Wednesday, April 1, 2009

రాముడుండాడు...రామాయణమూ ఉన్నిందేమో!

మొన్న ఉగాదికి మా ఊరు వాయల్పాడుకు బుయ్యొచ్చినా. బస్సు మీద వాయల్పాడనుందిగానీ, ఊళ్ళో బస్సు దిగంగానే "వాల్మీకి పురం" అని అని పేద్ద బోర్డొగటి స్వాగతమిచ్చింది. ఏందిరా అబ్బా ఈ కత? నేను సక్కంగా మావూరికే వచ్చినానా అనే అనుమానమొగటి పొడుసుకొచ్చింది. ఊరు మన్దిలాగుందిలే, పేరు రాసేద్దేలీనోడెవడో రాసుంటాడనుకుని కొంత దూరం పోతినోలేదో, అన్ని షాపుల బోర్డుల పైనా అదే రాత. అయ్యోనారాతా!! అనుకుని తేరిపారా సూడంగానే, కొంత మంది వాల్మీకి పురం అని రాసి వాయల్పాడు అనే పేరు బ్రాకెట్లో బెట్టుండారు.

"ఏమిరా సిద్దా?" అంటే, ఊరు పేరు మారిందంట. బొంబాయి ముంబై అయ్యింది. మద్రాసు చెన్నై అయింది. కలకత్తా కోల్కతా అయింది...ఇప్పుడు మాఊరికి పొయ్యేగాలమొచ్చి, వాయల్పాడు కాసింతా వాల్మీకిపురమయ్యింది. ప్రకృతి, కాలం పెట్టిన వాయల్పాడు అనే పేరిప్పుడు, స్థలపురాణం సొట్టుజూపించి అయ్యోర్లు మార్చేసినారు. దానికి ఊర్లోవాల్లంతా, తానా అంటే తందానా అని ఖాయం జేసినారంట.

ఒగానొక్కాలంలో మాఊరి నూరప్పకొండల్లో, వావిలాల చెట్లు విపరీతంగా ఉండేవంట. ఈ సెట్టు ఆకుల్ని సింధూరపత్రాలని ఔషధాలు తయార్జేసేదానికీ, పూజాపునస్కారాలకూ వాడతార్లెండి. అమాంతంగా ఉండే ఈ వావిలాల చెట్ల పేరు మింద ఈ ఊరికి "వావిలాలపాడు" అని పేరొచ్చిందంట. వావిలాలపాడు పేరు తెలుగు రాని తురకొల్ల నోట్లోబడి, ‘వావిల్ కి పహాడ్’ అయిపోయి అదికాసింతా, వాయల్పాడ్ అయిందని ఒగ కత చెప్తారు. నమ్మబుద్దెయ్యబోయే కత మాత్రం ఇదే.

కానీ, మాఊరి స్థలపురాణం కత ఇంగోటుంది. అదేమంటే, రామాయణం రాసిన వాల్మీకి అయ్యోరు మా ఊరి నూరప్పకొండల్లో తపస్సు జేసినాడంట. అందుకే ఈ ఊర్లో అందరూ రామాయణం కతని తెగపాడేస్తా ఉంటే, ఆ దార్నబొయ్యే అరవోళ్ళు "వాయిల్ పాడు" అనుకున్నారంట. తమిళంలో దానర్థం ఎప్పుడూ నోట్లో పాట నాన్తా ఉండే వాళ్ళుండే చోటు అని అర్థమంట. వాల్మీకి కతకి ఊతమిస్తా, మాఊర్లో ఒక రాములోరి గుడొగటుండాది. దాన్ని త్రేతాయుగంలో జాంబవంతుడు కట్టించాడని చెప్పుకుంటారు. ‘పట్టాభిరామాలయం’ అని ఈ గుడికి మహచెడ్డపెరుంది లెండి. ఇప్పటికి ప్రతిఏటా, శ్రీరామనవమికి తిరణాల వైభవంగా జరుగుతుంది. మా నూరప్పకొండని రైల్ టేసన్ నుంచీ ఒక మూలగాజూస్తే, దానిమింద వాల్మికి కుచ్చున్నట్లు కనబడతాది.

ఈ కత బట్టుకుని మావోల్లు, వాయల్పాడు పేరుని వాల్మీకిపురం జేసేస్నారు. కాబట్టి "ఇందు మూలముగా తెలియజేయినదేమనగా, వాయల్పాడు పట్టణాన్ని ఇకనుంచీ వాల్మీకిపురంగా వ్యవహరించండహో!"


మా ఊరికత ఇన్నాక, నాకొగ గమనమొచ్చింది. మా సుట్టుపక్కల పల్లెల్లో, ఊర్లలో ప్రతిసోటా రాముడు పాదం మోపిన చోటో, సీతమ్మతల్లి తానమాడిన బావో,గుంటో అట్టాగే హనుమంతుడు సంజీవిని పర్వతం మోస్తూ మోస్తూ జారబోసిన రాళ్ళోరప్పలో ఖచ్చితంగా ఉండాయి. అంటే...మా ఊర్లల్లో రాముడుండాడు...రామాయణమూ ఉన్నిందేమో!


****

35 comments:

మీ పక్కూరి పిల్లోడు said...

శానా బెమ్మాడంగజెప్పినావు సామీ కత. పేరాడినించొచ్చిదన్న అనుమానం అట్టబెట్టి ఒకతూరి కిందకి మీదకి సూడు. రాముడు యాడ్నో లేడు, మీ ఊరి సూరప్ప కొండల మింద దుమికే కోతుల మద్దెన, రచ్చ రచ్చ జేసుకుంటా ఉరుకుతా వుండారే ఆ పిల్లోల్ల మద్దేన, పట్టాభిరామసామి గుడి కాడ మాట్లాడకుండా కూకోనింటాడు - సాధువు - ఆయప్ప మందిక్కు జూసి నవ్విండే నవ్వులో - రాముడగుపిస్తాడు.

Unknown said...

రాముడు ఉంటే ఏంది లేకంటే ఏంది... రాముడు ఉన్న్యాడో లేదో తెలవ్వలసినోళ్ళకు సానా బాగ దెలుసుగాని నాయనా, నీ రాతలేందీ అంట? ఏమన్న రాచ్చే రూంత రీతీ రింగం ఉండబళ్ళా?

