Monday, April 20, 2009

తెలుగు బ్లాగులు - ఇంగ్లీషు బ్లాగులు

ఈ మధ్య కాలంలో తెలుగు బ్లాగుల్లోని కల్లోలాలు, అపోహలూ,ఈర్షాద్వేషాల మధ్యన శరత్, భాస్కర రామిరెడ్డి ఇంగ్లీషు బ్లాగుల ప్రస్తావన తెస్తూ, తెలుగు బ్లాగులతో కొంత తులనాత్మక వివరణ ఇచ్చారు. దీనితోపాటూ "అజ్ఞాత"లు ఎందుకు తయారవుతారో అన్న analysis కూడా చేశారు. ఈ నేపధ్యంలో కొంత నా "నస".

ఇంగ్లీషు బ్లాగులు కొన్ని కోట్ల సంఖ్యలో ఉన్నాయి. అదొక మహాసముద్రం. కాబట్టి, అందరూ అన్ని బ్లాగులూ చదవడం పక్కనబెడితే కనీసం చూడటం కూడా కుదరని పని. తమ అభిరుచికి తగ్గ బ్లాగుల్ని ఎంచుకునో లేక తమకు అవసరమైన సమాచారం లభించే బ్లాగుల లింకుల్ని అట్టిపెట్టుకుని అప్పుడప్పుడూ చూస్తారేతప్ప, విస్తృతమైన engagement కు ఆస్కారం తక్కువ. ఇక వ్యక్తిగత interaction కు అవకాశం బహుతక్కువ. ఆంగ్లంలో ‘బ్లాగ్ అడ్డా’,వర్డ్ ప్రెస్ అగ్రిగేటర్’ లాంటి అగ్రిగేటర్లు ఉన్నా, వాటి ప్రాచుర్యం ప్రాధాన్యం బహుస్వల్పం. కానీ తెలుగు బ్లాగుల్లో అలాకాదు. ఉన్నవి కొన్ని బ్లాగులవ్వడంతో అగ్రిగేటర్ల ప్రాధాన్యత హెచ్చు. వ్యక్తిగత పరిచయాలకూ ఆస్కారం మెండు. ఈ రెండూ ఒక స్థాయిలో సమస్యాత్మకమే! మరీ ముఖ్యంగా మన తెలుగు సంస్కృతిలో.

విషయవైవిధ్యం లో ఇంగ్లీషు బ్లాగుల్లో ఉన్న తరహా తెలుగుకి రాదు, రాలేదు కూడా. కారణం, ఇంగ్లీషు ఒక సంస్కృతికి చెందిన భాష కాకపోవడం. ఇంగ్లీషు కేవలం కొన్ని భావజాలాలకు సంబంధించిన భాషగా మిగలకపోవడం. దాని విస్తృతికూడా అపారం. అందుకే ఆ వైవిధ్యం సంభవం. మన తెలుగువాళ్ళు ఆముదాలవలసలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, చివరకు అంటార్కిటికాలో ఉన్నా మన మార్కు మనదే. మన భావాలూ,అపోహలూ,ఆభిజాత్యాలూ,అహంకారాలూ అస్సలు మారవు. మనది ఎలాగూ closed culture కాబట్టి, విషయవస్తువు సృజనలోనూ అంగీకారాత్మకత పేరుతో నియమాలూ,పరిధులూ తయారవుతాయి. ఇప్పుడు, ‘బ్లాగులు ఇలాగే రాయాలి’ అనే నియమావళికూడా కొందరు రూపొందించే "పవిత్ర"కార్యం చేబట్టబూనుతున్నారు కూడాను. అలాంటప్పుడు మనం బావిలో కప్పలుగా కాక, మహాసముద్రంలో ఈదే గజ ఈతగాళ్ళంగా ఎలా మారేది? అది కుదరని పని.

