Friday, April 17, 2009

బ్లాగు రచన సాహిత్యం ఎందుకు కాదు?

"Literature is not exhaustible, for the sufficient and simple reason that a single book is not. A book is not an isolated entity: it is a narration, an axis of innumerable narrations. One literature differs from another, either before or after it, not so much because of the text as for the manner in which it is read." -- Jorge Luis Borges


ఈ మధ్య ఒక బ్లాగులో జరిగిన చర్చల్లో, బ్లాగుల్లో రాసే రచనలు "సాహిత్యమా" కాదా? అనే ప్రశ్న ఉదయించింది. కొందరు ఘనాపాఠీలు యధావిధి, బ్లాగు రచనలు సాహిత్యం కాజాలవని కరాఖండి నిర్ణయించేసి, చేతులు దులిపేసుకున్నారు. మరొకరు, ‘అసలు బ్లాగు రాతల్ని సాహిత్యంతో పోల్చడమే, సారస్వతానికి జరిగిన అవమానం’గా భావించేశారు. రసస్పందన కలిగించేదేదైనా రచన అయినప్పుడు, ‘రసం’తో కూడిన బ్లాగు రచనలు మాత్రం సారస్వతం ఎందుకు కాదో నాకు అర్థం కాని విషయం. ఇక ‘హితం’ కలిగుంటేగానీ సాహిత్యం కాదనే వ్యాఖ్యానార్థం, ఛాందసవాద సిద్ధాంతంగా కనిపిస్తుందే తప్ప సాహిత్యానికి సరైన అర్థం అని చస్తే అనిపించదు. మరలాంటప్పుడు ఏ నిర్వచనాన్ని అనుసరించి బ్లాగు రాతల్ని రచనలు కావు, సాహిత్యం అసలు కాదు అని అంటున్నారయ్యా అనేది నా ధర్మసందేహం.

"లిఖితమైన లేదా గ్రంథస్థమైన భాగం సారస్వతంగా భావిస్తారు.శాస్త్రగ్రంథాలు, పంచాంగాలు,వార్తపత్రికలు, శాసనాలు ఇవి సారస్వతంగా చెప్పవచ్చు." "సహితస్యభావఃసాహిత్యం.హితేనసహితం సాహిత్యం. ధర్మ ప్రతిపాదనం చేసేది, ప్రీతిదాయకమైనది, ఉపదేశాత్మకమైనిది సాహిత్యం" అనే ‘ఒక పురాతన నిర్వచనాల్ని,ఆధునిక డిజిటల్ యుగంలోకూడా అన్వయించాలనుకునే కొందరు సాంప్రదాయవాదుల మనోవైకల్యాన్ని అంగీకరించాలా?' అన్నది మొదటగా కలిగిన శంక. కేవలం పత్రికల్లో, పుస్తకాల్లో అచ్చైతేనే సారస్వతమా! కంప్యూటర్ మీద అక్షరాల్లో కనిపిస్తే అది సారస్వతం కాకుండా పోతుందా? నీతులు వల్లించి, తియ్యటి కబుర్లు చెబుతేనే సాహిత్యమా! ప్రశ్నిస్తే, కటువుగా ప్రపంచాన్ని ఆవిష్కరిస్తే సాహిత్యం కాకుండా పోతుందా? అని సవాలు చేస్తే, ఈ రెండు నిర్వచనాలూ "హుష్ కాకి" ఐపోవూ!!

నా అభిప్రాయంలో, మనసులోని అనుభూతిని, అభిప్రాయాలను,ఆలోచనలకు అక్షరరూప వ్యక్తీకరణ ఏదయినా సాహిత్యమే. ఆ సాహిత్యం మంచిదా, చెడ్డదా అన్నది వేరే విషయం. రచయిత కలం నుండి జాలువారిన ఈ అక్షరాలు చదువరుల మనసులో కలిగించే రసస్పందన ప్రాతిపదికన అది విప్లవ సాహిత్యమా, లలితసాహిత్యమా, జానపదమా లేక బూతుసాహిత్యమా అన్నది నిర్ధారితమవుతుంది. దేశ,కాల,మాన పరిస్థితులను బట్టి ఈ నిర్ధారణ మారుతుంది. అంతెందుకు, సినిమాపాటలు,మాటలు మాత్రం ఇప్పుడు సాహిత్యం అవలేదా! మరి బ్లాగులు ఇందుకు మినహాయింపవుతాయా?

