక్తిగత బేరీజుకన్నా, నాగురించి నేను అనుభవించే అపోహే మిన్నకాదా! isn't my reality better than perceived notion of others...or is it others reality and perceived notions of my own self? either ways it makes no difference.
జీవించేద్దాం!
ప్రతిమనిషీ తను సృష్టించుకున్న మూసలోనే జీవిస్తాడు. తను అల్లుకున్న బోనులోనే బతికేస్తాడు.కానీ తనదంటూ ఒక పిచ్చితనం లేకపోతే...తనకంటూ కొన్ని నమ్మకాలు లేకపోతే బోనుకూ,మూసకూ సార్థకత కలిగేనా? అస్థిత్వానికొక అర్థం లభించేనా!
ఒరిజినల్ ధాట్:
సొంత ఆలోచనలు కావాలట...original thought. Foolish romantics. అసలు సిసలు ఆలోచనలున్న మహానుభావులెవరో సెలవిస్తారా? Best that has been thought and said is in literature అని ఊరికే అన్నారా! సొంతవీ కొత్తవీ ఎక్కడినుంచీ వస్తాయి..ఆదేదో మనకన్నా ముందు మనల్ని మించిన మొనగాళ్ళే పుట్టనట్టు.
అద్వితీయమైన ఆలోచనలున్నాయి. ఆచరణసాధ్యంకాని అనుభవాలున్నాయి. అనుభవైక్యమైన అనుభూతులున్నాయి. అనుభవించడం చేతకాదుగానీ..ఆలోచించాలట! అదీ ఒరిజినల్గా...ఎవడిక్కావాలి ఒరిజినాలిటీ? అందమైన అనుభవాలు రెడీమేడ్ గా అవేలబుల్ అయితేనూ...
ఆన్ బీయింగ్ సినికల్:
"ఎందుకురా జీవితం మీద అంత నిరసన.ఎప్పుడూ ప్రశ్నించడమేనా..కాస్త ప్రశాంతంగా ఉండలేవా?" అంటాడొక స్నేహితుడని చెప్పుకునే వెధవ. నిరసించని జీవితమూ ఒక జీవితమే! ప్రశ్నించని బ్రతుకూ ఒక బతుకే!!
అన్నిటినీ అంగీకరించి బతికెయ్యడంలో సుఖముండొచ్చుగాక...కానీ శోధించి సాధించడంలోని ఆనందం ఏ సుఖం ఇవ్వగలదు. If you don't problamatize your existence, can it ever become a meaningful Life...its a life with ‘L’ capital mind you. Not just any life.
అయినా నువ్వనుకునేట్లు నేను విరాగిని,విరసుడ్ని,రంధ్రాన్వే
Posted by Kathi Mahesh Kumar at 11:20 AM 8 comments
Labels: వ్యక్తిగతం
Friday, December 26, 2008
అర్ధసత్య (1983) - ఒక పరిచయం
నటీనటులు: ఓంపురి,స్మితా పాటిల్, అమ్రిష్ పురి, సదాశివ్ అమ్రపుర్కర్, నసీరుద్దీన్ షా మొదలైన వారు
దర్శకత్వం: గోవింద్ నిహలాని
చక్రవ్యూహ ప్రవేశానికి మునుపు
నేనెవరో..ఎలాంటివాడినో
నాక్కొంచెమైనా జ్ఞాపకం లేదే!
చక్రవ్యూహ ప్రవేశానంతరం
నాకూ దానికీ మధ్య
ప్రాణాంతక సామీప్యం తప్ప మరేమీ లేదు
అయినా ఆ అనుభూతి స్పృహకూడా నాలో రాదే!
చక్రవ్యూహాన్ని ఛేధించాక
ముక్తుడిగా నేనే మిగిలినా…
ఈ చక్రవ్యూహ సృష్టిలో
మార్పేమైనా కలిగేనా?
చచ్చినా చంపైనా
చనిపోయినా, ప్రాణాలే తీసినా
ఈ నిర్ణయం జరిగేనా?
నిద్రనుంచీ లేచి నడిచే మనిషికి
మళ్ళీ కలల ప్రపంచం కనిపించేనా!
వెలుగులో..
తీర్పుచెప్పే క్షణాల వెలుగులో
అన్నీ సరిసమంగా తూగేనా?
ఒకత్రాసులో పుంసత్వం
మరొక త్రాసులో నపుంసకత్వం
ఈ రెంటినీ తూల్చే తూలికలో…
సరాసరిమధ్యన ‘అర్థసత్యం’
హిందీ మూలం- దిలీప్ చిత్రే
తెలుగు స్వేఛ్చానువాదం - కె.మహేష్ కుమార్
పూర్తి వివరాలకు నవతరంగం చూడండి.
Posted by Kathi Mahesh Kumar at 1:56 PM 0 comments
Labels: సినిమాలు
Tuesday, December 23, 2008
ప్రేమ్ ‘ఆత్మహత్య’ కుమార్
ఈ టపా చదివిన కొందరు సాక్షి లోని వార్త లంకె అడిగారు. అది దొరక్క ఆ వార్తాంశాన్ని స్కాన్ చేయించి టపాల పెడుతున్నాను.
ఇప్పుడే ‘సాక్షి’ పేపర్లో ఒక వార్త చూసి వస్తున్నాను. ప్రేమ్ కుమార్ అనే ఒక ఎమ్మెస్సీ విద్యార్థి తన ప్రేమికురాలు ఇన్నాళ్ళ స్నేహానికి కటీఫ్ చెప్పేసి, ప్రేమకు గుడ్ బై చెప్పిందని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్తకు ఖచ్చితంగా యాసిడ్ ఘటనకున్న కవరేజీ, మైలేజీ రెండూ ఉండవు. ఒకవేళ ఎవరైనా బై మిస్టేక్ చదివినా, "ఒక అమ్మాయికోసం ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారా?" అని ఆ కుర్రాడి మానసిక స్థితిని ప్రశ్నిస్తారేతప్ప ఆ అమ్మాయి ప్రవర్తనని హర్షించకపోయినా ఖచ్చితంగా గర్హించరు. కారణం...తప్పెప్పుడూ అబ్బాయిదే ఉంటుందనే మన ప్రఘాఢ విశ్వాసం.అబ్బాయిలు emotional గా ఉండకూడదనే Social conditioning.
యాసిడ్ ఘటనలో ఎన్కౌంటర్ చేసి చంపినా పాపం లేదనుకున్న వాళ్ళందరి ముందూ ఈ సంఘటన పెడితే, ‘అబ్బాయి పిరికితనంతో ఈ పనిచేసుండకుండా ఉండాల్సింది’ అంటారే తప్ప, మోసం చేసిన అమ్మాయిని శిక్షించమని ఒక్కరూ అనరు. దానికున్న లాజిక్ ఒక్కటే, ఆ కుర్రాళ్ళు అమ్మాయిని బౌతికంగా దాడి చేసి హింసకు గురిచేసారు కాబట్టి వారికి ఆ శిక్ష కావాలి. కలిసి తిరిగి, ఆశలు రేపి పుటుక్కున బంధాన్ని తెంచుకుని ఆత్మహత్యకు ఉరికొల్పేంత మానసిక క్షోభపెట్టిన అమ్మాయి హింసమాత్రం మనకు కనిపించదు. కారణం...నాకూ తెలీదు.
వయసులోని ప్రేమల్ని..వయసుకు రాని ప్రేమల్నీ సహానుభూతితో అర్థం చేసుకునే తల్లిదండ్రులూ, సమాజం రానంతవరకూ యాసిడ్లతో పాటూ ఆత్మహత్యలూ జరుగుతూనే ఉంటాయి. మనం బ్లాగుల్లో మీడియాలో చదివో చర్చించో కొంత బరువు దింపుకుంటూనే ఉంటాం. పదండి, యాసిడ్ చర్చలకు కేటాయించిన సమయంలో నూరోవంతు ఈ ప్రేమ(ప్రేమ్ కుమార్) కోసం కేటాయిద్దామా!
Posted by Kathi Mahesh Kumar at 12:46 PM 41 comments
Labels: సమాజం
Wednesday, December 17, 2008
‘వినాయకుడు’ దర్శకుడితో ముఖాముఖి
మొదటి భాగం కోసం ఇక్కడ నొక్కండి.
అప్పటిదాకా దాదాపు చాలారొజుల తరువాత కలిసిన స్నేహితుల్లాగా మాట్లాడేసుకున్న తరువాత, ‘వినాయకుడు’ సినిమా విషయం చర్చకు రాగానే ఆ సినిమా నాకు in parts మాత్రం నచ్చిందన్న నిజం గుర్తుకొచ్చింది. ఈ సారి కొంత “ఫ్రొఫెషనలిజం” చూపిద్ధామని ఒట్టుపెట్టుకున్నాను.ప్రశ్నలేతప్ప చర్చలొద్దని నిర్ణయించుకున్నాను. కానీ ప్రశ్నలడుగుతున్నంతసేపూ ఆత్మారాముడు స్వగతంగా ఏదో ఒకటి వాగుతూనే వుంటే వాడి మాటల్తో కలిపి ఈ ఇంటర్వ్యూ ఇలా తయారయ్యింది…
నేను (నే): ‘వినాయకుడు’… అసలీ టైటిల్ ఎలా వచ్చింది?
సాయి కిరణ్ (సాకి): ఈ టైటిల్లో వింతేమీ లేదు అందరికీ తెలిసిన పేరే. అన్ని స్థాయిల్లోని ప్రజలూ వాడే పదమే. నిజానికి గణేష్, గణపతి అనే పేర్లకన్నా వినాయకుడు అంటేనే కొంత ‘నిండుతనం’ ఉందనిపిస్తుంది. ఈ టైటిల్ సజెస్ట్ చేసినప్పుడు పరిశ్రమలో చాలా మంది “వైబ్రేషన్ లేదు” అన్నారు. ఆ వైబ్రేషనేమిటో! అదెక్కడుంటుందో!! తెలీదుగానీ, నా కథకు తగ్గట్టుగా ప్రేక్షకులకు సులభంగా రిజిస్టర్ అయ్యేలా వుంటుందని అదే ఖాయం చెసాను.
(స్వగతం (స్వ): వైబ్రేషనా! సినిమా పేర్లలోకూడా ఈ మధ్యకాలంలో వైబ్రేషన్ ఆశిస్తున్నారా పరిశ్రమ జనాలు? అయినా కథలో పట్టు కథనంలో వైవిధ్యం లేకుండా సినిమా తీసేసి టైటిల్ లో వైబ్రేషనొచ్చినా, పేరే “వైబ్రేషన్” అని పెట్టినా ప్రేక్షకులు చూసేస్తారా!)
పూర్తి ముఖాముఖి కోసం నవతరంగం చూడండి.
Posted by Kathi Mahesh Kumar at 10:00 PM 3 comments
Labels: సినిమాలు
Tuesday, December 16, 2008
మతమా...! కులమా...?
కులచర్చలు అంత తొందరగా తెగేవీకాదు అంగీకారాత్మక నిర్ణయాలకు వచ్చేవీ కావు.అవి మన సామాజిక మనుగడనూ, ఆలోచననూ problamatize చేసి కొత్త సమీకరణాల్ని తయారుచెయ్యడానికేతప్ప సమస్యల్ని తీర్చడానికి ఎప్పుడూ ఉపయోగపడలేదు. ఇప్పట్లో అలా ఉపయోగపడే పరిస్థితీ కనిపించడం లేదు.
హిందూ మతస్థులు ఎప్పుడూ ఒక cohesive సమూహంగా వ్యవహరించ లేదు.ఒకే మతానికి చెందినవారిగా కొన్ని shared symbols ఉన్నప్పటికీ,ఆచారవ్యవహారాలు, విధివిధానాలు,సాంప్రదాయాలూ అన్నీ కులపరంగా ఏర్పరచబడ్డాయి లేదా అలాగే ప్రచారం కల్పించబడ్డాయి.
చాతుర్వర్ణాల సృష్టినుంచీ పంచమకులాల్ని చేర్చేవరకూ విభజించి పబ్బంగడుపుకునే బ్రాహ్మణక్షత్రియవర్ణాల ఆధిపత్య కుట్ర తప్ప మతపరిరక్షణ ఎవరి ఉద్దేశమూ కాలేదు. జ్ఞానాధారిత,రాజ్యాధికారాధారిత సంఘం నుంచీ భూమిఆధారిత సంఘం ఏర్పడే సరికీ నియో-క్షత్రియ (రెడ్డి,కమ్మ,బలిజ మొ")కులాలు తమ అధికారాన్ని చెలాయించాయేతప్ప సర్వమానవ సమానత్వం ఎక్కడా చూపించలేదు. అందుకే ఇప్పుడు దళితులు మేము హిందువులం కాము పొమ్మంటున్నారు.
భూమినుంచీ రాజకీయం రాజ్యాధికారానికి మూలమవ్వగానే ఇవే కుల సమీకరణాలు ఆ వ్యవస్థమీద superimpose అయ్యాయి.అంటే వ్యవస్థ మారినా మూలాలు మాత్రం అవే అన్నమాట.ఓట్ బ్యాంక్ రాజకీయ క్షేత్ర్రంలో ఈ వర్గసమూహాల స్పృహ విజయవంతంగా ప్రతిసారీ reinforce చెయ్యబడింది.ప్రజాస్వామ్యంలో సమానత్వం తేవడంపోయి రాజకీయలభ్ధి కోసం కులాలు మరింత కరుడుగట్టిపోయాయి.కొన్ని కులాలు తమపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ కులాల ఉనికిని బలోపేతం చేస్తుంటే,మరికొన్ని తమకు సంక్రమించిన అధికారం ఎక్కడ కోల్పోతామో అన్న భయంతో మరింతగా ఈ కులవ్యవస్థని వ్యవస్థీకరిస్థున్నాయి.
ఇటువంటి రాజకీయబ్రహ్మాస్త్రాన్ని త్యజించి సమానత్వాన్ని కాంక్షించే ఆలోచన దాదాపు అన్నికులాల్లోనూ అడుగంటింది. ఇది హిందూమత సమస్య కాదు. ఇదొక ఆర్థిక-సామాజిక-రాజకీయ సమస్య.కులాలకి మూలాలు మతంలో వున్నా,అసలే అరవ్యవస్థీకృత హిందూమతంలో ఈ విస్తృత సమస్యను తీర్చే శక్తి లేదు.ఈ సామాజిక సమస్యకు మతపరమైన సమాధానం వెతికితే అది మరింత ప్రమాదకరమైన పరిణామం అవుతుందేతప్ప solution ఏనాటికీ కాదు.
కాబట్టి, కులాన్ని ఒక సామాజిక వర్గంగా చూసి ఆర్థం చేసుకుని ఆరాతీసి సమాధానాలు వెతకగలిగితే కొంతైనా సాంత్వన కలగొచ్చు. హిందూమత పరిరక్షణలో భాగంగా కులాలను విడనాడాలని పిలుపునిస్తే మాత్రం మతాన్ని వదిలేస్తారేమోగానీ కులాల్ని చాలా మంది వీడలేరు.ఆధ్యాత్మికతకు మతమైతే కులం ఆర్థిక-సామాజిక-రాజకీయ అధికారానికి హేతువు.ఈ ఒక్క కారణం చాలు మతాన్ని త్యజించి కులాన్ని తలకెక్కించుకోవడానికి.
‘హిందూఛారిటీస్’ అనే బ్లాగులో ‘కులమును విసర్జించండి’ అనే టపాకు నేను చేసిన వ్యాఖ్య ఇది.