బ్లాగింగ్ అనేది వ్యక్తిగత అభివ్యక్తి అయినప్పుడు, ప్రతివ్యక్తికీ తగ్గ వైవిధ్యం బ్లాగుల్లో కనిపించాలి. కానీ, అది తెలుగు బ్లాగుల్లో కనిపించడం అసంభవం. కవితల బ్లాగుల్ని వదిలేస్తే, సాధారణ విషయాలమీద రాసే వాటిల్లో వైవిధ్యం తక్కువే. కారణం సాంస్కృతికంగా, సామాజికంగా,రాజకీయం మనకు చాలా నిర్ధిష్టమైన మూసలున్నాయి. ఈ మూసల్లోంచీ మనం ప్రతి ప్రాపంచిక విషయాన్నీ బేరీజుచేసి, అనుభవిస్తాం. అదే అనుభవాల్ని బ్లాగుల్లో గుప్పిస్తాం. కాబట్టి ఇక్కడ కూడా "గ్రూపులు కట్టడం" లేదా వీళ్ళందరూ ఒక గ్రూపని ఇతరులు అనుకోవడం అత్యంత సహజం. ఎవరైనా కాస్త వ్యక్తిత్వంతో రాస్తున్నాకూడా, ఏదో ఒక మిషతో వారిని ఏదో ఒక గ్రూపులో పడేస్తేగానీ మనకు అంగీకరించడానికో, విభేధించడానికో కుదరదు.సొంత భావాలతో ఎవరైనా కనిపిస్తే, మనకు అస్సలు నచ్చదు. వారిని ఏదో ఒక ఇజానికో, పార్టీకో లేక సామాజిక/కుల వర్గానికో అంటగట్టేసి "నిర్ణయించేస్తే"గానీ మన అహానికి తృప్తి ఉండదు. కాబట్టి, కాస్తో కూస్తో "తమదైన" రాతల్ని రాసేవారిని తరిమికొట్టేస్తాం. లేదా మనలో కలుపుకునో లేక వేరే గుంపులోకో కలిపేసి "జై" అనిపించేస్తాం. అలాంటప్పుడు వ్యక్తిత్వాలు ప్రతిఫలించేది ఎలా? ఇది మన సమాజ నిర్మాణం నుంచే వచ్చింది కాబట్టి ఇదీ పెద్దగా పట్టించుకోవలసిన విషయం కాదు. ఇక ఇంగ్లీషంటారా, ఇంగ్లీషులో రాసేవాళ్ళు ఎంతకైనా "బరితెగించొచ్చు". కారణం, నిర్ధిష్టమైన మూసలు లేకపోవడమే!

ఇక వ్యాఖ్యల గురించి. ఇంగ్లీషు బ్లాగుల్లోనూ తీవ్రస్థాయి వ్యాఖ్యలే కాదు, తిట్లు, బెదిరింపులూ, వ్యక్తిత్వహననాలూ సాధారణం. ఇక అనామక వ్యాఖ్యాతల బెడద ఎక్కడైనా ఉండేదే. బహుశా అది మానవనైజం అనుకుంటాను. మన తెలుగు బ్లాగులది "చిన్న ప్రపంచం" కాబట్టి తీవ్రత ఎక్కువ అనిపిస్తుంది. మన hypocritical సంస్కృతిలో చాలా చిన్న విషయాలుకూడా "సున్నితంగా" తయారయ్యి, ‘మా మనోభావాలు దెబ్బతిన్నా’యంటూ గెంతడం మనకు అవాటయ్యిందికాబట్టి, ఆ తీవ్రత కాస్తా ప్రకోపాన్ని తలపించే స్థాయిల్లో ఆవిష్కరింపబడుతున్నాయి. ఇవి మన మరుగుజ్జు అస్థిత్వానికి చిహ్నాలేతప్ప మరొకటి కాదు.

ఎవరు ఏమన్నా మనం బావిలో కప్పలమే. అదే మన అస్థిత్వం. దాన్ని మార్చాలంటే మందమైన తోలు కాదు కావలసింది, కొత్తను ఆహ్వానించగలిగే భావవైశాల్యం. మనకు అంగీకారాత్మకం కాకపోయినా, alternative ideology అవసరం అనే ఒక సృహ. వ్యక్తుల్ని వ్యక్తులుగా గౌరవించి,వారి భావాలకూ, ఆలోచనలకూ,అభిప్రాయాలకూ విలువనివ్వకపోయినా కనీసం సహించ గలిగే ఔన్నత్యం. ఇవి లేనంతరకూ, మన సంస్కృతిలో ఇవి రానంత వరకూ మనమింతే. కాబట్టి, let's be happy in our wells.

*****

14 comments:

MURALI said...

mari inthaki nannu ye gumpulo chercharu mahesh garu.

సుజాత వేల్పూరి said...

"ఎవరు ఏమన్నా మనం బావిలో కప్పలమే. అదే మన అస్థిత్వం. దాన్ని మార్చాలంటే మందమైన తోలు కాదు కావలసింది, కొత్తను ఆహ్వానించగలిగే భావవైశాల్యం. మనకు అంగీకారాత్మకం కాకపోయినా, alternative ideology అవసరం అనే ఒక సృహ. వ్యక్తుల్ని వ్యక్తులుగా గౌరవించి,వారి భావాలకూ, ఆలోచనలకూ,అభిప్రాయాలకూ విలువనివ్వకపోయినా కనీసం సహించ గలిగే ఔన్నత్యం."....hmmm!

