Wednesday, April 15, 2009

Passion కు తెలుగు పదం ఏమిటి?

ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ బ్లాగులో "Passion and Attachment" గురించి ఒక చిన్న వ్యాఖ్యానం చదివాను. "Passion belongs to the moment and Attachment is addicted to the past or the future. Attachment is desire while Passion is pure acceptance. Desire brings with it the fear of non achievement, but Passion has no fear." అని తను నిర్వచించిన తీరుకి అబ్బురపడి హఠాత్తుగా ఈ ఆలోచనల్ని తెలుగులో రాసిపెట్టుకుందామని ప్రయత్నించాను.

సమస్య ఇక్కడే మొదలయ్యింది. Attachment అనే పదానికి "బంధం" అనే తెలుగు పదం సరిపోయిందిగానీ, passion కోసం పదాన్ని వెతికితే, మోహం - కామం- వెర్రికోపం - ఆవేశం- తీవ్రోత్సాహం-ఉద్రేకం వంటి నెగిటివ్ షేడ్ ఉన్న పదాలేతప్ప ఆ ఆంగ్లపదానికి సమాంతరమైన భావోద్వేగం పలికే పదం దొరకలేదు. అప్పుడనిపించింది, మన తెలుగు భాష ఎంత value judgment కలిగిన భాషో! అని.


మనం "నిర్ణయించి" విలువలు అర్జంటుగా ఆపాదించే చరిత్రకలిగిన మనుషులం. అందుకే, మనకు అన్ని విషయాల్లోనూ ఖచ్చితమైన అభిప్రాయాలుంటాయి. ‘అవును’, ‘కాదు’ అనే పదాలేతప్ప ఇంగ్లీషోడు non-committed తరహాలో వాడే may be,might be, possibly, probably, most likely, most probably వంటి సమానార్థాలు చచ్చినా దొరకవు.ఎంతైనా మనం ప్రతివిషయాన్నీ సాధికారంగా చెప్పే స్వభావం కలిగినవారము కదా! ఒక టపాలో సమాధానమిస్తూ మిత్రుడు "తెలుగులో passive sentences ఉండవు" అని జ్ఞానోదయం కలిగించారు. నిజమే!!! చంద్రమండలానికి సంబంధించిన విషయాన్నైనా ఖచ్చితమైన ష్యూరిటీతో చెప్పగలిగే భాషలో passive-నిష్క్రియ వాక్యాలెందుకుంటాయ్?

మళ్ళీ మనం PASSION దగ్గరికొద్దాం. బహుశా మన సంస్కృతిలో రాధా, మీరాబాయి ల తరువాత తాదాత్మ్యకమైన unconditional ప్రేమ చూపించినవారు లేరేమో. దాన్ని కూడా భక్తిపారవశ్యం చేసేసి మనవాళ్ళు, ‘భగవంతునికీ-భక్తునికీ ఆనుసంధానమైన’ అనే అగరబత్తీ విజ్ఞాపనలాగా ఈ అచంచల,అవాజ్యమైన ప్రేమనుకూడా ఒక "బంధం" గా మార్చేసాము. అందుకే passion అనే పదానికి సమానార్థకం దొరకలేదనుకుంటాను.

అనుబంధాల్ని బంధాలుగా define చెయ్యకపోతే అది మనకొక బూతు. ఇక అవాజ్యమైన, అచంచలమైన, అమూల్యమైన ప్రేమ కనిపిస్తే గుండెల్లో దడ. అబ్బా ఈ ప్రేమ ఎలా కలుగుతుంది? పెళ్ళో గిళ్ళో లేకపోతేనూ!?! అని మహాసందేహం. కాబట్టి, ఆ ప్రేమకొక బ్రాండ్ తగిలించి బంధంగా నిర్ణయిస్తేగానీ కక్ష తీరదు. మరి బంధాలతో సంబంధం లేని passionate love మన సమాజంలో లేదు కాబట్టి నాకు పదం దొరకలేదా లేకపోతే నేను చూసిన డిక్షనరీ తప్పా అనేది పాఠకులే చెప్పాలి. పనిలోపని శేఖర్ కపూర్ చెప్పిన వాక్యానికి తెలుగు అనువాదం ఎవరైనా చెయ్యగలిగితే...మహాభాగ్యం.


****

31 comments:

సుజాత వేల్పూరి said...

