Monday, April 13, 2009

‘బలమైన’ ప్రధాని

ఈ మధ్య మన్మోహన్ సింగ్ ని ‘బలహీనమైన ప్రధాని’ అని మాటిమాటికీ చెప్పి, కాబోయే ప్రధానమంత్రి ఆశలున్న ఎల్.కె.అద్వానీ తన బలాన్ని చాటుకుంటున్నారు. పరిపాలనా పరమైన వైఫల్యాలనూ, విధానపరమైన లోపాలనూ ఎండగట్టాల్సిన ప్రతిపక్షనేత, నోరులేదు కదా అనే ధైర్యంతో మన్మోహన్ మీద వ్యక్తిగత దాడికి దిగడం దిగజారినతనాన్ని సూచిస్తే, "అజాతశతృవే అలిగిననాడు" అన్న ఛందంలో మన్మోహన్ నవ్వుతూ చెరిగిన నిప్పులతో ఎల్.కె.అద్వానీ పని నిప్పుతొక్కిన కోతి లాగా తయారయ్యింది. ఇంతకీ తేలనిదేమిటయ్యా అంటే, ఎల్.కె.అద్వానీ దగ్గరున్న బలం. మన్మోహన్ సింగ్ బలహీనత.

ప్రధానమంత్రికన్నా బలమైన శక్తికేంద్రం సోనియా గాంధీ కాబట్టి మన్మోహన్ బలహీనమైన ప్రధాని అని ఎల్.కె.అద్వానీ వాదన. ఇంతకన్నా హాస్యాస్పదమైన వాదన మరొకటి లేదని నా వాదన. ఎందుకంటే, సంకీర్ణప్రభుత్వాలు మొదలైనప్పటి నుంచీ "బలమైన" ప్రధాని ఎవరైనా ఉన్నారయ్యా అంటే అది మన్మోహన్ సింగ్ అనే చెప్పుకోవాలి కాబట్టి. 1984-89 లో రాజీవ్ గాంధీ తరువాత పార్టీ మరియూ ప్రభుత్వంపై పట్టున్న ప్రధానమంత్రి ఒక్కరూ లేరు. చంద్రశేఖర్, వీ.పీ.సింగ్, దేవేగౌడ, ఐ.కె.గుజ్రాల్ ఎవరూ తమదైన శైలి ప్రధానమంత్రిత్వం నెరిపినవారు కాదు. మద్ధతుగా ఉన్న పార్టీల కనుసన్నల్లోనో లేక సొంత పార్టీలోనే వారితో సమానమైన బలమున్న నాయకుడు లేక నాయకులతో ఎప్పుడూ భయపడుతూ, సర్దుకుపోతూ కాలం వెళ్ళదీసినవాళ్ళే. వీళ్ళలో కొందరు ఆపద్ధర్మ ప్రధానమంత్రులుకూడా ఉన్నారు మరి.

సరే! వీళ్ళందరూ బీజేపీయేతర ప్రధానులు అనుకుందాం. మరి బీజేపీ నాయకత్వంలోని ఎన్.డి.ఏ లోని ప్రధానికున్న బలమేమిటో చూద్ధాం. పదమూడు నెలల (1998-99) మొదటి బీజేపీ పాలనలో, పరిపాలన పక్కనబెట్టి సమయం మొత్తం జయలలిత మద్ధతు లేఖకోసం తన గుమ్మం దగ్గర పడిగాపులు పడటంతోనే సరిపోయింది. ఆర్.ఎస్.ఎస్. తన అంగబలంతో జస్వంత్ సింగుని ఆర్ధికమంత్రి కాకుండా అడ్డుకుంది. ఇక పక్కలోబల్లెంలాగా డిప్యూటీ ప్రధానమంత్రిగా ఎల్.కె.అద్వానీ వెలగబెట్టిన "బలం" ముందు పాపం అటల్ బిహారీ వాజ్పేయి కాస్తా, ‘అటక్ (చిక్కుకున్న) బిహారీ’ గా మిగిలారు.