GIREESH K. said...

very well written.

Anonymous said...

మీరంతా చాలా దగ్గరగా వచ్చి ఎందుకు మళ్ళ వేరెళ్ళిపోతున్నారో నాకస్సలు అంతుపట్టట్లేడు. ఇవ్వాళ్ళే మళ్ళా బ్లాగుల్లోకి వచ్చాను. అన్ని బ్లాగులు చదివి కామెంటేసే ఓపిక లేదు. రెండిటి మీద వేస్తాను. See if you can get my point; Neither i need a correction nor a clarification at the end.

భాష /బ్లాగు ఉత్త భావ వ్యక్తీకరణకు కాదు - అందుకే మీకు మన సంస్కృతి closed culture గా కనపడుతుంది.

పాషన్ మీద చర్చ ని లైట్ గా చూసాను...అక్కడేక్కడో వాల్యూ జడ్జెమెంట్ అన్నారు ...దీన్ని నేను "ది బ్రాహ్మనికల్ ఆటిట్యూడ్" అంటాను. దీని మీద ష్యూర్ గా ఓ పోస్టు వెయ్యాలని చాలా రోజుల్నించి అనుకుంటున్నాను; ఇది సంస్కృతంలో వాడే బ్రహ్మ, బ్రహ్మఙ్ఞానం,బ్రాహ్మణుడు అన్న పదాలతో, భావజాలం తో సంబంధం లేదు.
అదే బ్రాహ్మినికల్ ఆటిట్యూడ్ తో మీరు "విషయవైవిధ్యం లో ఇంగ్లీషు బ్లాగుల్లో ఉన్న తరహా తెలుగుకి రాదు, రాలేదు కూడా." అని నిర్ధారించారు. ఇదేనా నా "తెలుగు చచ్చి పోతే తప్పేంటి!?" త్రీపోస్ట్లు చదివి అర్ధం చేసుకున్నది!?

"మన తెలుగువాళ్ళు ఆముదాలవలసలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, చివరకు అంటార్కిటికాలో ఉన్నా మన మార్కు మనదే." - ఈ ఆటిట్యూడ్ మారకపోతే ఎలా!?

"కారణం సాంస్కృతికంగా, సామాజికంగా,రాజకీయం మనకు చాలా నిర్ధిష్టమైన మూసలున్నాయి." - ఎందుకు ఈ మూసలు ఏర్పడుతున్నాయి; వాటి వల్ల ఉన్న లాభనష్టాలు ఏంటి!?

- గ్రూపులు కట్టడం మానవ నైజం; అవి ఏర్పడతాయి; కానీ టీమ్ బిళ్డింగ్ అంటూ కూడా మాట్లాడతారే!

"ఇక వ్యాఖ్యల గురించి. ఇంగ్లీషు బ్లాగుల్లోనూ తీవ్రస్థాయి..... "బహుశా"..... అది మానవనైజం అనుకుంటాను. " - ఇదే కరక్టే నని నా ఉద్దేశ్యం; సో, ఇక ఇది తెలుగు బ్లాగులకు పట్టిన ఝాడ్యం కాదు! మరి ఇంకా బ్రాడర్ రేంజిలో మీరు తెలుగు వాడిగా మీ "అస్తిత్వా"న్ని ఎలా పొందగలరు!? అది ఆలోచించండి. బై ది వే, నాన్ కమిటల్ గా చెప్పేడబ్బుడు మనం "బహుశా" అని వాడతం - ఇది పెర్హాప్స్ , మే బి, మే బి నాట్ లాంటి అర్ధాల్లో వాడతాం. అసలు నాన్ కమిటల్ గా మాట్లాడడం అనేది ప్రాచ్య తత్త్వ లక్షణం గా అర్ధం చేసుకొని పాశ్చాత్యులు మారారు. దాని మీద చాలా మానేజిమింటె పుస్తకాలు కూడా ఉన్నాయి. మీరు పాషన్ మీద చర్చలో దీనికి వ్యతిరేకంగా రాసారు!? చూసారా మీ కల్చర్ ని మీరే చంపేసుకుంటున్నారంటే అర్ధం ఏంటో తెలుస్తోందా! డెసిషన్ అనేది సిషన్ అన్న పదం నుంచి వచ్చింది. అంటే రెండుగా స్ప్లిట్ చేయటం. డెసిషన్ మేకింగ్ అనేది పెద్ద సబ్జెక్టు చదవాలంటే! కానీ, జపనీస్ మానేజ్మెంట్ లో ఇది మోర్ ఆఫ్ ఎ కన్ సెన్సస్......సమ్ థింగ్ ఎకిన్ టు MBO ఆఫ్ పీటర్ డ్రక్కర్.....అలా డెసిషన్ అన్న పదంలోనే తప్పు ఉన్నదని తరువాత తెలుసుకున్నారు.......ఇక అంత కంటే రాయలేను.

