Sunday, April 12, 2009

సాంప్రదాయ రచన - వ్యక్తిగత అభివ్యక్తి

ఒక వెబ్ పత్రిక సంపాదకుడితో వారి వెబ్ పత్రిక నాకెందుకు వైవిధ్యతున్న పత్రిక అనిపించదో చెబుతుంటే, "అవును, మాది కొంత సాంప్రదాయక పత్రిక లెండి" అనే సమాధానం వచ్చింది.అప్పుడు ఉదయించింది నాకొక ప్రశ్న. అసలు, సాంప్రదాయక సాహిత్యం అంటే ఏమిటి? అని.

చుట్టూచూస్తే కవిత్వంలో,కథల్లో,నవలల్లో చనిపోయిన వ్యక్తులో లేక "గొప్పోళ్ళని" (ఎవరో)నిర్ణయించేసిన వ్యక్తులో రాసిన మూసలో రాసేస్తే అది సాంప్రదాయక సాహిత్యంగా పరిగణింపబడుతోందేమో అనిపించింది. ఇక్కడ సమస్యేమిటంటే, సాంప్రదాయక రచయితలుగా ప్రస్తుతం కీర్తించబడుతున్న అందరూ, వారి కాలంలోని "సాంప్రదాయకత"కు వ్యతిరేకంగా కలం ఝుళిపించినవారే. ఇతివృత్తాలూ, శైలి,శిల్పం అన్నింటిలో "ప్రయోగాలు" జరిపినవారే. ఒకస్థాయిలో విప్లవాత్మక ధోరణి ప్రదర్శించినవారే. కానీ ఇప్పుడు వారిని కన్వీనియంట్ గా "మావాళ్ళే" అనేసుకుని, "క్లాసిసిజం" అంటగట్టి, మూసలో పోసి, అదే మూసలో అందరూ రాయండహో! అని చాటింపు వేసేస్తున్నారు.

ఉదాహరణకు కొడవటిగంటి కుటుంబరావు గారిని తీసుకుందాం. ప్రస్తుతం ఈయన్ను తమలో కలుపుకోని సాహితీసదస్సు లేదు, సాహితీప్రియులు లేరు,సాహితీవిమర్శకులూ లేరు. కానీ, ఒకప్పుడు!!! ఇక్కడే ఉంది తిరకాసు. ఇక చలం సంగతి చెప్పనఖ్ఖరలేదు. అప్పుడూ, ఇప్పుడూ ఈయన రాసిన రాతలకు ఎవరో ఒకరు చంపేద్ధామని తయారు. కానీ, తన రచనల timelessness, ఈయన్నూ పాపం "great traditional writer" ని చేసి కూర్చోబెట్టింది. తమని పక్కనబెట్టి సొంత సాహిత్యాన్ని నిర్మించిన మహాశిల్పుల్ని తమలో అర్జంటుగా కలుపుకునో, లేక తాము నాశనం చెయ్యలేని బలమైన సాహిత్యానికి సాంప్రదాయమనే రంగునద్దో ఈ ‘సాహితీమాఫియా ప్రియులు’ వైవిధ్యాన్ని మూసల్లోపోసి సాంప్రదాయం లేబిల్ తగిలించేసి చప్పట్లు కొట్టేస్తున్నారు.

ఈ పద్ధతి తెలుగు సాహిత్యంలో ఆభిజాత్య ధోరణిని , కొత్త ఒరవడికి విఘాతాన్నీ తయారు చేసింది. తెలుగు సాహిత్యం కేవలం కొన్ని సామాజిక వర్గాలకు చెందిన సాహిత్యంగా, కేవలం కొందరి సర్టిఫై చేస్తేనే గొప్పదిగా నిలిచేవిధంగా తయారయ్యింది. ఈ కుట్రని మీరి తమ అస్థిత్వాన్ని నిలుపుకున్న ఏకొందరినో మినహాయిస్తే, విత్తులుగానే వికటింపబడ్డ రచయితలు కోకొల్లలు. ఈ ఒక్క కారణం చాలు మన తెలుగు సాహిత్యం దుస్థితికి.

ఈ పరిస్థితికి వ్యతిరేకంగా ఉద్భవించినవే, సాహితీ అస్థిత్వ ఉద్యమాలు. ఒకవైపు దళిత సాహిత్యం, మరో వైపు స్త్రీవాద సాహిత్యం తోపాటూ ఇప్పుడు మాండలికాల పోరాటం మరియూ ప్రాంతీయవాదాల గొంతుకలు సాహిత్యాన్ని కుదిపేస్తున్నాయి. వాదాలకో లేక భావజాలాలలో పరిమితమైనా, కొంత వైవిధ్యాన్ని అందించి కొత్త పాఠకుల్ని ఈ సాహిత్యం సంపాదించుకుంది. వీటి భావజాల పోకడల్ని పురస్కరించుకుని వీటినీ "సాంప్రదాయాలు" చెయ్యడం త్వరలో జరిగిపోవచ్చు. సామదానభేధ దండోపాయాల్ని ఉపయోగించి ఈ సాహితీమాఫియా అవలీలగా ఈ పనిచేసేస్తుందని నా ప్రఘాఢ నమ్మకం.

పత్రికల్లో ఈ ఆభిజాత్యధోరణి అందరికీ తెలిసిందే. అదే ధోరణిని మన తెలుగు వెబ్ జైన్లూ అందిపుచ్చుకోవడం దురదృష్టకరం. కొందరు సంపాదకులు వారి "అభిరుచి"ని బట్టి పాఠకలోకానికి ఏం నచ్చుతుందో, వారు ఏమి మెచ్చుతారో నిర్ణయించి, దాన్నే "ఉత్తమాభిరుచి" గా పాఠకుల గొంతుల్లోకి ఒంపి, మెదళ్ళలోకి నింపే ప్రయత్నం చేస్తుంటారు. సారమున్న సీన్లన్నీ దర్జాగా చూసేసి, ‘ఇవి ప్రేక్షకుల మీద ప్రతికూల ప్రభావం చూపిస్తా’యన్న నెపంతో "కట్" చేప్పే సెన్సారు వారన్నమాట ఈ సంపాదకులు. వీరికి ఇంగ్లీషు పదమైన "ఎడిటర్" సరైనదేమో! తెలుగులో మరో నాజూగ్గా,నాగరికంగా ఉంది పేరు. సం...పా...ద...కు...లు. I hate them.