Posted by Kathi Mahesh Kumar at 3:10 PM 25 comments
Labels: మతం
‘వినాయకుడు’ దర్శకుడితో పరిచయం
మధ్యాహ్నం రెండుగంటల ప్రాంతంలో ఫిల్మ్ నగర్ చేరుకున్నాను.ఫోన్ లో మళ్ళీ ఆఫీస్ అడ్రస్ అడగాల్సొచ్చింది. ఒకటో సారి. రెండో సారి మూడో సారి. అదే గొంతు విసుగులేకుండా ఓపిగ్గా డైరెక్షన్స్ చెబుతుంటే…’కొత్తగా విజయాన్ని దక్కించుకున్న ఒక నూతన సినీదర్శకుడు ఇంకా సాధారణంగా ఉన్నాడంటే అసాధారణమే’ అనిపించింది. ఆఫీస్ లోపలికి అడుగుపెట్టాను. అప్పుడే కొత్తగా ఏర్పాటుచేసుకుంటున్న పార్టిషన్లు ఇంకా పని జరుగుతున్నట్లుగా సంకేతాలందించాయి. ఆదివారం కాబట్టి వర్కర్లు పని చెయ్యడానికి రాలేదేమోగానీ, లేకుంటే the office would have been bustling with work of setting up the place…a new place for new achiever in Telugu film industry.
పూర్తి వ్యాసం కోసం నవతరంగం చూడండి....
Posted by Kathi Mahesh Kumar at 7:01 AM 2 comments
Labels: సినిమాలు
Monday, December 8, 2008
ఏది నిజం ? ఏది సత్యం?
15 పార్క్ అవెన్యూ (అనే భారతీయ ఆంగ్లచిత్రం) నాకు విపరీతంగా నచ్చిన సినిమాలల్లో ఒకటి. అందులో కొంకణా సేన్ శర్మ (మీఠీ) పాత్రకు స్కిజోఫీనియా (schizophrenia) అనే మానసికవ్యాధి ఉంటుంది. ఈ వ్యాధిగ్రస్తులు తమదైన ఆలోచనల్లో, కల్పిత నిజాల్లో, ఊహాజనిత జీవితాల్లో కాలం గడుపుతూ ఉంటారు. అదే నిజంగా, అదే జీవితంగా భ్రమిస్తూ ఉంటారు.
ఈ చిత్రంలో ఒక దృశ్యంలో మీఠీ యొక్క ఊహాజనిత కుటుంబం, భర్త,పిల్లలు, ఇల్లు మొదలైన మాటల్తో విసుగెత్తిపోయిన మీఠీ అక్క అంజలి (షబానా ఆజ్మీ) "ఇవన్నీ నిజాలు కావు కేవలం నీ మెదడ్లోంచీ వచ్చిన కల్పన" అని ఖరాఖండిగా ఒకస్థాయిలో rude గా చెబుతుంది. అప్పుడు మనం సహజంగా మీఠీ నుంచీ ఆశించే స్పందన నిరాశపడటమో లేక హింసాత్మకంగా ప్రవర్తించడం. కానీ మీఠీ అలా చెయ్యదు. చాలా ప్రశాంతంగా ఒక కాలేజీ ప్రొఫెసర్ అయిన అంజలితో "నువ్వొక ప్రొఫెసర్వి. కాలేజిలో చదువు చెబుతావు. పెద్దపెద్ద వ్యాసాలు రాస్తావు. ఇవన్నీ నిజం కాదు. కేవలం ఊహలని, నీ మెదడు కల్పించిన కల్పన మాత్రమే అని చెబితే నీకు ఎలా ఉంటుంది?" అని అడుగుతుంది.
ఈ డయలాగ్ వినగానే, నా మెదడు పైన ఒక బకెట్టు చన్నీళ్ళు కుమ్మరించినట్లనిపించింది. "ఎంత వేదాంతం, జీవిత సత్యం నిండుందీ ఆలోచనలో!" అనిపించింది. మనకు తెలిసిన ప్రపంచమే మన నిజం. పదుగురు అంగీకరించిందీ పాటించేదే మనకు సత్యం. అంతేతప్ప ‘నిజంగా నిజం’ ఎవరికైనా తెలుసా? ఏది సత్యమో ఖచ్చితంగా చెప్పగలమా? మనకు తెలీనిదాన్ని నిజం కాదనుకుంటాం. అప్పటీకే తెలిసిందానికి భిన్నంగా కొత్తగా ఏదైనా వినిపిస్తే కనిపిస్తే సత్యం కాదని నిర్ణయించుకుంటాం. నిజం సత్యమనేవి వ్యక్తిగతమని, భావాలకూ, నమ్మకాలకూ, తమకు తెలిసిన ప్రపంచానికీ అనుగుణంగా అవి రూపాంతరం చెందుతాయని అందరం మర్చిపోతాం. అలాంటప్పుడు మనం నమ్మివన్నీ నిజాలు కావని ఎవరైనా చెబితే ఎలా ఉంటుంది? మనజీవితం ‘కేవలం ఊహ!’ అని ఎవరైనా తేల్చేస్తే ఎలా ఉంటుంది?
అందుకే...సత్యానికి పలు పార్శ్వాలుంటాయని నా నమ్మకం.నిజానికి వివిధ కోణాలుంటాయని విశ్వాసం. అకిరకురసోవా ‘రోషోమాన్’ లో చెప్పినా, మన శ్యాంబెనెగల్ ‘సూరజ్ కా సాత్వాఘోడా’ లో వివరించినా, ఆల్బర్ట్ అయిన్ స్టీన్ సాపేక్షసిద్ధాంతంలో ప్రతిపాదించినా...ఇతి...ఇతి (ఇదే ఇదే!!). నిజం- సత్యం అనేవి ఎప్పటికీ నేతి..నేతి (ఇది కాదు ఇదికాదే!!).
Posted by Kathi Mahesh Kumar at 7:10 PM 6 comments
Labels: సమాజం
Sunday, December 7, 2008
లెట్ మీ ఆల్సో కన్ఫెస్...
'నువ్వు స్వార్థపరుడివి...!
నా అవసరంకన్నా నీ అహం నీకు ముఖ్యం
నా భావనలకన్నా నీ విలువలు నీకు ముఖ్యం'
అని తనంటుంటే...
సమాధానం చెప్పలేక
నిజాల్ని మింగలేక
ఇంకాజీర్ణించుకోని విలువల్ని కక్కలేక
నేను పడ్డ బాధ...ఏమని చెప్పేది?
మొదటిసారి కలిసాం
మళ్ళీ కలిసాం
మళ్ళీమళ్ళీ కలిసాం
రుచులూ అభిరుచులూ ఆలోచనలూ
ఆద్యంతంకాకున్నా అక్కడక్కడా కలిసాయి
ఇంతకన్నా 'స్నేహానికి' మరేంకావాలని
స్నేహితులమయ్యాం
'ఆడామగా మధ్య స్నేహమేమిట్రా కన్నా!
ఎంత రుచీ,అభిరుచీ ప్రాతిపదికైనా
ఎదరెదురుగా నిలిచాక
అప్పుడప్పుడూ...
మూలసూత్రం మాత్రం మారదురా చిన్నా..!’
అని మనసెంతచెబుతున్నా
పవిత్రంగా జ్వలిస్తానని
చెప్పిన మాటకు కట్టుబడతానని
కొత్తవిలువల కాకలో భీష్మప్రతిజ్ఞ గావించా
బలహీనతల్ని బలవంతంగా
భూస్థాపితం చేసి
కొత్తవిలువల్ని ఖచ్చితంగా పాటించడానికే నిర్ణయించా
స్టేట్మెంట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ సాక్షిగా
స్నేహంతప్ప మరేమీ కాకూడదని నిశ్చయించా
కానీ...
శరీరధర్మం స్నేహధర్మాన్ని ప్రశ్నించే క్షణాలు
మోహావేశాలు మనసుల్ని వివశుల్ని చేసే నిమిషాలు
అవసరాలు ఆదర్శాల్ని వెక్కిరించే తరుణాలు
ఎన్నో... ఎన్నెన్నింటినో దాటుకుని
స్పందనల్ని నడిసంద్రంలో నెట్టుకుని
కోరిల్ని కట్టగట్టి కాల్చుకుని
నిష్టగా నిర్ధ్వందంగా తనని నిలువరిస్తే...
ఇప్పుడు తనంటుంది...
'నువ్వు స్వార్థపరుడివి...!
నా అవసరంకన్నా నీ అహం నీకు ముఖ్యం
నా భావనలకన్నా నీ విలువలు నీకు ముఖ్యం'
అని
నిజమేనా!?!
నేను స్వార్థపరుడ్నా!
‘పవిత్ర’పాపినా!!
మళ్ళీ విలువల్ని బేరీజుచేసుకోవాలి
పాతవిలువల్ని పరీక్షించుకోవాలి
కొత్తవాటిని జీర్ణింఛుకోవాలి
కొన్నింటిని త్యజించాలి
మరికొన్నింటిని...తెలీదు
ఏదో ఒకటి చెయ్యాలి !
*‘లెట్ మీ కన్ఫెస్’ కవితా సంకలం ప్రేరణతో...
Posted by Kathi Mahesh Kumar at 11:58 AM 12 comments
Labels: కవిత
Wednesday, December 3, 2008
లెట్ మి కన్ఫెస్ : ఒక పరిచయం
Reader's Discretion is requested: ఇక్కడ పొందుపరచబడిన కవితల్లోని కొన్ని అంశాలు (కొందరికి) అభ్యంతరకరంగా అనిపించవచ్చు. ఈ కవితా సంకలనాన్ని పరిచయం చేస్తున్న ఉద్దేశంకూడా ఆ వైరుధ్యమే కాబట్టి, పాఠకులు తమ ఇంగితజ్ఞానాన్ని ఉపయోగించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తాను.
పుస్తకం పేరు: లెట్ మి కన్ఫెస్
సాహితీ విధానం: కవితా సంకలనం
కవి: పసుపులేటి పూర్ణచంద్ర రావు
పబ్లిషర్ : ELMO BOOKS
ధర: Rs 75/-
ప్రతులకు : విశాలాంధ్ర, నవయుగ పుస్తకాలయాలు.
"నరాలు జివ్వున లాగే గొప్ప అనుభవాన్ని స్త్రీ మనకిచ్చినప్పుడు, ఆ అనుభవం తర్వాతి అనుభూతిని హాయిగా నెమరవేసుకుని అమరత్వం పొందే ఆ కాన్షస్నెస్ని అద్భుతంగా చెప్పగలిగితే, అది సాహిత్యం ఎందుక్కాదు...?" అని ప్రశ్నించి మరీ కవితలు రాసేస్తే, ఆ భావప్రవాహాన్ని సాహిత్యం అనకుండా వుండగలమా!
కవిత్వాన్ని ఎందుకు రాస్తారో నాకు తెలీదు. అప్పుడప్పుడూ కవితల పేరుతో నేనూ పదాలు అల్లినా, ప్రాసల్ని గిల్లినా అదొక ప్రయత్నంగా మిగిలిందేతప్ప నేను చెప్పాలనుకున్న పరామార్థం ఆవిష్కరించలేదనే వెలితి ఎప్పుడూ ఉండేది. ఈ మధ్యకాలంలో పుస్తకాల్లో, బ్లాగుల్లో కవితల్ని చదివి స్పందించగలిగాను. ఆస్వాదించగలిగాను. అనుభవించగలిగాను. కొందరి కవితల్లో పదచిత్రాలు నన్ను ఆకట్టుకుంటే, మరికొన్నిట్లో అసాధారణ సాధారణత్వం చూసి మురిసిపోయాను. భావగర్భిత ఉద్వేగాలు కొన్ని కవితల్లో చవిచూస్తే, మరికొన్ని కవితలు వేదనావేదనల్ని పదాల్లో కూర్చగా చదివాను.కానీ ఇప్పటివరకూ ఎక్కడా చాచి లెంపకాయకొట్టినట్లు షాక్ ఇచ్చే కవితల్ని చదవలేదు.ఈ మధ్యనే ఒక స్నేహితుడిపుణ్యమా అని అలాంటి కవితా సంకలనాన్నొకటి దక్కించుకుని, కొన్ని బలమైన లెంపకాయల్ని ప్లెజంట్ గా షాకింగ్ గా తిన్నాను. Its an outrageous poetry that I have ever read in Telugu.
అదే "లెట్ మి కన్ఫెస్" అనే పుస్తకం. 'పసుపులేటి పూర్ణచంద్ర రావు' రాసిన కవితల సంకలనం. 'సెల్ఫ్ ఇంట్రో' అంటూ, "ఏ సమాజ ఉద్దరణ కోసవూ నేనీ పొయిట్రీ రాయలేదు. నా ఆనందం కోసం, నాలో నేను నవ్వుకోవడం కోసం, నాలో నే జూసుకుని, నావంకరల మీద జోక్ చేసుకోవడం కోసం, అంతకన్నా ముఖ్యంగా నా స్త్రీ (ల)ని నేను తలుచుకోవడం కోసం అప్పుడప్పుడూ తోచినప్పుడల్లా ఇరవై ఏళ్ళుగా ఈ "కన్ఫెషన్స్" చేస్తూ వచ్చాను. నిజానికివి నా డైరీలో పేజీల్లాంటివి" అంటూ మంగళవాక్యాలు పాడేసి. ఆతరువాత వరుసగా మనసుతడిని, యవ్వనపు చిత్తడిని, స్త్రీపురుషుల కాంప్లెక్స్ బంధాల కథాకమానిషుని ఆద్యంత్యం అద్భుతంగా, ఆలోచనాత్మకంగా, అబ్బురపడేలా కవిత్వించేశారు.
ఈ పుస్తకాన్ని పరిచయం చెయ్యాలంటే మొత్తం సంకలనాన్నిక్కడ మక్కీకి మక్కీ దింపాలి. ఎందుకంటే, ఇందులోని ఏ కవితా స్వయంసంపూర్ణం కాదు. మొత్తం సంకలనం కూడా స్వయంప్రకాశకం కాదు. జీవితాన్ని మధించకపోతే, ముందుగా కొంత యోగం పొందకపోతే ఈ భోగం అర్థం కాదు. కవి జీవితంలోని లోతుల్ని కూసింతైనా మనజీవితంలో అనుభవించకపోతే లేక కనీసం కనీవినకపోతే obscene ideas of perversion లాగా అనిపిస్తాయేతప్ప అక్కునచేర్చుకుని ఆదరించదగ్గ అద్భుత కవితల్లా కనిపించవు. అందుకే, simply outrageous అనాల్సొచ్చింది.
"మనిషీ కావాలి...
పశువూ కావాలి...అనే స్త్రీని
సముద్రాన్ని ఔపోసన పట్టినంత తేలిక్కాదు కదా
దిగమింగడం...!
నిజం-
తనకు ఖచ్చితంగా ఏం కావాలో తెలిసిన
స్త్రీని
అంత తేలిక్కాదు ప్రేమించడం...!"
అంటూ తన పురుషాహంకార బలహీనతను, స్త్రీపట్ల తనకుగల అంతర్గత భయాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకోవడం ఇక్కడే చెల్లింది. ఈ విషయం స్వయంగా చెబుతూ, "అప్టరాల్ నేను మగాడ్ని; లభించే అనేక ఎడ్వాంటేజస్ ని అందుకుంటున్నవాడ్ని; స్త్రీలు ఖచ్చితంగా విక్టిమ్సే అని గ్రహించికూడా, ప్రాక్టికల్గా స్త్రీ శ్రమని దోచడంలో పురుష భూస్వామ్య లక్షణాల్ని పూర్తిగా వొదులుకోలేనివాడ్ని- ఎలా అబద్ధం చెప్పను...? ఎడ్వాంటేజ్ కి అలవాటుపడ్డ ప్రాణం కదా...! అంత తేలిగ్గా పురుషావకాశాల్ని లొదులుకొంటానా.." అంటాడీ కవి. ఎంత దారుణం కదా!
‘సౌందర్యం కోసం’ పరితపిస్తూ భగ్నప్రేమనుకూడా అనిర్వచనీయమైన పూజగా చేసుకోమంటూ కవిచెప్పే కథ చూడండి;
"చాతనైతే
నీ దేవత
నీ చేయి వదిలిపోయినా చితికిపోకు...
చిట్లిపోయిన గుండేనే చేతిలో పట్టుకుని
చెమ్మగిల్లిని కళ్ళతో
చిట్టచివరిగా చేయు ఊపు...!