Anonymous said...

అవునుగానబ్బాయా, మళ్ళా కూడల్లోజేర్నవేంది కత?

సుజాత వేల్పూరి said...

మేము 2008 ఏప్రిల్ లో తిరుపతి నుంచి హార్సిలీ హిల్స్ వెళ్ళినపుడు మీ వూరి మీదుగానే వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడే వాల్మీకి పురం అనే బోర్డులు చూసాను నేను. అక్కడ చెరుకురసం తాగడానికి ఆగితే, వాయల్పాడు అనే బోర్డు కూడా కనపడింది. రెండూ ఒకటే అని అప్పుడే తెల్సింది.

మనదేశంలో పాండవులు నివాసముండని గుహలూ, సీతమ్మ వారు స్నానమాడని గుంటలూ ఉండవనీ గురజాడ గారెప్పుడో చెప్పారుగా!

Krishna said...

రాముడుండాడు...రామాయణమూ ఉన్నిందేమో!
ఇది విశ్వవ్యాప్తం గా అందరికి తెలిసిన నిజమే ..ఇంక ఇందులో సందేహాలు ఎందుకు?
రాముడుంటే రామాయణం ఉండి తీరుతుంది. ఇంత చరిత్ర ఉండి కూడా మీ ఊరి పేరు మార్చటానికి కూడా ఇంత సమయం తీసుకున్న మన అదికారులు నిజం గా బహు గొప్ప వారు.

$h@nK@R ! said...

మీరు వర్ణించిన తీరు చాల బాగుందండి.. ఈ సారి మీ శైలి కొత్తదనం తొక్కినట్లుంది :-)

Anonymous said...

సక్కంగ చెప్పినావు సోమి మీ యూరి కత! కాతే నాకు రొంత అనుమానంగుండాది. ఈడ్న కూడా నువ్వు ఏదైనా అగిత్తం పెట్టసూత్తివా అని..అహ! మన గురించి ఎరుకయింది గదా..అందుకని.. :)

satya said...

కొత్త శైలి బాగుంది.. మహచెడ్డపేరు గాదు, మాగొప్పపేరు అని వాడితే బాగుంటుందేమో..విమర్శ కాదులెండి.. ఎందుకో అలా అనిపించింది..

anyway..I always enjoy this slang. Expecting more such.

Anil Dasari said...

లేపాక్షి పేరు వెనక కథ తెలుసు కదా. రావణుడితో యుద్ధంలో రెక్కలు తెగి పడిపోయిన జటాయువుని రాముడు 'లే పక్షీ' అని లేపిన ప్రదేశం అది. గుంటూరు జిల్లాలో వినుకొండ అనే ఊరుంది. ఆ ఊరి పేరు వెనుక కధా రామాయణ గాధే. సీతని రావణుడు ఎత్తుకెళ్లిన విధానం, అతనితో తన యుద్ధం గురించి జటాయువు చెప్పగా రాముడు 'విన్న కొండ' అది. 'ఎక్కడి లేపాక్షి, ఎక్కడి వినుకొండ? లేపాక్షిలో లేపబడ్డ డేగ కొనప్రాణంతో వినుకొండ దాకా డేక్కుంటూ వచ్చి రాములవారికి ఈ కధ చెప్పిందా' అనేది చచ్చు ప్రశ్న. స్థల పురాణంలో గాధలన్నీ నిజాలే అనుకోరాదు. చదివి 'ఓహో' అనుకుని వదిలేయాలంతే.

Kathi Mahesh Kumar said...

@అబ్రకదబ్ర: రామాయణాన్ని సోషియల్ మార్కెటింగ్ ఎవరుజేశారోగానీ వాడికి నోబెల్ బహుమతివ్వాలి. రామాయణం కథతో సంబంధంలేని యాత్రాస్థలాలూ,గుళ్ళూగోపురాలూ, ఊర్లూ,పల్లెలూ మనకసలున్నాయా!? అనిపించేంతగా పాప్యులర్ చేసేశారు. కథల ఆధారంగా చరిత్ర,సహజపరిణామాల వర్తమానాన్ని మనం భూతకాలంలోకి నెట్టి అదే "పవిత్రం" అనుకుంటున్నామేమో ఆలోచించాల్సిన విషయం.

@సత్య: మా రాయలసీమలో "మాశెడ్డమారాజు" అంటే బహుదొడ్డ మారాజు అని అర్థం.అదే అర్థంలో ఇక్కడా "మహచెడ్డపేరు" అని వాడటం జరిగింది.

@అనామకుడు:నేన్జేసేదంతా ఆగింతంగాదప్పా, అదొగ గమనం అంతే!

@కృష్ణ: ఇది చరిత్రకాదు. పురాణం. ఒక నమ్మకం.నమ్మకానికి మానసిక విలువుంటుందిగానీ,చరిత్రలో స్థానం కాదు.

@సుజాత:నిజమే "మనదేశంలో పాండవులు నివాసముండని గుహలూ, సీతమ్మ వారు స్నానమాడని గుంటలూ" ఉండవు.

Anil Dasari said...

@మహేష్:

యెహోవా ఆర్రోజుల్లో విశ్వ సృష్టి చేశాడన్న నమ్మకం నుండి అధిక శాతం క్రిస్టియన్లు, యూదులు బయట పడ్డారు. వాళ్లా సంగతొప్పుకున్నంత మాత్రాన ఆయా మతాల్లో పాత నిబంధన ప్రాశస్త్యం తగ్గిపోలేదు. మన పురాణాల విషయంలో హిందువుల్లో అధికులు ఆ పనెందుకు చెయ్యలేరో నాకర్ధం కాదు. వాటిని నిఖార్సైన చరిత్రగా తీసుకోవటం ఏమిటో!

రవి said...

"రామాయణాన్ని సోషియల్ మార్కెటింగ్ ఎవరుజేశారోగానీ వాడికి నోబెల్ బహుమతివ్వాలి...."

ఇది కేవలం రాముడికి, పాండవులకు మాత్రమే పరిమితం కాలేదు. ఫలానా చోట బుద్ధుడి గోళ్ళు, వెంట్రుకలు, గుడ్డ పీలికలు నిషిప్తమైనాయని, (ఉదా : శ్రీలంక, బర్మా...) ఆ ప్రదేశం పవిత్రమని - ఇలా బుద్ధిజం లోనూ ఉంది. ఇది మానవుల సహజ బలహీనతే కారణమనిపిస్తుంది.పని కట్టుకుని మార్కెటింగ్ జరపబడిందా? అనే విషయం అనుమానాస్పదం.

