నేను మైసూర్ లో డిగ్రీ చదువుతుండగా, అక్కడ దొరికే ఏకైక తెలుగు సినీ పత్రిక ‘సితార’ క్రమం తప్పకుండా చదివేవాడిని. ప్రతి ఆదివారం సిటీకి వెళ్ళినప్పుడు ఆ పత్రిక కొని చదవందే, ఏదో మిస్సైనట్టే లెక్క. మైసూర్లో చాలా పాప్యులర్ అయిన తెలుగు సినిమాలు తప్ప ఆన్నీ వచ్చేవి కావు. కాబట్టి, ఈ పత్రికద్వారా వచ్చిన మరియూ రాబోయే సినిమా విశేషాలు తెలుసుకుని, ఇంటికి వెళ్ళినప్పుడు ధియేటర్లో ఆ సినిమా దొరక్కపోయినా వీడియోలో చూడచ్చనే ఒక ఆశని ఈ పత్రిక కల్పించేది. అంతేకాక, ఇందులో ‘గుడిపూడి శ్రీహరి’ గారి సినీసమీక్షలు నాకు తెగ నచ్చేవి. చాలా బ్యాలన్సుడ్ గా తను రాసే సమీక్షల ప్రభావం ఇప్పటికీ నాపై ఉందని నా నమ్మకం.
బహుశా నా రెండవ సంవత్సరంలో అనుకుంటా, ఒక సారి ఇలాగే పత్రిక కొని సిటీబస్సు ఎక్కడానికి బస్టాండుకు వచ్చి కూర్చున్నా. ఇంతలో, మా కాలేజికి చెందిన ఒక తెలుగు సీనియర్ కనబడేసరికీ కాస్సేపు మాట్లాడుతూ సమయం గడిపాం. ఇక బస్సెక్కగానే పక్కపక్కన కూర్చుని, నేను చేసిన మొదటిపని నా చేతిలో ఉన్న ‘సితార’ని అతడికివ్వడం. ఆ ఇరవైనిమిషాల బస్సు ప్రయాణంలో ఆ సీనియర్ పత్రికని తెరిచి చూడలేదు. బస్సు దిగీదిగగానే, దాన్ని మళ్ళీ నా చేతిలో పెట్టాడు. నాకు ఒక్క క్షణం ఆశ్చర్యమనిపించింది. ఉండబట్టలేక అడిగేశా, "చదువుతారని ఇచ్చాను, మీరు చదవలేదే?" అని. దానికి అతను ఒకే ఒకమాటన్నాడు. " మా మతంలో సినిమాలు నిషేధం". ఆ సెకనుకి అతను చెప్పింది నాకు అస్సలర్థంకాలేదు.
ఇది జరిగిన కొన్నాళ్ళకు మా ఆంగ్లసాహిత్యం క్లాసుల్లో, History of English Literature లో భాగంగా ‘బైబిల్’ యొక్క పరిణామక్రమం గురించి చెబుతూ, ఇంగ్లండ్ రాజు 8 వ హెన్రీ (1491-1547) తన వ్యక్తిగత లాభం కోసం (భార్యకు విడాకులిచ్చి, ఉంపుడు గత్తెని పెళ్ళి చేసుకోవడానికి) వాటికన్ నుంచీ ఎలా విడిపడిందీ, ఆ తరువాత ఎలా Church of England స్థాపించిందీ తెలుసుకున్నాను. అంతేకాక, అప్పటివరకూ కేవలం గ్రీకు, లాటిన్ భాషల్లో ఉన్న బైబిల్ని ఆంగ్లంలో తర్జుమా చెయ్యడం కూడా అప్పుడె మొదలయ్యింది. అదీ అప్పటి రాజకీయ పరిస్థితికి అనుకూలంగా ‘అంగీకారాత్మకమైన’ (an agreed version) విధానంలో. ఆ సవరణల బైబిలే ఇప్పటికీ "Great Bible"గా అందరికీ అందుబాటులో ఉంది. ఇక మన భారతీయ భాషల్లోకి అనువదించబడింది ఈ బైబిలు నమూనాయే అన్నది అందరికీ తెలిసిన సత్యం.