రెండో సారి అధికారంలోకి వచ్చాక వాజ్పేయికి పట్టించిన స్థితి ఏ ప్రధానికీ కలలోకూడా కలక్కూడదు. పరిపాలనా సౌలభ్యం కోసం సాధారణంగా ఉన్నతాధికారులపై అధికారం ప్రధానమంత్రికి ఉండాలి. అందుకే Department of Personnel and Training ఎప్పుడూ ప్రధానమంత్రి చేతిలో ఉంటుంది.కానీ, NDA ప్రభుత్వంలో ఉపప్రధానిగా ఉన్న అద్వానీగారు ఈ డిపార్టుమెంటుని హోంశాఖతో పాటూ "స్వాహా" అనిపించి ప్రధానిని బలహీనపరిచారు. అంతేకాక, CBI నికూడా ‘గుటకాయాస్వాహా’ అనబోతే తనపైనున్న కేసులు ఆపాయిగానీ, లేకపోతేనా...! ఒకవైపు భవిష్యత్తు నేనే అనే ఉపప్రధాని, మరోవైపు హిందుత్వను పక్కనబెట్టారంటూ RSS శ్రేణుల గొడవ, సంకీర్ణభాగస్వాముల లుకలుకలూ ఇన్నిటి మధ్య "వీక్ పీఎం" ఎవరో బహిరంగ రహస్యం. ఇక ఆ బలహీనతలకు కొంతవరకూ కారణమైన ఎల్.కె.అద్వానీ ఖచ్చితంగా "బలవంతుడే" మరి. ఇక గుజరాత్ అల్లర్లను నిరసించిన వాజ్పేయిని బహిరంగంగా ధూషించిన RSS, తరువాత కాంధహార్ విషయం తనకేమీ తెలీదని,, జిన్నాను సెక్యులర్ అని తనపార్టీలోనే బలం నిరూపించుకుని ఎల్.కె.అద్వానీ చాలా శక్తిమంతుడిగా మనముందు నిలిచారు. ప్రభుత్వాన్నీ, పరిపాలననూ, సంకీర్ణ భాగస్వాములనూ, పార్టీని, పార్టీకి సంబంధం లేని సైద్ధాంతిక మూలాల్నీ, పక్కలోబల్లాన్నీ పెట్టుకుని సాగించిన బీజేపీ ప్రధానికంటే మన్మోహన్ శక్తిహీనుడా అనేది అసలు ప్రశ్న.

శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, వామపక్షాల వంటి సంకీర్ణ భాగస్వాములను ప్రధానిని పరిపాలనకు ఇబ్బంది పెట్టకుండా అడ్డుకుంది సోనియా గాంధీ. సొంత పార్టీలోని దిగ్గజాలైన ప్రణబ్ ముఖర్జీ, అర్జున్ సింగ్, ఏ.కే.ఆంధొనీ, శివరాజ్ పాటిల్ వంటి వారిని ప్రధానమంత్రి అధికారాల హననంగావించకుండా కాచుకుంది సోనియాగాంధీ. ప్రధానమంత్రి ఆనారోగ్యస్థితిలోకూడా పార్టీలో, ప్రభుత్వంలో ఎటువంటి ఒడిదుడుకులూ రాకుండా ప్రణబ్, ఆంధొనీ మధ్య అధికారాల పంపకం జరిగేలా చూసి, ప్రధానమంత్రి అధికారాలకు ఢోకా రాకుండా చూసుకుంది. పార్టీని, సంకీర్ణభాగస్వాములతో తను తలపడుతూ, పరిపాలనను పూర్తిగా ప్రధానిపరం చేసింది. ఇంతకంటే పరిపాలనా పరంగా బలమైన ప్రధానిని ఈ మధ్యకాలంలో భారతదేశం నిజంగా చూసిందంటారా?

సోనియాగాంధీ RSS లాగా రాజ్యాంగేతర శక్తికాదు, అధికారపార్టీకి అధ్యక్షురాలు, సంకీర్ణభాగస్వాముల మధ్యన సంధానకర్త అయిన UPA చైర్మెన్. తను చేసే పనులు తాను చేస్తూనే, ప్రధానమంత్రిని పరిపాలనా పరంగా పరమశక్తివంతుడ్ని చేసింది. "శక్తివంతంగా ఉండటం అంటే గట్టిగా అరవడం కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే అధికారం కలిగి ఉండటం" అని మన్మోహన్ సింగ్ ఇప్పుడు అంటుంటే, ఉక్కుమనషి ఎల్.కె.అద్వానీ ఏమంటారో చూడాలి!