వీరంటే నాకు ఇంత ద్వేషం ఎందుకో చెప్పాలంటే, ఈ వ్యాసం యొక్క శీర్షిక దగ్గరికి వెళ్ళాలి. సాహిత్యం సామాజిక ఉన్నతికి, అభ్యుదయానికీ అని ఈ సాహితీ మాఫియా చెప్పే మాటలు శుద్ధ అబద్ధమని నా విశ్వాసం. ఎందుకంటే, రాసేవాడెవడూ సమాజాన్ని ఉద్దరించాలని రాయడు. తన వ్యక్తిగత అనుభవాలు,ఆలోచనలూ ముఖ్యమైనవి అనే నమ్మకంతో రాస్తాడు. ఇవి సమాజానికి ఉపయోగపడతాయనే "ఉదాత్తమైన" భావనకన్నా, తమ అనుభవాలతో identify చేసుకోగలిగే పాఠకులుంటారన్న ఆశ రచయితని రాయడానికి పురిగొల్పుతుంది. అంటే మూలస్థాయిలో రచన ఒక వ్యక్తిగత అభివ్యక్తి. అలాంటప్పుడు దాన్ని "పాత సాహిత్యం" తో బేరీజుచేసి, ఇది ప్రచురణకు,పదిమందీ చదవడానికి యోగ్యమా కాదా అని నిర్ణయించే హక్కు వీరికెవరిచ్చారు? సాహిత్యం సమాజానికి "మొత్తం" పనికిరావాలనేది ఒ Utopian idea. ఎప్పుడూ సాహిత్యం దాని స్థాయినిబట్టి by default కొందరికే పనికొస్తుంది. వారే రచయిత ఆశించన పాఠకులు. తన వ్యక్తిగత అభివ్యక్తితో identify చేసుకోలిగే ఇతర వ్యక్తులు.

భూతకాలం ఆధారంగా వర్తమాన,భవిష్యత్ కాలాల్ని నిర్ణయించడానికి, సాహిత్యం historical continuum కాదు. అందరికీ ఓకే విధమైన "ఉత్తమాభిరుచి" ఉండాలనీ లేదు. మరలాంటప్పుడు "ఉపయోగపడే" సాహిత్యాన్ని నిర్వచించే ఈ అధికారం వీరు ఏవిధంగా సంపాదించుకున్నారు అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. వార్తాపత్రికల సంపాదకుల వ్యవహారం నాకు అర్థమవుతుంది. కొంత లీగల్ రెస్పాన్సిబిలిటీ మరికొంత మోరల్ రెస్పాంన్సిబిలిటీ వీరి భుజాలమీద ఉంటుంది కాబట్టి, ఏ వార్త ప్రచురించాలీ, ఎందుకు ప్రచురించాలి, ఏంత జాగాలో ప్రచురించాలి అనే నిర్ణయాలకి కొన్ని కొలమానాల్ని ఊహించొచ్చు. కానీ సాహిత్యానికి సంపాదకీయం నెరిపే వారికి moral righteousness తప్ప మరేయితర బాధ్యతలూ ఉన్నట్లు నాకు కనిపించడం లేదు. వీరి వ్యక్తిగత అభిరుచిని బట్టి సాహిత్యం భవిష్యత్తుని శాసిస్తామంటే, నా వ్యక్తిగత అభివ్యక్తిని వీరికి అనుగుణంగా ఎందుకు మార్చుకోవాలో అర్థం కాకనే ఈ ద్వేషం.

ఈ ద్వేషపూరితమైన ప్రక్రియ అవసరం లేని బ్లాగంటే నాకు అత్యంత ప్రియం. ఇక్కడ రాసిన అనంతరం చర్చలరూపంలో సలహాలూ, సూచనలూ,విభేదనలూ, వివాదాలేతప్ప నేను చెప్పాలనుకున్నది చెప్పకుండా ఆపేసే అధికారం ఎవరికీ లేదు. నేను చెప్పాలనుకున్నది ఎలా చెబితే బాగుంటుందో "బలవంతంగా" రుద్దే హక్కు ఎవరికీ లేదు. ఇంతకంటే ఉత్తమ వ్యక్తిగత అభివ్యక్తి రూపం నాకైతే ఎక్కడా కనిపించలేదు. సాంప్రదాయ రచనల్ని ఆశించే వెబ్ పత్రికలకన్నా, నా వ్యక్తిగత అభివ్యక్తికి అద్దంపట్టే నా బ్లాగే నాకు మిన్న.

విభిన్న ఆలోచనలకూ,అభివ్యక్తులకూ స్థానం కల్పించకుండా, కేవలం సాంప్రదాయ రచనల పేరుతో అనుకూలమైన మూసల్ని సృష్టిస్తూ, ఏకధృవసాహిత్యం వైపు మనం ప్రయాణిస్తున్నంతవరకూ, తెలుగు సాహిత్యం సామాన్యులకు దూరంగానే ఉంటుంది. ఈ విధానాన్ని మార్చాలంటే, వ్యక్తిగత అభివ్యక్తికి పట్టంకట్టడం నేర్చుకోవాలి. ఒక వ్యక్తి అనుభవించి రాసిన ప్రతిరచనకూ, దానికితగ్గ పాఠకులుంటారు. ఇదే నిజం అని నా అనుభవం.