రచయితలు ఎప్పుడూ సమాజానికి పనికిరావాలని(‘హితం’ ఉద్దేశంగా) రాయరు. “తన” భావనలు సమాజానికి పనికివస్తాయోమో! అన్న ఆలోచనతో రాస్తారు. అంటే, literature is essentially an individual expression. ఆ వ్యక్తీకరణల్ని సమాజం నెత్తికెత్తుకున్నప్పుడో లేక కొందరు బలవంతంగా సమాజం నెత్తిన ఎక్కించినప్పుడో అది “సాహిత్యం” గా గుర్తింపబడుతుంది. ఇలాంటి మూలస్థాయి వ్యక్తీకరణలకు పట్టుగొమ్మలు బ్లాగులు. మరి సారస్వతపరంగా బ్లాగులకు విలువలేదని ఎవరు నిర్ధారిస్తారు? ఒకరు నిర్ణయించే విలువల్ని మనం ఎందుకు అంగీకరించాలి?

ప్రచురింపబడినప్పుడు అందరిచేతా నిరసింపబడి, ఛీకొట్టబడి, కాలగమనంలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన సాహితీకుసుమాలు మాత్రం ఎన్నిలేవని? విమర్శకుల నిర్ణయాలకు అతీతంగా, పాఠకులు సాహిత్యంగా నిలబెట్టిన రచనలు మాత్రం లేవా! ఏ రచన అయినా పండిత-పామరాభిమానాన్ని చూరగొన్నట్లయితే దానంతట అదే సాహిత్యమవుతుంది. ఈ విధంగా చూసినా, బ్లాగు రచనలు సాహిత్యమడానికి కొంత సమయం పడితే పట్టొచ్చేమోగానీ, ఆ అవకాశాన్నే కాలరాయాలనే ఆలోచన Elitist ఆభిజాత్యంకాక మరేమిటి?

బొల్లోజుబాబా బ్లాగుల్లో కవితలు రాస్తారుగనక వాటిని కవితలు కాదంటామా? తోటరాముడు ఒలికించే రసరమ్యహాస్యాన్ని సాహిత్యం కాదంటామా? చావాకిరణ్ రాసిన కథల్నీ, నవలనీ సారస్వతం కాదని పక్కనపెడతామా? గార్లపాటి ప్రవీణ్ రాసిన ట్రావెలాగుల్ని, సాహిత్యంకాదని అపహాస్యం పాలవుదామా? పప్పు నాగరాజు గారి వ్యాసాల్ని సాహిత్యం కాదని మూర్ఖత్వాన్ని మూటగట్టుకుందామా? ఇలా ఎందరో కవులు, కథకులు, వ్యాసకర్తలు, రచయితలూ బ్లాగులోకాన వెల్లివిరుస్తున్నారు. వీరిలో ఉన్న తక్కువేమిటి, ముద్రిత రచనల సాహిత్యంలోని ఎక్కువేమిటి?

ప్రపంచ సాహిత్యంలో కూడా, mainstream literature కు ధీటుగా సృజింపబడిన subaltern literature ని కనుక్కుని మరీ కలుపుకుంటున్న తరుణంలో,అస్థిత్వవాద సాహిత్యాల్నీ, బ్లాగు రచనల్నీ చిన్నచూపుచూసే తెలుగు సాహితీ ప్రేమికుల ఛాంధసాన్ని చూసి నవ్వుకోవాలే లేక వారి భావసంకుచితత్వాన్ని చూసి జాలి పడాలో అర్థం కాని పరిస్థితి. సారస్వత కళ వ్యక్తిభావనలు,ఆలోచనలూ,అభిప్రాయాలను సృజనాత్మకంగా వెల్లడించుకోవడానికి కాకపోతే. మడిచి అటకమీద పెట్టుకోవడానికా?

నాకోసం నేను రాసుకుంటాను. నాకు విలువైనవి అనిపించిన భావాలను అక్షరబద్ధం చేసుకుంటాను. అనే స్పూర్తి బ్లాగులకి సొంతం ఈ ప్రక్రియలో, ఆలోచనల్ని ఆస్వాదించే వారు, అభిప్రాయాలతో అన్యోన్యక్రియ సల్పేవారు, స్పందనలకు రసస్పందన పొందేవారు పాఠకులుగా ఖచ్చితంగా లభిస్తారు. Writings will find its readers, they will find the author. అందుకే, బ్లాగుల్లోని DIGITAL LITERATURE నిర్వచనాన్ని, ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేని వారికి బ్లాగు రచనలు సాహిత్యం కాదు. కానీ, నేను మాత్రం "ఎందుకు కాకూడదు" అని ప్రశ్నిస్తూనే ఉంటాను.
****

21 comments:

Anonymous said...