****

17 comments:

anil said...

మాస్టారు, పాములపర్తి వెంకట నరసింహారావు గారు బలహీనుడే నా? లేక బలవంతుడా?

కత్తి మహేష్ కుమార్ said...

@అనిల్: మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్ళూ నడిపిన పి.వి.నరసింహారావు గారు అపరచాణుక్యుడో లేక పదవిలో మనడానికి JMM తో జట్టు కట్టి బలహీనుడయ్యాడో మీరే తేల్చండి.

అబ్రకదబ్ర said...

రాజీవ్ గాంధీ విషయంలోనూ అది బలం కాదు, వాపు. అప్పట్లో కాంగ్రెస్‌కి 425 స్థానాలు కాకుండా 125 మాత్రమే ఉంటే ఆయన అసలు బలం తెలిసేది. కిచిడీ ప్రభుత్వాధినేతలు ఎప్పుడూ అశక్తులు, బలహీనులుగానే ఉంటారు. తప్పదు.

చదువరి said...

మీ విశ్లేషణలో తర్కం ఎక్కడో తంతోంది.

సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధాని పదిమంది మాట వింటూ పోవాలి, నిజమే. అంచేత ప్రధాని సహజంగానే నిదానించాలి. సంకీర్ణ భాగస్వాములంతా ఓ ప్రణాళిక అనుకుని దాని ప్రకారం పోతారు. తన ఇష్టా రాజ్యంగా పోతానంటే కుదరదు. కానీ, అది కాదు, బలహీనత.

రాజకీయ వ్యవహారాల్లో అసలు ప్రధాని జోక్యమే అవసరం లేకపోవడం బలహీనత అవుతుంది. పార్లమెంటులో విశ్వాస తీర్మానమో, అవిశ్వాస తీర్మానమో పెడితే, దానిమీద తనకు వోటేసేవాడెవడో, పోటేసేవాడెవడో తెలవకపోవడం బలహీనత అవుతుంది. తనకు వోటేసేవ్వాడు ఎందుకు వేస్తున్నాడో తెలవకపోతే అది బలహీనత అవుతుంది.

సంకీర్ణంలో పక్కపార్టీవాళ్ళకు పదహారు అవసరాలుంటాయి. వాళ్ళందరినీ సమర్ధించుకుంటూ పోవాలి కాబట్టి, వాళ్ళ మాట వినాలి. సంకీర్ణంలో అది తప్పించుకోలేని సహజ న్యాయం. కానీ తనపార్టీలోనే తనమాట వినేవాడు లేకపోవడం బలహీనత అవుతుంది. తనకు నచ్చని మంత్రిని, అసమర్ధత కారణంగా తొలగించి తీరాల్సిందే అనుకున్న మంత్రిని, పైగా తన పార్టీవాణ్ణే -తీసెయ్యలేకపోతే అది బలహీనత అవుతుంది. ఇది "సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే అధికారం కలిగి ఉండట"మా? అసమర్ధుడైన హోమ్‌మంత్రిని తొలగించడానికి సరైన సమయం ఎప్పుడు? అతడు అసమర్ధుడని ప్రధానికి అనిపించినప్పుడా? లేక, కాంగ్రెసు అధ్యక్షురాలికి అనిపించినప్పుడా?

మన్‌మోహన్ సింగు ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు మంత్రివర్గంలోని, పార్టీలోని ఉద్దండులు - అనగా అర్జున్‌సింగు, శరద్‌పవారు, బలరామ్ జక్కరు వగైరాలు - అతడిపై నిప్పులు చెరుగుతున్నపుడు, అతడిని ప్రధాని ఆదుకోవలసి వచ్చింది. అది సహజం, అతడు మంత్రి కాబట్టి, అతణ్ణి ప్రధాని ఆదుకోవాలి కాబట్టి! ప్రధాని అయ్యాక కూడా, ఇప్పుడు, ఆయన్ని సోనియా ఆదుకోవాల్సిన పరిస్థితి. మన్‌మోహను సోనియా చాటు బిడ్డ అయితే పర్లేదేమో.. ప్రధాని కాంగ్రెసు అధ్యక్షురాలి చాటు బిడ్డ అయితే దాన్ని బలహీనత అనే అంటారు.