వ్యక్తిగత అభివ్యక్తికన్నా, మీ అభిరుచికీ కాల్పనిక పాఠకుల అంగీకారానికీ పట్టంకట్టే సంపాదకులూ డౌన్ డౌన్!!

జైహో బ్లాగ్ లోకం- వ్యక్తిగత అభివ్యక్తికి అనుకూలం.


****

16 comments:

cbrao said...

అవును, మన ఊహల, ఆలొచనల వ్యక్తీకరణకు బ్లాగును మించినది లేదు.

Unknown said...

>> "వ్యక్తిగత అభివ్యక్తికన్నా, మీ అభిరుచికీ కాల్పనిక పాఠకుల అంగీకారానికీ పట్టంకట్టే సంపాదకులూ డౌన్ డౌన్!!"

ఎవరికి వారు తమ అభిరుచులే గొప్పవనుకోవటం సహజం. ఒక వేళ మీరు ఏదన్నా పత్రిక సంపాదకులైతే మీరూ అదే పని చేస్తారు. మీ పత్రికలో మీ అభిరుచికే పట్టం కడతారు. కాదంటారా?

Shiva Bandaru said...

నియంతృత్వ, చాదస్తపు వెబ్‌జైన్లను ఎదుర్కోవడానికి స్వేచ్చావాదులూ వెబ్‌జైన్లు పెట్టుకుంటే సరిపోతుంది. :)

అయితే బ్లాగుల్లో పిల్టర్ లెస్ గా ఏదైనా రాసుకునే స్వేచ్చ ఉంది. బ్లాగులను ,వెబ్‌జైన్లు వేటికవే ప్రత్యేకం. ఒక దానికి ఒకటి పోటీ కాదు.

Kathi Mahesh Kumar said...

@చైతన్య: ఎవరి అభిరుచి వారికి గొప్పే. కానీ,సంపాదకులు భవిష్యత్ సాహిత్యాన్ని గుర్తించకుండా, కేవలం భూతకాల ప్రమాణాలతో Multiple Individual expressions కి స్థానం లేకుండా చేస్తున్నారనేది నా అభియోగం.

@శివ బండారు: మ్యాగజైన్ల, వెబ్ జైన్ల ధోరణి మధ్య గొంతు దొరకని వ్యక్తిగత అభివ్యక్తే బ్లాగుల్లో ఉంది. ఆ స్వాతంత్ర్యాన్ని enjoy చేస్తున్నాను. అంతకంటేనా!

Malakpet Rowdy said...

First of all, a very good article!

Having said it (as the others said before) every magazine has its own objectives and hence they will obviously be lookin at something that meets their expectations.

చైతన్య said...

మన బ్లాగులో ఎలా అయితే మనకి నచ్చిన విషయాలని... మన అభిప్రాయాలని వ్యక్తపరుస్తామో... అలాగే ఎవరి వెబ్ పత్రిక లో వారు వాళ్ళ అభిప్రాయాలని వ్యక్తం చేస్తారు... అందులో ఏదో తప్పుందని నేను అనుకోవటంలేదు...
మన అభిప్రాయాలకి దగ్గరగా ఉన్న పత్రికలని మాత్రం చదివితే సరిపోతుంది కదా!

Multiple Individual expressions కి వాళ్ళు ఎలా స్థానం కల్పించాలని మీ ఆలోచన?

Bolloju Baba said...

మీరు స్పృశించిన అంశాలు నిక్కచ్చిగా, తర్కబద్దంగా ఉన్నాయి.

సంపాదకుల అభిరుచులే పైచేయిగా ఉంటున్నాయి.
ప్రింట్ మీడియాలో ఉన్నన్ని రాజకీయాలు ఈ అభిరుచుల ప్రభావం వలననే.

కవిత్వంలో అందరి అభిరుచులకు తగ్గట్టుగా వ్రాసి, అన్నిరంగుల గొడుగులు మార్చిన ఓ పెద్దమనిషికి గొప్ప పీఠ్ ఇచ్చారు మీకు తెలియదా?

అదన్న మాట అసలు సంగతి. :-)

మాగంటి వంశీ మోహన్ said...

మనదేశం చాలా విచిత్రమయిందండీ. అలాగే ఆ దేశ ప్రజలు కూడా. ఓ మన దేశమేనా, ఇతర దేశాలు వాళ్ళ ప్రజలు అలా విచిత్రంగా ఉండరా? ఓ ఇది నాకు మరింత విచిత్రంగా ఉందే అంటే "మీ సుఖమే నే కోరుకుంటా". :) .సరే. ఎందుకు విచిత్రమయింది అంటే, ఇక్కడ కళని కళాత్మక విలువలతో కొలవరు. సాహిత్యం ఆధారంగా సాహిత్య విశిష్టతని, సాహిత్య మహత్తుని, ప్రయోజనాన్ని గుర్తించరు. కాకపోతే ఈ విచిత్ర జనాలు అంతా గుర్తించి కూడా, పక్కనపడేసింది ఏమిటంటే ఆ సాహిత్యవనంలో స్థానాలు, మానాలు, ముఠాలు ఏర్పరుచుకుని సాధించింది ఏమీ లేదని తెలిసినతనం.