పోతే...గుండె విచ్చిపోనీగానీ
మొట్టమొదటి సారి చూడగానే
నీ దేవత కోసం
నీ గుండె ఎలాకొట్టుకుందో
ఆ పిచ్చిప్రేమను మాత్రం చచ్చిపోనీకు..!"
ఇంతకంటే మంచి సలహా భగ్నప్రేమికులకు ఎవరైనా ఇవ్వగలరా?!?
సింగిల్ మదర్స్ తొడుక్కునే ‘మానుషి- మాస్క్’ గురించి,available women గా చూసే మగాడి చూపుగురించి చెబుతూ...
" ‘లంజ...
మొగాడిలా కాలెత్తి
ఇట్నుంచీ అటేసి మోటార్ సైకిలెక్కుతుంది...!’
అని ప్రతిసారీ అగ్లీగా బావురుమంటారు
ఉత్త మీసాలు తప్ప
చెప్పుకోను మరో గొప్పలేని మెగవాళ్ళు...
...బల్లెంలా ఇల్లు చేరుతుంది
భళ్ళున తలుపు తెరుస్తుంది
పెళ్ళున విరిగి మంచంలో కూలిపోతుంది
ఇక అంతటితో
ఆ మంటల మాస్క్ తీసి
విసిరి...మంచం కింద పారేస్తుంది...!
కొసరి
కొడుక్కి గోరుముద్దలు తినిపిస్తుంది..
కసిరి
కసాపిసా క్లాసు పుస్తకాల్ని నవిలిస్తుంది..."
అంటూ మరోరూపాన్ని చూపించి ఆధునికజీవితంలో తప్పనిరిగా కనపించే (తనకు తెలిసిన) సింగిల్ విమెన్ గురించి మనకొక పదచిత్రాన్ని, భావవైచిత్ర్యాన్నీ అందిస్తారు. అదే ఊపులో ఒక ‘కామగానం’ చేస్తూ...
" కామం అంటేనే స్నేహం..
స్నేహం అంటేనే శాంతి...
మేం శాంతికాముకులం
యుద్ధ వినాశకులం..
నో సెక్స్ ప్లీస్...! ఉయ్ ఆర్ సెయింట్స్...!
అనే వెధవలతో
అసలు యుద్ధం ఏవిటి..?" అంటూ తనదైనా భాష్యాల్ని చెబుతూనే సూటిగా ప్రశ్నిస్తాడు కవి.
"తెల్లవారుఝాముకు కాస్తంత ముందరే
నా స్లీపింగ్ బాగ్ జిప్ పర్ర్ పర్ర్ న పగలదీసి
పక్కలో దూరిపడుకొంది...!
చీకట్లోకి చందమామల్ని విడిచి
పడుకుంటూనే పకపకా నవ్వింది...!
అలా నా కోపాన్ని
తన ముద్దు దువ్వెనతో ఆ అర్థరాత్రి దువ్విందా-
తెల్లారి బారెడు పొద్దెక్కి లేచి
ముద్దుగా ముఖం మీద గుచ్చుకుంటున్న
మూరడేసి పొడుగున్న సూరీడి మీసాల్ని విదిలించుకొంటూ
కళ్ళు నులుపుకుంటూ
ఓ నువ్వా బాస్...!
భాగీ అనుకున్నాను...అంది!
అని సిగ్గుపడుతూ నా బుగ్గ మీద పొడిచింది...!" అని తన beautiful misadventure గురించి చెబుతూనే...అదే కవితలో;
"ప్రతి ఆడదానితోనూ
ఓ మెట్టు తరిగే మనకు
ప్రతి మగపశువుతోనూ
ఓ మెట్టు పెరిగే ఆ నిరంతర స్వేచ్చ
మళ్ళీ
ప్రేమగానో...పిచ్చిలోనో
మనత నివిరేదెప్పుడో..! అంటూ తన అబ్బురపాటును, అద్వితీయ గౌరవాన్ని ప్రకటిస్తాడు.
‘బర్త్ ఆఫ్ వీనస్’ లో తన వనదేవతను ఆవిష్కరిస్తే, శ్వేతానందంలో ‘యూజ్ షీత్ మాన్..’ అంటూ, ‘తప్పదు... ఆతర్వాతే విందు’ అన్న శ్వేత సుందరి ఎదుట నీరుగారిన తనమగతనాన్ని ప్రస్తావిస్తాడు కవి. వెతికితే బూతేగానీ, కవిచెప్పిన విధానంలోని గమ్మత్తును చూడాలిక్కడ.
"అప్పటికే ఓ చావుచచ్చి గాల్లో తేలుతున్న
నా భూతాన్ని ఓ చక్కటి గులాబీ రంగు చిరు సంచిలో
ముద్దుగా బంధించి
మధురమైన మంత్ర తంత్రాలతో
అద్భుతంగా భూస్థాపితం చేయబోయింది...కానీ
ఆవిడి తాంత్రిక తీవ్రతకి తట్టుకోలేక
అసలే గిజగిజలాడుతున్న నా పిచ్చిభూతం
జస్ట్...
జస్ట్ భూమిని తాకీ తాకగానే
ఆగలేక...
ఆవేశంగా..భళ్ళున పేలి..బ్రద్ధలైపోయింది...!"
ఇలా యాభై కవితల్లో నిండిన ఎన్నో అనుభవాలు. వాస్తవిత, తాత్విత రెంటి కలబోతా ఈ కన్ఫెషన్స్ లో వున్నాయి. కవి మాటల్లోనే చూస్తే, "ఈ ప్యాకింగ్ పొరలు నిజంగా ఉల్లిపొరలే! ఒలిచి పూర్తిగా నగ్నం చేయగలిగినవాళ్ళు చేయండి. చేయకుండా కూడా నా కవిత్వంలోని నగ్నతను ఎంజాయ్ చేయగలిగిన వాళ్ళు అలాగైనా చేయండి. నగ్నతని చూడలేక కళ్ళుమూసుకునే వాళ్ళకోసవయితే నేనీ కన్ఫెషన్స్ చేయలేదు."
అందుకే, కొంత బలమైన appetite- జీర్ణశక్తి ఉన్నవాళ్ళుమాత్రమే ఈ కవితా సంకలనాన్ని చదవడానికి సాహసించండి.
Posted by Kathi Mahesh Kumar at 8:29 PM 13 comments
Labels: సాహిత్యం
Monday, December 1, 2008
టెర్రరిజాన్ని ఆపడానికి మనం ఏంచెయ్యాలి?
ముంబై ఘాతుకం నేపధ్యంలో మనకు కలిగిన ఉక్రోశం, ఆవేశం,ఆవేదన మరియూ కోపాన్ని ఒక నిర్మాణాత్మక రీతిలో వెళ్ళబుచ్చే అవకాశం కోసం వెతికాను. అలాంటి ఒక అవకాశం దొరికింది.కొందరు ఔత్సాహిక సామాజిక కార్యకర్తలూ, సంస్థలూ, వ్యక్తులూ, ఉద్యోగస్తులూ, అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్న కన్సల్టెంట్లు జనవరి 5, 2009 న హైదరాబాద్ లో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.
హైదరాబాద్ పాతబస్తీలో ముస్లిం సముదాయ సామాజిక,ఆర్థిక అభివృద్ధికి పాటుపడుతున్న ‘రోషన్ వికాస్’ సంస్థకు సంబంధించిన ‘అలి అజ్గర్’ ఆధ్వర్యం(coordination)లో ఈ సమావేశం జరుగనుంది. 90 లలో జరిగిన హైదరాబాద్ మతకల్లోలాలను ఆపడానికి అలిఅజ్గర్ చేసిన ప్రయత్నాలు పాతబస్తీవాసులకూ, హైదరాబాద్ వాసులకీ విదితమే. ఈ చర్చల్లొ పాల్గొని పౌరులుగా గ్లోబల్ టెర్రరిజంకు వ్యతిరేకంగా మన గొంతులను నిర్మాణాత్మకంగా ప్రభుత్వంవరకూ చేరవేయడానికి ప్రయత్నిద్దాం.
ఇప్పటికి ఈ క్రింది విషయాలు 5వతేదీ సమావెశాల్లో చర్చించడానికి ప్రతిపాదించడం జరిగింది.
- టెర్రరిజంపై భారతీయ విధానాల గురించి ఒక పరిశీలన
- మైనారిటీ-మెజారిటీ వాదాలు : ప్రస్తుత ఎన్నికల విధానం
- పోలీసు సంస్కరణలు :రాజకీయనియంత్రణ: టెర్రరిజం
- టెర్రరిస్టులకు ఆయుధాల సరపఫరా చేసే అంతర్జాతీయ కంపెనీలను కట్టడి చేసేందుకు భారత్ నేతృత్వంలో ఐక్యరాజ్యసమితి ద్వారా ప్రయత్నానికి వ్యూహం.
ఇంకా ఏదైనా అంశాలు చర్చకు పెట్టదలిస్తే మెయిల్ పంపగలరు. aliasghar60@gmail.com
చర్చలో పాల్గొని తమవంతుగా policy recommendation -విధానపర సూచనలు అందించగలరు.
రాజకీయవ్యవస్థనూ, రాజకీయనాయకులనూ విమర్శించడం. రక్షణ,నిఘా,పోలీసు వ్యవస్థలలోని లోపాలను ఎత్తిచూపడం. మీడియాలోని అతిని ఎండగట్టడం చాలా సులువుగా మనం చెయ్యగలిగే పని. కానీ, మన మేధస్సును, సంవేదననూ, ఆలోచననూ మరింత అర్థవంతంగా ఉపయోగకరంగా తెలియజెప్పడం ప్రస్తుతం మన కర్తవ్యం. ఈ సమావేశంలో ఒక ఆచరణప్రణాళిక ఏర్పరుచుకుని రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ స్థాయిల్లో ఆ ప్రణాళికను ఎలా అమలుపరచాలనే ప్లానింగ్ కూడా చెయ్యబడుతుంది. భారతదేశ పౌరులుగా వివిధస్థాయిల్లో మనం గ్లోబల్ టెర్రరిజంపై పోరాటంలో ఏవిధంగా భాగస్వాములవ్వగలం అన్నది ఇక్కడ నిర్ణయించుకోవచ్చు. Let's swing in to action. Let's contribute our bit to the nation. Let's contribute ideas, plans and proposals to combat terrorism. Let's make India a safe place to live. Let's make the world safe place to be in.
Posted by Kathi Mahesh Kumar at 2:14 PM 25 comments
Labels: మతం
Sunday, November 30, 2008
మతం - మతవాదం - మతోన్మాదం
ముంబై మారణహోమం నేపధ్యంలో మతాన్నీ, మతవాదాన్నీ, మతోన్మాదాన్నీ ఒకేగాటనకట్టి చాలామంది తమ భావజాల జాలాన్ని విజయవంతంగా అల్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ తరహా ప్రశ్నలు రాజకీయఉద్దేశాలను సాక్షాత్కరించగలవేగానీ సమస్యకు సమాధానాన్ని కాదు.
మతం: ఒక పుస్తకాన్ని,ప్రవక్తను లేక ఒక నిర్దేశించబడిన/ వివరించబడిన విధానాన్నిఆధారం చేసుకుని దాన్ని అనుసరించి జీవితాన్ని గడపడం. హిందూ మతం ఒక నిర్ధిష్టమైన code నుంచీ ఉద్భవించలేదు. కానీ క్రైస్తవం యూదుల మతానికీ రోమన్ సామ్రాజ్యానికీ వ్యతిరేకంగా ఉద్భవించింది, ఇస్లాం జుడాయిజం,క్రైస్తవంలోని అవినీతికి వ్యతిరేకంగా మహ్మదు ప్రవక్త సమర్పణ భావానికి ప్రతీకగా ఆవిర్భవించింది. నిజానికి ఇస్లాం అంటేనే భగవంతునికి సమర్పించబడింది అని అర్థం. క్రైస్తవం ఇస్లాం అవిఉద్భవించిన చారిత్రక స్థితినిబట్టి మతాలుగా వ్యాప్తిచేందే దిశలోనే మతవాదాలుగా మారిపోయాయి.
మతవాదం: ఒక రాజకీయ ప్రయోజనన్ని ఆశించి అనుకూలమైన మతం మాత్రమే పాలనకు అర్హమైనదిగా భావించడం. ఆ భావజాలం నేపధ్యంలో మిగతా మతాలను సమాన రాజకీయ అవకాశాలకూ పాలనాధికారాలకూ దూరం చెయ్యడం. ఒక విధంగా ఇతర మతాలను second rate citizens గా భావించడం. ఇస్లాం క్రైస్తవం సహజంగా నే ఈ విధానం వైపు త్వరగా మొగ్గుచూపినా హిందూ మతం ఈ ధోరణులనుంచీ దూరంగానే ఉంది. ముస్లింల దండయాత్రల నేపధ్యంలో కొంత ఈ భావజాలం కనిపించినా, ఆ తరువాత మొఘల్ కాలంలో (ఔరంగజేబ్ వరకూ) సద్భావనే వెల్లివిరిసింది. బిటిష్ కాలంలోకూడా మతాన్ని ఆధారం చేసుకుని రాజకీయ ప్రయోజనాలను బేరీజు చెయ్యలేదు. కానీ కాలక్రమంలో ముస్లింలీగ్ ఒకవైపు హిందూమహాసభ మరోవైపు (ఆ తరువాత ఆర్.ఎస్.ఎస్- సంఘ్ పరివార్) మతవాదానికి పెద్దస్థాయిలో తెరతీసారు. దేశవిభజన ఆ తరువాత పాకిస్తాన్ తో జరిగిన యుద్ధాలు మతపరమైన అపనమ్మకాన్ని ఒక రాజకీయ వాదాలరూపంలో, హిందుత్వవాదం పేరుతో బీజేపీ ఇప్పటికీ సజీవంగా నిలుపుతోంది. అందుకే మతవాదానికీ మతానికీ ఆధారం మతమే అయినా, రెంటికీగల తేడా గుర్తించడం అవసరం. కొందరి రాజకీయ ఉద్దేశాలకూ మతాన్ని నమ్మి జీవించే సామాన్యప్రజలకూ గల భావవైరుధ్యాన్ని తెలుసుకోవడం అవసరం.
మతోన్మాదం: తమ మతం తప్ప మిగతామతాలు అనర్హమైనవిగా భావించడం. తాము ఉత్తమమైనదిగా భావించే తమ మతస్థాపనలో భాగంగా ఇతర మతాల ప్రజలను హింసకు గురిచెయ్యడం, ప్రాణాలు హరించడం మతం ఇలా చెయ్యమని ఎక్కడా చెప్పదు. మతవాదం బలంగా వ్యాపించినప్పుడు ఆ మతాలకు చెందిన కొందరు ఈ ఉన్మాదస్థితిలోకి చేరే ఆవకాశం ఉంటుంది. ఈ ఉన్మాదానికి రాజకీయ, ఆర్థిక శక్తులు/ఆశయాలు తోడైతే ఉగ్రవాదంరూపంలో బయటపడుతుంది. వీరికి మతంతోకానీ, మతాన్ని అనుసరించే ప్రజలతోగానీ సంబంధం ఉండదు. ఒకస్థాయిలో వీరు పిచ్చివాడి చేతిలో రాయిలాంటివాళ్ళు. మరొకస్థాయిలో స్వయానా ఉన్మాదస్థితిలో ఉన్నవాళ్ళు. మతవాదుల చేతుల్లో బలమైన ఆయుధాల్లాంటివాళ్ళు. హిందుమతాన్ని పరిరక్షించడానికి. మాలెగావ్ లో బాంబులు పేల్చినా పాకిస్తాన్ ప్రోద్బలంతో ముంబైలో మారణహోమం చేసినా అది మతోన్మాదమేతప్ప మరొకటికాదు. ఈ మతోన్మాదాన్ని మతవాదంతో ముడిపెట్టి తమ రాజకీయపబ్బాలు గడుపుకునే నాయకత్వం వలన ఈ ధోరణి పెరుగుతుందేతప్ప అదొక ప్రత్యామ్నాయం అవుతుందని అనుకోవడం మన తెలియనితనమేతప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఆ రెండూ ఒకదానిమీద ఒకటి తమ అస్థిత్వాన్ని నిలుపుకునే విధానాలు.