చివుకుల కృష్ణమోహన్‌ said...

అబ్రకదబ్ర:"యెహోవా ఆర్రోజుల్లో విశ్వ సృష్టి చేశాడన్న నమ్మకం నుండి అధిక శాతం క్రిస్టియన్లు, యూదులు బయట పడ్డారు.మన పురాణాల విషయంలో హిందువుల్లో అధికులు ఆ పనెందుకు చెయ్యలేరో నాకర్ధం కాదు."

ఈ శాతాలు గురించి మీరు బాగా పరిశోధించినట్టున్నారు. వీలైతే కొంచెం గణాంకాలు ఇస్తే బాగుంటుంది.

Kathi Mahesh Kumar said...

@రవి: రామాయణానికి పనిగట్టుకుని ప్రాచుర్యం కల్పించారు అనే నాకు అనిపిస్తుంది. నా ఆలోచనకు కొన్ని కారణాలున్నాయి.

భారతదేశంలో ఇప్పటికి దాదాపు 30 రకాల రామాయణాలున్నట్లు ప్రతీతి. దాదాపు ప్రతిభాషలోనూ తమదైన రామాయణం రాసుకున్నారు.కానీ,సామాజిక విలువలను ఉద్భోధించే ‘తులసీ’రామాయణం అత్యధికంగా ప్రచారంలో కనిపిస్తుంది. నిజానికి వాల్మీకి రామాయణంలో రాముడి పట్ల అవాజ్యమైన ప్రేమ,భక్తి,గౌరవం కనిపిస్తే, తులసి రామాయణంలో రాముడు"మర్యాదా పురుషోత్తముడిగా" అవతారమెత్తుతాడు. ఒక ఆదర్శ సమాజానికి అవసరమైన గుణాల్ని వెల్లివిరుస్తూ కనిపిస్తాడు.

మొల్లరామాయణం,కంబరామాయణం వంటి దక్షిణభారత రామాయణాల్లోకూడా వైష్ణవభక్తితోకూడిన ఆరాధన ఉందితప్ప,సామాజిక విలువల్ని స్థాపించే లెక్చర్లుండవు. కానీ,ఈ అన్ని రామాయణాల్నీ త్రోసిరాజని తులసీరామాయణ స్ఫూర్తికి పట్టంకట్టే ప్రచారాలు మాత్రం ఇప్పుడు కనిపిస్తాయి.

అంతేకాక, దక్షిణభారతంలో చారిత్రాత్మకంగా ఉన్న శైవ-వైష్ణవుల ప్రాచుర్యంతగ్గి, రామభక్తుల హోరు పెరగడం ఈ మార్పుకు సంకేతం కాదంటారా? అందుకే some one has done an effective social marketing of Ramayana to establish definitive social values.

@అబ్రకదబ్ర:అక్కడ Theory of creation నుంచీ theory of evolution కు రావడానికి చాలా కృషి జరిగింది. కానీ,మనదగ్గర మాత్రం పురోగమనం నుంచీ తిరోగమనానికి దారితీసే పరిణామాలు ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువగా జరుగుతున్నాయి.ఎంతైనా మన విశ్వాసాలు మరింత గుడ్డివి లెండి.

సుజాత వేల్పూరి said...

అబ్రకదబ్ర,
ఈ లేపాక్షికి, వినుకొండ కీ ఎలా లింకు ఉందో నాకూ అర్థం కాదండీ! వినుకొండలో కొండ మీద ఒక రామాయలమూ ఉంది. వినుకొండ డిపో బస్సుల మీద ఇప్పటికీ పక్షి(జటాయువు)బొమ్మ ఉంటుంది. అదే బండగుర్తు విన్న కొండకి. మళ్ళీ లేపాక్షిలో వేరే కత!

ఈ లెక్కన నాసిక్ దగ్గర రామ్ కుండ్ లో ఉండే పంచవటి ని ఎంతవరకూ నమ్మొచ్చో మరి! అక్కడ నిజంగానే 5 మర్రి చెట్లూ ఇంకా ఉన్నాయి. వినేసి ఊరుకుంటే సరి.

Anil Dasari said...

@చివుకుల:

>> "ఈ శాతాలు గురించి మీరు బాగా పరిశోధించినట్టున్నారు. వీలైతే కొంచెం గణాంకాలు ఇస్తే బాగుంటుంది"

మీది వ్యంగ్యమైతే నేను ప్రతిస్పందించాల్సిన పని లేదు. ఇంతకు పూర్వం మీరు అలాంటి వ్యంగ్యాల జోలికెళ్లిన గుర్తు లేకపోవటంతో మీరు యధాలాపంగా అన్న మాటగానే దీన్ని తీసుకుని బదులిస్తున్నాను.

శాతాల గురించి నేను రాసిందానికి పెద్ద పరిశోధన అవసరం లేదు. నే చెప్పక పోయినా అవి మీకూ తెలిసిన విషయాలే అని నా నమ్మకం. మన లోపాలు సరిచేసుకోటానికి ఉదాహరణగా మరొకర్లో మంచి మార్పు గురించి ప్రస్తావిస్తే నొచ్చుకోవాల్సిన విషయం కాదు. ముందటి వ్యాఖ్యలో నే చెప్పదలచుకుంది - మత విశ్వాసాలకి, చరిత్రకి లంకె పెట్టకుండా కూడా ఓ మతాన్ని అవలంబించొచ్చు, ఆ మత గ్రంధాలని గౌరవించొచ్చు అని మాత్రమే.

గీతాచార్య said...

రాముడున్దాడా? రామాయణం ఉన్నిందేమో? భలే ఉండే ప్రశ్న.

మనం ఇలా ప్రశ్నించటమే ఆ రాముని గొప్పతనమేమో? ఇన్ని ప్రశ్నలని లేవనట్టిన మొనగాడెవరున్నారు?