బలమూ బలహీనతల సంగతి అటుంచండి.. ఫ్రాన్సులో మన ఇంటి సంగతుల గురించి లేవనెత్తి, ఏంటి కంధమాల్లో కిరస్తానీల మీద దాడులు చేస్తున్నారు అని అడిగితే సమాధానం చెప్పలేకపోయానని తానే స్వయంగా చెప్పుకున్న ప్రధానీ ఒక ప్రధానేనా? "తను చేసే పనులు తాను చేస్తూనే, ప్రధానమంత్రిని పరిపాలనా పరంగా పరమశక్తివంతుడ్ని చేసింది." -హాస్యాస్పదంగా ఉందండి.

పీవీ నరసింహారావు సంగతి.. జేయెమ్మెమ్‌తో జట్టు కట్టి తప్పు చేసినవాడు ఐతే అయ్యాడేమోగానీ, బలహీనుడైతే కాలేదు. ఐదేళ్ళ పాటు, కాంగ్రెసులాంటి కుటుంబ పార్టీలో, ఆ కుటుంబానికి దాసోహమైపోయిన, దాసానుదాసులైన నాయకులను చుట్టూ పెట్టుకుని కూడా ఐదేళ్ళు జయప్రదంగా ప్రభుత్వన్ని నడిపాడే.. అతడు చాణక్యుడే కాదు, చంద్రగుప్తుడూ పురుషోత్తముడూ కూడా! ఎక్కడ బొఫోర్సు భాగోతం బయటపెడతాడోననుకుంటూ బిక్కుబిక్కుమంటూ ఆ ఐదేళ్ళూ జీవించింది, సోనియా. ఆ ఐదేళ్ళూ ఎక్కడైనా కనిపించిందా? వినిపించిందా? నువ్వు మాట్టాడకుండా ఉంటే నీకేం దిగుల్లేదు, నీ క్షేమం నేను చూస్తాను అని చెప్పకనే చెప్పి, ఆ ఐదేళ్ళూ అధికారాన్ని నెరపాడు. ఏంటి.. అయోధ్యలో మసీదును కూల్చేసిన తరవాత కూడా అప్రతిహతంగా పరిపాలించాడు. అప్పుడేమీ చెయ్యలేని సోనియా, పీవీ పదవినుంచి దిగిపోయాక - చివరికి చనిపోయాక కూడా - తన అక్కసు తీర్చుకుంది, కుంటోంది. :)

ఇందిర యుగం తరవాతి కాంగ్రెసు నాయకులందరిలోకీ అత్యంత బలశాలి, పీవీ. ఇందిర తరవాత వచ్చిన కాంగ్రెసు ప్రధానుల బలము, బలహీనతల ప్రకారం కొలబద్దమీద నిలబెడితే, ఈ చివర దర్జాగా కుర్చీ వేసుకుని పీవీ ఉంటే, పో..లదుగో ఆ చివరెక్కడో మన్‌మోహనుంటాడు.

అయితే ఒక్కటి.. ఆ బలహీనతకు కారణం ఆయన కంటే, హీనమైన కాంగ్రెసు సంస్కృతే ఎక్కువ కారణం!

observer said...

Sonia Gandhi nijamga balamaina pradhane... :)

Ananth said...

"సోనియాగాంధీ RSS లాగా రాజ్యాంగేతర శక్తికాదు, అధికారపార్టీకి అధ్యక్షురాలు, సంకీర్ణభాగస్వాముల మధ్యన సంధానకర్త అయిన UPA చైర్మెన్. తను చేసే పనులు తాను చేస్తూనే, ప్రధానమంత్రిని పరిపాలనా పరంగా పరమశక్తివంతుడ్ని చేసింది"

పై క్వాలిఫికేషన్ సోనియాని ఎలా రాజ్యాంగశక్తిని చేసిందో చెప్పగలరా?

ఏ క్వాలిఫికేషన్ ఉందని రాహుల్ గాంధీని అప్పుడే భవిష్యత్తు ప్రధానిని చేసారు. మన ఖర్మకాలితే, రాహుల్ కొడుకు కూడా ప్రధాని అవుతాడు, పుట్టటమంటూ జరిగితే.