ఈ తేడాలను గుర్తించకుండా కేవలం భావోద్వేగాలతో ప్రస్తుత పరిస్థితికి సమాధానం వెతకాలనుకుంటే మనకు మిగిలేది ద్వేషం, కసి, కోపమేతప్ప శాంతీయుతంగా జీవించడానికి మనం ఆశిస్తున్న మార్పుకాదు. ఈ విషయం గమనించి స్పందించడం చాలా అవసరం.
Posted by Kathi Mahesh Kumar at 1:24 PM 11 comments
Labels: మతం
Saturday, November 29, 2008
దిగులు..భయం కాదు మార్పుకోరుకునే కోపం కావాలి !
ఏభావజాలాన్ని నమ్మినా, టెర్రరిజం యొక్క ముఖ్య ఉద్దేశం భీభత్సాన్ని సృష్టించి ప్రజల్లో భాయాందోళనల్ని కలిగించడం. వ్యవస్థమీద సామాన్యులకు అపనమ్మకాన్ని కలిగించటం.జీవితాల్లో దిగులు నింపి అసురక్షిత భావాన్ని కలిగించడం. ముంబై మారణహోమం నేపధ్యంలో వస్తున్న తెలుగు బ్లాగుల స్పందనల్ని చూస్తుంటే, తీవ్రవాదులు తమ ఉద్దేశంలో సఫలమైనట్లుగా అనిపిస్తోంది. ఆధునిక టెర్రరిజం యుద్ధం కాదు. అదొక ఉన్మాదం. ఉన్మాదాన్ని ఎదుర్కోవడానికి ప్రణాళికకన్నా, ఆత్మస్థైర్యం ముఖ్యం. అదే మనకిప్పుడుకావాలి. ముంబై పోలీసులూ, NSG కమేండోలూ అదే నిరూపించారు. మనకు దారి చూపించారు. టెర్రరిస్టులని చంపడంతోపాటూ వారి మూల ఉద్దేశాలను నిర్విర్యం చేసినప్పుడే గెలుపు మనవైపు నిలుస్తుంది.
ఇలాంటి పరిస్థితుల్లో మనం సురక్షితంగా ఉన్నామా? అనే ప్రశ్న ఉదయించడం సహజం. కానీ, ఆ అపనమ్మకం కలిగిందంటే తీవ్రవాదుల ఉద్దేశం సాకారమైనట్లే. ఒకవైపు వ్యవస్థవైఫల్యాలు తేటతెల్లంగా కనబడుతుంటే భయపడకుండా, దుగులుపడకుండా ఉండలేము. కానీ, మనలోని భయాన్ని మార్పుని ఆశించే ఆలోచనగా, మనలోని దిగులుని మార్పుకోసం పోరాడే నిర్ధిష్టమైన కోపంగా మార్చుకోవడం ఎంతో అవసరం. ఆ ఆలోచననీ, నిర్ధిష్టమైన కోపాన్నీ channelize చెయ్యడానికి తగిన ప్రాతిపదికని ఏర్పరుచుకోవడానికి ప్రయత్నిద్దాము.
ముంబై మారణహోమంలో మరణించిన సామాన్యులకూ, పోరాడుతూ ప్రాణాలు విడిచిన పోలీసులూ, కమెండోలకూ అశృనివాళి.
Posted by Kathi Mahesh Kumar at 11:20 AM 11 comments
Labels: మతం
Wednesday, November 26, 2008
నాకు దేవుడు కావాలి
‘దేవుడున్నాడా? లేడా?’ అనే ప్రశ్నలు చర్చిస్తే తెలేవీకాదు. ఒకరు నిర్ణయిస్తే ఆమోదించేవీ కావు. ప్రతిపాదిస్తే అంగీకరించేవీ కావు. అందుకని, అలాంటి చర్చలకన్నా ‘దేవుడు కావాలా? వద్దా?’అనడం సరైన పద్దతనుకుంటాను. వ్యవస్థీకృత మతానికీనాకూ చుక్కెదురైనా, దేవుడుంటే బాగుంటుందనిపిస్తుంది. నేనేదో ఆధ్యాత్మిక ధోరణిలోపడ్డానని అనుకోకండి. ఇక్కడా నాది తార్కికమైన స్వార్థమే!
మానవపరిణామ సిద్ధాంతం ప్రకటించినట్లు ఈజీవరాసులన్నీ "అలాఅలా" వృద్ధిచెందెయ్యకుండా, దేవుడు ఈ జగాన్ని సృష్టించివుంటే ఖచ్చితంగా ఒక ఉదాత్తమైన గమ్య ఒకటి జీవితాలకు ఏర్పడేది. అలాకాకుండా, డార్విన్ ను నమ్ముకున్నామనుకోండి. మనకు మిగిలేదల్లా అర్థరహితమైన, గమ్యహీనమైన కొండొకొచో అతలాకుతలమైన జీవితాలు. ఎందుకంటే, ఆ సిద్ధాంతం ప్రకారం జీవరాశులు వివిధ దశల్లో natural selection, survival of the fittest అంటూ ఏర్పడిపోయాయేతప్ప వాటికి higher purpose అనేవి లేవు. అలాంటప్పుడు మనుషులతోసహా ఈ జీవరాశులకు అలౌకికమైన గమ్యాలూ, ఉదాత్తమైన ఆలోచనలు అనవసరం. ఏదో పుట్టామా,బ్రతికామా, చచ్చామా అనేతప్ప మిగతావిషయాలు అనవసరం. కానీ, అలా వుంటే ఏమైనా బాగుంటుందా???
అందుకే, ఒక ఉదాత్తమైన ప్రయోజనం గమ్యం ఈ మానవజన్మకు కావాలి. జీవించడానికి ఒక అర్థవంతమైన కారణం కావాలి. కేవలం అవసరాలూ కోరికలూ తీర్చుకుంటూ బ్రతికేకన్నా,కొంత స్వార్థరహితంగా మరికొంత త్యాగమయంగా వుంటేనే జీవితం ఆసక్తికరంగా వుంటుంది. ‘ఇవన్నీ ఒక అలౌకికప్రయోజనం లేకుండా సాధ్యమా !’ అంటే, "కష్టమే" అని చెప్పుకోవచ్చు. నిస్వార్థంగా ఒకరినొకరు ప్రేమించుకోవడం. ఒకరినొకరు కాంక్షించుకోవడం. ఒకరికొకరు సాంత్వన చేకూర్చుకోవడం. ఇటువంటి భావాలకు జగత్ సంబంధిత (cosmic) ప్రయోజనం లేకుంటే, కేవలం లాభనష్టాలు బేరీజు చేసుకుని స్వార్థంకోసం అమలు జరిపేస్తాం. అందులో ఏమైనా తృప్తి వుంటుందా???
అందుకే మానవచైతన్యానికి ఒక అద్వితీయమైన అలౌకికప్రయోజనం కావాలి. అర్థరాహిత్యానికీ, అర్థంకాని ప్రయోజనానికీ మధ్య నన్ను ఎంచుకోమంటే ఖచ్చితంగా అర్థంకాని(అలౌకిక) ప్రయోజనాన్నే ఎంచుకుంటాను. అందుకే నాకు దేవుడు కావాలి. కాకపోతే ఆధునిక పోకడలైన సైన్సూ, లౌకికకవాదం,వ్యక్తివాదం ఎవ్వరూ ప్రశ్నించలేని ఆ ఉదాత్త జగత్ ప్రయోజనాన్ని పక్కనబెట్టి మతాలూ,పూజారులూ, నిబంధనలూ, సాంప్రదాయాలూ దేవుడ్ని ప్రశ్నార్థకం చేసేసాయి.
ఈ సందర్భంలో మా ప్రొఫెసర్ చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. ఆయన ప్రకారం "God is nothing but a center out side your own center. You need Him/Her some times."
Posted by Kathi Mahesh Kumar at 3:50 PM 15 comments
Labels: మతం
Tuesday, November 25, 2008
సాపేక్షసిద్ధాంతం - మానవసంబంధాలు
మానవసంబంధాల చర్చవచ్చినప్పుడలా 'ఆల్బర్ట్ అయిన్ స్టీన్' సాపేక్షసిద్ధాంతం (theory of relativity) గురించి ప్రస్తావిస్తుంటే కొందరు, "అదొక భౌతికశాస్త్ర సిద్ధాంతంకదా! దాన్ని మానవసంబంధాలలోకి ఎలా అన్వయిస్తున్నారు?" అని పదేపదే అడిగారు. ఇది చాలా సాధారణ విషయంకదా, దాదాపు అందరికీ తెలిసేవుంటుందనే నమ్మకంతో ఆ ప్రశ్నని పక్కనపెట్టాను. కానీ, ఈ రోజు మా ఆఫీసులో subjectivity - objectivity చర్చలోకొచ్చే సరికీ మళ్ళీ ఈ సాపేక్షసిద్ధాంతం నా మెదడ్లో మ్రోగింది. ఎలాగూ ఆలోచించేసానుగనక, ఒక టపా రాసే బాగుంటుందనిపించి ఈ విధంగా ప్రయత్నిస్తున్నాను.
1905 లో స్పేషియల్ (special) ధియరీ ఆఫ్ రిలేటివిటీ ఆతర్వాత 1915లో జనరల్ ధియరీ ఆఫ్ రిలేటివిటీని అయిన్ స్టీన్ ప్రతిపాదించాడు. అప్పటివరకూ సమయం (Time), స్థలం (space) స్థిరం అనే నమ్మకంతోవున్న ప్రపంచం, ఈ ప్రతిపాదనలతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాస్త over simplification చేసి చెబితే, "ఒక వస్తువుకు కాంతివేగంతోవున్న సంబంధాన్నిబట్టి 'స్థలం' మరియూ 'సమయాల్లో' మార్పువస్తుంది" (time and space are capable of being altered according to the nature of one's trajectory in relationship to the speed of light) అన్నమాట. ఈవిధంగా చెబితే సగంమందికి అర్థంకాదుగనక, అయనే ఒక ఆసక్తికరమైన ఉదాహరణ చెప్పాడు. "ప్రేమికురాలితో కూర్చునిగడిపిన ఒక గంట నిమిషంగానూ, బస్సుకోసం ఎదురుచూస్తూ గడిపిన ఒక నిమిషం ఒక గంటగానూ అనిపిస్తాయి. అదే సాపేక్షసిద్ధాంతం" అని.
ఈ విధంగా మానవసంబంధాలకు సాపేక్ష సిద్ధాంతాన్ని ఈ మహానుభావుడే లింకెట్టేసాడు. కాకపోతే, ఈ ఆలోచనాధోరణిని ఆధారం చేసుకుని 'ఫాన్స్ బావోజ్' అనే ఒక సామాజికశాస్త్రవేత్త 'సాంస్కృతిక సాపేక్షసిద్ధాంతానికి' (cultural relativism) తెరతీసాడు. దీని ఆధారంగా అప్పటివరకూ డార్విన్ ప్రతిపాదించిన ఏకమూససామాజిక ఎదుగుదల (savagery- barbarism-civilization) సిద్ధాంతాలని అద్యంతం అన్వయించుకుంటున్న సమాజనిర్మాణశాస్త్రవేత్తలు (anthropologists), ప్రతి సమాజాన్నీ ప్రత్యేకమూసగా పరిగణించి దాని మూలాలఅధారంగా అర్థం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అంటే, ఒక absolute విలువ అధారంగా సమాజాన్ని అర్థం చేసుకునే పోకడలుపోయి ఒక పదార్థాన్ని, సమాజాన్ని,వ్యక్తినీ, పరిస్థితినీ దాని ఉనికి,స్థితి ఆధారంగామాత్రమే అర్థం చేసుకునే సాపేక్షత (relativity) అలవడిందన్నమాట. ఈ సైద్ధాంతిక మూలాల ఆధారంగానే వ్యక్తివాదం, అస్థిత్వవాదం వంటి భావజాలాలు మానవసంబంధాలను ముఖ్యంగా స్త్రీపురుషుల సంబంధాలని నిర్వచించడం మొదలయ్యింది.
అక్కడే మానవసంబంధాలలో సాపేక్షసిద్ధాంతం యొక్క ఉనికి బలపడింది. ఇక్కడే సాంప్రదాయాలూ,మతం,సామాజిక కట్టుబాట్లు వంటి absolutism,fundamentalism పోకడలకు చుక్కెదురయ్యింది.
Posted by Kathi Mahesh Kumar at 7:45 PM 11 comments
Labels: సమాజం
Sunday, November 23, 2008
ఏదిపాపం?
ఆధునిక నవలాకారుల్లో (చిట్టిబాబు,బుచ్చిబాబు, కుటుంబరావు గారితోపాటూ) నాకునచ్చిన మరో నవలాకారుడు ‘చివుకుల పురుషోత్తం’. బహుశా రావలసిన గుర్తింపుకూడారాని నవలాకారుడుకూడా ఈయనేనేమో!
మొదటి నవల "ఏదిపాపం?"తోనే ఆంధ్రప్రదేశ్ సాహిత్యాఅకాడమీ బహుమతి పొందినా, ఇప్పటికీ చాలా మంది పాఠకులకు ఈ పేరు (సు)పరిచితం కాదు. నేను మా కాలేజి లైబ్రరీ పుణ్యమా అని చివుకుల పురుషోత్తం గారి నవలలు చదివాను. కానీ, ముద్రణలో లేని కారణంగా ఆ తరువాత ఎక్కడ ప్రయత్నించినా ఈ రచయిత నవలలు దొరకలేదు. ఈ మధ్య విజయవాడలోని పాతపుస్తకాల షాపుల్లో వెదుకుతుంటే, "ఏదిపాపం?", "మేలుకొలుపు" అనే రెండు నవలలు మాత్రం దొరికాయి.
‘ఏదిపాపం?’ నవలలోని కొన్ని పేరాలను ఇక్కడ రాస్తున్నాను. ఎవరిదగ్గరైనా చివుకుల పురుషోత్తం గారి మిగతానవలలుంటే తెలుపవలసిందిగా కోరుతున్నాను.
వనజ: "మగవారికి మా ఆడవారి ధృష్ట్యా కొన్ని మూర్ఖపు నమ్మకాలుంటాయి. నన్ను ఇరవైమూడేళ్ళ వయసుదానిని పెళ్ళిచేసుకున్నాడు విశ్వనాధం. కానీ, ఆయన అభిప్రాయం ప్రకారం నేను అప్పటిదాకా మనస్సును శూన్యంగా అట్టిపెట్టుకుని, ఆ మహాపురుషునితో వివాహం కాగానే ఆయనను మనస్సులో పెట్టుకుని పూజించుకొంటున్నాననుకుంటాడు. ఇపుడు మీ వెంటవచ్చాను కాబట్టి తప్పంతా మీదేననుకుంటాడు. మీ మగజాతి సంగతంతా ఇంతే! ఆడదాని గురించి అనాదిగా మూర్ఖంగా కొన్ని అసందర్భపు భావాలను ఏర్పరచుకున్నారు. వాటినీ మాపైరుద్దారు. మాలోఅందరూ ఆ మీ అభిప్రాయాల ప్రకారం నడుచుకున్నట్లు నటిస్తాం. కానీ, ఒక్కోసారి సహజంగా ప్రవర్తిస్తాము. ఆ సహజప్రవర్తన మీ అభిప్రాయాలకు భిన్నంగా వుంటుంది గనక మీరు ఆడదాన్నర్థం చేసుకోవడం కష్టం అనుకుంటూంటారు.