బావిలో కప్పల్లా ఉండకూడదు అంటే ఏం చెయ్యాలి? జీవనదిలా సంస్కృతి ఉండాలంటే ఏమన్నా చేయగలమా!? ఇది కేవలం ఇంటలెక్ట్యుయల్ సబ్జెక్ట్. అందరకి దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఐ బెగ్ యూ ఆల్ టు కైండ్లీ రీడ్ మై త్రీ పోస్ట్స్ ఆన్ ది క్వశ్చన్ ఆఫ్ డెత్ ఆఫ్ తెలుగు.

నాగప్రసాద్ said...

తెలుగు బ్లాగుల్తో పోల్చితే, ఇంగ్లీష్ బ్లాగుల్లో వ్యాఖ్యలు మరీ దారుణంగా ఉంటాయి. నిజం చెప్పాలంటే, ఇంగ్లీష్ భాషలోని బూతులు మనకు బూతులా అనిపించవు. అదే ఇంగ్లీష్ లోని బూతులని తెలుగులో అంటే మాత్రం మనకి చాలా కోపం వస్తుంది.

let's be happy in our wells. :). అవును ఇలాగే ఆనందంగా ఉందాం, మనకు వచ్చే నష్టమేముంది.

ఎందుకంటే, బావిలోని ప్రపంచం చిన్నదే అయినా అందులోని కప్పలు ఒకదానితో మరొకటి సన్నిహితంగా ఉంటాయి. అప్పుడప్పుడు పెద్ద పెద్ద వర్షాలు పడి, వరదలకు సముద్రంలోని కప్పలు వచ్చి బావిలో చేరుతుంటాయి. ఆ కొత్తగా వచ్చిన కప్పలు, వాటిని సముద్రంలో ఎవ్వరూ పట్టించుకోకపోయినా, బావిలోకి వచ్చీ రాగానే "మేము సముద్రం నుండి వచ్చాం తెలుసా, మీ బావి కన్నా చాలా పెద్దది. మీరు ఎప్పట్నుంచో ఇక్కడే ఉంటూ ఇంకా "బెక బెక, బెక బెక" అని అంటున్నారు. అదే మేమైతే పాష్ గా "బెక్ బెక్, బెక్ బెక్" అని అంటాం తెలుసా" అని గొప్పలు పోతాయి. అది విన్న కొన్ని పాత కప్పలు అంటే ముందునుంచి బావిలో ఉంటున్న కప్పలు "అవును నిజమే. మనమింకా బెక బెక, బెక బెక అనడంలోనే ఉన్నాం. మనం కూడా బెక్ బెక్, బెక్ బెక్ అనే అరుద్దాం" అంటాయి. ఇంకేముంది కొన్ని కప్పలేమో "బెక బెక" అనాలని, మరికొన్ని కప్పలేమో "బెక్ బెక్" అనాలని వాదించుకోవడం మెదలుపెడతాయి. దాంతో అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న బావి కాస్త "బెక్ బెక, బెక్ బెక, బెక్ బెక" అనే అరుపులతో గోల గోల గా తయారవుతుంది.

ఇటువంటి సమయంలో ఏవైనా చిన్న వర్షాలు పడి చెరువులనుంచో, మడుగుల నుంచో కొన్ని కప్పలు వచ్చి, ఆ బావిలోని గోలను భరించలేక "చెరువు/మడుగే నయం" అనుకొని వెనుతిరిగి వెళ్ళిపోతుంటాయి.

ఇలా కొన్నాళ్ళపాటు "బెక్ బెక బెక్ బెక" అని అరిచి అరిచి అరిచి అరిచి, అది కాస్త రొటీనయిపోయి, బోరు కొట్టడంతో, విసుగెత్తిపోయి అరవడం ఆపేస్తాయి. ఇంకేముంది, బావి మళ్ళీ ప్రశాంతంగా తయారవుతుంది.