"అనుబంధాల్ని బంధాలుగా define చెయ్యకపోతే అది మనకొక బూతు. ఇక అవాజ్యమైన, అచంచలమైన, అమూల్యమైన ప్రేమ కనిపిస్తే గుండెల్లో దడ. అబ్బా ఈ ప్రేమ ఎలా కలుగుతుంది? పెళ్ళో గిళ్ళో లేకపోతేనూ!?! అని మహాసందేహం. కాబట్టి, ఆ ప్రేమకొక బ్రాండ్ తగిలించి బంధంగా నిర్ణయిస్తేగానీ కక్ష తీరదు.".....:))

కొత్త పాళీ said...

పదాలు లేకేమీ, చాలా ఉన్నాయి. కాకపోతే సందర్భాన్ని బట్టి అర్ధపు ఛాయలు మారుతుంటాయి. ప్రతి ఆంగ్ల పదానికీ ఇదొక్కటే తెలుగు పదం అనుకోడానికి వీల్లేదు.
ఈ సందర్భంలో passionకి తాదాత్మ్యం అని అనువదించుకోవచ్చు. బైదవే మీరు కరేపాకులా తీసేసిన భక్తి అనే పదం కూడా దీనికి తగినదే.
మీకంతగా నచ్చిన కపూర్ వాక్యాల్ని ఇలా అనువదించుకోవచ్చు. నచ్చితే నిరభ్యంతరంగా వాడుకోండి.
ఈ క్షణానికి చెందినది తాదాత్మ్యం. నిన్నటితోనో, రేపటితోనో ముడి వేసుకునుండేది అనుబంధం. అనుబంధం మోహం. తాదాత్మ్యం భక్తి. మోహానికి వెన్నంటే సాధించలేనేమో ననే భయం ఉంటుంది. తాదాత్మ్యానికి భయం లేదు.

Anonymous said...

పాషన్ గురించి తెలుగుపదంలో కొంత చర్చ జరిగింది. కసి లేదా మోజు సరిపోవచ్చు.

రాజ మల్లేశ్వర్ కొల్లి said...

తపన..!?

చదువరి said...

సందర్భాన్ని బట్టి "మోజు", "ప్రియం/ప్రియమైన" లాంటివి వాడొచ్చేమో! "యావ" నెగటివుగా ధ్వనిస్తున్నప్పటికీ దాన్నీ కొన్న్ సందర్భాల్లో వాడొచ్చేమో!

Anonymous said...

మనకి తెలుగు రాదు కదాని తెలుగు భాషలో పదాల్లేవంటే ఎలా?
ఒకే పదానికి చచ్చేటన్ని అర్థాలున్న భాషా సంపద మనది.
పేషన్ కి అర్థంగా మోహం అన్న పదం వాడచ్చు.
మోహం అంటే "ప్రియులపై మోహం" కాదు. దేన్నయినా మోతాదు మించి ఇష్టపడ్డాన్ని మోహం అంటారు.

Anonymous said...

పైన వ్యాఖ్యాతల వ్యాఖ్యలు చదవకుండా వ్యాఖ్యానిస్తున్నాను:

"టపా" వెలువరించాలన్న ఆదుర్దాలో వ్రాసేసినట్టున్నటపా ఇది.
"దాన్ని కూడా భక్తిపారవశ్యం చేసేసి మనవాళ్ళు, 'భగవంతునికీ-భక్తునికీ ఆనుసంధానమైన' అనే అగరబత్తీ విజ్ఞాపనలాగా ఈ అచంచల,అవాజ్యమైన ప్రేమనుకూడా ఒక "బంధం" గా మార్చేసాము." ఒక్క సారి ఈ వాక్యం మళ్ళీ చదువుకోండి.

అలాగే ఈ వ్యాక్యం కూడా:" అనుబంధాల్ని బంధాలుగా define చెయ్యకపోతే అది మనకొక బూతు."

దీనికి మీరిచ్చే జవాబు మీద వెనువెంటనే జవాబివ్వలేను. క్షమించాలి. జవాబిస్తాను, కాని వెనువెంటనే మాత్రం కాదు.
ఇక మిగతా వారి వ్యాఖ్యలు చదువుతాను. ఉంటాను..

చక్రపాణి said...