అయినా హీరో వర్షిప్ మన దేశంలో, ఆ మాటకొస్తే ప్రపంచంలో ఎక్కువే. మర్యాద పురుషోత్తముడు కనుకే ఆయనంటే అందరికీ వర్షిప్. అంతే తప్ప మనం ఆయనలా వర్షిప్ పొందాలనే తపనా, కోరికా, ఆ ధైర్యం ఎవరికీ లేవు. We can not stand on our own legs. We need a hero for every situation.

Praveen Mandangi said...

ఇంత సైన్స్ చదివి సైన్స్ ని కించపరిచే నమ్మకాల్ని నమ్మే లెవెల్ లో మనం ఉన్నాం. మాటవరసకు కాదు, సీరియస్ చాలెంజే చేస్తున్నాను, రామాయణం నిజంగా జరిగిందనడానికి చారిత్రక ఆధారాలు చూపిస్తే నేను నిజంగానే చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో చేరి వైరాగి జీవితం స్వీకరిస్తాను.

భాస్కర రామిరెడ్డి said...

మార్తాండ గారు, మీతో వాదానికి దిగాలని కాదు కానీ, మీకు తెలుసో తెలియదో సైన్స్ లో కూడా సిద్ధాంతాలు అని కొన్ని ఉంటాయి. వాటిని కూడా నిరూపించడం సాధ్యం కాదేమో !!!

భాస్కర రామిరెడ్డి said...
This comment has been removed by the author.
Praveen Mandangi said...

మా గురువు పెన్మెత్స సుబ్బరాజు గారు చెప్పారు "ఇద్దరు సైంటిస్టులు మధ్య అభిప్రాయ భేదాలు వస్తే వాళ్ళు కూర్చుని చర్చించుకుంటారు కానీ ఒక హిందూ పండితుడు, ఒక ముస్లిం పండితుడు మాత్రం అలా చర్చించుకోరు. వాళ్ళ దృష్టిలో ఎవరి నమ్మకాలు వారివే. వాళ్ళు నిజ నిర్ధారణకి ఎన్నడూ ప్రయత్నించరు."

గీతాచార్య said...

భాస్కర రామి రెడ్డి గారు,

పర్ణశాలలో పక్షుల వేట. హ హ హ. You too from Narasaraopet?

చదువరి said...

"మత విశ్వాసాలకి, చరిత్రకి లంకె పెట్టకుండా కూడా ఓ మతాన్ని అవలంబించొచ్చు, ఆ మత గ్రంధాలని గౌరవించొచ్చు" - అవును గౌరవించొచ్చు, గౌరవించాలి కూడా. లంకె పెట్టినా పెట్టకున్నా గౌరవించాలి. మతవిశ్వాసాలను గౌరవించడమనేది కనీస మర్యాద. అలా గౌరవించకఫోవడం వల్లనే, ఆ మర్యాద మీరినవాళ్ళ వల్లనే సమస్యలొస్తున్నాయి. ఉదాహరణ 1: రాముడసలు లేడు
ఉదాహరణ 2: రాముడు సివిలింజనీరింగు ఎక్కడ చదివాడు?

భాస్కర రామిరెడ్డి said...
This comment has been removed by the author.
Kathi Mahesh Kumar said...

@చదువరి: మీరు చెప్పిన పాయింట్ అంగీకారాత్మకమేగానీ, మీరిచ్చిన ఉదాహరణ misleading అని గమనించగలరు.

రాముడున్నాడు అనేది ఒక విశ్వాసం,నమ్మకం. అది వ్యక్తివ్యక్తికీ మారుతుంది. అలాంటప్పుడు రాముడున్నాడు అనేదే సరి అంటే కూడదు.మీ ఇంటికి మా ఇల్లు ఎంతదూరమో మా ఇంటికి మీ ఇల్లూ అంతే దూరం. కాబట్టి రాముడున్నాడు అనే మీ "విశ్వాసానికి" ఎంత విలువుందో లేదు అనే వారి విశ్వాసానికీ అంతే విలువుండాలి.

ఇక రెండవది కరుణానిధి వ్యాఖ్య. రామసేతువు నిర్మాణం ఒక రాజకీయ సమస్యగా మారిన తరువాత రాముడి చారిత్రకతను సాధికారంగా నిరూపించకుండా, కేవలం రాజకీయలబ్ధికోసం రాముడ్ని అడ్డపెట్టుకుంటున్న వారిపై సంధించిన వ్యంగ్యం. అది విశ్వాసాల్ని కించపరచడం ఎట్లా అవుతుంది? రాజకీయలబ్ధికోసం రాముడ్ని అడ్డుపెట్టుకుంటున్నవాళ్ళు మాత్రం విశ్వాసాల్ని గౌరవించినట్లంటారా?

Praveen Mandangi said...

రాముడుండేవాడన్నది కేవలం వ్యక్తిగత నమ్మకం అని మత భక్తులు భావించి ఉంటే పెద్ద సమస్య వచ్చేది కాదు. కానీ రాముని పేరు చెప్పి కీలకమైన సేతు సముద్రం ప్రోజెక్ట్ ని ఆపడానికి ప్రయత్నించడం మాత్రం తప్పే. కరుణానిధి రాముడిని తాగుబోతు అని కూడా అన్నాడు. రాముడు నిజంగా మద్యం తాగాడా లేదా అన్న సంగతి పక్కన పెడితే, సేతు సముద్రం ప్రోజెక్ట్ వివాదంతో కలిగిన కోపం వల్ల కరుణానిధి అలా అన్నాడు అనుకోవచ్చు. వ్యక్తిగత నమ్మకాల కోసం కీలకమైన ప్రోజెక్ట్ లని వివాదాస్పదం చెయ్యడం అంత కంటే పెద్ద తప్పు.

సుజాత వేల్పూరి said...

భాస్కర్ రామిరెడ్డి గారు,
మాది నరసరావు పేటే! కానీ NRT వినుకొండ రోడ్లో వినుకొండ డిపో బస్సులు చూస్తాముగా! పైగా వినుకొండలో మా చుట్టాలున్నారు. శ్రీరామ నవమి కి ఒకసారి ఆ కొండ మీద గుడికి వెళ్ళాము. కనిగిరి కూడా చూసాను నేను.

మహేష్ గారు, మీ రామాయణం పోస్టులో మా పిడకల వేట కు క్షమించాలి.

Anonymous said...

"ఎంతైనా "మన" విశ్వాసాలు "మరింత" గుడ్డివి లెండి."