ఆ తరువాత సముద్రం నుంచి వచ్చిన కప్పలకు మళ్ళీ సముద్రానికి పొయ్యే అవకాశం ఉన్నా, బావిలోనే ప్రశాంతంగా ఉండటంతో అక్కడే స్థిరపడిపోయి అవి కూడా అందరిలాగానే "బెక బెక బెక బెక" అని అరవడం అలవాటు చేసుకొని, అన్ని కప్పలతో సన్నిహితంగా ఉంటాయి.

ఎన్ని గొడవలొచ్చినా చివరికి ప్రశాంతంగా ఉండేది బావి మాత్రమే. అదే బావి గొప్పతనం.


ఈ బావి-కప్ప కథ సరదాగా వ్రాసింది మాత్రమే. ఎవ్వరినీ భుజాలు తడుముకోవద్దని మనవి. లేదూ మేము తడుముకుంటాం అంటే మీ ఇష్టం.

నాగప్రసాద్ said...

>>"మన తెలుగువాళ్ళు ఆముదాలవలసలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, చివరకు అంటార్కిటికాలో ఉన్నా మన మార్కు మనదే. మనభావాలూ, అపోహలూ, ఆభిజాత్యాలూ,అహంకారాలూ అస్సలు మారవు".

దీని అర్థం ఏంటి మహేష్ గారు, అంటే, మిగతా ప్రపంచంలో ఉన్న వారు, వాళ్ళు పెరిగిన పరిస్థితులకనుగుణంగా కాక, వేరే విధంగా ప్రవర్తిస్తుంటారా?.

>>"మనం బావిలో కప్పలుగా కాక, మహాసముద్రంలో ఈదే గజ ఈతగాళ్ళంగా ఎలా మారేది?".

అందరం కలిసి బావిని తవ్వుకుంటూ, వెడల్పు చేసుకుంటూ పోతుంటే, చివరకు ఏదో ఒకరోజు అదే "మహాసముద్రం" అయిపోతుంది. :):)

Ramani Rao said...

తెలుగు బ్లాగులు - ఇంగ్లీషు బ్లాగులు కాదండి , తెలుగు బ్లాగులు vs తెలుగు బ్లాగులు అనే ఇవ్వాలి. మనలోని ఆలోచనలని పంచుకొనే నేపధ్యంలో మొదలయిన ఈ బ్లాగు ప్రహసనం చివరికి బావి లోని కప్పలా తేలింది అంటే కారణం తెలుగు బ్లాగులు(బ్లాగర్లే) కదా. ఎవరో పెద్దాయన నా బ్లాగు లో కామెంటారు అంటే దానికి కారణం వెనకాల ఏదో అవసరం ఉంది, అని ఎవరికి వారే నిర్వచించుకొంటున్నారు తప్పితే అసలు పోస్ట్‌లో ఏముంది, సదరు పెద్దాయన కామెంటడానికి కారణమేమిటి? అని అనుకోరు, దానికి వెకిలిగా ఇంకోరోజు ఒక పోస్ట్ తయారవుతోంది. అంతెందుకు? ఒక సంవత్సరం కింద మనం ఎలాంటి సమస్యలు లేకుండా చక్కటి బ్లాగు తులసిమొక్కని పెంచుకోలేదా? ఎవరో అజ్ఞాతలు వ్యాఖ్య రాస్తే కూడలిలో అందరం చేరి "పరిష్కారం ఇది" అనుకోకపోయినా ఇలాంటివి మాములే అనుకొని ఓదార్చుకోలేదా ? అవి అప్పుడు కలుపుమొక్కలనుకొని పీకి పారేశాము. కాని ఇప్పుడు గంజాయి మొక్కలా ఈ తులసి వనంలోకి అడుగుపెడితే "అజ్ఞాత వ్యాఖ్యలు, అనామక వ్యాఖ్యల ద్వారా తరిమిగొడదాము" అని ప్రయత్నించారే తప్పితే ఒక్కరు ముందుకు రాలేదు (మీరు తప్ప) (ఇక్కడ రావాలి అని ఎవరు అవేశపడడం లేదు "సి బి రావు గారు మీరు కనక ఈ వ్యాఖ్య చదివితే "నేనున్నాను" అంటూ అవేశపడకండి ప్లీజ్)

"ఎవరు ఏమన్నా మనం బావిలో కప్పలమే. అదే మన అస్థిత్వం. దాన్ని మార్చాలంటే మందమైన తోలు కాదు కావలసింది, కొత్తను ఆహ్వానించగలిగే భావవైశాల్యం. "