నాకైతే మోహం సరిపోతుందనిపిస్తోంది. ఈ పేరు మీద చలం పుస్తకం ఒకటి పబ్లిష్ అయ్యింది. ఈ పదం అంటే చలానికి చాలా ఇష్టం. చలం స్త్రీ లో కూడా మోహం ప్రస్తావన ఉంది.

-చక్రపాణి

Sujata M said...

వడ్డెర చండీదాస్ రాసిన హిమ జ్వాల లో ఒక చాప్టర్ ఉంది.. 'అనుభూతి సిగ్గెరగదట అని దాని పేరు. ఈ నవలలోనే రసం, రసాత్మకత, రసానుభూతి లాంటి పదాలు చదివాను. ఆ నవల చదువుతుంటే ఒక మనిషి మనసులోకి తొంగిచూసేసి, భావాల్ని చదివేసి, తాద్యాత్మం చెంది (అంటే ?!) ఆ మనిషిని ఎన్నాళ్ళుగానో స్వయంగా ఎరిగినట్టుగా చేసేసే ఆ శైలి, ఆ శైలిలో మనల్ని కట్టిపడేసే పేషన్ ... అంటే.... అది మోహమో మైకమో కాదు. చాలా సార్లు పేషన్ అంటే దృఢమయినదేదో ఉన్మత్తమయిన స్థిర చిత్తం కావచ్చు. ఒక గమ్యాన్ని నిర్దేశించేదీ, ఆ గమ్యాన్ని చేరుకునేందుకు సహకరించేదీ ఈ పేషనే ! రసాత్మకతకూ, రససిద్ధికీ, ఈ స్థిర చిత్తానికీ ఉన్న సంబంధం - విలువలకు సంబంధించినది. ఇంత గందరగోళలో కూడా, ఈ టపా చదివితే హిమజ్వాల గుర్తొచ్చిందెందుకో !!!

ఆత్రేయ కొండూరు said...

కపూరు వాక్యాల్ని ఇలా కూడా రాయొచ్చు. (కోపా గారు రాసినంత కుదించి రాయలేక పోయాను)

"రసాస్వాదనలోని సంలీనత తాత్కాలికమూ క్షణికమూ బలహీనమూ ఐతే అనురాగ సంబంధమైన బాంధవ్యాలు భూత భవిష్యత్‌ కాలాలతో పెనవేసుకుని ఉంటాయి. బాంధవ్యాలకి తరగని ఆప్యాయతుండాలి కానీ తాత్కాలిక రసాస్వాదనకి పరస్పర అవగాహన ఉంటే చాలు. అందుకే బాంధవ్యాలు తునుగుతాయేమోనన్న భయంతో పాటు వస్తాయి.. సంలీనత తాత్కాలికం కనుక అటువంటివేవీ ఉండవు."

Kathi Mahesh Kumar said...

@కొత్తపాళీ: రాధా,మీరా లది భక్తికాదు.ప్రేమ.అవాజ్యనీయమైన ప్రేమావేశం.భక్తిలోకూడా బంధం ఉంది.Conditions ఉన్నాయి. కానీ వారి మోహావేశానికీ/ప్రేమావేశానికీ హద్దులు,అంతాలు లేవు. అందుకే దాన్ని passion అన్నాను. మీ అనువాదం బాగుంది. ఇంకా ఏమైనా వస్తాయోమో చూద్ధాం.

@వీవెన్: మీరు చెప్పిన లంకెలో చూశాను. కొన్ని కొత్తపదాలు కూడా తెలుసుకున్నాను. ధన్యవాదాలు.

@అనామకుడు: మీరు చెప్పిన "మోహం" నా డిక్షనరీ అర్థాల లిస్టులో ఉంది. కానీ అదికూడా సమానార్థకం కాదని నేను భావిస్తాను.

తెలుగు భాష గొప్పతనం తెలుగు సంస్కృతిని బట్టి ఉంటుంది. కొన్ని expressions మన సంస్కృతిలో లేవు కాబట్టి అవి భాషలో ఉండే అవకాశం ఉండకపోవచ్చు.అంతమాత్రానా, అదేదో చిన్నబుచ్చుతున్నట్లు అనుకుంటే ఎలా?

@అనిల్: నా టపాలోని వాక్యనిర్మాణాల గురించి రాసిన మీ వ్యాఖ్య నాకు ఇంత వరకూ అర్థం కాలేదు. మీరు జవాబిచ్చేవరకూ వేచిచూస్తాను.