ఎమోషనల్ గా స్త్రీపురుషులు సమానులే. మీ బుర్రల్లో ఏం మెదులుతుందో మా బుర్రల్లోనూ అంతే. వివాహమంటే అండదే పవిత్రంగా చూసుకోవాలి -పాతివ్రత్యం ఆడదానిధర్మం - అనేవి కల్లబొల్లి కబుర్లు. అంతరగతంగా ప్రతి ఆడదానికీ తెలుసు - ఇలాంటి కబుర్లు చెబుతుంటేనే మగవాడు సంతోషిస్తాడని. మాకు ఆర్థికస్వాతంత్ర్యం లేదుకదా? పిల్లలు అనే బంధాలు మమ్మల్నే ఎక్కువగా బాధిస్తాయికదా? అందుకే పడివుంటాము అబద్దాలు చెప్పుకుంటూ - అసహజమూ, అసత్యమూ అయి. "
నారాయణ: "అసలు స్త్రీకి పవిత్రత అనే విచిత్ర భావనలు ఈ కాలంలోనే విపరీతంగా, అర్థరహితంగా,శాస్త్రభిన్నంగా ఉన్నాయి. పరపురుషుడి వేలు తగిలితేనే కుక్క ముట్టినకుండ అంటారు. అంటే పగలగొట్టెయ్యొచ్చన్నమాట. కానీ మనపూర్వులు ధర్మశాస్త్రంలో అలా అనలేదు. కొన్ని స్మృతులను చూస్తుంటే ఈనాటికీ చాలా అడ్వాన్సుడ్ గా కనబడుతాయి. స్త్రీకి వ్యభిచారం అనేది ఓ పెద్దతప్పుగా చెప్పలేదు. ఆనేరానికి ప్రాయశ్చిత్తంకూడా సింపుల్గా చెప్పారు. స్త్రీకి వ్యభిచార దోషం ఒక రజోదర్శనం నుండీ మరో రజోదర్శనం వరకే అంటే ఒక బహిష్టు నుండీ మరో బహిష్టువరకూ అని. ఆ తరువాత ఆటోమేటిగ్గా ఆ పాపం పోతుంది. ఇంకా ఉల్లిపాయలు, మాంసాహారం తిన్న నిష్టాగరిష్టుడైన బ్రాహ్మణునికే ప్రాయశ్చిత్తం చాలా ఎలాబరేట్ గా చెప్పారు."
"...మన శాస్త్రాలు కాన్స్టిట్యూషన్స్ లాంటివి. వాటికి అమెండ్మెంట్స్ ఇచ్చుకోమనికూడా శాస్త్రాలలొ నిర్దేశించారు. ధర్మశాస్త్రాల్లో సాంఖ్యాకంగా చెప్పి వీటిలో వేటినైనా మార్చుకోమన్నారు. అయితే ఆ మార్పు పెద్దలచెత చేయించమన్నారు. రాగద్వేషాలకు అతీతుడై, వయసుపండి ఆత్మదర్శనం చేసిన వ్యక్తిమస్తిష్కానికి తోచిన దానికంటే మించిన ధర్మం లేదు పొమ్మన్నారు. అట్టిధర్మం ఎలాంటిదయినా, అంతవరకూవున్న ధర్మశాస్త్రాలకు భిన్నంగా ఉంటే పాతధర్మాన్ని తుంగలో తొక్కమన్నారు...."
Posted by Kathi Mahesh Kumar at 3:50 PM 8 comments
Labels: సాహిత్యం
Tuesday, November 18, 2008
కొత్త బిచ్చగాడు
కొత్తగా ఏదైనా నేర్చుకుంటే దాన్నే సమయం సందర్భం లేకుండా చేస్తూ, కనపడినవాడికి తమ కొత్త విద్యలోని నైపుణ్యాన్ని గురించీ, కొత్తగా నేర్చుకున్న విషయవిజ్ఞానాన్ని గురించీ చెప్పిచెప్పీ విసిగించి వేసారిపోయేలా చెయ్యడం మనం సాధారణంగా చేసేపని. అప్పుడే "కొత్తబిక్షగాడు పొద్దెరగడు" అని వ్యవహరించేస్తూ ఉంటారు.
విశాల్ భరద్వాజ్ హిందీ సినిమా 'మఖ్బూల్'లో ఇలాంటిదే ఒక మతానికి సంబంధించిన సామెత చెబుతాడు. "నయా ముసల్మాన్ హై, పాంచ్ బార్ నమాజ్ తో పఢేగా హీ" అని. అంటే, 'కొత్తముస్లిం కదా, ప్రస్తుతానికి ఐదుసార్లు నమాజ్ ఖచ్చితంగా చదువుతాడ్లే!' అని అర్థం. ఈ విధంగా, కొత్తగా మతంపుచ్చుకున్నవాళ్ళలో ఈ ధోరణివుండటం సహజంగా జరిగిపోతూ ఉంటుంది. మాటిమాటికీ మతపరమైన references వాళ్ళమాటల్లో కనిపించేది అందుకే.
కొత్తగా మతంపుచ్చుకున్న ఒక క్రైస్తవ మిత్రుడి వింతధోరణి గురించి వాసిలి సురేష్ తన బ్లాగు 'తెలుగు నేస్తమాలో' రాసినటపా చదివేసరికీ, మా కాలేజిలో జరిగిన మతచర్చలు గుర్తొచ్చాయి. నేను చదివింది ఇంగ్లీషు సాహిత్యం, అందులో ఆధునిక సాహిత్యంలోని సింహభాగం చర్చ్ (Church) వ్యతిరేక సాహిత్యం గనక, మా చర్చల్లో మతం తరచూ receiving endలో ఉండేది. బైబిల్ గ్రంధాన్ని గురించికూడా ఆంగ్లసాహిత్య చరిత్రలో భాగంగా చదువుకున్న మాకు ఈ వింతపోకడల్ని సాధికారంగా ఖండించే అవకాశం ఉండటంతో, క్లాసులోవున్న క్రైస్తవ మిత్రులు తమ నిరసనని బాహాటంగా చెప్పేవారు కాదు. కానీ, క్లాసు ముగిసిన తరువాత కాస్త informal గా జరిగే మాటల్లో "మతాన్ని గురించి అలామాట్లాడితే ఎలా?" అనేవాళ్ళు.
ఈ సంవాదాల్లో జరిగేచర్చల్లో ముఖ్యంగా వచ్చే విషయాలు "మనమంతా పాపులం" అనే నమ్మకం. ఇతర మతాల దేవుళ్ళపటాలు,ప్రసాదాలూ తాకకూడదు. సినిమాలు చూడకూడదు,సినిమా సంగీతం వినకూడదు లాంటివి. మొదటి నమ్మకానికి కనీసం బైబిల్ లో కొంత ప్రాదిపదిక వున్నా, మిగతా రెండిటీకీ క్రైస్తవమతానికీ సుదూరంలోకూడా సంబంధం లేదు. కానీ,దినదిన వ్యవహారాలలో ఇలాంటివి మాటిమాటికీ ఎదురై, ఎప్పుడూ ప్రశ్నలు తలెత్తేవి. అందుకే తెగని చర్చలకు మూలమయ్యేవి.
మా ఫ్రొఫెసర్ ఒకాయన సరదాగా "పాపిగళూ బన్ని అంతా బోర్డ్ హాకి కరితారప్పా! నీవు హోగబేడ. నీ పాపియేనో?" అని కన్నడలో ప్రశ్నించేవాడు. అంటే, "పాపులారా రండి అని బోర్డుపెట్టుకుని మరీపిలుస్తారయ్యా! నువ్వెళ్ళకు. నువ్వు పాపివి కావుకదా?" అనర్థం. క్రైస్తవమతంలో original sin అనే ఒక భావన ఉంది.ఆడమ్- ఈవ్ భగవంతుడు నిషేధించిన (జ్ఞానఫలం)పండు (forbidden fruit) తినడం వలన దేవుడు సృష్టించిన పవిత్రలోకానికి దూరమయ్యారని. కాబట్టి, ఆడమ్-ఈవ్ సంతానమైన అందరిమనుషులూ పుట్టుకతో ఆ పాపాన్ని పంచుకుని పుడతారని ఒక నమ్మకం. ఆ పాపం నుంచీ పరిహారం పొందడానికి దేవుడిదారి ఎంచుకోవాలనే ఆధారంతో ఈ నమ్మకాన్ని మతవ్యాప్తికి బాగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయం మీద క్రైస్తవుల్లోని వివిధ శాఖల్లోకూడా బహు విభేధాలున్నాయి.
మా కాలేజి చర్చల్లో తేలిన conclusion ఏమిటంటే,‘if eating the fruit of knowledge is a sin, it's good that the sin happened’ అని. జ్ఞానఫలం తినకుండా ఉంటే, మనిషి మనషిగా ఉండేవాడుకాదు కదా! అందుకే, ఆ "పాపం" జరగడం మంచిదనే నిర్ణయానికొచ్చేవాళ్ళం. ఆపని చెయ్యకుండా ఉంటే మనుషజాతికూడా అనభూతులులేని కూరగాయలో,జంతువులలాగానో ఉండేవాళ్ళంకదా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఆ పాపం, పాపమెలా అవుతుంది అనేది ప్రశ్నార్థకమే! అంతేకాకుండా, మతానికి ‘గిల్ట్’ (అపరాధభావన) ప్రాతిపదికైతే,దాంట్లో ఎస్కేపిజమే తప్ప జీవనమూల్యాల సాధన సాధ్యమా అనేది తరచూ ఉద్భచే సందేహం.
ఇక ఇతరమతాల దేవుళ్ళపటాలనూ,ప్రసాదాన్నీ తాకకూడదు అనేది కేవలం అపోహేతప్ప బైబిల్ ను ప్రాతిపదికగా చేసుకున్న నమ్మకమైతే అస్సలు కాదు. చారిత్రకంగా రోమన్ సారాజ్యానికి వ్యతిరేకంగా ఒక reactionary మతంగా క్రైస్తవమతం ఉధ్బవించినా, (ఆ తరువాత కాలంలో రాజకీయ ఉద్దేశాలతో ప్రారంభమైన క్రుసేడర్ సమయం మినహా) చాలావరకూ శాంతీ, ప్రేమలను ఆధారం చేసుకుని వ్యాప్తి చెందింది. అందుకే, ఇస్లాం మతంలో కనిపించే పరమతంపట్ల వ్యతిరేకత ( పేగన్లకు వ్యతిరేకంగా ఇస్లాంలో చాలా విధివిధానాలున్నాయి) కనబరిచే అవకాశం లేదు. అదీ ముఖ్యంగా "ఒక అంగీకారాత్మక ప్రాతిపదికన రాయబడిన" కొత్తనిబంధన గ్రంధం ఆవిధంగా ప్రవచించే అవకాశమే లేదు.
ఇక కొత్తక్రైస్తవుల సినిమా ప్రహసనం గురించి నా ఇదివరకటి టపాలో చెప్పాను చూడండి.
అందుకే, కొత్తగామతం పుచ్చుకున్నవాళ్ళ పోకడల్లో ఫాదర్లూ, పాస్టర్లూ, ఇతర మతప్రచారకులు నింపే అపోహల పాత్ర చాలా ఉందనిపిస్తుంది. హిందుమతంలోని అపోహలకు చాలా కారణాలుండొచ్చు. కారణం ఇక్కడ ఏక గ్రంధం,ఏక ప్రవక్త, ఏక దేవుడు లేడు. కానీ, క్రైస్తవం బైబిల్ కు కట్టుబడింది కాబట్టి (పేరే కొత్తనిబంధన గ్రంధం కదా!), నియో- క్రైస్తవులు కనీసం బైబిల్ ని పుర్తిగా చదువుకోవాలేమో!
Posted by Kathi Mahesh Kumar at 1:20 PM 9 comments
Labels: మతం
Monday, November 17, 2008
నువ్వు ఆడపిల్లవి
కొన్ని సంవత్సరాలుగా తస్లీమా సస్రీన్ 'లజ్జా' (Shame) పుస్తకం కంటిముందు కనబడుతూవున్నా, ఇంతవరకూ చదవలేదు. కానీ ఇప్పుడే ఆ నవల ఆంగ్లానువాదంనుంచీ కొన్ని వాక్యాలు చదవటం జరిగింది. వాటిని తెలుగులో అనువదించి ఇక్కడ అందిస్తున్నాను.
నువ్వు ఆడపిల్లవి
ఆ విషయం నువ్వు మర్చిపోకు
గడపదాటావా, మగాళ్ళు నిన్ను అనుమానంగా చూస్తారు
నువ్వు వీధిలోకి వస్తే
మగాళ్ళు నిన్ను వెంటాడతారు, వేధిస్తారు
వీధిదాటి రోడ్డుమీదకొచ్చావో...
నిన్ను నిందిస్తారు,నిన్ను కళంకిని అంటారు
నువ్వు నిజంగా పవిత్రురాలివైతే
వెనుదిరిగి చూడవు
తలొంచుకు వెళ్తావు
ఇప్పుడెలా వెళ్తావో, అప్పుడూ అలాగే ఉంటావు.
- తస్లీమా సస్రీన్
ఈ వాక్యాలు చదివిన తరువాత ఆడపిల్లలపై ఆంక్షల విషయంలోభారతీయ పరిస్థితికీ బాంగ్లాదేశ్ పరిస్థితికీ పెద్ద తేడా లేదనిపిస్తుంది. ఈ పుస్తకం ఆంగ్లంలో తెలుగులోకూడా విరివిగా లభ్యమవుతుంది. ఈ వాక్యాలు చూసిన తరువాతనే నేనూ పూర్తి నవలను చదవాలని నిర్ణయించుకున్నాను. వీలైతే మీరూ చదవండి.
Posted by Kathi Mahesh Kumar at 3:19 PM 13 comments
Labels: సాహిత్యం
Sunday, November 16, 2008
కులాల కురుక్షేత్రం
చెన్నై లోని అంబేద్కర్ లా కాలేజిలో జరుగుతున్న సం‘కుల’సమరం నేపధ్యంలో మళ్ళీ కులచర్చలు వీధుల్లోకొచ్చాయి.దళితుల్లో సామాజిక స్పృహ పెరిగినకొద్దీ కులఘర్షణలు తీవ్రరూపం దాలుస్తున్నాయన్నది ఎవరూ కాదనలేని సత్యం . అగ్రకులాలుదీన్ని, ‘అతిగా స్పందించడం’ అంటుంటే, దళితులు ‘వారి ఎదుగుదలకి ఓర్వలేని అగ్రకులాల దాష్టీకానికి వ్యతిరేకంగా ఈ ఘర్షణలు జరుగుతున్నాయి’ అంటున్నారు. రెండుధృక్పధాలూ పాక్షికంగా సరైనవే, కానీ తమిళనాడు చారిత్రక నిజాల వెలుగులో చూస్తే ఈ generalization అంత సులభం కాదనిపిస్తుంది.
తమిళజాతీయవాద స్ఫూర్తితో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మొదలైన ద్రవిడ/తమిళ ఉద్యమం అగ్రకుల ఆధిపత్యానికి సవాలుగా జరిగినా, బ్రాహ్మణేతర కులాలు దళిత అజెండాని ఈ పోరాటంలో భాగం చెయ్యక దళిత ఉనికిని మరుగుపరిచారని దళితమేధావుల వాదన. దీంతో సామాజిక, ఆర్థిక,రాజకీయ పరంగా దళితులు వెనక్కునెట్టబడి, ఇప్పటికీ (కనీస) మానవహక్కులకోసం నిత్యజీవన పోరాడటం సాగిస్తున్నారు.తమిళ అస్థిత్వసాధనలో, హిందీ hegemony కి వ్యతిరేకంగా తమిళసంస్కృతి పునర్జీవనం జరిగినా, అందులోనూ దళితులకు సముచిత స్థానం లభించలేదు. గుళ్ళో ప్రవేశం, పూజల్లో వివక్ష, మతంలో సముచిత స్థానం ఇంతవరకూ ప్రశ్నార్థకంగానే ఉంది. ఇప్పటికీ జీవించడంలోనే కాక చావులోకూడా ఈ వివక్ష కొనసాగటం ఈ వివక్షవిస్తృతత్వానికి అద్దం పడుతుంది.