Your supportive comments in favour of "madam" are lopsided, irrational and pathetic.

కత్తి మహేష్ కుమార్ said...

@అనంత్: రాజ్యాంగం ప్రకారం మెజారిటీ ఉన్న పార్టీ అధ్యక్షుల్ని ప్రభుత్వం ఏర్పాటుకు స్వాగతించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా,UPA చైర్పర్సన్ గా సోనియాగాంధీ స్వయంగానైనా లేక ఇంకెవరినైనా ప్రధానిమంత్రిగా నామినేట్ చెయ్యొచ్చు. తను మన్మోహన్ ను చేసింది.

అప్పటినుండీ పరిపాలన తనపరం చేసి పార్టీదిద్దుబాట్లు, సంకీర్ణభాగస్వాముల సర్ధుబాట్లు తను చేసింది.పార్టీ అధ్యక్షురాలిగా,UPA చైర్పర్సన్ గా అది రాజ్యాంగపరంగా ఎటువంటి వైరుధ్యం లేని బాధ్యత.

రాహుల్ గాంధీకి భవిష్యత్ ప్రధాని అయ్యేలక్షణాలున్నాయని కొందరు కాంగ్రెస్ నాయకులు అంటారు. అది అవసరం political correctness కూడా. ఎంతైనా మనం మూలత: ఫ్యూడల్ ప్రజలం. కానీ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడైన రాహుల్ స్వయంగా ఎప్పుడైనా "నేనే భావిప్రధానిని" అని డంకా బజాయించాడా? పైగా dynastic politics కి తను వ్యతిరేకం అని ఖరాఖండిగా చెప్పాడుకూడా. కాంగ్రెస్ పార్టీకి తను అవసరమైతే మనం చెయ్యగలిగేదేమీ లేదు. వాళ్ళకి ఓటువెయ్యకుండా ఉండటం తప్ప. అంతేతప్ప రాజ్యాంగపరంగా రాహుల్ ని తీసుకొచ్చినా ప్రియాంకాను తీసుకువచ్చినా అది వారి హక్కు.

I have explained my rational in my article. You are welcome to disagree but calling them pathetic only makes you irrational.

@చదువరి:పార్టీ వ్యవహారాలూ,సంకీర్ణభాగస్వాములతో మంతనాల బెడద లేకుండా కేవలం ప్రభుత్వం పరిపాలనలు చూసుకునే సౌలభ్యంకన్నా "బలం" ప్రధానికి అవసరం లేదని నా వాదన. ఇందులో తర్కం ఎక్కడ తన్నిందో నాకు తెలీదు.

ప్రధానమంత్రి రాజకీయాలకు అతీతంగా పరిపాలన నిర్వహించాలని రాజ్యాంగం చెబుతుంది. ఈ రాజ్యాంగ విధిని మన్మోహన్ నిర్వహించేలా పార్టీఅధ్యక్షురాలు సహాయపడింది ఇందులో ప్రధానమంత్రి కార్యాలయానికి తగ్గిన బలం ఏమిటో నాకు అర్థం కాని విషయం. అసమర్ధుడైన హోంమంత్రిని తొలగించడం ప్రధాన మంత్రి బాధ్యత, కాకపోతే ఆ హోంమంత్రికి పార్టీపైకూడా పట్టుండటం వలన ప్రధానమంత్రి-పార్టీఅధ్యక్షురాలూ ఇద్దరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ప్రధానమంత్రి కార్యాలయం యొక్క అసమర్ధత ఏమిటో!

రాజ్యాంగేతర మతతత్వ సంఘపరివార్ మాటలమీద ప్రధానమంత్రి నిర్ణయాలు ఆధారపడుంటే రాజ్యాంగేతర విధానం కానీ, పార్టీ రాజకీయాలకు కూడా అతీతంగా పరిపాలన చెయ్యడం బలహీనమా!