పైన చెప్పిన చరిత్రతోపాటూ, మా Film Clubలో నేను తెలుసుకున్న ‘సినిమా పుట్టుక’ చరిత్రను పోల్చిచూస్తే, 1890లలో పుట్టిన సినిమాలను, 15వ శతాబ్ధంలో తిరగరాయబడిన బైబిల్ ఎలా నిషేధించిందో నాకైతే అర్థం కాలేదు. పోనీ యేసు ప్రభువుకి సినిమాలంటే గిట్టవా అనుకుంటే, పాపం ఆయన బతికుండగా అసలు సినిమాలే లేవే! మరి సినిమాల నిషేధం గురించి యేసూ చెప్పక, బైబిలూ రాయకపోతే ఈ మతం సినిమాలను ఎలా నిషేధించిందో, ఇప్పటికీ నాకు సమాధానం తెలీని ప్రశ్నల్లో ఒకటి.
మీకు సమాధానం తెలిస్తే నాకు తెలియజెప్పగలరు. జవాబుకోసం ఎదురుచూస్తూ....
Tuesday, July 1, 2008
మతం సినిమాను నిషేధించిందా...!
--------------------------------
Subscribe to:
Post Comments (Atom)
15 comments:
మీ తార్కిక జ్ఞానానికి జోహార్లు.
బహుశా, మతం సినిమాను నిషేధించి ఉండకపోవచ్చు. దానిలో ఉండే హింస, అశ్లీలం మొ" వాటిని నిషేధించి ఉంటుందేమో. కాకపోతే జబ్బు చేసిన వేరుకి చికిత్స చేసే బదులు మొత్తానికి చెట్టునే నిర్మూలిస్తే అస్సలు జబ్బే ఉండదని అలా చేసిఉంటారేమో.
ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో సినిమాలు నిర్మించేది హాలీవుడ్‌లోనే. అంటే క్రిస్టియన్ దేశంలో. మీరు చెప్పినవన్నీ అక్కడ అమలవుతున్నాయని నేను అనుకోను. మన దేశంలోనే ఇక్కడి వారు తమ మత ప్రచారంలో భాగంగా ఆడవాళ్ళు బొట్టు పెట్టుకోకూడదని, గాజులు ధరించకూడదని, సినిమాలు చూడకూడదని, ఇలాంటివన్నీ ప్రచారంలోకి తెస్తున్నారని అనిపిస్తుంది. చిత్ర విచిత్రమయిన పేర్లు పెట్టుకోవడము, ప్రత్యేకమయిన భాష వాడడము కూడా అలాంటిదే కావచ్చు.
సినిమా ప్రొజెక్టర్, వెండితర వంటివన్నీ ఆ మతం వారే కనిపెట్టారు కాబట్టి దాన్ని వదిలేద్దాం! ఇకపోతే ఇంకో నాలుగు స్టేజీల వరకు మీ పక్కనే కూర్చుంటే వాడి మతం యొక్క గొప్పతనాన్ని నాటక రూపంలో మీకు చూపించేవాడు హిహ్హీ... మిస్సయ్యారు :)
మతం సినిమాలను నిషేధించలేదు. కానీ మతప్రచారకులు (అంటే మళ్ళీ మతమే కదా! ఎందుకంటే వీళ్ళుచెప్పేదే ఆచరించబడుతుంది. ఆచరించబడేదే అసలైన మతమని నాఅభిప్రాయం) మాత్రం నిషేధించారు. ఆమాటకి వస్తే మొత్తం వ్యతిరేక సమాచారాన్ని, కొత్త ఆలోచనల్ని విమర్శించారు. కాకపోతే దానికి సమయానుగుణంగా కొన్ని జతచేస్తుంటారు (Okay... this applies to only a few people. Thats it I have said it). జనాలు కొత్త ఆలోచనల పాలై ప్రశ్నించడం మొదలుపెడితే ఇక వాళ్ళ తర్కానికి వీళ్ళ తలప్రాణం తోకకి వస్తుంది. I remember the Osho's words "as per the Bible the first sin that was committed is the disobedience. Adam disobeyed the God'd mandate by eating the fruit of the tree of "knowledge". I think this could explain the cause to some extent. తాము రాసుకున్న గ్రంధంలోలా కాక ఇంకోలా చెప్పినందుకు గెలీలియో గెలీలీ ని "తప్పుబట్టారు" (perish disobedience) మళ్ళీ Jesus పుట్టుకనాడు కనిపించిన దివ్యనక్షత్రాన్ని justify చేసుకోవడానికి గెలీలియో సిధ్దాంతాన్ని వాడుకుంటారు. కాబట్టి మతాలు వీలును బట్టి ప్రో గానూ ఆంటీ గానూ వుంటాయి అవి సినిమాలుకావచ్చు లేక ఇంకేమైనా కావచ్చు.