ఈ సరంజామా అంతా పక్కన బెట్టి అసలు విషయానికి వస్తే సంపాదకులు ఉన్నారు చూసారా, వారి పని గిలుకుపావలు తొడిగించుకుని, కుంకుమపువ్వు బొట్టుతో కళకళలాడుతూ, పట్టెమంచం ఎక్కి భార్యామణిలాంటి ఉపసంపాదకులు చిలకలు చుట్టిస్తూ ఉంటే తాంబూలసేవనం చేస్తూన్నట్టుగా వచ్చిన రచయితల భాగ్యరేఖలాంటివో, దౌర్భాగ్యరేఖలాంటివో రచనల వంక చూస్తూ, చదువుతూ, ఆనందిస్తూ, కొండొకచో ఏడుస్తూ, అప్పుడప్పుడు నవ్వుతూ, ముసుగు కప్పిన మేలిమి బంగారం కోసం వింధ్య పర్వత గుహల్లో వెతుకుతున్నవాడిలా ఉంటుంది. వారు ఆమోదించగలిగే అభిరుచులు అనంతమయినా, వారు గుర్తుంచుకునే, గుర్తుంచుకోవలసిన ఒకే ఒక్క మాట - జీవితం నుంచే సాహిత్యం పుడుతుంది. కానీ జీవితానికీ సాహిత్యానికి పొత్తు కుదురుతుందా అంటే చప్పట్లు కొట్టుకుంటూ కూర్చోవటం కాకుండా సమకాలీన పరిస్థితులకి సరిపోయేట్టు రచన ఉన్నదా, అది కలిగించే ప్రభావం ఎంత అని బేరీజు వేసుకుని ఆ సాహిత్యాన్ని ప్రజల్లోకి వదలటం.

అయితే సంపాదకులు అనే వారు కూడా మనుషులే కాబట్టి ఆ ఆమోదించే పని ఎంత సమర్థంగా చేస్తున్నారు అనేది ఆయనకు చిలకలు చుట్టిచ్చిన మనుషుల మీద, ఆవేళ వాళ్ళ ఆవీడతో ఏం గొడవ పడి వచ్చారో ఆ విషయం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి సంపాదకుల మీద ద్వేషం, ఆగ్రహం ప్రదర్శించటం అనేది గార్ధబం మావిచిగురు తిని గొంతెత్తి పాడుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. అదేంటి ఈ ఉపమానం కోకిలకు కదా ఉపయోగించాల్సింది అంటే, ఇంతే సంగతులు చిత్తగించవలెను.

విత్తనాలు చల్లేవరకే రచయిత బాధ్యత. దాన్ని బాగా పెంచి అందరికీ ఫలాలు అందించే వృక్షం చెయ్యటమా వద్దా అనేది "సంపాదకుల మీద ఆధారపడిన రచయితల" రచనల అదృష్టం. మీ బ్లాగుకు మీరే సంపాదకులు కాబట్టి మీ ఆలోచనలే మీ బ్లాగు ప్రతిబింబిస్తుంది. ఆ ముక్క ఒక్కటి చాలు అన్నం ఉడికిందా, పైన ఇంత పొడుగున నేనన్నది అర్థం అయ్యిందా అన్నది తెలుసుకోవటానికి.

మనకు బోలెడంతమంది సమర్థులయిన రచయితలు ఉన్నారు , అంతకుమించిన సంపాదకులు ఉన్నారు అని మాత్రమే నేను చెప్పగలిగేది. ఇందులో అంటే నేను పైన రాసిన ఒక్క ముక్కలోకూడా శ్లేష లేదు అని అనిపిస్తే సంతోషం.ఇంతే సంగతులు...

ఇంకో మాట మీ బ్లాగులో ఇదే నా మొట్టమొదటి కామెంటు అనుకుంటా..దాదాపు రెండు నెలల తర్వాత కూడలికి వస్తే కనిపించిన మీ "సంపాదకీయం" పోష్టు చూసి ఇది రాయాలనిపించింది..మళ్ళీ ఒక నాలుగు నెలల వరకు కూడలికి సెలవు, బ్లాగులకు సెలవు.. అదీ సంగతి

మరువం ఉష said...

జయహో బ్లాగ్లోకం. జయహో బ్లాగ్వ్యాఖ్యాస్వాతంత్రం జయహో బ్లాగ్సాహీతీమిత్రత్వం ...

Kathi Mahesh Kumar said...

@చైతన్య: పత్రికా స్వాతంత్ర్యం Individual right to expression నుంచే పుట్టిందనేది మా జర్నలిజంలో చెప్పే మొదటి పాఠం. వార్తాల్ని పక్కనబెటితే, నేను సాహిత్యాన్ని,సృజనాత్మకతనూ మాత్రం అదే ప్రాతిపదికగా కొలుస్తాను.

సంపాదకులు Multiple Individual expressions ని క్రోడీకరించి వాటికి తగ్గ పాఠకులదగ్గరి చేర్చాల్సిన బాధ్యత తీసుకోవాలేగానీ, వారి భూతకాల కొలమానాలతో కథాంశాల్ని, కథనరీతుల్నీ,శైలినీ మార్చమని డిక్టేట్ చేసి భవిష్యత్తును నిర్దేశించే రచనల్ని సమూలంగా నాశనం చేసేపనిచెయ్యకూడదనే నా నమ్మకం.

"మాది సాంప్రదాయక వెబ్ పత్రిక" అన్న సంపాదకుల attitude తో నాకు సమస్యలేదు. కానీ వారు సాంప్రదాయకత అంటున్న సాహిత్యం తీరుతో నాకు సమస్య ఉంది. అందుకే ఈ టపా. ఇది వాళ్ళను మారిస్తుందని నేను అనుకోను. కానీ ఇలాంటి పత్రికలకు తమ రచనల్ని పంపే రచయితలు కొంత జాగ్రత్త వహిస్తారని మాత్రమే రాశాను.

@బాబా గారు: ప్రింట్ మీడియా అద్దం పడుతున్న సాహితీ విలువలు ప్రశ్నార్థకంగా తయారయ్యాయనేది కాదనలేని సత్యం. దానికి alternative గా వచ్చిన వెబ్ పత్రికలు కూడా ఇదే ఆభిజాత్య ధోరణిని ప్రదర్శించడం కొంత విస్మయాన్ని కలిగిస్తోంది. ఇదంతా ఒక great design లో భాగమేమో అన్న విచారం ఈ టపాకు మూలం.