ఆఖరికి ఎవరో తెలిసింది అని అనుకొన్నప్పుడు కూడా మనకు సంబంధించినది కాదులే మిన్నకున్నారు చాలా మంది ఏదో ఒకటి చేయగలిగే పెద్దలు. మీరన్నట్లు ఇలా బావిలో కప్పల్లా ఉండి, ఆ బావే మన ప్రపంచం అనుకొంటూ బతుకుతున్న బ్లాగర్లు ఏ ఇద్దరు గొడవలోకో బయటకి విసిరివేయబడి పాముల చేతికి చిక్కీ చిక్కకుండా విల విల లాడ్తూ ఉంటే ..ఇక్కడ తోలు మందం కాదు ఉండాల్సింది కొత్తను ఆహ్వానించే భావ వైశాల్యమే బాగా చేప్పారు మహేష్ గారు. కొత్తను ఆహ్వానించే భావ వైశాల్యం లేకే కదూ ఇలా బాధ పడ్తున్నది మహిళా బ్లాగర్లు.

శరత్ కాలమ్ said...

@ కత్తి
చక్కగా చెప్పారు. మీ చివరి పేరాతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

@ నాగప్రసాద్

మీ కథ చాలా బావుంది :))
ఓ కప్పగా నేను ఇప్పుడు ఎలా అరవాలి? చాలా అయోమయంలో పడేసారు నన్ను!

Anonymous said...

@మహేష్: ఈజ్ దిస్ పోస్టే రిలేటెట్ టు సమ్ ఇన్సిడెంట్స్!! దెన్ ఐ నవ్ క్నో మై రియాక్షన్ మైట్ నాట్ ఫిట్ ఇన్. బట్ మహేష్, ప్లీజ్ కీప్ ఏన్ ఐ ఆన్ ది బిగ్గర్ పిక్చర్! సెల్ఫ్ బాషింగ్ ఈజ్ ఆఫ్ నో యూజ్! భావ వైశాల్యం, సంస్కృతి లో మార్పులూ సెల్ఫ్ బేషింగ్ వల్ల రావేమో! ప్లీజ్ ధింక్ ఎబౌట్ ఇట్! మహిళలను కించ పరచటం మన సంస్కృతి ఎప్పుడూ నేర్పలేదు!! పిచ్చి కామెంట్లు వచ్చేది ఇంటెలెక్ట్యుయాలిటీలో కాదు.ఇట్స్ ఇన్ ఎ డిఫరెంట్ ఎమోషనల్ ఎరీనా! ప్లీజ్ లుక్ ఎట్ ది బిగ్గర్ పిక్చర్ అండ్ థింక్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ఫ్ బాషింగ్! (ఇట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ....ఐ కుడ్ గాదర్ టు దట్ ఎక్స్టంట్.)

Kathi Mahesh Kumar said...

@రేరాజు: నా టాపా మీకు స్వీయనింద(self bashing)గా అనిపించుంటే మాత్రం నా ఉద్దేశం సఫలమైనట్టు కాదు. నా టపా వ్యంగ్యంగా తగిలించిన ఒక చురక. critical outlook ఉద్దేశమేగానీ, స్వీయనింద కాదని గమనించగలరు.

నేను విస్తృతత్వాన్ని చూడటం లేదని ఎందుకనుకుంటున్నారు? I see the bigger picture and aspire for it as well. That's precisely why I am critical of present situation.

@రమణి: మీ వ్యాఖ్య చదివిన తరువాత మనసు ఎందుకో కొంత బాధ అనిపించింది.మీతో నేను ఏకీభవిస్తాను.

@నాగప్రసాద్: నేను తెలుగుకన్నా ముందే ఒక ఇంగ్లీషు బ్లాగు మొదలెట్టాను. కానీ, ఇంత sustained motivation అందులో లేక, నా ఆంగ్లాభాషా పాండిత్యం నాకు తెలిసొచ్చి,తెలుగు నా సృజనాత్మక భాష అని గ్రహించి ప్రస్తుతానికి తెలుగు బ్లాగే రాస్తున్నాను. అంటే నేను సముద్రంలో కొంతకాలం ఉండొచ్చిన "కప్ప"నన్నమాట. కాబట్టి ఆమాత్రం critical గా ఉండాలి లెండి.
మీ కథ బాగుంది.

@రేరాజు:బ్లాగు/భాష భావవ్యక్తీకరణకు కాక మరెందుకో కొంత విశదంగా చెప్పగలరు.