@చక్రపాణి: మోహం బాగుందిగానీ ఇంకా కొంచెం బలంగా ఉంటేగానీ passion కు సరిసమానం కాదేమో అనిపిస్తోంది.

@Sujata:మీ విశ్లేషణ బాగుంది. కానీ, నన్ను మరింత గందరగోళానికి నెట్టేశారండోయ్!

@ఆత్రేయ: చాలా మంచి ప్రయత్నం. అభినందనలు.

@సుజాత: హ్మ్ కీలకమైన వాక్యాన్ని పట్టుకున్నారు.

Anonymous said...

సంవేదన

Naga said...

శంకర నారాయణ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు:

Passion, n. మనోభావము, మనో వికారము, రసము, కామక్రోధాది గుణములలో నేదైన నొక గుణము, feeling, emotion, కోపము, anger, wrath, rage, మోహము, కామము, love, amorous feeling.

Anonymous said...

మోజు సరైన పదం కావచ్చు. కాని అది తెలుగు పదమేనా? లేక మౌజ్ (ఉర్దూ?)నుంచి వచ్చిందా అనేది నాకు అనుమానం.

Kathi Mahesh Kumar said...

"మోహావేశం ఆ క్షణానికి చెందిన తాదాత్మ్యత. బంధం భూతభవిష్యత్ కాలాలకు చెందిన ఒక అలవాటు. బంధం కోరికైతే, మోహం అచంచలమైన విశ్వాసం.అందుకే కోరిక కోల్పోతామేమో అన్న భయాన్ని వెంటతెస్తే, మోహం ఈ భయాలకు అతీతం"

ఈ అనువాదం ఎలా ఉంది?

chakri said...

ప్రగాడ కాంక్ష

Bolloju Baba said...

ఇవిగో నా రెండు పైసలు,


మోహం వర్తమానానికి చెంది ఉంటుంది. అనుబంధం గతానికో, భవిష్యత్తుకో తగులుకొని ఉంటుంది. అనుబంధం ఒక కోర్కె కాగా మోహం ఒట్టి అంగీకారం. కోర్కె వెనుక సాధించలేనేమో నన్న శంక ఉంటుంది. మోహానికా భయం లేదు.

(కొత్తపాళీగారి లైన్స్ లోనే..... :-)

అనువాదాలలో సందర్భాన్ని బట్టి రూప స్వేచ్ఛ లేదా భావ స్వేచ్ఛ తీసుకోకతప్పదు. అలా కానప్పుడు కొన్నిసార్లు గందరగోళం తప్పదు.

బడు ప్రయోగాల గురించి చాలాకాలం క్రితం రంగనాయకమ్మ, చేకూరి రామారావు గార్లకు మధ్య మంచి సంవాదనలు జరిగినయ్. బడు ప్రయోగం వ్యతిరేకించే వారిని బడుద్దాయలు అని రంగనాయకమ్మ తిట్టినట్లు గుర్తు.
నాకు తెలిసి వస్తువులకు బడు ప్రయోగం
ఆమోదయోగ్యమే.
వ్యక్తులవద్దకు వచ్చేసరికి బడుప్రయోగం తెలుగులో ఎబ్బెట్టుగా ఉంటుంది. వాడకపోవటమే మంచిది.
కవిత్వంలో బడు ప్రయోగానికి అప్పటికీ ఇప్పటికీ ఒక గొప్ప ఉదాహరణ కవితా, ఓ కవితా.. లో శ్రీశ్రీ వ్రాసిన ఈ వాక్యం
ఉరి తీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం

బొల్లోజు బాబా

సుజాత వేల్పూరి said...

నాకైతే "ప్రగాఢ కాంక్ష" నచ్చింది!.ఇంకా....మోహం కూడా బాగానే ఉంది. కానీ అన్నింటికంటే దాన్ని అలా వదిలేసి తెలుగులో కూడా passion అని మాట్లాడుకుంటే ఇంకా బాగుండనిపిస్తోంది.

గీతాచార్య said...

ప్యాషన్ అంటే అవ్యాజమైన అభిమానం అనేమో? వెర్రి వ్యామోహం. ఇలా చెప్పుకోవచ్చేమో.