- ఇప్పుడూ అమెరికాలో మా ఊళ్ళో ఫ్లైయింగ్ సాసర్ దిగింది, లేకపోతే తోకచుక్క పడిపోయింది అనే "అమెరికన్" విశ్వాసం

కొంచెం "తక్కువ" గుడ్డితనమా! అఛ్ఛా విశ్వాసాల్లో గుడ్డివి. అందులో "మరింత" గుడ్డివి, కొంచెం "తక్కువ" గుడ్డివి కూడా

ఉంటాయ!! యూరోప్ లో బ్లాక్ మేజిక్ కొంచెం "తక్కువ" గా నమ్మేవాళ్ళు, మనం మన కాష్మోరా ని కాస్త "ఎక్కువ"గా

నమ్ముతామా! ఏంటి ఈ లాజిక్కు!

ఈ "మన" ని కించ పరుచుకోవడం ఎందుకో నాకు నచ్చదు; ఫ్యాషనా! - ఒకవేళ ఒక కొడుకు తన "తల్లి" వేశ్య అని

తెల్సినంత మాత్రన తల్లి యొక్క గౌరవం కొడుకు దృష్టిలో పడిపోవాలా!? మిగిలిన వాళ్ళలాగానే తల్లిని తిట్టాలా!! నా తల్లీ మీ

తల్లి లాంటిదే నని వాదించకపోయినా, నా తల్లిని తిట్టద్దు అనన్నా ఉండద్దా!!! ఈ ఆత్మవిశ్వాస రాహిత్యం ( విశ్వాసం లో

తక్కువ ఎక్కువ లేదు; ఉంటే ఉంది, లేక పోతే లేదేమో! ) ఈజ్ టూ బాడ్! ( "కొంచెం ఆత్మవిశ్వాసం" ఉంటే explain)

సరే! " అక్కడ Theory of creation నుంచీ theory of evolution కు రావడానికి చాలా కృషి జరిగింది. "
ఇక్కడ సృష్టి , స్థితి, లయ అనేవి సైక్లికల్ గా భావించబడింది. అందుకని ఇక్కడ "theory of evolution" ను

నమ్మించడానికి అంత కృషి అవసరమవ్వలేదు. అది "స్థితి" .

ఇది కూడా ఎవల్యూషనే! ప్రజల నమ్మకాల వల్ల, మార్కెటింగ్ వల్ల మీ ఊరు వాల్మీకిపురం గా మారిపోవడం వల్ల నష్టం

ఏంటి!? అసంబద్దంగా మీ ఊరు పేరు ఎలా మారిందో అలాగే ఆ కధలు నిజమో కాదో! ఇంకే కోయ బాష వల్లో! అన్ లెస్ యూ హావ్ నాస్టాల్జియా ఆఫ్ సమ్ కైండ్ - మారిపోతే తప్పేంటి!!!! మార్పు అనివార్యం నాయనా! మన కేదన్నా నష్టం ఉంటే దాన్ని ఎలా పూడ్చుకుందామో ఆలోచించాలి. కోయ భాషలో మూలికలున్నాయని "అనుమానం" వచ్చినా దాన్ని కాపాడుకోవాలి; అంతే కానీ ఛాందస వాదుల్లాగా "మారిపోయిందో" అని ఏడవ కూడదు. దీన్ని మార్చొద్దు అని చెప్పొద్దు. అలాంటి కాపాడు కోవాల్సిన కారణం ఉన్నదా!?

మధ్యలో ఎక్కడో రామసేతు ప్రాజెక్టు మాట వచ్చింది! ప్రజల నాస్టాల్జియా అది! అయ్యో రామసేతు పోతోంది అని!
అప్పుడు "సీత అయోధ్యకి వెళ్ళి పోయిందిగా, లంక లో లేదుగా , ఇంకా రామసేతు ఎందుకు? - అసలు ఆ బాడ్ మెమరీ

వద్దే వద్దంటున్నాడేమో రాముడు?" అని కదా మనం సమధాన పర్చాల్సింది!

ఎందుకు రాముడూ ఉన్నాడో లేడో వెతకటం! చరిత్ర నిర్ధారణలనూ !

నిజంగా రాముడు ఉంటే మాత్రం "కీలకమైన ప్రాజెక్టు" ను ఆపేస్తారా!? ఇక రాముడు ఉంటే ఆగిపోయే "కీలకమయిన"

ప్రాజెక్టు, ఉన్నా"డనుకొని" మానేసినా నష్టం ఉండదు. నష్టపోయేది ఉంటే, రాముడున్నా ఆపరు! - కీలకం కదా!! సో!

రామసేతు ప్రాజెక్టు అనివార్యం! దాని "మార్కెటింగ్ " ఆల్రెడీ ఐపోయింది. డబ్బు సముద్రంలో ముంచేసాం అని చెప్పాలి.

అందుకనీ రాముడు "ఉన్నా" ఈ ప్రాజెక్టు చేస్తాం అని చెప్పాలి గానీ, రాముడు లేడు! తాగుబోతు అనకూడదు! గెట్ మై

పాయింట్!

ఒకవేళ రాముడు ఉంటే మాత్రం "వైరాగి" అయ్యి జియ్యర్ స్వామి దగ్గరికి వెళ్తానంటాడు ఇంకో ఆయన!

ఒకవేళా రాముడు ఉంటే మాత్రం "వైరాగి" అయ్యి జియ్యర్ స్వామి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి!? వాట్స్ ది లాజిక్!
ఒక వేళ "వైరాగి" అవ్వడానికి "రాముడు" కారణం అయితే, ఆ కారణం వల్ల రాముడు చారిత్రక నిజం కాకపోయినా మీరు

"వైరాగి" అవ్వాలేమో చూసుకోండి. లేదనిపిస్తే, రాముడు ఉన్నా మీరు "వైరాగి" కానక్కర్లేదు.

ఏంటి ఇక్కడ బోళ్డు చదువుకున్న వాళ్ళ లాజిక్కులు!?

ఇంతకీ మహేష్ గారు, మీకు మీ ఊరన్నా, ఊరి పేరన్నా అంత ఇష్టమా! ఏంటీ! "మన" ’ఊరి’ ’విశ్వాసాలు’ "మరింత"

గుడ్డివైనా!!