బావిలో కప్పల్లా ఉండకూడదంటే భావవైశాల్యం,సహనమనే ఔన్నత్యం కావాలని నా టపాలో సూచించాను.

@సుజాత:Hmmmm
@గిరీశ్: ధన్యవాదాలు.

@మురళి: నేను ఏగ్రూపులో ఉన్నానో ఎవరో చెబితే తెలుస్తోంది. మీరెక్కడున్నారో నన్నడిగితే ఇబ్బందే!

నీహారిక said...

అజ్ఞాత వ్యాఖ్యలు, అనామక వ్యాఖ్యలు పదే పదే ఎందుకు ఆలోచిస్తారో అర్దం కావడం లేదు. నాక్కూడా ఆ అజ్ఞాత వ్యాఖ్యలు, అనామక వ్యాఖ్యలు వచ్హాయి. తీవ్రంగా సమాధానం చెప్పాను.
దెబ్బకు పరార్.

Ajit Kumar said...

తెలుగు బ్లాగర్లూ - వర్గాలు
అనే టైటిల్తో ఓ బ్లాగ్గు రాయండి ప్లీజ్.

మరువం ఉష said...

Sadly all you said is very true.

>> మన మరుగుజ్జు అస్థిత్వo
Specifically, though I can not root cause it.

>> కొత్తను ఆహ్వానించగలిగే భావవైశాల్యం. మనకు అంగీకారాత్మకం కాకపోయినా, alternative ideology అవసరం అనే ఒక సృహ

Still optimistic about this to happen among a proportion of us large enough to outweigh the rest.

Anonymous said...

@మహేష్: ఫైన్, నేనే పొరపడుతున్నానేమో! నాకు గుడ్డోళ్ళం, కుంటోళ్ళం, బావిలో కప్పలం అనేది స్వీయనింద లాగా అనిపిస్తోంది. ఇప్పుడు వ్యంగ్య చురకలు గా అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. మీరు కూడ, వ్యంగ్య చురకల వల్ల భావ వైశాల్యం, సంస్కృతి లో మార్పు తెచ్చుకోగలమా? అని కొంచెం ఆలోచించండి.

మళ్ళా చెబ్తున్నాను : మన "సంస్కృతి" స్త్రీలను కించ పరచడం నేర్పలేదని నా అభిప్రాయం;అలాగే మనకి చాలా భావ వైశాల్యం కూడా ఉన్నదనే నా అభిప్రాయం;

>>విషయవైవిధ్యం లో ఇంగ్లీషు బ్లాగుల్లో ఉన్న తరహా తెలుగుకి రాదు, రాలేదు కూడా >> దీనితో నేను ఏకీభవించడం లేదు; ఇది రావాలని, రాగలదని, దానికి మనం

తెచ్చుకోవాల్సిన దృక్పదంలో మార్పు గురించే, మిమ్మల్ని "నా త్రీ పోస్ట్స్ చదవండి" అని మొర పెట్టుకుంటూ ఉన్నాను.

>>"...............కానీ, అది తెలుగు బ్లాగుల్లో కనిపించడం అసంభవం." - ఎలా ఇది "అసంభవం" అంటూ మీరు నిర్ణయించేస్తున్నారు???
అసలు బ్లాగింగ్ అనేది "ఉత్త" వ్యక్తిగత అభివ్యక్తి అని ఎలా నిర్ణయిస్తున్నారు!?ప్లీజ్.........మీకై మీరే ఆలోచించుకోండి.

కానీ ఒక బంగారం లాంటి మాట : "మనకు అంగీకారాత్మకం కాకపోయినా, alternative ideology అవసరం అనే ఒక సృహ. " - కరెక్ట్! బ్యూటిఫుల్!!
కానీ "ఇది మన సంస్కృతిలో ఇవి రానంత...."... రావాటానికి అసలు లేకపోతేగా!!!!!! మన సంస్కృతిలో మెండుగా ఉన్నదే ఇది కదా!!! - ఇక్కడే నాకు డిస్కనెక్ట్ ఔతోంది

మరి!