"రచయితలు ఎప్పుడూ సమాజానికి పనికిరావాలని('హితం' ఉద్దేశంగా) రాయరు. "తన" భావనలు సమాజానికి పనికివస్తాయోమో! అన్న ఆలోచనతో రాస్తారు."
"ఒకరు నిర్ణయించే విలువల్ని మనం ఎందుకు అంగీకరించాలి?"
మీ ప్రశ్న క్ జవాబు కూడా మీరే ఇచ్చుకున్నారు. :)

Anil Dasari said...

బ్లాగుల్లో రాసినా, పత్రికల్లో రాసినా - సత్తా ఉన్న రాతలే నాలుగు నాళ్లు మనగలిగేవి, సాహిత్యంగా మన్ననలందుకునేవి. మాధ్యమం ఏదనేది పశ్నే కాదు. పత్రికల్లో అచ్చయ్యే చెత్తంతా సాహిత్యం అనలేం, బ్లాగుల్లో రాలే మంచి టపాల్ని సాహిత్యం కాదనీ అనలేం.

సుజాత వేల్పూరి said...

అబ్రకదబ్ర గారితో ఏకీభవిస్తున్నాను.

Tesla said...

@abrakadabra : well said. This topic is actually simple (one liner probably) but mahesh garu made it like an essay kind of disucssion topic. I liked the answer given by you which is very simple yet most powerful definition.

రవి said...

"నేనూ నా భావనలను కాస్తో కూస్తో వ్యక్తపర్చగలను, నా భావాలకు ప్రతిస్పందించే లోకం ఒకటుంది" అన్న ఓ చిన్ని ఆశకు ప్రతిరూపంగా బ్లాగు తయారయింది. చాలా మంది బ్లాగర్లు, బ్లాగు రచయితలు ఇలానే రాయటం మొదలుపెట్టారు. అంతే తప్ప తమకు ఓ విషయంపైన సమగ్రత ఉందనో, సాహిత్యపు తీరు తెన్ను తమకే తెలుసనో, ఇలానే వ్రాయాలనో, ఇలా వ్రాయకూడదనో ఎవరూ రచనలు మొదలెట్టరు. తిలక్ అంతటి వాడు, "నాకు మీ సాహిత్య విచారాలు తెలియవు. నలుగురిని మంచి చేసుకోవటం అంతకన్నా తెలియదు.." అంటాడు.

ప్రమాణాలు నిర్దేశించటం (బ్లాగ్లోకం వరకూ అయినా) ఖచ్చితంగా పొరబాటు.

ఈ మధ్య బ్లాగ్లోకంలో పైకి కనబడకపోయినా, ఇలాంటి ధోరణి మొదలయింది. దీని ఫలితమే, బ్లాగు మాంద్యం.

నాసి రకం టపాలు ఉండవచ్చు గాక, అయితే అది ఆ బ్లాగరు అభివ్యక్తీకరణ అంతే. నాసి రకం రాతలతో ఆరంభించి క్రమంగా చక్కని టపాలు రాసిన బ్లాగర్లు చాలా మంది ఉన్నారు.

Unknown said...

సారం, రసం, విలువ ఉన్న విషయమేదైనా, ఏ మాధ్యమంలో ఉన్నప్పటికీ అది సాహిత్యమనే అనాలి. డిజిటల్ మాధ్యమం తోసుకొంటూ ముందుకొస్తున్న ఈ కాలంలో బ్లాగు రచనలు సాహిత్యం కాదనేది సబబు కాదు.

నవ్వులాట శ్రీకాంత్ said...

మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

Malakpet Rowdy said...

Can somebody define the word "Saahityam" for me again?

But Mahesh (and the others), well said!

నిషిగంధ said...

I totally agree with you...

శ్రీనివాస్ పప్పు said...

ముద్రిత సాహిత్యం అంటే డబ్బెట్టి కొనుక్కుంటాము కదా అందువల్ల అలా,ఇదయితే ఫ్రీ కదా ఉత్తుత్తినే అందువల్ల ఇలా,ఏదయినా ప్రజలు మెచ్చని దానికి విలువలేదు సాహిత్యమయిన సంగీతమయినా ఒకటే నా దృష్టిలో అదీ సంగతి...