మీరు నాస్టాలిజాగా ఫీలయ్యారు! దాన్ని ఎక్స్ ప్రెస్ చేసారు. అంతటితో ఆగి పోతే, ఛాందసవాదుల మీద నాకున్న జాలిని

మీమీద చూపించి కామెంట్ లేకుండా వదిలేసే వాడినేమో! ఈ "మన"ని కించ పరచినప్పుడే నాక్కాలుద్ది. మొన్న

అబ్రకబ్రగారు కూడా అంతే! "మన" ప్రభుత్వాలు అంటూ ఏదో రాశారు! ఎవరికైనా సమస్యలుంటాయి. వాటి గురించి

ఆలోచించుకోని, ఎదో ఒకటి నమ్మి, ఆగే బడో! అంతేగానీ! మనమింతే! మనకి రాదంతే! ఔను! మనం గుడ్డోళ్ళం! మనం

కుంటోళ్ళం!ఏమిటిది? ఆ మాటంటే మిగితావాళ్ళకి కాలదా!

మీకు కంట్రీ ఆఫ్ ది బ్లైండ్ తెలుసా! అందులో హీరో దాన్నించి పారిపోతాడు. ఎందుకూ! కళ్ళున్నాయి అని తెలుసు గాబట్టి!

మీకేమో కళ్ళున్నాయి. కానీ "మన" కి మాత్రం గుడ్డితనం! మీ కళ్ళు దాన్ని చూస్తాయి?

ఇంకో నిజం చెప్పానా - నేను కాదు, పూరీ గాడు చెప్పాడు స్టైలిష్ గా!
"కొట్టేసుకుందా అని డిసైడ్ అయ్యాక తమిళైతే ఏంటి, తెలుగైతే ఏంట్రా! రండ్రా కొట్టేసుకుందాం " అని!
దానికి "నిజం" తో సంబంధంలేదు.

మీరు నిజంగా మీ ఊరి పేరుని మార్చేసారు అని బాధ పడితే - అయ్యో నా ఇడ్లీ చచ్చి పోయింది! దాని ప్లేస్ లో కార్న్

ఫ్లేక్స్ వచ్చాయన్న బాధని అర్ధం చేసుకునే వాళ్ళు! కోకో కోలాలు , పెప్సీలు, పబ్ లు నా ఊరుని మార్చేస్తున్నాయన్న

బాధని అర్ధం చేసుకునే వాళ్ళు.

ఐనా మీరు బాధ పడ్డారనే అనుకుంటున్నాను. మీ ఊరు చెట్లు మీరు చూసి ఉంటారు, ఆ చెట్ల మీద వచ్చిన పేరు

పోయిందని బాధ పడి ఉంటారు అని నేను "నమ్ముతున్నాను". ఆ "నమ్మకం" తోనే ఏదో ఓ రోజు ఆత్మవిశ్వాస

రాహిత్యాన్ని వదులుకొని, మెరుగైనభావ జాలాన్ని, భాష జాలాన్ని మీరు పొందుతారు అని "నమ్ముతున్నాను"

మనం "తెలుగు" అని చెప్పుకోవడానికి నామోషీ గా ఫీలవ్వట్లేదుగా అని ఆ చిన్న పిల్ల అంటే, "విభేధించలేని అభిప్రాయం"

అని రాశారు. మీరు మాత్రం మనం గుడ్డి వాళ్ళం అని నమ్మండి! :) ఏంటి మీరు? :)

ఇంతకి ఈ పోస్టు "నిజమైన" కారణం మీ "అయ్యో పోయిందే" అన్న బాధేనా? మరేదన్నా ఉందా! సపెరేట్ పోస్ట్ వేస్తే,

విపరీతంగా చర్చించేసుకోవచ్చేమో :)

Praveen Mandangi said...

మత నమ్మకాల్ని నమ్మే వాళ్ళు అన్ని వేళల్లో అవే నమ్మకాల్ని పట్టుకుని వేలాడరు. ఉదాహరణ: పుట్టలో పాలు పోసే వాడికి పుట్టలో చెయ్యి పెట్టమంటే పెట్టలేడు. పాము దేవత కాదు, అది విష జంతువు అని అప్పుడు అతనికి గుర్తుకొస్తుంది. వాళ్ళకి కూడా కొంచెమైనా భౌతిక జ్ఞానం ఉంటుంది కానీ కొన్ని సందర్భాలలో భౌతిక జ్ఞానానికి పూర్తి విరుద్ధమైన పనులు చేస్తుంటారు. చిన్నప్పుడు నేను కూడా దేవుడిని, ఆత్మల్ని నమ్మేవాడిని. కానీ నేను దేవుడితో మాట్లాడాననో ఆత్మని చూశాననో చెపితే నా ఫ్రెండ్స్ నమ్మేవారు కాదు. ఎందుకంటే వాళ్ళకి మినిమం సెన్స్ కొన్ని సార్లైనా పని చేస్తుంది. కొన్ని సార్లు మినిమం సెన్స్ అంటే ఏమిటో అర్థం కాని డైలెమా కలుగుతుంది. రామాయణం జరిగిందనడానికి చారిత్రక ఆధారాలు లేవు. మత భక్తులు రామాయణం నిజంగా జరిగిందని నమ్ముతున్నారు కానీ చరిత్రకారులు మాత్రం రామాయణాన్ని కేవలం పుక్కిట పురాణంగా కొట్టిపారేస్తున్నారు. ఒక గ్రామానికి చెందిన ప్రజలు తమ గ్రామం దగ్గర వాల్మీకీ నిజంగా తపస్సు చేశాడని గ్రామస్తులు బలంగా నమ్మడం విచిత్రమే.

Bolloju Baba said...

భలే ఉంది డిస్కషను.
రాజ్ గారు గుక్కతిప్పుకోకుండా దంచేసారు. మహేషేమంటాడో చూడాలి

Kathi Mahesh Kumar said...

@రేరాజు: నా టపా మీదకన్నా ఆ తరువాత చర్చల్లో నేను చేసిన వ్యాఖ్యల్ని ఎక్కువగా చీల్చిచండాడారు. గుడ్డివిశ్వాసాల్లో relativity ని ప్రతిపాదించే ఉద్దేశంతో "మరింత" అనే పదప్రయోగం చెయ్యలేదు. ఇక "మన" అన్నది స్వాభావికంగా రాసిందేతప్ప ఆత్మన్యూనత దానికి కారణం కాదు.