ఇదే నియో-అగ్రకులభావజాలం ఒకవైపు రాజకీయ వ్యవస్థలో ప్రతిఫలిస్తే, మరోవైపు అధికారవ్యవస్థ నిర్మాణానికి ఇదే మూలంకావడంతో పరిస్థితి విషమించింది. ఒకవైపు సమాజం, మరో వైపు ప్రభుత దళితవ్యతిరేక భావజాలానికి ఆధిపత్యం వహిస్తే, ఒకమూలకు త్రోయబడ్డ దళితులు ప్రతిఘటించడంతప్ప మరేమీ చెయ్యలేని నిస్సహాయులయ్యారు. ఈ నిస్సహాయతలోని ఉక్రోషం ఒకవైపు అడుగడుగునా తక్కువచెస్తున్న అగ్రకులాలపై కోపం మరోవైపు, ఇవన్నీ చూస్తూకూడా నిమ్మకునీరెత్తినట్లుండే ప్రభుత్వం,రాజకీయవ్యవస్థపై తిరుగుబాటు ధోరణి ఒకవైపూ ఏకమై ఈ ఘర్షణలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం జరిగిన ఘటనకు మూలం కాలేజి పేరులోని ‘అంబేద్కర్’ పేరుతొలగించి దేవర్ కులస్థులు ఒక కరపత్రాన్ని పంచడం. దళిత ఆత్మగౌరవానికీ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుకీ విడదీయరాని సంబంధం ఉందని తెలిసీ ఈ పని చెయ్యడం దేవర్ కులస్థుల అహంకారానికి ప్రతీకైతే, హింసకుపూనుకోవడం పల్లవర్ కులస్తుల పోరాటస్ఫూర్తిలోని లోపాలను ఎత్తిచూపుతుంది. ఈ రెండు సామాజిక పార్శ్వాలకూ వారికారణాలు వారికుంటే, ఉద్రిక్త పరిస్థితి తెలిసీ ముందస్తుజాగ్రత్తలు తీసుకోని కాలేజీ యాజమాన్యం(ప్రిన్సిపాల్), ఘర్షణ సమయంలో అక్కడుండీ చోద్యం చూసిన పోలీసుల పాత్రమాత్రం సిగ్గుపడేలాగా ఉంది. ఇలాంటి ఘర్షణలకు ఊతమచ్చి తమ రాజకీయ పబ్బంగడుపుకునే రాజకీయ పార్టీల తీరు అత్యంతహేయం.
ఈ పరిస్థితుల చారిత్రక నేపధ్యం గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవండి.
DALITS IN DRAVIDIAN LAND — Frontline Reports on Anti-Dalit Violence in Tamil Nadu 1995-2004: S. Viswanathan; Pub. by Navayana Publishing, I Floor, 12/293, Ahmed Complex, Royapettah High Road, Chennai-600014. Rs. 300.
Posted by Kathi Mahesh Kumar at 9:27 AM 7 comments
Labels: సమాజం
Saturday, November 15, 2008
పోహా - జిలేబి
పోహా- జిలేబి...ఇదేంటా! అని ఆలోచిస్తున్నారా?!?
మధ్యప్రదేశ్ రాష్త్రంలో ‘మాల్వా’(Malwa) అనే ప్రాంతం వుంది. ఇండోర్ (Indore) నగరానికి చుట్టుపక్కలున్న ప్రదేశానంతా మాల్వాగా వ్యవహరిస్తారు. కొంత రాజస్థాన్, గుజరాత్ లోని ప్రాంతాలనుకూడా చారిత్రకంగా మాల్వా ప్రాంతంగా చెప్పడం జరుగుతుంది. మనం చిన్నప్పుడు చందమామ కథల్లొ చదివిన మాళవదేశం ఇదేనట. అదేంటో...ఆ కథల్లో ఎప్పుడూ మాళవదేశం రాకుమారుడూ, వంగదేశపు రాకుమారీ మాత్రమే ఉండేవారు!!
ఆ సంగతి పక్కనబెడితే, ఈ ప్రాంతంవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఫలహారం - బ్రేక్ ఫాస్ట్ "పోహా- జిలేబి". జిలేబి సంగతి అందరికీ తెలిసిందేకాబట్టి, విశదంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, ఈ ‘పోహా’ కూసింత కొత్తపదంగనక చెప్పుకోవాల్సిందే. మనం అటుకులంటామే..ఫ్లాట్ రైస్ దాన్ని లెమన్ రైస్ తరహాలో పోపుబెట్టి, నిమ్మకాయపిండితే అదే పోహా. ఈ పులిహోరలాంటి పోహాకీ, చెక్కెరపాకం కారే జిలేబీజీ చనువెప్పుడు కుదిరిందో, మనువెప్పుడు జరిగిందో తెలీదుగానీ, ఈ ప్రాంతం మొత్తం ఇదే తరహా. పొద్దునైతే చాలు రొడ్డుపక్కన చిన్నచిన్నబళ్ళూ, కాకాహోటళ్ళూ ఇదే వడ్డిస్తూ కనిపిస్తాయి. మనుషులు వీటిని మనసారా ఆరగిస్తూనే కనిపిస్తారు.
ఇడ్లీ, వడ,దోసె, ఉప్మా-పెసరట్టు, పొంగల్, పులిహోరకి అలవాటుపడ్డనాకు ఇంట్లో ఏంవండుకున్నా, ఈ పోహా- జిలేబి మాత్రం పాప్యులర్ వంటకం విచిత్రమైన కాంబినేషన్ గానే అనిపించింది. అక్కడున్న మూడు సంవత్సరాలూ, కనపడిన ప్రతి వ్యక్తినీ ఈ పెళ్ళిసంబంధం గురించి ఆరాతీసా. కానీ నిరాశే మిగిలింది. ఇదితప్ప పొద్దున్నే అక్కడ ఇంకేదైనా కావాలంటే దొరికేవి సమోసా, కచోరి. అక్కడక్కడా అప్పుడప్పుడూ పూరి, పరాఠా. ఈ పరాఠా మన ఆంధ్రాతరహా కాదండోయ్! వీళ్ళకి పారాఠా అంటే, ఆలూ,గోబీ,పన్నీర్, పాలక్ (పాలకూర) లాంటి filling కలిపిన stuffed పరాఠా అన్నమాట. దాంట్లోనూ డాల్డాకారేలా కాలిస్తేగానీ వీరికి ముద్దదిగదు.మనలాంటోళ్ళకి గొంతు దిగదు.కాబట్టి safe bet పోహా -జిలేబీనే. పొద్దునే స్వీట్ తినే అలవాటు లేకపోవడం వల్ల, జిలేబీవద్దంటే దుకాణమోడు జూలో జంతువల్లే చూసేవాడు. తెలుగులో అంటామే "గాడిదకేంతెలుసు గంధం వాసన", "అడవికోడి కేందెలుసు వడ్లగింజ రుచి" అని, అలాచూస్తారన్నమాట.
ఇప్పుడు ఈ వంటకం ఒకవైపు గుజరాత్,రాజస్థాన్ లలో మరోవైపు మహరాష్ట్రలోకూడా జాతీయ బ్రేక్ఫాస్ట్ అయ్యిందని విన్నాను. ఈమధ్య హైదరాబాద్ వచ్చినతరువాత, మళ్ళీ బయట ఎన్నిరకాల బ్రేక్ఫాస్టులో....I am loving it. మెక్ డోనాల్డ్స్ నాకుపెద్దగా నచ్చదుగానీ, ఈ ట్యాగ్ లైన మన ఆంద్రాటిఫిన్ హోటళ్ళకూ, కర్ణాటక తరహా దర్శినిలకూ మాత్రం అర్జంటుగా పెట్టేసి సంతోషించెయ్యాలనుంది.
చివరిగా ఒక్కమాట, భోపాలో, ఇందోరో, అహ్మదాబాదో, నాగ్ పూరో వెళితేమాత్రం పోహా-జిలేబి కాంబినేషన్ ప్రయత్నించండే...భలే వుంటుంది "ఆవకాయ్ బిర్యానీ"లాగా.
Posted by Kathi Mahesh Kumar at 7:13 AM 7 comments
Labels: వ్యక్తిగతం
Thursday, November 13, 2008
బాలబాలికల దినోత్సవం
మళ్ళీ బాలల దినోత్సవం వచ్చింది. అందరుపిల్లలూ బడికెళ్ళి, ప్రేమగా చాచా నెహ్రూని తలుచుకుంటారు. చిన్నపిల్లలో ఎవడోఒకడికి నెహ్రూ తరహా శేర్వాణీ తొడిగి, జేబుకు గులాబిగుచ్చి సరదాగా నవ్వుకుంటారు. టీచర్లు చాక్లెట్లో, లడ్డూలో పంచిపెట్టి "ఈ రోజు మీరోజర్రా!" అని ఒక పదినిమిషాలు ఊదరగొట్టేస్తారు. ఆ తరువాత, బాలల దినోత్సవం అయిపోతుంది.
కానీ, పుట్టగానే చనిపోయే కొందరి గురించి. పుట్టినా, కొన్నాళ్ళకే గిట్టే మరికొందరి గురించి. బ్రతికినా, బ్రతికినకొన్నాళ్ళూ ఆకలీ, అనారోగ్యంతో బ్రతికే మరికొందరిగురించి. బడికెళ్ళలేని బడుగు బుడుగుల గురించి కొన్ని నిజాల్ని కూడా తెలుసుకుని, వాళ్ళకోసంకూడా బాలల దినోత్సవం జరుపుకుందాం.
- ప్రతిసంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్ళు నిండకుండానే 9.7 మిలియన్ పిల్లలు చనిపోతే, వారిలో దాదాపు 21% అంటే 2.1 మిలియన్ పిల్లల భారతదేశంలో మరణిస్తారు.
- ప్రపంచవ్యాప్తంగా ఇలా మరణించేవారిలో, పుట్టిన నెలరొజులకే సంక్రమించే అనారోగ్యాల (neo-natal) కారణంగా 37% చనిపోతే, మనదేశంలో 50% మంది పిల్లలు మరణిస్తారు.
- నిమోనియా కారణంగా 19%
- విరోచనాలు (డయేరియా) కారణంగా 17%
- మలేరియా కారణంగా 8%
- తట్టు (measles) మరియూ ఇతర గాయాల కారణంగా 4% మరియూ 3%
- ఎయిడ్స్ కారణంగా 3%
- ఇతర కారణాలవల్ల మిగతా 10% మరణిస్తారు.
- ప్రస్తుతం 9.4 మిలియన్ పిల్లలు ప్రాణాంతక వ్యాధుల్ని నివారించే టీకాలు వేయించుకోకుండా ఉన్నారు.
- దాదాపు 8.3 మిలియన్ పిల్లలు పుట్టుకసమయంలో కనీసం 1.5 కిలోల బరువుకూడా లేకుండా పుడుతున్నారు.
- ప్రపంచంవ్యాప్తంగా పౌష్టికాహారలేమి కారణంగా బరువుతక్కువగా (underweight) ఉన్న పిల్లల్లో 1/3 వవంతు భారతదేశంలో ఉన్నారు.
- ప్రతి లక్షజన్మాలకీ 450 నుంచీ 301 మందిపిల్లలు చనిపోతున్నారు (Infant Mortality Rate)
మరిన్ని వివరాలకు ఇక్కడ చూడండి.
Posted by Kathi Mahesh Kumar at 11:16 PM 16 comments
Labels: సమాజం
Wednesday, November 12, 2008
కాలం చెల్లిన భీష్ములు
మహాభారతంలో నాకు ఇష్టమైన పాత్రలు కర్ణుడు, భీష్ముడు. ఒకరు విభ్రమకు గురిచేస్తే మరొకరు విభ్రాంతిని అందిస్తారు. కర్ణుడు తన నిబద్ధత నిలబెట్టుకుంటూకూడా , బాహ్యప్రపంచ కారకాలమూలంగా ప్రాణాలు కోల్పోతాడు. కానీ భీష్ముడు, తన వ్యక్తిత్వంలోని లోపాల కారణంగా అసువులుబాస్తాడు. ఈ విధంగాచూస్తే, భీష్ముడు ఒక క్లాసిక్ షేక్స్పీరియన్ పాత్ర తరహా అన్నమాట. సినిమా పరిభాషలో "miscasting" అంటారు. అంటే మోహన్ బాబు పాత్రలో మహేష్ బాబుని పెట్టడంలాంటిదన్నమాట. సత్యయుగం, త్రేతాయుగం నాటి విలువలు కలిగిన భీష్ముడు, ఈ ద్వాపరయుగంలో a complete miscast అనిపిస్తుంది.
భీష్ముడి పాత్రలో వున్న అత్యంత definingలోపం, 'సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం' . మొత్తం మహాభారతంలో కృష్ణుడికి సరితూగగలిగిన శక్తియుక్తులు, బలాబలాలూ,జ్ఞానవిజ్ఞానాలూ సొంతమైనా, భీష్ముడు మహాభారతాన్ని నిర్దేశించడానికి తన ఉనికిని వాడడు. ప్రతిసారీ ఒక ప్రేక్షకుడిగానో లేక తప్పుజరుగుతుంటే దానిలో మూగభాగస్వామిగానో కనిపిస్తాడేగానీ, పరిస్థితుల్ని మార్చగలిగివుండీ నిర్ణయాత్మకంగా అడుగులువేసే ధీరీద్ధాత్తుడిలాగా ఆగుపించడు.కొన్ని సందర్భాలలో కృష్ణుడికీ భీష్ముడికీ మధ్య జెట్ -కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్ల మధ్య కుదిరిన ఒప్పందంలాంటి 'డీల్' కుదిరినట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ జెట్-కింగ్ ఫిషర్ డీల్ లో optimization of operational costs అయితే, కృష్ణ-భీష్ముల మధ్య ధర్మసంస్థాపనకోసం, ఒకరు వేగవంతమైన మరొకరు మూగవంతమైన భాగస్వాములుగా పాత్రలు పోషించారనిపిస్తుంది. కానీ, ఈ పరిణామక్రమంలో కృష్ణుడు అవతారమైపోతే, భీష్ముడు మాత్రం అపవాదునేమూటగట్టుకున్నాడు.లేకపోతే, భీష్ముడుమాత్రం అవతార హోదాకి అర్హుడుకాదా?
తండ్రి సుఖంకోసం, కాబోయేతల్లి పిల్లలకు అధికారం ఇవ్వడంకోసం భీష్మమైన ప్రతిజ్ఞ చేసి ఈ గాంగేయుడు భీష్ముడయ్యాడు.పెద్దతమ్ముడు చిత్రాంగదుడు యుద్ధంలో మరణిస్తాడు. భార్యల్నికూడా గెలిచితెచ్చుకోలేని బలహీనుడైన తమ్ముడు విచిత్రవీర్యుడికి అంబాలిక,అంబికలకు కట్టబెట్టి, అంబ జీవితాన్ని అడవులపాలు చేశాడు. తీరా, విచిత్రవీర్యుడు వంశాంకురాన్నివ్వకుండా కన్నుమూస్తే, తన ప్రతిజ్ఞకు మూలకారణమే నశించినాకూడా, పట్టినపట్టువీడని భీష్ముడిది మంకుపట్టు అనిపిస్తుందేతప్ప,మహాప్రతిజ్ఞలాగా అనిపించదు.వంశాన్నుద్ధరించడానికి వ్యాసుడ్ని పట్టితేగలిగినవాడు, తనే ఆపనిచేసుంటే మహాభారతం ఎలావుండేదో! బహుశా అందుకేనేమో రచయిత వ్యాసుడే కల్పించుకుని కాగలకార్యంకాస్తా నెరవేర్చాడు.