కింద లింకు
కూడా చూడండి.
Link
మామూలు సినిమాలు చూడకపోయినా కరుణామయుడు, దయామయుడు లాంటివి విరివిగా చూస్తుంటారు. అంటే వీళ్ళు సినిమాకి వ్యతిరేకం కాదు, కేవలం మానసిక ఉద్రేకాన్ని పెంచే ( అవి action కానివ్వండి romantic ంకానివ్వండి అలాంటిదేమైనా) సినిమాలకు వ్యతిరేకం. రంగుల సినిమా మాయలో పడీతే దేవున్ని తద్వార మూల విస్వాసాలని త్యజిస్తారని మతప్రచారకుల భయం. బైబిల్‌లో ఉండే చాలా విషయాలకు సినిమాలు (entertainment కి సంబందించిన అంశాలు) వ్యతిరేకంగా ఉండడమే ఇందుకు కారణం.
నాగరాజా గారు,
బాగా చెప్పారండి!
మూర్ఖత్వానికి పరాకాష్ట! ఇవన్నీ మనదేశంలోనే అనుకుంటాను.
"మతం సినిమాను నిషేధించిందా...!" అని భారీ శీర్షిక పెట్టి టపాను ఒక మీ ‘సీనియరు విధ్యార్ధి’ అభిప్రాయానికి పరిమితం చేసారు.ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మీకు సమాధానం దొరకలేదా అని నాకు ఆశ్చర్యం గా ఉంది.దొరక్కపోతుండొచ్చు కూడా!మామతం సినిమాలు చూడటం నిషేధించింది అని ఒకమతాధిపతి,కనీసం ఒక థియాలజీ విధ్యార్ధో చెప్పుంటే మీకూ(మాకు)కొంత సమాచారం దొరికుండేది.ఆటవికదశ నాటి ప్రకృతి ఆరాధన నుంచి వ్యవస్తీకృతమైన మతం దశవరకూ అప్పతి నుంచి ఇవ్వాళ్టి హైటెక్కునిక్కుల అమ్మలబాబాల వరకూ ప్రతి మతం లోనూ తప్పనిసరిగా ఉండేవి "విధినిషేధాలు".ఇవి కొంతకాలం క్రితం వరకూ అవశ్యాచరణీయాలు,అనుల్లంఘనీయాలు,కానీ కాలంతో పాటు సడలింపులు వచ్చాయి.గర్భస్రావాలను అనుమతించని సమాజాల్లో కూడా స్వలింగసంపర్కుల వివాహాలను చర్చిలో,చర్చి సమ్మతితో జరుపుకుంటున్నారని చదువుతున్నాం.క్రైస్తవ్యం అంటే స్తూలంగా కాధలిక్,ప్రొటెస్టెంట్ అని రెండు ప్రధానవిభాగాలుగా మనకు కనిపించినా,ఒక అనధికార అంచనా మేరకు 30,000 వరకూ ఇందులో ఉపశాఖలున్నాయి.వీలయినంతవరకూ ఆధునిక సాంకేతికపరిజ్ఞానాన్ని దూరంగా ఉంచే అమిష్ శాఖవారిలో కూడా సినిమా చూడకూడదన్న పట్టింపు లెదనుకుంటా.అమిష్ తెగవారి గురించి బడ్ స్పెన్సర్, టెరెన్స్ హిల్ నటించిన They Call Me Trinity సినిమా,అలాగే హారిసన్ ఫోర్డ్ నటించిన సినిమా (దాని పేరు మర్చిపోయాను)కొంత తెలుసుకున్నాను.అలాగె ఇక్కడ http://www.religionfacts.com/christianity/denominations/amish.htm నొక్కి తెలుసుకోవచ్చు.