@మాగంటి వంశి: మొత్తానికి సంపాదకులూ మనుషులే కాబట్టి క్షమించెయ్యలంటారు! మరి వీళ్ళు గొప్పోళ్ళని చెప్పుకుంటారే!!

సుజాత వేల్పూరి said...

మీ వ్యాసంలోని చాలా అంశాలతో ఏకీభవించడం తప్ప మరో మార్గం లేదు. ఒక పత్రికలో ఎటువంటి కథల్ని రచనల్ని అనుమతిస్తారనేది సంపాదకుడి అభిరుచి మీద, వారికి చిలకలు చుట్టిచ్చేవారి అభిరుచిమీదా కూడా ఆధారపడి ఉంటుందనుకుంటా! వాళ్ళ మూడ్ ఆరోజు బాగాలేకపోయినా, వాళ్ళావిడ మూడ్ బాగాలేకపోయినా రచయితలు బలి కావలసిందేనా?

మరోవైపు ఈ అస్థిత్వ వాదాలు, ప్రాంతీయ వాదాల సాహిత్యం అంతా నాకు రుచించదు. అవి సాహిత్యంలో ఒక భాగంలా ఉండాలి కానీ "మేమొక ప్రత్యేక వర్గం" అని ప్రకటించుకోవడం నాకెంచేతో నచ్చదు. ఆ సాహిత్యం చదవాలంటే ముందే ఒక మైండ్ సెట్ తో సిద్ధంగా ఉండాలి. కుటుంబరావు గారి సాహిత్యం పక్కాగా మధ్యతరగతి జీవితంలోంచి ఊడిపడ్డట్టు ఉంటుంది. అద్భుతమైన భాష, ఫ్లో, విశ్లేషణ! అది చదవాలంటే ఎంత సేపైనా నాకు విసుగెత్తదు. వాదాల సాహిత్యం ఎంత సేపూ ఒకటే రకంగా సాగుతూ విసుగెత్తిస్తుంది.(నాకు) అందుకేనేమో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాదాలు పుడుతూనే ఉంటాయి.

అలాగే రచయిత వ్యక్తం చేసిన అభిప్రాయాలను(రచనను) పాత సాహిత్యంతో బేరీజు వేయడం,నాణ్యత నిర్ణయించడం సబబు కాదు. కానీ అందువల్ల "ఇది రచయిత అభిప్రాయం కాబట్టి దీన్ని ఖండించే అధికారం నాకు లేదు" అని సంపాదకుడు అనుకుంటే ప్రతి రచనా వేసుకోవాల్సిందే! ఈ రకంగా చెత్త, నాసి రకం రచనలనీ రంగలోకి వచ్చే అవకాశం ఉందిగా! ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన దాన్ని రాసేసి రచయితలు గా చలామణీ అయిపోయే ప్రమాదం ఉండదూ! (నండూరి పార్థ సారథి గారి సాహిత్య హింసావలోకనం చదవండి)

"వ్యక్తిగత అభివ్యక్తి" కి పట్టం కట్టడానికి బ్లాగులున్నాయి. కానీ వందల్లో, వేలల్లో పాఠకులుండే పత్రికలకు, సంపాదకులకు ఇది సాధ్యం కాకపోవచ్చు. కానీ మంచి సాహిత్యాన్ని అందిస్తున్నామన్న నెపం తో మంచి వారి అభిరుచితో ఏకీభవించని మంచి రచనలను కూడా తిరగ్గొట్టే సంపాదకులను ఎలా అర్థం చేసుకోవాలో మరి!

చైతన్య said...

ఓకే... మీరు చెప్పింది బాగుంది... i agree to that point.

Rajendra Devarapalli said...

అంశం బాగుంది,బాగా చర్చ జరగాలని ఆశిస్తున్నాను,కాకుంటే కాస్థ పనుల వత్తిడిలో ఉన్నా,మా అమ్మగారు చనిపోయిన రోజు మరలా కలుద్దాం.

మెహెర్ said...

ఈ పోస్టులో విప్లవోద్రేకం నాకు నచ్చింది. కాని దురదృష్టవశాత్తూ దిశానిర్దేశం లేని ఈ ఉద్రేకం ఏమీ రుజువు చేయలేకపోతోంది.

ముందుగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. బ్లాగులెప్పుడూ పత్రికా స్థాయికి చేరుకోలేవు. ఎందుకంటే, మీరేదైతే వాటి బలం అని చెప్తున్నారో, చిత్రంగా, అదే వాటి బలహీనత: namely, బ్లాగులకు సంపాదకులు ఎవరూ ఉండరు. ఈ కారణంగానే ఇలా రెటోరిక్ ముసుగులో నిజాలకి వక్రభాష్యాలూ, ఉనికి లేని abstractions పై ప్రకటితమయ్యే అర్థం లేని ఆవేశాలూ, ఆ ఆవేశాల్ని డంప్ చేయడానికి వీలుగా రెడీమేడ్ జనరలైజేషన్లూ బయట పడగలిగి నాలాంటి ఖర్మకాలిన పాఠకులు కొందరి ముందైనా పెరేడ్ చేయగలుగుతున్నాయి.