Praveen Mandangi said...

Wordpress, serendipity లాంటి blogging scripts పాపులర్ అవ్వకముందు నేను raw HTML పేజిలని FTP ద్వారా అప్ లోడ్ చేసేవాడిని. బ్లాగైనా, మామూలు HTML వెబ్ సైటైనా, పుస్తకమైనా అందులో సరైన matter ఉంటే అది సాహిత్యమే.

శేఖర్ పెద్దగోపు said...

పైన రవిగారు తెలిపిన దానితో నేను 100% ఏకీభవిస్తున్నాను. మా మనసులో మాటని యధాతధంగా ఆవిష్కరించేసారు.
మహేష్ గారు మీ టపా నా లాంటి బ్లాగర్ లకు ప్రోత్సాహకరంగా ఉంది. అభినందనలు.

Anonymous said...

మీ ప్రతి పోస్టులో ఆలోచింపచేసే పాయింట్స్ చాలా వుంటాయు.

Unknown said...

ravi gaari aBipraayaM 75% samaMjasamainadi.
maMchi aMSamu tO kotta aalOchanaku SrIkaaraM chuTTaaru rachayita.

Unknown said...

ravi gaari aBipraayaM 75% samaMjasamainadi.
maMchi aMSamu tO kotta aalOchanaku SrIkaaraM chuTTaaru rachayita.

sirishasrii said...

blaagu racchayitala paTla itarulaku unna apOhalanu tolagiMchinadi mI vyaasamu.

Change Maker said...

Good Topic and articulated very well. Blog world is one of the mediums for all the poets/authors.
Their work can not be trivialized just because of the new medium and instant audience. Since ages, Just like how great poets came out from the wannabes, great bloggers work also will shine. For telugu literature this is another age. Only thing is that those who are writing great poetry and literary works need to place their work against the past writings to see for themselves.

కవిత ఎలా వ్రాసిన ఎక్కడ వ్రాసినా కవితే
రచయిత చదువరులను మెప్పించాలి

In the future, for sure a sri sri, a devulapalli will come out of the ranks of the bloggers. It takes a lifetime to reach that.

Keep it up bloggers.

Shiva Bandaru said...

బ్లాగు అన్నది ఒక వేదిక మాత్రమే. అందులోని రాతలను బట్టె వాటికి పేరు . బ్లాగుల్లో ఎటువంటి రచనలు వస్తాయో చదువరులకి అంచనాలు ఉండవు.

అయితే (వెబ్ )పత్రికలు అయితే చదువరులకు కొన్ని అంచనాలు ఉంటాయి . బ్లాగుకన్నా ఎక్కువ విజిటర్స్ ఉండే అవకాశం ఉంది . ఎక్కువమంది రచయుతలు ఉంటారు కాబట్టి కొన్ని వర్గాల్ని కొందరు ఆకర్శిస్తారు .

బ్లాగు అయినా , వెబ్‌ పత్రికలు అయినా ఇవి కేవలం వేదికలు మాత్రమే. ఇవి సోసియల్ మీడియాలో భాగమే. వాటిలో ఉండే కంటెంట్ ను బట్టి , వాటి మార్కెటింగ్ ను బట్టి వాటికి విజిటర్స్ ఉంటారు.

మన బ్లాగులో మనం రాసుకోవడం నథింగ్ స్పెషల్ !
అప్పుడప్పుడూ ఇతర పత్రికల్లో రాయడం సంథింగ్ స్పేషల్!!

Anil Dasari said...

మార్తాండబ్బాయా,

సందర్భమేదైనా, సంగతేదైనా .. నీ రూటే వేరు.

>> "Wordpress, serendipity లాంటి blogging scripts పాపులర్ అవ్వకముందు నేను raw HTML పేజిలని FTP ద్వారా అప్ లోడ్ చేసేవాడిని"

చర్చతో సంబంధం లేకుండా ఏది తోస్తే అది రాసెయ్యటం, చేసెయ్యటం అంటే మామూలు విషయం కాదు.

మరువం ఉష said...