అలాగే ఇర్వింగ్ వాలెస్ రాసిన ది సెవెన్ మినిట్స్ చదివినవారికి వాటికన్ నిర్వహించే సెన్సారు గురించీ తెలుసుకోవచ్చు.నాకు గుర్తున్నంతవరకూ అందులో కూడా సినిమాలు చూడవద్దని ఉన్నట్లు లేదు.నేను క్రిస్టియన్ కాలేజీలో చదివాను,అందులో మూడు సంవత్సరాలు వారి హాస్టల్ లోకూడా ఉన్నాను.రెండు చోట్లా నాకెవ్వరూ సినిమాలు చూడొద్దని చెప్పలేదు.శిల్పం,సంగీతం,చిత్రలెఖనం వంటి లలితకళలను పోషించి,ప్రోత్సహించిన క్రైస్తవ్యం సినిమాలను చూడొద్దని నిబంధనలు విధించిందంటే నాకు నమ్మకం లేదు.కానీ కాళిదాసు కవిత్వానికి స్వంతపైత్యం జోడించిన మానసికమలబద్దకపు మతపెద్ద ఎవడో ఈ చూడొద్దన్నమాట వాగిఉంటాడు.అయినా ఎవడో కొత్తెంగాడు,కొత్తగా మతం పుచ్చుకుని ఉంటాడు ఆమాటలు ఇన్నేళ్ళయినా మీరు పట్టించుకోకుండా మీఎరికన ఇలాంటి జరుగుతున్నాయేమో చూసి మాకు చెప్పండి.
దాందేముంది? గర్భ నిరోధన సాధనాలూ ఇటీవలే వచ్చాయి, వాటినీ నిషేధించలేదూ? :-)
అందరికీ నెనర్లు.
@ప్రతాప్,రక్షించారు. జీవితంలో అశ్లీలమూ, హింసా ఉన్నాయని జీవితాన్ని నిషేధిస్తామనలేదు ఈ మతాలు.
@జగదీష్, నిజమే. అందుకే నేను టపాకు పెట్టిన ఫోటోలో హాలీవుడ్నిరికించా. చిత్రవిచిత్రమైన పేర్లూ, భాషా గురించి కొంత శోధించి ఒక టపా వెయ్యాల్సిందే. దానికి తగ్గ కారణాలు చాలా ఇంటరెస్టింగా ఉండొచ్చు.
@నాగరాజా,ఆ ప్రయత్నమూ జరిగిందండి. దానిగురించి మరో టపాలో రాయాల్సిందే. గుర్తు చేసినందుకు నెనర్లు.
@ఇండియన్ మినర్వా,చాలా బాగా సూచించారు. ఈ మతమూర్ఖుల మూఢత్వాన్ని గురించి నేను కేవలం ఈ టపాలో ప్రశ్నించి వదిలేసాను అంతే! నెనర్లు.
@దిలీప్, ఈ లంకెను ఇంతకు ముందే చూసా.నెనర్లు.
@శంకర్, మత ప్రచారకుల భయం సహేతుకమే అయినా, వారెంచుకుంటున్న మార్గం కాస్త ‘మూఢనమ్మకాన్ని’ పెంచి పోషించేదిగా ఉంది. అక్కడే సమస్యంతా.
@సుజాత, ఇవన్నీ మన దేశానికీ ముఖ్యంగా మన రాష్ట్రంలోని కొత్తగా మతంపుచ్చుకున్న వారి ధోరణులు. క్రైస్తవ మతం చాలా మంచి మతమైనప్పటికీ, ఈ విపరీతధోరణులు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయని వీరు గ్రహించాలి కాబోలు.
@రాజేంద్ర,విస్తృత సమాచారానికి నెనర్లు. ఇదికేవలం నా అనుభవంలోని ఒక చిన్న ఘటన ఆధారం కాబట్టే, ప్రశ్నని ఒక ప్రశ్నగానె మిగిల్చి, నాకు తరువాత తెలిసిన కొంత సమాచారాన్ని జోడించి రాసాను. ఇక వేళ నిజంగా నాకు జ్ఞానోదయం అయ్యుంటే ఇక్కడ ఖచ్చితంగా రాసేవాడిని.