ఉదాహరణకి మీ ఈ పోస్టుకే నాలాంటి సంపాదకుడు ఉన్నాడనుకోండి, అందులో ఈ క్రింద ఉదహరించినటువంటి నిర్లక్ష్యపు పొరపాట్లు జరిగేవి కాదు:

1) సరైన నిర్మాణం లేని వాక్యాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మచ్చుకి ఒకటి: "చుట్టూచూస్తే కవిత్వంలో,కథల్లో,నవలల్లో చనిపోయిన వ్యక్తులో లేక గొప్పోళ్ళని (ఎవరో)నిర్ణయించేసిన వ్యక్తులో రాసిన మూసలో రాసేస్తే అది సాంప్రదాయక సాహిత్యంగా పరిగణింపబడుతోందేమో అనిపించింది." ఈ వాక్య నిర్మాణం చాలా అస్తవ్యస్తంగా ఉంది. నిజానికి యిది ఈ క్రింది విధంగా ఉండాలి (నా మార్పుని కోట్స్‌లో సూచించాను):

చుట్టూచూస్తే "కవిత్వం, కథలు, నవలలు" చనిపోయిన వ్యక్తులో లేక గొప్పోళ్ళని (ఎవరో)నిర్ణయించేసిన వ్యక్తులో రాసిన మూసలో రాసేస్తే అది సాంప్రదాయక సాహిత్యంగా పరిగణింపబడుతోందేమో అనిపించింది.

ఇది ఆ వాక్యానికి సరైన నిర్మాణం. వాక్యాన్ని మొదలు పెట్టడం ఒక పోకడలో మొదలు పెట్టి, పుల్‌స్టాప్ దగ్గరకొచ్చేసరికి ఎలా మొదలు పెట్టామో మర్చిపోయి, మరో పోకడలో ముగించడం వల్ల ఇలాంటి అవకతవక వాక్యాలు బయటపడుతూంటాయి. సంపాదకులుంటే వీటిని పరిశీలించే అవకాశం ఉంటుంది.

అలాగే "వైవిధ్యతున్న" కాదు; "వైవిధ్యమున్న" అన్నది తీరైన ప్రయోగం. అలాగే "అస్థిత్వం" అన్నది తప్పు; "అస్తిత్వం" ఒప్పు.

2) "విప్లవాత్మక ధోరణి" ప్రదర్శించిన రచయితలంటూ కొడవటిగంటి కుటుంబరావుగార్ని ఉదాహరణగా తీసుకోవడం చేతివాటంగా దొర్లిపోయిన మరో తప్పిదం. కొడవటిగంటి ఇతివృత్తం, శైలి, శిల్పాల్లో ప్రదర్శించిన భారీ విప్లవాత్మక మార్పులేవీ లేవు. నిజానికి తన రచనా జీవితం మొదట్లో శిల్పానికి ప్రాధాన్యం ఇచ్చినందుకు తరవాత్తర్వాత ఆయన చాలామార్లు వగచాడు కూడా. వెతికే ఓపిక లేక ఇప్పటికిప్పుడు దొరికిన ఉదాహరణ ఒకటి ఇస్తున్నాను. "నేను కథలు ఎలా రాస్తాను?" అనే వ్యాసంలో ఈ వ్యాక్యాల్ని ఆయన కాస్త self-reproaching manner లోనే రాస్తున్నాడని గమనించవచ్చు: "నేను కూడా మొదట్లో కథా శిల్పానికి అత్యంత ప్రాముఖ్యం ఇచ్చే వాణ్ణి. టెక్నిక్ బాగుంటే కథలో ఇంకేమీ లేకపోయినా ఫరవాలేదు అనుకునేవాణ్ణి. ఇతరులు వ్రాసిన కథల్లో విషయం ఎంత బాగున్నప్పటికీ టెక్నిక్ లోపించినట్టుతోస్తే ఆ కథలు నాకు నచ్చేవి కావు."

నేనీ మధ్యన తెలుగు సాహిత్య చరిత్రపై ఓ పుస్తకం చదువుతున్నాను. ఆ పుస్తక రచయిత అందులో గురజాడకి అన్వయించిన విశ్లేషణే మనం కుటుంబరావు గారికీ అన్వయించుకోవచ్చు. కుటుంబరావు గారిది "విమర్శనాత్మక వాస్తవికతతో కూడిన, సామాజిక చైతన్య లక్షితమైన పురోగామి తత్త్వం." ఆయనలో మీరంటున్న తిరుగుబాటు ధోరణి ఏమీ లేదు. సాంప్రదాయ విముఖతా లేదు. చలంలోని గుడ్డి ఆవేశం అసలే లేదు.

3) "కానీ, [చలం] రచనల timelessness, ఈయన్నూ పాపం "great traditional writer" ని చేసి కూర్చోబెట్టింది."

ఇక్కడ మీరు రాసింది ఒక పరస్పర విరుధ్ధమైన వాక్యం. చలాన్ని సాంప్రదాయక రచయితగా మార్చింది ఆయన రచనల్లోని timelessness ఎలా అవుతుంది? ఆయన రచనల్లో ఆ టైంలెస్‌నెస్సే వుంటే ఆయన మీరన్నట్టు సాంప్రదాయక రచయితగా చప్పబడి మిగిలేవాడు కాడు; ఇంకా కొత్తావకాయ ఘాటే చూపించగలిగి వుండేవాడు.

మీరన్నట్టు చలం "great traditional writer"గా మారిపోయివుంటే దానికి కారణం ఆయన రచనల్లోని "timelessness" కాదు; మనచుట్టూ మారుతున్న "time", అంటే కాలగమనం. Ideology ప్రధానంగా వుండే ఆయన రచనలు కాలగమనంలో తమ ఔచిత్యం కోల్పోయి ఆయన్ని సాంప్రదాయిక రచయితగా చేసివుండవచ్చు. అయినా చలం చూపించినటువంటి భావాత్మక విప్లవ ధోరణి ఎక్కువ కాలం నిలబడి వుండదు. ఆ విప్లవానికి కారణమయిన పరిస్థితులు చక్కబడగానే, లేక మరో విధంగా మారిపోగానే ఆ విప్లవమూ చల్లబడిపోతుంది. మిగిలేదేమైనా వుంటే అది కళ. అది లేని నాడు చలమైనా ఎవరైనా చివరకో చంచలమైన ఫినామినాగానే మిగులుతారు. అయినా ఈ ప్రస్తావన ఇక్కడ అప్రస్తుతం అనుకోండి....