కందమాల్ గురించి తను చెప్పింది సమాధానం చెప్పలేక అవమానంగా ఫీల్ అయ్యానని.అది మనిషన్నవాడు ఎవరైనా చేసేపని. బాబ్రీమసీద్ కూలగొడుతుంటే కరసేవకుల్ని కంట్రోల్ చెయ్యలేక, రూంలో దూరుకున్న అద్వానీ ధైర్యంకన్నా అమానుషమైన చర్యపట్ల అవమానంగా ఫీలయ్యే మన్మోహన్ ఎక్కువ ధైర్యవంతుడని నా నమ్మకం.

పి.వి.నరసింహారావు చాణాక్య నీతిగురించి మీరు చెబుతున్నది వారిని ఎంత గొప్పనేతని చేసింద మీకే తెలియాలి. బాబ్రీ మసీద్ ఘట్టంలో మాత్రం ఈ నేతను తప్పుబట్టడానికి ఏమీ లేదనేది నా ఖచ్చితమైన అభిప్రాయం. లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్ అప్పటి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం కేంద్రానికి assurance ఇచ్చింది ఎటువంటి ఘటనా జరక్కుండా చూస్తామని. ఒక ముఖ్యమంత్రిని నమ్మి UP లో President rule విధించకుండా ఉన్నందుకు పి.వి.నరసింగారావు నింజంగా అభినందనీయుడు. ప్రజాస్వామిక విలువలకు పట్టంగట్టిన ప్రధాని.

Vinay Chakravarthi.Gogineni said...

i agree with chduvari gari explanation

KumarN said...

Mahesh,
ఇప్పుడే చూసానీ ఆర్టికల్. ఈ మధ్య జాబ్ లో బిజీగా ఉండడం వల్ల నేను అస్సలు ఫాలో అవ్వటం లేదు ఎలక్షన్స్ ని కాని, ఇండియన్ న్యూస్ ని కాని. కాబట్టి ఇక్కడున్న వాళ్ళందరితో పోలిస్తే నేను కాంపిటీటివ్ వ్యక్తిని కాకపోవచ్చు నా అభిప్రాయాన్ని వ్యక్త పరచడానికి. కాని నేను చాలా కాలంగా నా ఫ్రెండ్స్ సర్కిల్ లో ఎప్పుడూ ఒప్పుకోను..మన్మోహన్ బలహీనమయిన ప్రధాని అంటే. చాలా సార్లు వాదనలయ్యాయి. వివరల్లోకి వెళ్ళే టైం కానీ, ఓపిక్కానీ లేదు కాని, మీర్రసిందానితో నేను పూర్తిగా నేను అంగీకరిస్తాను అని తెలియ చెప్పటం కోసం ఈ కామెంట్ ని వదుల్తున్నాను ఇక్కడ..(ఈ మధ్యన ఎక్కడా కామెంట్లు వదలనప్పటికీ)
KumarN

హరేఫల said...

పీ.వీ. గారు తప్పకుండా అపర చాణక్యుడే. అందులో ఏమీ సందేహం లేదు. ఇప్పుడు ఉన్న మన్మోహన్ గారు ఇన్నాళ్ళూ ఓపిక పట్టారు. గుండె ఆపరేషన్ అయిన తరువాత ధైర్యం తెచ్చుకొన్నారు !! 5 సంవత్సరాలూ, అన్నిరకాల ఒత్తిళ్ళూ ఎదుర్కొని ( 14 పార్టిలు,కాంగ్రెస్ లో ఉన్న అతిరధ, మహారధులు,కమ్యూనిష్ట్ లు), అనీ నేర్చుకొని,పక్కా పొలిటీషియన్ అయ్యారు. ఇదివరకు నోట్లో వేలు పెడితే కొరకలేడోమో అనిపించేవారు. 1992 లో జరిగిన ఆర్ధిక సంస్కరణల గ్రంధకర్త కూడా ఆయనే.

ఏం మాట్లాడడు కదా అని ఆద్వానీ ఏదో కూశారు. దిమ్మ తిరిగేటట్లుగా మన్మోహన్ సమాధానం ఇస్తారని ఊహించలేదు.ఈయన కి ఇంకోసారి నాయకత్వం వస్తే, ఆనాడు పీవీ చేసినట్లుగా గాంధీ కుటుంబాన్ని కొంప ముంచేస్తారు.

రాఘవ said...