ఇంకో విషయం చెప్తాను : మీరే మొన్న భారత దేశం యొక్క డైవర్సిటీ, ఎలా నెహ్రూలాంటి వారు ( ఆ పేరు మీరు వాడలేదేమో) "భిన్నత్వం లో ఏకత్వం" దర్శించమని

చెప్పారో, ఎలా ఓ నేషన్ హుడ్ కాంసెప్ట్ తీసుకు రావడానికి ప్రయత్నం చేసారో - అందులో వారి మేధావి నిబద్ధతే కనుబడుతుంది కాని మరోటి కాదు - ఇలా చెప్పు

కొచ్చి, ఐనా గానీ ఈరోజు మిగిలిన అస్తిత్వ ఉద్యమాలని డివిజివ్ పాలిటిక్స్ గా తీసుకోకూడదని విశ్లేషిస్తున్నప్పుడు కూడా నాకు నచ్చుతూనే ఉంది; మరి ఇంత డైవర్సిటీ

ఇమడ్చుకోగల మనం "భావనైశాల్యం" లేని వాళ్ళం ఎందుకౌతాం!? నిజానికి అదే డివిజివ్ పాలిటిక్స్ వల్ల మనం ఎంత కోల్పోతున్నామో ఎప్పుడన్నా మీరు

ఆలోచించారా!!!?? కానీ మీరన్నట్టు, తప్పదు - అందరనీ సంస్కరించేసి ఆ డైవర్సిటీ చంపేయ కూడదు; (మళ్ళా భారత, తెలుగు, తెలుగుబ్లాగు సంస్కృతులు వేర్వేరంటూ

వాదించకండి :) అంతా అదే సమాజం కద! )

కానీ వద్దాన్నా గ్లోబలైజేషన్ సంస్కృతులన్నీ ఏకమైపోయేట్టు చేస్తోంది. మీరన్న డైవర్సిటీ ని తగ్గించేస్తోంది ( "బోర్డర్ లెస్ వర్డ్" అనేదో పదం ఉంది - కాదు పుస్తకం ఉంది -

మరీ అంత కొత్తది కాదు; నేను చదవలేదు, ఇంటరెస్టు ఉంటె మీరు చదవండి - అందులో నేషన్ హుడ్ కాంసెప్టే చచ్చిపోతుందని చెప్పినట్టున్నాడు - చదివితే ఓ రివ్యూ

వేయండి ; )..............లేక పోతే డెత్ ఆఫ్ నేషన్హుడ్ అనో..... )

థాంక్స్ ఫర్ గివింగ్ ది వర్డ్ - "మ్యాజిక్ రియలిజమ్" - ( ఐ వజ్ ట్రైయింగ్ టు సే ఇట్ వజ్ ఆల్సో ట్రైడ్ ఎర్లియర్ ఇన్ అవర్ ఓన్ వే) - ఇంకోటి, రాం గోపాల్ వర్మ స్కూల్

మీద నాకు కొన్ని భిన్నమైన అభిప్రాయాలున్నాయి. అవి కూడా "అంగీకారాత్మకం" కాకపోయినా అవి కొన్ని నాకు నచ్చుతాయి :) అందుకే వాడి మీద నా లాంగ్వేజికి,

బహుశా మా ఇద్దరికి పెద్ద ఇబ్బందుండదు :p

ఇక " @రేరాజు:బ్లాగు/భాష భావవ్యక్తీకరణకు కాక మరెందుకో కొంత విశదంగా చెప్పగలరు." కదా!...........నిజానికి ఇది కూడా ఆ త్రీ పోస్టుల్లో కవర్ చేసాననుకుంటా........ఐతే,

బహుశా ముందు మీ దృష్టిలో భావ వ్యక్తీకరణ అంటే ఏంటో నేను తెలుసుకోవాలి ........అంత కంటే ముందు ...నేనన్నది "ఉత్త" భావ వ్యక్తీకరణకు కాదు అని...అంటే

అంతకంటే ఎక్కువ అని........ ఇప్పడు మీకు ఓకేనా లేక ఇంకా ఏమన్నా తప్పుగానే కనపడుతున్నానా?

యూ ఆర్ ఎ సాజీ మాన్! (హవ్ కమ్ యూ కీప్ ఇట్ ఇన్ ది ప్రొఫైల్! నమ్ముతారా? లిండా గుడ్ మన్ ఆస్ట్రాలజర్ కాదండోయ్ :p)
యా.....యూ వోంట్ మిస్ ది బిగ్గర్ పిక్చర్..మే బి ఐ డోంట్ నో వాట్ యూ ఆర్ సీయింగ్....ఐతే కొంచెం కిందకు వంగి, డిటైల్స్ చూడండి............ప్లీజ్ కేర్ ఎబౌట్ డిటైల్స్...!?
(గుడ్డి నమ్మకం కాదు...సరదాగా జోడియక్ సైన్తో చెప్పాను.)