4) ఇక ఈ నాలుగో పాయింటు ఏమీ factual error కాదు. కానీ మీరు మరీ ఇంత అమాయకులా అని అనిపించి, ఖాయపరచుకోవడానికి ప్రస్తావిస్తున్నానంతే. నేనంటున్నది ఈ వాక్యం గురించి:

"ఈ పరిస్థితికి వ్యతిరేకంగా ఉద్భవించినవే, సాహితీ అస్థిత్వ ఉద్యమాలు."

ఈ సాహితీ అస్తిత్వ ఉద్యమాలు సాంప్రదాయకతకు వ్యతిరేకంగా ఉద్భవించాయనుకుంటున్నారా ! పొరపాటు !! పాఠకులు కరువై మంచు ఎడారిలా మారిపోయిన ప్రస్తుత సాహితీక్షేత్రంలో రచయితలంతా తమను వణికిస్తున్న గుర్తింపులేమి నుండి తప్పించుకోవడానికి వెచ్చనైన గుంపులుగా ఇలా ఓ దగ్గర చేరి "నువ్వు రచయిత"వంటే "నువ్వూ రచయితవే"నంటూ ఒకరి వీపులు ఒకరు గోక్కుని ఉపశమనం పొందడానికి ఈ అస్తిత్వ ఉద్యమాలు మొదలయ్యాయి. ఇవి ఆయా పీడిత వర్గాలు తమ ఉనికి కోసం చేసే అస్తిత్వ ఉద్యమాలు కావు; వాటి ముసుగులో ప్రజ్ఞా విహీనులైన రచయితలు కాలానికి కొట్టుకుపోతామన్న భయంతో తమ ఉనికి కోసం చేస్తూన్న అస్తిత్వ ఉద్యమాలివన్నీ. "దళిత సాహిత్యం", "స్త్రీవాద సాహిత్యం", "మాండలిక సాహిత్యం"... పేరేదైతేనేం, శిథిల సారస్వత ప్రాకారాల్ని పట్టుకు వేలాడుతోన్న గబ్బిలాల గబ్బు ఇదంతా. ఈ ఉద్యమాల్లోని రచయితలకు రాయడం తప్ప అన్నీ వచ్చు. "సాహిత్యం సామాజిక ఉన్నతికి, అభ్యుదయానికీ" అని బోధించే "సాహితీ మాఫియా" ఇక్కడే కనిపిస్తుంది. మీరనుకుంటున్నట్టు ఈ అస్తిత్వ ఉద్యమాలు "తెలుగు సాహిత్య దుస్థితి"కి విరుగుడు కావు; అసలివే దానికి కారణాలు. నిజానికి పత్రికా సంపాదకులు చేయగలిగే మంచి పనేమన్నా ఉంటే తమ పత్రికల్లో సాహిత్యానికి కేటాయించిన పేజీల్లోంచి ఈ పారసైట్స్‌ని పారద్రోలడం. లేదా "ఈనాడు" లా పత్రికలో సాహిత్యానికి పేజీనే లేకుండా చేయడం.

5) "సాంప్రదాయ రచనల్ని ఆశించే వెబ్ పత్రికలకన్నా, నా వ్యక్తిగత అభివ్యక్తికి అద్దంపట్టే నా బ్లాగే నాకు మిన్న."

మీరు ఈ పోస్టులో "వ్యక్తిగత అభివ్యక్తి" అన్న మాటను ఎక్కువసార్లు వాడారు. అంతేకాదు, "మూలస్థాయిలో రచన ఒక వ్యక్తిగత అభివ్యక్తి" అంటూ సారస్వత పరిధిని కుంచింపజేసే ఓ సిద్ధాంతీకరణ కూడా చేయబోయారు. బ్లాగుల పరమార్థం వ్యక్తిగత అభివ్యక్తి; కానీ సారస్వత పరమార్థం వ్యక్తిగత అభివ్యక్తి కాదు. సిసలైన ఏ కళాకారుడూ కళ తనను తాను అభివ్యక్తీకరించుకోవడాని మాత్రమే అనుకోడు; చుట్టూ ప్రపంచం తనలో ప్రతిఫలించే విధానాన్ని తన కళలో చూపిస్తాడు. తన అనుభవాల్ని పాఠకులతో పంచుకోవడం మాత్రమే రచనా పరమార్థం అనుకునే రచయిత — నా దృష్టిలో — చాలా పేలవమైన రచయిత. (He is a writer in the sense that every dairy writer is a writer.) అయితే బ్లాగరుల్లో చాలా తక్కువమంది మాత్రమే కనీసం ఈ పేలవమైన రచయితల స్థాయికైనా నికరంగా చేరుకోగలరు. అసలైన రచయిత నిగ్గుదేల్చడానికి అక్కరకొచ్చేది ఒకే కొలత: imagination. దానికీ, మీరంటున్న "వ్యక్తిగత అభివ్యక్తి"కీ చాలా దూరం. అది బ్లాగుల్లో కనిపించించేది కాదు.

లింగ్విస్టిక్స్‌ని అనుసరించి రాసేది ప్రతీదీ రచన అవచ్చు. కానీ ఈస్థటిక్స్‌‌ని అనుసరించి రాసేది ప్రతీదీ రచన అయిపోదు. మీరు, మీరే కాదు, ఇక్కడ బ్లాగుల్లో చాలా మంది రాస్తున్న ఏ రచనా సారస్వతమనే నిరంతర పరంపరకు ఇసుమంత కూడా తమ వంతు కంట్రిబ్యూషన్ ఇవ్వలేవు. పిచ్చోడి చేతిలో రాయి కన్నా philistine చేతిలో పెన్ను ఎక్కువ ప్రమాదకారి అవుతుందని మాత్రమే ఈ బ్లాగులు చాలా సందర్భాల్లో రుజువు చేస్తున్నాయి.