మన సిద్ధాంతం సృష్టి-స్థితి-లయలైనా, సృష్టి మాత్రం "దేవుడు" చేశాడని నిర్ణయించేసుకుంటున్నాముగా. How is it different from christian faith?

ఇక మా ఊరి పేరు మారే విషయంలో నాలో కలిగింది మిశ్రమ స్పందన. నా టపా ఆ స్పందనను అక్షరబద్ధం చెయ్యడానికి చేసిన ప్రయత్నం మాత్రమే.

గీతాచార్య said...

I have my own story to tell.

@Rayraj: Interesting comments.

@Mahesh: Agreat job again. Many issues came into the discussion.

Anil Dasari said...

@రేరాజ్:

>> "అబ్రకబ్రగారు కూడా అంతే! "మన" ప్రభుత్వాలు అంటూ ఏదో రాశారు!"

అసందర్భ ప్రస్తావన. ఆ ప్రస్తావించేది కూడా ఔట్ ఆఫ్ కంటెక్స్ట్ చేసి ఓ వాక్యం రాసిపడేశారు - నా టపా చదవకుండా ఇది మాత్రమే చదివినోళ్లకి నా మీద దురభిప్రాయం కలిగేలా! నే రాసింది నానో కారు గురించే కానీ 'మన' ప్రభుత్వాల గురించి కాదు, 'మీ', 'మా' తేడాల గురించీ కాదు. నా టపా గురించి చెప్పేదేమన్నా ఉంటే మీ లేదా నా బ్లాగులో చెప్పండి. మూడో చోట ఎందుకు?

Anonymous said...

@అబ్రకదబ్ర : :) ఏంటండి! ఒక్క రెండు నిముషాలు ఊరికే మహేష్ తో కలిసి, "పోన్లే మహేశ్" అన్నట్టు చెప్పద్దు! ఎనీవే - మీకు నా అన్ కండిషనల్ అపాలజీస్! ఇందు మూలంగా తెలియ జేసేది ఏంటటే - అబ్రకదబ్ర గారు ఈ వాదనలో అప్రస్తుతం.

@మహేశ్ : నేనే మీ వైపు నిలబడి ఈ వాదనలను షూట్ డౌన్ చేయగలను. బహుశా మీరూ చేయగలరు. వాదనలు, నమ్మకాలు, నిజాలు ( అవన్నీ నిజాలని నమ్మిన నిజాలు) - ఏవి నిలబడలేవు. ఐతే "సత్యం" ఏంటి అని మనసుకి దురద పెడుతుందా!? అదే జీవిత లక్ష్యం, తేల్చుకోమని దీనికి సంబంధించిన ప్రతి వాళ్ళు చెబ్తూవచ్చారు. అందులో చాలా మంది బోగస్ గాళ్ళలాను ఉంటారు!
బోగస్సో , లేకపోతే వాళ్ళ ప్రయాణం అక్కడే ఆగి పోయిందో!? "తెలీటం లేదు" అన్న మజలీలోను కాసేపు ఉండటం తప్పుగాదేమో! "సత్యం" నాకూ ఇంకా తెలీదు. లేక పోతే, మీ నెత్తి మీద చెయ్యి పెట్టి మీకూ తెలిసేలా చేయాలి అనుకుంటా నేను : ) నాకు మాత్రం అలా ఎవరన్నా చెప్పినా "హిప్నటైజ్ చేసాడా? ఇది నా హెల్యుసినాషనా? " అని మళ్ళా అనుమానిస్తానేమో! :) ; కాసేపు ఈ పర్మెనెంట్ గా ఉన్న "మార్పు" , "అనుమానము" - ఇదే "సత్యమా" అని మళ్ళీ "అనుమానించాను" - తెలుసా!? :) (బైదవే ఇంత కాంప్లెక్సిటీ తట్టుకోలేక ఏదో ఒకటి డిసైడ్ చేసేసుకోవటం హ్యూమన్ జీన్స్ లోనే ఉంది’ట’ - వి ఆర్ హార్డ్ కోడెడ్ దట్ వే! ఎవల్యూషన్ ధియరీ నిజమైనా దీన్ని ఎప్పుడు బ్రేక్ చేసుకుంటామో! )

How is it different from christian faith? - డెఫెనెట్లీ నాట్. ఇట్ ఈజ్ సేమ్! సో వాట్! నేను చెప్పేది అదే - ప్రపంచం అంతా ఏదో విధమైన నమ్మకాల మీదే ఉంది! అసలు ఈ ప్రపంచమే ఓ నమ్మకమేమో ననే అనుమానాన్ని లేవనెత్తరు మరో వాదనలో! మీరింకా సృష్టిలోనే దేవుడనుకుంటున్నట్టునారు - కాదు, స్థితి, లయల్లో కూడా దేవుడున్నాడన్నది కాంసెప్టు రైట్! మీరింకా మీ స్టైల్లో "తీవ్రంగా" ఆలోచించండి.

"టపా లో మిశ్రమ స్పందన" - దాంట్లో చీల్చేది ఏమీ లేదు.
కన్వ్ఫ్యూజన్ నాకూ ఉందనే చెప్తున్నాను. అందుకే మీ కన్ఫ్యూజన్ నే గాదు, మరి కొన్ని కోట్లమంది కన్ఫ్యూజన్ ని నేను "అర్ధం"చేసుకోగలను! చిన్న ప్రయత్నంతో మీరూ తెలుసుకోగలరూ!

అసలు నేనిక్కడకి వచ్చిన కారణం మీ పోస్టు కాదు. ఆ పిల్లని "విభేధించలేని అభిప్రాయం" అంటూ అన్న మనిషి నిశ్చితాభిప్రాయమేమిటో తెలుసుకుందామని. నాకు మీరు కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు అనిపించింది.(ఇదీ నమ్మకమే!) నాక్కావాల్సింది అదే! అదీ పారాడాక్స్! :)

ఏమో! గుర్రమెగారావచ్చు!? - (ఔనూ , నా ఖలీల్ జిబ్రాన్ - ఆత్మఙ్జానం కవిత చదివారా లేదా!?)