మహేశ్‌గారూ, మీరు అనేది మన్మోహన్‌కి వెనుక సపోర్టు అనే బలం (సోనియా ఏ ఇబ్బందీ రాకుండా చూసుకోవడం వలన వచ్చిన బలం) బావుంది అనా లేక... ???

మీరు చదువరిగారు వేఱ్వేఱు బలాల గుఱించి మాట్లాడుతున్నట్టున్నారు!

Dhanaraj Manmadha said...

Some of the points raised by the BJP leader are valid, as usual. But what, and how he expressed his views is wrong.

Mr. Advani, desiring to become the stro(you)ngest PM of India need to think before he speak.

Dr. Sing is not a strong PM, but a strong willed PM, and is well supported by his team in the guidance of Ms. Gandhi.

His efficiency can be know from the incidents of the 123 bill.

సూర్యుడు said...

నిజానికి కాంగ్రెస్ ఒక క్రొత్త మోడల్ ని అనుసరించింది. రాజకీయ పవర్ సెంటర్ సోనియా గాంధీ, పరిపాలనా పవర్ సెంటర్ మన్మోహన్ సింగ్. నాకు ఈ మోడల్ బాగా నచ్చింది.

In simple terms, Sonia Gandhi would have told Manmohan, "I will take care of political issues, you just concentrate on execution". In my opinion, this works well when the political power has the charisma and the execution power centre has the capability to execute. Also, this model proved successful as well. When they started, there were lot of rumours about the freedom Manmohan Sing will get and many more. No one believed Sonia that she will let Manmohan continue for 5 years. However, everyone was proved wrong in more than one way ;)

~సూర్యుడు :-)

Sujata said...

cool discussion. sonia is better than rss. see menaka-varun nexus bjp now supports ? advani is pro-corporate, pro-hindutva and pro-pakistan leader. i think he will keep the burner of hindutva and pota alive, for his sustainance.

SREEKANTH said...

if NDA comes into power in the coming elections...can Mr.LK Advani able to be a "stong" PM with the support of Jaya,Maya and others (with 'in/out'side support)

satya said...

పస లేని టపా..ఏదో ఆత్మ తృప్తి కోసం వ్రాసుకున్నట్లు ఉన్నది. ప్రారంభోత్సవాలకి సోనియా ని పిలిచి హడావుడి చేసినప్పుడే మన్మోహనుడి బలం ఏంటో అర్ధం అయింది. తొలి విలేఖరుల సమావేశం పదవి ని అలంకరించిన సంవత్సరానికి. అద్వానీ బలహీనుడైతే బహు బలవంతుడైన మన్మోహన్ చర్చ ని తిరస్కరించి చాటుమాటు వ్యాఖ్యలెందుకు? బీజేపీ లో లీడర్ అంటే తొలుత వినిపించేది అద్వానీ పేరు. ప్రధాని అభ్యర్ధిత్వానికి భాగస్వామ్య పక్షాల అందరి మద్దతూ కూడగట్టాడు. మరి మన్మోహన్? కనీసం లోక్‌సభ కి పోటీ చేసే స్థాయి లో కూడా లేడు.
గమనించండి. మీరు చెప్పినట్లు అద్వానీ ఎక్కడా సంకీర్ణ ప్రభుత్వం నడపడం లో మన్మోహన్ విఫలమయ్యాడు అనలేదు. మీరు NDA సంకీర్ణ వైఫల్యం గురించి మాట్లాడటం అసంధర్భం. PMO ఆఫీస్ కన్నా 10 జనపధ్ నిర్ణయానికే విలువ ఎక్కువ అని మాత్రమే విమర్శించాడు. అంతిమ నిర్ణయం ఎవరిదో జగమెరిగిన సత్యం. అసలు ఒక ప్రభుత్వానికి chair person ఏంటి? ఇదేమైనా private limited company నా? స్వతంత్ర భారతం లో ఎప్పుడూ లేదు.
మన్మోహన్ బలహీన ప్రధానే కాదు. బలహీన మనస్తత్వం కలిగిన వ్యక్తి కూడా.

satya said...

నా ముందు వ్యాఖ్య లో కొంచెం కఠినంగా మాట్లాడాను. అది మీ మీద కాదు, మీరు వ్రాసిన టపా లోని arguement మీద చేసిన వ్యాఖ్యలు గా భావించండి.