— నేను ఏ వెబ్‌పత్రిక సంపాదక వర్గంలోనూ పని చేయను. సాటి బ్లాగరునే. ఇదంతా నేను వెబ్‌జైన్ సంపాదకుల వకాల్తాకి రాయలేదు; పత్రికల స్థానాన్ని బ్లాగులు ఎప్పటికీ భర్తీ చేయలేవని చెప్పడానికి మాత్రమే రాశాను.

"తెలుగు సాహిత్యం కేవలం కొన్ని సామాజిక వర్గాలకు చెందిన సాహిత్యంగా, కేవలం కొందరి సర్టిఫై చేస్తేనే గొప్పదిగా నిలిచేవిధంగా తయారయ్యింది."

ఒకవేళ ఇదే నిజమయితే — మీరు వ్యక్తిగతంగా దిగులేమీ పడకండి — దీనికి విరుగుడు ఉంది. ఏ సాహిత్యమైనా కడకు ఒక్కడు "సర్టిఫై" చేస్తేనే నిలుస్తుంది. అయితే ఆ ఒక్కడూ ఎప్పుడూ యిలా హడావిడి చేయడు. జండాలు పట్టుకుని తిరగడు. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూపోతుంటాడు. అందరూ మర్చిపోతున్న ఆ ఒక్కణ్ణీ పాఠకుడంటారు. వాడు నచ్చితే చదువుతాడు; నచ్చకపోతే పక్కన పడేస్తాడు. ఓ ప్రముఖ రచయిత మాటల్లో చెప్పాలంటే :

It is he—the good, the excellent reader—who has saved the artist again and again from being destroyed by emperors, dictators, priests, puritans, philistines, political moralists, policemen, postmasters, and prigs.

పైన ఊటంకించిన శత్రువుల జాబితాలోకి మీరు పత్రికా సంపాదకుల్నీ చేరుస్తానంటారు. అంతే కాదు, వాళ్ళందరికీ మూకుమ్మడిగా "సాహితీ మాఫియా" అని ఒక పేరు కూడా ప్రతిపాదిస్తున్నారు. ఈ జనరలైజేషన్ ఎంత అర్థం లేనిదో మీకు రాస్తున్నప్పుడే అర్థంకాకపోతే ఇప్పుడు నేను చెప్పినా అర్థం కాదు. మీకు ఓ ఫలానా వెబ్ పత్రిక సంపాదకుడు తన పత్రిక "సాంప్రదాయ పత్రిక" అని చెప్పాడు. దాన్ని పట్టుకుని మొత్తం సంపాదకుల్నందర్నీ ఒక గాటన కట్టేయడమా! అందరూ గత కాలపు ప్రమాణాల్తో సాహిత్యాన్ని కొలిచే సంపాదకులే అయితే ఇప్పుడు మీరు ఉదహరిస్తున్న చలం లాంటి రచయితలు మన ముందుకు వచ్చేవారా? పస ఉన్న ఏ రచననీ అభిరుచి వున్న ఏ సంపాదకుడూ వదులుకోడు. సంపాదకుడు ప్రచురించలేదని రాయడం మానేసే రచయితలుంటే వాళ్ళు విత్తులుగా "వికటింపబడ్డా" సారస్వతానికి పెద్దగా జరిగే నష్టమేం లేదు. (బైదవే, ఈ "బడు" ప్రయోగాన్ని చాలామంది సంపాదకులు ఒప్పుకోరు; తెలుగులో passive sentences ఉండవు.)

"మరలాంటప్పుడు "ఉపయోగపడే" సాహిత్యాన్ని నిర్వచించే ఈ అధికారం వీరు ఏవిధంగా సంపాదించుకున్నారు అనేది మిలియన్ డాలర్ ప్రశ్న."

ఇదేమీ "మిలియన్ డాలర్" ప్రశ్న కాదండీ. వాళ్ళు పత్రిక పెట్టగలరు కాబట్టి పెట్టారు. ఆ పత్రికలో వారి అభిరుచికి తగిన రచనల్ని/ లేదా పాఠకుల అభిరుచికి అందుతాయి అని వారనుకున్న రచనల్ని ప్రచురిస్తారు. వారి అభిరుచి తమ అభిరుచితో సరిపోలితే పాఠకులు ఆ పత్రికను ఆదరిస్తారు. లేదంటే నిరాదరణ కారణంగా పత్రిక నడక కుంటుపడుతుంది. అయితే పత్రికా సంపాదకుల్లో చాలా మందికి పాఠకుల స్థాయిని తక్కువ అంచనా కట్టే అవలక్షణం ఉంది; అది మాత్రం పోవాలి.

చివరిగా, "ఏకధృవ సాహిత్యం" వైపు ప్రయాణించకుండా విభిన్న అభివ్యక్తులకు పట్టం కట్టేలా సాహిత్యం ఉండాలన్నదే నా భావనా. కానీ దానికి బ్లాగులు ఎంత మాత్రమూ ప్రత్యామ్నాయంగా ఉపయోగపడలేవు. ఎందుకంటే కళ వేరు, "వ్యక్తిగత అభివ్యక్తి" వేరు.

ఏది నిజమైన సాహిత్యం అన్న విషయంలో సంపాదకులదో రకమైన moral righteousness అయితే, మీదో రకమైన moral + rhetorical righteousness, ఇప్పుడు నేను చూపిస్తున్నది మరో రకమైన moral + rhetorical righteousness. ఈ విషయంలో వాదాల్తో ఏమీ తేలదు. పాఠకుడే చివరి నిర్ణేత.

కొత్త పాళీ said...

మెహర్ మహాశయా, బాగు బాగు!

కొత్త పాళీ said...

మహేశా, మీరు Classic కీ, Tradition కీ confuse అయినట్టున్నారు :)