నా మనసు స్పందనని తానే వెలికి తెచ్చుకుంటుంది. నాకోసమే నేను వ్రాసుకుంటాను. అవి చదివి మెచ్చే మరో మనసుంటే దానికి ఓ సార్థకత, అలాగని అదే నా కవితలకి భవిత కాదు. అవి జనిస్తూనేవుంటాయి. నా కలం నుంచి జారే వరకే అది మాట మార్చగల మనసు, జాలువారిన ప్రతీ పదం నా బిడ్డే ఇక ఎవరిని వదిలేయమంటే ఏ తల్లి మాత్రమేమంటుంది? దాదాపుగా నావన్నీ నా వరకు ఉత్తమ రచనలే, ఇది ఆత్మవిశ్వాసమే. అవి బ్లాగులో ఉనికి సంతరించుకున్నాయా, లేక ఓ పత్రికాముఖంగా వెలుగు చూపాయా అన్నది నాకు అప్రస్తుతం. నాది సాహిత్యం కాదంటే తర్కించను. సమకాలీన తీరుల్లో వున్నదని మాత్రం నమ్ముతున్నాను. పాఠకులు వస్తున్నారు, ఇకపై వస్తారు. వ్రాసాక తిరిగి తిరిగి చదువుకుంటాను.,మనం ఎపుడో తిన్న మామిడి రసాల్ని మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకున్నట్లు. నా మటుకు నేను ఎప్పుడూ ఏదో ఒకటి చదువుతాను కనుక, మన రచనలకీ చదువరులు పుట్టుకొస్తూనేవుంటారు. జయహో బ్లాగ్లోకం. జయహో బ్లాగ్వ్యాఖ్యాస్వాతంత్రం జయహో బ్లాగ్సాహీతీమిత్రత్వం ...

Anonymous said...

అబ్రకదబ్ర గారితో ఏకీభవిస్తున్నాను. అంతకు ముందు మెహర్ మీ పోస్టులో రాసిన సుదీర్ఘ వ్యాఖ్య కూడా చాలా సమంజసమైనది.
నధింగ్ స్పెషల్ - సమ్ ధింగ్ స్పెషల్ - శివ బండారూ కరెక్టే! తెలుగు టీచరు గారి టపా చదివాను; తెలుగు టీచరుగా చెప్పాల్సిందే చెప్పారు;
అందులో కూడా తప్పు లేదు. దాన్ని పాఠించే ప్రయత్నం చాలా మంది చెయ్యాలి.
నేనేమన్నా కాంట్రడిక్టరీ గా చెప్తున్నట్టనిపిస్తే, అలా అందరూ వాళ్ళ వ్యూ పాయింట్స్ లో సరిగ్గా చెప్పారు అని అర్ధం చేసుకోండి.
నేను మొదటినుంచీ చెప్పేది ఇదే. అలా చెప్పే వాళ్ళు కావాలి; వాళ్ళు అలాగే చెప్పాలి.
కానీ మీరు మాత్రం పెద్ద సాహిత్యకారుడుగా నిలవాలి అని ప్రయత్నం చేస్తున్నప్పుడు - మీరే "ఆ పిల్లాడు" - డైనమిక్:రూత్ లెస్, రూల్ లెస్ అండ్ రాండమ్ అని!
కాచ్ మై పాయింటూ!?

పోతే: మీరూ సాహిత్యానికి సంబంధించిన మనిషే - "మా జర్నలిజం లో" అని కూడా అన్నారుగా - ఈ కారణాల వల్లే మీకు నా "భాష ఉత్త భావ వ్యక్తీకరణ కి కాదు"

అన్న వాక్యం - "వ్యక్తి అభివ్యక్తి సాహిత్యం కాదు" అన్నట్టుగానే ధ్వనిస్తోందేమో అని నాకిప్పుడు అనుమానం వచ్చింది.

లెట్ మి బి క్లియర్ : నేను సాహిత్యం మనిషిని కాదు; నేను చెబ్తున్నది వాళ్ళు చెబ్తున్నది ఒకటి కాదు. నిజానికి నేను ఒక్క సాహిత్యంతో భాష నిలబడదని గొంతుచించుకు అరుస్తున్నాను.(అదెవరికీ వినబడట్లేదు లెండి)

ఒక్కముక్కలో ట్రై చేస్తాను : "పార్టీలు మఖ లో పుట్టి పుబ్బలో చస్తున్నాయి " అన్నది ఓ భావ వ్యక్తీకరణ అనుకుంటే , అందులో మఖ, పుబ్బ అనే పదాలు ఏ భావంలో పుట్టాయంటారు? ( ఎలా పుట్టాయో ఎవరికి తెలుసో, మీ ఊహ చెప్పండి)

ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ; కత్తి మహేష్ కుమార్ గొప్ప రచనలు చేయాలని, గొప్ప రచయిత అన్న పేరూ పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.