ఇక్కడా భీష్ముడి ప్రతిజ్ఞ నిలబెట్టుకునే కాంక్షకనిపిస్తుందేగానీ, నిజంగా అంబాలిక,అంబికల స్త్రీత్వాన్ని గౌరవించినట్లు కనపడదు. వారి ఇష్టానికి వ్యతిరేకంగా వ్యాసునితో కూడమని చెప్పడంవలనే, ఒకరికి రక్తహీనుడైన పాండురాజు జన్మిస్తే వేరొకరికి అంధుడైన ధృతరాష్టృడు జన్మించాడు. ఇందులో జరిగిన మంచిఏదైనా ఉంటే,అది concessionగా విదురుడు జన్మించడం. ఇక ఈతరంలోనూ స్త్రీల ఉసురు పోసుకోవల్సిన అగత్యం ఈ మహానుభావుడికి పట్టింది. కుంతీ,మాద్రుల్ని సంసారసుఖం ఇవ్వలేని పాండురాజుకు కట్టబెడతాడు. గుడ్డివాడైన ధృతరాష్టృడ్ని గాంధారికి కట్టబెట్టాడు. ఒకరికి సుఖంలేదు మరొకరికి శాంతిలేదు. వేరే ప్రత్యామ్న్యాయం ఉండీ, ఇన్ని సంకరాల్ని చేజేతులారా చేసిన భీష్ముడు, ఆ తరువాత జరిగిన దారుణాలకు మూగసాక్షిగా మిగలక, సాధికారంగా ఆపగలిగేవాడా!
భీష్ముడి వ్యక్తిత్వానికి గొడ్డలిపెట్టులాంటి ఘటన, ద్రౌపదీ వస్త్రాపహరణం. ఇంటికోడలిని, ఏకవస్త్రను నిండుకొలువులో వలువలీడ్పించే సమయంలో,ఆపగలిగిన అధికారం బాధ్యత రెండూ వుండికూడా మౌనం వహిస్తాడు. "ఇంతకన్నా, misplaced sense of loyalty మరోటుంటుందా?" అనిపిస్తుంది. ఈ ఘోరావమానం ఎదుర్కొంటున్న ద్రౌపదికూడా, ఆ నిండుకొలువులో "నేను ధర్మ విదితనా, అధర్మవిధితనా?" అని ఒక్కభీష్ముడి నుంచే సహాయాన్ని అర్థిస్తుంది. కానీ దానికి ఇతడి సమాధానం మాత్రం "దర్మం నిఘూడమైనది. నేను నీ ప్రశ్నకు సమాధానం చెప్పలేను" అని. దర్మాధర్మాల సంగతిపక్కనపెట్టినా, ఒక క్షత్రియుడిగా, విజ్ఞుడిగా, కనీసం మనిషిగా బలాత్కారం చెయ్యబడుతున్న ఒక దాసిని రక్షించకూడదా? కానీ ఆపనిచెయ్యలేకపోయాడు. కారణం విధేయత,విశ్వాసపాత్రత. అదీ ఎవరికి, అన్యాయానికి,అక్రమానికి. ఇంతటి మూర్ఖపు విధేయత అవసరమా అనిపిస్తుంది.బలహీనుల్ని రక్షించాల్సిన క్షాత్రధర్మాన్ని విస్మరించిన భీష్ముడి విధేయత,ధర్మనిబద్ధత ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది.
ఇక్కడే యుగధర్మానికి కట్టుబడిన కృష్ణుడికీ, ‘సత్తెకాలపు సత్తెయ్య’లాంటి భీష్ముడికీ తేడాకనబడుతుంది. కాకపోతే, కురుక్షేత్ర యుద్ధ సమయానికొచ్చే సరికీ ఈ విధేయతకూడా కోల్పోయిన రూపం భీష్ముడిలో కనిపించడం, మరో షాక్. సర్వసైన్యాధ్యక్షుడయ్యుండీ, కావలసినప్పుడు మరణించే వరం పొందుండీ తన చావురహస్యాన్ని తన ప్రభువుయొక్క ప్రత్యర్థులకు సునాయాసంగా చెప్పేసే ఈ మహానుభావుడ్ని ఎలా అర్థం చెసుకోవాలో తెలీదు.జీవితాంతం తప్పుడునిర్ణయాలుతప్ప, తప్పనిసరి పరిస్థితుల్లో సక్రమమైన నిర్ణయాలు తీసుకోలేని భీష్ముడు చనిపోతూ, అంపశయ్యమీద ధర్మరాజుకు రాజ్యధర్మాన్ని నేర్పడం మహాభారతానికే హైలైట్.
బహుశా, మనందరిలోనూ ఈ భీష్ముడున్నాడు. ఈ కలియుగంలో యుగధర్మాన్ని విస్మరించి, కొంత సత్య- త్రేత్రా - ద్వాపరయుగాలలోని విలువల్ని ఆచరిస్తూ, సరైనసమయంలో సరైన నిర్ణయాలు తీసుకోక, అసంబద్ధ విధేయతని (misplaced loyalty) ప్రకటించుకుంటూ జీవిస్తూ ఉంటాము. మనలోని ఆ భీష్ముడికి కాలం చెల్లాలి. కాలం చెల్లిన భీష్ములకు కాలం చెల్లాలి.
Posted by Kathi Mahesh Kumar at 11:55 AM 37 comments
Labels: మతం
Monday, November 10, 2008
మహిళ నుంచీ, ‘మానవి’గా మారిన ఒక స్త్రీ కథ
నవల పేరు : మానవి
రచయిత్రి: వోల్గా
ప్రచురణ కర్త: స్వేచ్చ ప్రచురణ
మొదటి ముద్రణ: 1998
ధర: 50 రూపాయలు
ప్రతులకు: ప్రజాశక్తి, దిశ, నవోదయ, విశాలాంధ్ర బుక్ హౌస్
ఇల్లే స్వర్గం. భర్తే దైవం. పిల్లలే లోకం అనుకున్న ఒక మహిళకు, తను నమ్మిన విలువలన్నీ ఒక్క క్షణంలో ఆవిరైపోతే? ఇల్లాలిగా తన హోదా, భార్యగా తన గుర్తింపు, తల్లిగా తన గౌరవం అర్థాంతరంగా ప్రశ్నార్థకమైతే? ప్రేమించే భర్త మరో స్త్రీని ప్రేమిస్తున్నాడన్న నిజం తెలిస్తే? తన విలువలు పుణికిపుచ్చుకున్నదనుకున్న కూతురు, తన సంసారాన్ని కాపాడుకోవడానికి ఆ తల్లినే దూరం చేస్తే? బంధాలతోనే కొలవబడి. అనుబంధాల ఆసరాతోనే జీవితాన్ని అర్థం చేసుకుని. ఇల్లాలిగా మాత్రమే గౌరవాలందుకున్న ఒక మహిళను, ఎంచుకున్న జీవితం, పెంచుకున్న బంధం. అర్థరహితమై, తన అస్థిత్వాన్ని ప్రశ్నిస్తే? అప్పుడా మహిళ ఏం చేస్తుంది?
ఈ ప్రశ్నలకు సమాధానమే ‘వోల్గా’ నవల ‘మానవి’. పాతికేళ్ళ కాపురం తరువాత, డాక్టర్ సురేష్ తన తోటి డాక్టర్ నీలిమతో సంబంధం ఏర్పరచుకుంటాడు. అతడికి భార్య,కొత్తగా పెళ్ళయిన కూతురు, యూనివర్సిటీలో చదువుతోన్న మరో కూతురు ఉంటారు. అయినా అతడు ఈ బంధం నుంచి తప్పించుకోలేకపోతాడు. భార్యతో ఈ విషయం దాచకుండా చెప్తాడు. దానితో అతడి భార్య వసంత దాదాపు పిచ్చిదవుతుంది. భార్యగా తనలో ఏదైనా లోపముందా! ఇల్లాలిగా తను ఏదైనా తప్పుచేసిందా!! తల్లిగా తనుభాద్యతలు నెరవెర్చలేదా!!! అనే మీమాంశలో వసంతం ఉక్కిరిబిక్కిరవుతుంది. నీలిమలో గల ఆకర్షణేమిటో తను ఇప్పుడు భర్తని ఎందుకు ఆకట్టుకోలేకపోతోందో తెలీక సతమతమవుతుంది.ఏంచెయ్యాలో తెలీదు. ఎలా భర్తను "అదుపులో పెట్టుకోవాలో" అర్థం కాదు. ఈ నిరాశానిస్పృహల మధ్య భర్తకు ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేసి, మళ్ళీ ప్రేమికురాలి దగ్గర స్వాంతన పొందేంతగా మానసికహింసకు గురిచేస్తుంది. తనూ మానసికక్షోభ అనుభవిస్తుంది.
ఈ సంఘర్షణలో భాగంగా, తన ఆలోచనలకూ ఆకాంక్షలకూ ప్రతిరూపమైన పెద్దకూతురు లావణ్య దగ్గర స్వాంతనపోందాలనుకుంటుంది. కానీ, తల్లికన్నా తన సంసారం ముఖ్యమనుకునే లావణ్య, తల్లికి ఆర్థికంగా తండ్రి సహాయం చెయ్యాలనే షరతు (తన భర్తద్వారా) తండ్రికి తెలియపరుస్తుందే తప్ప, వాళ్ళని కలిపే ప్రయత్నం చెయ్యదు. అవసరానికి కావాలనుకున్న తల్లి కష్టాల్లో వుండటం చూసి, తప్పించుకోవాలనుకుంటుందేతప్ప ఆధారమై ఆదుకోవాలని అనుకోదు. ఈ విధంగా ఆశపెట్టుకున్న కూతురు నిరాశపరుస్తుంది. కారణం, ఆ కూతురికీ తన సంసారమేతప్ప తల్లిదండ్రులు ముఖ్యంకాదు.
వ్యక్తిత్వాన్ని మూర్తీభవించినట్లుండే (యూనివర్సిటీలో చదివే) రెండో కూతురు ‘నవత’ ఒకవైపు తల్లికి ఆసరాగా నిలవడమేకాక, తండ్రిని అర్థం చేసుకుని గౌరవప్రదంగా తల్లిదండ్రులు విడిపోవడానికి తోడ్పడుతుంది. నవత సహవాసంలో వసంత తన జీవితంలో అప్పటివరకూ నమ్మిన విలువల్ని త్యజింస్తుంది. ఇల్లే ప్రపంచంగా, భర్తా పిల్లలే జీవితంగా తనకంటూ ఒక వ్యక్తిత్వం లేకుండా ఒక reflected relationships యొక్క ఆసరాతో బ్రతికిన ఒక గృహిణి, తను నమ్మిన విలువలన్నింటినీ ఒక్క క్షణంలో కోల్పోయిన తరువాతకూడా, zero base నుంచీ జీవితాన్ని పునర్నిర్మించుకుంటూ, పాత విలువల్ని (భర్త సురేష్ ని) ఒక dispassionate human being గా కళ్ళలోకళ్ళుపెట్టి చూసిన తరువాత, మార్పుని మనస్ఫూర్తిగా ఆహ్వానించి పరిపూర్ణ వ్యక్తిత్వం సంతరించుకుని "మానవి" అవుతుంది.
ఈ నవలలో రచయిత్రి ఉద్దేశం 'మహిళకు తనదంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి. సంబంధాలు తన జీవితాన్ని నిర్వచించక, ఒక మనిషిగా తనకు ఒక వ్యక్తిత్వం-అస్థిత్వం ఉండాలి' అనిచెప్పడం. అందుకే అటు నీలిమకూ ఇటు సురేష్ పాత్రకూ ప్రాధాన్యత ఇవ్వలేదు. Point of conflict ఆ సంబంధం అయినప్పటికీ, ప్రధాన వస్తువు కాదు. ఒక మహిళ, భార్య,తల్లి,గృహిణి నుంచీ మనిషిగా మారిన వసంత లో జరిగే "మార్పు" కథావస్తువు. కాకపోతే, రచయిత్రి ఈ సంబంధాన్ని సమాజిక విలువలకోణంలోంచీ చూపించి నిరసించకపోవడం ఒక పెద్ద తెరపి అనుకోవచ్చు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో, నీలిమ పాత్రను ఒక వ్యాంప్ లాగా చిత్రిస్తే, వసంత పాత్రకు మరింత సానుభూతి దక్కుండేది. కానీ అలా చెయ్యకపోవడం రచయిత్రిలోని ప్రత్యేకతని చాటుతుంది.
అదే విధంగా సురేష్ పాత్రకూడా సాధ్యమైనంత సాధారణంగా ఈ "తప్పు" గురించి భార్యదగ్గర ప్రస్తావిస్తాడు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఎక్కడా నీతి,అనైతికతా అనే పదాలు రాకపోవడం. ఈ ఘటనని ఒక మానవీయపరిస్థితి (human situation) గా ఎటువంటి value judgment లేకుండా చెప్పటంలో రచయిత్రి చేసిన కత్తిమీది సాము అభినందనీయం. ఈ నవలలో, ఆర్థికంగా సామాజికంగా స్వతంత్ర్యంగా ఉంటూ, శారీరక-మానసిక అవసరాలకోసం ఒకపెళ్ళయిన మగాడితో సంబంధం కొనసాగించే వసంత స్నేహితురాలు శాంత నీలిమను రెప్రెజెంట్ చేస్తే. వసంతం- శాంతల పాత్రధోరణులలోని భిన్నత్వానికి వారధిలా, ఒకవైపు ఇల్లూ చూసుకుంటూ మరో వైపు డాక్టరుగా తన వ్యక్తిత్వాన్నీ నిలుపుకుంటూ మరో స్నేహితురాలు డాక్టర్ రోహిణి కనిపిస్తుంది. అతిముఖ్యంగా వసంత చిన్నకూతురు నవత భవిష్యత్తుకు చిహ్నంగా అనిపిస్తుంది.బహుశా అందుకే తన పేరు "నవత" అయ్యిందేమో! ఈ విధంగా మహిళా సాధికారతలోని వివిధస్థితిగతుల్ని రచయిత్రి తన పాత్రలద్వారా చూపించడం, అదీ సామాజిక విలువల ప్రస్తావన లేకుండా హృద్యంగా అనిపిస్తుంది.
భార్య, తల్లి,గృహిణిగా వసంత తన identity కోల్పోయి, ఆఖరికి వసంత, వసంతగా మిగులుతుంది. కేవలం ఒక మహిళగా కాకుండా ఒక వ్యక్తిగా, మనిషిగా, మానవిగా మిగులుతుంది. prescribed, ascribed and reflected identities పోయి తన true identityతో మిగులుతుంది.
తప్పకుండా చదవ వలసిన నవల. ప్రచురించబడి పది వసంతాలు కావస్తున్నా, ఇప్పటి పరిస్థితులకూ అన్వయించుకోదగ్గ విషయమున్న నవల.
Posted by Kathi Mahesh Kumar at 11:45 PM 11 comments
Labels: సాహిత్యం
Sunday, November 9, 2008
మెకాలే (Macaulay) మానసపుత్రులు
ఉదార-లౌకిక సాంప్రదాయాలు (secular liberal traditions) లేక లౌకికమానవతావాదాల(secular humanism) త్రోవలో ఏ చర్చ సాగించాలన్నా, సాంప్రదాయవాదులు మొదటిగా వేసే నింద "మెకాలే మానసపుత్రులు". భారతదేశంలో ఆధునికవిద్య ప్రవేశపెట్టిన థామస్ బెనింగ్టన్ మెకాలే -Lord Thomas Babington Macaulay (1800-1859) విధానాలవలన హిందూమతానికి దూరమైన మూఢులే ఈ ‘మెకాలే మానసపుత్రులు’. హిందూజాతీయవాదం పేరుతో ఉప్పొంగుతున్న భావజాల నేపధ్యంలో, ఈ భావన బలంగా పాతుకుపోయింది. హిందూజాతీయవాదులే కాక, సాధారణ హిందువులుకూడా, ఈమధ్య అంతర్జాలంలో ప్రచలనలోకి వచ్చిన కొన్ని వాక్యాలను (quote) ఆధారం చెసుకుని ఈ విషయాన్ని నమ్మడానికి తయారుగా వున్నారు. పూర్తి చరిత్ర చదవటమో, లేక కనీసం ఆ quote యొక్క పూర్వాపరాలను తెలుసుకోవడం (ఆ మెకాలే విధానాలవలన వచ్చిన ఉద్యోగాలలో) బిజీగా వున్న మనజీవితాలలో కుదరదు కాబట్టి, చెప్పింది యధావిధిగా నమ్మేయడం జరుగుతోంది.