ఇంకా ఈ ప్యాషన్ ని పాజ్ఇటివ్ గా కూడా వాడొచ్చు. Just like I'm passionate about tennis, writing, etc.

మనకి దేనిమీద ప్యాషన్ ఉంటే దానిలో విజయం సాధించటం తేలిక. శ్రీనివాస రామానుజన్ కి లెక్కల మీద ప్యాషన్.

ఏమంటారు?

Anil Dasari said...

అర్ధం కాలా. Passion పదాన్నడ్డుపెట్టుకుని దేన్నో ఏకే తాపత్రయమే నాక్కనిపించింది :-)

చైతన్య said...

ఈ పదానికి negative అర్థం ఉన్నా కుడా ... ఇప్పటి వరకు నేను ఎక్కువగా పాజిటివ్ అర్థాలలోనే విన్నాను/ వాడాను (గీతాచార్య గారు చెప్పిన ఉదాహరణలో లా)

"ప్రగాఢ కాంక్ష" నాక్కూడా నచ్చింది

Anonymous said...

ఆర్తి.....ఈ పదం ఎలా ఉంది...దీనిని పాజిటివ్ గానే వాడతాము కదా....
-----yahoo

చైతన్య said...

ఇప్పుడే టీవీలో విన్నాను... 'వ్యామోహం' అనే పదం...
Passion కి ఇది సరిపోతుందనుకుంటా

Anonymous said...

The word "Passion" is used by Missionaries to express their intense emotions (often blind or irrational) towards their god. There are couple of English moies with this word as title. E.g. Passion of Christ.

This is the number one motivation for them for converting others.

Kathi Mahesh Kumar said...

హహహ అనామకుడా!నీ క్రిస్టియన్ ఫోబియా ఇంగ్లీషు పదాల్లో మతాన్ని వెదకడం వరకూ వచ్చిందా...What a pity.

@చక్రి: ప్రగాఢ కాంక్ష నాక్కూడా నచ్చింది.

@అబ్రకదబ్ర: మేరీ దునియాభీ గోల్ హై జనాబ్!

గీతాచార్య said...

మోహార్ద్రత సరిపోతుంది. కాస్త అటూ ఇటు గా. కానీ అలా ఆ అంగ్లపదమే సరైన అర్థమ్. :-)

Samanyudu said...

కత్తి గారు, అనామకులంటే మాలాంటి సామాన్యులు.. మీరు కావాలంటే anonymous ని 'ఎవడోవొకడు ' (లేకపోతే ఎవతోవొకతె) అని పిలుచుకోండి. :-)

అసలు విషయానికి వస్తే, నాకు కూడా కాంక్ష సరిపోతుంది అనిపిస్తోంది. దీనికి ఆర్ధ్రత తగిలించి ఎవరైనా కొత్త పదం కనిపెడితే బాగుండును.

నాకు కూడా ఇప్పటివరకు passion ని positive గా వాడటమే తెలుసు. As a manager working for an MNC IT firm, i can confirm to you that there is a lot of passion in using this word so religiouy in corporates.

అవునూ, పెద్దాయన శ్రీ తాడేపల్లిగారి నుండి ఏమీ వ్యాఖ్య రాలేదా? ఆయన సరి అయిన అర్ధం చెప్పగలరని నా నమ్మకం.

Rajendra Devarapalli said...

తమకం-- సరైన సమానార్ధక తెలుగుపదం.

Unknown said...

అయ్య బాబోయ్, రాజేంద్ర కుమార్ గారూ ... ఇప్పటికే మోహం, కాంక్ష పదాలతో సగం మందికి హోష్ ఉడ్ గయా లగ్ రహా హై!! ఇప్పుడు మీరు తమకం తగిలిస్తున్నారా !!??

Kathi Mahesh Kumar said...

@రాజేంద్ర:"తమకం" అనే పదం ఇప్పటివరకూ sexual connotation లో చాలావరకు ఉపయోగించగానే చూశాను. పదం బాగుందిగానీ passion కుతగ్గ intensity రావట్లేదే!

Dheeraj Sayala said...

మనకి అలవాటైన పదాలకి intensity ఎక్కువ ఉన్నట్టు అనిపించడం సాధారణమే లెండి.. నాకు తెలిసినంత వరకూ passionని తెలుగు లొ ప్యాషన్ అంటారు.. :)