మీరన్నట్లు మతపెద్దలూ, బాబాలూ తమ మనుగడ కోసం విధిస్తున్న నిషేధాలలో ఇదొకటి కాబోలు.
నిజానికి దాదాపు సగం ఆంగ్ల సాహిత్యం చర్చ్ వ్యతిరేక సాహిత్యమే. క్రిస్టియన్ మతానికీ,క్రిస్టియన్ నమ్మకానికీ చాలా తేడా ఉందని ఎలుగెత్తి చాటిన సాహిత్యం వీరినుండీ వచ్చిందే. కానీ మన భారతదేశంలోని ఈ మతం మన హిందూ మూఢవాదాన్ని అలవర్చుకుని ఇలా తయారవుతూ ఉందేమో అని ఒక అనుమానం.
@కొత్తపాళి, నెనర్లు. నిజమే..వీరికి నిషేధించడానికి లాజిక అవసరం లేదు.
మీరన్నట్లు లేని సినిమాని నిషేదించడం ఏమిటండీ... ఇవన్ని మన దేశం లో మత పెద్దలు జోడించి ప్రచారం చేస్తున్న నిబంధనలు మాత్రమే. లేదంటే హాలీఉడ్ లో ఇన్ని సినిమాలు వచ్చేవి కావు.
నా తమిళ క్రైస్తవ మిత్రుడొకరు ఇలాంటి నియమాలను పాటిస్తారు. ఆయన పాటించే క్రైస్తవంలో (సౌతిండియా చర్చో మరోటో నాకు గుర్తు లేదు) సినిమాలు చూడరు, టీవీ చూడరు. కొందరైతే.. జబ్బు చేస్తే డాక్టరు దగ్గరకు వెళ్ళరట కూడా. ఆ మతావలంబీకులందరూ ఇంత ఖచ్చితంగా పాటించకపోవచ్చు. అన్నట్టు ఆ క్రైస్తవులకు క్రిస్ట్‌మస్ ప్రధానమైన పండుగ కాదు.. ఏసుక్రీస్తు డిసెంబరు 25న పుట్టాడనే నమ్మకం వారికి లేదు. పునరుత్థానాన్ని నమ్ముతారనుకుంటా. వారి ముఖ్యమైన పండుగ జనవరి 1 - కొత్త సంవత్సరం. మరోటి.. ఏడాదికోమాటు వాళ్ళ కూటములేవో జరుగుతాయి -వాటికి తప్పకుండా హాజరు కావాలని వాళ్ళు భావిస్తారు. జ్ఞానస్నానం విషయంలో కూడా వారికి భేదాభిప్రాయాలేవో ఉన్నాయి. విగ్రహారాధన చెయ్యరనుకుంటాను.
మహేష్,
మీరు చెప్పిన 'ప్రామాణిక బైబిల్' అనేది ఏదీ లేదు. క్రిస్టియన్లలో రోమన్ కేథలిక్, ప్రొటెస్టెంట్ అని రెండు తెగలున్నాయి. రోమన్ కేథలిక్కులు మొదటినుండీ వున్నవారు (పోప్ నాయకత్వం కింద). వీళ్లది లాటిన్ నుండి అనువదించబడిన బైబిల్. ప్రొటెస్టెంట్లు మధ్యయుగాల తర్వాత పుట్టుకొచ్చినవారు. ప్రొటెస్టెంట్లలో వందలాది రకాలున్నారు - ఇవాంజెలిస్టులు, పెంతెకోస్తులు, Seventh Day Adventists, Christ the Scientist, లూధరన్స్, మోర్మన్స్ .... ఇలా. వీళ్లవి అవసరానికి తగ్గట్లు మార్పులు చేసుకున్న రకరకాల బైబిళ్లు. ప్రొటెస్టెంట్లు వాటికన్ నాయకత్వం కింద ఉండరు. రోమన్ కేధలిక్కులకి, ప్రొటెస్టెంట్లకి ప్రధాన తేడా మేరీని గుర్తించే విషయంలో. కేథలిక్కులు మేరీని కూడా పూజిస్తారు, ప్రొటెస్టెంట్లు పూజించరు. ఇది కాక మరో తేడా - కేథలిక్కుల మత గురువులు, సన్యాసినులు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. ప్రొటెస్టెంట్ల మత గురువులు వివాహితులు కావచ్చు. ప్రొటెస్టెంట్లలో సన్యాసినులు (nuns) అంటూ ఎవరూ ఉండరు.