ఈ quote నేపధ్యానికి చెందిన కొంత చరిత్ర, మరికొంత విశ్లేషణా సేకరించి ఔత్సాహికులైన ఉదారవాదులకోసం ఇక్కడ పొందుపరుస్తున్నాను.
"I have traveled across the length and breadth of India and I have not seen one person who is a beggar, who is a thief. Such wealth I have seen in this country, such high moral values, people of such calibre, that I do not think we would ever conquer this country, unless we break the very backbone of this nation, which is her spiritual and cultural heritage, and, therefore, I propose that we replace her old and ancient education system, her culture, for if the Indians think that all that is foreign and English is good and greater than their own, they will lose their self-esteem, their native self-culture and they will become what we want them, a truly dominated nation."
మెకాలేకి ఆపాదించబడుతున్న పై quote యొక్క కాలం 1835 బ్రిటిష్ పార్లమెంట్ గా చెబుతారు. ఇక్కడున్న సమస్యేమిటంటే, 1835 సమయానికి మెకాలే భారతదేశంలో వున్నాడు. ఈ విషయం మీద తను బ్రిటిష్ పార్లమెంట్లో మాట్లాడింది 1833 లో. ఈ నిజాన్ని పక్కనబెట్టి, కేవలం తను చెప్పాడని అనుకుంటున్న quote లోని విషయాన్ని చూద్ధాం. ఆకాలంలో ఆంతరంగికంగా బ్రిటిష్ వాళ్ళ ఈ విషయాల గురించి మాట్లాడుకున్నాకూడా, ఒక పార్లమెంటరీ డిబేట్ లో ఇలాంటి వాదాలు చేసేవారు కాదు. ‘నాగరికతను స్థాపించడం’ మరియూ ‘బానిస విధానాలను అంతమొందించడం’ లాంటి ఉద్దాత్తమైన విధానాల పేరుతో అప్పటి సామ్రాజ్యవాద (colonial) విస్తరణ జరిగింది. అందుకే, ఎప్పుడూ తాము గొప్పవాళ్ళమని, ఈ చీకటి ప్రపంచంలోకి వెలుగు నింపడానికి వచ్చామనీ చాలా బలంగా నమ్మేవాళ్ళు. కానీ, ఇక్కడమాత్రం మెకాలే భారతీయ సంస్కృతిని ఆకాశానికెతేస్తూ, దాన్ని నాశనం చెయ్యడానికి కంకణం కట్టుకోవాలని ఒక పబ్లిక్ ఫోరంలో చెబుతున్నట్లుగా నమ్మించాలని చూసారు. పైగా, బ్రిటిష్ సంస్కృతికన్నా ఈ నాగరికత గొప్పదన్నట్లుగా ఆ కాలంనాటి ఒక upper class ఇంగ్లీష్ అధికారి (అదీ పార్లమెంట్ లో, ఈస్ట్ ఇండియా కంపెనీని represent చేస్తూ) మాట్లాడినట్లు చెప్పడం నమ్మశక్యం కాని విషయం.
ఒకవేళ మాట్లాడాడు అనుకున్నా, 1833-35 నాటికి మన భారతీయ సంస్కృతి తను చెప్పినంత ఉన్నతంగా ఉన్నట్లు చారిత్రక ఆధారాలు లేవు. కేవలం 2% కన్నా తక్కువమందికి వేదాలూ,స్మృతులూ,ధర్మాలూ ఇతరత్రా విషయాల జ్ఞానం ఉండేది. కేవలం బ్రాహ్మణ,క్షత్రియ, వైశ్యులు ఈ విధివిధానాలను పాటించేవారు. ఈ జ్ఞానాన్ని సమపార్జించేవారు. అప్పటికే జనబాహుళ్యంలో మూఢనమ్మకాలూ, హింసాత్మకమైన ఆచారాలూ వేళ్ళూనుకొని వున్నాయి.ఇక్కడ మరో విచిత్రమేమిటంటే, ఈ పురాతనజ్ఞానం మీద సర్పాల్లా తిష్టవేసుకున్న ఇవే వర్గాలు/కులాలు, మెకాలేవిధానాల వలన అత్యధికంగా లాభపడ్డారు. కార్మికులూ,కర్షకులూ, రైతులూ బ్రిటిష్ వారి ఆర్థిక విధానాలవలన చితికిపోతే, ఈ సాంప్రదాయ ప్రేమికులు దుబాసీలుగా, బ్రిటిష్ అధికారానికి దాసులుగా రాజ్యం చేసారు.
ఇక్కడ మెకాలే భారతదేశానికేదో పెద్ద సేవ చేసాడని చెప్పడం ఉద్దేశం కాదు. కాకపోతే, అప్పట్లో తనకు ఇచ్చిన పనిని సిన్సియర్గా చేసాడు అంతే! అప్పట్లో బ్రిటిష్ వారి ముఖ్య ఉద్దేశం వ్యాపారం, ఆ తరువాత రాజ్యాధికారం. వాటిని సాకారం చెయ్యడానికి కావలసిన విధానాల రుపకల్పన చేసాడు.
ఇతని మీద వేసే మరొ అభియోగం, ‘హిందువుల్ని మతరహితుల్ని చేసి, తమ భావజాలానికి బానిసలుగా చేసే విద్యావిధానాన్ని నిర్మించాడు’ అని. దానికి ఆధారంగా చూపే quote ఇది;
'It is impossible for us, with our limited means, to attempt to educate the body of the people. We must at present do our best to form a class who may be interpreters between us and the millions whom we govern; a class of persons, Indian in blood and colour, but English in taste, in opinions, in morals, and in intellect." నేనిక్కడ ఒక వాక్యాన్ని బోల్డ్ లో పెట్టి, ప్రత్యేక ఆకర్షణగా నిలిపినట్లే ఈ quote చెప్పేటప్పుడు తమ వాదనల్ని వినిపించేవారూ చేస్తారు. కానీ మెకాలే అదే వ్యాఖ్యలో తరువాత చెప్పిన వాక్యాల్ని మాత్రం ఎక్కడా చూపించరు. వాటిని ఇక్కడ చూడండి; "To that class we may leave it to refine the vernacular dialects of the country, to enrich those dialects with terms of science borrowed from the Western nomenclature, and to render them by degrees fit vehicles for conveying knowledge to the great mass of the population.'" ఇప్పుడు మొత్తం పేరాని ఒకసారి చదువుకోండి. Now you may know, who is taking you for a ride.
ఇక్కడ మెకాలే మాటల్లో ఆ కాలంనాటి classic liberalism కనిపిస్తుందేతప్ప "కుట్ర" కనిపించదు.అప్పట్లో యూరోప్ లో ప్రచులితమైన శాస్త్రీయ ధృక్పధం (scientific temperament), సాంకేతిక విజ్ఞానాన్ని మనస్ఫూర్తిగా జ్ఞానమని నమ్మి, దాన్ని అందరికీ అందేలా చెయ్యాలనుకునే ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఒక సంస్కృతి గొప్పదనంవలన తమ ఉద్దేశాలు సాకారం కావుగాబట్టి, మోసంతో దాన్ని అంతం చెయ్యాలనుకునే మూర్ఖుడు కనిపించడు.అంతేకాక, అప్పటికే ఇతర సంస్కృతులవలన బాగుపడిందనుకున్న బ్రిటిష్ సంస్కృతి నేర్చుకున్న పాఠాలను, భారతదేశానికి అన్వయించాలనుకునే మేధావి కనబడతాడు. ఇదే speech లో తను బ్రిటన్ గురించీ, బ్రిటన్ లోకి ఇతర సంస్కృతులు వచ్చి ఎలా enrich చెసిందీ చెప్పాడు.
"The first instance to which I refer, is the great revival of letters among the Western nations at the close of the fifteenth and the beginning of the sixteenth century. At that time almost everything that was worth reading was contained in the writings of the ancient Greeks and Romans. Had our ancestors acted as the Committee of Public Instruction has hitherto acted; had they neglected the language of Cicero and Tacitus; had they confined their attention to the old dialects of our own island; had they printed nothing and taught nothing at the universities but Chronicles in Anglo-Saxon, and Romances in Norman-French, would England have been what she now is? What the Greek and Latin were to the contemporaries of More [Thomas --, 1478-1535] and Ascham [Roger --, 1515-68], our tongue is to the people of India."
ఇక్కడ, జ్ఞానాన్ని పంచుకోవడంలో తను తెలుసుకున్న మార్గాన్ని విధానరూపంలో చూడాలనుకునే ఒక ఔత్సాహిక విధ్యావేత్త కనిపిస్తాడు. గ్రీకు లాటిన్ భాషలద్వారా బ్రిటిష్ వారు నేర్చుకున్న నమూనాలో ఇంగ్లీష్ ద్వారా భారతీయులు ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటారనే conviction కనిపిస్తుంది. కొందరు మిత్రులు "ఆ..మెకాలే కొత్తగా నేర్పే జ్ఞానమేమిటి? మనదగ్గరున్న వేదాల్లో అప్పటికే అన్నీ వున్నాయిగా!" అంటారు. నిజమే. నిజమే!! కానీ అదెక్కడుంది? ఎంతమందికి తెలుసు? దాన్ని పంచుకోవడానికి ఎవరు తయారుగా ఉన్నారు? కనీసం ఇప్పటికన్నా దాన్ని వెలికితీసి అందరికీ పంచరే!!! వీటికి మాత్రం సమాధానాలు రావు.
మెకాలే ఇదంతా ఏదో లాభాపేక్షరహితంగా చేసాడనో, బ్రిటిష్ వారు భారతదేశం మీద ప్రేమతోనో చేసింది కాదని అందరికీ తెలిసిన సత్యమే.అది వారెక్కడా దాచుకోలేదుకూడా.
"It is scarcely possible to calculate the benefits which we might derive from the diffusion of European civilisation among the vast population of the East. It would be, on the most selfish view of the case, far better for us that the people of India were well governed and independent of us, than ill governed and subject to us; that they were ruled by their own kings, but wearing our broadcloth, and working with our cutlery, than that they were performing their salams to English collectors and English magistrates, but were too ignorant to value, or too poor to buy, English manufactures. To trade with civilised men is infinitely more profitable than to govern savages."
ఇలా విద్యకూ వ్యాపారానికీ గల సంబంధం యొక్క రహస్యాన్ని విప్పిచెప్పాడుకాబట్టే, మొదట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ తరువాత బ్రిటిష్ ప్రభుత్వం విద్యపైన డబ్బులు ఖర్చుపెట్టాయి. లేకపోతే, మనమూ ఏ ఆప్ఘనిస్తానో లేక ఆఫ్రికా దేశాల్లాగానో అధమం నేపాల్ లాగానో తయారయ్యుండేవాళ్ళం. మెకాలే అర్థజ్ఞానంతో తన ప్రతిపాదనల్ని సమర్పించాడనుకున్నా, ఈ ప్రతిపాదనలు ఏకపక్షంగా అంగీకరించబడలేదు. దాన్ని ప్రతిఘటించినవారూ, చర్చించినవారూ ఉన్నారు. కానీ, వారి వాదనలు నిలబడలేకపోయాయి. అప్పటికే Tradition Vs Modernity చర్చలు జరుగుతున్న బ్రిటన్లో, ఈ రెండిటిమధ్యా కావలసిన సమన్వయాన్ని ప్రతిపాదించేవాళ్ళు లేకపోయుండచ్చు. అందుకే సాంప్రదాయం మీద ఆధునికత విజయం జరిగిపోయింది.
మెకాలే మీద చేసే మరో ఆరొపణ క్రైస్తవ మిషనరీల ఉద్దేశాలకు అనుగుణంగా విద్యావ్యవస్థను తయారు చేసాడని. ఒకవైపు బ్రిటిష్ ప్రభుత్వం మరో వైపు బ్రిటిష్ చర్చిని సముదాయించి, బిజ్జగిస్తేగానీ ప్రశాంతంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం చేసుకోలేని సమయం అది. తను కలకత్తాలోని ఒక ఎవాంజెలిస్ట్ ఫాదర్ కు రాసిన లేఖలోని భాగాలను చూడండి;
"No Hindoo, who has received an English education, ever remains sincerely attached to his religion. Some continue to profess it as matter of policy; but many profess themselves pure Deists, and some embrace Christianity. It is my firm belief that, if our plans of education are followed up, there will not be a single idolater among the respectable classes in Bengal thirty years hence. And this will be effected without any efforts to proselytise; without the smallest interference with religious liberty; merely by the natural operation of knowledge and reflection. I heartily rejoice in the prospect."
ఇక్కడకూడా హిందూమతానికి దూరమైన వార్లో కొందరి క్రైస్తవానికి రావచ్చనే ఆశనికల్పించాడేతప్ప, అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేదు. జ్ఞానం మనిషిలో బుద్దివికాసానికి తోడ్పడితే, వాడు మానవతావాది అవుతాడే తప్ప మతాల్ని పట్టుకుని వేలాడడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే,ఈ దారిలోనే ఇస్లాం మతం లో, మదరసాల విద్యకు దూరంగా, సెక్యులర్ విద్యను భోధిచడం ఇస్లాం తీవ్రవాదానికి సరైన మందుగా ఒకవైపు ప్రభుత్వాలు భావిస్తుంటే, అది త్వరితగతిన జరగాలని హిందూ సాంప్రదాయవాదులు కోరడం. అప్పట్లోని అవసరాలకు అనుగుణంగా మెకాలే ప్రతిపాదిస్తే తప్పు, ఇప్పుడు మన అవసరాలకి అనుగుణంగా మనం కావాలనుకుంటే ఒప్పు. అంతే!
మెకాలే సిద్ధాంతాల వలన వచ్చిన ఆంగ్లవిద్య కావాలి. అదే విద్యద్వారా వచ్చే ఉద్యోగాలు, సాఫ్ట్ వేర్ జాబ్స్ కావాలి. తద్వారావచ్చే ఆర్థిక లాభాలూ,స్వావలంబనా కావాలి. దాని ఆధారంగా మనం ఒక developed nation కావాలి. కానీ, ఎవరైనా ఉదార-లౌకిక సాంప్రదాయాలు (secular liberal traditions) లేక లౌకికమానవతావాదాల(secular humanism) గురించి మాట్లాడితే మాత్రం "వాడొక మెకాలే మానసపుత్రుడు". సాంప్రదాయాల్నీ, సంస్కృతుల్నీ, విలువల్నీ ఆధునికత ఆధారంగా ప్రశ్నిస్తే...వారు మెకాలే మానసపుత్రులు. మెకాలే విధానాలు అందించిన లాభాలు మాత్రం కావాలి, ఆలోచనలు మాత్రం ఒద్దు. మెకాలే విధానాలు అందించే సామాజిక గుర్తింపుకావాలి, విలువలు మాత్రం ఒద్దు. వాటిని మాత్రం ఎవరికీ తెలీని రహస్య వేదాల్లో, అర్థంకాని సంస్కృత శ్లోకాల్లో వెతుక్కోవాలి.
"English remains indispensable for technical education and as a means of inter-State communication. The software revolution in India might never have happened had it not been for Macaulay's Minute. And India might not have still been united had it not been for that Minute either. For, it was the existence and availability of English that allowed the States of South India to successfully resist the imposition of Hindi upon them"
- Guha (2007)
*కొసమెరుపేమిట్రా అంటే, మొదట్లో ఉటంకించిన quote ఒక అంతర్జాల HOAX అని కొన్నాళ్ళకి తేలడం.
References
http://en.wikipedia.org/wiki/Thomas_Babington_Macaulay
http://www.languageinindia.com/april2003/macaulay.html
http://www.humsurfer.com/india-in-1835-a-proposal-from-lord-macaulay-to-british-parliament
http://www.countercurrents.org/dalit-prasad271004.htm
http://koenraadelst.bharatvani.org/articles/hinduism/macaulay.html
http://www.mumbai-central.com/nukkad/jan2008/msg00251.html
****
Posted by Kathi Mahesh Kumar at 11:53 AM 29 comments
Labels: సమాజం