(నా "తెలుగెందుకు - ప్రతిస్పందన" ( ఆ త్రీపోస్టులు) మీరు దయ ఉంచి మరో సారి చదివి, అభిప్రాయాన్ని మీతోనే అట్టిపెట్టుకోండి. అక్కడే రాయకండి. మీ అభిప్రాయాన్ని మీరు రాయాల్సింది అక్కడ కాదు. మీరు రాయబోయే ప్రతి ఇతర అభిప్రాయంలో దాన్ని నేను చూడగలను. నన్ను నమ్మండి. అక్కడెవ్వరూ తప్పు చెప్పలేదు. జస్ట్ నేను కోరుకుంటున్నది ఓ చిన్న "దృక్పదంలో మార్పు" అంతే! )

చివరగా ఒక్క మాట : నేను హిందువుని. అలా పుట్టుండకపోతే, బహుశా నేను ఓ రిలిజియస్ బైగాట్ అయ్యేవాడినేమో!
ఇందులో "స్వధర్మే నిధనం శ్రేయ: పర ధర్మోభయావహా " అని ఉంది. దీని ఇంటర్ ప్రేటేషన్ ఇంకా చాలా ఉంది - దీన్ని చాలా స్థాయిల్లో చెప్పొచ్చనిపిచ్చింది. ఒక స్థాయిలో - "నీ మతం ఏదైతే, నువ్వుదాన్నే కొంచెం తప్పుడుగా ఐనే ఫాలో ఔవ్వు; సూపర్ గా ఫాలో ఐనా, వేరే మతం నీకు భయంకరమే " అని. పాండర్ ఆన్ దట్!

అందుకే నేను ఏ మతస్థులు ఆ మతంలోనే ఉండాలంటాను ! ఎగైన్ ఎ పారడాక్స్ - చాలా పక్క మతాలు దాన్ని ఒప్పుకోవు - "రా, నా మతంలోకి రా" - అని పీకుతూ ఉంటాయి. That's when Hindu starts his/her enquiry and resists; And the resistence will make the other religion to find more reasons from its own self; Finally, both or either of the two might end up getting the Truth. మనసులాయో!

మీరు ఎంటర్ ది డ్రేగన్ సినిమా చూసారా! చైనీస్ మార్షల్ ఆర్ట్స్ ఫిలాసిఫీని ఓ సారి సింపుల్ గా - సినిమా పేర్లకి - ముందు బ్రూస్లీ తన గురువు ప్రశ్నించి నప్పుడు చెబ్తాడు. somthing like..... " When the enemy expands, i contract and when the enemy contracts, i expand. In the action, there is no enemy and no me, we just move in tandem. And when it is time to hit (showing his fist) it hits " ; మార్షల్ ఆర్ట్స్ కి ఫిలాసిఫీ ఏంటీ అని మీకెప్పుడూ అనిపించలేదా!?

ఇంకో విషయం - ప్రాబబలీ క్వైట్ ఆఫన్ టోళ్డ్ - " భగవద్గీత" కి సెట్టింగ్ "యుద్ధం" ఎందుకు అయ్యింది? హిందూ మైధాలిజీలోనే పెద్దగా కనబడని "అహింస" - మహాత్ముడు ఎక్కడ్నించి తెచ్చాడు? బుద్దుడు నుంచి తెచ్చాడని కొందరనుకున్నారు - గాంధీ స్వయంగా మై ఎక్స్పరిమెంట్స్ విత్ ట్రూత్ లో ఇంకా చాలా రాశాడు - శ్రీలంకలో బుద్ధుడు గురించి ఏదో చెప్పాడు - ఫైన్ ఆయన ఎంక్వైరీ ఎప్పుడు? ఎక్కడ స్టార్ట్ అయ్యిండొచ్చు? -కాదు, దాని ఫలితం ఏమయ్యింది? ఆలోచించండి, ఆలోచిస్తూనే ఉండండి - హార్డ్ కోడెడ్ జన్యువులవల్ల డిసైడ్ చేస్తారో? "సత్యమే" కనుగొంటారో!? నాకు తెలీదు.

"భారత్ ఏక్ ఖోజ్" అని ఓ సీరియల్ తీశాడు శ్యామ్ బెనెగల్.
(అదెక్కడన్నా డీవీడీల్లా కొనుక్కోవచ్చా! (ఇట్ షుడ్ ప్రాబబలీ బి ఎక్స్పోర్టెడ్ గ్లోబల్లీ ) ;
(ఇది మీరు ఆ రోజుల్లో చూసుంటే, రీప్లే అయ్యి అనుభవిస్తారు)
డిస్కవరీ ఆఫ్ ఇండియా బేస్ చేసుకొని ; రోషన్ సేత్ -నెహ్రూ చివర్లో ఏదో "ఉన్నీసౌ ఇక్యాసీ మే.........." అంటూ ఏదో చెప్పింతర్వాత.....
చిన్న పాజ్ వచ్చి టైటిల్స్ పడేవి. ఆ పాజ్ లోంచి " హిరణ్య గర్భస్త....................." అంటూ కాస్త చదివాక......ఓ మ్యూజిక్ మొదలెయ్యేది; అది ప్రామినెన్స్ లోకి వచ్చి, " సృష్టి కా కౌన్ హై కర్తా ........" అంటో హిందీలో పాట వచ్చేది........
చివరికి ఇలా ముగిసేది : ......................... "నహీ హై పతా................నహీ హై పతా.............."

ది ఎంక్వైరీ మస్ట్ గో ఆన్! ఇట్స్ నాట్ నోన్ ఎట్!

Thank you for giving so much space to say this.
i know......i am finding it difficult myself to come to terms with changes in personal life and external world.......and i know the trauma one faces in the process....i am going thru it.....and so perhaps, the only thing that i understand without confusion is your "confusion" - "మిశ్రమ స్పందన"

Anil Dasari said...

@రేరాజ్:

No need to opologize :-) మీరు యధాలాపంగా నా గురించి ప్రస్తావించారే కానీ దురుద్దేశంతో కాదని తెలుసు. మీ వ్యాఖ్య నా గురించిన అనవసర అపోహలకి దారి తీస్తుందనే ఉద్దేశంతో నేనిచ్చిన వివరణ అది. అంతకు మించి మరేమీ లేదు. ప్రతిస్పందించినందుకు ధన్యవాదాలు.