ఇక సినిమాల విషయానికొస్తే - క్రిస్టియన్లు సినిమాలు చూడకూడదు అనేది బైబిల్ లో ఎక్కడా లేదు (ఆ మాటకొస్తే బైబిల్లో ఎటువంటి వినోద కార్యక్రమాలమీదా నిషేధం లేదు). ఇది భారత దేశంలోనే, అదీ కొన్ని రకాల ప్రొటెస్టెంట్లలోనే అక్కడక్కడా కనిపించే అలవాటు. ఎందుకొచ్చిందో వారికే తెలియదు.
తెలుగువారిలో ప్రొటెస్టెంట్లలో మాత్రమే బొట్టు పెట్టుకోకపోవటం, పాశ్చాత్య పద్ధతుల్లో నామకరణం చేయటం లాంటివి కనిపిస్తాయి. రోమన్ కేథలిక్కుల్లో ఈ అలవాటు ఉండదు. తెలుగు కేథలిక్కులు హిందూ సంప్రదాయాలనే ఎక్కువగా పాటిస్తారు (వివాహ కార్యక్రమాల్లో బ్రాహ్మలు పాలుపంచుకోవటం, కట్టు, బొట్టు, పేర్లు, మొదలైనవి). మన ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి దీనికి పెద్ద ఉదాహరణ. వీళ్లకి ఉండటానికి 'జేవియర్', 'మేరీ' లాంటి baptism పేర్లు ఉంటాయే కానీ అవి చలామణిలో ఉండవు. తెలుగు ప్రొటెస్టెంట్లలో మాత్రం ఎందుకో పాశ్చాత్య సంస్కృతిని అనుకరించే అలవాటు ఎక్కువగా కనిపిస్తుంది. బైబిలు ప్రచారం పేరిట కనపడినవారికి బోధనలు చేసే అలవాటు కూడా ప్రొటెస్టెంట్లదే. కూటముల పేరుతో సభలు జరిపేది కూడా ప్రొటెస్టెంట్లే - కేథలిక్కులు కాదు.
తెగలవారీగా చూస్తే క్రిస్టియన్లలో అత్యధికంగా ఉన్నవారు కేథలిక్కులు. ఐరోపా దేశాల్లోనూ, ఉత్తర అమెరికాలోనూ ప్రొటెస్టెంట్లదే హవా. ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికా దేశాల్లో రోమన్ కేథలిక్కులదే రాజ్యం. సాధారణంగా 'సెయింట్' అనే పదంతో ప్రారంభమైన సంస్థలన్నీ కేథలిక్కులవే అయి ఉంటాయి (St. Joseph's, St. Teresa, etc). ప్రొటెస్టెంట్ సంస్థలకు ఆ పదం ఉండదు (Sainthood అనేది కేథలిక్కుల్లో గొప్పవారికి వాటికన్ ఇచ్చే అత్యున్నత బిరుదం. మదర్ తెరెసాకి మరి కొన్నేళ్లలో ఇది లభించనుంది).
ఇకపోతే, అబార్షన్లూ, గర్భనిరోధక సాధనాల్లాంటివాటికి క్రిస్టియన్లు - అందునా కేథలిక్కులు విరుద్ధం. దీనికి కారణం అది భౄణ హత్య కాబట్టి. ప్రాక్టికల్ గా ఇది సాధ్యమయ్యే విషయం కాకపోయినా, మానవత్వంతో ఆలోచిస్తే వారు చెప్పేదేమీ నవ్వులాడుకునే విషయం కాదు. ఈ విషయంలో మనం వారితో ఏకీభవించకపోవచ్చు కానీ, అపహాస్యం చేయనవసరం లేదు.
sorry I missed this topic
i have few thoughts and found my own justiifications
Post a Comment